
తెలంగాణ స్పీకర్ డిఫెక్షన్ తీర్పు విశ్లేషణ
తెలంగాణలో “సాఫ్ట్ డిఫెక్షన్” కి ఇప్పుడు సరైన చట్టపరమైన కారణం దొరికింది. ఫిరాయింపు కు సరిపోయే అసలు సాక్ష్యాల లేవు
పార్టీ ఫిరాయింపులను నివారించేందుకు రాజ్యాంగంలో పదో షెడ్యూల్ (Anti-Defection Law)ను 1985లో చేర్చారు. 1960లలో జరిగిన “ఆయా రామ్, గయా రామ్” రాజకీయాల వల్ల వచ్చిన అస్థిరతను తగ్గించడమే దీని లక్ష్యం. కానీ ఇన్ని సంవత్సరాల తరువాత కూడా, ఈ చట్టం అమలు విషయంలో రాజకీయ పక్షపాతం, విధానపరమైన లోపాలు కనిపిస్తూనే ఉన్నాయి.
ఇటీవల ఫిరాయింపులను నిర్ధారించే విషయంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 55 పేజీల తీర్పు ఇస్తూ BRS పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలపై వచ్చిన అనర్హత పిటిషన్లను తిరస్కరించారు. ఈ తీర్పు ఈ చట్టాన్ని ఎలా బలహీనపరచవచ్చో చూపించింది. ముఖ్యంగా “సాక్ష్యా”లను ఎలా ఉపయోగించుకోవచ్చో ఇది స్పష్టంగా చూపించింది. అసలు ఫిరాయింపు చట్ట పరమయిన నిర్వచనం నుంచి ఎలా తప్పించుకోవాలో చూపించింది. ‘‘డిఫెక్షన్ జరిగిందని నిరూపించడానికి “ఖచ్చితమైన, చట్టపరంగా నిలబడగల సాక్ష్యాలు లేవు” అని స్పీకర్ చెప్పారు. ఎన్ని అధారాలను చూపించినా అవిసరైనవి కాదని స్పీకర్ కొట్టేయవచ్చు. అంతేకాదు, ఏ అధారాలను బిఆర్ ఎస్ పార్టీ చూపించిందో అవన్నీ కూడా ‘ నియోజకవర్గం అభివృద్ధి కోసం చేసిన కొన్ని పను’అను ఫిరాయింపునకు ఆధారంగా చూపించారని ఎమ్మెల్యే వాదిస్తున్నారు.
ఈ ఫిరాయింపుల వ్యవహారం పాడి కౌశిక్ రెడ్డి కేసుతో సుప్రీంకోర్టుకు వెళ్లింది. 2025 జూలైలో సుప్రీంకోర్టు మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ ను ఆదేశించింది. కానీ ఆలస్యం జరుగుతూ వచ్చింది. 2025 నవంబరులో కోర్టు ధిక్కార నోటీసులు కూడా జారీ అయ్యాయి. చివరకు 2026 ఫిబ్రవరిలో స్పీకర్ మరో మూడు వారాల గడువు కోరారు. సుప్రీంకోర్టు అంగీకరించింది.
బిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి ఫిరాయించడం 2024 మార్చిలో ప్రారంభమయింది. మొదట ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారారు. తర్వాత మరో తొమ్మిది మంది రెండు విడతల్లో పార్టీ మారారు. దీని వల్ల అసెంబ్లీలో BRS బలం 39 నుండి 29కి తగ్గింది. కాంగ్రెస్ బలం 64 నుండి 74కి పెరిగింది.
“సాక్ష్యాల లేవే” అనే వాదన
స్పీకర్ తీర్పు చాలా కఠినమైన సాక్ష్యాల నిర్వచనంపై ఆధారపడి ఉంది. పత్రికల వార్తలు, టీవీ వీడియోలు — ముఖ్యమంత్రి పక్కన నిలబడ్డ ఎమ్మెల్యేల ఫోటోలు వీడియోలు కనిపించినా — ఇవన్నీ సరైన సాక్ష్యాలుగా పరిగణించలేదు.
అలాగే, కాంగ్రెస్ కండువాలు ధరించడం కూడా సరైన సాక్ష్యం కాదని చెప్పారు. అవి కేవలం “మూడురంగుల కండవా” మాత్రమే అని వాదించారు. ఇది జాతీయ గుర్తు. ఈ కండువా మీద పార్టీల గుర్తు లేదు. కాబట్టి కండువా కాంగ్రెస్ లోకి మారారనడం సబబు కాదు అన్నారు. ఇలా ఎమ్మెల్యేలు తమ చర్యలను ఇలా సమర్థించుకున్నారు — మేము అధికార పార్టీ నాయకులతో కలిసింది కేవలం “నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు తీసుకోవడానికే” అని ఎమ్మెల్యేలు వాదించారు. ఇది ఒక విధంగా చట్టపరంగా ఎమ్మెల్యలకుచట్టం నుంచి రక్షణ కలిగించే మార్గంగా మారింది.
రవి ఎస్. నాయక్ కేసు ప్రాధాన్యం
1994లో సుప్రీంకోర్టు ఇచ్చిన రవి ఎస్. నాయక్ కేసు తీర్పు ప్రకారం — పార్టీని విడిచిపెట్టడం అంటే తప్పనిసరిగా రాజీనామా లేఖ ఇవ్వాల్సిన అవసరం లేదు. వారి ప్రవర్తన ఆధారంగా కూడా నిర్ణయించవచ్చు.
దానం నాగేందర్ కేసులో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన BRS ఎమ్మెల్యేగా ఉండి 2024లో కాంగ్రెస్ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అయినా కూడా ఇది డిఫెక్షన్ కింద రాదని స్పీకర్ చెప్పడం కొత్త వింత వాదన.
ఒక మరొక బిఆర్ ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విషయంలో — ఆయన స్వయంగా పోటీ చేయలేదు కానీ తన కుమార్తెకు (కాంగ్రెస్ అభ్యర్థిగా) ప్రచారం చేశారు. కాబట్టి ఇది కూడా పార్టీ మార్పు సంకేతంగా పరిగణించలేదు.
BRS పార్టీ పాత్ర
ఈ కేసులో స్పీకర్ మాత్రమే కాదు, BRS పార్టీ వ్యవహరించిన విధానం కూడా ప్రశ్నార్థకంగా ఉంది. స్పీకర్ చెప్పినది ఏమిటి? ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు అని ఆరోపిస్తున్నపుడు తమ ఎమ్మెల్యేలపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు బిఆర్ ఎస్ తీసుకోలేదు. కనీసం నోటీసులు ఇవ్వలేదు, బయటకు పంపలేదు, అసెంబ్లీలో విప్ కూడా జారీ చేయలేదు. అయితే BRS మాత్రం — తాము వెంటనే పిటిషన్ వేసామని, సాక్ష్యాలు సమర్పించామని చెబుతోంది. పిటిషన్ వేయవచ్చు. కానీ, ఒక ముఖ్యమైన ప్రశ్న: పార్టీకి అంతర్గత చర్యలు తీసుకునే అవకాశం ఉండగా ఎందుకు తీసుకోలేదు? ఇక్కడ ఒక విచిత్రం కూడా ఉంది. గతంలో KCR ప్రభుత్వ కాలంలో BRS చాలా మంది ఎమ్మెల్యేలను ఇతర పార్టీల నుండి తమలో చేర్చుకుంది. 2014 నుంచి 2018 మధ్య 47 మంది ప్రతినిధులను తమవైపు తిప్పుకుంది. ఇప్పుడు అదే పార్టీ డిఫెక్షన్‌పై ఫిర్యాదు చేస్తోంది.
ముందున్న పరిస్థితి
ఇప్పుడు ఈ కేసు తెలంగాణ హైకోర్టుకు వెళ్తుంది. అక్కడ రెండు ముఖ్యమైన అంశాలు పరిశీలించబడతాయి:‘
* స్పీకర్ తీర్పు సరైనదా? స్పీకర్ కు స్వయంప్రతిపత్తి ఉందని ఆయన తీర్పు లో జోక్యం చేసుకుకోకుండా వదిలేస్తే డిఫెక్షన్ చట్టం బలహీనమవుతుందా?
* గెలిపించిన రాజీనామ ాచేయకుండా, ప్రత్యర్తి పార్టీలకు అన్ని విధాల సహకరిస్తూన్న ప్రహసనంగా ఫిరాయింపులను కుదించడమా?
ఈ కేసు కేవలం 10 మంది ఎమ్మెల్యేల గురించి మాత్రమే కాదు. ఇది భారత రాజ్యాంగంలో ఉన్న డిఫెక్షన్ చట్టం భవిష్యత్తును నిర్ణయించే ఒక ముఖ్యమైన పరీక్షగా మారింది. ఈ విషయం అంటే ఫిరాయింపులకు సంబంధించిన పదో షెడ్యూల్ రాజ్యంగాలో ఒక భాగం Kihoto Hollohan v. Zachillhu (1992) కేసులో నిర్దారణ అయింది. మరి తెలంగాణ స్పీకర్ వ్యవహారంలో ఇది తప్పని తేలడం లేదూ?
ముఖ్యమంత్రి ముందు కండువాలు కప్పుకోవడం, ప్రత్యర్థి పార్టీకి ప్రచయారం చేయడం, ప్రభుత్వ పెద్ద లను కలవడం అన్నీ 'కేవలం అభివృద్ధి నిధుల కోసం’ అనడం, దాన్ని విశ్వసించడం అంటే ఇప్పుడు రాజకీయాల్లో “సాఫ్ట్ డిఫెక్షన్” అనే కొత్త పద్ధతి ప్రవేశపెట్టడమే.
ఈ పరిస్థితిలో చట్టం ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.

