హైదరాబాద్ లో  కోరలు చాస్తున్న డెంగ్యూ ... మనం ఏమి చేయాలి?
x

హైదరాబాద్ లో కోరలు చాస్తున్న డెంగ్యూ ... మనం ఏమి చేయాలి?

పరిసరాల పరిశుభ్ర త, దోమలు గుడ్లు పెట్టె ప్రాంతాలను నిర్మూలించటం, వారానికి ఒక డ్రై డే పాటించడం మొదలైన నివారణా చర్యలు తూ తూ మంత్రంగానే అమలు చేస్తున్నారు.



డెంగ్యూ (Dengue) జ్వరం (Dengue Fever) మన హైదరాబాద్ నగరాన్ని మరోసారి చుట్టు ముట్టేస్తోంది. ప్రతి ఇంటిలో ఇద్దరు లేక ముగ్గురు ఈ జ్వరం బారిన పడుతున్నారు. ఒక సీజనల్ వ్యాధిగా ఇది ప్రజలలో చాలామందికి బాగా పరిచయమైపోయింది. అంతే కాదు ఇది ఒకరకం దోమల ద్వారా వస్తుందని అందరికీ తెలుసు. మానవులలో అత్యంత సాధారణ ఆర్బో వైరల్ అనారోగ్యం డెంగ్యూ. ఈడిస్ జాతికి చెందిన దోమల ద్వారా వ్యాపిస్తుంది, ప్రపంచంలోని ఉష్ణమండల ప్రాంతాలలోను ఉప ఉష్ణ మండల ప్రాంతాల లోను విస్తృతంగా వ్యాపిస్తున్నది. కానీ ఆ దోమల్ని నివారించటమే సమాజానికి చేతకావటం లేదు. నాలుగు కేసులు పెరగ గానే ఎం. సి. హచ్ వాళ్ళు అక్కడక్కడా ఫాగింగ్ చేయటం తో తమ బాధ్యత పూర్తి అయ్యిందను కుంటున్నారు. పరిసరాల పరిశుభ్ర త, దోమలు గుడ్లు పెట్టె ప్రాంతాలను నిర్మూలించటం, వారానికి ఒక డ్రై డే పాటించడం మొదలైన నివారణా చర్యలు తూ తూ మంత్రంగానే అమలు చేస్తున్నారు.

ఈ లోగా దోమలు వృద్ధి చెందటం, అందులోనూ పగలు స్వైర విహారం చేసే దోమ- టైగర్ దోమ అని ప్రజలు పిలుస్తున్నఈడీస్ దోమ- విపరీతంగా పెరిగి పోతున్నది. కాళ్ళకు, చేతులకు తొడుగులు వేసుకోండి లేక బట్టతో కప్పి ఉంచండి అని ఒక ఉచిత సలహా పారేయటం లేదా మా మస్కిటో రిపెలెంటుని వంటికి పూసుకోండి, లేదా మా కంపెనీ పొగ పెట్టి దోమల్ని తరిమి వేయండి అనే ప్రచారం చేస్తూ బాగా సొమ్ము చేసుకోవటం జరుగుతోంది. మొత్తం మీద ఈ దోమల నుండి రక్షించుకోవాల్సిన బాధ్యత మాత్రం ప్రజలదే నన్నమాట. సమాజం ఏమీ చేయబోవటం లేదు.

ఇటీవలి సంవత్సరాలలో ప్రపంచ వ్యాప్తంగా డెంగ్యూ నాటకీయంగా పెరిగింది, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం ఒక్క సంవత్సరంలో 5 లక్షల నుండి 52 లక్షలకు కేసులు నివేదించబడ్డాయి అంటే పది రెట్లు ఎక్కువయ్యా యి. వాతావరణం మారుతున్న కొద్దీ, ప్రపంచంలోని సమశీతోష్ణ ప్రాంతాలలో కూడా డెంగ్యూ వచ్చే ప్రమాదం పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా డెంగ్యూ సంభవం 2024 లో ఇప్పటికే రికార్డు స్థాయిలో ఉంది, ఇది అమెరికాలో 2023 రేటు కంటే రెట్టింపు అయ్యింది. ప్యూర్టో రికో రాష్ట్రము లో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించారు.

ఒక రోగికి ఈ వ్యాధి వివిధ రకాలుగా వేర్వేరు సమయాల్లో సోకవచ్చు. రీఇన్ఫెక్షన్ కావోచ్చు. అంతేకాదు చాలా మందిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించ కుండానే వ్యాధి గ్రస్తులయి వుండవచ్చు. ఒక మెటా-విశ్లేషణ లో రక్తదాతలలో ఇలా లక్షణాలు లేని వ్యాధి ప్రాబల్యాన్ని గమనించారు. ప్రాధమిక డెంగ్యూ వైరస్ ఇన్ఫెక్షన్లలో 80% లక్షణాలు లేనివి, వ్యాధి సోకిన రోగులలో 20% కంటే తక్కువ మంది మాత్రమే హాస్పిటల్ ను సందర్శించే స్థాయి లో జబ్బు ఉంటోంది. కనీసం సగం మంది రోగుల కు లక్షణాలు లేని ఇన్ఫెక్షన్లు ఉన్నాయని కనుగొన్నారు. అయితే వీరంతా వ్యాధిని వ్యాపింప జేస్తూనే వుంటారు. డెంగ్యూ వ్యాప్తిలో లక్షణాలు లేని ఇన్ఫెక్షన్లు గల వారు ప్రయాణాలు చేస్తుండటం తో వ్యాధి కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తోంది.

డెంగ్యూ యొక్క సాధారణ సంకేతాలలో అధిక జ్వరం (40 °C/104 °F) అనేది చాలా ముఖ్యమైనది. కండరాల నొప్పులు, అలసట, కీళ్లనొప్పులు [చికున్ గునియా లోమాదిరి తీవ్రంగా ఉండవు] ఆకలి మందగించటం, కళ్లు ఎర్రబడటం లాంటి లక్షణాలు ఉంటాయి రెండుం మూడు వారాలలో, శరీర భాగాలలో అంతర్గతంగా కానీ, బాహిరం గా కానీ రక్తస్రావం జరిగే అవకాశాలు వున్నాయి. [చివుళ్ళ నుండి, ముక్కు, నోరు తదితర శరీర భాగాల నుండి, రక్తం స్రవించవచ్చు. మల మూత్రాల ద్వారా రక్తం పోవచ్చు. లేక స్వల్పంగా చర్మం కింద పింకు రంగు మచ్చలు, కంటి తెల్లగుడ్డులో ఎర్రని మరకలు కనిపించ వచ్చు. రోగి అతని పక్కన వుండేవారు ఈ లక్షణాలను డాక్టర్ దృష్టికి వెంటనే తీసుకు రావాలి. రక్త స్రావం తీవ్రమైతే పేషంటు అపస్మారక స్థితికి చేరవచ్చు. అందువల్ల ఈ లక్షణాలలో ఏవి కనిపించినా, పలుమార్లు రక్త పరీక్షలు [తెల్ల కణాల సంఖ్య, ప్లాటిలెట్స్ సంఖ్య, హెమోగ్లోబిన్ శాతం ] చేయటం అవసరం హాస్పిటల్ లో అనవసరం గా రక్తం తీసుకుంటున్నారు అనే దుర్భ్రమ వొదిలి ఈ మేరకు పరీ క్లు చేయించాలి. అలాగే వ్యాధి యొక్క తీవ్రతను సూచించేది లివర్ ఎంజైమ్ టెస్టు. SGPT, SGOT అనే ఈ పరీక్షలోఎంజైమ్ 1000 యు / ఎల్ వుందంటే అది తీవ్రమైన డెంగ్యూకు సూచన. ఇలాంటి కేసులను అత్యవసర పరిస్థితిగా పరిగణించాలి. ఈ ప్రమాణాల ఆధారంగా ప్లేట్ లెట్లు ఎక్కించటము, ఇతర విధాలా రక్త ఉత్పత్తులను వాడవలసి వుంటుంది. ఈరకం పేషంట్లు కామెర్ల బాధితులుగా హాస్పిటల్ కు వస్తారు కానీ వారి డెంగ్యూ చరిత్ర గుర్తుకు రాదు. డాక్టర్ కూడా దాన్ని గుర్తించ లేకపోవచ్చు.

డబ్ల్యూహెచ్ఓ ఉదహరించిన తీవ్రమైన డెంగ్యూను సూచించే ఇతర హెచ్చరిక సంకేతాలలో కడుపు నొప్పి , ప్లేట్లెట్ల సంఖ్య వేగంగా తగ్గడం, బద్ధకం, శ్లేష్మ రక్తస్రావం, అదుపు లేని వాంతులు, కంటిలో రెటీనా రక్తస్రావం, వైట్రియస్ రక్తస్రావం మరియు మాక్యులోపతి వంటివి వున్నాయి. ప్రజలు బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం డయాబెటిస్ వున్న వారిలో డెంగ్యూ జ్వరం అతి త్వరగా తీవ్రమైన స్థాయికి చేరుకునే అవకాశం ఎక్కువగా వుంది. మరణానికి చేరువయ్యే ప్రమాదం ఎక్కువ. అలాగే మహిళలు డెంగ్యూ జ్వరం నుండి తీవ్రమైన వ్యాధికి పురోగతి చెందే ప్రమాదం ఉందని అదనపు పరిశోధనలు నిర్ధారించాయి. డెంగ్యూ వైరస్ సెరో టైప్- 2, చిన్న పిల్లలలో మరింత తీవ్రమైన వ్యాధితో ముడిపడి ఉందని ఈ పరిశోధన కనుగొంది,

రోగి ఎక్కడ నివసిస్తాడు ఎక్కడ ప్రయాణించాడు అనే దానిపై ఆధారపడి, డెంగ్యూ వైరస్ సంక్రమణ వల్ల కలిగే వ్యాధి స్పెక్ట్రమ్ ను, వ్యాధికారకాలను గుర్తిస్తారు. క్లినికల్ వ్యాధి యొక్క ప్రారంభ దశలలో, డెంగ్యూ జ్వరం, చికున్ గున్యా, మలేరియా, మీజిల్స్, ఎల్లో ఫీవర్ , జికా వ్యాధి అన్ని కూడా ఒకే లాంటి లక్షణాల్తో తేలికపాటి ఫ్లూ జ్వరం లా కనిపిస్తాయి. క్రమంగా వాటి ప్రత్యేక లక్షణాలను ప్రదర్శిస్తాయి. మొదట వీటన్నిటికీ వాడవలసింది “పారాసిటమాల్“, ఆ దశలో ఆ పరీక్షలు ,ఈ పరీక్షలు అని హైరానా పడనవసరం లేదు. 20% మాత్రమే తీవ్ర దశలోకి వెళతాయి. కనుక రోగి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ చికిత్స ఇవ్వాలి. అనేక ఇతర ప్రమాదకర వ్యాధులు కూడా మొదట డెంగ్యూ లాగానే అనిపిస్తాయి. తగిన సమయంలో వాటిని గుర్తించ కలిగితే వాటికి చెందిన కచ్చితమైన మందులు ఇవ్వవచ్చు. ఇతర రక్తస్రావ పరిస్థితులు, రక్తం గడ్డ కట్టే/ కట్టని రుగ్మతలు, ఎలక్ట్రోలైట్ అసమతుల్యతలు హైపోక్సియా, కాలేయ వైఫల్యం, మూత్రపిండాల బలహీనత, షాక్ , ఇతర సమస్యలకు దారితీయకుండా జాగ్రత్త పడవలసి వుంటుంది.

ఎంత తీవ్ర పరిస్థితి రానున్నప్పటికి డెంగ్యూ జ్వరానికి చికిత్స మొదట లక్షణాల పైనే ఆధారపడి వుంటుంది. బెడ్ రెస్టు, తేలికపాటి చికిత్సలతో తరచుగా వ్యాధితో సంబంధం ఉన్న అనారోగ్యం, బద్ధకం ,జ్వరం నుండి ఉపశమనం లభిస్తుంది. నొప్పి, జ్వరం చికిత్సకు ఎసిటమినోఫెన్ (పారాసిటమాల్) మాత్రమే సిఫార్సు చేయబడింది. ప్లేట్లెట్ పనితీరుకు మరింత ఆటంకం కలిగించే, రక్తస్రావం సమస్యలను పెంచే ఆస్పిరిన్, ఇతర నొప్పి గోలీలు -బ్రూఫేన్, వోవెరాన్, డైక్లోఫెనాక్ లాంటి, నాన్ స్టీరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులను నివారించాలి. చాలామంది కీళ్ల నొప్పులకని ఈ మందులు తరచుగా వాడుతున్నారు. డెంగ్యూ జ్వరంలో మాత్రం వీటిని ఏమాత్రం వాడకూడదు. వెంటనే ఆపివేయాలి. ఇక కార్టికోస్టెరాయిడ్స్, గ్లూకోకార్టికాయిడ్లు అనవసరం. అవి ఏమాత్రం సహాయపడవు. వీటిని కూడా కౌంటర్ మీద కొనుక్కుని చాలామంది అలవాటుగా వాడుతుంటారు కనుక ఈ జ్వరంలో వాటిని ఆపివేయాలి. అవి సహాయపడవు. డెంగ్యూ చికిత్సకు నిర్దిష్ట యాంటీవైరల్ మందులు అందుబాటులో లేవు. రిబావిరిన్ వంటి యాంటీ వైరల్ మందులు - హంటావైరస్ సంక్రమణ , లాస్సా జ్వరం వంటి ఇతర రక్తస్రావ జ్వరాలలో సమస్యలను నివారించ కలిగాయి కనుక కొంత మంది వాటిని వాడుతున్నారు కానీ డెంగ్యూ జ్వరం లో వాటి నిర్దిష్ట పాత్ర గురించి తెలియదు.

అటోల్టివిమాబ్-మాఫ్టివిమాబ్-ఒడెసివి మాబ్ వంటి మోనోక్లోనల్ ప్రతిరోధకాలు, అత్యంత ఆధునికమైనవి. కొన్ని వ్యాదులలో మంచి ఫలితాల నిచ్చాయి. ఇవి చాలా ఖరీదైనవి. అవి ఇతర రక్తస్రావం జ్వరాలలో హోస్టు కణ పొరలపై వైరస్ అటాచ్మెంట్నీ వైరస్ ప్రవేశాన్ని నిరోధించగలిగినట్లు నిరూపించ బడింది. కాని అవి డెంగ్యూ జ్వరం చికిత్సకు సూచించ బడలేదు. అయితే రోగి తీవ్రత, అసహాయ స్థితిలో డాక్టర్లు, ముఖ్యం గా కార్పొరేట్ స్థాయిలో తమవంతు ఆఖరి ప్రయత్నంగా రోగులకు వీటిని సూచిస్తున్నారు. వీటి ఎంపికలో తగు జాగ్రత్తలు పాటించాలి.

మరికొందరి లో డెంగ్యూ అనే పదం వినగానే అల్లోపతిలో దీనికి మందులు లేవు అని సహాయకారి మందులన్నీ ఆపి వేసి, బొప్పాయి ఆకులు, రసము, బొప్పాయి పండు ఇవ్వటం ఒక వెర్రిగా తయారయ్యింది. ఆయుష్ విధాన కర్తలు దానిని ఒక ఇమ్యూను సప్లిమెంటుగా, ఆమ్లా [ఉసిరి] రసం తో పాటు పోషక పదార్ధముగానే వాడమని చెప్పారు కానీ దాన్ని డెంగ్యూ జ్వరానికి చికిత్సగా చెప్పలేదు.

కొంచెం రక్తకణాలు పడిపోగానే ఆందోళన చెందటం, పెద్ద పెద్ద హాస్పిటల్స్ చుట్టూ గాభరాగా తిరగటం అవసరంలేదు. ఒక సాధారణ జనరల్ ఫిజీషియన్ డాక్టరు డెంగ్యూ స్థితిని సక్రమంగా నిర్వహించగలడు. 5% కంటే తక్కువ మంది కి మాత్రమే ఉన్నత స్థాయి హాస్పిటల్ చికిత్సలు అవసరమవుతాయి. ఈ 5% ఎవరు అనేది తేల్చుకోవటానికే వ్యాధి సమయం లో నిత్య జాగ్రత్త అవసరం,

నేడు సమాజంలో డెంగ్యూ జ్వరం పట్ల భీతి, హాస్పిటల్ వైద్యం పట్ల అపనమ్మకమూ, చికిత్స ఖర్చుల గురించి భయమూ అనేక మందిని పీడిస్తున్నాయి. వారికి విషయం తెలిస్తే విశ్వాసం కలుగుతుందని, కాస్తయిన సాంత్వన కలుగుతుందని ఈ విషయాలు వివరించాను తప్ప ఇది రోగిని పరీక్షించి, తగిన చికిత్సను సూచించే వైద్యాభిప్రాయా నికి ప్రత్యామ్నాయం కాదని పాఠకులు గుర్తించాలి.


Read More
Next Story