
GSDP పెరుగుదలతో మానవాభివృద్ధి సాధ్యమేనా?
తెలంగాణలో GSDP పెరుగుదల ఉన్నా ఆదాయ అసమానతలు, కార్మిక సమస్యలు పెరుగుతున్నాయా? మానవాభివృద్ధిపై విశ్లేషణ.
ఒక అంచనా ప్రకారం, 2025-2026 గణాంకాల ప్రకారం తెలంగాణ మొత్తం స్థూల రాష్ట్ర ఉత్పత్తి (GSDP) సుమారు రూ. 17.82 లక్షల కోట్లు అనుకుంటే అందులో ఉద్యోగుల జీతాలు, ప్రజల ఆదాయాలు (మొత్తం రాష్ట్రంలో): సుమారు రూ. 4.80 - 5.20 లక్షల కోట్లు మాత్రమే. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా కలిసి ఉంటాయి. యజమానుల లాభం & ఇతర ఆదాయం సుమారు రూ. 11.50 - 12.00 లక్షల కోట్లు. ప్రభుత్వానకి అందే పరోక్ష పన్నులు (నికరంగా): సుమారు రూ. 80,000 - 1,00,000 కోట్లు.
ఇప్పుడున్న అభివృద్ధి నమూనాలో యాంత్రీకరణ, AI వినియోగం పెరిగే కొద్దీ ఈ నిష్పత్తిలో "యజమానుల లాభం" వాటా పెరుగుతుంది."కార్మికుల వేతనాల" వాటా తగ్గుతుంది. ఫలితంగా సంపద మరింత కేంద్రీకృతమవుతుంది. ఆర్థిక పరిభాషలో దీనిని "Capital vs Labor Share" (పెట్టుబడి - శ్రమ మధ్య వాటాల పంపిణీ) అంటారు. లక్షల మంది ఉద్యోగుల మొత్తం జీతాలు, కొద్ది మంది యజమానుల లాభాలతో సమానంగా ఉండటం అనేది సమాజంలో నెలకొన్న ఆదాయ అసమానతకు నిదర్శనం. అందుకే ప్రభుత్వాలు GSDP అభివృద్ధి గురించి బడాయి కబుర్లు చెప్పడం మానేసి, రాష్ట్ర మానవాభివృద్ధి సూచీలో మన స్థానం ఎక్కడ ఉందో బేరీజు వేసుకుని, దానిపై దృష్టి సారించడం మంచిది.
మనుషులందరికీ విష పూరితం కాని పౌష్టిక ఆహారం, శుభ్రమైన ఉచిత తాగు నీరు, స్థానికంగా ఉచిత వైద్యం అందుబాటు, స్తానుకంగా ఉచిత విద్యను అందించడానికి బడులు, ప్రజలపై విద్యుత్ చార్జీల భారాన్ని తగ్గించే స్థానికంగా చిన్న స్థాయిలో సోలార్ విద్యుత్ సరఫరా ఉత్పత్తి, సరఫరా ప్రణాళికలు అభివృద్ధి చేయాలి. వీటిపై ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలి.
గ్రామాల వ్యవసాయ భూముల నుండీ బయటకు వ్యవసాయ ఉత్పత్తులను సులభంగా తరలించడానికి అవసరమైన చిన్న రోడ్ల అభివృద్ధి., స్థానికంగా పశుపోషణకు అవసరమైన ఉమ్మడి భూముల రక్షణ, మేత భూముల అభివృద్ధి, పంటలను ఎండ బెట్టుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు, పంటలను నిలవ చేసుకోవడానికి గిడ్డంగులు, శీతల గిడ్డంగులు - వీటిపై కూడా ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలి.
పారిశ్రామిక,సేవా రంగాలలో ఉన్న కార్మికులకు, ఉద్యోగులకు కార్మిక హక్కుల అమలు, మహిళా, పురుష కార్మికులకు సమాన వేతనాలు, వృద్ధులకు, విశ్రాంత ఉద్యోగులకు గౌరవ ప్రదమైన పెన్షన్, భిన్న లైంగిక ప్రవర్తులకు గుర్తింపు, గౌరవం, కుల, మతపరమైన వివక్ష చూపని సమానత్వం ప్రభుత్వాలు రాజ్యాంగ బద్ధ బాధ్యతగా భావిస్తే, అవి అమలవుతాయి.
ఇవన్నీ చేయగలిగితే ప్రజల నిజ ఆదాయాలు పెరుగుతాయి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. మనుషుల, పశువుల ఆరోగ్యాలు మెరుగవుతాయి. స్థానిక పర్యావరణం మెరుగవుతుంది.
ఇదే సమయంలో మద్యం , డ్రగ్స్ లాంటి దుర్వ్యసనాలను గ్రామాల నుండీ నిషేధిస్తే, ఆయా గ్రామల యువత పని సామర్ధ్యాలు పెరుగుతాయి. పిల్లలపై, మహిళలపై హింస తగ్గుతుంది. ఇదే నిజమైన మానవాభివృద్ధి సూచీగా మారుతుంది. ప్రజలు సంతోషంగా ఉంటారు.
ఇవేవీ చేయకుండా, కేవలం పారిశ్రామికాభివృద్ధి గురించీ, ఐటీ రంగ అభివృద్ధి గురించీ, భారీ హైవే ల గురించీ, స్మార్ట్ సిటీ ల గురించీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించీ మాత్రమే ప్రభుత్వాలు మాట్లాడితే, వాటికి మాత్రమే పెట్టుబడులు పెడితే, రాష్ట్ర GSDP మరింతగా వృద్ధి చెందవచ్చు కానీ, రాష్ట్ర మానవాభివృద్ధి సూచీ మాత్రం మెరుగుపడదు.
ఇప్పటికే బాగా అభివృద్ధి చెంది, అంతర్జాతీయంగా హైదరాబాద్ నగరం IT పటంలో కీలక స్థానంలో ఉందనీ, ఈ రంగం ద్వారానే రాష్ట్రానికి ఎక్కువ GSDP సమకూరుతుందనీ ప్రభుత్వాలు చేసే ప్రకటనలను కూడా మనం నిర్ధిష్టంగా పరిశీలించాలి.
ఐటీ రంగంలో శ్రమ దోపిడీ :
ఐటీ రంగంలో "శ్రమ దోపిడీ" అనేది రెండు రకాలుగా కనిపిస్తుంది. గత 10-15 ఏళ్లలో సాఫ్ట్‌వేర్ కంపెనీల లాభాలు, సీనియర్ మేనేజ్‌మెంట్ జీతాలు 500 శాతం పైగా పెరిగాయి. కానీ, ఒక ఫ్రెషర్ (Entry-level Engineer) కి ఇచ్చే సగటు జీతం (సుమారు రూ. 3.5 - 4 లక్షలు) దాదాపు అలాగే ఉండిపోయింది. ద్రవ్యోల్బణాన్ని (Inflation) లెక్కలోకి తీసుకుంటే, 2010 లో రూ. 3 లక్షల విలువ, నేడు రూ. 7-8 లక్షలతో సమానం. అంటే వాస్తవానికి కొత్త ఉద్యోగుల వేతనాలు తగ్గుతున్నట్లే లెక్క. ఐటీ రంగం లో పని గంటలు కోవా భారీగా పెరుగుతున్నాయి. ప్రాజెక్ట్ డెడ్‌లైన్‌ల పేరుతో వారానికి 60-70 గంటలు పని చేయించుకోవడం, అదనపు పనికి (Overtime) వేతనం ఇవ్వకపోవడం కూడా ఒక రకమైన శ్రమ దోపిడీయే.
లాభాల వాటా ఎందుకు అంత ఎక్కువగా ఉంటుంది?
సాఫ్ట్‌వేర్ కంపెనీలు తాము సృష్టించే మేధో సంపత్తి (Intellectual Property) మీద లాభాలు గడిస్తాయి. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఒక కోడ్‌ను ఒకసారి రాస్తే, ఆ కంపెనీ దానిని లక్షల మందికి అమ్ముకోవచ్చు. ఇక్కడ శ్రమ ఒకసారి జరిగినా, లాభం మాత్రం నిరంతరం వస్తుంది.
ఈ అదనపు విలువ అంతా యజమానుల, ఆయా కంపనీల షేర్ హోల్డర్ల లాభాల రూపంలోకి వెళ్తుంది. అందుకే 10 లక్షల మంది ఉద్యోగులకు వెళ్లే మొత్తం జీతం, ఆ కంపెనీలు గడించే నికర లాభం (Net Profit) దాదాపు సమానంగా ఉంటుంది.
ఐటీ రంగంలో జీతాలు మిగతా రంగాల (టెక్స్‌టైల్స్ లేదా నిర్మాణ రంగం ) కంటే ఎక్కువగా కనిపించినప్పటికీ, ఆ కంపెనీ గడించే లాభంతో పోలిస్తే ఉద్యోగికి ఇచ్చే వాటా తక్కువే.
ఉదాహరణకు ఒక క్లయింట్ ఒక ఉద్యోగి పని కోసం గంటకు 500 రూపాయలు కంపెనీకి చెల్లిస్తే, ఆ కంపెనీ ఆ ఉద్యోగికి జీతం రూపంలో గంటకు రూ. 100 నుండి రూ. 200 మాత్రమే ఇవ్వవచ్చు. మిగిలిన రూ. 400 – 300 రూపాయలకు పైగా కంపెనీ నిర్వహణ ఖర్చులకు కొంత, మిగిలినది యాజమానుల లాభాల కిందకు వెళ్తుంది.
కొద్ది మంది ఐటీ ఉద్యోగులు, యజమానుల దగ్గర ఎక్కువ డబ్బు ఉండటం వల్ల హైదరాబాద్ వంటి నగరాల్లో రియల్ ఎస్టేట్ ధరలు, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది మిగిలిన రంగాల సామాన్య కార్మికులకు,అసంఘటిత రంగాల శ్రామికులకు భారంగా మారుతోంది.
పైగా లాభాలు తగ్గితే చాలు, సాఫ్ట్ వేర్ కంపనీలు వెంటనే "లే-ఆఫ్స్" (Layoffs) పేరుతో ఉద్యోగులను తొలగిస్తాయి. అంటే, లాభాల్లో, ఉద్యోగులకు సరైన వాటా ఇవ్వని కంపెనీలు, నష్టాల్లో మాత్రం ఉద్యోగులనే ముందుగా బలి చేస్తున్నాయి. అంకెల్లో ఐటీ రంగం తెలంగాణను "ధనిక రాష్ట్రం"గా చూపిస్తున్నా, ఆ సంపదలో మెజారిటీ భాగం కొద్దిమంది కార్పొరేట్ శక్తుల చేతుల్లోనే కేంద్రీకృతమవుతోంది. దీనినే "కే-షేప్డ్ గ్రోత్" (K-shaped Growth) అంటారు. అంటే ధనికులు మరింత వేగంగా ఎదుగుతుండగా, సామాన్యులు లేదా శ్రామికులు మరింత పేదలుగా మారుతున్నారు.
సాధారణంగా ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని వీడి, పారిశ్రామిక, సేవా రంగాల కోసం పట్టణాలకు తరలి రావాలని గ్రామీణ ప్రజలకు పిలుపు ఇస్తుంటాయి. కానీ లక్షలాది మంది గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించే స్థితిలో ఆయా రంగాలు ఉన్నాయా అన్నది ప్రధాన ప్రశ్న. ఇప్పటికే అలా తరలి వచ్చిన వారికి పట్టణాలు, నగరాలు గౌరవ ప్రదమైన జీవితాలను ఇచ్చే స్థితిలో ఉన్నాయా అనేది మరో ప్రశ్న.
ఆధునిక యాంత్రీకరణ (Automation) వల్ల పారిశ్రామిక మరియు సేవా రంగాల్లో 'సాధారణ పనుల'కు (Routine jobs) ముప్పు పొంచి ఉంది. ఒకప్పుడు 100 మంది చేసే పనిని ఇప్పుడు ఒక రోబోట్ లేదా ఒక AI ప్రోగ్రామ్ చేస్తోంది. దీనివల్ల నైపుణ్యం లేని (Unskilled) గ్రామీణ కార్మికులకు పట్టణాల్లో ఉపాధి దొరకడం కష్టమవుతోంది. బీహార్, యూపీ వంటి ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వలస కూలీలు తక్కువ వేతనాలకే పని చేయడానికి సిద్ధపడటం వల్ల, స్థానిక కార్మికుల వేతనాలు పెరగడం లేదు. ఇది పట్టణాల్లో "పేదరికాన్ని" మరింత పెంచుతోంది.
తెలంగాణ లో గత 30 ఏళ్లలో పారిశ్రామికాభివృద్ధి పేరుతో లక్షల ఎకరాల భూమి ఆయా ప్రభుత్వాలు రైతుల, ముఖ్యంగా అసైన్డ్ రైతుల చేతుల్లో నుండీ గుంజుకున్నాయి. ఆయా భూముల్లో పారిశ్రామిక పార్క్ అంటూ బోర్డులు కూడా పాతాయి. కానీ అక్కడికి వచ్చిన పరిశ్రమలు ఎన్ని? ఇప్పటికీ ఖాళీగా పడి ఉన్న భూమి ఎంత ? వచ్చిన పరిశ్రమలలో ఎంతమందికి యాజమాన్యాలు ఉపాధి కల్పించాయి? అలా ఉపాధి పొందిన వారిలో ఎంతమంది స్థానికులు ఉన్నారు ? ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండానే, రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రతి రోజూ కొత్త కొత్త భూ సేకరణ నోటిఫికేషన్ లు జారీ చేస్తోంది. వేలాది ఎకరాలను రైతుల చేతుల్లో నుండీ గుంజుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. స్థానికంగా గ్రామాలలో పరిశ్రమలు వస్తాయని, అందులో స్థానికులకు ఉద్యోగాలు వస్తాయని మాట వరసకు చెబుతోంది కానీ, గత అనుభవాలు, ప్రజలకు నమ్మకాన్ని కలిగించడం లేదు.
పట్టణాలకు వస్తే ఉపాధికి హామీ ఎవరిస్తారు ?
గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు వచ్చే ప్రజలకు ఆయా నగరాలలో, పట్టణాలలో సరైన నివాసం వసతి ఉండడం లేదు. ఉచిత ఆరోగ్యం అందుబాటులో లేదు. ప్రభుత్వ రంగం లో స్కూల్స్ పెరగడం లేదు. కార్మికులకు స్థిరమైన ఆదాయం ఉండటం లేదు. పట్టణాల్లో పెరిగే జనాభాలో ఎక్కువ మంది "అసంఘటిత రంగం" (Informal Sector) లో అంటే డెలివరీ బాయ్స్ గానో, సెక్యూరిటీ గార్డులుగానో లేదా రోజువారీ కూలీలుగానో చేరుతున్నారు. వీరికి ఎటువంటి సాంఘిక బధ్రత (పెన్షన్ లేదా ఇన్సూరెన్స్) ఉండడం లేదు.
వ్యవసాయ రంగాన్ని 'ఆదాయ వనరు'గా మార్చడమే ప్రత్యామ్నాయం :
ప్రస్తుత తెలంగాణ పరిస్థితులలో గ్రామీణ ప్రజలను పట్టణాలకు తరలించడం కంటే, వ్యవసాయం, అనుబంధ రంగాలను లాభసాటిగా మార్చడమే దీర్ఘకాలికంగా సరైన పరిష్కారం అవుతుంది.
రైతు కేవలం వరినో, పత్తినో పండించి బడా పరిశ్రమలకు ముడి సరుకులను సరఫరా చేయకుండా, స్థానికంగా ఎక్కడికక్కడ చిన్న స్థాయిలో సహకార రంగంలో పత్తి నుండి నూలు తీయడం, వరి నుండి తవుడు నూనె తీయడం వంటి చిన్న తరహా పరిశ్రమలను గ్రామాల్లోనే నెలకొల్పాలి. దీనివల్ల ఆయా ప్రాంతాల పారిశ్రామిక ఆదాయం స్థానిక గ్రామానికే దక్కుతుంది. కేవలం వరి, పత్తి మొక్క జొన్న లాంటి పారిశ్రామిక అవసరాలను తీర్చే రెండు మూడు పాంతలనే కాకుండా, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరు ధాన్యాలు లాంటి పంటలను ప్రోత్సహించడం కూడా అవసరమే. కూరగాయలు, పండ్లు, పూల సాగులో ఆదాయం ఎక్కువ. వాటిని ప్రోత్సహించాలి.
తెలంగాణలో పశుసంవర్ధక రంగం (Livestock) వాటా 48 % ఉంది. పాల సేకరణ, మాంసం ఎగుమతులు, కోళ్ల ఫారాల ద్వారా ఆదాయాన్ని రెట్టింపు చేసే అవకాశం మరింత ఉంది. అమూల లాంటి గుజరాతీ సహకార సంఘాన్ని కాకుండా , స్థానిక విజయ, ములకనూరు, కరీం నగర్, నార్మూరు లాంటి సహకార సంఘాలను ప్రోత్సాహిస్తే, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయి.
ఇతర రంగాల్లో నమ్మకమైన ఉపాధి లేనప్పుడు, ఇతర రాష్ట్రాల నుండి పోటీ ఉన్నప్పుడు, AI మరియు యంత్రాల వల్ల పనులు తగ్గుతున్నప్పుడు, వ్యవసాయ రంగం నుండి బలవంతంగా తరలించడం కంటే, వ్యవసాయాన్ని ఒక లాభదాయకమైన "వ్యాపారం"గా (Agri-business) మార్చడమే అత్యుత్తమ మార్గం.

