తెలంగాణలో ముంచుకొస్తున్న కరువు
ప్రభుత్వం వెంటనే కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకోవాలి. MCHRD రూపొందించిన కరువు మాన్యువల్ ను అమలు చేసి రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలి
(కన్నెగంటి రవి)
వాతావరణంలో వస్తున్న మార్పుల గురించీ, ప్రతి సంవత్సరం పెరుగుతున్న ప్రకృతి వైపరిత్యాల గురించీ, వీటి కారణంగా సాధారణ ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రజలు ఎదుర్కుంటున్న ప్రత్యేక నష్టాల గురించీ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాతావరణ శాస్త్రవేత్తలు చాలా కాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వాలు అనుసరిస్తున్న అభివృద్ధి నమూనాలోనే, ప్రజల జీవన విధానంలోనే ఇందుకు మూలాలు ఉన్నాయని కూడా ప్రకటిస్తున్నారు.
2023-2024 లో తగ్గిన వర్షపాతం :
నెల | సాధారణ వర్షపాతం (మిల్లీ మీటర్లు) | 2021-2022 వర్షపాతం (మిల్లీ మీటర్లు) | 2022-2023 వర్షపాతం (మిల్లీ మీటర్లు) | 2023-2024 వర్షపాతం (మిల్లీ మీటర్లు) |
జూన్ | 129.3 | 194.5 | 150.6 | 72.60 |
జులై | 244.3 | 353.0 | 539.9 | 490.0 |
ఆగస్ట్ | 219.6 | 185.7 | 186.2 | 79.90 |
సెప్టెంబర్ | 127.9 | 276.2 | 222.1 | 218.60 |
మొత్తం నైరుతి | 721.2 | 1009.5 | 1098.8 | 861.10 |
అక్టోబర్ | 95.5 | 66.0 | 117.8 | 6.50 |
నవంబర్ | 23.9 | 26.6 | 0.90 | 20.60 |
డిసెంబర్ | 5.50 | 0.0 | 7.10 | 25.60 |
మొత్తం ఈశాన్య | 124.90 | 86.60 | 125.80 | 52.70 (లోటు) |
జనవరి | 6.80 | 0.0 | 0.60 | 0.0 (వర్షాలు కురవలేదు ) |
ఫిబ్రవరి | 4.60 | 0.0 | 0.10 | 0.10 (తీవ్ర లోటు) |
మార్చ్ | 4.90 | 0.0 | 0.10 | 0.10(తీవ్ర లోటు ) |
మొత్తం | 862.40 | 1138.60 |
క్రమ సంఖ్య | ప్రాజెక్టు పేరు | 2022-2023 | 2023-2024 |
1 | జూరాల | 4.80 | 3.82 |
2 | తుంగ బధ్ర | 20.15 | 6.66 |
3 | శ్రీశైలం | 39.85 | 35.48 |
4 | నాగార్జున సాగర్ | 185.63 | 138.66 |
5 | పులి చింతల | 42.87 | 4.86 |
6 | సింగూర్ | 21.01 | 19.78 |
7 | నిజాం సాగర్ | 8.22 | 6.78 |
8 | శ్రీరామ సాగర్ | 37.61 | 23.26 |
9 | మిడ్ మానేరు | 19.14 | 11.41 |
10 | లోవర్ మానేరు | 12.66 | 7.03 |
11 | కడం | 4.60 | 3.01 |
12 | ఎల్లమ్ పల్లి | 17.09 | 9.50 |
మొత్తం | 413.63 | 270.15 |
గురువింద గింజలు హరీష్ రావు, KTR :
భారాస ప్రభుత్వంలో కీలక శాఖల మంత్రులుగా పని చేసిన KTR, హరీశ్ రావు ప్రస్తుతం ప్రతిపక్ష నేతలుగా వీరంగం వేస్తున్నారు. తమ పరిపాలనా కాలంలో ఎప్పుడూ పట్టించుకోని రైతుల ఆత్మహత్యల గురించి వాపోతున్నారు. పంటలకు నష్టపరిహారం గురించి డిమాండ్ చేస్తున్నారు. మాట్లాడే విషయాలు న్యాయమైనవైనా, వారి హిపోక్రసీ స్పష్టంగా కనపడుతున్నది.
నీటి పారుదల రంగంలో, వర్షాభావ పరిస్థితులు, కరువు కాటకాలు ఏర్పడినప్పుడు, పంటలు ఎండిపోయి, భారీ వర్షాలకు నష్టపోయిన రైతులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నప్పుడు, తమ పరిపాలనా కాలంలో తాము వ్యవహరించిన తీరు అంతా మర్చిపోయి, ప్రస్తుతం ప్రతిపక్ష నేతలుగా రైతుల పక్షాన మాట్లాడుతున్నట్లుగా ఫోజు పెడుతున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై రాజకీయ విమర్శలు చేయడానికి తప్ప, ప్రాజెక్టుల గేట్లు తెరిచి నీళ్ళు వదలాలనే డిమాండ్‌లో వాళ్ళ నిజాయితీ కనపడడం లేదు.
ప్రభుత్వం తక్షణం ఏమి చేయాలి ?
రాబోయే మూడు నెలల ఎండాకాలంలో ఉండే ఉష్ణోగ్రతలు, వర్షాభావ పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని ఇలాంటి రిజర్వాయర్ లెవెల్స్‌తో ఏ ప్రభుత్వమైనా పంటలకు సాగు నీరు అందిస్తుందని ఆశించడం కష్టమే. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో అత్యవసర సమీక్ష చేసి, ఏ ప్రాజెక్టు క్రింద ఏ మాత్రం అవకాశం ఉన్నా, రిజర్వాయర్ల నుండి సాగునీరు అందించి రైతులను ఆదుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేయాలి.
ఎండుతున్న పంటలను రక్షించుకోవడానికి రైతులు ఎప్పుడైనా తాపత్రయ పడతారు. అందుకే లెక్కకు మించి బోర్లు వేయిస్తారు. భూగర్భ జాలాలు వేగంగా అడుగంటి పోతున్నప్పుడు ఇది వృధా ప్రయాసే అవుతుంది. పైగా దీనివల్ల రైతు కుటుంబాలు లక్షల రూపాయల అప్పులో కూరుకు పోతాయి. రైతులకు విచ్చల విడిగా బోర్లు వేయవద్దని అవగాహన కల్పిస్తూనే, రైతులు అప్పులపాలు కాకుండా నీళ్ళు పడే అవకాశం ఉన్న చోట ప్రభుత్యమే రైతులకు ఉచితంగా బోరు బావులు తవ్వించి ఇవ్వాలి.
2023 జూన్ నుండీ 2024 మార్చి 15 వరకూ రెండు జిల్లాలలో వర్షపాతంలోటు ఉంది. మరో 25 జిల్లాల్లో కేవలం సాధారణ వర్షపాతం నమోదైంది. కేవలం 6 జిల్లాలలో మాత్రమే అధిక వర్షపాతం నమోదైంది. ఈ పరిస్థితులే,ఇప్పటి కరువు ఛాయలకు ప్రధాన కారణం. ఇలాంటి స్థితిలో వరి సాగు చేయడం ఎప్పుడైనా రిస్క్ అవుతుంది. పైగా గత ప్రభుత్వం అధిక సాగు నీరు అవసరమయ్యే ఆయిల్ పామ్ సాగును కూడా ప్రోత్సహించి, ఆ రైతులను కూడా సంక్షోభంలోకి నెట్టింది.
సాధారణంగా వర్షాభావ పరిస్థితులు లేదా కరువు ఉన్నప్పుడు, ప్రభుత్వం స్పందించి కరువు మండలాలను ప్రకటించాల్సి ఉంటుంది. కరువు మండలాలను ప్రకటిస్తే, రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందుతుంది. పంట రుణాలు రీ షెడ్యూల్ చేయబడతాయి. పశువులకు మెత్తాను ప్రభుత్వమే సరఫరా చేయాల్సి ఉంటుంది. గ్రామాలకు మంచి నీటి సరఫార చేయాల్సి ఉంటుంది. తీవ్ర కరువు పరిస్థితులు ఉంటే, ప్రజలకు ఉచిత ఆహార సరఫరా కేంద్రాలు తెరవాల్సి ఉంటుంది.
గత పదేళ్ళ KCR పాలనలో కొన్ని సార్లు ఈ పరిస్థితులు ఏర్పడినా, అసలు పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వ కోరిక మేరకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCHRD) తెలంగాణ రాష్ట్రానికి కరువు మాన్యువల్ రూపొందించినా, దానిని KCR ప్రభుత్వం బయట పెట్టి అమలు చేయలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ మాన్యువల్‌లో చేసిన సూచనల మేరకు, వెంటనే గ్రామీణ రైతులను ఆదుకోవడానికి పూనుకోవాలి.
గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని త్వరగా ప్రారంభించి గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించాలి. సాధారణంగా ప్రకృతి వైపరీత్యాల నుండి రైతులను ఆదుకోవడానికి పంటల బీమా పథకాలు ఉపయోగపడతాయి. కానీ KCR ప్రభుత్వం 2020 ఖరీఫ్ నుండీ ఈ పథకాల అమలును ఆపేసింది. ఆ పథకాలు అమలై ఉంటే, ఈ సంవత్సరం కరువు పరిస్థుతుల కారణంగా పంటల దిగుబడులు తగ్గినప్పుడు, రైతులకు నష్ట పరిహారం అంది ఉండేది.
సీజన్‌లో వ్యవసాయ శాఖ చేపట్టే, పంట కోత పరిక్షల ద్వారా సగటు ఆయా ప్రాంతాలలో దిగుబడులను లెక్కిస్తారు. ఇండెమ్నిటీ లెవల్ కంటే ఏ రైతుకు దిగుబడి తగ్గినా రైతుకు నష్ట పరిహారం అంది ఉండేది. కానీ గత KCR ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, పంటల బీమా పథకాలు అమలు కాక, ఈసారి కరువు వల్ల రైతులు పంట నష్ట పోయినా, పరిహారం వచ్చే అవకాశం లేకుండా పోయింది.
పాత ప్రభుత్వం చేసిన తప్పులనే కొత్త ప్రభుత్వం పునరావృతం చేయకూడదు. కరువు బారి నుండి రైతులను ఆదుకునే అన్ని రకాల చర్యలను వేగంగా అమలు చేయాలి. ఇంకా పెండింగ్‌లో ఉన్న రైతు బంధు సహాయం వెంటనే అందించాలి. వడగండ్ల కారణంగా ప్రస్తుత కరువు పరిస్థితుల కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందించడానికి, కేంద్ర ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూడకుండా వేగంగా చర్యలు చేపట్టాలి.
పంట కోతకు వచ్చిన ప్రాంతాలలో ఇంకా ఆగకుండా వెంటనే ధాన్యం సేకరణ కేంద్రాలు తెరిచి కొనుగోళ్ళు ప్రారంభించాలి. ఇతర పంటలను కూడా కనీస మద్ధతు ధరలతో కొనుగోలు చేయాలి. వచ్చే ఖరీఫ్ సీజన్‌లో పంటల బీమా పథకం అమలు కోసం ఇప్పటి నుండే అవసరమైన చర్యలు చేపట్టాలి. కౌలు రైతుల గుర్తింపు, రైతు భరోసా మార్గదర్శకాలు, వ్యవసాయ కూలీలకు రైతు భరోసా, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు రైతు బీమా పథకం అమలుకు మార్గదర్శకాలు, ఖరీఫ్ పంటల ప్రణాళిక లాంటి అన్ని అంశాలను చర్చకు చేపట్టాలి.
ఈ ప్రభుత్వ కాలంలోనూ కొనసాగుతున్న రైతు ఆత్మహత్యలను, గత పదేళ్ళలో రాష్ట్రంలో జరిగిన రైతు ఆత్మహత్యలను గుర్తించి, ఆయా కుటుంబాలకు పరిహారం అందించే జీవో 193 ని అమలు చేయాలి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా సాధారణ పరిపాలనా ప్రక్రియ క్రింద ఈ చర్యలను తీసుకోవడానికి ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాసి అనుమతి తీసుకోవాలి.
దారి తప్పిన రాష్ట్ర వ్యవసాయం గాడిలో పడాలంటే, రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానం, శాస్త్రీయ పంటల ప్రణాళిక రూపొంది అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల మానిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా వెంటనే రైతు కమిషన్ ఏర్పాటు చేయాలి. ఆ కమిషన్ సిఫారసులకు చట్టబద్ధత కల్పించాలి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా, రాష్ట్ర వ్యవసాయ శాఖ, రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో రైతు సంఘాలతో, రైతు సహకార సంఘాలతో చర్చలు కొనసాగించాలి. కొన్ని తక్షణ చర్యలు చేపట్టాలి.
(రచయిత కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక, హైదరాబాద్)