2023లో జగన్ ను చుట్టుకున్న 8 మైనస్ లు ఇవే...
x
2023లో జగన్ అనుకున్నవి చాలా తారుమారయ్యాయి...

2023లో జగన్ ను చుట్టుకున్న 8 మైనస్ లు ఇవే...

నిద్రలేని రాత్రులతో వైఎస్‌ జగన్మోహనరెడ్డికి 2023 వీడ్కోలు చెబుతున్నట్లుంది. అనుకున్నవన్నీ ఎదురుతిరుగుతున్నాయి.


మన్నెం కోటేశ్వరరావు

ఒక వ్యాపారి ఏడాది చివరిలో తన లాభనష్టాలను బేరీజు వేసుకోవటం అందరికీ తెలిసిందే. రాజకీయాలనే వ్యాపారంగా మార్చుకున్నవారూ అదే చేస్తారు. ఒక పెట్టుబడిదారు మార్కెట్లో నిలబడాలంటే తన అనుకూల అంశాలనే ఎక్కువగా చెప్పినట్లుగా రాజకీయ వ్యాపారులూ లోపాలను బహిరంగంగా అంగీకరించేందుకు ముందుకు రారు. ఈ పూర్వరంగంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎడుగూరి సందింటి (వైఎస్‌) జగన్మోహన్‌రెడ్డికి 2023 మిగిల్చిందేమిటి ? పోగొట్టిందేమిటి అన్నదాన్ని బేరీజు వేసుకోవాల్సి ఉంది.

కాలండర్‌లో గడిచిపోయిన ఒక ఏడాదిగానే కాదు, ఐదేండ్ల పాలనలో చివరి సంవత్సరంగా కూడా 2023 ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది.అనుకున్నదొకటి అయ్యింది ఒకటీ బోల్తాపడ్డావులే బుల్‌బుల్‌ పిట్టా అన్న సినిమా పాట వైస్‌ జగన్‌మోహనరెడ్డికి, ఆయన సారధిగా ఉన్న వైసిపికి వర్తిస్తుందా ?

మూడు రాజధానుల చిక్కుముడి

ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తే 2023లో కొన్ని ముఖ్యపరిణామాల తీరుతెన్నులు గోచరిస్తాయి. మూడు రాజధానులతో ముప్పేట అభివృద్ధి చేస్తామనే పేరుతో ఆడిన క్రీడ వికటించింది.అభివృద్దీ లేదు, మూడు రాజధానుల సంగతీ ఎటూతేలలేదు, ఉన్న రాజధాని అమరావతిని గాలికి వదలివేశారు. కర్నూలుకు న్యాయరాజధాని అంటే హైకోర్టుకు తరలింపు రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లో లేదు.హైకోర్టు, సుప్రీం కోర్టు అనుమతి లేకుండా జరగదు. వివిధ రాష్ట్రాలలో హైకోర్టు బెంచ్‌లను ఏర్పాటు చేయాలని కోరుతూ శాసనభల్లో ఆమోదించిన తీర్మానాలకే దిక్కులేదు. అలాంటిది ఒకసారి ఖరారైన హైకోర్టును మరోచోటికి తరలింపును అనుమతిస్తే సుప్రీం కోర్టు ముందుకు కొత్త సమస్యలకు తెరలేస్తుంది.

అమరావతి పోలేదు, విశాఖ రాలేదు

ఇక విశాఖకు కార్యనిర్వాహక రాజధాని గురించి తేదీలను ప్రకటించిన మంత్రులు బొత్స సత్యనారాయణ వంటి వారి మాటలకు విశ్వసనీయత లేదని స్వయంగా నిరూపించుకున్నారు. వారి ఊకదంపుడు ప్రకటనలను పక్కన పెట్టినా ఈ ఏడాది సెప్టెంబరు నాటికి విశాఖకు తరలనున్నట్లు సాక్షాత్తూ సిఎం జగన్మోహనరెడ్డే ఏప్రిల్‌ నెలలో శ్రీకాకుళం పర్యటనలో చెప్పారు. తరువాత దసరా అన్నారు, అదీ తప్పింది. చివరికి 2023 నవంబరు 22న జారీచేసిన ఉత్తరువులో ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి, సంక్షేమ పధకాల సమీక్షల నిమిత్తం ముఖ్యమంత్రి, శాఖాధిపతుల క్యాంపు కార్యాలయాలను విశాఖలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దానిలో ఎక్కడా కార్యనిర్వాహక రాజధాని అనే పదం లేదు. చివరికి కోర్టులో కేసులు దాఖలు కావటంతో అది కూడా ఆగిపోయింది. ఎప్పుడు విచారణ పూర్తి అవుతుందో, ఎప్పుడు తీర్పు వచ్చేనో తెలియదు. ఇది జగన్‌మోహనరెడ్డికి ఊహించని దెబ్బ.

సరిగ్గా ఎన్నికల ముందు విశాఖలో కాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసి దాన్నే రాజధానిగా ప్రచారం చేసుకొనేందుకు వేసిన ఎత్తుగడ వికటించింది.ఈ అంశం కోర్టుకు ఎక్కింది, ఇప్పట్లో తేలే అవకాశాలు కనిపించటం లేదు. ఈ లోగా ఎన్నికల షెడ్యూలు ప్రకటన రానుంది.

అంతన్నాడింతన్నాడే గంగరాజు ముంతమామిడి పండన్నాడే గంగరాజు అన్నట్లు పరిస్థితి తయారైంది. చివరికి ఉత్తరాంధ్రకు రాజధాని వస్తుందని ఆశలు పెట్టుకున్నవారు కూడా ఇప్పుడేమీ మాట్లాడటం లేదు. ఎన్నికల్లో మూడు రాజధానుల గురించి చెప్పుకొనేందుకు ఏమీలేని స్థితిని జగన్మోహన్‌ రెడ్డి స్వయంగా కల్పించుకున్నారంటే అతిశయోక్తి కాదు.

సిల్క్ డెవలప్ మెంట్ కేసులో అంతా మైనసే

అధికారపక్షానికి, ప్రభుత్వానికి వాటి నేతగా జగన్మోహనరెడ్డికి 2023 మిగిల్చిన మరో ఆశాభంగం స్కిల్‌డెవలప్‌మెంట్‌, ఇతర కేసులు. తెలుగుదేశం పార్టీ నేతలను ప్రత్యేకించి మాజీ సిఎం నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌లను వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు లేదా కనీసం ఎన్నికల తేదీ వరకు జైలుకు పంపి ప్రచారానికి దూరం చేయటం, అంతకంటే ముఖ్యంగా అగ్రనేతలకే ఏ గతి పట్టించానో చూడండి అని తెలుగుదేశం శ్రేణులను భయపెట్టేందుకు చూశారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో సిఐడి వ్యవహరించిన తీరు ఊహించినదానికంటే ముందుగానే జనసేనను తెలుగుదేశానికి మరింత దగ్గర కావించింది. తెలుగుదేశం శ్రేణుల్లో ఇంతకంటే ఏం చేస్తారన్న తెగింపు వచ్చేందుకు దోహదం చేసింది.

చంద్రబాబు నాయుడిపై బనాయించిన కేసు ప్రభుత్వ తిరుగులేని ఎత్తుగడ అని గొప్పగా ఊహించుకున్న వైసిపి శ్రేణులు పైకి చెప్పుకోలేని విధంగా తీవ్ర ఆశాభంగం చెందాయి. ప్రభుత్వం చేసిన ఆరోపణల మీద ఇంతవరకు నిర్దిష్ట చార్జిషీట్లు కూడా దాఖలు చేయలేదు. ఎన్నికలకు ముందు విశాఖకు తరలి చూడండి నా తడాఖా అని చెప్పుకోవాలని చూసినట్లే స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో కూడా సిఎం వ్యవహరించారన్నది స్పష్టం. నాలుగేండ్లు మౌనంగా ఉండి 2023 చివరిలో చంద్రబాబును ముద్దాయిగా చేర్చటం విఫల రాజకీయ వ్యూహంలో భాగమే. అనేక కేసుల్లో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. బెయిలు రాదు అనుకున్న చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటికి రావటమే కాదు, రాజకీయ ప్రచారం చేసుకొనేందుకు కూడా కోర్టు అనుమతించింది. గడచిన నాలుగున్నర సంవత్సరాల్లో ప్రతి ముఖ్యమైన కేసులోనూ ప్రభుత్వానికి ఎదురుదెబ్బే తగిలింది.

సంవత్సరాంతపు దెబ్బ ఎమ్మెల్యేలనుంచి

మంత్రులు, ఎంఎల్‌ఏల పని తీరు మీద అటు జనంలోనూ ఇటు పార్టీ కార్యకర్తల్లోనూ అసంతృప్తి ఉన్నట్లు చాలా కాలం నుంచి వార్తలు వచ్చాయి. నీరు వంద డిగ్రీలు మరిగిన తరువాతే రూపం మార్చుకొని ఆవిరిగా మారుతుంది. 2023 చివరిలో వైసిపిలో అది ప్రారంభమైంది.అధికారం రాదు అనుకున్న నేతలు వారంతటవారే పక్కదార్లు వెతుక్కుంటారు.చిత్రం ఏమిటంటే సాక్షాత్తూ జగన్మోహనరెడ్డి గారే మంటను ఎగదోస్తూ ముందుగానే ఎంఎల్‌ఏలు, ఎంపీలను వదిలించుకోవడం , వీలుగాకపోతే బదిలీలు చేసేందుకు పూనుకున్నారు.

తెలంగాణ సెగ

నవంబరు నెలలో ఇంటిలిజెన్స్‌ ఇచ్చిన నివేదిక సారం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో వైసిపికి 90 సీట్లకు మించి రావు. కానీ 175కు 175 ఎందుకు తెచ్చుకోకూడదు అన్న ప్రచారానికి తూట్లు పొడిచే విధంగా ఇది ప్రమాద ఘంటికలను మోగించింది.

ఎన్నికల ముందు ఈ సంఖ్య ఇంకా పడిపోతే ఎలా అని ఆందోళన కలిగిస్తున్నపుడు పక్కనే ఉన్న తెలంగాణ దుర్వార్త వచ్చింది. అంతా వేసుకున్న అంచనాలకు భిన్నంగా బిఆర్‌ఎస్‌ ఓడి కాంగ్రెస్‌ అధికారానికి రావటంతో జగన్‌కు సెగ తగిలింది. సంక్షేమ కార్యక్రమాల పేరుతో జిల్లాలు తిరుగుతూ పార్టీ అభ్యర్ధుల మార్పునకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు 30 మందికి ఉద్వాసన లేదా మార్పిడి నిర్ణయాలను చెప్పినట్లు వార్తలు.

నవరత్నాలూ మెరవరడం లేదు

కాలం కలసి రాకపోతే తాడే పామై కరుస్తుందన్న సామెత తెలిసిందే. సరిగ్గా ఎన్నికలకు ముందు 2023లో ఒక వైపు వర్షాల లేమి, మరోవైపు అధికవర్షాలు, వరదలు కూడా పాలకపార్టీకి ఊహించని పరిణామాలే. సాగు భూమి తగ్గింది.రైతాంగాన్ని ఆదుకోవటంలో, సాయం అందించటంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారన్న విమర్శలను జగన్మోహనరెడ్డి మూటగట్టుకున్నారు. నవరత్నాల సంక్షేమ పధకాలు తొలి సంవత్సరాల్లో జనాలకు కిక్కు ఇచ్చినా ఇప్పుడు అవి సాధారణంగా మారాయి. ఎవరు అధికారానికి వచ్చినా అమలు జరుగుతాయని జనం భావిస్తున్నారు.

నిరుద్యోగుల్లో చిరుద్యోగుల్లో రాజుకున్నమంట

ధరల పెరుగుదల ఉపాధి లేకపోవటం వంటి కారణాలతో ఈ పథకాలతో లబ్దిపొందినవారిలో కూడా అసంతృప్తి ఉంది. ఏడాది ప్రారంభంలో జరిగిన పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల్లో విద్యావంతుల్లో పేరుకుపోయిన అసంతృప్తి అధికారపక్ష అభ్యర్థులను ఓడించటం ద్వారా వెల్లడైంది. జగన్మోహనరెడ్డి స్వంత జిల్లా ఉన్న నియోజకవర్గంలో సైతం అదే జరగటం పెద్ద ఎదురుదెబ్బ. సరిగ్గా ఎన్నికల ముందు అంగన్‌వాడీలు, మున్సిపల్‌ కార్మికులు సమ్మెబాట పట్టారు. వారిని ఆవైపుకు నెట్టటం నష్టం అని తెలిసినా మంత్రులు, ఎంఎల్‌ఏలు వారిని రెచ్చగొడుతున్నా నిరోధించి ఆందోళనలను విరమించేందుకు ముఖ్యమంత్రి ముందుకు రావటం లేదు.వారు కోరుతున్నవేమీ గొంతెమ్మ కోరికలు కాదు, గతంలో జగన్మోహనరెడ్డి మద్దతు ఇచ్చినవి, వాగ్దానం చేసినవే. పోగాలము దాపురించినపుడు విచక్షణా జ్ఞానం పని చేయదంటారు.

కాంగ్రెస్ వదిలిన బాణం వస్తాంది

ఆస్తి, అధికారపంపకాల్లో తలెత్తిన బేధాలతో విడిపోయిన అన్నా చెల్లెళ్ల కథ కొత్త మలుపు తిరిగింది. సోదరి షర్మిల కాంగ్రెస్‌లో చేరటం ఖాయమైంది. జనవరి తరువాత ఆమె తెలంగాణాను వదలి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో అడుగుపెడుతున్నారు. జగనన్న వదలిన బాణంగా గతంలో ప్రత్యర్థుల మీద విరుచుకుపడిన ఆమె ఇప్పుడు సొంత అన్నమీదే బాణాలను సంధిస్తారని చెబుతున్నారు. వైసిపిలో అసంతృప్తనేతలు, కార్యకర్తలూ, అభిమానులు కాంగ్రెస్‌ వైపు మొగ్గుతారనే వార్తల నడుమ పరిణామాలు ఏ విధంగా ఉండేదీ చెప్పలేము. వీర విధేయులుగా ఉన్న కోటం రెడ్డి శ్రీధర రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి వంటి ఎంఎల్‌ఏలు బద్ద వ్యతిరేకులుగా మారతారని అంతకు ముందు ఊహించలేదు. ఇలా ఏ విధంగా చూసినప్పటికీ 2023 వైఎస్‌ జగన్మోహనరెడ్డికి నిద్రలేని రాత్రులతోనే వీడ్కోలు పలుకుతోంది.

Read More
Next Story