సుమేరుల ‘శివు’డే ఎంకి
x
Source: Old World Gods

సుమేరుల ‘శివు’డే ఎంకి

రామాయణంలో నిరుత్తరకాండ-30 : పశ్చిమాసియా-భారత్ ల మధ్య ప్రాచీనకాలంలోనే సాంస్కృతిక సంబంధాలున్నట్లు మనపురాణలలో, ఇతిహాసాలలో లెక్కలేన్ని సాక్ష్యాలున్నాయి.


‘ఎంకి ఏర్పరచిన ప్రపంచవ్యవస్థ’ (Enki and the World Order) అనే సుమేరు పురాణగాథనుంచి కొన్ని పంక్తులను విలియం ఇర్విన్ థామ్సన్ ఉటంకిస్తాడు. వాటిని తెలుగులో ఇలా చెప్పుకుందాం:

జగజ్జనకుడైన ఎంకి

ఆ తావునుంచి తేరిపార చూశాడు,

తన చూపును యూఫ్రటిస్ పై ప్రసరించిన తర్వాత,

రంకెలు వేసే వృషభంలా సగర్వంగా నిలబడి,

తన పురుషాంగాన్ని పైకెత్తి స్కలించాడు,

టైగ్రిస్ ను మెరిసే నీటితో నింపాడు.

పచ్చికభూముల్లో, తేళ్లతో నిండిన కొట్టంలోంచి

బిడ్డకోసం అంబా అని అరిచే అడవి గోవు

కామంతో రంకెలు వేసే వృషభానికి లొంగిపోయినట్టు

టైగ్రిస్ అతనికి లొంగిపోయింది.

అతను పురుషాంగాన్ని పైకెత్తి, వధువుకు కానుక వర్షించాడు,

ఒక భారీ అడవి టెద్దులా టైగ్రిస్ లో సంతోషం నింపాడు,

దాని కడుపు పండినందుకు సంతోషించాడు.

అతను కానుక చేసినవి తళుకులీనే జలాలు,

‘ద్రాక్షమద్యం’లా అవి తియ్యగా ఉన్నాయి,

అతను, చిత్రవిచిత్రవర్ణాలలో ఉన్న ధాన్యాన్ని పుట్టించాడు,

అది జనానికి ఆహారమైంది,

ఎన్ లిల్ ఇంటిని అతను ధనధాన్యాలతో నింపాడు.

ఎంకి చేసినదానికి ఎన్ లిల్ సంతోషభరితుడయ్యాడు, నిప్పూర్ [వెలిగిపోయింది]

ఇందులో ప్రస్తావనకు వచ్చిన యూఫ్రటిస్, టైగ్రిస్ లు జంట నదులు; ప్రాచీన మెసపొటేమియాకు చెందిన వ్యవసాయసంస్కృతీ, ఆర్థికతా, నాగరికతా, రాజ్యాల అవతరణకు అవే మూలకందాలు. ‘మెసపొటేమియా’ అనే పేరు ఆ రెండు నదుల వల్లనే వచ్చింది. రెండు నదుల మధ్యనున్న భూభాగమని ఆ మాటకు అర్థం, మన వ్యవహారంలో ‘లంక’. నేటి ఇరాక్ తోపాటు, తుర్కియే(టర్కీ), సిరియా, కువాయిట్ లలోని కొన్ని ప్రాంతాలను కలుపుకున్న భూభాగం మెసపొటేమియా.

యూఫ్రటిస్ పశ్చిమాసియాలోనే పొడవైన నది; అది తుర్కియేలో పుట్టి, సిరియా, ఇరాక్ ల మీదుగా 2,800 కిలోమీటర్లు ప్రవహించి, ఇరాక్ లోని షత్ అల్ అరబ్ వద్ద టైగ్రిస్ ను కలుపుకుని పర్షియన్ జలసంధిలో కలుస్తుంది. సుమేరులో దాని పేరు ‘బురునున్’ (Burunun). అది రాగి ఖనిజాన్ని సూచించే ‘బురుడు’(Burudu) అనే మాటనుంచి రూపొందింది. ఆనాడు మెసపొటేమియా రాగి ఆధారిత లోహపరిశ్రమకు కేంద్రంగా ఉండేది. యూఫ్రటిస్ ద్వారానే ఆ లోహం ఇతర ప్రాంతాలకు రవాణా అవుతుండేది. ‘బురునున్’ అనే సుమేరు మాటే అక్కాడియన్, ఈలమైట్, పాత పర్షియన్ భాషల మీదుగా రూపాంతరాలు చెంది గ్రీకులో యూఫ్రటిస్ గా మారింది.

ఆర్మీనియా, తుర్కీ, కుర్దీ భాషల్లో యూఫ్రటిస్ పేరు ఒకింత వర్ణక్రమ, ఉచ్చారణ తేడాలతో యెప్రాట్, పెరాట్, ఫిరాట్ వగైరా రూపాలలో కనిపిస్తుంది. ఇరాక్ దక్షిణ, నైరుతి ప్రాంతాలకు చెందిన ‘మంద’ అనే ప్రాచీనజనం యూఫ్రటిస్ ను స్వర్గంలో ప్రవహించే ‘యర్ద్న’ (Yardna) అనే దేవనదికి భూరూపంగా తమ పురాణగాథల్లో చిత్రించుకున్నారు. మన దగ్గర గంగానదిని కూడా త్రిపథగా, అంటే ఆకాశ, భూ, పాతాళమార్గాలలో ప్రవహించేదిగా మన పురాణ, ఇతిహాసాలు పేర్కొన్న సంగతిని ఇంతకుముందు చెప్పుకున్నాం.

టైగ్రిస్ నది కూడా తుర్కియేలోని తారస్ పర్వతాల్లో పుట్టి ఇరాక్ మీదుగా 1750 కిలోమీటర్లు ప్రవహించి యూఫ్రటిస్ లో కలుస్తుంది. అసీరియా రాజ్యాలు ఈ నదీతీరంలోనే వర్ధిల్లాయి. ఈ రెండు నదులూ, వాటి ఆధారంగా వర్ధిల్లిన సంస్కృతీనాగరికతల గురించి చెప్పుకునే ప్రస్తుత సందర్భంలో విలియం ఇర్విన్ థామ్సన్ తోపాటు రాంభట్ల కృష్ణమూర్తినీ ప్రస్తావించుకోవడం అవసరం. ఎందుకంటే, పదివేల సంవత్సరాల క్రితం యూఫ్రటిస్, టైగ్రిస్ నదులవైపు జరిగిన వలసలతో సహా రాంభట్ల తన ‘జనకథ’లో చెప్పిన సంగతులను థామ్సన్ అధ్యయనం ధ్రువీకరిస్తోంది.

ఆపైన, రాంభట్ల చెప్పిన సంగతులు పశ్చిమాసియా-భారత్ ల మధ్య ప్రాచీనకాలంలో జరిగిన ఆదానప్రదానాలను కూడా సూచిస్తాయి. ఆయన ప్రకారం, ఒక దశలో మధ్యాసియాలోని కాస్పియన్ సముద్రప్రాంతంలో అన్ని జాతులు, రంగులు, భాషలవారూ కలసి ఉన్నారు. కాస్పియన్ సముద్రాన్నే పూర్వులు కాశ్యపీ సముద్రమన్నారు. మన పురాణ, ఇతిహాసాల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి. దేవతలు, దైత్య, దానవులతో సహా అందరూ ఆయన సంతానం. ఆవిధంగా దేవతలు; దైత్యులు, దానవులు, అసురులు, రాక్షసులు అన్నదమ్ములు. దేవతలు దేవుళ్లైతే మిగిలినవారు పూర్వదేవుళ్లు అయ్యారు.

ఈ రెండు పక్షాల మధ్య ఘర్షణ తలెత్తడంతో పూర్వదేవుళ్ళలో కొందరు యూఫ్రటిస్, టైగ్రిస్ నదులవైపు వలసవచ్చారు. అది పదివేల ఏళ్లక్రితం సంగతి. వారు క్రమంగా అక్కడి బురదనేలల్లో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి వ్యవసాయాధారిత సంస్కృతినీ; అసూరు, నినవే అనే నగరాలను నిర్మించి రాజ్యాలు ఏలారు. వీరిని ‘సుబరు’లన్నారు. వీరే మన శంబరులయుంటారనీ, వీరు భారతదేశానికి వచ్చినట్లు దాఖలాలు ఉన్నాయనీ రాంభట్ల అంటారు. శంబరుడనే రాక్షసుని మన్మథుడు జయించినట్టు మన దగ్గర పురాణగాథ. ప్రాచీనకాలంనుంచీ భారత-పశ్చిమాసియాల మధ్య ఉన్న సంబంధాల గురించిన మరిన్ని వివరాలను ఈ వ్యాసకర్త రాసిన ‘ఇవీ మన మూలాలు’లో చూడవచ్చు.

పైన చెప్పిన సుబరులు, లేదా శంబరులు యూఫ్రటిస్ ను ‘వరుణ’ గానూ, టైగ్రిస్ ను ‘తిగ్లత్’ గానూ పిలిచారనీ; సుమేరులు ఆ పేర్లనే ఉపయోగించారనీ రాంభట్ల అంటారు. సుమేరుల ‘బురునున్’ అనే పేరు వరుణ శబ్దానికి దగ్గరగా ఉంది. సుమేరు దేవతల గురించి రాంభట్ల ఇచ్చిన వివరణ ప్రకారం, ‘అంకి’ వారి తొలి దేవత. మన దగ్గర శివపార్వతుల్లా అంకి అర్ధనారీశ్వరూపం. ‘అం’ అంటే ఆకాశం, ‘కి’ అంటే భూమి. ఆకాశాన్నీ, భూమినీ కలిపి వేదాలు ‘ద్యావాపృథివీ’ తత్వం అన్నాయి. పశుపాలకులైన ఆర్యులకూ, ఆర్యేతరులైన మ్లేచ్ఛులకూ కూడా మెసపొటేమియా నట్టిల్లు లాంటిది. అందువల్ల వారు అర్ధనారి అయిన అంకిని ఇద్దరు పురుషదేవులుగా విభజించారు. వారిలో ఆకాశదేవుడు, లేదా ద్యుదేవుని పేరు ‘అను’; పృథివీదేవుని పేరు ‘ఎంకి’. ఎంకి నివాసం ‘అప్సు’, అంటే సముద్రం. ఆవిధంగా ఎంకి జలదేవత. మన వేద, పురాణ, ఇతిహాసాల్లోని వరుణుడు కూడా జలదేవతే; అతని నివాసం కూడా సముద్రమే. వర్షాన్ని కురిపించే దేవుడిగా వరుణునే చెప్పుకుంటాం.

అర్ధనారి అయిన అంకిని ఇద్దరు పురుషదేవుళ్లుగా విభజించిన తర్వాత, ‘నిన్ హుర్ సగ్’ అనే స్త్రీదేవతను సుమేరులు సృష్టించుకున్నారు. ఈమె దేవతలకు తల్లి. మొదట్లో ద్యుదేవుడే సర్వశక్తులూ కలిగిన మహాదేవుడిగా ఉండేవాడు; తర్వాత తన కొడుకైన ఎన్ లిల్ కు తన శక్తులన్నీ ఇచ్చాడు. అప్పటినుంచీ ఎన్ లిల్ రెండువేల సంవత్సరాలపాటు మహాదేవపదవిలో ఉన్నాడు. ఎన్ లిల్ కే మరో పేరు ‘ఎల్లి’; ఇతనే వాయుదేవుడు కూడా. సంస్కృతంలో వాయుదేవుని ‘అనిలు’డంటారు. అను-ఎంకి-ఎన్ లిల్ అనే ముగ్గురు పురుషదేవుళ్ళూ, నిన్ హుర్ సగ్ అనే స్త్రీదేవతా సుమేరుల ఆదిదేవతలు.

‘ఎంకి ఏర్పరచిన ప్రపంచవ్యవస్థ’నుంచి ఉటంకించిన పై పంక్తులలో చివరిగా పేర్కొన్న ‘నిప్పూర్ (Nippur) ప్రాచీన సుమేరు నగరం. ఆ నగరానికి అధిష్ఠానదైవం సుమేరుల మహాదేవుడైన ఎన్ లిల్(Enlil).

పై వివరాలలో సుమేరు-భారతీయ దేవతల మధ్య పోలికలను గమనించవచ్చు. ఎంకికీ, కుమారస్వామికథలోని శివునికీ పోలికలు ఇంకా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఆ రెండూ ఒకదానికొకటి మాతృకలా అని కూడా అనిపిస్తాయి. ఎంకి కథలో టైగ్రిస్ నదికి స్త్రీత్వాన్ని ఆపాదించినట్టే, కుమారస్వామికథ భూమికీ, గంగానదికీ స్త్రీత్వాన్ని ఆపాదిస్తుంది. ఎంకి తన వీర్యంతో టైగ్రిస్ నదిని నింపితే; కుమారస్వామికథలో శివుడు తన వీర్యాన్ని భూమిపైనా; మరో పాఠం ప్రకారం, అగ్ని ద్వారా గంగలోనూ ప్రవహింపజేశాడు. ఎంకి వీర్యమనే జలాలు భూమినుంచి ధాన్యాన్ని పండిస్తే; కుమారస్వామికథలో శివుని వీర్యం భూమి అంతటా వ్యాపించి శ్వేతపర్వతమై, ఆ పర్వతం మీద ఒక రెల్లుగడ్డివనం అవతరించి, అందులోంచి కుమారస్వామి పుట్టాడు. అదే కథకు చెందిన రెండో పాఠం ప్రకారం, శివుని వీర్యాన్ని గంగ హిమవత్పర్వతాలలోని ఒక పర్వతం మీద విడిచిపెడితే, దానినుంచి బంగారం, వెండి మొదలైన లోహాలతోపాటు రెల్లుగడ్డి, చెట్లు, లతలు, పొదలు పుట్టి అవి కూడా బంగారంగా మారిపోయాయి; ఆ తర్వాత ఆ వీర్యంనుంచి కుమారస్వామి పుట్టాడు.

సుమేరు పురాణగాథలోని పై పంక్తులు ఎంకిని రంకెలు వేసే వృషభంతో పోల్చితే, భారతీయపురాణాలలోని శివుడు వృషభవాహనుడు. ఇది మరొక ఆసక్తికరమైన పోలిక.

అయితే, రెండు కథల మధ్యా మౌలికమైన తేడాలూ ఉన్నాయి. టైగ్రిస్ ను నింపిన ఎంకి వీర్యజలాలతో భూమి కడుపు పండి ధాన్యాలను పుట్టించినట్టు సుమేరుకథ చెబితే; శివుని వీర్యంనుంచి బంగారం తదితర లోహాలు, రెల్లుగడ్డి వనం, చివరిగా కుమారుడు పుట్టినట్టు కుమారస్వామికథ చెబుతోంది. సుమేరుకథ వ్యవసాయాన్ని సూచిస్తుండగా, కుమారస్వామికథలో వ్యవసాయ సూచనకు బదులు, లోహాల ప్రస్తావన ఉంది. ఈ రెండు కథలు భిన్న భౌగోళికనేపథ్యాలకు చెందినవి కావడమే ఈ తేడాకు ఒక కారణంగా కనిపిస్తుంది. ఉదాహరణకు, హిమాలయప్రాంతాల్లోని ఖనిజసంపద గురించి కుమారస్వామికథే కాకుండా మహాభారతంలోని మరుత్తుడనే రాజు కథ కూడా చెబుతోంది. హిమాలయాలకు వెళ్ళి, శివుని ప్రార్థించి, ఆయన కరుణతో అక్కడి బంగారాన్ని తవ్వి తెచ్చి అశ్వమేధయాగాన్ని చేయమని బృహస్పతి సోదరుడైన సంవర్తుడు మరుత్తునికి చెబుతాడు. మరుత్తుడు హిమాలయసమీపంలోనే ఆ యాగం చేసి అక్కడ తవ్వి తీసిన బంగారాన్ని ఋత్విక్కులకు దక్షిణగా ఇస్తాడు. హిమాలయాలలోని ఖనిజసంపద గురించిన సమాచారాన్ని ఆధునిక అధ్యయనాలు కూడా ఇస్తున్నాయి.

ఇందుకు భిన్నంగా ఎంకి కథకు రంగస్థలం పల్లపుప్రాంతమైన యూఫ్రటీస్-టైగ్రిస్ నదుల పరీవాహకప్రాంతం. ఆ రెండునదులు తుర్కియేకు తూర్పున ఆర్మీనియా మెట్టప్రాంతాలలో పుట్టి లోయలు, కనుమల గుండా సిరియా, ఉత్తర ఇరాక్ మెట్టప్రాంతాలనుంచి దిగువనున్న మధ్య ఇరాక్ లోని ఒండ్రుమట్టి మైదానంలోకి ప్రవహిస్తున్నాయి. ఈ నదీసంగమప్రాంతాలలో చిత్తడినేలలు, సరస్సులు, మడ అడవులు ఏర్పడ్డాయి. చిత్తడినేలలనే ఆవలనీ, బురదనేలలనీ అంటారు. రాంభట్లనే మరోసారి ఉటంకించుకుంటే, అదొక విచిత్రజగత్తు. అక్కడ నిరంతరం భ్రమించే జీవచక్రం కనిపిస్తుంది. ఏ జీవికీ అన్నలోపం ఉండదు సరికదా, రక్షణ కూడా ఉండదు. జలచరాలు, పాములు, తేళ్ళు కూడా ఎక్కువే. కనుక తప్పనిసరైతే తప్ప మనిషి చిత్తడినేలల్లోకి అడుగుపెట్టడు. పశుపాలక దేవుళ్ళ ధాటికి ఆగలేక పూర్వదేవుళ్ళైన అసుర, దైత్య, దానవాదులు అలాంటి తప్పనిసరి పరిస్థితుల్లోనే కాందిశీకులుగా ఈ చిత్తడినేలల్లోకి వచ్చిపడ్డారు.

ఈ నేలల్లో రకరకాల తుంగలు మొలుస్తాయి. వాటికి కుశ, పుల్లు, రెల్లు మొదలైన అనేక పేర్లున్నాయి. ఈ తుంగలకు దుంపలుంటాయి. వాటిని తుంగముస్తలంటారు. వాటిని తినడానికి వరాహాలు చేరతాయి. వాటికోసం అదే పనిగా నేలను పెళ్ళగిస్తాయి. దాంతో ఇప్పుడు చూసిన ఆ నేల రూపం మరో గంటకు మారిపోతుంది. వరాహాలు చిత్తడినేలను పెళ్ళగించడాన్నే ‘కోలాహలం’గా పిలిచి ఉంటారని రాంభట్ల అంటారు. ‘కోలం’ అంటే అడవి పంది అనీ, ‘ఆహలం’ అంటే పెళ్ళగించడం, లేదా దుక్కి అనీ అర్థం. పంది దుక్కి వల్ల నీరు ఒడిసి పొడినేల బయటపడుతుంది. ఆ పొడినేల మీద ఆహారపు మొక్కలు ఏపుగా పెరుగుతాయి.

నాగలికి పశువులను పూన్చి భూమిని దున్నడం ఈ పంది దుక్కినుంచే మనిషి నేర్చుకుని ఉంటాడనీ, ఆవిధంగా వరాహం వ్యవసాయానికి చిహ్నమైందనీ, మత్స్యమూ, కూర్మమూ ఇంతకుముందు అన్నమై మనిషిని ఆదుకుంటే; ఇప్పుడు వ్యవసాయం నేర్పి వరాహం ఆదుకుందనీ; ఈ మూడూ విష్ణువు అవతారాలయ్యాయనీ రాంభట్ల అంటారు. ఇదీ- తొలి వ్యవసాయసంస్కృతీ, నాగరికతా కేంద్రాలలో ఒకటిగా మెసపొటేమియా అవతరణ నేపథ్యం!

చిత్తడినేలల్లో రెల్లుగడ్డి మొలుస్తుందని పైన చెప్పుకున్నాం. విచిత్రం ఏమిటంటే, శివుని వీర్యం పడిన పర్వతంమీదే రెల్లుగడ్డి వనం అవతరించిందని కుమారస్వామికథ కూడా చెబుతోంది. చిత్తడినేలల్లో వ్యవసాయాన్ని స్పష్టంగా చెబుతున్న ఎంకి కథకు భిన్నంగా, ఖనిజసంపద గురించి చెబుతున్న కుమారస్వామికథలో రెల్లువనం ప్రస్తావనకు రావడం- ఈ రెండు కథల సంబంధాన్ని మరింత స్పష్టంగా వెల్లడిస్తోంది.

మొత్తంమీద మానవాతీతంగానూ, మార్మికంగానూ, దైవసంబంధమైనవిగానూ ధ్వనించే సుమేరు, భారతీయ పురాణకథలు రెండూ మనకు తేలికగా బోధపడే ఒక భౌతికవాస్తవికతనూ, చారిత్రకపరిణామాన్నే చెబుతున్నాయి. ఎంకి గురించి చెప్పే పై పంక్తులకు విలియం ఇర్విన్ థామ్సన్ వివరణ ఇస్తూ, సుమేరు భాషలో నీరు అనే మాటకు వీర్యమనే అర్థం కూడా ఉందనీ, జలదేవుడైన ఎంకి వీర్యదేవుడు కూడాననీ అంటాడు. సుమేరుల భూమిని మహత్ పిత(Great Father) అయిన ఎంకి వీర్యం వరదలా ముంచెత్తిందని చెప్పడం, బురదనేలలు, ఆనకట్టలు, కాలువలతో నిండిన సుమేరుభూమి మొత్తం పురుషులదైనట్టు చెప్పడమేనంటాడు; పురుషులకు చెందిన సేద్యపునీటి సాంకేతికను, సైనికస్వభావం కలిగిన సరికొత్త సామాజికనిర్మాణాన్ని, పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని అది నొక్కిచెబుతోందంటాడు.

విశేషమేమిటంటే, ఈ వివరణ కుమారస్వామికథలోని శివునికీ యథాతథంగా అన్వయిస్తుంది!

ఎంకి గురించి చెబుతున్న పై పంక్తులు ఒక విప్లవాత్మకమైన పరివర్తనను సూచిస్తున్నాయని థామ్సన్ అంటూ దాని పూర్వరంగాన్ని వివరిస్తాడు; అదీ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.

దాని గురించి తర్వాత...


కల్లూరి భాస్కరం మరొక రచన


కుమారస్వామికథ ఆవిష్కరించే చారిత్రక సత్యం ఏమిటో తెలుసా?


కల్లూరి భాస్కరం రచలన్నీ ఇక్కడ చదవండి

Read More
Next Story