
మున్సిపల్ ఎన్నికలు మూడు పార్టీలకు ముఖ్యమే...
తెలంగాణ రాజకీయాల్లో రెండో స్థానం బిఆర్ ఎస్ దా లేక బిజెపిదా తేల్చనున్న మునిసిపల్ ఎన్నికలు
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమవుతోంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు అంటే కాంగ్రెస్, బిఆర్ ఎస్, బిజెపిలకు కీలకంగా మారనున్నాయి .మరో కోణంలో వచ్చే మున్సిపల్ ఎన్నికలు అన్ని పార్టీలను ఒకరకంగా కలవర పెడుతున్నాయి.ఇపుడు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమంటే మేము అని బిఆర్ ఎస్ , బిజెపి నాయకులు భావిస్తున్నారు. అయితే, మొగ్గు కొద్ది బిఆర్ ఎస్ వైపు ఉన్నట్లు ఆ మధ్య జరిగిన జూబిలీ హిల్స్ అసంబ్లీ ఎన్నిక, ఇటీవల జరిగిన గ్రామసర్పంచుల ఎన్నికలు చెప్పాయి. బిజెపి కొద్దిగాబలహీనపడినట్లు పార్టీ హైకమాండ్ లో కూడా అనుమనాలు వచ్నినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధాని మోదీ స్వయంగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బిజెపిని ఆదుకునేందు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే, బిజెపి ఆయనతో కలసేందుకు సముఖంగా లేదు. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు స్వయంగా ప్రకటిస్తూ కాంగ్రెస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయని, ఇలాంటి తమకు జనసేన సాయం అవసరం లేదని ఆయన అన్నారు. ఈలెక్కన రామచంద్రరావు విశ్వాసంలో ఎంత పస ఉందో మునిసిపల్ ఎన్నికలు రుజువుచేయనున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి పార్టీల గుర్తులపై జరుగుతున్న ఈ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. గ్రామీణ రాజకీయాలకంటే భిన్నంగా పట్టణ ఓటర్ల మనస్తత్వం, అభివృద్ధి ఆశలు, జీవన వ్యయ సమస్యలు ఈ ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు ఒక ఎత్తు, వచ్చే మున్సిపల్ ఎన్నికలు మరో ఎత్తుగా కనిపిస్తున్నాయి.
మున్సిపల్ ఎన్నికల ప్రాధాన్యత ఎందుకు పెరిగింది? అని ఆలోచిస్తే తెలంగాణలో పట్టణీకరణ వేగంగా పెరుగుతోంది. హైదరాబాద్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీలు జిల్లా కేంద్రాలు,పారిశ్రామిక పట్టణాలు, ఇవి ఇప్పుడు రాజకీయ శక్తికేంద్రాలుగా మారాయి. పట్టణ ప్రజలు కేవలం సంక్షేమం మాత్రమే కాదు, మౌలిక సదుపాయాలు, ఉపాధి, మౌలిక వసతులు, శుభ్రత, ట్రాఫిక్, నీటి సమస్యలు వంటి అంశాలపై స్పష్టమైన అభిప్రాయం కలిగి ఉన్నారు. అందుకే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు, భవిష్యత్ లోక్‌సభ ఎన్నికల ట్రెండ్‌కు సూచికగా భావిస్తున్నారు.
పార్టీల పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ ముందున్న సవాళ్లు ఏంటి?
ప్రస్తుత పరిణామాలు చూస్తే అధికారంలో వున్న కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ , బీజేపీ లు రాజకీయ సందిగ్ధం తోనే కొట్టుమిట్టాడుతున్నాయి. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు, పార్టీలో సంస్థాగతంగా వున్న ఇబ్బందులు, మూడేళ్ల పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారో అన్న సందిగ్ధంలో కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతోంది.ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలలో చులకన అయిందని అరుస్తున్న విపక్షాలు అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు. ఆరు గ్యారెంటీల అమలు, పరిపాలనలో మార్పులు, సంక్షేమ పథకాలు పునర్వ్యవస్థీకరణ, పట్టణ ప్రజానీకంలో ఎంతవరకు నమ్మకం కల్గించాయన్నది ఈ ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి. పట్టణాలలో కాంగ్రెస్ సంస్థాగత బలహీనత, స్థానిక నేతలు మధ్య అంతర్గత విభేదాలు , గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి తో అందరూ పోల్చి చూడటం కాంగ్రెస్ ముందున్న ప్రధాన సవాళ్లుగా మారాయి.కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికలను ఒక పరీక్షగానే భావిస్తునే ,పైకి మాత్రం గాంభిర్యాన్ని ప్రదర్శిస్తోంది.బీసీ రిజర్వేషన్ల ఉచ్చు కాంగ్రెస్ ను వెంటాడుతూనే వుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని గర్వంగా చెప్పుకొని నానా హంగామా చేసిన కాంగ్రెస్ దానిని అమలు చేయలేని పరిస్థితిలో వుంది.న్యాయ పరంగా ఆటంకాలు, కేంద్ర నిర్ణయం ఏదేమైనా ఆర్భాటంగా హామీ ఇచ్చి బొక్కబోర్లా పడిన తీరు కాంగ్రెస్ పార్టీని బీసీ వర్గాలలో చులకన చేసింది.బీఆర్ఎస్, బీజేపీలు దానిని అనుకూలంగా మార్చుకుంటున్నాయి.
గులాబీ పార్టీకి ఈ ఎన్నికలే చక్కటి అవకాశం
గత ఒకటిన్నర సంవత్సరంగా కాంగ్రెస్ పాలన తీరు మీద బీఆర్‌ఎస్ నేతలు సాగిస్తున్న ఆందోళనలను పట్టణ ప్రజలు ఎలా స్వీకరిస్తున్నారో తెలుసుకునే అవకాశం ఈ మున్సిపల్ ఎన్నికలు ద్వారా ప్రతిపక్ష పార్టీకి లభిస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తు లేకున్నా మంచి ఫలితాలే సాధించామని భావిస్తున్న గులాబీ పార్టీ నేతలు మున్సిపల్ ఎన్నికలు మరో కీలక అవకాశం గా చూస్తున్నారు. పట్టణాల్లో తమ అభివృద్ధి రికార్డు ప్రస్తావనతో పాటు మున్సిపాలిటీలకు గతంలో కేటాయించిన నిధులపై బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటోంది.కాంగ్రెస్ పాలనపై అసంతృప్తిని ఎత్తిచూపడం ప్రజలలోకి తీసుకెళ్లడం ప్రధాన అంశంగా బీఆర్ఎస్ భావిస్తోంది. ప్రత్యేకించి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోబీఆర్‌ఎస్‌కు ఇప్పటికీ బలమైన క్యాడర్ ఉండటం ఈ ఎన్నికలను మరింత ఉత్కంఠభరితంగా మారుస్తోంది. "కాంగ్రెస్ కు మాకే పోటీ బీజేపీ రేసులోనే లేదు" అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు.
కవిత ఫ్యాక్టర్ ఎఫెక్ట్
గత ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీలో అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న బీఆర్ఎస్ కు కేసీఆర్ తనయ కవిత ఎపిసోడ్ బాంబు లా మారింది.కవిత ప్రభావం తమ పార్టీపై లేదని బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నా, ఏ క్షణంలో ఏం కొంప మునుగుతుందోనన్న భయం మాత్రం గులాబీ నేతల్లో కనిపిస్తోంది. శాసనమండలి వేదికగా కవిత తన తండ్రి కేసీఆర్ ను కూడా టార్గెట్ చేసిన తరువాత కారు పార్టీలో కలకలం కనిపిస్తోంది.ఈ విషయమై సూర్యాపేట జిల్లా కు చెందిన బీఆర్ఎస్ నేత రావుల శ్రీనివాస్ రెడ్డి ఫెడరల్ తెలంగాణ తో మాట్లాడుతూ " జిల్లాల స్ధాయిలో మా పార్టీపై కవిత ప్రభావం లేదు " అన్నారు. "మా నాయకుడు కేసీఆర్ కుమార్తెగా కవితమ్మకు తగిన గౌరవం ఇస్తూ వచ్చారే గాని, పార్టీ పరంగా నాయకులు దూరం కాలేదన్నారు.ఇదంతా కాంగ్రెస్ ఆడిస్తున్న ఆటగా బీఆర్ఎస్ నేతలు కొట్టి పారేస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు,ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సభ్యులు ప్రొఫెసర్ మోహన్ రావు ఈ విషయమై ఫెడరల్ తెలంగాణ తో మాట్లాడుతూ" కవిత ప్రభావం ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీపై కనిపించడం లేదు.భవిష్యత్ లో వుంటుందని నేను అనుకోవడం లేదు "అన్నారు.మీడియాపరంగానే కవిత హైలెట్ అవుతుందని చెప్పారు.
మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ఆశలు
........
తెలంగాణలో బీజేపీ ప్రధానంగా
పట్టణ ఓటర్లపై దృష్టి పెట్టింది.జాతీయ రాజకీయాల ప్రభావం,కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం,హిందుత్వ, జాతీయత అంశాల ప్రస్తావన పట్టణ ఓటర్లలో వర్క్ అవుట్ అవుతాయని కమలనాథులు భావిస్తున్నారు.మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బలపడితే భవిష్యత్తులో ప్రధాన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలన్న లక్ష్యానికి బలం చేకూరుతుంది. ఈ ఆలోచనతోనే కమలం నేతలు అడుగు ముందుకు వేస్తున్నారు. అయితే గడిచిన అసెంబ్లీ, ఆ తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికలు పార్టీకి అనుకూలంగా వున్నా, ఆ రాజకీయ పరిణామాలను తమకు పూర్తి అనుకూలంగా మార్చుకోవడంలో బీజేపీ రాష్ట్ర నేతలు విఫలమయ్యారన్నది ఎవరూ కాదనలేని నిజం. బలుపు చూసి బలం అనుకునే స్థితిలో కమలం నేతలు కనిపిస్తుండగా , బలుపు ను బలంగా మార్చుకోవడంలో విఫలం అయ్యామని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు ఎలావచ్చినా, ఆ తరువాత జరగనున్న జిహెచ్ఎంసి ఎన్నికలపైనే ప్రధానంగా బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఇదే విషయంపై ప్రొఫెసర్ మోహన్ రావు ఫెడరల్ తో మాట్లాడుతూ "మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ పెద్దగా సాధించేది వుండదు. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలను అనుకూలంగా మార్చుకోవాల్సిన తప్పని సరి పరిస్థితుల్లో బీజేపీ వుంది" అన్నారు. "పట్టణ ఓటర్లలో మా పార్టీ కి సానుకూల వాతావరణం వుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా సత్తా చాటుతాం" అని బీజేపీ తెలంగాణ మెడికల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ సుందరయ్య వ్యాఖ్యానించారు.బీసీల రిజర్వేషన్లు విషయంలో కాంగ్రెస్ వైఫల్యం తమకు కలిసి వస్తుందని బీసీ నేతగా చెబుతున్నానని సుందరయ్య ఫెడరల్ తెలంగాణ తో అన్నారు.
తెలంగాణ లో పోటీకి సిద్దమయిన జనసేన
మున్సిపల్ ఎన్నికలలో తాము కూడా పోటీలో దిగుతామని జనసేన నుంచి ప్రకటన రావడం కూడా తెలంగాణ రాజకీయాలలో చర్చకు దారితీసింది.ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ , తెలుగుదేశం తో పొత్తులో వున్న జనసేన తెలంగాణ లో ఒంటరిగా బరిలో దిగుతుందా, అదే జరిగితే బీజేపీ ఎలా స్పందిస్తుందో నన్న చర్చల మధ్య మున్సిపల్ ఎన్నికలలో జనసేన మద్దతు తమకు అవసరం లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తేల్చిచెప్పారు. తమ పార్టీ పుంజుకుందని, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని ధీమా వ్యక్తంచేశారు. పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటనకు వచ్చిన స్పందనను గుర్తు చేస్తున్న జనసేన తెలంగాణ నేతలు, భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో పోటీకి జనసేన దిగుతోందని చెబుతున్నారు.అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం ప్రస్తుతానికి జనసేన ప్రభావం తెలంగాణ రాజకీయాలలో లేదని విశ్లేషిస్తున్నారు.ఏదైనా పవన్ కళ్యాణ్ తెలంగాణ బీజేపీ కి ఎలాంటి ఝలక్ ఇస్తారో చూడాల్సి వుంది.అయితే ఇటీవల కోనసీమ కొబ్బరి కి తెలంగాణ నేతలు దిష్టి తగిలిందంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో చర్చకు దారితీశాయి. పవన్ వ్యాఖ్యలపై బీజేపీ నుంచి ఎలాంటి స్పందన రాకున్నా, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు మాత్రం తీవ్రంగానే స్పందించారు..ఆ వ్యాఖ్యల దుమారం తరువాతే పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన పూర్తి సక్సెస్ కావడం కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాల్సి వుంది.
స్థానిక అంశాలే ఫలితాలను నిర్ణయించనున్నాయా?
మున్సిపల్ ఎన్నికలు అంటే సాధారణంగా అధికార పార్టీకి అనుకూలంగానే వుంటాయి.అయినా స్థానిక సమస్యలు, అభ్యర్థుల బలాబలాలు కూడా ప్రభావితం చేస్తాయి. అధికార పార్టీ మాత్రమే తమ సమస్యలను తీర్చగలదన్న అమాయక ప్రజల ఆకాంక్ష లతో ఆడుకోవడం కూడా రూలింగ్ పార్టీలు తొలి నుంచి చేసే పనే. మున్సిపాలిటీ లలో డ్రైనేజీ,తాగునీరు, రోడ్లు, ఆస్తి పన్నులు,ట్రాఫిక్ సమస్యలు
వంటివి ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేయనున్నాయి.
అలాగే అభ్యర్థి వ్యక్తిగత ప్రతిష్ఠ,స్థానికంగా చేసిన సేవలు వార్డు స్థాయిలో నాయకత్వం కూడా కీలక పాత్ర పోషించనున్నాయి.
మొత్తంగా చూస్తే, తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు అధికార కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది.పంచాయతీ ఎన్నికల్లో గెలుపు ధీమా గా వున్న కాంగ్రెస్ పాలనకు తొలి ప్రజాతీర్పు మున్సిపల్ ఎన్నికల ద్వారా లభించనుంది.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పట్టాలెక్కకున్నా ,పాత విధానంలో రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఎన్నికలు కమిషన్ మున్సిపల్ ఎలక్షన్ లకు చర్యలు ప్రారంభించింది. అటు పంచాయతీ ఎన్నికల్లో కరెక్ట్ గోల్ కొట్టామన్న ఊపులో వున్న ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వంలో నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ లను మట్టికరిపించడానికి ఇదే తగిన సమయమని భావిస్తోంది. బీఆర్‌ఎస్‌కు రికవరీ అవకాశమో, బీజేపీకి లక్కో, కాంగ్రెస్ హస్తవాసి కంటిన్యూ అవుతుందో ఏమోగానీ అన్ని పార్టీలకూ ఈ మున్సిపల్ ఎన్నికలు కీలకమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

