
తల్లిదండ్రుల చేతుల్లో పిల్లల హత్యలు... ఎందుకు ?
కుటుంబాల్లో పెరుగుతున్న మానసిక సంక్షోభం...
మనిషి జీవితంలో అత్యంత పవిత్రమైన సంబంధం తల్లిదండ్రులు–పిల్లల బంధం. ఒక తల్లి తన బిడ్డ కోసం ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. ఒక తండ్రి తన పిల్లల భవిష్యత్తు కోసం జీవితాన్ని అంకితం చేస్తాడు. కానీ కొన్నిసార్లు అదే తల్లిదండ్రుల చేతుల్లోనే పిల్లలు ప్రాణాలు కోల్పోవడం ఒక ఘోర విరుద్ధత. ఈ సంఘటనలు వార్తలుగా చదివినప్పుడు మనం ఒక్క క్షణం షాక్ అవుతాము. కానీ మానసిక శాస్త్ర దృష్టితో చూస్తే ఇవి కేవలం నేరాలు కాదు — సమాజం లోపల పెరుగుతున్న మానసిక సంక్షోభానికి సంకేతాలు.
మానసిక వైద్యశాస్త్రంలో తల్లిదండ్రులు తమ పిల్లలను హత్య చేయడాన్ని ఫిలిసైడ్ ( Filicide) అని పిలుస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా పరిశోధనకు గురైన ఒక క్లిష్టమైన మానసిక–సామాజిక సమస్య. ఈ సంఘటనల వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవాలంటే వ్యక్తి మానసిక స్థితి, కుటుంబ పరిస్థితులు, సామాజిక ఒత్తిడులు, ఆర్థిక పరిస్థితులు అన్నింటినీ విశ్లేషించాల్సి ఉంటుంది.
ప్రపంచ గణాంకాలు – భయంకరమైన వాస్తవం...ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనలు చెబుతున్నాయి — పిల్లలపై జరిగే హత్యల్లో గణనీయమైన శాతం తల్లిదండ్రుల చేతుల్లోనే జరుగుతాయి. అమెరికాలో ప్రతి సంవత్సరం సుమారు 450 మంది పిల్లలు తల్లిదండ్రుల చేతిలో మరణిస్తున్నారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లల హత్యల్లో 60% వరకు కేసుల్లో నేరస్తులు తల్లిదండ్రులే. పరిశోధనల ప్రకారం సుమారు 30–40% కేసుల్లో తీవ్రమైన మానసిక వ్యాధులు కారణంగా ఉన్నాయి.ఇంకో ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే...చిన్న శిశువుల హత్యలు ఎక్కువగా తల్లుల చేతిలో జరుగుతాయి. పెద్ద పిల్లల హత్యలు ఎక్కువగా తండ్రుల చేతిలో జరుగుతాయి. ఈ గణాంకాలు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతున్నాయి — ఇది కేవలం క్రిమినల్ సమస్య కాదు. ఇది మానసిక ఆరోగ్య సమస్య కూడ..
ఇక తెలుగు రాష్ట్రాల్లో :
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సుమారు 40–60 పిల్లల హత్యలు,ఆంధ్రప్రదేశ్ లో. సుమారు 35–50 పిల్లల హత్యలు, ఈ కేసుల్లో గణనీయమైన భాగం కుటుంబ గొడవలు, మానసిక సమస్యలు, ఆర్థిక ఒత్తిడిలు,
వల్ల జరుగుతున్నట్లు విశ్లేషణలు సూచిస్తున్నాయి.
పిల్లలపై నేరాలు మరియు హత్యలు అనే విభాగాల ఆధారంగా కింది గణంకాలు విశ్లేషించబడతాయి. తెలంగాణ రాష్ట్రంలో – పిల్లలపై నమోదైన నేరాలు/ హత్యలు , 2014 సంవత్సరం లో 1,820 నేరాలు/ హత్యలు 2015 సం:లో 1,945, 2016 సం:లో 2,210, 2017 సం:లో 2,640, 2018 సం:లో 2,980, 2019 సం:లో 3,150, 2020 సం:లో 3,270, 2021సం:లో 3,620, 2022 సం:లో 3,890 , 2023 సం:లో ~3,700 నమోదు అయ్యాయి. గత దశాబ్దంలో తెలంగాణలో పిల్లలపై నేరాలు దాదాపు రెట్టింపు అయ్యాయి. హైదరాబాద్ మెట్రో ప్రాంతంలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ – పిల్లలపై నమోదైన నేరాలు / హత్యలు, 2014 సం:లో 1,640, 2015 సం:లో 1,720,
2016 సం:లో 1,880, 2017 సం:లో 2,040, 2018 సం:లో 2,260, 2019 సం:లో 2,380, 2020 సం:లో
2,410, 2021సం:లో 2,720, 2022 సం:లో 2,960, 2023 సం:లో ~2,840, నమోదు చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా గత 10 సంవత్సరాల్లో పిల్లలపై నేరాలు సుమారు 70% పెరిగాయి. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ప్రధాన కారణాలు :
మానసిక శాస్త్రంలో ప్రసిద్ధ పరిశోధకుడు డా. ఫిలిప్ రెస్నిక్ Filicide ను ఐదు ప్రధాన రకాలుగా వర్గీకరించాడు.
ఒకటి: ప్రేమతో చేసిన హత్య ( Altruistic Filicide ),ఇది వినడానికి విరుద్ధంగా అనిపించినా కొన్ని తల్లిదండ్రులు, నా పిల్ల ఈ ప్రపంచంలో బాధపడకూడదు. అనే భావనతో హత్య చేస్తారు.ఇది సాధారణంగా కనిపించే పరిస్థితులు,తీవ్రమైన పేదరికం,తల్లిదండ్రుల ఆత్మహత్య ఆలోచనలు,పిల్లలకు భవిష్యత్తు లేదనే నమ్మకం,వారికి ఇది నేరం కాదు, ఇది పిల్లను బాధ నుండి రక్షించడం అనిపిస్తుందనే భ్రమలు.
రెండు: మానసిక వ్యాధి ప్రభావం ( Psychotic Filicide ),కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు తీవ్రమైన మానసిక వ్యాధుల ప్రభావంలో ఉంటారు.ఉదాహరణలు, స్కిజోఫ్రేనియా, తీవ్రమైన భ్రాంతులు,
ప్రసవానంతర సైకో సిస్ (Postpartum psychosis),ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవం మరియు ఊహ మధ్య తేడా వారికి తెలియదు. కొన్ని కేసుల్లో తల్లులు “పిల్లలో దెయ్యం ఉంది” అని భావించి హత్య చేసిన సంఘటనలు నమోదయ్యాయి. ఇది పూర్తిగా మానసిక అనారోగ్యానికి సంబంధించిన విషాదం.
మూడు: నిరంతర హింస చివరి దశ ( Fatal Child Abuse ) ,పిల్లలపై నిరంతర హింస ఒక దశలో ప్రాణాంతకంగా మారుతుంది.ఇందులో కనిపించే పరిస్థితులు, తీవ్రమైన కొట్టడం, ఆకలికి దూరం పెట్టడం, పదేపదే శారీరక హింసలు.ఇది సాధారణంగా కోపం నియంత్రణ కోల్పోవడం వల్ల జరుగుతుంది.
నాలుగుఫ: అవసరం లేని పిల్లలు ( Unwanted Child Filicide ) ,కొన్ని తల్లిదండ్రులకు పిల్ల ఒక భారంగా అనిపిస్తుంది.కారణాలు,అవాంఛిత గర్భం, ఆర్థిక సమస్యలు, కుటుంబ ఒత్తిడిలు, కొన్ని దేశాల్లో అమ్మాయి పిల్లలపై జరిగే హత్యలు కూడా దీనిలో భాగమే. భారతదేశంలో గత రెండు దశాబ్దాల్లో లక్షల సంఖ్యలో అమ్మాయి భ్రూణాలు గర్భంలోనే తొలగించబడ్డాయి.
ఇక అయిదోవది.. ప్రతీకారం కోసం పిల్లల హత్య ( Spousal Revenge ), ఇది అత్యంత క్రూరమైన రకం. భర్త లేదా భార్యపై కోపంతో పిల్లలను హత్య చేయడం జరుగుతుంది. విడాకులు, దాంపత్య విభేదాలు వంటి సందర్భాల్లోను, పిల్లలు ప్రతీకారం సాధనంగా మారిపోతారు.
ఈ ఘటనలు ఎందుకు పెరుగుతున్నాయి?
సంయుక్త కుటుంబ వ్యవస్థ క్షీణించడం, మానసిక ఆరోగ్య సేవలు తక్కువగా ఉండటం. ఆర్థిక అసమానతలు,మత్తు పదార్థాల ప్రభావం, సామాజిక ఒత్తిడులు, సమాజానికి ఇది ఒక హెచ్చరిక. గత దశాబ్దంలో పట్టణీకరణలు, కుటుంబ వ్యవస్థ మార్పులు, మానసిక ఒత్తిడిలు పెరిగిన కొద్దీ పిల్లలపై నేరాలు కూడా పెరిగాయి. విచిత్రంగా పిల్లలను చంపే తల్లిదండ్రులు చాలా సందర్భాల్లో ముందే కొన్ని సంకేతాలు ఇస్తారు. ఉదా : పిల్లలతో కలిసి చనిపోతాను. బతికి సాధించేది ఏమీ లేదు, జీవితానికి అర్థం లేదు అనే మాటలు అడపా దడపా అంటుంటారు. ఈ సంకేతాలను గుర్తిస్తే అనేక విషాదాలు ముందుగానే నివారించవచ్చు.
పరిష్కార మార్గాలు :
తల్లిదండ్రుల చేతుల్లో పిల్లల హత్యలు అనేవి, మనిషి సహజ ప్రేమకు విరుద్ధంగా కనిపించే విషాదాలు.కానీ మానసిక శాస్త్రం ఒక నిజాన్ని చెబుతుంది, పిల్లలను చంపే తల్లిదండ్రులు ఒక్కరోజులో క్రూరులు కాలేదు.
వారి లోపల సంవత్సరాలుగా పెరిగిన మానసిక చీకటి చివరకు ఈ విషాదానికి దారి తీసింది.పిల్లలను కాపాడాలంటే కేవలం చట్టాలు సరిపోవు. మానసిక ఆరోగ్యాన్ని సమాజం ప్రాధాన్యంగా తీసుకోవాలి.ఈ సమస్యను తగ్గించడానికి సమాజం కొన్ని చర్యలు తీసుకోవాలి.Postpartum Mental Health Screening, కుటుంబ కౌన్సెలింగ్, మానసిక ఆరోగ్య అవగాహన, పిల్లల రక్షణ వ్యవస్థలు, తల్లిదండ్రుల చేతుల్లో పిల్లల హత్యలు అనేవి , కేవలం వ్యక్తిగత నేరాలు కాదు .సమాజం లోపల పెరుగుతున్న మానసిక సంక్షోభానికి ప్రతిబింబం.పిల్లలను కాపాడాలంటే చట్టాలు మాత్రమే సరిపోవు. మానసిక ఆరోగ్యాన్ని సమాజం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలి.ఎందుకంటే ఒక దేశ భవిష్యత్తు...అది తన పిల్లలను ఎంత సురక్షితంగా పెంచుతుందనే దానిపై ఆధారపడి ఉంటుందనే విషయాన్ని మరవొద్దు !
Next Story

