కేవలం సన్న బియ్యం చాలవు, ఫుడ్ బాస్కెట్ ను విస్తరించాలి
x
Source: Compassion Foundation

కేవలం సన్న బియ్యం చాలవు, ఫుడ్ బాస్కెట్ ను విస్తరించాలి

పప్పులు, నూనెలు, చిరు ధాన్యాలు, కూరగాయలు వగైనా అందిస్తే పేదలకు ఆహారభద్రత, పంటలకు మార్కెటింగ్ పెరుగుతుందంటున్నారు రైతు స్వరాజ్య వేదిక కన్నెగంటి రవి


ఉగాది నుండీ ప్రారంభించి, రాష్ట్రంలో రేషన్ కార్డు పై సన్న బియ్యం సరఫరా చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖా మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఉగాది రోజు రేషన్ కార్డులపై సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

2025 మార్చ్ 30 నాటికి పౌర సరఫరాల శాఖ వెబ్ సైట్ ప్రకారం రాష్ట్ర వ్యాపితంగా 90,41,972 రేషన్ కార్డుల పై 2,85,82,272 మంది లబ్ధి దారులుగా ఉన్నారు. ప్రజా పాలన కార్యక్రమం లో భాగంగా రేషన్ కార్డుల కోసం మరో 30 లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. వీటిని పూర్తిగా పరిష్కరించే సమయానికి రాష్ట్రంలో 1,10,00,000 రేషన్ కార్డులు, 3,15,00,000 మంది లబ్ధిదారులు ఉండే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తున్నది.

రేషన్ బియ్యాన్ని పొందే వారిలో దారిద్ర్య రేఖకు దిగువున ( BPL) ఉన్న , దారిద్ర్య రేఖకు ఎగువున ఉన్న ( APL) పేదలు ఉన్నారు. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం అంత్యోదయ అన్న యోజన కార్డులు 5,66,628 ఇచ్చింది. వీటిపై 16,23,152 మంది లబ్ధిదారులుగా ఉన్నారు. ఈ కార్డులపై కుటుంబ సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి 35 కిలోల బియ్యం ఇస్తారు. మరో 48,99,281 ప్రియారిటీ కారులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిపై 1,78,11,626 మంది లబ్ధి దారులుగా ఉన్నారు. వీటిపై ఒక వ్యక్తికి నెలకు 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తారు. అంటే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మొత్తం 54,65,909 కార్డులపై 1,94,34,777 మంది లబ్ధిదారులుగా ఉన్నారు.

వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 9 అంత్యోదయ అన్న యోజన కార్డులు ( 16 మంది లబ్ధిదారులు ), మరో 35,70,667 ప్రయారిటీ కార్డులు ( 91,41,840 మంది లబ్ధిదారులు), మరో 5387 అన్న పూర్ణ కార్డులు ( 5639 మంది లబ్ధిదారులు ) జారీ చేసింది . ఈ కార్డులపై ఎవరూ తోడు లేని వృద్ధులకు నెలకు 10 కిలోల బియ్యం ఇస్తారు. అంటే మొత్తం 35,70,667 రేషన్ కార్డులపై 91,47,495 మందికు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యం అందిస్తున్నది. పైగా కేంద్రం ఇచ్చే బియ్యానికి అదనంగా మరో కిలో కలిపి ఒక వ్యక్తికి నెలకు 6 కిలోల బియ్యం ఇస్తున్నది.

అంటే తెలంగాణ రాష్ట్రంలోఇప్పటి వరకూ 90,41,972 కార్డులపై 2,85,82,272 మంది రేషన్ బియ్యం పొందడానికి అర్హులు గా ఉన్నారు. అంటే 2021 నాటికి రాష్ట్ర జనాభా సుమారుగా 3,81,00,000 అనుకుంటే, 85 శాతం జనాభా ఆహార భద్రత చట్టం పరిధిలో ఉంటున్నారని అర్థం . ఈ పథకం కోసం మొత్తంగా కేంద్ర ప్రభుత్వం 5,489 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 8,033 కోట్లు మొత్తం గా సంవత్సరానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి13,522 కోట్లు ఖర్చు చేస్తున్నాయి.

ఈ కార్డులపై ఇప్పటి వరకూ దొడ్డు బియ్యం సరఫరా చేసే వారు. సాధారణ ప్రజలలో అత్యధికులు కూడా ఈ బియ్యం తినడానికి ఇష్టపడడం లేదు. ఇందుకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న దొడ్డు బియ్యం నాణ్యతగా లేకపోవడం ఒక కారణమైతే, బాగా పాలిష్ చేసిన తెల్ల బియ్యం తినడాన్ని నాగరికతగా గుర్తించే ఒక సంస్కృతి సమాజంలో విస్తృతంగా చెలామణి లో ఉండడం మరో కారణం.

గత నాలుగు దశాబ్ధాలుగా ప్రజలు తినలేని విధంగా ప్రభుత్వం సరఫరా చేసిన దొడ్డు బియ్యం చుట్టూ ఒక మాఫియా తయారైంది. ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైస్ మిల్లర్లు ఇందులో వేల కోట్లను దండుకున్నారు. ఇప్పుడు తెల్ల బియ్యం చుట్టూ కూడా ఎటువంటి మాఫియా తయారవుతుందో వేచి చూడాలి. క్వింటాలు ధాన్యానికి ఎంత తెల్ల బియ్యం ప్రభుత్వానికి రైస్ మిల్లర్లు తిరిగి ఇవ్వాలనే దానిపై కుంభ కోణం మొదలవుతుంది. అక్కడి నుండే అవినీతి కథ ముందుకు వెళుతుంది.

ధాన్యంలో సన్న బియ్యం రకాలు వేరు, దొడ్డు బియ్యం రకాలు వేరు. నిజానికి బాగా పాలిష్ చేసిన సన్న బియ్యం కంటే, దొడ్డు బియ్యం లో ఎక్కువ పోషకాలు ఉంటాయి (తవుడు కలసి ఉండే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ). కానీ బాగా పాలిష్ చేసిన సన్న తెల్ల బియ్యం తో పోల్చినప్పుడు, ఈ బియ్యంతో వండిన అన్నం కొంత సుద్ధగా తయారవుతుంది. తెల్లని సన్న బియ్యం తో వండిన తెల్లగా ఉండే అన్నం చాలా మంది కనులకు ఇంపుగా కనపడుతుంది.

ధనికులు, మధ్యతరగతి ప్రజలు తెల్లని సన్న బియ్యం తింటారనీ, స్థోమత లేని పేదలు మాత్రమే దొడ్డు బియ్యం తింటారనీ ఒక ప్రచారం సమాజంలో ఉంది. అంటే ఆరోగ్యం, పోషకాలు కాకుండా, సన్న బియ్యపు తెల్లని రంగు చాలా మంది ఆలోచనలను ప్రభావితం చేస్తూ వచ్చింది. దీనిని సాకుగా తీసుకుని, ప్రభుత్వాలు తాము అధికారంలోకి వస్తే రేషన్ కార్డులపై తెల్ల సన్న బియ్యం సరఫరా చేస్తామని హామీలు ఇవ్వడం ప్రారంభమైంది. గతంలో KCR కూడా ఈ హామీ ఇచ్చాడు. హాస్టల్ పిల్లలకు తెల్లని సన్న బియ్యం సరఫరా చేశాడు.

కాంగ్రెస్ పార్టీ కూడా తాము అధికారంలోకి వస్తే, కేవలం హాస్టల్ విద్యార్ధులకే కాకుండా, ప్రజలందరికీ సన్న తెల్ల బియ్యం సరఫరా చేస్తామని ఎన్నికల మానిఫెస్టోలో హామీ ఇచ్చింది. 15 నెలల తరువాత ఇప్పుడు అమలు ప్రారంభించింది. ఈ హామీ అమలు చేయడానికి వీలుగా, రైతులు సన్న ధాన్యం పండించేలా, కనీస మద్ధతు ధరపై 500 రూపాయల బోనస్ ఇస్తామని హామీ ఇచ్చింది. 2024 ఖరీఫ్ సీజన్ లో 4,40,000 మంది రైతుల నుండీ 1200 కోట్ల బోనస్ చెల్లించి సన్న బియ్యం సేకరించింది. నడుస్తున్న యాసంగి సీజన్ లో కూడా MSP పై 500 రూపాయల బోనస్ అదనంగా చెల్లించి మరింత సన్న ధాన్యం కొనుగోలు చేస్తామని కూడా ఇప్పటికే ప్రకటించింది.

పేదలకు కడుపు నిండా ఆహారం అందేలా చూడడం ప్రభుత్వాల బాధ్యత. దేశంలో UPA ప్రభుత్వ హయాంలో 2013 నుండీ అమలులోకి వచ్చిన ఆహార బద్రత చట్టం కూడా అదే చెబుతుంది. రేషన్ కార్డులు ఎవరికి ఉండాలి ? అందుకు మార్గదర్శకాలు ఏమిటి ? అనేది కూడా స్పష్టంగానే ఉంది. వీటి ప్రకారం రేషన్ కార్డులు, రేషన్ బియ్యం కేవలం పేదలకు మాత్రమే అందాలి. కానీ ప్రభుత్వాలు ఇప్పటి వరకూ కేవలం బియ్యం సరఫరా చేస్తూ, మిగిలిన నిత్యావసర సరుకుల ధరలు పెరిగినా పట్టించుకోవడం లేదు.. ఫలితంగా ప్రజలు ఈ భారాన్ని మోయవలసి వస్తున్నది.

ఆహార బధ్రత చట్టం వచ్చిన 12 ఏళ్లు గడిచాక కూడా పేదలకు ఇచ్చే రేషన్ కార్డుల సంఖ్య తగ్గడం లేదు. పైగా పెరుగుతున్నది. రేషన్ బియ్యం పై ఆధారపడి బతికే లబ్ధి దారుల సంఖ్య కూడా పెరుగుతున్నది. దీని అర్థం ఏమిటి ? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్ధిక, సామాజిక, రాజకీయ విధానాలు దేశంలో పేదరికాన్ని తగ్గించడం లేదనీ, పేదలను మరింత పెంచుతున్నాయనీ అర్థం చేసుకోవాలి. ఈ విధానాలు దేశంలో కొద్ది మంది చేతుల్లో ఆస్తులను పెంచుతున్నాయి కానీ, మెజారిటీ ప్రజలకు కనీస ఆదాయాలు కూడా రావడం లేదని అర్థం చేసుకోవాలి.

ఉదాహరణకు తెలంగాణ సామాజిక ,ఆర్ధిక ముఖ చిత్రం ప్రకారం 2024-2025 కోసం అంచనా వేసిన తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువ 16,12,000 కోట్లు. ఈ సంవత్సరానికి అంచనా వేసిన సగటు తలసరి ఆదాయం 3,79,000 రూపాయలు. రాష్ట్రం ఈ స్థాయిలో అభివృద్ధి చెందితే, నిజానికి రేషన్ కార్డుల సంఖ్య పూర్తిగా తగ్గిపోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకూ ఉన్న మార్గదర్శకాల ప్రకారం, గ్రామీణ ప్రాంతాలలో కుటుంబానికి లక్షన్నర రూపాయల లోపు, నగర ప్రాంతాలలో 2 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికే రేషన్ కార్డులు మంజూరు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సారి రేషన్ కార్డులను మంజూరు చేయడానికి కూడా ఇవే మార్గదర్షాకాలు ఉంటాయని స్పష్టం చేసింది.

అంటే, రాష్ట్రంలో 85 శాతం కుటుంబాలు ఇప్పటికీ రేషన్ కార్డులపై, రేషన్ బియ్యం పై ఆధారపడాల్సిన దుస్థితిలోనే ఉన్నాయన్నమాట. అంటే ప్రభుత్వాలు ప్రకటిస్తున్నట్లుగా పెరుగుతున్న జీ ఎస్ డీ పీ, సగటు తలసరి ఆదాయం గాలి లెక్కలే తప్ప, వాస్తవ చిత్రాన్ని చూపించడం లేదని అర్థం. లేదా GSDP లెక్కింపులో సమస్యలున్నాయని అర్థం. లేదా, శత కోట్లకు పడగలెత్తిన ధనికులను, దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న పేదలను సమానంగా చూస్తూ, సగటు తలసరి ఆదాయం ప్రకటిస్తున్నారని అర్థం. ప్రభుత్వాలు ఎంత తప్పుడు ఆర్ధిక విశ్లేషణ చేస్తున్నాయో, తప్పుడు అభివృద్ధి నమూనాను అమలు చేస్తున్నాయో అర్థం చేసుకోవడానికి మనకు రాష్ట్రంలో తగ్గని రేషన్ కార్డుల సంఖ్య ఉపయోగపడుతుంది.

నిజానికి రాష్ట్రంలో పేదరికం ఉన్న మాట నిజం . పౌష్టికాహార లోపం ఉన్నమాట నిజం. సమాజంలో మెజారిటీ కుటుంబాలకు ఆదాయాలు తక్కువ ఉన్న మాట నిజం. కానీ 85 శాతం జనాభా రేషన్ బియ్యం ఆధారపడి జీవించే పేదరికంలో ఉన్నారనే మాట తప్పకుండా అబద్ధం.

అంటే గ్రామాలలో, పట్టణాలలో ఎంతో కొంత ఆర్ధిక స్థోమత ఉన్న మధ్యతగతి ప్రజలు కూడా ప్రభుత్వ అంచనాల ప్రకారం, నిజ అర్థం లో పేదరికంలో ఉన్నారని అర్థం చేసు కోవాల్సి ఉంటుంది. పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు, ప్రభుత్వాలు విధించే పన్నులు, ఇళ్ల కిరాయిలు, ప్రైవేట్ విద్యా,వైద్యం ఖర్చులు, రవాణా ఖర్చులు, ఫోన్ బిల్లు, ఇంటర్నెట్, కేబుల్ టీవీ, OTT ప్లాట్ ఫామ్స్ లాంటి వాటి ఫీజులు పెరిగి మధ్యతరగతి కుటుంబాలపై భారం మోపుతున్న మాట నిజం. కానీ, “ఆహార బధ్రత” అర్థంలో అది నిజమేనా ? ఈ ప్రశ్న వేయడానికి ప్రతిపక్ష రాజకీయ పార్టీలు,ప్రజా సంఘాలు వెనకాడతాయి. నిజాలు చెప్పడానికి ప్రభుత్వాలు భయపడతాయి.

ఎందుకు ఈ ప్రశ్న మనం తప్పకుండా వేయాలంటే, ఈ ఆహార బధ్రత చట్టం అమలు, అందుకు కేటాయించే నిధులు దుర్వినియోగం కాకుండా ఉండాలి. నిజమైన పేదలకు పౌష్టిక ఆహారం అందాలి. పేద ,మధ్యతరగతి ప్రజలకు ఇతర నిత్యావసరాలు తక్కువ ధరలకు అందాలి. కానీ అవసరం లేని వారికి కూడా సన్న బియ్యం ఉచితంగా లేదా కిలో ఒక రూపాయికి అందించడం తప్పకుండా నిధుల దుర్వినియోగమే అని మనం చెప్పాలి.

నిజానికి ప్రభుత్వాలకు చిత్తశుద్ది ఉంటే, రేషన్ కార్డుల జారీకి ముందుగా మార్గదర్శకాలు మార్చాలి. ఆయా మార్గ దర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డులను పునః సమీక్షించాలి. గ్రామాలలో వ్యవసాయ కూలీలు, సన్న,చిన్నకారు రైతులు, కౌలు రైతులు, ఆదాయం తక్కువగా పొందుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారు కనుక వారి రష్యన్ కార్డులను కొనసాగించాలి. గ్రామాలలో, పట్టణాలలో వివిధ రంగాలలో పని చేసే అసంఘటిత కార్మికులు ( స్వంత నాలుగు చక్రాల వాహనం నడిపే రవాణా రంగ కార్మికులు సహా),స్వయం ఉపాధి గా , రోడ్డుపై చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే హాకర్లు, వివిధ సంస్థలలో పని చేసే కాంట్రాక్టు, క్యాజువల్ కార్మికులు, ఉద్యోగులు తప్పకుండా రేషన్ కార్డులకు అర్హులవుతారు. ఈ తరహా ప్రజలందరినీ కవర్ చేసేలా ఆహార బధ్రత చట్టం మార్గదర్శకాలలో తగిన మార్పులు చేయాలి. మిగిలిన వారి నుండీ రేషన్ కార్డులు తొలగించాలి.

ఆరోగ్య శ్రీ కార్డు , ఆదాయ సర్టిఫికెట్, ఫీజు రీ యంబర్స్ మెంట్, ఇందిరమ్మ ఇల్లు, గృహ జ్యోతి వంటి పథకాల అమలుకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేయాలి తప్ప, రేషన్ కార్డుకు ముడి పెట్టడం మానుకోవాలి. ఈ పథకాలు కూడా తప్పకుండా పేదలకు, క్రింది మధ్యతరగతి ప్రజలకు మాత్రమే అందాలి. నిజానికి విద్యా,వైద్య రంగాలకు తగిన బడ్జెట్ లో తగిన నిధులు కేటాయిస్తే, విద్యా, వైద్యాన్ని ప్రజలందరికీ ఉచితంగా అందిస్తే, కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూడడం తగ్గుతుంది. ఆరోగ్యశ్రీ , ఫీజు రీ ఎంబర్స్ మెంట్ ల కోసం బడ్జెట్ లో నిధులు కేటాయించే అవసరం తగ్గుతుంది.

వివిధ ఆర్ధిక స్థోమత ఉన్న ప్రజల అవసరాలకు వీలుగా తక్కువ ధరలతో ఇళ్లను నిర్మించడానికి ప్రభుత్వాలు పూనుకుంటే ఇందిరమ్మ ఇంటి పథకం కోసం రేషన్ కార్డుల పై ఆధారపడే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. ప్రభుత్వ భూములను ఈ ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించుకోవచ్చు.

రాష్ట్రంలో రేషన్ కార్డులపై బియ్యం సరఫరా చేయడానికి 13,522 కోట్లు ఖర్చు చేస్తూ, పేద ప్రజల పౌష్టిక ఆహార అవసరాలను తీర్చడానికి నిధులు లేవని చేతులు ఎత్తేయడం ప్రభుత్వాలు మానుకోవాలి. కేవలం బియ్యం సరఫరా చేస్తేనే ఆహార బధ్రత కాబోదు. నిజమైన పేదలకు పౌష్టికాహారం అందించడానికి ఫుడ్ బాస్కెట్ ను విస్తరించాలి.

నిజంగా అవసరం లేని వారికి కూడా రేషన్ బియ్యంపై బియ్యం సరఫరా చేస్తూ, నిధులు ఖర్చు చేసే బదులు, అందులో 25 శాతం నిధుల వినియోగం తగ్గించినా కనీసం 3,300 కోట్లు ప్రభుత్వాలకు నిధులు అందుబాటులోకి వస్తాయి.

ఇంకా కొంత నిధులను కలిపి ఈ బాస్కెట్ ను విస్తరించవచ్చు. పప్పులు, నూనెలు, చిరు ధాన్యాలు, కూర గాయలు లాంటి వ్యవసాయ ఉత్పత్తులు, పాలు, గుడ్లు, మాంసం లాంటి పశు ఉత్పత్తులు, కారం, పసుపు, చింతపండు లాంటి సుగంధ ద్రవ్యాలు చేర్చవచ్చు. చక్కెర, బెల్లం లాంటివి చేరిస్తే, పెద్ద ఎత్తున చెరకు సాగవుతుంది. ఫలితంగా వరి విస్తీర్ణాన్ని కూడా తగ్గించవచ్చు.

ముఖ్యంగా ఇప్పటికే వేలాదిగా రాష్ట్రం నలుమూలలా నిర్మాణమై ఉన్న రైతు సహకార సంఘాలను, FPO లను, మహిళా సంఘాలను ఈ ప్రక్రియ లో భాగస్వాములను చేయడం ద్వారా, మార్కెట్ ధరల కంటే, తక్కువ ధరలకే అనేక ఉత్పత్తులను ప్రజలకు సరఫరా చేయవచ్చు.ఎందుకంటే స్థానికంగా ఉత్పత్తి, ప్రాసెసింగ్, నిల్వ జరిగితే రవాణా ఖర్చులు తగ్గుతాయి. ఆ మేరకు గాలిలో హరిత వాయువుల శాతాన్ని కూడా తగ్గించవచ్చు.

ఈ కార్యక్రమాల వల్ల స్థానిక ప్రజల జీవనోపాధులు మెరుగవుతాయి. ఆదాయాలు పెరుగుతాయి. రైతులకు కనీస మద్ధతు ధరలు అందుతాయి. మధ్యాహ్న భోజన పథకానికి, విద్యార్ధుల హాస్టల్స్ కు ఆహార ఉత్పత్తుల సరఫరాకు, అంగన్ వాడీ సెంటర్లకు అవసరమైన ఆహార ఉత్పత్తుల సరఫరాకు , ప్రభుత్వ ఆసుపత్రుల రోగుల ఆహార అవసరాలకు స్థానిమగా లభించే ఈ వ్యవసాయ ఉత్పత్తులనే ప్రభుత్వం సేకరించి ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఇవన్నీ మార్కెట్ పై ఆధారపడి నడుస్తున్నాయి. దీనిలో అవినీతి కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నది.

ఉన్న నిధులనే జాగ్రత్తగా వాడుకుంటే ఈ అంశాలను అమలు చేయడం పెద్ద కష్టం కాబోదు. కానీ రాజకీయ సంకల్పం, ప్రజల పట్ల బాధ్యత ప్రభుత్వానికి ఉండాల్సి ఉంటుంది.

Read More
Next Story