రెండు తేదీలు, ఒకటే రక్తపు మరక
x

రెండు తేదీలు, ఒకటే రక్తపు మరక

తొలి పోలీసు కాల్పుల్లో అసువులొదిలిన నెల్లిమర్ల అమరత్వానికి ఈరోజుకు సరిగ్గా యాబై ఏండ్లు (10-7-1974 -10-7-2024).


-పి. ప్రసాద్ (పిపి)


తొలి పోలీసు కాల్పుల్లో అసువులొదిలిన నెల్లిమర్ల అమరత్వానికి ఈ రోజు (జూలై 10,2024) కు సరిగ్గా యాబై ఏండ్లు! నెల్లిమర్ల అమరత్వం అంటే 1994 కాల్పులు మనకు గుర్తు వస్తాయి. అంతకంటే ఇరవై ఏళ్ళ ముందు 1974లో కూడా అక్కడ పోలీసు కాల్పులు జరిగినట్లు నేటి తరానికి తెలియదు. ఆరోజూ ఐదుగురే మరణించారు. అది జరిగి నేటికి 50 ఏండ్లు!

1994 కాల్పులు రైల్ రోకో సందర్భంగా జూట్ మిల్లుకు 2 KM దూరంలోని రైల్ పట్టాల పై జరిగాయి. 1974 కాల్పులు ఏకంగా మిల్లులోనే జరిగాయి.

పని భారాల పెంపుదలకూ, పీసు రేట్ల కోతకు వ్యతిరేకంగా జరిగే ఘెరావోను చెదరగొట్టే పేరిట రాజ్యం 1974 కాల్పులు చేసింది. లాకౌట్ వ్యతిరేక ఉద్యమ అణచివేత కోసం 1994 కాల్పులు జరిపించింది. మొదటిది, యాదృచ్చిక కార్మిక ఆందోళన! రెండవది దీర్ఘకాలిక నిర్మాణయుత కార్మికోద్యమం. యాదృచ్చికమైనా రెండుసార్లు ఐదుగురే అమరులయ్యారు. రెండూ వర్గ పోరాటాలే!1974 కాల్పుల్లో ఐదుగురు కార్మికులతో పాటు మిల్లు పర్సనల్ ఆఫీసర్ మృతి చెందారు. ఆయన్ని లేబర్ ఆఫీసర్ గా పిలిచేవారు1974 కాల్పుల్లో మరణించిన ఐదుగురు కార్మికుల పేర్లు:-- 1-మొయిద కూర్మయ్య @ సీతారాం, కొండ గుంపాం. 2-నల్ల సన్యాసిరావు, మొయిద గ్రామం. 3-సిడగల నారాయణ, మొయిద గ్రామం. 4-చల్లా రాములు, కొండ వెలగాడ గ్రామం. 5-బోని రాములు, జరజాపు పేట గ్రామం.

నలుగురు కార్మికులు, ఒక మేనేజ్మెంట్ ప్రతినిధితో కలిపి ఐదుగురు మృతి చెందినట్లు 1991 లో నెల్లిమర్లలో అడుగు పెట్టిన నాటి నుండి నేటివరకు మా మనస్సుల్లో ఉంది. అదే కార్మికులు చెబుతుండేవారు. ఈరోజే తెల్సిన సాధికారిక పత్రం ప్రకారం కార్మికులే ఐదుగురని పై జాబితాలోని నల్లా సన్యాసిరావు కొడుకు నూకరాజు ద్వారా తెల్సింది. కాల్పుల్లో తండ్రి మరణించే నాటికి నూకరాజు వయస్సు రెండేళ్లు! ఇప్పుడు 52 ఏండ్లు! తన తండ్రి జ్ఞాపకార్ధం ఓ జీవో కాపీని భద్రపరిచాడు. విశాఖ జిల్లా కలెక్టర్ నాటి కాల్పుల్లో మరణించిన కుటుంబాలకు తలకు ₹1000 నష్టపరిహారం చెల్లింపుకి జారీ చేసింది. నూకరాజు 1992 నుండి నెల్లిమర్ల కార్మికోద్యమంలో యువకునిగా పాల్గొనే వాడు. బ్రతుకుదెరువు కోసం ఏలూరు చేరాడు. తర్వాత గుంటూరు జూట్ మిల్లుకు మారాడు. నాకు పరిచితుడు. 50 ఏండ్ల అమర స్మృతిలో మేమిద్దరం ఈరోజు మాట్లాడుకున్నాం. తన వద్ద భద్రంగా దాచిపెట్టిన పత్రం గూర్చి చెప్పాడు. స్కాన్ చేసి పంపాడు. ఆ జీవోలో గల పేర్లను పైన ఉదహరించా.

జగన్నాధరావు పంతులుగా కార్మికులు పిలిచే మేనేజ్మెంట్ ప్రతినిధి కూడా మరణించారు. ఆయన పెట్టుబడిదారుడు కాదు. పెట్టుబడిదారీ తాత్విక ప్రతినిధి కాదు. ఓ ఉద్యోగి మాత్రమే. పెట్టుబడిదారీ వర్గ ప్రయోజనాల కోసం సేవచేస్తూ కార్మికవర్గ ధర్మాగ్రహానికి గురై బలిపశువయ్యాడు. చరిత్రలో ఇలా బలిపశువులు ఎందరో!

1974 ఘెరావోలో పాల్గొన్న ఉద్యమకారుల్లో కాళ్ళ అప్పల సత్యనారాయణ ఒకరు. నాటి కేసుల్లో ఒకడు. జైలుకు వెళ్లిన వారిలో ఒకడు. ఉద్యోగం కోల్పోయిన వారిలో ఒకడు. తర్వాత ఓ ఒప్పందం ప్రకారం ముద్దాయిలకు బదులు వారి కుటుంబ సభ్యులకు మిల్లులో పని కల్పించారు. తన భార్య రమణమ్మ మిల్లులో వర్కర్ గా మారింది. కొన్నేళ్లకు ఆయన్ని కూడా యాజమాన్యం బదిలీ వర్కర్ గా చేర్చుకుంది. అదే అప్పల సత్యనారాయణ నెల్లిమర్లలో ఇఫ్టూ ప్రవేశించిన తర్వాత చురుకైన కార్యకర్తగా ఎదిగాడు. తుఫాను గా కార్మికవర్గంలో పేరొందాడు. మరో ఇరవై ఏళ్ళకి 1994 కాల్పుల్లో తుఫాను వీర మరణం పొందడం విశేషం!

10-7-1974వ తేదీన జీతాల బట్వాడా రోజున ఫినిషింగ్ డిపార్ట్మెంట్ కార్మికుల జీతాలకి కోత పెట్టింది. జీతాల స్లిప్స్ చూసిన వెంటనే A షిఫ్ట్ రెండో రిలేలో మధ్యాహ్నం 2-30 కి ఘెరావో ప్రారంభమైనది. రాత్రి 7-45 నుండి 8 గంటల మధ్య కాల్పులు జరిగాయి. అది ఐదు గంటలకి పైగా జరిగింది.

ఆనాటి ఘెరావోకు ప్రత్యక్ష నేతృత్వం వహించిన నాటి యూనియన్ ఆఫీసు బేరర్ మొయిద రాజారావు గారు నేటికీ జీవించి వున్నారు. నాటి పోరాటంలో ఆయనొక హీరో! ఆయన మేనేజ్మెంట్ వత్తిళ్ళకి గానీ, పోలీసు వత్తిళ్ళకి గానీ లొంగలేదు. ఐదు గంటలకు పైగా ఘెరావోలో కార్మికుల్ని నిలబెట్టారు. స్వయంగా తాను కార్మికుడై ఉండి నాయకత్వం వహించడం విశేషం!

విజయనగరంలో తన కొడుకు రాంబాబు ఇంట్లో మొయిద రాజారావు గారితో 22-2-2023న అమరజీవి ఉరిటి ఉమామహేశ్వరరావు, నేను ఇంటర్వ్యూ చేశాం. అరబిందో సంఘం నేత సూర్యనారాయణ రాజు సాంకేతిక సహకారాన్ని కూడా తీసుకున్నాం. ఆ ఘెరావోలో పాల్గొన్న మైపాడు రాములు గారిని ఇంటర్వ్యూ చేశాం. అదో ఉత్తేజకర పెట్టుబడిదారీ వ్యతిరేక వర్గ పోరాటం.

యాబై ఏండ్ల సందర్భంగా ఇఫ్టూ విజయనగరం జిల్లా కమిటీ ఈరోజు నెల్లిమర్లలో స్మారక సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఆనాటి ఘెరావో పోరాట చరిత్రను వెలుగులోకి తెస్తూ పుస్తక ఆవిష్కరణ చేయాల్సి ఉంది. నెల్లిమర్ల జూట్ మిల్ అస్థిర పరిస్థితి, ఇఫ్టూ సంస్థాగత పని వత్తిళ్ల వల్ల ఫలించలేదు. ఐనా ఈరోజు ఓ స్మారక సమావేశం జరపాలని భావించింది. ఐతే అనివార్య కారణాలవల్ల దాన్ని ఇఫ్టూ విజయనగరం జిల్లా కమిటీ వాయిదా వేసింది. అవకాశం చూసి ఏర్పాటు చేద్దామని భావించింది.

1974 కాల్పుల గూర్చి ప్రత్యేక ఆసక్తితో మొయిద రాజారావు గారిని ఇంటర్వ్యూ చేయడమే కాకుండా, పుస్తక ఆవిష్కరణ కోసం కూడా తన దృష్టి పెట్టిన ఉమామహేశ్వరరావు దానికి ముందే 6-7-2024న అకాల మృతి చెందాడు. యాబై ఏండ్ల స్మారక ప్రోగ్రామ్ లో చురుకైన పాత్ర పోషించాల్సిన ఉమాకు 17-7-2024న సంతాప సభ పెట్టుకునే పరిస్థితి రావడం ఓ విషాధకర పరిణామం.(పి. ప్రసాద్ (పిపి), ఇఫ్టూ అనుబంధ నెల్లిమర్ల జూట్ కార్మిక సంఘం మాజీ అధ్యక్షులు)


Read More
Next Story