ఈడీ అదుపులో కర్ణాటక మాజీ మంత్రి
కర్ణాటక మాజీ మంత్రి బి నాగేంద్రను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈడీ అధికారులు ఉదయం ఆయన ఇంటికి చేరుకుని తమ కార్యాలయానికి తీసుకెళ్లినట్లు సమాచారం.
కర్ణాటక మాజీ మంత్రి బి నాగేంద్రను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఈడీ అధికారులు ఉదయం ఆయన ఇంటికి చేరుకుని తమ కార్యాలయానికి తీసుకెళ్లినట్లు సమాచారం.
కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఇటీవల వార్తలొచ్చాయి. తనపై మనీ లాండరింగ్ ఆరోపణలు రావడంతో నాగేంద్ర జూన్ 6న తన పదవికి రాజీనామా చేశారు.
గత రెండు రోజులుగా నాగేంద్ర, కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్ నివాసాలలో కూడా ఈడీ సోదాలు నిర్వహించింది.
కార్పొరేషన్ సూపరింటెండెంట్ చంద్రశేఖరన్ మే 26న ఆత్మహత్య చేసుకున్నారు. కార్పొరేషన్‌కు చెందిన రూ. 187 కోట్లు దారి మళ్లిన వైనాన్ని మృతుడు తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. రూ. 88.62 కోట్లు అక్రమంగా ఐటి కంపెనీలు, హైదరాబాద్‌లోని సహకార బ్యాంకుకు బదిలీ చేశారని ఆరోపించారు. డబ్బుల బదిలీలో ప్రస్తుతం సస్పె్న్షల్ ఉన్న కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జెజి పద్మనాభ్, అకౌంట్స్ ఆఫీసర్ పరశురామ్ , యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ సుచిస్మిత రావల్ పాత్ర ఉందని, డబ్బు బదిలీ చేయాలని మంత్రి తనకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారని కూడా సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.
ఈ ఆరోపణలతో రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సిఐడి) దర్యాప్తునకు ఆదేశించింది. ఆర్థిక నేరాల అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మనీష్ ఖర్బికర్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేసుకు సంబంధించి సిట్ మంగళవారం నాగేంద్ర, దద్దల్‌లను విచారించింది.