రైతుకు భారమవుతున్న FPO ల నిర్వహణ
x

రైతుకు భారమవుతున్న FPO ల నిర్వహణ

FPO లు ఒక్కరూపాయి బిజినెస్ చేయకపోయినా, GST లైసెన్సు తీసుకున్నందుకు, ప్రతి నెలా రిటర్న్స్ ఫైల్ చేయలేక జరిమానాలు కట్టిన సందర్భాలున్నాయి.


రైతులు ఆరు నెలలు కష్టపడి పంటలు పండిస్తారు కానీ, తాము ఉత్పత్తి చేసిన పంటలను మార్కెట్ చేసుకోవడంలో రైతులు ఇబ్బందులు పడతారు. అందుకే స్థానికంగా వచ్చిన వ్యాపారులకే, వాళ్ళు చెప్పిన ధరకు పంటను అమ్ముకుంటారు. మంచి ధర వచ్చే వరకూ నిల్వ చేసుకోవడానికి గ్రామీణ ప్రాంతంలో గిడ్డంగులు లాంటి మౌలిక సదుపాయాలు రైతులకు అందుబాటులో ఉండవు. అందుకే రైతులు కష్టపడినా లాభాలు సంపాదించలేక నష్టపోతున్నారు.

ఈ సమస్యను పరిష్కరించడానికి వచ్చినవే రైతు సహకార సంఘాలు. రైతులు సభ్యులుగా, షేర్ హోల్డర్స్‌గా ఉండే ఈ సహకార సంఘాలు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశలో 1965 నుండీ ఉనికిలో ఉన్నాయి. మొదట రెండు మూడు దశాబ్దాల పాటు రైతులకు మంచి సేవలు అందించిన ఈ రైతు సహకార సంఘాలు క్రమంగా రాజకీయ పార్టీల ఉచ్చులో చిక్కుకున్నాయి. రాజకీయ పార్టీలు, తమ రాజకీయ ప్రాబల్యానికి ఈ సహకార సంఘాలను వేదికగా చేసుకున్నాయి. రైతుల భాగస్వామ్యంతో జరగాల్సిన సహకార సంఘాల ఎన్నికల్లో పార్టీల అనుచిత జోక్యం ఎక్కువైంది. అధికారంలో ఉన్న పార్టీ, ఈ సంఘాలను కూడా తమ చెప్పు చేతుల్లో వుంచుకోవడానికి, ప్రయత్నించడం , సహకార సంఘాలు కూడా తమ స్వతంత్రతను కోల్పోయి రాజకీయ నాయకులు చెప్పినట్లు నడుచుకోవడం చాలా సాధారణ విషయమై పోయింది. చాలా సహకార సంఘాలు ఆర్ధికంగా కూడా నష్టపోయాయి.

ప్రభుత్వ జోక్యం లేకుండా, రైతులు స్వయంగా సహకార సంఘాలను నిర్మించుకోవడానికి 1995 లో మరో చట్టం వచ్చింది కానీ, అంతగా విజయవంతం కాలేదు. గ్రామ స్థాయిలో స్వయం సేవక సంఘాలుగా ఉన్న మహిళలు గ్రామ స్థాయిలో ఏఏ చట్టం క్రిందనే పరస్పర సహాయ సహకార సంఘాలుగా ఏర్పడ్డారు. కానీ ఏఏ సంఘాల ప్రకటనలో అనేక పరిమితులున్నాయి. పైగా ఈ సంఘాలన్నీ, పూర్తిగా మహిళలే భాగస్వాములుగా ఉన్నవి, ఇందులో మగ రైతులకు భాగస్వామ్యం లేదు. అందువల్ల ఈ సంఘాల కార్యక్షేత్రం కూడా పరిమితమై పోయింది.

ఈ నేపథ్యంలో 2013 నుండి వచ్చినవే రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు (FPO). 1956 కంపెనీ చట్టంలో సవరణ ద్వారా ఏర్పడిన ఈ కంపెనీలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 2,000 వరకూ ఉన్నాయి. ఈ కంపెనీలు ఏర్పడి పని చేయబట్టి 10 ఏళ్లు నిండుతున్నా, ఇప్పటికీ ఇంకా బాలారిష్టాలు దాటడం లేదు. ఈ సంఘాలు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను చూస్తే, ఆ సమస్యల లోతు అర్థమవుతుంది.

రైతు ఉత్పత్తిదారుల కంపెనీల రిజిస్ట్రేషన్ పూర్తి కావడం ఒక ఎత్తైతే, ఆచరణలో దాన్ని నిర్వహించడం మరో ఎత్తు. గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల్లో ఈ సంఘాలను నిర్వహించడానికి మానవ వనరుల కొరత తీవ్రంగా ఉంది. ఈ కంపెనీల నిర్వహణకు నగరాల్లో ఉండే, బిజినెస్ మేనేజ్‌మెంట్ చదువుకున్న యువతీ యువకులు ఎవరూ రారు. గ్రామాల్లో ఉండే యువతీ యువకులే ఉపాధి వెతుక్కుని పట్టణాలకు వెళ్లిపోదామని చూస్తున్న కాలమిది.

FPO లు ప్రారంభమై తొమ్మిదేళ్లు గడుస్తున్నా, ఇప్పటికీ వ్యవసాయ, ఉద్యాన, సోషల్ సైన్స్, BBA, MBA కాలేజీలలో, FPO ల CEO లుగా పని చేయడానికి అవసరమైన విద్యార్ధులను తయారు చేయడానికి సిలబస్, కోర్సులు రాలేదు. మొదటి దశలోనే ఈ కోర్సులు వస్తే, ఈ పాటికి రెండు బ్యాచీలు అందుబాటులో ఉండేవి . ఈ స్థితిలో ఊర్లలో దొరికిన వారితోనే ఒకరిని ఎంపిక చేసుకుని, సంఘాలు నడిపించాల్సి వస్తున్నది. వీరిలో అనేకమంది ఎప్పుడూ నగరాల్లో మంచి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. వస్తే వెళ్లిపోతారు. కాదనలేని పరిస్థితి.

సంఘాల నిర్వహణలో ఎంత శిక్షణ ఇచ్చినా అన్ని పనులు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, CEO లు మాత్రమే చేసుకోలేరు. పైగా కంపెనీ నియమాల ప్రకారం, కంపెనీ సెక్రటరీని, కంపెనీకి ఆడిటర్‌ను తప్పకుండా నియమించుకోవాల్సిందే. కంపెనీ లీగల్ కంప్లయన్సెస్ చూసినందుకు వారికి కనీసం సంవత్సరానికి రూ.25,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కంపెనీల ఏర్పాటుకు, నిర్వహణకు ఆర్థిక సహకారం అందిస్తున్న కేంద్ర సంస్థ లేవీ ఇందుకోసం ప్రత్యేక నిధులను ఇవ్వడం లేదు. వీటిని ప్రత్యేకంగా సంఘమే సమకూర్చుకోవాల్సి ఉంటుంది.

2015-2021 మధ్య ఏర్పడిన FPO లకు కంప్యూటర్ లాంటి సదుపాయం కూడా లేదు. కొత్తగా నిర్మాణం అవుతున్న FPO లకు ఇస్తున్న ఆర్థిక సహాయంలో కూడా కేంద్ర సంస్థలు దీని కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు.

సహకార సంఘాల చట్టం ప్రకారం సంఘం నిర్వహణలో ఏదైనా పొరపాట్లు దొర్లినా, నిర్వహణలో ఆలస్యం జరిగినా, పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. వాటిని సభ్యులే సవరించుకునే వారు, సహకార శాఖ అధికారులు కూడా కొంత హెచ్చరించి వదిలేసే వారు. కానీ, కంపెనీ చట్టం కింద ఏర్పడుతున్న FPO ల నిర్వహణ, పనులు, నిర్దిష్ట కాలపరిమితితో చేయకపోతే, విపరీతమైన జరిమానాలు కట్టాల్సి ఉంటుంది. ఒక్కోసారి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందుబాటులో ఉండకపోవచ్చు. CEO లకు పూర్తిగా అవగాహన ఉండకపోవచ్చు. అయినా సరే, నిర్దిష్ట గడువు పూర్తయిన వెంటనే, జరిమానాలు మొదలయిపోతాయి. కొన్నిటిలో ఆలస్యమయిన ప్రతిరోజుకూ జరిమానా పడుతుంటుంది. అది కూడా వేలల్లో జరిమానాలు ఉంటాయి.

2015-2021 మధ్య చాలా FPO లు ఇటువంటి జరిమానాలు చెల్లించాయి. తాము వసూలు చేసుకున్న వాటా ధనం నుండి కూడా జరిమానాలు కట్టిన సంఘాలున్నాయి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ స్వయంగా భరించుకున్న జరిమానాలున్నాయి. సంఘాలను ప్రోత్సహించిన NGO లు కూడా తప్పని పరిస్థితుల్లో కొన్ని జరిమానాలు చెల్లించాయి.

FPO లు ఒక్క రూపాయి బిజినెస్ చేయకపోయినా, GST లైసెన్సు తీసుకున్నందుకు, ప్రతి నెలా రిటర్స్‌లు ఫైల్ చేయలేక జరిమానాలు కట్టిన సందర్భాలున్నాయి. సంఘం రిజిస్ట్రేషన్ పూర్తయిన 6 నెలల లోపు ఒక ఫార్మాలిటీ పూర్తి చేయకపోతే, ఆ సంఘం పై రూ.50 వేల జరిమానా ఉంది. సంఘం డైరెక్టర్ ప్రతి సంవత్సరం గడువులోపల తన KYC దాఖలు చేయకపోతే, 5 వేల రూపాయల జరిమానా కట్టాలి. ఇలాంటివే మరెన్నో.

పెట్టుబడిదారుల కోసం రూపొందించిన కంపెనీ చట్టంలో రైతులను కూడా అదే స్థాయి పెట్టుబడిదారులుగా చూస్తూ, నియమ నిబంధనలు పాటించలేదని, జరిమానాలు వేయడం అత్యంత అన్యాయమైన విషయం. ఈ జరిమానాలను తక్షణమే రద్దు చేయకపోతే, ఏ సంఘమూ కొనసాగే అవకాశం లేదు. ఈ కారణం రీత్యా కూడా రాష్ట్ర సహకార సంఘాల చట్టం(MACS) ప్రకారం, సంఘాలను రిజిస్ట్రేషన్ చేసుకోవడం మంచిది.

నాబార్డ్ మార్గదర్శకాల ప్రకారం A,B,C,D గ్రేడ్స్‌లో మంచి గ్రేడ్స్ పొందాలంటే, తప్పకుండా ప్రతి సంఘం వ్యాపారం చేయడానికి వీలుగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల అమ్మకాల కోసం లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయ శాఖలో మండల వ్యవసాయ అధికారి (MAO) ఈ లైసెన్సులు జారీ చేస్తారు. కానీ, రాష్ట్రంలో ఈ లైసెన్సులు ఇవ్వడానికి కొందరు వ్యవసాయ శాఖ అధికారులు అనధికారంగా, లైసెన్సుకు 10 వేల రూపాయల చొప్పున లంచం రేటు నిర్ణయించేశారు. ఒక్కో సంఘం నుండి రూ.30 వేలు వసూలు చేశారు. ఇవ్వలేని వాళ్లను నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పారు. చాలా సంఘాలలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ స్వయంగా తమ జేబు నుండి ఈ లంచాలు చెల్లించారు. తాము ఇచ్చిన డబ్బులను సంఘం లెక్కలలో రాయలేక ఇబ్బంది పడ్డారు.

ఒక FPO సంవత్సరానికి 20 లక్షల రూపాయలు దాటి బిజినెస్ చేస్తే మాత్రమే GST చెల్లించాలని రూల్స్ చెబుతున్నాయి . అప్పటివరకూ GST లైసెన్సు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ, వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం మిగిలిన లైసెన్సులు ఇవ్వడానికి ఖచ్చితంగా GST లైసెన్సు తేవాలని ఒత్తిడి చేశారు. అందువల్ల మొదటి దశలో అవసరం లేకపోయినా, GST లైసెన్స్ అందరూ తీసుకున్నారు. కానీ, ఇబ్బంది ఏమిటంటే, సంఘం బిజినెస్ చేయకపోయినా, డబ్బులు సంపాదించకపోయినా, తప్పకుండా ప్రతినెలా GST మాత్రం ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఆలస్యమైతే జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఈ పని స్వయంగా చేసుకోలేక చాలా సంఘాలు GST ఫైల్ చేయడానికి మరొక కన్సల్టెంట్‌ను పెట్టుకుంటున్నారు. అందుకు వారికి ప్రతినెలా ఫీజును చెల్లిస్తున్నాయి.ఇది సంఘాలపై అదనపు భారమే.

“రైతులు కష్టాలలో ఉన్నారు, ఆర్థికంగా నష్టపోతున్నారు. వారు FPO పెట్టుకుని, ఇబ్బందుల నుండి బయట పడాలని” సాధారణంగా ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. తప్పకుండా రైతుల సహకార సంఘాలు గ్రామాలలో అవసరం. కానీ, ముఖ్యమైన రెండు సందర్భాలలో FPO లు ఇంకా ఆర్థిక భారాన్ని మోస్తున్నాయి. ఒకటి, సంఘం వ్యాపార నిర్వహణ కోసం తీసుకునే రుణంపై సంవత్సరానికి చెల్లించే 12 శాతం వడ్డీ భారం. కార్ల కొనుగోలుకు బ్యాంకులు ఇచ్చే రుణాలపై వడ్డీ కంటే ఈ వడ్డీ భారం ఎక్కువ. రెండవది, రైతులకు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు GST నుండి మినహాయింపు లేకపోవడం వల్ల పడుతున్న భారం. FPO లు ప్రాసెసింగ్ యూనిట్‌లు పెట్టుకున్నా, కస్టమ్ హైరింగ్ సెంటర్ల కోసం యంత్రాలు కొనుకున్నా, విపరీతమైన GST కట్టాల్సి వస్తోంది. అలాగే సంఘం ద్వారా వ్యవసాయ ఉపకరణాలు, రైతులకు అమ్మినప్పుడు కూడా కంపెనీలకు GST చెల్లిస్తున్నారు.

వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌లో రైతులకు గిట్టుబాటు ధరలు రావడం లేదు. వాళ్లు సంఘం ద్వారా సభ్యులకు అమ్మే ఎరువులు లాంటి వ్యవసాయ ఉపకరణాలపై లభించే మార్జిన్ కూడా తక్కువే. (అందరికీ, అన్ని విధాలా హాని చేసే పురుగు విషాల్లో తప్ప) ఈ నేపథ్యంలో నిర్వహణ రుణంపై 12శాతం వడ్డీ, GST రెండూ కలిపి సంఘాలకు పెద్దగా నికర మిగులు ఉండడం లేదు.

రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు లాభకరంగా నడవాలంటే, కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలి. సాధారణ రైతులకు ఉపయోగకరంగా ఉండేలా ఈ సంఘాల నిర్మాణంలో, నియమ నిబంధనలలో కొన్ని మార్పులు చేయాలి. రైతులపై పన్నుల, జరిమానాల భారాన్ని తగ్గించాలి.

Read More
Next Story