పత్రికా స్వేచ్ఛకు పట్టం కట్టిన ’ది పోస్ట్’
పవర్‌కి పత్రికా స్వేచ్ఛకి, ఆయుధ వ్యాపారానికీ అక్షరాన్నే నమ్ముకున్న వారికి మధ్య జరిగిన ప్రత్యక్ష యుద్ధమది, జురాసిక్ పార్క్ ఫేమ్ స్టీవెన్ స్పిల్‌బర్గ్ తీశారు
పత్రికా స్వేచ్ఛకు పట్టం కట్టిన ’ది పోస్ట్'
a movie based on true story by STEVEN SPIELBERG
ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య కూసాలు కదులుతున్న చప్పుడు.. పవర్ కోసం పార్లమెంటుపైన్నే తెగబడుతున్న తెంపరి మూకలు.. అగ్రరాజ్యమైనా, అభివృద్ధి చెందుతున్న దేశమైనా.. అదే వరస. ఎటుచూసినా ఏదో నిరాశ, మరేదో నిస్పృహ. గొంతెత్తితే పీక నులిమేసే మూకస్వామ్యం.. పెచ్చులూడుతున్న ప్రజాస్వామ్య నాలుగో స్తంభంపై ’కపోతాల’ హాహాకారాలు.. కీచుగొంతుకతో సవ్వడికైనా జంకే.. మసకబారుతున్న అక్షరాలు. కళ్లముందే కదలాడుతున్న కపటదారులు.. 1970ల నాటి సన్నివేశాలే ప్రత్యక్ష సాక్ష్యాధారాలు.. అధికార దాహం, అహంకారం, ఆయుధ వ్యాపారం కలిస్తే ఏమవుతుంది? ఏమో, చూడండి.
....
నేను టెక్సాస్‌లో ఉన్నప్పుడు ఓ మిత్రుడు డిన్నర్‌కి రమ్మంటే వెళ్లా. కుశలాలు ముగిశాయి. మాటలు మొదలైయ్యాయి. మధ్యలో.. ’మీరు జర్నలిజంలో చాలా కాలంగా ఉన్నారు కదా, ఆమధ్య వచ్చిన ’ది పోస్ట్ గానీ, ’స్పాట్‌లైట్’ గానీ చూశారా? అనడిగాడు. కాస్తంత సిగ్గుపడుతూనే స్పాట్‌లైట్ పేరు విన్నా గానీ చూడలేదన్నా. నిజానికి ’ది పోస్ట్’ సినిమా పేరే వినలా. 2018లో వచ్చిన ఈ మువీకి ఆస్కార్ అవార్డు వచ్చిందని, జురాసిక్ పార్క్ ఫేమ్ డైరెక్టర్ స్టీవెన్ స్పిల్‌బర్గ్ దర్శకత్వం వహించాడని చెప్పాడు. డిన్నర్ ముచ్చట ముగుస్తుండగా.. ఆ సినిమా ఉంటే పెట్టు చూద్దామన్నా. పూర్తయ్యేసరికి అర్థరాత్రి రెండు దాటింది. ఆ తర్వాత కంటి మీద కునుకుపడితే ఒట్టు. అంతలా వెంటాడింది ఆ సినిమా. ఇప్పటి తరం ప్రత్యేకించి నేటి జర్నలిస్టులు కచ్చితంగా చూడదగిందీ మూవీ. పవర్‌కి పత్రికా స్వేచ్ఛకి, ఆయుధ వ్యాపారానికీ అక్షరాన్నే నమ్ముకున్న వారికి మధ్య జరిగిన ప్రత్యక్ష యుద్ధమది. ఓ పాటకో, క్యారెక్టర్‌కో ఆస్కార్ వస్తే – ఓలంపిక్ జ్యోతి మాదిరి పట్టుకుని ఊరూరా ఊరేగుతున్న నేటి పరిస్థితికీ ఏకంగా మూడు అవార్డులొచ్చినా ఆ.. దాందేముందిలెమ్మన్నట్టు ఓచిర్నవ్వు నవ్వి మౌనంగా వెళ్లిపోయిన స్పిల్‌బర్గ్‌కి మధ్య తేడాకు అద్దం పట్టిన చిత్రమది.
....
ఇదీ నేపథ్యం..
1970.. ఏప్రిల్.. అమెరికా–వియత్నాం యుద్ధం మొదలై అప్పటికే 8 ఏళ్లు దాటింది. ట్రూమన్ మొదలు నిక్సన్ వరకు నలుగురు ప్రెసిడెంట్లు మారారు. మధ్యలో జాన్ ఎఫ్ కెన్నడీ మర్డరయ్యాడు. వేలాది మంది అమెరికన్ సైనికులు చనిపోయారు. దిక్కుతోచని స్థితి.. ఆయుధ వ్యాపారం కోసం యుద్ధాన్ని ఉరికించడమా? దేశభక్తి పేరిట సైన్యంలో చేరిన అమెరికన్ల ప్రాణాలను బలిపెట్టడమా? అనే ప్రశ్న వచ్చింది. అసలు విషయాన్ని దాచి అమెరికన్ ప్రతినిధుల సభ మొదటి దానికే ఓటేసింది. కెన్నడీ హత్య తర్వాత అధ్యక్షుడైన లిండన్ బి.జాన్సన్ మిలిటరీ బడ్జెట్ పెంచారు. వియత్నాంలోని మరికొన్ని రహస్య ప్రాంతాలకు సైన్యాన్ని పంపారు. జనం మండిపడతారు. నిరసనలు హోరెత్తుతాయి. ఈ పరిస్థితుల్లో రాజకీయ పార్టీల మోసాన్ని వెలుగెత్తి చాటాలని, అవినీతిని చీల్చిచెండాడాలని పత్రికారంగం నడుంకట్టింది. కవెలకట్టల మాటున దాగున్న సత్యాన్ని వెలికితీసేందుకు ’అన్‌సంగ్‌హీరోలైన’ జర్నలిస్టులు పరిశోధన చేపట్టారు. ఆ సమయంలో పడిన మానసిక సంఘర్షణ, యాజమాన్యాలపై పాలకుల వత్తిళ్లే ఈ సినిమా. చూసే ప్రేక్షకులు– పాలకపక్షమో ప్రజాపక్షమో తేల్చుకునే లోపు సినిమా అయిపోతుంది. అసలు సిసలైన పత్రికా స్వేచ్ఛేమిటో తేలుతుంది. అధికార రహస్యాల మాటున పాలకపక్షం దాక్కోలేదని సుప్రీంకోర్టు తెగేసి చెబుతుంది. ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలతో ఉండేదే ప్రజాస్వామ్యమని చెబుతుంది. ’అతిగొప్ప ప్రజాస్వామ్య’ దేశాధ్యక్షుడు తలదించుకోవాల్సి వస్తుంది. అలా చేసింది పత్రికలు. తలదించుకున్నది నిక్సన్. ఆ ఇన్వెస్టిగేషన్ పేరు పనామా పేపర్స్ లీక్.
అసలు కథేమిటంటే...
వియత్నాం యుద్ధం అమెరికన్ ప్రజాస్వామిక వాదుల్ని, కొందరు మిలిటరీ అధికారుల్నీ కలవరపరిచింది. అన్యాయంగా అమాయక యువత బలవుతున్నారని ఆవేదన చెందింది. వియత్నాం యుద్ధంలో గెలవలేమని తెలిసినా మళ్లీ బలగాలను పంపాలన్న ప్రభుత్వ నిర్ణయం మింగుడు పడని ఓ సైన్యాధికారి మిలిటరీ హెడ్ క్వార్టర్స్– పెంటగాన్ లోని డిఫెన్స్ రీసెర్చ్ కార్యాలయం– నుంచి వియత్నాం యుద్ధ రహస్యపత్రాలను దొంగచాటు తెచ్చి జిరాక్స్ చేస్తాడు. ఇలా ఏడు వేల పేజీలను జిరాక్స్ చేసి తన దగ్గరుంచుకుంటాడు. కొన్నింటిని తనకు పరిచయం ఉన్న న్యూయార్క్ టైమ్స్ పత్రిక రిపోర్టర్‌కిస్తాడు. ఆ పత్రిక పేరు మార్మోగుతుంది. దేశాధ్యక్షుని ఆఫీసు ముందు నిరసనలు మిన్నంటుతాయి. ప్రెసిడెంట్ నిక్సన్‌కి అరికాలి మంట నెత్తికెక్కుతుంది. న్యూయార్క్ టైమ్స్‌పై దేశద్రోహం కేసు పెడతారు. పెంటగాన్ పేపర్లు ప్రచురించకుండా హకుం జారీ అవుతుంది. కోర్టు తీర్పు వచ్చేవరకు పత్రికపై నిషేధం విధిస్తారు. మరోపక్క, ఆ మిలిటరీ అధికారి మొత్తం 47 సంపుటాల పత్రాలను ది వాషింగ్టన్ పోస్టు ఎడిటర్‌కి ఇస్తాడు. న్యూయార్క్ టైమ్స్‌పై నిషేధం ఉన్నప్పటికీ కచ్చితంగా పేపర్లో వేస్తానని ఎడిటరూ మాటిస్తాడు. అయితే వాటిని ప్రచురిస్తే వచ్చే కష్టనష్టాలు ఏమిటో అప్పుడే కొత్తగా యాజమాన్య బాధ్యతలు చేపట్టిన వాషింగ్టన్ పోస్ట్ మహిళా పబ్లిషర్‌కు తెలుసు. అప్పటికే పీకల్లోతు కష్టాల్లో మునిగి పత్రికను నడపలేక మూతేయలేక కన్నతండ్రి చనిపోతాడు. తర్వాత ఆ బాధ్యతలు చేపట్టిన ఆమె భర్తా ఆత్మహత్య చేసుకుంటాడు. పుట్టెడు దుఖంలో ఉండి పత్రికా భారాన్ని నెత్తిన పెట్టుకుంది. పత్రికను ఆర్ధికంగా నిలబెట్టేందుకు పబ్లిక్ ఇష్యూకి పోయే ఏర్పాట్లలో ఉంది. పనామా పేపర్లు బయటికొచ్చే నాటికే ఆమె దోరణి– మగవాళ్లు ఎక్కువున్న ఎడిటోరియల్ బోర్డుకు నచ్చదు. ఎడిటరూ కొమ్ములు దిరిగినోడే. రాజధాని సర్కిల్స్‌లో పేరు, నోరున్నోడే. చేతికందిన పెంటగన్ పేపర్లను అచ్చుగుద్ది తీరాలన్నది ఆయన పట్టుదల.
యజమానురాలిదే తుది నిర్ణయం..
ఎడిటర్ మాటెలా ఉన్నా తుది నిర్ణయం తీసుకోవాల్సిన పబ్లిషర్ అయిన యజమానురాలు ఇరుకున పడ్డారు. ఓపక్క న్యూయార్క్ పత్రికపై నిషేధం, మరోపక్క ఎడిటోరియల్ నిర్ణయం. సంశయం వెంటాడింది. ఒకవేళ వార్త వేస్తే.. నిక్సన్‌కి మండి కోర్టు కెళితే.. వాషింగ్టన్ పోస్ట్‌పైనా వేటు వేస్తే్త.. ఓడలు బండ్లయితే.. నమ్ముకున్న సిబ్బంది నట్టేట మునిగితే.. వాళ్ల పిల్లాజెల్లా వీధిన పడితే.. ఇలా బోలెడన్ని భయాలు, సంశయాలు ఆమె బుర్రను తొలిచేస్తుండగా లాయర్లను సంప్రదించింది. వార్త వేసి చేతులు కాల్చుకోవద్దని వాళ్ల సలహా. ఇంకోపక్క 7 వేల పేజీలను నేలమీద పరిచి న్యూస్ బ్యూరోలోని 25 మంది రిపోర్టర్లు ఆగమేఘాల మీద వార్తా కథనాలను రాశారు. పేజీలు సిద్ధమయ్యాయి. ప్లేట్లు మెషిన్‌లోకి ఎక్కాయి. యజమాని మాట కోసం ఎడిటర్, ఎడిటర్ మాట కోసం యావత్ సిబ్బంది ఎదురుచూపులు. ప్రింటింగ్ డెడ్‌లైన్ దాటుతోంది. ఎంతకీ నిర్ణయం రావడం లేదు. సిబ్బందిలో యజమానిపై ఏదో తెలియని అసహనం.. జర్నలిజమంటే తెలియని వ్యక్తినీ అదీ ఓ మహిళను పబ్లిషర్‌గా పెట్టుకుంటే ఇలాగే ఉంటుందన్న రుసరుసలు... కాలుగాలిన పిల్లిలా ఇంట్లో గంతులేస్తున్న ఎడిటరు.. ఇంతలో ఎడిటర్ భార్య కుండబద్ధలు కొడుతుంది. ఆ మాటలు మనల్ని ఎక్కడికో తీసుకెళతాయి...’మీరెందుకు అంత పట్టుదలతో ఉన్నారో అర్థం కావడం లేదు.. పత్రిక మూత పడితే మీకు మహా అయితే పోయేది ది సోకాల్డ్ పరువు. ఏ నాలుగు నెల్లో ఐదు నెల్లో ఖాళీగా ఉండి మళ్లీ ఎక్కడో చోట ఉద్యోగం సంపాయించుకుంటారు. ఆమెకు (యజమానురాలు) అలా కాదే. ఇప్పటికే కన్నతండ్రిని, కట్టుకున్న భర్తను పొగొట్టుకుంది. కూతురుంది. ఆమె ఏకైక ఆధారం ఆ పత్రిక. ఒక్కసారి ఆమె వైపు నుంచి ఆలోచించండి’ అనడంతో ఎడిటర్ ఖిన్నుడవుతాడు. అంతే ఆ అపరాత్రి ఉన్నపళంగా వెళ్లి యజమాని ఇంటి తలుపుతడతారు. వార్తను ఆపేద్దామంటాడు. అప్పుడామె మన సిబ్బందందరిదే ఇదే మాటా అని అడుగుతుంది. కాదంటాడు. సిబ్బంది అంతా ఆఫీసులోనే ఉన్నారని, మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారని చెబుతాడు.
ప్రజల కోసమే పత్రిక, పాలకుల కోసం కాదు..
దానికామె... మనం ప్రజల కోసం పత్రిక పెట్టుకున్నామే గాని పాలకుల కోసం కాదు. ప్రజా ప్రయోజనాలు, ప్రజాస్వామ్యమే ముఖ్యం, గో హెడ్, స్టార్ట్ ది ప్రింట్ అని అనడంతో సిబ్బంది హర్షాతిరేకాలతో ఆఫీసు మార్మోగింది. ప్రింటింగ్ పూర్తయ్యే పాటికి ఆలస్యమవుతుంది. సిబ్బందే పేపర్ కట్టలతో బజార్లలోకి వస్తారు. ఒక్క కాపీ కూడా మిగలకుండా అమ్ముడవుతాయి. ఆ మర్నాడు మిగతా పేపర్లు కూడా ఒక్కతాటిపైకి వచ్చి పెంటగాన్ పేపర్లను పబ్లిష్ చేస్తాయి. ప్రభుత్వం వేసిన కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. అమెరికన్ ప్రజాస్వామ్యం కొనసాగాలంటే మీడియా కీలకమంటుంది కోర్టు. రాజ్యాంగ తొలిసవరణ పత్రికా స్వేచ్ఛకు భరోసా ఇచ్చిందని, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్టు చేసిన తప్పేమీ లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇస్తుంది. వియత్నాం యుద్ధ పత్రాలను ఎందుకు ప్రచురించకూడదో ప్రాసిక్యూషన్ నిరూపించుకోలేక పోయిందని పేర్కొంది. ప్రజలకు అవసరమై సమాచారాన్ని ప్రచురించే హక్కు పత్రికలకు ఉందని, ఈ పబ్లిషర్ చేసిన పోరాటమదేనని స్పష్టం చేసింది. ఆ పత్రికలపై నిషేధాన్ని ఎత్తివేసింది. నిజమైన పత్రికా స్వేచ్ఛను నిలువుటద్ధంలో చూపింది ది పోస్ట్. ది వాషింగ్టన్ పోస్ట్ యజమానురాలైన క్యాథరిన్ గ్రాహం కుటుంబానికి రక్షణ కార్యదర్శి రాబర్ట్ మెక్‌నమారా వంటి ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులతో పరిచయాలున్నా పెంటగాన్ పేపర్ల ప్రచురణకే మొగ్గుచూపిన ధీశాలి. 70వ దశకంలోనే నిర్భీతి రిపోర్టింగ్‌కు వెన్నుదన్ను ఆమె. అమెరికా చరిత్రలోనే దేశాధ్యక్షుణ్ణి పదవి నుంచి తప్పించిన వ్యూహకర్త. సాదాసీదా ఉద్యోగి తమ సంస్థ నుంచి వెళ్లిపోతుంటే అతని గౌరవార్ధం తన ఇంట్లో పార్టీ ఇచ్చిన పెద్ద మనసున్న మనీషి. ఈ సినిమాలో పబ్లిషర్ క్యాథరిన్ గ్రాహం పాత్రను మెరిల్ స్ట్రీప్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ బెన్ బ్రాడ్లీ పాత్రను టామ్ హాంక్స్ గ్రఫ్ అద్భుతంగా పండించారు.
గుర్తింపు లేకున్నా ప్రాణాలిస్తున్న జర్నలిస్టులు...
ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛను ప్రశ్నిస్తున్న ప్రస్తుత తరుణంలో రావాల్సిన సినిమా ఇది. తమ పనికి ఏ మాత్రం గుర్తింపు లేకున్నా ఏదో సాధించాలన్న తపనలో జీవితాలను ఫణంగా పెట్టే జర్నలిస్టుల జీవితాలకు అద్ధం ఈ సినిమా. ‘పత్రిక ప్రజల కోసమే తప్ప ప్రభుత్వం కోసం కాదు‘ అనే ముగింపు లైన్లు స్క్రోల్ అవుతున్నప్పుడు జర్నలిస్టుల గుండెలు నీరవుతాయి. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రెసిడెంట్ నిక్సన్ వైట్ హౌస్‌లోకి రిపోర్టర్లు రాకుండా నిషేధించడం ప్రారంభించాడు. అయినప్పటికీ జర్నలిస్టులు వాళ్ల సోర్సులతో వార్తల్ని సేకరించారు. వాటర్ గేట్ కుంభకోణాన్ని బయటపెట్టారు. నిక్సన్‌తో రాజీనామా చేయించారు.
పేపర్లు లీక్ చేసిన అధికారికి 115 ఏళ్ల జైలు, విడుదల..
1969లో పెంటగాన్ పేపర్లను దొంగిలించి పేపర్లకు లీక్ చేసిన డేనియల్ ఎల్స్‌బర్గ్ అనే మిలిటరీ అధికారికి ఓ కోర్టు 115 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, ప్రభుత్వంపై నిఘా ఉంచే వ్యక్తిగా (విజిల్‌బ్లోయర్) గుర్తించి కోర్టు ఆయన్ను నిర్దోషిగా తేల్చింది పైకోర్టు. పెంటగాన్ పత్రాలన్నింటినీ 2011లో వర్గీకరించారు. వాటిని మొదటిసారి ఆన్‌లైన్‌లో పెట్టారు.
స్పీల్‌బర్గ్ ఎవరంటే...
1946లో అమెరికాలో పుట్టిన స్టీవెన్ అలన్ స్పీల్‌బర్గ్ ఓ సంచల దర్శకుడు. రచయిత, నిర్మాత. హాలీవుడ్‌లో నూతన శకానికి ఆవిష్కర్త. మూడు ఆస్కార్, రెండు బీఏఎఫ్‌టీఏ అవార్డులు, నాలుగు డైరెక్టర్స్ గిల్డ్ అవార్డులు సహా అనేకం ఆయన ఖాతాలో ఉన్నాయి. 2009, 2015లో ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అందుకున్నవాడు. ఆయన తీసిన ఏడు సినిమాలను సాంస్కృతిక, చారిత్రక సంపదగా అమెరికా లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ గుర్తించింది.
నెట్‌ఫ్లిక్స్‌లో, అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. వీలయితే చూడండి.