
సావు బతుకుల్లో - సర్కారు దవాఖాన
ఎవరికి పట్టని -ప్రజల ఆరోగ్యం -మన వైద్య ఆరోగ్య వ్యవస్థ ఎటుపోతుంది?
అయ్యా ! నాకు ఒక్కగా నొక్క కొడుకు,ఏదో అరుదైన మాయదారి రోగమట, దానిని నయం చేయుటకు 15 నుండి 20 లక్షల రూపాయలు అవుతుందట. నేను చిన్న చాయ బండి నడుపుతూ బతుకు వేళ్ళ దీస్తున్నాను. ఒక్కొక్క పైసా కూడా బెట్టి, ఒక చిన్న పాటి ఇల్లు కట్టుకున్నాను. దానిని కూడా అమ్ముకున్నాను. నా కొడుకు బతికితే చాలు అనుకున్నాను. కానీ ఇంకా డబ్బు కావాలట. ధాతలు , ధాతృత్వ సంస్థలు ఆర్థిక సహాయం చేసి నా బాబు ని కాపాడండి” అంటూ కనబడ్డ వాళ్ళని చేతులు జోడించి దీనంగా ఏడుస్తూ అడుగుతున్నాడు.ఇలాంటి దృశ్యాలు సంఘటనలు ఏ కార్పొరేట్ ఆసుపత్రి వద్దనైనను నిత్యం కనపడుతుంది. అక్కడ ఏ ఒక్కరినీ కదిలించినను ఇలాంటి విషాధబరిత, హృదయాన్ని కదిలించే గాథలు కోకొల్లలు.
ఇంకొక చోట ఇంకొకరు “ నా బిడ్డ ఆరోగ్యముకు శస్త్ర చికిత్సకు ముఖ్య మంత్రి సహాయ నిధికి సిపారస్ చేయమని. ఒక శాసన సభ్యుడిననో, రాజకీయనాయకుడినో, పలుకుబడి కలిగిన ఉన్నత అధికారినో ప్రదేయపడటం” చూస్తాము.
ఇంకొక సారి ఫేస్ బుక్ లోనో. వాట్స్ ఆప్ లోనో వార్తా పత్రిక లోనో ఇలాంటి హృదయ విధారక సంఘటనలు చూస్తాము. చదువుతాము మరియు వింటాము. చదివిన ప్రతి ఒక్కరు బలవంతం మీద బాధను, దు:ఖంను దిగమింగుకుని నిస్సాహాయముగా మరిచి పోవడానికి ప్రయత్నిస్తారు. ఒకరో ఇద్దరో స్పందించి, తమకు తోచిన కొలది , శక్తి కొలది సహాయం చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా కొందరు తమ జీవిత పర్యంతం కష్ట పడి ఒక్కొక్క పైసా ఒక దగ్గర కూడా బెట్టి, సంపాదించిన ఆస్తి నంతా పావుకో పరకకో వచ్చిన కాడికి తెగ నమ్మి, కార్పొరేట్ ఆసుపత్రులకు తగల బెట్టి,ప్రాణము నిలుపుకుని జీవ శవం మాదిరి ఇంటికి వస్తారు. జబ్బు తగ్గిందని సంతోషించాలో, ఉన్న ఆస్తి అంత ఊడ్చుకు పోయిందని బాధ పడాలో తెలియని అయోమయ స్థితిలో పడి కొట్టు మిట్టాడే వాళ్ళు కూడా ఎందరో ఉంటారు.
ఆ రంగు రంగుల అద్దాల మేడ లాంటి ఆసుపత్రులలో , మల్లె పువ్వు లాంటి తెల్లని బట్టలతో సారు , మ్యాడమ్ అంటూ ఎంతో చనువుగా , అతి మర్యాదగా మాట్లాడే సిబ్బందితో డిశ్చార్జ్ అయ్యేటప్పుడు సంతోషంగా ఆనందంగా పోవల్సిన వాళ్ళు, చాలా కళా హీనంగా భారమైన హృదయముతో దిగులుపడుతూ వెళ్ళి పోవడం అందరికీ తెలిసందే.ఇలాంటి నిత్య కృత్యాలు కార్పొరేట్ ఆసుపత్రుల వద్ద సర్వ సాదారణమే
ప్రభుత్వ ఆసుపత్రులు – వైద్యులు :
ఒక వైద్యుడు తన విధులను నిర్లక్ష్యం చేశాడని ఒక ఉన్నత అధికారి వచ్చి చెక్ చేసి సస్పెన్షన్ చేయడం. మీడియాలో పెద్ద పెద్ద అక్షరాలతో హెడ్డింగులతో పతాక శీర్శిక వార్త, సామాజిక మాద్యమాలలో చక్కర్లు, టెలివిజన్ చానల్లో డిబేటింగ్ , చర్చోపచర్చలు.
ఒక దగ్గర డాక్టర్ మీద దాడి. ఒక చోట నర్సులు, డాక్టర్లు,వార్డు సిబ్బంది , పరిశుద్ద కార్మికులు రోగుల పట్ల, రోగులతో పాటు ఉన్న వాళ్ళ పట్ల దురుసుగా , విసుగ్గా కోపంగా ఉండటం . సిబ్బంది ఎంతో ఒత్తిడికి గురి కావడం. సగం సచ్చి జబ్బుతో ఆసుపత్రికి వస్తే , వీరిని ఎందుకు సిబ్బంది తమ విపరీత ప్రవర్తనతో చిత్ర వధ ఎందుకు చేస్తున్నారు? ఆ దిక్కు మొక్కు లేని అలగ జనం ఎలా సహిస్తున్నారు ? మరి ఎందుకు బరిస్తున్నారు? ఈ తదితరాల వెనుక కనుపించని అగోచర పరిస్థితులు ఏమిటి ? ఎలాంటి పరిస్థితులు శాంతి కాముకులై, ప్రేమతో రోగులను అక్కున చేర్చుకుని మృదు మాటలతోనే సగం రోగం నయం చేసే వృత్తి చేపట్టిన వారు యావత్ ప్రపంచ మానవ జాతితో “వైద్యో నారాయణ “ అని చేతులు ఎత్తి మొక్కిచ్చుకునే వైద్య సిబ్బంది ఎందుకు ఇంత ఒత్తిడికి లోనై ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు. ఇలా సస్పెన్షన్ , మేమో ఇవ్వడం, పోలీస్ కేసులు పెట్టడం, భౌతికంగా దాడి చేయడం వల్ల ఈ పరిస్థితులు మారుతాయా ? వీటికి దారి దీసిన పరిస్థితులు ఏమిటని పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఇదిలా ఉండగా ప్రభత్వ వైద్య శాలలో పనిచేసే వైద్య సిబ్బంది విషయానికి వస్తే అక్కడకు వచ్చే రోగుల రద్దీ విపరీతం. బోధన ఆసుపత్రి అయితే ఇంకా మరి రద్దీ. 20 నుండి 30 వరకు ప్రత్యేక వైద్య విభాగాలు. తగినంత సరిపోయే స్థలం ఉండదు. అంతా ఇరుకుగానే ఉంటుంది. కొత్త ఏర్పాటు వైద్య కళాశాలలు ఏర్పాటు చేసిన చోటనే 1500 -2000 మధ్య బయటి రొగులు వస్తారు. ఇంకా పెద్ద నగరాలలో అయితే ఇంకా నాలుగు ఐదు రేట్ల బయటి రొగులు వస్తారు. వీరికి తోడు ఆసుపత్రిలో జాయిన్ అయిన రొగులు(ip) కూడా బాగానే ఉంటారు. మందులు ఒకటి ఉంటే ఒకటి ఉండదు. బయటికి మందులు రాయడానికి వెసులు బాటు ఉండదు. ఆపరేషన్ పరికరములు,మెటీరియల్ అంతంత మాత్రమే. ఏదైనా రిపెరుకు వస్తే , తక్షణం ఆగమేఘాల మీద బాగు చేయడం సాధ్యంకాదు. అక్కడ ఉండే పరికరాల నాణ్యత కూడా అంతంత మాత్రమే. ఎంతో నైపుణ్యం అనుభవం కలిగి ఎంతో సీనియర్ ప్రొఫెసర్లు కూడా ఒక మేజర్ సర్జరీ కూడా చేయలేని నిస్సహాయత. మెడికల్ లీగల్ కేసుల సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం, బోధనేతర పనులు, రికార్డు నిర్వాహణ, బుక్ కీపింగ్ లాంటి పనులు కూడా ప్రొఫెసర్ స్థాయి వాళ్ళే చేయాల్సి రావడం. గుక్క తిప్పుకోకుండా పని ఒత్తిడి.
ఒక స్కానింగ్ విభాగం వద్ద గాని, ఒక డయాగ్నోస్టిక్ విభాగం వద్ద గానీ గరిష్టంగా 50 నుండి 60 మందిని పరీక్షించి , రిపోర్టులు ఇవ్వడం కూడా చాలా కష్టముతో కూడిన పని. మిసిండ్లు, పని ముట్లు, పరికరాల సంఖ్య తక్కువగాను, సిబ్బంది కొరత మరి ఎక్కువగాను , ఉన్న సిబ్బంది కూడా చాలా వరకు ఒప్పంద , ఔట్ సోర్సింగ్ ప్రతి పాదిక మీద పని చేసి , అర కొర జీతాల మీద బతుకు అతి కష్టంగా నెట్టు కొచ్చే వాళ్ళే ఎక్కువ. ఇక్కడ కార్పొరేట్ ఆసుపత్రి వద్ద కనబడే అతి వినయం, మేడమ్ , సారు లాంటి మాటలు వినబడితే అది ఒక అరుదైన విషయమే. ఇలా సిబ్బందికి వాళ్ళ శక్తికి మించిన పని. ఇన్నింటిలో సతమతమయ్యే వారు చాలా సందర్భాలలో విసుగు , కోపం కలిగి అరవడం, దూషించడం, కొన్ని సార్లు పరుషంగా మాట్లాడటం లాంటివి రోగుల పైన , రోగులతో పాటు ఉన్న వారి పైన చూపడం జరుగుతుంది. అతి పెద్ద డాక్టర్ నుండి స్వీపర్ వరకు ఎవరికి కోపం వచ్చినను రోగుల మీద తీర్చుకోవడం జరుగుతుంది.
ఇలాంటి చెడు అనుభవాలు చవి చూసిన సామాన్య జనం ప్రభుత్వ ఆసుపత్రుల మీద దురాభిప్రాయం పెరిగి కాబోలు కార్పొరేటు ఆసుపత్రికి పోయి ఇల్లు వాకిళ్ళు అమ్ముకుని రోడ్డు మీద పడే వాళ్ళు ఎందరో??
ఇలా ఆర్థికంగా , సామాజికంగా , మానసికంగా , భౌతికంగా కుప్ప కూలి పోయిన కడగండ్ల కన్నీళ్ళ పాలై చిక్కిపోయిన కుటుంబాలు ఎన్నో ? వీటి పైన అధ్యయనం లేదు. అధ్యయనం చేయాలని ఊహా ఎవరికి లేదు. సభ్య సమాజం స్పందన ఎక్కడ ? ప్రభుత్వాలు పట్టించుకోక పోవడం ఏమిటి? ప్రభుత్వ ఆసుపత్రులు ఎన్నో ఉండగా ఈవిధంగా కార్పొరేట్ ఆసుపత్రులకు వచ్చి, ఎందుకు ఇలాంటి ఘోరమైన ఇబ్బందులు పడుతున్నారు? లాంటి విషయాలను లోతుగా సంక్షిప్తంగా ఒక సామాన్య మానవుడిగా పరిశీలిద్దాం ...
మొదటి ప్రపంచ దేశాల (first world countries)లో వైద్య ఆరోగ్య పరిస్తితి ఎలా ఉందో చూద్దాం
నెదర్లాండ్: ఈ దేశములో ప్రభుత్వ -ప్రయివేట్ రంగాలు 85:15 నిష్పత్తి లోనూ, వారి జాతీయ స్థూల ఉత్పత్తిలో 11% నిధులు ఖర్చు చేస్తూ , ప్రతి వెయ్యి మందికి 3 బెడ్లు మరియు 4 గురు వైద్యుల చొప్పున ఉన్నారు.
బ్రిటన్ : ఇందులో ప్రభత్వ -ప్రయివేట్ రంగాలు 83:17 నిష్పత్తిలోనూ , జాతీయ స్టూల ఉత్పత్తిలో 11% నిదులు వాటా ఉంది. ప్రతి వెయ్యి మందికి 3 బెడ్లు , 2 ఇద్దరు వైద్యలు ఉన్నారు.
కెనడా : ఇక్కడ ప్రభుత్వ -ప్రయివేట్ రంగాల బాగాస్వామ్యం 71:29 నిష్పత్తిలో ఉంది. ప్రతి వెయ్యి మందికి నలుగురు వాదయునలు, మూడు బెడ్లు ఉన్నాయి. జాతీయ ఉత్పత్తిలో దీని వాటా 11.7% గా ఉంది.
ఆస్ట్రేలియా : ప్రభుత్వ -ప్రయివేట్ రంగాల బాగా స్వామ్యం 73:27 నిష్పత్తి ఉండగా , ప్రతి వెయ్యి మందికి 4 గురు వైద్యులు, 4 బెడ్లు చొప్పున ఉన్నవి. జాతీయ స్థూల ఉత్పత్తిలో దేని వాటా 10% ఉంది.
ప్రాన్స్ : ప్రభుత్వ – ప్రయివేట్ రంగాల బాగస్వామ్య 84:16 నిష్పత్తిగా ఉంది. ప్రతి వెయ్యి మందికి 4 గురు వైద్యులు , 6 బెడ్లు ఉండగా, దీని వాటా జాతీయ స్థూల ఉత్పత్తిలో 12% ఉంది.
జర్మనీ : ప్రభుత్వ – ప్రయివేట్ రంగాల బాగా స్వామ్యం 85:15 నిష్పత్తిలో ఉంది. ఇక్కడ ప్రతి వెయ్యి మందికి 8 బెడ్లు, 4 గురు వైద్యులు ఉండగా , దీని వాటా జాతీయ స్థూలఉత్పత్తిలో 13% ఉంది.
ఇంకా వీటితో పాటు బ్రెజిల్ , స్వీడన్ , డెన్మార్క్ , నార్వే , ఐస్ లాండ్, ఫిన్లాండ్, న్యూజిలాండ్ తదితర దేశాలు కూడా సాదారణంగా ఇదే స్తాయిలో ఉన్నాయి. ఇవి ఈ విధంగా ఉండగా మన దేశం పరిస్థితి చూద్దాం.
భారత దేశం : మన దేశములో వైద్య రంగం విషయంలో ప్రభుత్వ రంగం వాటా 20 నుండి 25 శాతం మద్యలో ఉంటే, ప్రయివేట్ రంగం వాటా 75నుండి 80శాతం మధ్యలో వరకు ఉంది. 62 శాతం బెడ్లు ప్రయివేట్ రంగం ఆసుపత్రుల్లో ఉంటే, ప్రభుత్వ రంగం ఆసుపత్రుల్లో 38 శాతం మాత్రమే బెడ్లు ఉన్నాయి. 81శాతం మంది వైద్యులు ప్రయివేట్ రంగా ఆసుపత్రుల్లో ఉండగా, కేవలం 19 శాతం వైద్యులు ప్రభుత్వ రంగా ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు. ఈ 19 శాతం మందిలో 30 శాతం మంది ప్రాథమిక ఆరోగ్య మరియు వాటి అనుబంధ కేంద్రాలలో ఉన్నారు. మన ఆరోగ్య సేవల అంటే ప్రభుత్వ మరియు ప్రయివేట్ రంగాలు కలిపి కూడా మన జాతీయ స్తూల ఉత్పత్తిలో వాటా 3.8శాతం మాత్రమే. ఇందులో ప్రభుత్వ రంగా వాటా 1.84శాతం కాగా, ప్రయివేట్ రంగం వాటా 1.96శాతంగా ఉంది. అంటే మొత్తం మీద ప్రభుత్వ రంగం , ప్రవేట్ రెండు రంగం వాటా కంటే కూడా తక్కువే ఉంది. ఇక ప్రతి వెయ్యి మందికి 1.3 బెడ్లు ఉన్నాయి. కానీ వైద్యుల సంఖ్య ప్రతి 811 కు ఒకరు చొప్పున మొదటి ప్రపంచ దేశాలలో గల వైద్యల సంఖ్య కంటే ఎక్కువ కలరు. ఇది AYUS వైద్యుల సంఖ్యతో కలిపి ఉండ వచ్చును ?( కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబందనల ప్రకారం ప్రతి 1000 కి ఒక వైద్యుడు ఉండాలి). ప్రపంచ దేశాల ముందు గొప్పగా చెప్పాలని చూపించి ఉంటారు ?
విశ్లేషణ : ప్రపంచములో అభివృద్ది చెందిన లేదా మొదటి ప్రపంచ దేశాలలో వైద్య ఆరోగ్య వ్యవస్థ ప్రైవేట్ రంగ బాగాస్వామ్యం 15- 30 శాతంలో ఉండగా భారత దేశంలో 75-80 శాతం ప్రయివేట్ రంగంలో ఉంది. వైద్యల సంఖ్య ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి 1000 మందికి ఒకరు వైద్యుడు ఉండాలని సూచిస్తే మన దేశంలో ప్రతి 800 ల మందికి ఒకరు ఉన్నారు. కానీ ఈ వైద్యులు మొత్తం చాలా వరకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చాలీ చాలని జీతానికి పని చేస్తున్నారు. ఇంకా పారా మెడికల్, వైద్యేతర , పారిశుద్ద కార్మికుల పరిస్థితి ఇంకా మరి దయనీయం. ఇంకా కొంచెం ఆర్థికంగా బాగా ఉన్నవారు మేధో వలస(intellectual drain) తో విదేశాలకు ఉపాదికి పోతున్నారు. ఇంకా ఇక్కడ తయారైన వైద్యులు 81 శాతం మంది ప్రయివేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో పని చేస్తుండగా , కేవలం 19 శాతం మంది మాత్రమే ప్రభుత్వ రంగంలో పని చేస్తున్నారు. వీరు కూడా ఇందులో 30 శాతం మంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పరిమితం. వీరికి గణాంకాల , నివేదికలు తయారీ, పల్స్ పోలియో, తదితరరాలకే సమయం సరిపోదు. వైద్య సేవలు ఏ మేరకు అందుతాయో అర్థం చేసుకో వచ్చును.
ఇక అభివృద్ది చెందిన దేశాల(first world countries)లో జాతీయోత్పత్తి లో వైద్య రంగం వాటా రెండంకెలకు తక్కువ కాకుండా 10-12 శాతం వరకు ఉండగా , మనదేశంలో జాతీయోత్పత్తి లో ప్రయివేట్ రంగంతో కలుపు కుని 3.8 శాతం ఉండగా , అందులో ప్రభుత్వ రంగం వాటా కేవలం 1.84 శాతం ఉంది. ప్రయివేట్ రంగం వాటా 1.96 శాతం ఉంది. అంటే అభివృద్ది చెందిన దేశాలలో పెట్టిన ఖర్చులో మనం పావు వాటా( ప్రయివేట్ రంగం వాటా కలుపుకుని 3.8 శాతం )కూడా పెట్టుబడి పెట్టడం లేదు.వారి ప్రాధాన్యత వైద్యం మీద మూడు రేట్లు ఎక్కువ. ఇక మన ప్రభుత్వ రంగా వాటా తో పోల్చితే మన కంటే, అభివృద్ది చెందిన దేశాల వాటా ఆరు రెట్లు ఎక్కువ.
అంతే కాదు 15-20 శాతం జనాబా గల ధనిక వర్గాల వారికి 80 శాతం ప్రయివేట్ వైద్య రంగా సరిపోవటం లేదు. అలాంటిది 80 శాతం మంది గల పేదలకు 20 శాతం గల పెట్టుబడి తో నడిచే ప్రభుత్వ రంగా వైద్యము న్యాయం చేస్తుంది. దీనిని బట్టి వైద్య రంగాన్ని మనం ఎంత హీనంగా చూస్తున్నామో , ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో తలచుకుంటే ఒక రకంగా బాధ , ఇంకొ రకంగా సిగ్గు కలుగుతుంది. ఇంకా 50-60 సంవత్సరాలలో కూడా మన ఆలోచన వైద్య వ్యవస్థ ప్రదాన్యత గుర్తించదేమో.
ఈ మద్య కోవిడ్-19 మహమ్మారి వచ్చినప్పుడు అతి గడ్డు కాలంలో, క్లిష్ట , కష్ట ఆరోగ్య సంక్షోభ పరిస్థితిలో ప్రభుత్వ వైద్య రంగం కృషి , వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, పరిశుద్ద కార్మికులు , పోలీసులు తమ ప్రాణాలకు తెగించి , అన్ని రకాల అన్ని వర్గాల ధనిక, పేధ కుల,మత, జాతి తదితర వైషమ్యాలు లేకుండా అందరికీ ఒకే గొడుగు కింద ప్రయివేట్ వైద్య రంగం ఊసు లేకుండా ప్రమేయం లేకుండా ప్రభుత్వ రంగం మాత్రమే కోవిడ్ -19 మొదటి వేవ్ నందు చేసిన కృషి విప్లవాత్మకం మరియు చారిత్రాత్మకం కూడా . అప్పుడు ఎన్నో ప్రయివేట్ కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నప్పటికి ప్రభుత్వం వాటిని బాగస్వాములుగా తీసుకోలేని నిస్సాయత. అవి ఏవి కూడా ప్రభుత్వ నిధులతోను కాకుండా స్వతంత్రంగా నడిచేవి. అలాంటి అందరికీ ఒకే రకంగా ఉచిత ఆరోగ్య సేవలు మన దేశంలో నిరంతరం ఉంటే మన దేశం ఎంత బాగా ఉండేదో. ప్రపంచ దేశాలలో ఎంత గౌరవంగా ఉండేదో మరీ. చిత్త శుద్ది ఉంటే ఈ దేశమైనను, ఏ ప్రభుత్వమైనను, ఏ రాష్టమైనను, నిదులతోనూ , GDP తో సంబంధం లేకుండా అందరికీ సార్వత్రిక , సార్వజనిక ఉచిత వైద్య ఆరోగ్య వ్యవస్థ అమలు సాధ్యము కానిది ఏమి కాదనియు ధనిక పేద తదితర వర్గ బేధం లేకుండా అందరికీ ఉచిత వైద్యం అందించ వచ్చని నిరూపణ ప్రపంచ వ్యాప్తంగా అయ్యింది.
కాని కోవిడ్ -19, రెండవ వేవులో ప్రయివేట్ లేదా కార్పొరేట్ ఆసుపత్రులకు అనుమతి ఇవ్వగానే , ప్రభుత్వ వైద్యశాలలో మొత్తం ఉచితంగా ఇచ్చినట్టి ఇంజక్షండ్లు ఒక్కొక్కటి పది వేల రూపాయల పైబడి అమ్ముకుని ప్రయివేట్ డాక్టర్లు అందిన కాడికి నిలువు దోపిడి చేసిన విషయం. ఉన్నదంతా ఊడ్చి పెట్టి కోవిడ్ సోకిన రొగులు తమ ప్రాణాలు కాపాడుకున్న విషయం అందరికీ తెలిసీనా విషయమే .
విద్యా మరియు వైద్య రంగాల విపరీత పరిస్తితుల వల్ల రోగులు సంఖ్య పెరుగు తుంది. పద్దతి తప్పితే ప్రతికూల ఫలితాలు ఎలా ఉంటాయో ‘ఇవాన్ ఇల్లిచ్’ (Ivan illich) తన Deschooling Society (1970) Medical Nemesis (1976)” లలో స్పష్ట పరిచినాడు.
అంతే కాకుండా “క్యూబా” అతి చిన్న దేశం. ప్రపంచ పటంలో ఎక్కడ ఉందో కనుక్కోవడం కూడా కష్టమే. వైద్య రంగానికి పెద్ద పీట వేయడం ఎప్పటి నుండియో అతి పెద్ద సంఖ్యలో వైద్యులను తయారు చేయడం, కోవిడ్-19 సమయంలో ఈ క్యూబా వైద్యులు చాలా మంది పలు లాటిన్ అమెరికా దేశాలకు వెళ్ళి పనిచేయడం. పెద్ద పెద్ద దేశాలు ఒక చిన్న దేశం సహాయం తీసుకోవడం చూసి, సిగ్గు తెచ్చుకుని ప్రభుత్వ వైద్య సంస్థలను, వైద్యుల సంఖ్యను పెంచు కోవాల్సిన అవసరం గుర్తించిన ప్రపంచ దేశాలు ప్రభుత్వ వైద్య రంగం మీద దృష్టి సాదించాయి. దానిలో బాగంగా మన దేశం కూడా ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేసింది.
కానీ వీటిలోనూ కూడా సిబ్బంది కొరత, చాలి చాలని వసతులు, ఇక్కడ కూడా ఒప్పంద , ఔట్ సోర్సింగ్ చాలి చాలని జీతాల సిబ్బంది. ఎప్పుడైతే ఔట్ సోర్సింగ్ , ఒప్పంద పద్దతి ఎప్పుడు వచ్చిందో అప్పటి నుండి అందులో ఇరుక్కున్న ఉద్యోగులు చావలేక, బతుక లేక వారి పరిస్థితి పాపం కుడితి తొట్టిలో పడ్డ ఎలుకల గతి అయ్యింది.
అంతేకాకుండా ఏ మంత్రి గానీ , ముఖ్య మంత్రి గానీ తనకు ఆరోగ్య పరీక్షలకు ప్రయివేట్ లేదా కార్పొరేట్ ఆసుపత్రికి వెల్లుతారు. వారే కాదు ఏ ప్రభుత్వ ఉద్యోగి గానీ, ఏ ఉన్నత అధికారి గానీ, చివరకు ప్రభుత్వ వైద్యుడు కూడా తనకు ఆరోగ్య బాగా లేనప్పుడు కార్పొరేట్ అసూపత్రికే వెల్లుతాడు. కానీ ప్రభుత్వ ఆసుపత్రికి ఎట్టి పరిస్థితులో వెల్లను గాక వెళ్ళడు. వాళ్ళకి ఉద్యోగం వల్ల, పదవి వల్ల వచ్చే సదుపాయాలు కావచ్చు , మరేదైనా కావచ్చు.
ఇన్ని చూసిన ఏ వ్యక్తీకయిన ప్రభుత్వ వైద్య శాలల పైన , వైద్యుల పైన ఎలాంటి బావన కలుగుతుందో అందరికీ తెలుసు. ఇలాంటి ఎన్నో కారణాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు ప్రవేట్ వైద్యానికి తమ శక్తికి మించి నప్పటికి మొగ్గు చూపుతున్నారు.
ఉచిత బస్సులు ఎందుకు విజయ వంతం అవుతున్నాయి. ఉచిత వైద్యం , ఉచిత విద్య ఎందుకు విఫలం అవుతున్నాయి. ఒక బస్సు డ్రైవరు ఇచ్చే నమ్మకం , ఒక టీచరు , ఒక ప్రభుత్వ వైద్యుడు ఎందుకు ఇవ్వలేక పోతున్నాడు? కర్ణుడి చావుకు ఎన్ని కారణములో దీనికి కూడా అన్నీ కారణాలే.
విద్యా మరియు వైద్య రంగాలు ప్రైవేటీకరణ కబంధ హస్తాల నుండి విముక్తి పొందుతాయో అప్పుడే ఏ దేశమైన , ఏ ప్రాంతమైన , ఏ రాష్టమైన వెలిగి పోవడం జరుగుతుంది.. లేనిచో తిరోగమనమే.. పతనమే.. అభివృద్ది పథములో లో దూసుకు పోవాలా? పాతాళానికి కుంగి పోవాలా ? ప్రజలే తేల్చుకోవాలి