The Federal

మాస్కోలో మరణించిన మన సాహితీ వేత్త!


మాస్కోలో మరణించిన మన సాహితీ వేత్త!
x

రాబోయే రోజుల్లో రాజయ్యే మొనగాడా.. అని గొంతెత్తి అరిచిన మహా మనీషి. పల్నాటి పులి. పలనాడు వెలలేని మాగాణిరా అని నినదించిన యోధుడు, రెండు సార్లు ఎమ్మెల్యే ఆయన.

మాస్కోలో మరణించిన మన సాహితీ వేత్త!

రాబోయే రోజుల్లో రాజయ్యే మొనగాడా.. అని గొంతెత్తి అరిచిన మహా మనీషి

......

ప్రస్తుత పల్నాడు జిల్లా.. నరసరావుపేట నుంచి వినుకొండ ఊళ్లోకి వెళ్లడంతోనే ఎర్రటి రంగేసున్న పెద్ద స్థూపం కనిపిస్తుంది. నాలుగు రోడ్ల కూడలి. బాగా రద్దీ. కుడివైపుకు తిరగడంతోనే ఎడమ వైపు మొదట్లో ఈ స్థూపం ఎర్రగా మిలమిలా మెరుస్తూ ఉంటుంది. ఇప్పుడంటే బాగా రద్దీ పెరిగిపోవడంతో.. తేరిపార చూస్తే తప్ప కనిపించడం లేదు. ఇంతలావు సెంటర్లో ఈ విగ్రహం ఎంట్రా అనుకుంటాం గాని అదో ప్రజల మనిషిదని, ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, ఆ మహామనిషి వెనుక పెద్ద చరిత్ర ఉందని చాలా మందికి తెలియదు. పలనాడు వెలలేని మాగాణిరా అన్న ఆ మహానుభావుడిది ఆ స్థూపం. ఆయన పేరు పులుపుల వెంకట శివయ్య. కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరు. పరుల బాగు తప్ప సొంతమంటే ఏమిటో తెలియని పిచ్చి మనిషి. ఆ సెంటర్ పేరే శివయ్య స్థూపం సెంటర్. కమ్యూనిస్టులు పల్చబడ్డా విగ్రహం మాత్రం కనిపిస్తుంది. చిట్టచివర్న ఆయన పోటో కనిపిస్తుంటుంది. దాని ఎదురుగా రోడ్డుకివల సీపీఐ కార్యాలయం కూడా ఉంటుంది. ఇప్పుడా సెంటర్ పెద్ద వ్యాపార కూడలి. అందరూ శివయ్య స్థూపం అంటారే తప్ప ఆ శివయ్య ఎవరో ఒక్కరూ కూడా తల్చుకోరు. ఆయన చరిత్ర ఏమిటో తెలుసుకోరు. అదో పెద్ద విషాదం.

ఎవరీ శివయ్య అంటే...

పేరు పులుపుల వెంకట శివయ్య. పుట్టింది మన తొలిప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన నవంబర్ 14నే. 'వెనుక' తరములవారి వీర చరితల సిరులు సర్వోనీ త్యాగమ్ము నీర్వెట్టి పెంచరా, విరిసి 'ముఖములు పండురా' అనే పవర్పుల్ సందేశాన్ని ఇచ్చిన వారు. ముందు తరాలకు అందించిన వాడు. కమ్యూనిస్టు. ఎంతో ముందు చూపున్నవాడు. దార్శనికుడు. ఆకలి రుచి తెలిసిన వారు. అన్యాయాన్ని ఎదిరించమని పురికొల్పిన వారు పులుపుల వెంకట శివయ్య. తన సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ కార్య కలాపాల ద్వారా 20వ శతాబ్దిలో తెలుగు నేలను ప్రభావితం చేసిన ప్రముఖులలో పులుపుల ప్రసిద్ధులు.

1910 నవంబర్ 14న పల్నాటి సీమలో పుట్టారు. విద్యార్థిగానే బ్రిటీష్ వాళ్ల దాష్టీకాన్ని ఎదిరించిన వాడు. స్వాతంత్ర్యోద్యమంలో ప్రవేశించి జైలు పాలయ్యారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ (ఆనర్స్) చదివారు. కాశీ నుంచి అందరూ రాగి చెంబులో గంగాజలం పట్టుకు వస్తే ఈయన కమ్యూనిస్టు సాహిత్యాన్ని తీసుకువచ్చిన వారు. తీసుకొచ్చిన వాడు అంతటితో ఆగాడా అంటే ఆక్కుండా రాష్ట్రమంతా వెదజల్లాడు. మూడు పువ్వులు ఆరు కాయలు కాయించాడు. ఆంధ్రలో కమ్యూనిస్టు చైతన్య స్రవంతిని ప్రవహింపజేసిన ఆయన కమ్యూనిస్టు ఉద్యమ ఆద్యులలో ఒకరు. 1937,38లలో కొత్తపట్టణం, మంతెనవారి పాలెంలో కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన రాజకీయ పాఠశాలలకు శివయ్య ప్రిన్సిపాల్. స్వాతంత్య్ర సమరయోధునిగా, కమ్యూనిస్టు ఉద్యమ కార్యకర్తగా శివయ్య నెల్లూరు, అల్లీపురం, బళ్ళారి జైళ్లలో మగ్గారు. 1930 'ఉప్పు సత్యాగ్రహం నుంచి 1944 వరకూ 38 నెలల జైలు జీవితం గడిపారు. 1952, 62లలో వినుకొండ శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికైనారు. పులుపుల శివయ్య అభ్యుదయ సాహితీవేత్త. 1943లో ప్రారంభమైన ''ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం"లో క్రియాశీల పాత్ర పోషించారు. విలువైన గేయాలు, వ్యాసాలు రాశారు. ఆయన పలనాటి సీమను గురించి సమగ్ర గీతం రాశారు. 'రాబోయే రోజుల్లో రాజయ్యే మొనగాడా / రాబోయే రోజుల్లో రచయించే అని వైతాళిక గీతం ఆలపించిన కవి శివయ్య. ఆయన రాసిన 'రాజమండ్రిలో పంతులుగారు', 'గిడుగు గ్రాంథిక భాషావాదుల పాలిటి పిడుగు', 'భాష-పుట్టు పూర్వోత్తరాలు' చాలా విలువైన సమాచారంతో కూడిన సాహిత్య వ్యాసాలు.

శివయ్య 1944లో రాజమండ్రిలోని హిత కారిణీ సమాజం కార్యదర్శి శివరావును కలిసి వీరేశలింగం రచనల పునర్ముద్రణకు హక్కులు సాధించారు. ఈనాడు వీరేశలింగం రచనలు మన చేతుల్లో ఉన్నాయంటే శివయ్యే కారణం. 'నయాగరా' కవిత్రయానికి శివయ్య మార్గదర్శి. 1943లో నరసరావు పేటలో ఏర్పడిన 'నవ్యకళా పరిషత్తు' సభ్యులైన అనిశెట్టి సుబ్బా రావు, నయాగరా కవిత్రయం, రెంటాల గోపాలకృష్ణ వీరంతా ఆరుద్ర అన్నట్లు 'యవ్వనంలో పులుపుల వెంకటశివయ్య గారి రహస్య కమ్యూనిస్టు పాఠాల బోధనల వల్ల ప్రభావితులు' (రెంటాల గోపాలకృష్ణ కవితా సంపుటి 'శివ ధనువు'కు ఆరుద్ర రాసిన ముందు మాటలో).

వెంకటశివయ్య 1976 జూలై 14న మాస్కోలో మృతి చెందే నాటికి శివయ్య 'అరసం' గుంటూరు జిల్లా శాఖ అధ్యక్షులుగా 'ఆఫ్రికా-ఆసియా రచయితల సంఘం' ఆంధ్రప్రదేశ్ సమితి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. 'ఈ నిరంకుశ రాజ్యమేలేటి కాలాన ఎలుగెత్తి పాడాను స్వాతంత్య్ర గీతాన్ని మరణింపగాబోను అమరజీవిని నేను' అన్న మాటలకు నిదర్శనం శివయ్య జీవితం.

Next Story