కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇలా కొల్లగొడుతున్నారేమిటి?
రాష్ట్ర ప్రభుత్వమే రైతుల భూములు గుంజుకుని పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టే విధానం అన్యాయమైనది అంటున్నారు రైతు స్వరాజ్య వేదిక నేత కన్నెగంటి రవి
వికారాబాద్ జిల్లా ధనవాడ మండలం లగచర్ల గ్రామం లో ఇటీవల జరిగిన ఘటనలు, తెలంగాణలో పారిశ్రామికీకరణను, భూసేకరణ కోసం ప్రభుత్వాలు అనుసరిస్తున్న పద్ధతులు, ప్రజల మనో భావాల గురించీ మరోసారి చర్చకు తెచ్చాయి. ఈ చర్చ అన్ని రాజకీయ పార్టీల మధ్యా, ప్రజా సంఘాల మధ్యా కూడా సాగాలి. ప్రజలను విశ్వాసం లోకి తీసుకుని ప్రజా ప్రయోజనాల లక్ష్యంగా చర్చ కొనసాగాలి. నూతన విధానాలు రూపొందాలి.
దశాబ్ధాల పాటు, అనేక త్యాగాలతో, శాంతియుత, సమరశీల ఉద్యమాలు సాగించి ప్రజలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నప్పుడు, అనేక ఆకాంక్షలు వారి మనసు నిండా ఉన్నాయి. కష్టాలతో, నష్టాలతో నిండిన గత కాలపు కన్నీళ్ళు సమసిపోయి భవిష్యత్తు తెలంగాణ ప్రజలందరి జీవనోపాధులను, ఆదాయాలను మెరుగు పరుస్తుందనీ, పేదరికం, ఆకలి, నిరుద్యోగం రద్దయ్యేలా తెలంగాణ లో అధికారం చేపట్టిన ప్రభుత్వాలు విధానాలు రూపొందిస్తాయనీ ప్రజలు అనేక కలలు కన్నారు.
రాష్ట్రం సాధించుకున్నప్పుడు మన ఆకాంక్షలేమిటి ?
భూమిలేని పేద కుటుంబాలకు భూమి దక్కుతుందనీ, కౌలు రైతులకు కూడా గుర్తింపు దక్కుతుందనీ, రైతు కుటుంబాలు అప్పుల ఊబి నుండీ బయట పడి రైతుల, వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు ఆగిపోతాయనీ, రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికీ ఇల్లు, రేషన్ కార్డు, ఆసరా పెన్షన్ సహా, అన్ని సంక్షేమ పథకాలు అందుతాయనీ మనం ఆకాంక్షించాం.
రాష్ట్రంలో వ్యవసాయం, పారిశ్రామికీకరణ, సేవా రంగాలు చెట్టా పట్టాలు వేసుకుని ఉమ్మడిగా ముందుకు సాగుతాయనీ, వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రభుత్వాలు పర్యావరణ హితమైన విధానాలు మాత్రమే అనుసరిస్తాయనీ కూడా మనం ఆశించాం. దశాబ్ధాల పాటు, కరువుతో మగ్గిపోయిన ప్రాంతాలకు సాగు నీరు అంది పుష్కలంగా పంటలు పండించుకుంటామనీ, గ్రామాల నుండీ వలసలు ఆగిపోతాయనీ, సాంకేతిక, ఉన్నత చదువులు చదువు కున్న వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉద్యోగాలు దక్కుతాయనీ, మిగిలిన గ్రామీణ, పట్టణ యువతీ యువకులకు అవసరమైన నైపుణ్య శిక్షణలు అందిస్తే, స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కేలా, కాలుష్యం వెదజల్లని వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు గ్రామాల మధ్య నెలకొనాలని కూడా మనం కోరుకున్నాం.
భూమి, సాగు నీరు, ఖనిజ సంపద లాంటి మన సహజ వనరులు మన రాష్ట్ర ప్రజల , ప్రభుత్వ చేతుల్లోనే ఉండి, రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి ఉపయోగపడతాయనీ, కార్పొరేట్ ల కోసం కాకుండా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అవినీతి రహిత, ప్రజాస్వామిక పాలన సాగాలనీ కూడా మనం కోరుకున్నాం.
రాష్ట్ర అభివృద్ధి నమూనాపై ప్రధాన రాజకీయ పార్టీల వైఖరి ఏమిటి?
రాష్ట్ర అభివృద్ధి నమూనా విషయంలో ప్రజల ఆలోచనా ధోరణికి భిన్నంగా బీజేపీ, బీఆర్ఎస్ , కాంగ్రెస్ లాంటి ప్రధాన రాజకీయ పార్టీల ఆలోచనా ధోరణి భిన్నంగా ఉంది. ఈ రాజకీయ పార్టీలు అధికార, ప్రతిపక్ష స్థానాలు మారినప్పుడు, పరస్పరం ఒకరి విధానాలపై మరొకరు విమర్శించుకున్నట్లు కనపడుతున్నా, నిజానికి ఈ పార్టీల మధ్య ఈ విధానాల విషయంలో, రాష్ట్రంలో కొనసాగాల్సిన అభివృద్ధి నమూనా విషయంలో ఏకాభిప్రాయం ఉంది. అందుకే తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఒక పార్టీ నుండీ నాయకులూ, ప్రజా ప్రతినిధులూ నిస్సిగ్గుగా మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఏ పార్టీ అధికారం లో ఉన్నా, ఈ ఆస్తి పర వర్గాలే ( పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధుల కూటమి ) ప్రయోజనం పొందుతున్నాయి.
ఈ పార్టీల ఆధర్యంలో ఏర్పడుతున్న ప్రభుత్వాలు కూడా గ్రామాలలో వ్యవసాయం ఎప్పటికీ గిట్టుబాటు కాదనీ, గ్రామీణ రైతులు, కూలీలు అక్కడే ఉంటే పేదరికం నుండీ , అప్పుల నుండీ బయట పడలేరనీ , అందుకే గ్రామీణ ప్రజలు నగరాలకు తరలి వచ్చి, ఇతర రంగాలలో ఉపాధి అవకాశాలు వెతుక్కోవాలనీ బోధిస్తున్నాయి. .
గ్రామాలలో భూములు కొనుగోలు చేయగలిగిన వారికి భూమి మార్కెట్ సరుకుగా అందుబాటులో ఉండాలనీ, పారిశ్రామిక వేత్తలకు ఇబ్బడి ముబ్బడిగా భూములు ఇచ్చి గ్రామాలలో పరిశ్రమలు పెట్టేలా ఆకర్షించాలనీ ఈ పార్టీలు, ఆయా ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి.
రాష్ట్ర సాగు భూముల సద్వినియోగం, శాస్త్రీయ పంటల ప్రణాళిక, సమగ్ర వ్యవసాయ విధానం, విష పూరితం కాని సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం, అన్ని పంటలు పండించే రైతులకు లాభదాయకత లాంటి అంశాలపై ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో కూడిన చర్చ చయడం లేదు.
రైతులు అప్పుల ఊబి నుండీ బయట పడడం, రైతులు, కూలీలకు గ్రామీణ ప్రాంతాలలోనే ఉపాధి అవకాశాలు మెరుగయ్యేలా చూడడం, వారికి ఆదాయ, ఆరోగ్య,ఆహార భద్రత చేకూరేలా చూడడం, గ్రామీణ ప్రజలకు కూడా, పట్టణ మౌలిక సౌకర్యాల అందుబాటు, ఆయా ప్రాంతాలలో ఎక్కువమందికి ఉపాధి కల్పించే సూక్ష్మ , చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు, ప్రజలందరికీ ఉచిత విద్యా, వైద్యం అందుబాటులో ఉండడం లాంటి అంశాల చుట్టూ చర్చ జరగాల్సి ఉండగా, అది పక్కకు పోయి, బడా పారిశ్రామిక, సేవా రంగాల అభివృద్ధి, నగరాల విస్తరణ , ఆధునిక హంగులతో అట్టహాసంగా కొత్త నగరాల నిర్మాణం లాంటి అంశాలు ప్రభుత్వాల ఎజెండాను ఆక్రమించాయి.
రాష్ట్రం ఏర్పడిన మొదటి పదేళ్ళలో ఏమైంది? అప్పటి ప్రభుత్వం ఏం చేసింది ?
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి పదేళ్ళూ పాలించిన KCR నాయకత్వం లోని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను అడియాసలు చేసింది. ఏకపక్షంగా, నిరంకుశంగా అప్రజాస్వామిక పాలన సాగించింది. సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, పారి శ్రామిక జోన్ లు, ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్లు , ఫార్మా సిటీ, గ్రీన్ ఎక్స్ప్రెస్ హై వే ల పేరుతో, వేలాది మంది దళిత అసైన్డ్ రైతులనుండీ, పేద, మధ్యతరగతి పట్టాదారు రైతుల నుండీ వేలాది ఎకరాల రైతుల భూములను గుంజుకున్నది. ఈ సందర్భంగా 2013 భూసేకరణ చట్టం అన్ని నియమ నిబంధలను తుంగలో తొక్కేసింది. వారికి సరైన నష్ట పరిహారం చెల్లించకుండా అన్యాయం చేసింది.
మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టులో సిద్దిపేట జిల్లాలో మల్లన్న సాగర్ రిజర్వాయర్ కోసం ప్రత్యేకించి చేసిన భూసేకరణ, రంగారెడ్డి జిల్లాలో ఫార్మా సిటీ కోసం చేసిన భూ సేకరణ, సంగారెడ్డి జిల్లాలో NIMZ కోసం చేసిన భూ సేకరణ, వివిధ జిల్లాలలో ఆహార శుద్ధి పార్కులు, ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు. పేద దళిత కుటుంబాల నుండీ పల్లె వనాలు , వైకుంట ధామాలు, రైతు వేదికల నిర్మాణం పేరుతో, గుంజుకున్న అసైన్డ్ భూములకు లెక్కేలేదు.
సరైన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు లేకుండానే ప్రాజెక్టులు చేపట్టడం, తప్పుడు డిజైన్లతో ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని పెంచుకుంటూ పోవడం, నాణ్యత లేని ప్రాజెక్టులను నిర్మించడం లాంటి అన్ని రకాల అవకతవకలకు పాల్పడి , రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులలో ముంచేసింది. ఈ ప్రాజెక్టుల నిర్మాణం నుండీ వేల కోట్లు కమిషన్ రూపంలో దండుకోవడం కూడా ఇందులో ఆనాటి పాలకుల ప్రధాన లక్ష్యం. యాదాద్రి, భధ్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్టు లాంటివి ఈ కోవలోకే వస్తాయి.
ధరణి పేరుతో సాగించిన అక్రమాలు, ఆనాటి BRS పార్టీ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ భూములను, చెరువులను కబ్జా పెట్టడం, ఆదాయ సమీకరణ పేరుతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ భూములను విచ్చలవిడిగా అమ్ముకోవడం చూశాం.
ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇవన్నీ జ్ఞాపకం చేయాల్సి వస్తుందంటే, KCR ప్రభుత్వం అప్పుడు చేసిన ఈ అన్యాయమైన భూసేకరణను, ప్రతిపక్ష పార్టీగా అప్పటి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. భూ సేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకు మద్ధతు తెలిపింది. కొన్ని సార్లు కోర్టులో ప్రత్యేకంగా కేసులు దాఖలు చేసింది. KCR ప్రభుత్వం చేసిన అన్యాయాలను అసహ్యించుకున్న తెలంగాణ గ్రామీణ ప్రజలు 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పారు . అధికారం నుండీ కూల దోశారు. ప్రజలకు 6 గ్యారంటీలు ఇవ్వడంతో పాటు, KCR పార్టీ అనుసరించిన అవినీతికర , అన్యాయ పాలనను ఎండగట్టిన కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్ట బెట్టారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి “ప్రజా పాలన – ప్రజాస్వామిక పాలన 7 వ గ్యారంటీగా ఉంటుందని “ ఇచ్చిన హామీని విశ్వసించారు. పారిశ్రామిక రంగం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది ?
2023 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభయ హస్తం మానిఫెస్టో లో పారిశ్రామిక రంగం క్రింద కొన్ని హామీలు ఇచ్చారు. ప్రతి ఉమ్మడి జిల్లా కేంద్రం లో పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేస్తామనేది మొదటి హామీ. నిరుద్యోగులకు ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని తీసుకు వచ్చి, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తామనేది రెండో హామీ. జాతీయ రహదారుల వెంట పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు సహా, ఇతర అనేక హామీలు కూడా ఈ రంగంలో ఇచ్చారు.
కాలుష్య నియంత్రణ మండలి (PCB )ని ఆధునీకరించి, వాతావరణ కాలుష్య నివారణలో మరింత మెరుగ్గా సేవలు అందించే (కాలుష్య నియంత్రణ వార్డ్ ) విభాగాన్ని ఏర్పాటు చేస్తామని, గత ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా ముచ్ఛర్ల మండలంలో 20,000 ఎకరాలలో నిర్మించ తలపెట్టిన ఫార్మా సిటీ ని రద్ధు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో చక్కర ఫ్యాక్టరీలను పునరుద్దరిస్తామని కూడా హామీ ఇచ్చారు.
కానీ ఆచరణలో ఏం జరుగుతోంది?
గత ప్రభుత్వం అనుసరించిన విధానాలనే , కొత్త ప్రభుత్వం కూడా పారిశ్రామిక రంగంలో అమలు చేస్తున్నది. పైగా రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ గురించి ఏ మాత్రం పట్టింపు లేకుండా, అత్యంత కాలుష్య కారక పరిశ్రమలనే రాష్ట్రంలో నెలకొల్పేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. ఫార్మా సిటీ రద్ధు చేస్తామన్న హామీని మర్చిపోయి, ఫార్మా సిటీ , గ్రీన్ ఫార్మా సిటీ గా కొనసాగుతుందని, రాష్ట్ర హైకోర్టు ముందు స్పష్టం చేసింది.
పైగా నవంబర్ 7 ఆంధ్ర జ్యోతి కథనం ప్రకారం ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ ఫార్మా విలేజ్ ల పేరుతో తొమ్మిది జిల్లాలలో 1000-2000 ఎకరాల చొప్పున 10 క్లస్టర్ లలో 20,000 ఎకరాల భూమిని సేకరించి, కనీసం 1000 కంపెనీలను ఏర్పాటు చేయాలనే బృహత్ ప్రణాళికను సిద్దం చేస్తోంది. ఇప్పటికే 500 కంపనీలను గుర్తించినట్లు,తెలిసింది. తొలుత వికారాబాద్, మెదక్, నల్గొండ జిల్లాలో మూడు క్లస్టర్ లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా ముందుకు వెళుతూ, భూమిని సేకరిస్తున్నారు.
ఇందుకు ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో అధికారులు వేగంగా ముందుకు వెళుతున్నారు. ఇందులో భాగంగానే వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల లో జరిగిన సంఘటనలను, ప్రభుత్వం తమ భూములు గుంజుకోవడానికి వచ్చిన ప్రభుత్వ తప్పుడు విధానాలపై ప్రజల ప్రతిఘటన గానే ప్రభుత్వమూ, మిగిలిన సమాజమూ అర్థం చేసుకోవాలి.
ఎన్నికల మానిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా, ప్రభుత్వ రంగంలో చక్కర ఫ్యాక్టరీల పునరుద్దరణకు నిర్ధిష్ట చర్యలు తీసుకోవడానికి పూనుకోని రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ----- జిల్లాలలో, గ్రామాలు, పచ్చని పొలాల మధ్యలో అత్యంత కాలుష్య కారక 30 ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రంతో కలసి అనుమతులు మంజూరు చేసింది. అనేక చోట్ల కాలుష్య కారక సిమెంట్ ఫ్యాక్టరీలకు అనుమతులు ఇస్తున్నారు. ఇప్పటికే కాలుష్యంతో నిండి పోయిన రామగుండంలో పెద్ద ఎత్తున థర్మల్ విద్యుత్ సంస్థలను విస్తరించానికి సిద్దమవుతున్నారు. గత 7 దశాబ్ధాలుగా రాష్ట్రంలో ఏర్పడి నడుస్తున్న ఫార్మా , ఇతర కాలుష్య కారక పరిశ్రమలకు ఇవన్నీ అదనం.
నిజానికి రాష్ట్రంలో అనుసరిస్తున్న పారిశ్రామిక విధానం 2070 నాటికి గాలిలో కర్బన ఉద్గారలను జీరో శాతానికి తేవాలనే పర్యావరణ పరిరక్షణపై పారిస్ ఒప్పందానికి వ్యతిరేకం. ఇప్పటికె రాష్ట్రంలో కార్బన్ డై యాక్సైడ్ సహా, గాలిలో కర్బన ఉద్గారాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. వ్యవసాయ ఉత్పత్తిలో, ముఖ్యంగా వరి పత్తి సాగులో కూడా రసాయనాల వినియోగం , సాగు నీటి వినియోగం పెరగడం కారణంగా గాలిలో మీథేన్ లాంటి హరిత వాయువు పరిమాణం కూడా పెరిగి పోతున్నది.
ఇవన్నీ, రాష్ట్ర వాతావరణ పరిస్థితులను మరింత దారుణంగా మార్చేస్తున్నాయి. వర్షపు రోజులు తగ్గిపోవడం, అకాల వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలు, భారీ వర్షాలు , వరదలు, వడగండ్లు – ఇవన్నీ ఈ వాతావరణ మార్పుల ఫలితమే. ప్రకృతి వైపరీత్యాలతో జరుగుతున్న విధ్వంసాలను రాష్ట్రం ఇప్పటికే అనుభవిస్తున్నది. పట్టణాల పేదలు , గ్రామీణ రైతు కూలీలు ఈ ప్రకృతి వైపరీత్యాల ప్రధాన బాధితులుగా ఉంటున్నారని ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలి.
మేం తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికీకరణకు వ్యతిరేకమా?
కానే కాదు, రాష్ట్రంలో పారిశ్రామికీకరణ,సేవా రంగాల అభివృద్ధి వేగవంతంగా జరగాలని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా పెరగలని మా ఆకాంక్ష. అయితే రాష్ట్రంలో అమలయ్యే పారిశ్రామిక, సేవా రంగాల అభివృద్ధి ఈ క్రింది లక్షణాలను కలిగి ఉండాలని మేము బలంగా భావిస్తున్నాం.
1. రాష్ట్రంలో ఏర్పాటయ్యే పారిశ్రామిక, సేవా రంగాలు 80 శాతం ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు స్థానిక యువతకు మాత్రమే కల్పించేలా స్పష్టమైన ఒప్పందాలు ఉండాలి. అందుకు అనుగుణంగా వారి నైపుణ్యాలను పెంచడానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి.
2. రాష్ట్రంలో ఏర్పాటయ్యే సంస్థలు సహజ వనరులైన గాలిని, నీటిని, భూమిని విష పూరితం చేయకుండా ఉండాలి. ప్రజల, పశువుల ఆరోగ్యాలకు హాని చేయకుండా ఉండాలి.
3. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో వచ్చే వ్యవసాయాధారిత, పశు ఆధారిత పరిశ్రమలు స్థానిక ఉత్పత్తి దారులకు లాభం చేసేలా ఉండాలి.
4. రాష్ట్రంలో విద్యుత్ వినియోగించే ఎత్తి పోతల ప్రాజెక్టుల ద్వారా, భూగర్భ జలాల ద్వారా అందుబాటులోకి వచ్చే నీరు అత్యంత ఖరీదైనదిగా ప్రభుత్వం గుర్తించాలి. కోటి ఎకరాల మాగాణం, మనం వరి ధాన్యం పండించి, బయట రాష్ట్రాలకు, బయట దేశాలకు ఎగుమతి చేయడమంటే, అత్యంత ఖరీదైన రాష్ట్ర నీళ్ళను, తద్వారా రాష్ట్ర నిధులను ఎగుమతి చేయడంగా గుర్తించాలి. ఇది ఈ రాష్ట్ర ఖజానాపై అదనపు భారం మోపె అంశమే. కాబట్టి నీటిని ఎక్కువగా వినియోగించే వరి, పత్తి, ఆయిల్ పామ్ లాంటి పంటలను , ప్రాసెసింగ్ లో నీరు ఎక్కువ అవసరమయ్యే కాలుష్య కారక ఇథనాల్ లాంటి పరిశ్రమలను కాకుండా నీటిని పొదుపుగా వాడే పంటలను, పరిశ్రమలను ప్రోత్సహించడం అవసరం.
5. రాష్ట్రంలో వర్షాధార ప్రాంతాలను, పంటలను, పశువులను, రైతులను కాపాడుకోవడం కూడా రాష్ట్ర అభివృద్ధి నమూనాలో భాగంగా చూడాలి. ఆయా ప్రాంతాలను వెనక బడిన ప్రాంతాలుగా చూసి, ( ఉదాహరణకు మహబూబ్ నగర్, జహీరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు , ) అక్కడ పండే పంటలను (పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరు ధాన్యాలు) విలువ లేనివిగా భావించి, వాటిని పరిశ్రమలకు కేటాయించడం సరైందే అనే ఆలోచనా ధోరణి అత్యంత ప్రమాదకర మైనది. ప్రభుత్వాలు ఆ ఆలోచనలను తక్షణం వదిలించుకోవాలి.
6. ఆయా పరిశ్రమలలో పని చేసే ఉద్యోగులకు, కార్మికులకు ఉద్యోగ బధ్రత కల్పించడంతో పాటు, వారికి దక్కాల్సిన అన్ని చట్టబద్ధ హక్కులు అమలు చేసేలా ఉండాలి
కానీ, గత BRS ప్రభుత్వం సహా, ఇప్పటి వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ లో అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలు ఆచరణలో పై సూత్రాలకు అనుగుణంగా లేవని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కారణం చేతనే సాధారణ ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో ముందుకు తెస్తున్న భూ సేకరణ విధానాలకు, కాలుష్య కారక పరిశ్రమల ఏర్పాటుకు ఎదురు తిరుగుతున్నారని మేము స్పష్టం చేయదలుచుకున్నాం. మోడీ ప్రభుత్వ ఫార్ములానే ఎంచుకుని , రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పారిశ్రామికీకరణ విధానాలను అమలు చేస్తే, ఈ రెండు పార్టీలకు ఈ విషయంలో తేడా ఏమీ లేదని కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు.
అందుకే పై ప్రాధమిక సూత్రాలకు అనుగుణంగా ప్రభుత్వం రాష్ట్ర పారిశ్రామిక విధానం రూపొందించాలని మేము భావిస్తున్నాం. కేవలం యాజమానుల లాభాపేక్ష, పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రాయితీలు మాత్రమే రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పటుకు ప్రాతిపదిక కారాదు.
మా నుండీ కొన్ని నిర్ధిష్ట ప్రతిపాదనలు :
1. రాష్ట్రంలో గత 7 దశాబ్ధాలలో పారిశ్రామికీకరణ, ప్రత్యేక ఆర్ధిక మండళ్ళు , పారిశ్రామిక వాడల పేరుతో సాగించిన ప్రభుత్వ భూముల కేటాయింపు , రైతుల నుండీ భూసేకరణ ద్వారా చేసిన భూముల కేటాయింపు, పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పన , మూతపడిన పరిశ్రమలు, భూముల ప్రస్తుత స్థితి పై రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేత పత్రం రూపొందించి ప్రజల ముందు చర్చకు ఉంచాలి.
2. రాష్ట్రంలో ముందుగా భూమి వినియోగ విధానం తీసుకు రావాలి. ఏ అవసరాలకు ఎంత భూమి అవసరమో నిర్ధారించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజల, పశువుల ప్రస్తుత, భవిష్యత్ ఆహార భద్రత అవసరాల దృష్ట్యా పంట సాగు భూములను విచ్చల విడిగా పారిశ్రామిక అవసరాలు, నగరీకరణ పేరుతో మళ్లించడం మానుకోవాలి.
3. రాష్ట్ర ప్రజలకు అవసరమైన ఎటువంటి గృహ ప్రణాళికలు లేకుండా విచ్చల విడిగా సాగు భూములను మళ్లించి, రియల్ ఎస్టేట్ వెంచర్ లుగా మార్చడాన్ని నిషేధించాలి. ఇప్పటికే వేసిన రియల్ ఎస్టేట్ వెంచర్ లపై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించి, అనుమతులు ఇవ్వకుండా, వాటిని సాగు భూములుగా మార్చాలి.
4. గతంలో ప్రభుత్వాలు రైతుల నుండీ భూములను గుంజుకుని పరిశ్రమలకు కేటాయించిన చోట, ఆ పరిశ్రమలు రాకపోతే, కేటాయించిన భూములను ఇతర అవసరాలకు ప్రభుత్వం తనకు తానుగా మళ్లించకుండా , ప్రజలతో చర్చించి, అవకాశం ఉన్న చోట ఆ భూములను రైతులకు తిరిగి ఇచ్చేయాలి.
5. రాష్ట్రంలో పారిశ్రామిక, సేవా రంగాల విధాన తయారీ స్థానికులకు , ముఖ్యంగా యువతకు, మహిళలకు జీవనోపాధుల కల్పన లక్ష్యంగా ఉండాలి.
6. నిజంగా పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే పారిశ్రామిక వర్గాలు , అవసరమైన మేరకు వాస్తవాలు ప్రజలకు చెప్పి, ఒప్పించి, రైతుల నుండీ నేరుగా మార్కెట్ ధరతో భూములు కొనుగోలు చేసేలా ప్రభుత్వం ప్రోత్సహించాలి.
7. భూములపై రైతుల యాజమాన్య హక్కులను భూముల కొనుగోలు పేరుతో శాశ్వతంగా కాజేయకుండా, పారిశ్రామిక వేత్తలు, రైతులతో దీర్ఘ కాలానికి లీజు ఒప్పందాలు చేసుకునేలా ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. ఈ ఒప్పందాలు స్పష్టంగా చట్టబబద్ధ ఒప్పందాలుగా ఉండాలి. ఒప్పందం [ప్రకారమే ఆ భూములను ఉపయోగించాలి తప్ప, ఆ భూములను ఇతర అవసరాలకు, ఇతరులకు మళ్లించకుండా ఒప్పందాలలో నియమాలు ఉండాలి. ఒకవేళ అనుకున్నట్లుగా లీజుకు తీసుకున్న భూములలో పరిశ్రమలు రాకపోయినా, సకాలంలో రాకపోయినా, ఎప్పటికప్పుడు లీజు మొత్తం అందుతుంటుంది కాబట్టి రైతులకు నష్టం ఉండదు. పెట్టిన పరిశ్రమలు సరిగా నిర్వహించ లేకపోయినా, యాజమాన్యాలు నష్టపోయి పరిశ్రమలను మూసేసినా, ఆ భూములు రైతుల పేరుతోనే ఉంటాయి కాబట్టి, రైతు కుటుంబాలకు నష్టం ఉండదు. తిరిగి ఆ భూములను స్వాధీనం చేసుకుని భూములను , తమ అవసరాలకు రైతులు వినియోగించుకుంటారు.
8. వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం విచ్చల విడిగా నోటిఫికేషన్ లు ఇచ్చి, ప్రజాభిప్రాయ సేకరణ సవ్యంగా చేయకుండా, ప్రజలపై పోలీసులతో, అధికారులతో దౌర్జన్యం చేయించి, తక్కువ నష్ట పరిహారంతో రైతుల నుండీ బలవంతంగా భూ సేకరణ చేయడం మానుకోవాలి.
9. లాండ్ పూలింగ్ పేరుతో రైతుల నుండీ నేరుగా భూములు తీసుకుని,అభివృద్ధి చేసిన ప్లాట్లు వారికి తిరిగి ఇస్తామని మభ్యపెట్టి మోసం చేయడం ప్రభుత్వం మానుకోవాలి. ఆయా వ్యవసాయ భూముల్లో ఇప్పటి వరకూ జీవనోపాధులు పొందిన వ్యవసాయ కూలీలకు, పశు పోషకులకు, ఇతర జేవనోపాధుల్లో ఉన్న గ్రామాల ప్రజలకు ఎలాంటి పరిహారం చెల్లించకుండా అన్యాయం చేస్తూ, 2013 భూసేకరణ చట్టం స్పూర్తిని తుంగలో తొక్కుతూ సేకరించిన ఆయా భూములను పరిశ్రమలకు కట్టబెట్టడం మానుకోవాలి.
10. గత 7 దశాబ్ధాలుగా వివిధ ప్రభుత్వాలు వివిధ భూ పంపిణీ పథకాల క్రింద భూమి లేని దళిత, ఇతర పేద కుటుంబాలకు భూమి పంపిణీ చేయడం ప్రజా ప్రయోజనంగానే చూడాలి. కేవలం పారిశ్రామికీకరణ, నగరీకరణ మాత్రమే ప్రజా ప్రయోజనంగా, అదే అభివృద్ధిగా భావిస్తూ పేద అసైన్డ్ రైతుల నుండీ ఒక్క కలం పోటుతో ప్రభుత్వం భూములు వెనక్కు తీసుకోవడం మానుకోవాలి.
11. ప్రభుత్వం ఇప్పటికే తన చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములను పరిశ్రమలకు కేటాయించే చోట, స్థానిక గ్రామాల ప్రజలను, లేదా స్థానికంగా నిర్వాశితులైన వారిని, పారిశ్రామికీకరణ కారణంగా చేకూరే ఆ ప్రాంత అభివృద్ధిలో లబ్ధిదారులుగా మార్చాలి. ఇందుకోసం ఆయా ప్రాంతాల ప్రజలను ఆయా పరిశ్రమలలో వాటా దారులుగా మార్చాలి. ఆయా పరిశ్రమలు సాధించే లాభాలలో వారి వాటా వారికి దక్కాలి.
12. రాష్ట్రంలో ఇప్పటికే నెలకొల్పిన పరిశ్రమలు కాలుష్యం వెదజల్లుతుంటే , వాటిపై లోతైన సమీక్ష చేసి, కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలి. అందుబాటులో ఉన్న టెక్నాలజీతో కాలుష్య నివారణ సాధ్యం కాకపోతే, ఆ పరిశ్రమలను జనావాసాలకు, నీటి వనరులకు దూరంగా తరలించాలి. లేదా పూర్తిగా మూసేయాలి.
13. కొత్తగా రాష్ట్రంలో పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేటప్పుడు, ఆ పరిశ్రమ స్వభావాన్ని లోతుగా అర్థం చేసుకుని, ఆ పరిశ్రమ విషయంలో అంతర్జాతీయ అనుభవాలను కూడా అధ్యయనం చేసి పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యాలకు ఆ పరిశ్రమ చేసే హానిని గురించిన పూర్తి స్పష్టతతో ఆ పరిశ్రమను రాష్ట్రంలో అనుమతించాలా లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవాలి.
14. వస్తున్న పరిశ్రమల విషయంలో ప్రజలకు అబద్ధాలు చెప్పడం, ప్రజలు ప్రశ్నించకుండా అణచివేయడం, ప్రజల నిరసనలను, ఆందోళనలను తప్పు పట్టడం, ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని ప్రశ్నించే ప్రజాస్వామికవాదులను, పర్యావరణ వేత్తలను అభివృద్ధి నిరోధకులుగా ముద్ర వేయడం ప్రభుత్వం మానుకోవాలి.
Next Story