ప్రభుత్వమే భూమి కాజేయాలనుకుంటే  ఇక దిక్కెవరు?
x

ప్రభుత్వమే భూమి కాజేయాలనుకుంటే ఇక దిక్కెవరు?

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలోజరుగుతున్నదేమిటి?


పర్యావరణ పరిరక్షణ ముఖ్యమా, అభివృద్ధి ముఖ్యమా?ఈ రెండు అంశాల మధ్యలో ప్రతిష్టాత్మక హైదరాబాద్ యూనివర్సిటీ మాత్రం ఇప్పుడు భగ్గుమంటోంది. యూనివర్శిటీకి చెందినదిగా భావిస్తున్న నాలుగు వందల ఎకరాల పచ్చని చెట్లతో వున్న భూమిని ఇప్పుడు ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం , అభివృద్ధి పేరుతో ఆ ప్రాంతాన్ని చదును చేయడానికి సంకల్పించడం రచ్చ రాజేస్తోంది. వర్శిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం చర్చకు దారితీస్తోంది. ప్రభుత్వం టీజీఐఐసీకి కేటాయించిన స్థలాన్ని చదును చేస్తుండగా విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో విద్యార్థులు, పోలీసులకు మధ్య తీవ్ర ఉధ్రిక్తత వాతావరణం నెలకొంది. అసలు హెచ్ సీఏ భూముల వివాదం ఏమిటి..? విద్యార్థులు ఎందుకు ఆందోళనకు దిగారు..? ప్రతిపక్ష పార్టీలు విద్యార్థుల ఆందోళనకు మద్దతునిస్తూ, ప్రభుత్వ చర్యను ఎందుకు ఖండిస్తున్నాయి..? అభివృద్ధి చేసి ప్రభుత్వం విక్రయించాలని చూస్తున్న 400 ఎకరాల భూమి అసలు ప్రభుత్వానిదేనా... గతంలో యూనివర్సిటీ కి ఇచ్చి ఇప్పడు మళ్లీ లాక్కోంటోందా..? అసలు కథేంటి? ఆ 400 ఎకరాల భూమి నిజంగా ప్రభుత్వానిదేనా... ప్రభుత్వానిదే అయినా వందలాది వృక్షాలు, జంతువులతో వున్న ఆ ప్రాంతాన్ని, జీవ వైవిధ్యానికి విఘాతం కలిగించేలా అభివృద్ధి చేయడం సమంజసమేనా .. ఇదే చర్చ సాగుతోంది?

అసలు వివాదం ఏంటి..?

హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీ ఆవ‌ర‌ణంలో ఉన్న 400 ఎకరాల భూమిని వేలం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం , అందుకు పూనుకోవడం తో వివాదం మొదలైంది.. 400 ఎక‌రాల భూమిని రాష్ట్ర మౌలిక స‌దుపాయాల సంస్థ‌కు కేటాయిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. భూమిని అభివృద్ధి చేసి ఐటీ సంస్థ‌ల‌కు విక్ర‌యించేందుకు టీజీఐఐసీ ప్ర‌ణాళిక సిద్ధం చేసింది. అయితే, ఈ భూములు హెచ్‌సీయూకి చెందిన‌వి అని జీవ‌వైవిద్యం ఉన్న వీటి జోలికి రావొద్ద‌ని విద్యార్థి సంఘాలు ఆందోళ‌న చేస్తున్నాయి. వర్శిటీ భూమిలో వేలాది చెట్లు, పక్షులు, వివిధ రకాల జంతువులు, వందల సంవత్సరాల నాటి శిలలు వున్నాయి. వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని, భూముల వేలాన్ని నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ఉద్య‌మిస్తామని హెచ్చరించారు. టీజీఐఐసీకి కేటాయించిన స్థలాన్ని ఆదివారం చదును చేస్తుండగా విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఉధ్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు పలువురు విద్యార్థులపై కేసులు నమోదు చేశారు.

1974లో హెచ్ సీ యూ ని స్థాపించారు. అప్పట్లో పూర్తి అటవీ ప్రాంతంగా వున్న గచ్చిబౌలిలో యూనివర్సిటీ కోసం 2300 ఎకరాలను కేటాయించారు. అయితే యూజీసీ లెక్కల ప్రకారం వర్శిటీ పేరుతో 1800 ఎకరాలే వుందని , మిగిలిన 500 ఎకరాలు వర్శిటీ పరిధిలోనే వున్నా రికార్డులలో ప్రభుత్వ భూమిగా వుందంటున్నారు. అయితే యూనివర్సిటీ యాజమాన్యం వర్శిటీ అభివృద్ధి కోసం ఆ భూమిని తమ పేరున బదలాయించాలని ఎప్పటి నుంచో అడుగుతోంది. ఆ భూమి తనదిగానే భావిస్తోంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం కంచె గ‌చ్చిబౌలి గ్రామం స‌ర్వేనంబ‌ర్ 25లోని ఈ 400 ఎక‌రాల భూమిని 2004 జ‌న‌వ‌రి 13వ తేదీన నాటి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం క్రీడా వ‌స‌తుల అభివృద్ధి కోసం ఐఎంజీ అక‌డ‌మీస్ భార‌త ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించింది. ఐఎంజీ అక‌డ‌మీస్ త‌న ప్రాజెక్టును ప్రారంభించ‌క‌పోవ‌డంతో 2006 న‌వంబ‌రు 21న ప్ర‌భుత్వం ఆ కేటాయింపును ర‌ద్దుచేసింది. ప్రభుత్వం నిర్ణయం పట్ల ఐఎంజీ అక‌డ‌మీస్ అదే సంవత్సరం హైకోర్టులో రిట్ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఈ న్యాయ‌పోరాటం సుదీర్ఘ కాలం కొన‌సాగింది. అయితే, 2024 మార్చి 7వ తేదీన ఈ కేసులో హైకోర్టు ప్ర‌భుత్వానికి అనుకూలంగా ఉత్త‌ర్వులు ఇచ్చింది. ఆ తరువాత హైకోర్టు తీర్పుపై ఐఎంజీ అకాడమీస్ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా 2024 మే3న ఆ పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఆ త‌రువాత‌.. టీజీఐఐసీ విజ్ఞ‌ప్తి మేర‌కు శేరిలింగంప‌ల్లి డిప్యూటీ క‌లెక్ట‌ర్, త‌హ‌శీల్దార్ రెవెన్యూ రికార్డుల ప్ర‌కారం 400 ఎక‌రాల భూమిని ప్ర‌భుత్వ భూమిగా నిర్ధారించారు. త‌రువాత ప‌రిణామాల నేప‌థ్యంలో ఆ భూమి హ‌క్కుల‌ను టీజీఐఐసీకి బ‌ద‌లాయిస్తూ గ‌తేడాది ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. అయితే, ఆ భూమిని అభివృద్ధి చేసి ఐటీ సంస్థ‌ల‌కు విక్ర‌యించేందుకు టీజీఐఐసీ ప్ర‌ణాళిక సిద్ధం చేసింది.అదే తాజా వివాదానికి కారణమయింది.

యూనివర్శిటీ విద్యార్థుల వాదన ఏంటి..? ప్రభుత్వ చర్య పర్యావరణానికి విఘాతమా ?

హైదరాబాద్ కే తలమానికంగా ఆ మాటకొస్తే తెలంగాణాకే ప్రతిష్టాత్మక మైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 2వేల ఎకరాల్లో ప్రకృతి అందాలకు ఆలవాలంగా, పర్యావరణాన్ని పరిరక్షించే రీతిలో భారీ అటవీప్రాంతంలో విద్యాకుసుమాలను విద్యార్ధులకు అందిస్తోంది. దేశంలోనే గుర్తింపు తెచ్చుకుంటోంది. అలాంటి వర్శిటీ పరిసరాలు వేలాది మేలుజాతి వృక్షాలు, వన్య ప్రాణులతో నిండి , ఐటీ కారిడార్ గా అభివృద్ధి చెందిన గచ్చిబౌలి ప్రాంతానికే ఆక్సిజన్ సిలెండర్ గా పర్యావరణాన్ని పరిరక్షిస్తోంది. అలాంటి వాతావరణానికి ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో పెను విఘాతం గా మారుతోందని విద్యార్థిసంఘాలు ఆరోపిస్తున్నాయి. యూనివర్సిటీ కి చెందిన 400 ఎకరాలు ప్రభుత్వానిదని లాగేసుకొని , వేలాదిగా వున్న వృక్ష సంపద, వన్యప్రాణులకు విఘాతం కలిగిస్తూ, దానికి అభివృద్ధి అని పేరుపెట్టడం ఏంటని విద్యార్థి సంఘం నాయకుడు రమేష్ అంటున్నారు. ప్రభుత్వ చర్య తప్పని విద్యార్దులు నిరసన తెలిపితే పోలీసులతో లాఠీచార్జి చేయిస్తారా అంటూ నిలదీశారు. హెచ్ సీయూ టీచర్స్ అసోసియేషన్ మాజీ జాయింట్ సెక్రటరీ విజయ్ మాట్లాడుతూ యూనివర్సిటీ మరింత అభివృద్ధి కావడానికి ఎక్కవ స్థలం కావాలని, గతంలో వర్సిటీ కే కేటాయించిన భూమిని ఇప్పుడు లాక్కోవడం విచిత్రంగా వుందన్నారు. 400 ఎకరాలు అమ్మితే 10 వేల కోట్లు, ఇంకా ఎక్కువగా వస్తుందని లెక్కలేస్తున్నారని, ప్రభుత్వం ఆదాయం సంపాదించుకోడానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవా అని ప్రశ్నించారు. పర్యావరణానికి విఘాతం కలిగించే ఈ చర్యలకు స్వస్థి పలికి ఆదాయానికి వేరేదార్లు వెదుక్కోవాలని , యూనివర్సిటీ అభివృద్ధి ని అడ్డుకోవడం మంచిది కాదన్నారు. యూనివర్సిటీ కి మొదట్లో 2300 ఎకరాలు కేటాయించారన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికే యూనివర్సిటీ స్థలాలను ఆర్ టీసీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్ లకు కేటాయించారని, ప్రైవేటు వ్యక్తులకు అమ్మాలని చూడటం దారుణమన్నారు.మరో వైపు విద్యార్థి సంఘాలు మాత్రం తగ్గడం లేదు. అవసరమైతే నిరవధిక నిరాహార దీక్షలు చేసైనా ప్రభుత్వ నిర్ణయంలో మార్పు తెస్తామంటున్నారు.

ప్రభుత్వ వాదన ఏంటి? ఎలా సమర్దించుకొంటోంది?

హెచ్ సీయూ వివాదంపై స్పందించిన ప్రభుత్వం 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని,అందులో సెంట్రల్ యూనివర్శిటీ భూమి లేదని చెప్పింది. ఆ భూమి యాజమాని తామేనని న్యాయస్థానం ద్వారా తెలంగాణ ప్రభుత్వం నిరూపించుకుందని, ప్రైవేట్ సంస్థకు 21 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని న్యాయ పోరాటం ద్వారా ప్రభుత్వం దక్కించుకుందని తెలిపింది. వేలం, అభివృద్ధి పనులు అక్కడ ఉన్న పర్యావరణాన్ని ఎలాంటి విఘాతం కల్గించదని తెలిపింది.

అక్కడ వున్న రాళ్లను దెబ్బతీయమని, అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువు లేదని, సర్వేలో ఒక అంగుళం భూమికూడా హెచ్ సీయూది కాదని తేలిందని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. విద్యార్థులను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ప్రభుత్వం ఆరోపించింది.ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్ర‌భుత్వం చేప‌డుతున్న ప్ర‌తి ప్ర‌ణాళిక‌లో స్థానిక సుస్థిరాభివృద్ధి, ప‌ర్యావ‌ర‌ణ అవ‌స‌రాల‌కు అత్య‌ధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్ర‌స్తుత ప్రాజెక్ట్ ను వ్య‌తిరేకించే వారంతా కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు,

రియ‌ల్ ఎస్టేట్‌ వ్యాపారుల‌ ప్ర‌యోజ‌నాల‌కు అనుగుణంగా విద్యార్థుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారఅని రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.ఆ భూమికి సంబంధించిన చ‌ట్ట‌ప‌ర‌మైన అంశాలను వివరిస్తూ ప్రెస్ నోట్ విడుదల చేసింది.

ఆ భూమికి సంబంధించిన చ‌ట్ట‌ప‌ర‌మైన అంశాలు

1. రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం కంచె గ‌చ్చిబౌలి గ్రామం స‌ర్వేనంబ‌ర్ 25లోని 400 ఎక‌రాల భూమిని 2004, జ‌న‌వ‌రి 13వ తేదీన నాటి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం క్రీడా వ‌స‌తుల అభివృద్ధికి ఐఎంజీ అక‌డ‌మీస్ భార‌త ప్రైవేట్ లిమిటెడ్‌కు మెమో నంబ‌ర్ 39612/Assn/V(2) 2003 ప్ర‌కారం కేటాయించింది.

2. ఐఎంజీ అక‌డ‌మీస్ భార‌త ప్రైవేట్ లిమిటెడ్ త‌న ప్రాజెక్టును ప్రారంభించ‌క‌పోవ‌డంతో 2006, న‌వంబ‌రు 21న నాటి రాష్ట్ర ప్ర‌భుత్వం జీవో నెం: 111080/S1/2003 ప్ర‌కారం ఆ కేటాయింపును ర‌ద్దు చేసి ఏపీ యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం అండ్ క‌ల్చ‌ర‌ల్ డిపార్ట్‌మెంట్‌కు దానిని కేటాయించింది.

3. ఈ భూమి కేటాయింపుల‌పై ఐఎంజీ అక‌డ‌మీస్ భార‌త ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టులో 2006లో రిట్ పిటిష‌న్ నంబ‌ర్ 24781/2006 దాఖ‌లు చేసింది. ఈ న్యాయ‌పోరాటం సుదీర్ఘ కాలం కొన‌సాగింది. రాష్ట్రంలో ఏర్ప‌డిన నూత‌న ప్ర‌భుత్వం ఈ అంశాన్ని చాలా తీవ్రంగా ప‌రిగ‌ణించింది. ఈ కేసులో (రిట్ పిటిష‌న్ నంబ‌ర్ 24781/2006) గౌర‌వ హైకోర్టు ప్ర‌భుత్వానికి అనుకూలంగా 2024, మార్చి 7వ తేదీన ఉత్త‌ర్వులు ఇచ్చింది.

4. హైకోర్టు తీర్పును ఐఎంజీ అక‌డ‌మీస్ భార‌త ప్రైవేట్ లిమిటెడ్ గౌర‌వ సుప్రీంకోర్టులో స్పెష‌ల్ లీవ్ పిటిష‌న్ (సీ) నంబ‌ర్ 9265/2024 ద్వారా స‌వాల్ చేసింది. ఈ పిటిష‌న్‌కు వ్య‌తిరేకంగా రాష్ట్ర ప్ర‌భుత్వం పోరాడింది. 2024, మే 3వ తేదీన గౌర‌వ సుప్రీంకోర్టు ఐఎంజీ అక‌డ‌మీస్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను డిస్మిస్ చేసింది. దీంతో ఆ 400 ఎక‌రాల భూమి ప్ర‌భుత్వానికి ద‌క్కింది.

భూమి సర్వే వివాదం, సర్వే జరిగిందన్న ప్రభుత్వం, లేదంటున్న హెచ్ సీ యూ

ప్ర‌భుత్వ రెవెన్యూ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం కంచె గ‌చ్చిబౌలి గ్రామం స‌ర్వే నంబ‌ర్ 25లోని 400 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి హ‌క్కుల‌ను టీజీ ఐఐసీకి బ‌ద‌లాయిస్తూ 2024, జూన్ 24న ఉత్త‌ర్వులు జారీ చేశారు. శేరిలింగంప‌ల్లి మండ‌ల రెవెన్యూ అధికారులు ఆ 400 ఎక‌రాల భూమికి సంబంధించి పంచ‌నామా నిర్వ‌హించి 2024, జులై 1వ తేదీన టీజీ ఐఐసీకి అప్ప‌గించారని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ వివాదం నేపధ్యంలో HCU అధికారుల‌ స‌మ‌న్వ‌యంతోనే హ‌ద్దుల గుర్తింపు జరిగిందని కూడా టీజీఐఐసీ తరపున తాజాగా ప్రకటన విడుదలైంది. త‌మ‌కు కేటాయించిన 400 ఎక‌రాల భూమికి సంబంధించిన‌ ఉమ్మ‌డి హ‌ద్దుల గుర్తింపున‌కు త‌మ అధికారుల‌కు స‌హ‌క‌రించాల‌ని కోరుతూ టీజీఐఐసీ సైబరాబాద్ జోన‌ల్ మేనేజ‌ర్ యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్ రిజిస్ట్రార్‌కు 2024, జులై 04వ తేదీన లేఖ రాశారని తెలిపింది. యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్ రిజిస్ట్రార్ స‌మ్మ‌తితోనే 2024, జులై 19న యూనివ‌ర్సిటీ అధికారులు యూనివ‌ర్సిటీ రిజిస్ట్రార్‌, యూనివ‌ర్సిటీ ఇంజినీర్‌, యూనివ‌ర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, రెవెన్యూ అధికారులు రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్‌, మండ‌ల స‌ర్వేయ‌ర్ స‌మ‌క్షంలో స‌ర్వే జ‌రిగింది. అదే రోజు హ‌ద్దులు నిర్ధారించారని ప్రకటించడం కొత్త వివాదానికి దారితీసింది.

హెచ్ సీ యూ స్పందన

టీజీఐఐసీ చేసిన ప్రకటనపై హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం స్పందించింది. 2024 జులైలో అక్కడ ఎలాంటి సర్వే నిర్వహించలేదని, ఇప్పటి వరకు భూమి ఎలా ఉందన్న దానిపై ప్రాథమిక పరిశీలన మాత్రమే చేశారని తెలిపింది. హద్దులకు అంగీకరించినట్లు టీజీఐఐసీ చేసిన ప్రకటనను ఖండిస్తున్నట్లు వెల్లడించారు.ఇప్పటి వరకు భూమికి సరిహద్దులు గుర్తించలేదని, దీనిపై హెచ్‌సీయూకి సమాచారం ఇవ్వలేదని తెలిపారు. ఆ భూమిని విశ్వవిద్యాలయానికే ఇవ్వాలని చాలాకాలంగా కోరుతున్నామని, భూమి కేటాయించడంతో పాటు పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని కాపాడాలని మరోసారి కూడా ప్రభుత్వాన్ని కోరతామని వర్శిటీ రిజిస్ట్రార్ ప్రకటించారు.

ప్రతిపక్షాల ఆగ్రహం

హెచ్ సీ యూ భూముల వేలాన్ని ఆపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఈ విష‌యాన్ని కేంద్ర‌ ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ..రాష్ట్రానికి తలమానికమయిన హెదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూములు అమ్మి అప్పులు కట్టాలని నీచమైన ఆలోచనను రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. స్మశాన వాటికలకు, పార్కులకు జాగా లేకుండా పోతున్న రోజులలో, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఇలాంటి దుర్మార్గ నిర్ణయాలు తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో కేంద్ర మంత్రి బండిసంజయ్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.భూములు అమ్మకుంటే రాష్ట్రాన్ని పాలించే పరిస్థితి లేదా? భూములన్ని వేల కోట్లు సంపాదించి దండుకోవడమే మీ పనా? అంటూ బండి సంజయ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాబోయే తరాలకు గజం భూమి కూడా ఉంచకుండా చేస్తారా? ఇదేం పాలన? అంత మాత్రాన మీరెందుకు...కేఏ పాల్ కు అప్పగించినా అదే పని చేస్తారు కదా?''అంటూ మండిపడ్డారు.కాళేశ్వరం పేరుతో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 25 లక్షల చెట్లు నాశనం చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం గచ్చిబౌలిలో హరిత విధ్వంసానికి దిగిందని ఆవేదన వ్యక్తంచేశారు.

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విద్యార్థుల పట్ల పోలీసుల తీరును ఖండించారు. వెంటనే ప్రభుత్వ భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

2016లో రోహిత్ వేముల మరణం సమయంలో విద్యార్థుల బాధను చెబుతూ యూనివర్శిటీలోకి వచ్చిన రాహుల్ గాంధీ, ఇప్పుడు అదే క్యాంపస్ పై వారి పార్టీ ప్రభుత్వం దాడులు చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.విద్యార్థుల పై దాడులను ఖండిచిన కేటీఆర్ హెచ్ సీ యూ విద్యార్థుల ఉద్యమానికి తాము అండగా వుంటామన్నారు. జేసీబీ లను చూసి బెదురుతున్న నెమళ్లు, ,చిన్న జంతువులు సాయం కోసం ఎదురు చూస్తున్నాయని అన్నారు.

పట్టు వదలని ప్రభుత్వం

హెచ్ సీయూ 400 ఎకరాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గడంలేదు. ఆ భూమితో యూనివర్సిటీ కి సంబంధం లేదని, ఆ ప్రాంత అభివృద్ధి లో భాగంగానే ఆ భూమిని వినియోగిస్తున్నామని చెబుతోంది. పర్యావరణ నిబంధనల మేరకే తమ చర్యలు వుంటాయని చెబుతున్న ప్రభుత్వం విపక్షాలు విద్యార్దులను రెచ్చగొట్టి వివాదాన్ని పెద్దవి చేస్తున్నాయని ఆరోపిస్తోంది. విద్యార్దుల ఆందోళనలు లెక్కచేయకుండా, జేసీబీ లు ఉపయోగిస్తూ ఆ స్థలం అభివృద్ధి కొనసాగిస్తోంది.

విద్యార్థి సంఘాలు తగ్గేదిలేదని తేల్చి చెబుతుండటంతో వివాదం ఎంత దూరం వెళుతుంది. ప్రభుత్వం ఆలోచనలో పడుతుందా లేదో చూడాలి. ప్రభుత్వ చర్యతో జీవవైవిధ్యం దెబ్బతింటోందన్న అంశం ప్రధానాంశంగా మారుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పడేస్తోంది..

Read More
Next Story