
హైాదరాబాద్ లో AI మినీ రెవల్యూషన్, దిక్చుతోచని స్థితిలో రేవంత్
HCU భూపోరాటంలో కొత్త ట్విస్ట్, ఇక నుంచి ఉద్యమాలకు AI అండ
నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరు చుట్టొస్తుందని ఊరికే అనలేదు. కావాలనే చాలామంది లేనిపోని వదంతులు సృష్టిస్తూ.. దానికి సోషల్ మీడియాను అస్త్రంగా వినియోగిస్తూ అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఆ వార్త నిజమాకాదా తెలిసేలోపే దేశమంతా పాకిపోతోంది. ఇప్పుడు ఎఐ (Artiricial Intelligence AI) టెక్నాలజీ తోడయ్యాక అసలును మైమరిపించేలా ఫేక్ వీడియోలతో పాటు ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంలో అచ్చం ఇదే జరిగిందంటోంది తెలంగాణ ప్రభుత్వం. తమ నిర్ణయాన్ని జీర్ణించుకోలేని కొందరు ఎఐ జనరేటెడ్ కంటెంట్ (AI Generated Content) ను సృష్టించి తెలంగాణ ప్రజలనే కాదు, యావత్ దేశాన్ని ఆఖరికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ను తప్పుదోవ పట్టించారని వాదిస్తోంది. ప్రపంచాన్ని వణికించిన కరోనా కన్నా ఈ ఫేక్ కంటెంట్ ప్రమాదకరమని చెబుతోంది. దీని మీద విచారణ జరపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోర్టునుకోరాలని నిర్ణయించింది.
అసలేం జరిగింది....?
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (Hyderabad Central University) పరిధిలోని 400 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేసి , ఆ భూమిని ఐటీ విస్తరణకు ఉపయోగించాలని సంకల్పించింది. అయితే ఆ ప్రాంతం జీవవైవిధ్యాన్ని చాటుతోందని, అటవీ ప్రాంతం, సరస్సులు, జంతువులు, నరీసృపాలు వున్న ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి కాంక్రీటు జంగిల్ గా మార్చడమంటే, పర్యావరణానికి తీవ్ర విఘాతమని ,అదీగాక ఆ భూమి గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కి కేటాయించిన 2300 ఎకరాలలో భాగమని హెచ్ సీ యూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. దానికి విపక్షాలు కూడా తోడవడంతో నిరసన ఉద్యమంగా మారింది. దాంతో ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని ఫిస్టేజ్ గా తీసుకొని వెనక్కితగ్గేదిలేదంటూ అధిక సంఖ్యలో జేసీబీ లను రంగంలో దింపి పనులు కొనసాగించాలని చూచింది. దీంతో జీవవైవిధ్యానికి తీవ్ర విఘాతం కల్గిస్తున్నారన్న అంశం ప్రధానాంశం కావడంతో పర్యావరణవేత్తలు, సెలబ్రిటీలు ప్రభుత్వ చర్యపై భగ్గు మన్నారు. వేలాదిగా చెట్లను నరికేస్తున్నారు.. నెమళ్లు , జింకలు భయంతో పరుగులు తీస్తున్నాయంటూ వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి.నెమళ్లు , జింకలు ,జెసీబీల ధాటికి అరుస్తూ చెల్లాచెదురుగా పారిపోతున్న విడియోలు, నెమళ్ల అరుపులు అందరినీ కలచివేశాయి.
దాంతో హెచ్ సీ యూ భూముల వివాదం కాస్తా పర్యావరణ పరిరక్షణ అంశంగా మారి సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని పనులను వెంటనే ఆపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించింది. ఈ పరిణామాలన్నింటితో రాష్ట్ర ప్రభుత్వ వాదన వినేవారు, వినిపించుకునేవారు లేక ప్రభుత్వం డ్యామేజ్ లో పడింది.
దిద్దుబాటు చర్యలలో తెలంగాణ ప్రభుత్వం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలతో కళ్లు తెరిచింది. యూనివర్సిటీ భూముల వివాదం పరిష్కరించడానికి ముగ్గురు మంత్రులతో కమిటీ వేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి, శ్రీధర్ బాబు, పొంగులేటి తో కూడిన కమిటీ సమీక్ష జరిపి, విద్యార్థి సంఘాలు, యూనివర్శిటీ అధికారులు, ప్రజాసంఘాలతో చర్చలు ప్రారంభించి, అసలు వాస్తవాలను వారికి తెలియజెప్పే ప్రయత్నాలు మొదలు పెట్టింది. మరోవైపు సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి సమగ్ర నివేదిక కోరింది. విద్యార్థులు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఆ నాలుగు వందల ఎకరాలతో HCU కి సంబంధం లేదని, ఆ భూమి ప్రభుత్వానిదే అన్న విషయాన్ని ఆధారాలతో అందరి ముందు వుంచాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పర్యావరణానికి విఘాతం కలగకుండానే అభివృద్ది వుంటుందని చెబుతోంది.
ఏఐ ఫేక్ వీడియోలే కొంప ముంచాయా? సీఎం రేవంత్ సమీక్ష
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.కంచ గచ్చిబౌలి భూముల్లో 25 ఏళ్లలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారని, ఎన్నడూ వన్యప్రాణులు, పర్యావరణానికి సంబంధించిన వివాదాలు రాలేదని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఏఐ జనరేటెడ్ వీడియోలతో గందరగోళం సృష్టించారని అధికారులు పేర్కొన్నారు.ఈ సమీక్ష సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, టీజీఐఐసీ ఎండీ, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. ఆ 400 ఎకరాల భూముల్లో చెట్లను నరికివేయడంతో వన్యప్రాణులు చెల్లాచెదురయ్యాయంటూ కొందరు వీడియోలు సృష్టించడాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణించారు. దీనిపై విచారణకు ఆదేశించేలా కోర్టును కోరాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వం తదుపరి కార్యాచరణపై అధికారులను ఆదేశించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని అన్నారు. ఏఐ ఫేక్ కంటెంట్ ను పసిగట్టే ఫోరెన్సిక్, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ టూల్స్‌ను సమకూర్చుకోవాలని సూచించారు.
విద్యార్థులను రెచ్చగొట్టేలా కొందరు వెనకుండి కుట్ర చేశారని నిర్థారణకు వచ్చిన ప్రభుత్వం ఆ దిశగా కూడా విచారణ జరపాలని ఆదేశించింది.
రంగంలోకి పార్టీ అధిష్టానం
హెచ్ సీ యు , కంచె గచ్చిబౌలి భూముల వివాదంలో తెలంగాణ ప్రభుత్వ చర్యను సెలబ్రిటీలు ఖండించడం, సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా రంగంలో దిగింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ చేరుకుని , గచ్చిబౌలి భూముల వివాదంపై వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల కమిటీతోనూ చర్చించారు. వాస్తవాలను విపక్షాలు వక్రీకరించి కాంగ్రెస్ ప్రభుత్వం పై బురద జల్లుతున్నాయని, వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని మీనాక్షి నటరాజన్ తెలిపారు. వివాదానికి సామరస్య పరిష్కారం కోసం మంత్రుల కమిటీ ని వేశామని కమిటీ పరిష్కారం కనుగొంటుందన్నారు.
ఏదైనా వివాదాస్పద నాలుగు వందల ఎకరాల విషయంలో ముందుగా చర్చలు జరపకుండా, యూనివర్సిటీ అధికారులు, విద్యార్దులకు అవగాహన కల్పించకుండా ప్రభుత్వం కొంత దూకుడు గా వ్యవహరించడం సమస్యను పెద్దది చేసుకుందన్నది నిజం.. అందివచ్చిన అవకాశాన్ని కొందరు ఫేక్ ఫొటోలు, విడియోలతో తమకు అనుకూలంగా మార్చుకున్నారన్నా రన్నది అంతే నిజం. ఇప్పుడు ప్రభుత్వం అసలు నిజమిదంటూ మొత్తుకుంటున్నా వినేవారు లేరేమో... ఏఐ వీడియోల మజాకానా...