రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నుల నామకరణం ఎలా జరిగింది?
x
Rama by Niladri Paul (Source:Pinterest)

రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నుల నామకరణం ఎలా జరిగింది?

రామాయణంలో నిరుత్తరకాండ-39: రాముడు దేవుడెలా అయ్యాడు?

రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నుల నామకరణం గురించి బాలకాండ, 18వ సర్గలోని 20, 21 శ్లోకాలు ఇలా చెబుతాయి:

అతీత్యైకాదశాహం తు నామకర్మ తథాకరోత్

జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకయీసుతం

సౌమిత్రిం లక్ష్మణమితి శత్రుఘ్నమపరం తథా

వసిష్ఠః పరమప్రీతో నామాని కురుతే తదా

పదకొండు రోజులు గడిచిన తర్వాత నామకరణం జరిగింది. ఎంతో సంతోషభరితుడైన వసిష్ఠుడు జ్యేష్ఠుడికి రాముడనీ, కైకేయి కుమారుడికి భరతుడనీ, సుమిత్ర కుమారులలో ఒకరికి లక్ష్మణుడనీ, ఇంకొకరికి శత్రుఘ్నుడనీ పేరు పెట్టాడు.

ఈ శ్లోకాలు కూడా రాముడి తర్వాత భరతుడినే చెబుతున్నాయి. అదలా ఉంచితే, వ్యాఖ్యాతలలో చర్చను రేకెత్తించిన సందర్భాలలో ఈ నామకరణం కూడా ఒకటి. ఎలాగంటే, పుల్లెల శ్రీరామచంద్రుడు గారి వివరణ ప్రకారం, క్షత్రియులు పన్నెండు రోజులపాటు పురుడు పాటించాలని శ్రుతులూ, క్షత్రియుల పిల్లలకు పదమూడవ రోజున నామకరణం చేయాలని స్మృతులూ చెబుతున్నాయి. ఇదే సర్గలోని 14వ శ్లోకం ప్రకారం, భరతుడు పుట్టిన మరునాడు లక్ష్మణశత్రుఘ్నులు పుట్టారు. దానినిబట్టి, ప్రత్యేకంగా చెప్పకపోయినా రాముడు, భరతుడు ఒకే రోజున పుట్టారనుకోవాలి. కనుక పదమూడవ రోజున నామకరణం జరగాలన్న నియమం ప్రకారం రామ, భరతులకు ఒక రోజున, లక్ష్మణశత్రుఘ్నులకు ఆ మరునాడు నామకరణం జరగాల్సి ఉంటుంది.

అయితే, నలుగురికీ పదకొండు రోజులు గడిచిన తర్వాత నామకరణం జరిగినట్టు మాత్రమే పై శ్లోకాలు చెప్పడంతో వ్యాఖ్యాతలకు పెద్ద సమస్య వచ్చిపడింది. పదమూడవ రోజున జరపాలన్న స్మృతుల నిబంధననే దృష్టిలో పెట్టుకున్నప్పుడు, రామభరతులకు నామకరణం జరపాల్సిన పదమూడవ రోజు, లక్ష్మణశత్రుఘ్నులకు పన్నెండవరోజు మాత్రమే అవుతుంది. పోనీ, రామభరతులకు పదమూడవ రోజునే నామకరణం జరిపి, ఆ మరునాడు లక్ష్మణశత్రుఘ్నులకు జరపవచ్చునా అనుకుంటే; పురిటిదినాలపై ఉన్న నిషేధం అడ్డువస్తుంది; అలాగని, నలుగురికీ ఒకేరోజున నామకరణం జరపవచ్చునా అనుకుంటే, క్షత్రియుల పిల్లలకు పదమూడవ రోజునే జరపాలన్న నిబంధన- రామభరతుల విషయంలో అడ్డువస్తుంది. దాంతో ఎగదీస్తే బ్రహ్మహత్య, దిగదీస్తే గోహత్య అన్న తంతుగా ఇది తయారైందన్నమాట.

దీనిపై పుల్లెలవారు వ్యాఖ్యానిస్తూ, స్వయంగా స్మృతికర్త అయిన వసిష్ఠుడే పదకొండు రోజుల తర్వాత నామకరణం చేశాడని చెప్పినప్పుడు మనకిలాంటి ప్రశ్నలెందుకంటారు; అదీగాక, ఆ రోజుల్లో జాతకర్మకు పురిటిదినాలన్న నిషేధం లేనట్టే, నామకరణానికి కూడా లేకపోవచ్చనీ; మన భావాలను, సంప్రదాయాలను, ఆచారాలను ప్రాచీనగ్రంథాలలో చేర్చి వ్యాఖ్యానించడం సమంజసం కాదనీ; వాక్యార్థాన్ని యథాతథంగా గ్రహించి ఇది ఆనాటి పరిస్థితి కదా అని సరిపెట్టుకోవాలనీ హితవు చెబుతారు.

పుల్లెలవారూ, ఆయన ఉటంకిస్తూవచ్చిన ఇతర వ్యాఖ్యాతల తీరు గురించి ఇక్కడ మరోసారి చెప్పుకోవడం అవసరమనిపిస్తోంది. కథానిర్మాణం రీత్యా వివరణ అవసరమైన సందర్భాలలో వారు మౌనం వహించడం గురించి ఇంతకుముందు అనేక ఉదాహరణలు చెప్పుకున్నాం. ప్రస్తుత సందర్భానికే వస్తే, రామభరతాదుల జననక్రమాన్ని మార్చి చెప్పుకోవడంపై కానీ, నలుగురు సోదరులనూ రెండు జంటలుగా విడదీయడం వెనుక కనిపించే రాజకీయసంబంధమైన భావిసూచనపై కానీ పుల్లెలవారి దృష్టి ప్రసరించలేదని అనుకున్నాం. అలాంటిది, కథానిర్మాణం రీత్యా అంత ముఖ్యమైనవి కావనిపించే విషయాలను మాత్రం వ్యాఖ్యాతలు ఎక్కువగా పట్టించుకోవడం విచిత్రంగానే అనిపిస్తుంది. రామాదుల పుట్టుకకు సంబంధించిన ప్రస్తుతసందర్భంలోనే, దశరథుని భార్యల్లో ఎవరెవరికి ఎంతెంత పాయసభాగం లభించింది, విష్ణువు అంశ లేదా భాగం నలుగురు సోదరులకూ ఎంతెంత సంక్రమించిందన్నవి వారికి చర్చనీయాలుగా మారడం గురించి చెప్పుకున్నాం. అలాంటిదే నామకరణం గురించిన మీమాంస కూడా.

ఇంకో విచిత్రం గమనించండి… మూలంలోని వాక్యార్థాన్ని యథాతథంగా గ్రహించి సరిపెట్టుకోవాలనీ, ప్రశ్నలెందుకనీ పుల్లెలవారు అనడంలో ఏకంగా ప్రశ్ననే నిషేధించడం కనిపిస్తుంది. అలా నిషేధించడానికి మూలంపట్ల భక్తి, విధేయతలనే తప్ప మరో కారణాన్ని ఊహించలేం. అయితే, ఆ భక్తి, విధేయతలను ప్రతిచోటా కనబరిచారా అంటే అదీ లేదు; మూలాతిక్రమణకు, లేదా మూలాన్ని సవరించడానికి వ్యాఖ్యాతలు పాల్పడిన సందర్భాలను కూడా ఇంతకుముందు ఉదహరించుకున్నాం. ప్రస్తుతసందర్భంలోనే, రాముని విష్ణువు యొక్క పూర్ణావతారంగా చెప్పడానికి పుల్లెలవారు ఎలాంటి కసరత్తు చేశారో గమనించాం.

నిజానికి ఇతిహాస, పురాణకథలు చిరకాలంపాటు మౌఖికసంప్రదాయంలో ఉండి లిఖితరూపం ధరించాయి కనుక, అనేక సంవత్సరాలపాటు జరిగిన ఆ ప్రక్రియలో అనేకమంది చేయి పడింది కనుక; వాటి కూర్పులో ఖాళీలు ఏర్పడి వస్త్వైక్యత, భావైక్యత లోపించడం, వివరణ రూపంలో ఆ ఖాళీలను పూరించవలసిన అవసరం తలెత్తడం సహజమే. ప్రశ్నలనైనా, సందేహాలనైనా లేవనెత్తడాన్ని అందులో భాగంగానే చూడాలి తప్ప మూలంపట్ల అవిధేయతగా కాదు. అంతిమంగా ఈ కసరత్తు అంతా వస్తువులోనూ, భావంలోనూ మరింత స్పష్టతను, కథాంశాల కూర్పులో తగిన సమన్వయాన్ని తేవడానికే సాయపడుతుంది. వెనకటి వ్యాఖ్యాతల సంగతలా ఉంచి, విద్యావిషయకంగా ఆధునికక్రమశిక్షణకు చెందిన పుల్లెలవారు కూడా ఈ కోణాన్ని గమనించకపోవడం ఆశ్చర్యమే కలిగిస్తుంది.

నలుగురు సోదరులకూ పెట్టిన పేర్లపై కూడా పుల్లెలవారు వివరణ ఇచ్చారు. దాని ప్రకారం, ‘రాము’డంటే తన సద్గుణాల ద్వారా అందరినీ సంతోషపెట్టేవాడు(రమంతే సర్వే జనాః గుణైః అస్మిన్ ఇతి రామః); ‘లక్ష్మణు’డంటే, సంపద కలిగినవాడు(లక్ష్మీః అస్య అస్తీతి లక్ష్మణః); ‘భరతు’డంటే, రాజ్యాన్ని భరించేవాడు(బిభర్తీతి భరతః); ‘శత్రుఘ్నుడంటే, శత్రువులను చంపేవాడు(శత్రూన్ హంతీతి శత్రుఘ్నః).

పేర్లకు ఇచ్చిన ఈ వివరణ కూడా ప్రశ్నలకు, చర్చకు ఎలా అవకాశమిస్తోందో చూడండి! రాముడి పేరలా ఉంచి, మిగతా ముగ్గురి పేర్లకూ ఉన్న అర్థాలను వివరణకర్త యాంత్రికంగా వివరించారు తప్ప, అవి వారికి పూర్తిగానూ అర్థవంతంగానూ వర్తిస్తున్నాయా లేదా అన్నది చూసుకోలేదు. ఉదాహరణకు, లక్ష్మణుని పాత్రచిత్రణనే దృష్టిలో పెట్టుకుంటే ‘సంపద కలవా’డనే అర్థమున్న ఆ పేరు అతనికి ఎంతమాత్రం అతకదు; అతను మొదటినుంచి చివరివరకూ రాముడికి నీడలా, సేవకుడిలా ఉండిపోయాడు తప్ప సొంతంగా సంపద ఉన్నవాడిగా ఎక్కడా కనబడడు; విశేషంగా ఇతరుల సంపదను జయించి తెచ్చి రాముడి సంపదను పెంచినట్టూ కనిపించడు.

అలాగే, ‘రాజ్యాన్ని భరించే’వాడనే అర్థం కలిగిన భరతుని పేరు కూడా! రాముడు అరణ్యవాసం చేసిన పద్నాలుగేళ్లూ అతడు రాజ్యభారాన్ని వహించినమాట నిజమే కానీ, రాముడు రాజయ్యాక అతను కూడా మిగతా సోదరుల్లో ఒకడిగానే ఉండిపోయాడు. అదీగాక, రాముడు కూడా రాజ్యభారం వహించినవాడే కనుక ప్రత్యేకించి భరతుడి విషయంలో అది ఎలాంటి విశేషార్థాన్నీ ఇవ్వదు. శత్రుఘ్నుని విషయానికి వస్తే, ‘శత్రువులను చంపేవా’డనే అర్థం కలిగిన ఆ పేరూ ప్రత్యేకంగా అతనొక్కడికే వర్తింపజేయగలిగినదీ కాదు; భరతుని సంగతలా ఉంచితే, శత్రువులను చంపడంలో రాముడికీ, లక్ష్మణుడికీ లభించినంత ప్రసిద్ధి శత్రుఘ్నుడికి లేదు.

ఈవిధంగా చూసినప్పుడు, ఈ పేర్లకు ఏదో విశేషార్థముందన్న భావన కలిగిస్తూ ప్రత్యేకంగా వివరించడం ద్వారా వివరణకర్త సాధించిన అదనపు ప్రయోజనమేదీ కనబడదు. నిజానికి ఈ పేర్లు పెట్టడంలో ప్రత్యేకమైన ఉద్దేశం ఏదీ ఉండి ఉండకపోవచ్చు; వారు పెరిగి పెద్దైన తర్వాత చాటుకున్న గుణగణాలను, వ్యవహారసరళిని, లేదా చేసిన పనులను బట్టి ఆ పేర్లకు ఒక సార్థకతను ఆపాదించడానికి వివరణకర్త ప్రయత్నించారనుకోవాలి. కాకపోతే, పైన చెప్పుకున్నట్టు, అది కూడా అంత అర్థవంతంగా జరగలేదు.

నిశితంగా చూసినప్పుడు, సోదరులు నలుగురూ విష్ణువు అంశతో పుట్టారని చెప్పడం కూడా పై తరహా ఆపాదనలానే కనిపిస్తుంది. మిగిలిన ముగ్గురు సోదరులతో పోల్చితే రాముడు పరాక్రమంలోనూ, జనాభిమానాన్ని పొందడంలోనూ ఉన్నతుడిగా కనిపించడమే కాక, కథానాయకుడు కూడా కనుక; శివధనుర్భంగం చేశాడు కనుక; లోకకంటకులుగా రామాయణకథకుడు అభివర్ణించిన రావణుని, ఇతర రాక్షసులను సంహరించాడు కనుక విష్ణువు అవతారంగా చెప్పడం కొంతవరకు అర్థవంతమనుకుందాం. ‘కొంతవరకు’ అని ఎందుకు అనాల్సివచ్చిందంటే, పరాక్రమాన్ని చాటుకున్నవారు, జనాభిమానాన్ని పొందినవారు ఇతిహాసపురాణాల్లోనే కాక, చరిత్రలోనూ చాలామందే ఉన్నారు; సంప్రదాయం వాళ్ళందరినీ అవతారపురుషులుగా గుర్తించలేదు. దానికి భిన్నంగా రాముని మాత్రమే అవతారపురుషునిగా గుర్తించడం వెనుక ఉద్దేశపూర్వకమైన ఆపాదన కనిపిస్తుంది. పూర్తిగా కాకుండా, కొంతవరకు అది అర్థవంతమవుతుందనడానికి అదీ కారణం.

ఇక మిగతా ముగ్గురి విషయానికి వస్తే, వారిని విష్ణువు అంశగా చెప్పడానికి రాముడి విషయంలో ఉన్నపాటి సమర్థన కూడా లేదు. దైవాంశసంభూతులనడానికి వారు చేసిన మానవాతీత మహత్కార్యాలు కానీ, లోకోత్తరపరాక్రమాన్ని చాటుకున్న ఘటనలు కానీ ఏమీలేవు. సాధారణ రాకుమారుల్లానే వారూ వ్యవహరించారు. కనుక, ఇది కూడా నూటికి నూరుపాళ్లూ ఉద్దేశపూర్వకంగా చేసిన ఆపాదనే అవుతుంది.

అయితే, ఈ ఆపాదనకు ఏదో ఒక సమర్థన ఎప్పుడు సాధ్యమవుతుందంటే; దానిని కథ, లేదా కావ్యనిర్మాణకోణంనుంచి చూసి అర్థం చేసుకున్నప్పుడు! లౌకికమైన కథకు, లేదా పాత్రలకు దైవసంబంధాన్ని ఆపాదించి అలౌకికస్థాయికి తీసుకు వెళ్ళడమనేది ఇతిహాస, పురాణాలు అనుసరించిన శైలి. మన దగ్గరే కాక, ఇతర ప్రాచీనసంస్కృతీ, నాగరికతలకు చెందిన చోట్ల కూడా ఇతిహాస, పురాణకథలు, కావ్యాలు ఇలాంటి శైలినే అనుసరించాయి. ఇంతకుముందు ఉదహరించుకున్న, బాబిలోనియాకు చెందిన ‘గిల్గమేశ్ ఇతిహాసం’లోనూ, సుమేరు పురాణగాథ అయిన ‘ఎంకి-అతను ఏర్పరచిన ప్రపంచవ్యవస్థ’ (Enki and the World Order)లోనూ లౌకికమైన ఇతివృత్తాన్ని దైవపరంగా ఎలా అన్వయించారో చూశాం. మన దగ్గర వ్యాసమహాభారతంలోనూ, గ్రీకుకవి హోమర్ చెప్పిన ‘ఇలియడ్’, ‘ఒడిసీ’లలోనూ మనుషులు, దేవతలు విడివిడిగా ఉంటూనే కథలో పాత్రలు కావడం కనిపిస్తుంది.

మౌలికంగా రామాయణం కూడా ఇలాంటి చట్రాన్నే అనుసరించింది. అయితే ఒక తేడా ఉంది; అదేమిటంటే, రామాయణకథ చిరకాలంపాటు మౌఖికంగా ప్రచారంలో ఉండి ఆ తర్వాత గ్రంథరూపం ధరించింది కనుక, ఈ మధ్యలో ఎన్నో సంవత్సరాల అంతరం ఉంది కనుక, అప్పటికి మారిన పరిస్థితులు, ప్రభావాలు, ప్రయోజనాల దృష్ట్యా కథనంలో కొత్త అంశాలు చోటుచేసుకోవడం ఎంతైనా సంభవమేననుకున్నప్పుడు; రాముణ్ణి సాక్షాత్తు విష్ణువు అవతారంగా చెప్పడం వాటిలో ఒకటిగా భావించడానికి అవకాశం లభిస్తుంది. అంటే; దేవతలు, మనుషులు విడివిడిగా ఉంటూనే పాత్రలుగా మారినట్టు పైన చెప్పుకున్న బాబిలోనియా, సుమేరు, గ్రీకు తదితర ఇతిహాస, పురాణకథలకు భిన్నంగా రామాయణంలో రాముడనే మానవుడినే నేరుగా దేవుణ్ణి చేశారన్నమాట!

మానవమాత్రుడైన రాజును దేవుడిగా, లేదా దేవుడి ప్రతినిధిగా మార్చే ఈ ప్రక్రియకు సాక్ష్యాలు ఇతర ప్రాచీనసంస్కృతీ, నాగరికతలలో మరింత స్పష్టంగా కనిపిస్తాయి. ఉదాహరణకు, క్రీ.పూ. 3000 తర్వాత పితృస్వామికవ్యవస్థకు చెంది, అర్ధసంచారదశలో ఉన్న సెమిటిక్కులు మెసపొటేమియాను ఆక్రమించుకున్న దరిమిలా క్రీ.పూ.2300కు చెందిన సారగాన్, క్రీ.పూ.1700 కు చెందిన హమ్మురాబి రాజులుగా అతిప్రసిద్ధులై చరిత్రకెక్కారు. ‘ది మాస్క్స్ ఆఫ్ గాడ్’ (The Masks of God)పేరుతో బృహద్ సంపుటాలను వెలువరించిన ప్రముఖ పౌరాణికపరిశోధకుడు జోఎఫ్ కాంబెల్(Joseph Campbell)ప్రకారం, రాజును దేవుడికి ప్రతిరూపంగా, లేదా దేవుడిగా చెప్పుకోవడం సారగాన్ తో ప్రారంభమైంది. రాచరికాన్ని పూజారుల ఆధిపత్యం నుంచి, రాజ్యాన్ని మతాధిపత్యంనుంచి తప్పించి ఆనువంశికరాజకీయవ్యవస్థను స్థాపించడంలో భాగంగా ఇది జరిగింది.

హమ్మురాబి విషయానికి వస్తే, మన దగ్గర మనువులా శిక్షాస్మృతిని రూపొందించిన రాజుగా ఇతని గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం. అందులో అతనే చెప్పుకున్న ప్రకారం, ఆకాశాన్ని ఏలే ‘అను’ అనే దేవుడూ, స్వర్గాన్ని, భూమినీ ఏలే ‘బెల్’ అనే దేవుడూ బాబిలోనియా నగరదేవుడైన మర్దుక్ కు ప్రజలందరిమీదా సార్వభౌమత్వాన్ని అప్పగించారు. ఆ తర్వాత హమ్మురాబిని పిలిచి, భూమి మీద ధార్మికమైన పాలనను చేపట్టమనీ, అధర్మాన్ని, చెడును తుడిచిపెట్టమనీ, బలవంతుల దాష్టీకంనుంచి బలహీనులను కాపాడమనీ, మానవజాతిలో సూర్యుడిలా ప్రకాశిస్తూ భూమి అంతటా వెలుగు నింపమనీ ఆదేశిస్తారు. తూర్పుదేశాలలో ఏర్పడిన నిరంకుశరాజ్యాల నమూనాకు ఈ మాటలు అద్దంపడతాయని కాంబెల్ అంటాడు.

విశేషమేమిటంటే, భూమి మీద రాజును సృష్టించిన ఈ నమూనాలోనే దేవతలకు కూడా ఒక రాజును కల్పించారు. మన దగ్గర ఇంద్రుని దేవతల రాజుగా చెబుతాం. ఇప్పటికీ ఆలయాలలో దేవుడికి చేసే ఉపచారాలను ‘రాజోపచారా’లనే అంటాం. అదలా ఉంచితే, దేవుళ్లే తనకు పరిపాలనను అప్పగించారని హమ్మురాబి చెప్పుకోవడమే చూడండి, ఆవిధంగా తనను దేవుళ్ళ ప్రతినిధిగా చెప్పుకున్నాడన్నమాట. దేవుళ్ళ ప్రతినిధి కావడానికీ, దేవుడిగా మారడానికీ పెద్ద అంతరం లేదు.

రామాయణంలో కూడా విష్ణువు అంశతో పుట్టిన రాముడు చివరికి దేవుడే అయ్యాడు. ఇంకో విశేషాన్నికూడా గమనించండి...సారగాన్, హమ్మురాబీలను ‘సౌర’వీరులంటాడు జోసెఫ్ కాంబెల్. మానవజాతిలో సూర్యుడిలా ప్రకాశిస్తూ భూమి అంతటా వెలుగు నింపమని దేవుళ్ళు హమ్మురాబీని ఆదేశిస్తారు. హోమర్ చెప్పిన ‘ఒడిసీ’ కావ్యనాయకుడు ఒడీసీయెస్ ‘సౌరద్వీపాన్ని’ సందర్శించివస్తాడు. అలాగే, డరియస్, గ్జెరక్సెస్ తదితర పర్షియన్ రాజులు కూడా సూర్యారాధకులు.

వీళ్ళందరితో రాముడికి ఎంత అద్భుతంగా సామ్యం కుదురుతోందో చూడండి. అతను కూడా ‘సౌర’ వీరుడే! అతని వంశమే సూర్యవంశం!!

మిగతా విశేషాలు తర్వాత...

Read More
Next Story