
ఏది చరిత్ర , ఇది సచ్చరిత్ర?
ఏది నిజం, ఏది అబద్దం, ఏది సత్యం, ఏది అసత్యం అన్నది మనం కనిపెట్టలేనంతగా ప్రభువులు, ప్రభు భక్తులు చేసే మాయలో పడి కొట్టుకుంటున్నాం.
-ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ
మనలో చాలా మంది పుస్తకాల్లో చదువుకుని,పరీక్షా పత్రాల్లో జవాబులు రాసి మార్కులు సంపాదించిన చరిత్ర పాఠాలు అవాస్తవమని, అసత్యమని ప్రచారం జరుగుతున్న ఈ రోజుల్లో పైన వేసిన ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మొదటిగా నాకు వచ్చిన ప్రశ్న ప్రాచీన భారతీయ చరిత్రకారులు ఎవరు అని. శ్రమ పడకుండా, గూగుల్ సౌలభ్యంతో కొంత సమాచారం సేకరించాను. 610 మధ్య నుంచి ఇప్పుడు జీవించి ఉన్న భారతీయ చరిత్రకారుల దాకా, తీసుకుంటే రోమిలా థాపర్, ఇర్ఫాన్ హబీబ్ మన మధ్య ఉన్నారు. మరణించిన అత్యంత ప్రసిద్ధ భారతీయ చరిత్రకారులలో పులకేషిన్ II, అబ్దుల్-ఖాదిర్ బదాయుని, ఆర్. హెచ్. టావ్నీ ఉన్నారు.
వీరిలో రొమీల గారి మీద కాంగ్రెస్ మనిషి అని ముద్ర పడింది. ఇర్ఫాన్ గారు వారి మతంతో పాటు వామపక్ష భావజాలం గలవారు. గతించిన వారిలో ముస్లిం కానివారు, పాశ్చాత్యులు కాని వారు పులికేసి మాత్రమే కనిపిస్తున్నారు.
దేనినీ నమ్మకపోవడం, ఎవరినీ నమ్మకపోవటం ఒక సంక్షోభం ( Crisis) అని చెప్పాలి. పాలకులు అలాంటి క్రైసిస్ ని వ్యాప్తి చేయడానికి ఉత్సాహపడతారు. ఎందుకంటే తమ నాయకుడు చెప్పినదే నిజం, నమ్మినదే చరిత్ర అని నమ్మజేయడం కోసం.
భారతీయులకు చారిత్రక స్పృహ, చారిత్రక దృష్టి అంతంత మాత్రమేనని పెద్దగా ఎలుగెత్తి చాటక్కర లేదనుకుంటాను. చరిత్రని తిరగరాసే ప్రయత్నంలో ఏది నిఖార్సయిన చరిత్ర, ఏది హోలీ రంగులద్దుకున్న చరిత్ర అని ఎలా, ఎవరు నిర్ణయించగలరు ? నిన్న మొన్న జరిగిన సంఘటనలే చూస్తే, జరిగిన సంఘటనల విష
యంలో "చరిత్రకారులలో" ఏకాభిప్రాయం కుదరదు. బాబ్రీ మసీదు కూల్చివేతకు కారణం ఎవరు అని అన్వేషిస్తే మనం చూసిన వెబ్సైట్ బట్టి, చదివిన పుస్తకాన్ని బట్టి సమాధానం మారుతూ ఉంటుంది. మనకి ఇష్టమైన రంగుని బట్టి మనం ఏది " నిజం" నిర్ధారించుకుంటున్నాం. నిజం అఖండంగా గా ఉండాలి కదా!??? కానీ, కొన్ని సంవత్సరాల క్రితం అరాచకాన్ని సమర్థిం చడం కోసం కొందరు మాటకార్లు " ప్రత్యామ్నాయ నిజాలు" అనే మాట (phrase) ని కనిపెట్టారు. ఏది నిజం, ఏది అబద్దం, ఏది సత్యం, ఏది అసత్యం అన్నది మనం కనిపెట్టలేనంతగా ప్రభువులు, ప్రభు భక్తులు చేసే మాయలో పడి కొట్టుకుంటున్నాం.
చరిత్రకారులు ఆధారపడే మాతృక లో ఎక్కువ భాగం ఆనాటి వార్తాపత్రికలు, ఒకప్పటి శాసనాలు. అవి కాకుండా, నేరస్తులకు వేసే శిక్షలు, వారు చేసిన నేరాలూ కూడా ఉంటాయట! "ఫలానా కాలం లో "ఏం పీకుతావురా" అని ప్రత్యర్థులు ఒకరినొకరు బెదిరించుకునేవారట అని మనం భాష్యత్ చరిత్రలో చదవవచ్చు. నచ్చనివారిని చెరసాల పాలుచేసే సనాతన సంప్రదాయం ద్వాపరయుగం నుండి,కలియుగం నాల్గవపాదం వరకూ కొనసాగిందని భవిష్యత్ లో చరిత్ర పాఠాలలో చదువుకోవచ్చు లేక, ధర్మరక్షణ కోసం దేశాద్రోహులని పాలకులు కట్టడి చేసేవారని చదువుకోవచ్చు
దురదృష్ట వశాత్తూ ఈనాటి వార్తా పత్రికా రంగం సత్యాన్ని నిలబెట్టే దిశగా ప్రయత్నించి మనగలిగే దశలో లేదు. కొని చదివే వారు తక్కువ, తమకు నచ్చిన వార్తలు వేసే పత్రికే చదివి "ఖుద్ కుషీ" అయ్యే వారే ఎక్కువ. రంగులేని వార్తా పత్రిక, ప్రసార మాధ్యమం లేదన్నది ఎంత సత్యమో నమో లో న లేదన్నది అంతే నిక్కం. పుట్టగొడుగుల్లాంటి అంతర్జాల వార్తా పత్రికలు వార్త కి విలువ లేకుండా చేస్తున్నాయి. అలాంటివి ఆధారంగా చేసుకుని చరిత్ర రాస్తే ?. ఊహించడం కష్టం; కానీ అలాంటి చరిత్ర భారాన్ని మనమీదకి మోపితే భయంతోనో, భక్తితోనో ఇంకేదో కారణంతోనే మోస్తూ బతుకీడుస్తున్నాం.