
తెలంగాణ రాష్ట్ర విత్తన చట్టం ఎలా ఉండాలి ?
రైతుల విత్తన హక్కులను రక్షించడానికి ప్రత్యేక చట్టం కావాలంటున్నారు‘రైతు స్వరాజ్య వేదిక’ కన్నెగంటి రవి
కల్తీ విత్తనాలతో పంటల నష్ట పోయిన రైతుల దీన గాధలను మనం అనేక సార్లు వినే ఉంటాం. ప్రైవేట్ కంపనీలు విచ్చలవిడిగా విత్తన ధరలను పెంచుకుంటూ పోవడాన్ని కూడా మనం చూస్తుంటాం. రైతులతో, విత్తనానాలను ఉత్పత్తి చేయించే కంపనీలు , విత్తనోత్పత్తి చేసే రైతులను ఎలా దోచుకుంటున్నాయో, ప్రతి సంవత్సరం కల్తీ విత్తనాల వల్ల లక్షలాది ఎకరాలలో పంటలు నష్టపోవడం కూడా మనం చూస్తుంటాం.
ఇప్పటి వరకూ అమలులో ఉన్న విత్తన చట్టాలు, ప్రభుత్వ రంగంలో విత్తనాల ఉత్పత్తి, పంపిణీ జరిగిన కాలంలో రూపొందాయి. కానీ గత మూడు దశాబ్ధాలలో విత్తనోత్పత్తి , విత్తన సరఫరా, అమ్మకాల రంగంలో ప్రైవేట్ కంపనీలు వందలాదిగా వచ్చాయి. విదేశీ, స్వదేశీ బహుళ జాతి కంపనీలు ఈ రంగంలోకి ప్రవేశించాయి. ఈ ప్రైవేట్ కంపనీలకు తెలంగాణ (హైదరాబాద్ ) రాష్ట్రం ముఖ్య కేంద్రంగా ఉంది. దేశానికి కావలసిన అనేక పంటల విత్తనాలను మన రాష్ట్రం ఉత్పత్తి చేస్తోంది. 2014 లో అధికారం లోకి వచ్చిన భారత రాష్ట్ర సమితి పార్టీ (BRS) తెలంగాణ రాష్ట్రాన్ని సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా గా మారుస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చింది.
కానీ పదేళ్ళ తన పాలనా కాలంలో అటు వైపు అడుగులు కూడా వేయలేదు. పైగా ఈ కాలంలో ప్రభుత్వ రంగం లో ఉన్న తెలంగాణ సీడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పూర్తిగా బాల్కహీన పడింది. అప్పుల ఊబిలో కూరుకుపోయింది. గత ప్రభుత్వ కాలంలోనే గద్వాల జిల్లా బీటీ పత్తి విత్తన రైతులు, భద్రాచలం ప్రాంత మొక్క జొన్న విత్తన రైతులు ఎంతో దోపిడీకి గురయ్యారు. ప్రభుత్వ విత్తన క్షేత్రాలలో విత్తనోత్పత్తి పూర్తిగా తగ్గిపోయింది. యూనివర్సిటీలు అభివృద్ధి చేసిన ఫౌండేషన్ విత్తనాలు రైతులకు ఉపయోగ పడక పోగా ప్రైవేట్ కంపనీల పరమయ్యాయి. అనేక మంది రైతులు స్వయంగా ఎంపిక పద్ధతిలో అభివృద్ధి చేసిన విత్తన రకాలకు రక్షణ లేకుండా పోయింది. అన్ని పంటల లోనూ హైబ్రిడ్ విత్తనాలకు విచక్షణా రహితంగా ప్రోత్సాహం లభించింది. ఈ కాలంలో కల్తీ విత్తనాలకు అడ్డుకట్ట పడక పోగా, అనేక కంపనీలు విత్తనాల విషయంలో రైతులను మోసం చేసినా, వారిపై చర్యలు లేకుండా పోయాయి. రైతుల ప్రయోజనాల రక్షణ కంటే, విదేశీ బహుళ జాతి, ఇతర ప్రైవేట్ కంపనీల ప్రయోజనాల కోసం శాస్త్రవేత్తలు, అధికారులు , మంత్రులు పని చేయడం కళ్ళారా చూశాం.
దేశ వ్యాపితంగా కల్తీ విత్తనాలు అరికట్టాలనీ, విత్తన ధరలను అదుపు చేయాలనీ రైతులు, రైతు సంఘాలు చేసిన డిమాండ్ తో , 2010 లో అప్పటి UPA కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాపితంగా అమలు చేసే లక్ష్యంతో ఒక విత్తన చట్టానికి రూపకల్పన చేసింది. అప్పటి వ్యవసాయ శాఖా మంత్రి శరద్ పవార్ నేతృత్వం లో వచ్చిన ఈ విత్తన బిల్లు, రైతుల కోసం కాకుండా, ప్రైవేట్ కంపనీల కోసం, ముఖ్యంగా బహుళ జాతి విత్తన కంపనీ మోన్ శాంటో లాంటి బడా విత్తన కంపనీల కోసం ఈ బిల్లు రూపొందించింది. ఈ బిల్లును దేశ వ్యాపితంగా రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘాలు, ఆనాటి కిసాన్ కాంగ్రెస్ నాయకులు, ఇవాళ్టి రాష్ట్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ అధ్యక్షులు ఎం. కోదండ రెడ్డి నేతృత్వం లో డిల్లీ వెళ్ళి, కేంద్రం తెచ్చే విత్తన బిల్లుకు వ్యతిరేకంగా గళం వినిపించాయి.
ఆ రోజుల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రిగా ఉన్న కన్నా లక్ష్మీ నారాయణ గారిని కలసి రాష్ట్ర స్థాయిలో విత్తన చట్టం తయారు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. ఇందుకు అంగీకరించి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయి విత్తన చట్టం తేవడానికి సిద్దపడింది. ఈ విత్తన బిల్లు రూపకల్పనలో రైతు స్వరాజ్య వేదిక సహా ఆనాటి రైతు సంఘాల నాయకులందరూ భాగస్వాములయ్యారు. కానీ కేంద్ర ప్రభుత్వం అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి, రాష్ట్ర స్థాయిలో చట్టం రాకుండా నిలిపేసింది. పైగా రైతులకు అనుకూలంగా 2010 డ్రాఫ్ట్ లో నియమాలను మార్చి, కేంద్ర చట్టం రూపొందించలేదు. అప్పటి నుండీ గత పదిహేనేళ్లుగా రాష్ట్రంలో, దేశంలో సరైన విత్తన చట్టమే లేకుండా పోయింది. ఫలితంగా పంటలను సాగు చేసే రైతులు,విత్తనాలను ఉత్పత్తి చేసే రైతులు కూడా ప్రైవేట్ విత్తన కంపనీల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు.
జన్యు మార్పిడి పత్తి 2002 నుండీ రాష్ట్రంలో సాగవుతున్నా, ఆ పత్తి రకం కూడా రాష్ట్ర పత్తి రైతుల సమస్యలను పరిష్కరించలేకపోయింది. పైగా ప్రభుత్వాల నుండీ ఎటువంటి చట్టబద్ధ అనుమతి లేకపోయినా, హెర్బిసైడ్ టాలరెంట్ (HT) పత్తి కూడా రాష్ట్రం లో సాగవుతున్నట్లు అనేక సార్లు బయట పడింది. పైగా కొన్ని పంటల జన్యు మార్పిడి విత్తనాల ఫీల్డ్ ట్రయిల్స్ కూడా రాష్ట్రంలో జరుగుతున్నట్లు అనేక సార్లు రుజువైంది.
ఈ నేపధ్యంలో తెలంగాణ లో పంటలను సాగు చేసే రైతుల, ఈ పంటల కోసం విత్తనాలను ఉత్పత్తి చేసే రైతుల విత్తన హక్కులను రక్షించడానికి తెలంగాణ రాష్ట్ర విత్తన చట్టాన్ని రూపొందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ చట్టం రూపకల్పనకు ఒక కమిటీని వేసింది. రాష్ట్ర సీడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఎస్. అన్వేష్ రెడ్డి ఛైర్మన్ గా ఉన్న ఈ కమిటీలో వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ జేవీ రామాంజనేయులు, భూ చట్టాల నిపుణులు సునీల్ కుమార్ , పర్యావరణ వేత్త డాక్టర్ దొంతి నరసింహా రెడ్డి, ఇతరులు ఉన్నారు. ఈ కమిటీ జిల్లాల స్థాయిలో విత్తన చట్టం పై రైతుల నుండీ అభిప్రాయాలను సేకరిస్తున్నది.
ఈ బిల్లు సమగ్రంగా రూపొందాలని, వచ్చే అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం విత్తన చట్టాన్నిఆమోదించాలని కోరుకుంటూ , కొన్ని సూచనలు చర్చకు పెడుతున్నాము.
బిల్లు లక్ష్యం ఇలా ఉండాలి :
1. ఈ బిల్లు లక్ష్యం రాష్ట్ర రైతుల ప్రయోజనాలను, పర్యావరణాన్ని రక్షించేదిగా ఉండాలి. రైతుల, విత్తన రైతుల హక్కులను రక్షించడానికి, విత్తన ధరలను నియంత్రించడానికి, , విత్తన నాణ్యతకు, నిరంతర విత్తన లభ్యతకు హామీ ఇవ్వడానికి, రైతులకు వాటిల్లే విత్తన నష్టానికి పరిహారాన్ని నిర్ధారించడానికి, ప్రైవేట్ విత్తన కంపెనీల కోసం విత్తనాలను ఉత్పత్తి చేస్తున్న విత్తన రైతులను రక్షించడానికి, తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విత్తన కంపెనీల దోపిడీని,మోసాలను, రాష్ట్రంలో జన్యు మార్పిడి, ఇతర HT పంటల సాగును , విత్తనాల సాగును నియంత్రించడానికి ఈ చట్టం ఉపయోగపడాలి.
2. విత్తన రంగంలో ప్రభుత్వ రంగం పాత్రను బలోపేతం చేయడానికి , వివిధ పంటల విత్తనోత్పత్తిలో, సరఫరా లో రైతు సహకార సంఘాల, రైతు ఉత్పత్తి దారుల కంపనీల భాగస్వామ్యాన్ని పెంచడానికి ఈ చట్టం ఉపయోగపడాలి. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి వర్తించేలా తెలంగాణ రైతులు మరియు విత్తన ఉత్పాదకుల హక్కుల రక్షణ చట్టం, 2025 రూపొందాలి.
3. ఈ చట్టం ప్రకారం ఇచ్చే నిర్వచనం లో భూమిపై పట్టా హక్కులు కలిగిన రైతులతో పాటు, కౌలు రైతులను, పోడు రైతులను కూడా చేర్చాలి.
4. విత్తన ఉత్పత్తి దారులు అంటే పంటల సాగు కోసం విత్తనాలను ఉత్పత్తి చేసే రైతు లేదా సంస్థ గా స్పష్టం చేయాలి. మార్కెటింగ్ కోసం విత్తనాలను ఉత్పత్తి చేయించే ప్రైవేట్ విత్తన కంపెనీల యజమానులు, వారి తరపున వ్యవహరించే ఆర్గనైజర్లు కూడా ఈ చట్టం పరిధి లోకి రావాలి.
5. ప్రైవేట్ విత్తన కంపెనీ అంటే విత్తనాల ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, అమ్మకంలో పాల్గొనే ప్రభుత్వేతర సంస్థ అని భావించాలి.
6. విత్తనం అంటే వ్యవసాయంలో విత్తడం లేదా నాటడం కోసం ఉపయోగించే అన్ని రకాల విత్తనాలు. (రాష్ట్రంలో, దేశంలో సాగు నిషేధించిన జన్యు మార్పిడి, ఇతర HT విత్తనాలు కాకుండా)
7. ఈ చట్టం కింద విత్తన రంగాన్ని నియంత్రించడానికి తెలంగాణ రాష్ట్ర విత్తన అథారిటీ ఏర్పాటు చేయాలి.
విత్తన ధరల నియంత్రణ :
1. ఈ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అమ్మ బడే విత్తనాల గరిష్ట రిటైల్ ధర (MRP) నిర్ణయించడానికి విత్తన ధరల కమిటీని ఏర్పాటు చేయాలి.
2. కమిటీ విత్తన ఉత్పత్తి ఖర్చులు, సంస్థకు సహేతుక లాభాలు, రైతుల స్థోమతను పరిగణన లోకి తీసుకుని ధరలను నిర్ణయించాలి.
3. కమిటీ నిర్ణయించిన MRP కంటే ఎక్కువ ధరకు ప్రైవేట్ విత్తన కంపెనీ విత్తనాలను అమ్మకూడదు.
4. ధరల నిబంధనల ఉల్లంఘన జరిగితే, తెలంగాణ రాష్ట్ర విత్తన అథారిటీ నిర్ణయించిన విధంగా భారీ జరిమానా వేయాలి. కంపెనీ లైసెన్స్ రద్దు చేయాలి.
విత్తన నాణ్యత ప్రమాణాలు :
1. రాష్ట్రంలో అమ్మబడే అన్ని రకాల విత్తనాలు మొలకెత్తే రేటు, జన్యు స్వచ్ఛత , వ్యాధి నిరోధకత తో సహా అన్ని విషయాలలో తెలంగాణ రాష్ట్ర విత్తన అథారిటీ నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను పాటించాలి.
2. ప్రతి విత్తన బ్యాచ్ అమ్మకానికి ముందు గుర్తింపు పొందిన ప్రయోగశాల ద్వారా నాణ్యత ధృవీకరించబడాలి.
3. ప్రైవేట్ విత్తన కంపెనీలు విత్తన నాణ్యత పరీక్షలపై త్రైమాసిక నివేదికలను తెలంగాణ రాష్ట్ర విత్తన అథారిటీకి సమర్పించాలి.
4. నాణ్యతా ప్రమాణాలను పాటించడంలో విఫలమైతే భారీ జరిమానా విధించడం తో పాటు విత్తన బ్యాచ్ ధృవీకరణ రద్దు చేయాలి.
నిరంతర విత్తన లభ్యత :
1. సహజ విపత్తులు లేదా మార్కెట్ కొరత సమయాల్లో కూడా నాణ్యమైన విత్తనాల లభ్యతకు హామీ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విత్తన బ్యాంకును ఏర్పాటు చేయాలి.
2. తెలంగాణ రాష్ట్ర విత్తన అథారిటీ ఆదేశాల ప్రకారం తెలంగాణ సీడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ రైతులకు అత్యవసర విత్తన పంపిణీ కోసం రాష్ట్ర మొత్తం అవసరాలలో 10 శాతం విత్తనాలను అదనంగా నిల్వ చేయాలి.
3. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విత్తన క్షేత్రాలలో విత్తనాలను తప్పకుండా ఉత్పత్తి చేయాలి. రైతుల సహకార సంఘాలు, రైతుల ఉత్పత్తిదారుల కంపనీలు ఆధ్వర్యంలో విత్తనాలను ఉత్పత్తి చేసి స్థానికంగా రైతులకు పంపిణీ చేయడాన్ని ప్రోత్సహించాలి. యూనివర్సిటీ లు , వ్యవసాయ పరిశోధనా స్థానాలు అభివృద్ధి చేసే విత్తనాలను, ఎటువంటి రుసుము లేకుండా ఈ సహకార సంఘాల ద్వారానే రైతులలో వ్యాప్తి చేయడానికి పూనుకోవాలి.
4. రాష్ట్ర ప్రభుత్వం అందించే విత్తన సబ్సిడీ మొత్తాలను ముందుగా రైతు సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి దారుల సంఘాల ద్వారా విత్తన సరఫరాకు కేటాయించాలి.
5. తెలంగాణ రాష్ట్ర విత్తన అథారిటీ విత్తన సరఫరా గొలుసును పర్యవేక్షించాలి.
విత్తన నష్టానికి పరిహారం చెల్లించాలి
1. నాసి రకం, కల్తీ విత్తనాల కారణంగా పంట విఫలమైతే, రైతులు విత్తన ఖర్చు, ఇతర పంట సాగు ఖర్చులు, మరియు కంపనీ ప్రకటించిన దిగుబడి నష్టానికి సమానమైన పరిహారానికి అర్హులవుతారు.
2. అన్ని ప్రైవేట్ విత్తన కంపెనీలు నష్టం ధృవీకరణ తర్వాత 30 రోజులలో రైతుల దావాలను పరిష్కరించడానికి విత్తన నష్ట పరిహార నిధిని తప్పకుండా ఏర్పాటు చేయాలి.
3. తెలంగాణ రాష్ట్ర విత్తన అథారిటీ జిల్లా స్థాయి ఫిర్యాదు పరిష్కార కమిటీలను ఏర్పాటు చేయాలి.
4. నిర్దిష్ట కాలంలో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించడంలో కంపనీ విఫలమైతే, ప్రతి కేసుకూ ప్రత్యేకంగా భారీ జరిమానా విధించాలి. ఆ కంపనీ లైసెన్స్ రద్దు చేయాలి. బాధ్యులైన వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
విత్తన రంగంలో ప్రభుత్వ పాత్రను బలోపేతం చేయాలి :
1. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రింది విధులతో తెలంగాణ రాష్ట్ర విత్తన అథారిటీని ఏర్పాటు చేయాలి.
1. విత్తన ధరలు, నాణ్యత మరియు లభ్యతను నియంత్రించడం.
2. రాష్ట్రంలో పనిచేసే ప్రైవేట్ విత్తన కంపెనీలకు లైసెన్స్ జారీ చేయాలి.
3. ఈ చట్టం నిబంధనల పాటింపును పర్యవేక్షించాలి.
4. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా విత్తన సాంకేతికత పై పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించాలి. జన్యు మార్పిడి, ఇతర HT పంటల పై నిషేధాన్ని పర్యవేక్షించాలి.
5. తెలంగాణ రాష్ట్ర విత్తన అథారిటీ ప్రైవేట్ విత్తన కంపెనీల వార్షిక ఆడిట్‌లను తనిఖే చేయాలి.
6. ప్రభుత్వ రంగంలో విత్తన ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, చిన్న, సన్నకారు రైతులకు విత్తన సబ్సిడీలను అందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించాలి.
విత్తనాలను ఉత్పత్తి చేసే రైతుల హక్కులకు రక్షణ కల్పించాలి
విత్తన ఉత్పత్తి కోసం రైతులను ఎంపిక చేసుకున్న ప్రతి ప్రైవేట్ విత్తన కంపెనీ ఈ క్రింది వివరాలతో రాతపూర్వక ఒప్పందం చేసుకోవాలి.
1. విత్తన ఉత్పత్తి ఖర్చులు పూర్తి స్థాయిలో లెక్కలోకి తీసుకోవాలి. విత్తన అమ్మకాల నుండి సహేతుక లాభం కూడా ప్రాతిపదికగా ఉంచుకుని విత్తనోత్పత్తి చేసే రైతులకు న్యాయమైన ధర చెల్లించాలి.
2. విత్తన నాణ్యత కు సంబంధించి , డెలివరీ షెడ్యూల్స్, రైతులకు ధర చెల్లింపు గడువులకు సంబంధించిన స్పష్టమైన నిబంధనలు ఒప్పందంలో ఉండాలి..
3. విత్తన ఉత్పత్తి నాణ్యతను పెంచడానికి అవసరమైన సాంకేతిక సహాయం ఉచితంగా అందించాలి. రైతులకు శిక్షణ కూడా ఇవ్వాలి. ఈ అంశాలు కూడా ఒప్పందంలో భాగంగా ఉండాలి.
4. తెలంగాణ రాష్ట్ర విత్తన అథారిటీ విత్తన ఉత్పత్తి దారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి.
5. విత్తనాలను ఉత్పత్తి చేసే రైతులు - ప్రైవేట్ కంపెనీల మధ్య ఒప్పందాలను తెలంగాణ రాష్ట్ర విత్తన అథారిటీ పర్యవేక్షించాలి. ఆమోదించాలి.
6. ప్రైవేట్ కంపెనీలతో వివాదాల విషయంలో విత్తనాలను ఉత్పత్తి చేసే రైతులకు చట్టపరమైన, ఆర్థిక సహాయం తెలంగాణ రాష్ట్ర విత్తన అథారిటీ అందించాలి.
7. విత్తన ఉత్పాదక రైతుల హక్కులను ఉల్లంఘించిన ప్రైవేట్ విత్తన కంపెనీలపై అథారిటీ చర్యలు చేపట్టాలి. కంపనీలు అన్యాయమైన ఒప్పంద నిబంధనలు పెట్టకుండా చూడాలి. రైతులకు సకాలంలో చెల్లింపులు చేయకపోవడం, ఏకపక్ష ఒప్పంద రద్దు వంటి వాటికి ఒక్కో కేసుకు కంపనీలపై భారీ జరిమానా విధించాలి. రైతులకు నష్టం చేసేలా తీవ్ర నేరాలకు పాల్పడిన కేసులలో కంపనీ లైసెన్స్ కూడా రద్ధు చేయాలి.
8. ప్రైవేట్ విత్తన కంపెనీలతో రైతులు సామూహికంగా ఒప్పందాలను చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సహాయంతో సహకార సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కును కలిగి ఉంటారు.
ప్రైవేట్ విత్తన కంపెనీల పై నియంత్రణ
1. రాష్ట్రంలో పనిచేయడానికి అన్ని ప్రైవేట్ విత్తన కంపెనీలు తెలంగాణ రాష్ట్ర విత్తన అథారిటీ నుండి లైసెన్స్ పొందాలి.
2. ధరలు, నాణ్యత, సరఫరా తో పాటు, విత్తనాలను ఉత్పత్తి చేసే రైతుల హక్కుల రక్షణ తదితర విషయాలలో నిబంధనల పాటింపును బట్టి కంపనీల లైసెన్స్‌లు ప్రతి సంవత్సరం పునరుద్ధరించాలి. లేదా రద్ధు చేయాలి.
3. ఈ చట్టం నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీ లైసెన్స్‌ను తెలంగాణ రాష్ట్ర విత్తన అథారిటీ సస్పెండ్ చేయాలి లేదా రద్దు చేయాలి.
4. ప్రైవేట్ విత్తన కంపెనీలు తమ విత్తనాల జన్యు కూర్పు మరియు పనితీరు డేటాను తెలంగాణ రాష్ట్ర విత్తన అథారిటీకి ఎప్పటి కప్పుడు వెల్లడించాలి.
జరిమానాలు
1. ఈ చట్టం నిబంధనలను ఉల్లంఘించిన ఏ వ్యక్తి లేదా కంపెనీ సంబంధిత విభాగాల కింద నిర్దేశించిన జరిమానాలకు కట్టుబడి ఉండేలా చట్టం లో నిబంధనలు రాయాలి.
2. చట్ట నిబంధనలను పదే పదే ఉల్లంఘించే ప్రైవేట్ కంపనీల యాజమాన్యాలపై జైలు శిక్ష, భారీ జరిమానా లేదా రెండూ కలిపి కూడా విధించాలి.
3. అనుమతి లేని విత్తనాలను స్వాధీనం చేసుకునే అధికారం తెలంగాణ రాష్ట్ర విత్తన అథారిటీ కలిగి ఉండాలి.
ఇతరములు
1. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టం నిబంధనలను అమలు చేయడానికి వీలుగా నియమాలను వెంటనే రూపొందించాలి.
2. తెలంగాణ రాష్ట్ర విత్తన అథారిటీ ఈ చట్టం అమలుపై తెలంగాణ రాష్ట్ర శాసనసభకు క్రమం తప్పకుండా వార్షిక నివేదికను సమర్పించాలి .
జిల్లాలలో రైతుల అభిప్రాయాలను సేకరించడంతో పాటు, అన్ని రైతు సంఘాల అభిప్రాయాలను కూడా కమిటీ సేకరించాలి. చట్టం డ్రాఫ్ట్ ను సమగ్రంగా రూపొందించాలి.