Supreme Court
x

42% బిసి రిజర్వేషన్ల అమలుకు న్యాయస్థానాల మద్దతు సాధ్యమేనా?

రిజర్వేషన్లకు రాజ్యాంగ పరిరక్షణ కల్పించాలి ప్రభుత్వ బాధ్యత


-డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు

తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం శాసనసభ, శాసనమండలిలో బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. గవర్నర్ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతికి ఆ బిల్లులు పంపబడ్డాయని సమాచారం. ఇది సామాజిక న్యాయ దిశగా ఒక చారిత్రక ముందడుగు. అయితే చట్టం చేయడమే కాదు – దాన్ని సమర్థవంతంగా, న్యాయపరంగా, పారదర్శకంగా అమలుఅయ్యేలా చూడటం ఒక పెను సవాల్.

ప్రస్తుతం ప్రజల్లో కొన్ని ముఖ్యమైన సందేహాలు కొనసాగుతున్నాయి:

1. 42% రిజర్వేషన్లు ఎప్పటి నుంచి అమలవుతాయి?

2. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవే వర్తిస్తాయా? లేక పాత 21% కోటా కొనసాగుతుందా?

3. ప్రభుత్వం నిర్ణయించిన శాతానికి గణాంక ఆధారాలేమిటి?

ఈ ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పష్టమైన, అధికారిక సమాధానాలు లేవు. దీనివల్ల ప్రజల్లో అనిశ్చితి పెరిగింది. ఎన్నికల హామీగానే ఈ చట్టం మిగలకూడదు. అమలులోకి తెచ్చే విధానాలు చక్కగా రూపొందించాలి.

రిజర్వేషన్లకు రాజ్యాంగ మద్దతు – స్పష్టమైన నిబంధనలు

42% బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కేవలం రాజకీయ నిర్ణయం ద్వారా కాదు – రాజ్యాంగం ద్వారా గట్టి పునాది ఉంది. భారత రాజ్యాంగంలోని ఈ నిబంధనలు రిజర్వేషన్లకు బలమైన మద్దతునిస్తాయి:

ఆర్టికల్ 15(4):

సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది. విద్యారంగంలో బీసీలకు ఇది చట్టబద్ధమైన స్థానం కల్పిస్తుంది.

ఆర్టికల్ 16(4):

ప్రాతినిధ్యంలో లేమి మరియు రాజకీయ వెనుకబాటుతనం ఉన్న వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించవచ్చని చెబుతుంది. ఇది ఉద్యోగ రంగంలో సామాజిక న్యాయం నిలబెట్టే సాధనం.

ఆర్టికల్ 243D(6):

గ్రామస్థాయి స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తుంది.

ఆర్టికల్ 243T(6):

మున్సిపల్ సంస్థలలో (పట్టణ పాలక వ్యవస్థ) బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు మార్గం చూపుతుంది.

ఈ నాలుగు నిబంధనలు కలిపి చూస్తే – విద్య, ఉద్యోగం, గ్రామస్థాయి నుంచి పట్టణస్థాయి పాలన వరకు బీసీలకు రాజ్యాంగ పరిరక్షణ కల్పిస్తున్నాయని స్పష్టంగా తెలుస్తుంది.

డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు

సుప్రీంకోర్టు తీర్పులు – మూడో పరీక్ష (Triple Test)లు తప్పనిసరి

డా. కె. కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2010) కేసులో సుప్రీంకోర్టు స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసం మూడు ప్రమాణాలు నిర్దేశించింది. ఇవే Triple Test:

1. సమకాలీన గణాంకాల ఆధారంగా అధ్యయనం

2. ప్రాతినిధ్యంలో లేమి మరియు రాజకీయ వెనుకబాటుతనం ఉన్న వర్గాల గుర్తింపు

3. రిజర్వేషన్ల మొత్తం 50% లోపే పరిమితం

ఈ మూడు లేకుండా ఇచ్చే రిజర్వేషన్లు కోర్టుల్లో నిలబడవు. ఇది న్యాయ పరిరక్షణకు పునాది లాంటిది.

వికాస్ కిషన్ రావు వర్సెస్ గవాలి (Vikas Kishan Rao Gawali ,2021): డేటా లేకుంటే రిజర్వేషన్లు నిలవవు. మహారాష్ట్ర ప్రభుత్వం 27% బీసీ రిజర్వేషన్ కల్పించగా – సుప్రీంకోర్టు Triple Test పాటించలేదని పేర్కొంటూ రద్దు చేసింది. కమిషన్ నివేదికల లేకపోవడం, గణాంకాల లోటు ప్రధాన కారణాలు.

ఇక్కడ కోర్టు స్పష్టంగా గుర్తు చేసిన అంశం:

ప్రాతినిధ్యంలో లేమి మరియు రాజకీయ వెనుకబాటుతనం నిరూపించకపోతే — రిజర్వేషన్ నిలవదు.తెలంగాణకు ఇది హెచ్చరికలా మారాలి.

ఐఆర్ కోయెలో వర్సెస్ తమిళనాడు (IR Coelho vs State of Tamil Nadu, 2007) 9వ షెడ్యూల్ (Ninth Schedule) కి న్యాయ పరిమితులు

ఈ చారిత్రక తీర్పులో సుప్రీంకోర్టు చెప్పింది:

“9వ షెడ్యూల్‌లో చేర్చిన చట్టాలూ న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయి. అవి ప్రాథమిక హక్కులు లేదా రాజ్యాంగ నిర్మాణ మూల సూత్రాలను ఉల్లంఘిస్తే కోర్టు తిరస్కరించగలదు.”

అంటే తెలంగాణ ప్రభుత్వం 42% బిల్లును 9వ షెడ్యూలో చేర్చాలనుకున్నా –దానికి డేటా ఆధారంగా, న్యాయసామర్థ్యంతో, ప్రజల మద్దతుతో ఉండాల్సిందే. ఈ తీర్పుతో 42% రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదు అనడం కాదు —సరైన పద్ధతులు ఉంటే, సాధ్యమే అని చట్టపరంగా అవకాశాన్ని చూపుతోంది.

కౌన్సెల్ ఫర్ సివిల్ లిబర్జీస్ వర్సెస్ బీహార (Counsel for Civil Liberties vs Bihar ,1997): గణాంక ఆధారాలపై స్పష్టత ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం: సమాకాలీన సమాచారం (Contemporaneous empirical data) తప్పనిసరి. లేకుంటే రిజర్వేషన్ చట్టబద్ధత కోల్పోతుంది.”ఇది మరొకసారి గుర్తు చేస్తుంది – ఒక్క మాటలో చెప్పాలంటే, డేటా లేకుండా రిజర్వేషన్ నిలవదు.

కుల గణన – పారదర్శకత అవసరం

ప్రస్తుతం ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత విశ్లేషణ జరుగుతోందని సమాచారం. కానీ — ప్రభుత్వం ఇప్పటివరకు:

• కమిటీ సభ్యుల వివరాలు

• విశ్లేషణా పద్ధతులు

• కమిటీ అధికారిక స్థితి

ఏదీ బహిరంగంగా ప్రకటించలేదు. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ప్రజల సమాచారం రాజ్యాంగ హక్కు. ప్రభుత్వం ఈ విషయాన్ని గౌరవించాలి.

ప్రభుత్వానికి సూచించవలసిన మార్గాలు:

1. బీసీ కమిషన్, డెడికేటెడ్ కమిషన్, నిపుణుల నివేదికలు –

రాజ్యాంగ ప్రక్రియకు, న్యాయ సమీక్షకు సిద్ధంగా ఉండేలా సమన్వయంగా రూపొందించాలి

2. కుల గణనలో AI తో పాటు సామాజిక శాస్త్రవేత్తలు, గణాంక నిపుణుల సహకారం తీసుకోవాలి

3. న్యాయ నిపుణులతో ముందస్తు చర్చలు జరిపి వ్యాజ్యాలకు వ్యూహం సిద్ధం చేయాలి

4. 42% అమలుకు సంబంధించి G.Oలు జారీ చేసి, అమలుశకం స్పష్టంగా ప్రకటించాలి

5. నివేదికలు, గణాంకాలు పారదర్శకంగా ప్రజలతో పంచుకోవాలి

నిజమైన ప్రజాస్వామ్యం అంటే — గోప్యత కాకుండా, ప్రజలతో స్పష్టంగా వ్యవహరించడం

6. రాష్ట్రపతి ఆమోదం తర్వాత వెంటనే అమలుకు కార్యాచరణ రూపొందించి —

స్థానిక సంస్థల ఎన్నికల ముందే అమలు ప్రారంభించాలి

ముగింపు:

బీసీలకు 42% రిజర్వేషన్లు — రాజ్యాంగ హక్కుగా, న్యాయ సమర్థతతో, పారదర్శకంగా అమలవ్వాలి.ఇది ఎన్నికల హామీ కాదు – ఒక బాధ్యత, ఒక నైతిక నిబద్ధత.సమగ్ర గణాంకాలు, నిపుణుల నివేదికలు, పారదర్శకతతో ముందడుగు వేస్తే —

ఇది చరిత్రలో నిలిచిపోయే సామాజిక న్యాయ విజయంగా మారుతుంది.


(వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణ బిసి కమిషన్ చెయిర్ పర్సన్ గా పనిచేశారు)

Read More
Next Story