ధర్మశాస్త్రాలు స్త్రీని ఎలా కట్టడి చేశాయి?
x
Source: Indian Museum, Kolkata

ధర్మశాస్త్రాలు స్త్రీని ఎలా కట్టడి చేశాయి?

రామాయణంలో నిరుత్తరకాండ-37. స్త్రీలు కూడా గుర్తించని ధర్మసూక్ష్మాలున్నాయంటున్నారు కల్లూరి భాస్కరం


ఎగువరాతియుగంనుంచి మధ్యరాతి, కొత్తరాతియుగాల మీదుగా నాగరికయుగంవరకూ...

అంటే దాదాపు యాభైవేల సంవత్సరాల కాలంలో స్త్రీ, పురుషుల స్థానాలు ఎలా తలకిందులయ్యాయో, అంతిమంగా స్త్రీ ఆధిపత్యాన్ని కూలదోసి పురుషుడు తన ఆధిపత్యాన్ని ఎలా స్థాపించుకున్నాడో పశ్చిమాసియా, యూరప్ నేపథ్యాలనుంచి విస్తృతంగా చెప్పుకున్నాం. అందులో భాగంగా, ఫ్రాన్స్ లోని లస్కో గుహాచిత్రాలను, అనటోలియాలోని చాటల్ హ్యుయక్ కుడ్యచిత్రాలను, దేవాలయవ్యవస్థను, సుమేరుపురాణగాథలను; వాటికీ, భారతీయపురాణగాథలకూ మధ్య ఉన్న పోలికలను ఉదహరించుకున్నాం...

ఈ మొత్తం నేపథ్యాన్ని పుచ్చుకుని రామాయణంలోకి వెళ్లబోయే ముందు ఒకసారి ‘మనుధర్మశాస్త్రం’ దగ్గర ఆగుదాం. అందులోని అయిదవ అధ్యాయంలో 147 నుంచి 169 వరకూ ఉన్న శ్లోకాలు ‘స్త్రీధర్మా’ల పేరిట స్త్రీ ఎలా నడచుకోవాలో చెబుతాయి. వాటిలోని తొలి మూడు శ్లోకాలను మాత్రం మచ్చుకు ఉదహరించుకుని మిగతా విషయాల్లోకి వెడదాం:

బాలయా వా యువత్యా వా వృద్ధయా వాపి యోషితా

న స్వాతంత్య్రేన కర్తవ్యం కించిత్ కార్యం గృహేష్వపి

బాల అయినా, యువతి అయినా, వృద్ధ అయినా స్త్రీ ఇంట్లో స్వతంత్రంగా ఏ కార్యాన్నీ చేయకూడదు.

బాల్యే పితుర్వశే తిష్ఠే త్పాణిగ్రాహస్య యౌవనే

పుత్రాణాం భర్తరి ప్రేతే నా భజేత్ స్త్రీ స్వతంత్రతాం

స్త్రీ బాల్యంలో తండ్రి అధీనంలోనూ, యౌవనంలో భర్త అధీనంలోనూ, భర్త మరణించిన తర్వాత పుత్రుల అధీనంలోనూ ఉండాలి తప్ప స్వతంత్రంగా ఉండడానికి వీలులేదు.

పిత్రా భర్త్రా సుతైర్వాపి నేచ్ఛే ద్విరహ మాత్మనః

ఏషాం విరహేణ స్త్రీ గర్హ్యే కుర్యాత్ ఉభే కులే

స్త్రీ ఎప్పుడూ తండ్రిని, భర్తను, కొడుకులను వదలిపెట్టి ఒంటరిగా ఉండకూడదు; అలా ఉండడం ఆమె పుట్టింటికీ, అత్తింటికీ కూడా చెడ్డపేరు తెస్తుంది.

మిగతా శ్లోకాలలో చెప్పిన ప్రకారం- స్త్రీ ఇంటిపనులు నేర్పుగా చక్కబెట్టాలి; ఎప్పుడూ నవ్వుముఖంతో ఉండాలి; దుబారా చేయకూడదు; భర్తకు జీవితాంతం శుశ్రూష చేయాలి, అదే ఆమెకు యజ్ఞమూ, వ్రతమూ, ఉపవాసమూ; భర్త ఆజ్ఞను ఎప్పుడూ ఉల్లంఘించకూడదు; భర్తే ఆమెకు ఋతుకాలంలోనూ, ఇతర సమయాల్లోనూ సుఖాన్ని ఇస్తాడు, పరలోకంలో సుఖాన్ని ఇచ్చేది కూడా అతనే; భర్త సదాచారం పాటించకపోయినా, పరస్త్రీలోలుడైనా, చదువుసంధ్యలు, సద్గుణాలు లేనివాడైనా అతన్ని దేవుడిలా పూజించాలి; భర్త చనిపోయినా సరే, అతనికి ఇష్టంలేని పని ఏదీ చేయకూడదు, చేస్తే అది వ్యభిచారంతో సమానమవుతుంది; భర్త చనిపోయాక కందమూలఫలాలను తిని మాత్రమే జీవించాలి, పరపురుషుని పేరు కూడా ఉచ్చరించకూడదు; ఒకవేళ తనకు సంతానం లేకపోతే అందుకు దుఃఖించకూడదు; పునర్వివాహం చేసుకోకూడదు, చేసుకుంటే మరుజన్మలో నక్కగానో, కుష్ఠు మొదలైన నికృష్టరోగాలతోనో పుడుతుంది...

వీటిని విడిగా చూసినప్పుడు, ప్రవచనాకారుల నోట ఎప్పుడూ వినే పతివ్రతాధర్మాలుగా, లేదా స్త్రీవాదులు ఎత్తిచూపే పురుషాధిక్యంగా, స్త్రీని అణచివేయడంగానే కనిపిస్తాయి. అందులోనూ మనుధర్మశాస్త్రం గురించి కొద్దోగొప్పో తెలిసినవారికి వీటిలో ఎలాంటి కొత్తదనమూ కనిపించదు. కానీ ఇంతవరకూ చెప్పుకుంటూవచ్చిన చారిత్రకనేపథ్యంలో అమర్చి చూడండి; అప్పుడివి కొత్తగా ధ్వనించి సరికొత్త అవగాహన కలిగిస్తాయి. ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలంటే, ఎగువరాతియుగంనుంచి, నాగరికయుగంవరకూ నడిచిన చరిత్రకు కొనసాగింపుగా తోస్తాయి. ఉదాహరణకు, స్త్రీ చలాయించే అన్ని రకాల ఆధిపత్యాల కింద నలుగుతూ ఆత్మన్యూనతకు గురవుతూవచ్చిన పురుషుడు ఎట్టకేలకు ఆమె ఆధిపత్యాన్ని కూలదోసి తన అధికారాన్ని విజయవంతంగా స్థాపించిన తర్వాత కూడా ఆమెపట్ల శాంతించని అతని శత్రుత్వాన్ని, పగను, ప్రతీకారాన్నే కాక, భయభీతులను కూడా పట్టిచూపుతాయి.

పనులు చేయడంలో దాసి, సలహాసంప్రదింపులలో మంత్రి, రూపంలో లక్ష్మి, సహనంలో భూదేవి, అన్నం పెట్టడంలో అమ్మ, పడకమీద రంభ- అంటూ ఆరుగుణాలు కలిగిన కులధర్మపత్నిగా ఆ తర్వాత స్త్రీని ఎంతగా ఆకాశానికెత్తినా అందులో పాతశత్రుత్వపు ఛాయలు తొంగి చూస్తూనే ఉంటాయి. అదే సమయంలో, శత్రువు పట్టుబడడంతో పగ చల్లారింది కనుక; అతనితో, లేదా ఆమెతో పని చేయించుకోవడానికి ఒక్కోసారి బుజ్జగింపూ అవసరమవుతుంది. ఆ చాణక్యమే కులధర్మపత్నిగా, సహధర్మచారిణిగా స్త్రీని కీర్తించడంలోనూ కనిపిస్తుంది.

యుద్ధాల దరిమిలా దాసదాసీవ్యవస్థ ఎలా మొదలైందో ఇంతకుముందు ప్రస్తావించుకున్నాం. మనుధర్మశాస్త్రం స్త్రీధర్మాల పేరిట స్త్రీని కట్టడి చేస్తూ చెప్పిన పై మాటల్ని ఆ నేపథ్యంనుంచి గమనించండి; తల్లిగా, చెల్లిగా, ఇల్లాలుగా పట్టం కడుతూనే ఆ దాసదాసీవ్యవస్థను స్త్రీ గృహజీవితానికి పొడిగించి ఇంటినే ఆమెకు చెరసాలగా మార్చడం స్పష్టంగా కనిపిస్తుంది. ఖైదీలను ఏబీసీ తరగతులుగా విభజించే ఈనాటి జైళ్లతో పోల్చి చెప్పుకుంటే, మనుధర్మశాస్త్రం తనకు విధించిన గృహనిర్బంధంలో స్త్రీ మహా అయితే ‘ఏ’ లేదా, ‘బి’ తరగతికి చెందిన ఖైదీ అవుతుందన్నమాట.

ఇక్కడొకసారి ఆగి విలియం ఇర్విన్ థామ్సన్ ను ఉటంకించుకోవడం ఆసక్తికరంగానూ, ఆశ్చర్యకరంగానూ కూడా ఉంటుంది. మనుధర్మశాస్త్రం గురించి కానీ, అది స్త్రీకి విధించిన గృహనిర్బంధం గురించి కానీ ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు; కానీ ‘వ్యవసాయీకరణ’ అనే అధ్యాయాన్ని ముగిస్తూ ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆ పరిణామానికి గల చారిత్రకనేపథ్యం మొత్తాన్ని మన కళ్ళకు కట్టిస్తూ, ఆ చరిత్ర స్థలకాలాలను జయించి మరీ ఎలా కొనసాగుతూవస్తున్నదో చెబుతాయి.

స్త్రీ ఆధిపత్యాన్ని కూలదోసి పురుషుని ఆధిపత్యాన్ని స్థాపించడమనేది హఠాత్తుగా సంభవించినది కాకపోయినా, అదొక మహత్తరవిప్లవ మంటాడాయన. అంతకుముందు వందల వేల సంవత్సరాలుగా స్త్రీలు పెంపొందించిన సంస్కృతీ, స్త్రీకి సంబంధించిన నిగూఢతలే ప్రాబల్యం వహిస్తూ మానవజీవనాన్ని మలచి, ప్రభావితం చేస్తూవచ్చాయి. ఎద అయినప్పుడు మాత్రమే సంపర్కం చెందే జంతులక్షణం నుంచి మనిషిని తప్పించి, ఎప్పుడైనా సంపర్కం చెందే మానవలక్షణాన్ని స్థాపించడంలో ముందడుగు స్త్రీదే. చంద్రుని వృద్ధిక్షయాలపై ఆధారపడిన కాలగణనాన్ని ప్రవేశపెట్టడం ద్వారా మానవవిజ్ఞానానికి ప్రాతిపదిక కల్పించినది స్త్రీయే. వ్యవసాయాన్నీ, తద్వారా స్థిరమైన గ్రామ, పట్టణజీవనాన్నీ స్త్రీ సృష్టించినది కూడా స్త్రీయే. కానీ

నాగరికతా, యుద్ధాలు మాత్రం ఆమె సృష్టించినవి కావంటాడు థామ్సన్. అవే ఘనతవహించిన అమ్మదేవత ప్రాభవానికి చావుగంట మోగించాయంటాడు. అమ్మ స్థానానికి అయ్య ఎగబాకే ప్రయత్నంలో అతనికీ, అమ్మ సోదరుడికీ మధ్య విప్లవాత్మకమైన ఘర్షణ మొదలైందనీ, దాని పర్యవసానంగా అంతవరకూ ఈ భూమిమీద చిరకాలంపాటు వర్ధిల్లిన సంప్రదాయం మొత్తం కుప్పకూలిపోయిందనీ అంటాడు.

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సందర్భానికి పూర్తిగా అతికినట్టు సరిపోయే మరికొన్ని వ్యాఖ్యలు కూడా థామ్సన్ చేస్తాడు. స్త్రీ-పురుషుల ఆధిపత్యపోరాటం ఎంత విప్లవాత్మకమూ, ఎంత ఇటీవలిదంటే పురుషుడి జ్ఞాపకాలలో అది ఇప్పటికీ పదిలంగానూ పచ్చగానే ఉందనీ; పురాతనమైన అమ్మదేవతనుంచి ఏ చిన్నపాటి ప్రతిఘటనైనా కత్తులు, తుపాకులు అందుకునే వైపు పురుషుని పరుగు పెట్టిస్తుందంటాడు. శాంతి, సామరస్యం, సాన్నిహిత్యం వెల్లివిరిసిన వెనకటి గ్రామజీవితమనే స్వర్ణయుగాన్ని స్త్రీలు స్వప్నిస్తుంటే; మందలో కలిసిపోయి ఊపిరాడకుండా, అస్తిత్వభయాలతో గడిపిన వెనకటి అనుభవాల పీడకలలను దర్శిస్తూ పురుషుడు భయంతో వణికిపోతాడంటాడు.

‘అమ్మదేవతతో తనను బంధించిన బొడ్డుతాడును పురుషుడు కత్తితో తెగనరుక్కున్నాడు; అప్పటినుంచీ ఆ కత్తి అతని నెత్తిన వేలాడుతూనే ఉంది’ అంటూ ముగిస్తాడు.

తిరిగి మన ధర్మశాస్త్రాలకు వెడదాం. సాధారణంగా స్త్రీలు కూడా గుర్తించని ఒక ధర్మసూక్ష్మం ఏమిటంటే; బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులనే మూడు వర్ణాల వింగడింపు పురుషుడి పరంగానే జరుగుతుంది తప్ప, స్త్రీ పరంగా జరగదు. అంటే, ఈ మూడు వర్ణాలలోనూ ఏదో ఒక వర్ణంలో పుట్టి, ఆ వర్ణానికి చెందిన పురుషుని పెళ్లిచేసుకోవడం ద్వారా మాత్రమే స్త్రీకి వర్ణసంబంధమైన గుర్తింపు వస్తుంది తప్ప సొంతంగా రాదు. కేవలం స్త్రీగానే చెప్పుకుంటే ఆమె అన్ని విషయాల్లోనూ శూద్రులతో సమానమే అవుతుంది; శూద్రుల పట్ల అమలు చేసే అన్ని రకాల విధి, నిషేధాలూ ఆమెకీ వర్తిస్తాయి. ఇంట్లోనే ఓ చెరసాలను ఏర్పాటు చేసి స్త్రీని పురుషుడి అధికారక్షేత్రానికి దూరంగా ఉంచే ప్రక్రియ అక్కడితో ఆగకుండా సహజంగానే ఆమె జీవితానికి సంబంధించిన సమస్తాంగాలకూ విస్తరిస్తుందన్నమాట.

ఉదాహరణకు, పుట్టుకతో ప్రారంభించి చావు వరకూ జరిపే రకరకాల సంస్కారాలన్నింటిలోనూ స్త్రీ-పురుష విభజన కొనసాగుతూనే ఉంటుంది. స్త్రీ, శూద్రులది ఒకే స్థాయి కనుక ఇక్కడ స్త్రీ అన్నప్పుడల్లా శూద్రునీ దృష్టిలో పెట్టుకోవాలి. ఈవిధంగా దాసదాసీవ్యవస్థతో కూడిన అంచెలంచెల సామాజికనిర్మాణానికి గృహజీవితం తొలి అంచే కాదు; పటిష్ఠమైన పునాదీ అవుతుంది. ధర్మశాస్త్రాలలోకే తొంగి చూసినప్పుడు అవి ఏ ఒక్క చిన్నవివరాన్నీ విస్మరించకుండా, ఎక్కడా సందిగ్ధానికి అవకాశమివ్వకుండా ఎంత పకడ్బందీగా ఈ నిర్మాణాన్ని నిర్దేశించాయో అర్థమై ఆశ్చర్యం కలుగుతుంది. ఎంతోమంది మేధావులు ఒక చోట చేరి ఒక దేశ రాజ్యాంగాన్నో, లేదా చట్టాలనో కూర్చడం కన్నా ఇది తక్కువ కసరత్తు ఏమీ కాదు. ఇంతకుముందు అనేక వ్యాసభాగాలలో చెప్పుకున్న చారిత్రకనేపథ్యంనుంచి చూసినప్పుడు ఎంతో జాగ్రత్తను పాటిస్తూ సాగించిన ఆ కసరత్తు వెనుక ఎలాంటి భయాలు గూడుకట్టుకుని ఉన్నాయో కూడా అర్థమవుతుంది.

స్త్రీ, శూద్రసమానత్వాన్ని చెప్పే దాసదాసీలతో కూడిన సామాజికనిర్మాణం మనుధర్మశాస్త్రంలోనూ, ‘ధర్మసింధు’ అనే మరో సంకలనంలోనూ ఎలా ప్రతిఫలిస్తోందో సోదాహరణంగా చూద్దాం:

కె. వై. ఎల్. నరసింహారావుగారు వెలువరించిన మనుధర్మశాస్త్రంలోని, తొమ్మిదవ అధ్యాయంలో 22నుంచి 25వరకూ ఉన్న శ్లోకాలు స్త్రీకి ఎలాంటి గుర్తింపైనా పురుషుడివల్లనే లభించాలి కానీ, ఆమెకు స్వతంత్రమైన గుర్తింపూ, అస్తిత్వమూ ఉండవని చాలా స్పష్టంగా చెబుతాయి. నది సముద్రంలో కలవగానే అందులోని మంచినీరు ఎలా ఉప్పగా మారిపోతుందో అలాగే, వివాహమైన తర్వాత స్త్రీ భర్తగుణాలనే పొందుతుందని అంటాయి. ఉదాహరణకు, అక్షమాల అనే ఒక ‘నీచజాతి’ కన్య వసిష్ఠుని, చటక అనే మరో ‘నీచజాతి’ కన్య మందపాలుడనే ఋషినీ వివాహమాడడం వల్లనే లోకంలో మన్నన పొందారని; వీరేకాక, మరెందరో ‘అధమజాతి’ స్త్రీలు ఉత్తమకులస్థులను పెళ్లాడి వారి ‘శుభగుణా’లవల్లనే గొప్పతనాన్ని పొందారని ఈ శ్లోకాలు చెబుతాయి. ఈ ‘శుభగుణా’లలో వర్ణాన్ని కూడా చేర్చుకోవలసి ఉంటుంది.

విచిత్రమేమిటంటే, భర్త శుభగుణాలు స్త్రీకి సంక్రమిస్తాయని మనుధర్మశాస్త్రం ఒక పక్క నమ్మబలుకుతూనే, మరోపక్క ఎందులోనూ స్త్రీ పురుషునితో సమానురాలు కాదన్న సంగతినీ అంతకన్నా గట్టిగా నొక్కి చెబుతుంది. ఉదాహరణకు, స్త్రీ తొలి మూడు వర్ణాలలోనే జన్మించినా పురుషుడికి చేసినట్లు ఆమెకు జాతకర్మ, నామకరణం మొదలైనవాటిని మంత్రయుక్తంగా చేయకూడదని తొమ్మిదవ అధ్యాయంలోని 18, 19 శ్లోకాలు చెబుతున్నాయి. అందుకు శ్రుతి, స్మృతి ప్రమాణాలు లేవనీ, కేవలం ఇంద్రియాలే ప్రమాణమనీ; స్త్రీలకు ప్రాయశ్చిత్తమంత్రాలు లేవు కనుక, వారికి పాపాన్ని పోగొట్టుకునే శక్తి ఉండదనీ, ఆవిధంగా వారు ‘అశుభ’లనీ అంటున్నాయి. ఇంకా దారుణం ఏమిటంటే, స్త్రీలకు వ్యభిచారశీలమే స్వాభావికమని పెక్కు వేదవాక్యాలు ప్రకటించిన సంగతిని గుర్తుస్తున్నాయి.

అంతకుముందు మనుధర్మశాస్త్రంలోని రెండవ అధ్యాయంలో 65, 66 శ్లోకాలు కూడా జాతకర్మ మొదలైన సంస్కారాలను స్త్రీలకు మంత్రం లేకుండానే చేయాలని చెబుతున్నాయి. వీటిలో శూద్రుల ప్రస్తావన లేకపోయినా ఇతరత్రా చెప్పినప్రకారం వారికి కూడా ఇదే వర్తిస్తుంది. అదలా ఉంచితే, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యవర్ణాలకు చెందిన పురుషులకు అన్ని సంస్కారాలనూ సమానంగా వర్తింపజేస్తున్నట్టు కనిపిస్తూనే వారి మధ్య కూడా ఏదో ఒక విధమైన వివక్షను చూపడం మనుధర్మశాస్త్రంలో సర్వత్రా కనిపిస్తుంది. ఎలాగంటే, బ్రాహ్మణులకు కేశసంస్కారాన్ని పదహారో ఏటా, క్షత్రియునికి ఇరవై రెండో ఏటా, వైశ్యునికి ఇరవై నాలుగో ఏటా జరపాలని పై శ్లోకాలు చెబుతున్నాయి.

ఇక ఉపనయనానికే కాక, చదువుసంధ్యలకు, అగ్నికార్యాలకూ కూడా స్త్రీకి అధికారం లేదనే విషయాన్ని రెండవ అధ్యాయంలోని 67వ శ్లోకం ఇలా చెబుతోంది:

వైవాహికో విధిః స్త్రీణాం సంస్కారో వైదికస్మృతః

పతిసేవా గురౌ వాసో గృహాz ర్ధోగ్ని పరిక్రియా

స్త్రీలకు శాస్త్రోక్తంగా చేసిన వివాహమే ఉపనయనం, భర్తకు శుశ్రూష చేయడమే గురుకులవాసం, ఇంటిపనులు చేసుకోవడమే అగ్నిహోత్రమని దీని అర్థం. దాస్యాన్ని సూచించే ఇవే నిర్దేశాలు శూద్రులకూ వర్తిస్తాయని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక ‘ధర్మసింధు’ ఏం చెబుతోందో చూద్దాం. విజయనగరసంస్థాన పండితుడు కొల్లూరి కామశాస్త్రి కూర్చిన ఈ గ్రంథాన్ని 1930లో వావిళ్లవారు ప్రచురించగా శ్రీ జయలక్ష్మీ పబ్లికేషన్స్, హైదరాబాద్ వారు 2019లో పునర్ముద్రించారు. ఇందులోని తృతీయపరిచ్ఛేదంలో ‘శూద్రసంస్కార విచారము’ అనే శీర్షిక కింద చెప్పిన ప్రకారం, ద్విజులు, అంటే ఉపనయనం ద్వారా రెండో జన్మ పొందినవారు మాత్రమే -గర్భాధానం, పుంసవనం, జాతకర్మ, నామకరణం, అన్నప్రాశనం, పుట్టువెంట్రుకలు తీయడం, ఉపనయనం, వివాహం మొదలైన పదహారు సంస్కారాలకూ అర్హులు. ద్విజులలోనే ఉన్న స్త్రీలు వీటిలో ఆరు సంస్కారాలకు మాత్రమే అర్హులు; మళ్ళీ ఆ ఆరింటిలోనూ ఒక్క వివాహం మాత్రమే మంత్రయుక్తంగా ఉంటుంది; మిగతావాటిని మంత్రం లేకుండానే జరపాలి.

శూద్రపురుషులైతే, మంత్రయుక్తం కాని పది సంస్కారాలకు మాత్రమే అర్హులు. కాకపోతే, శూద్రులు పంచమహాయజ్ఞాలు చేయవచ్చుననీ, వేదమంత్రాలు లేకుండా వారికి ఉపనయనం కూడా చేయవచ్చనీ కొందరు చెప్పడాన్ని ‘ధర్మసింధు’ ఉదహరిస్తుంది. అలాగే, బ్రహ్మపురాణం శూద్రులకు ఒక్క వివాహాన్ని మాత్రం మంత్రయుక్తంగా విధించినట్టూ చెబుతోంది. ఇంకా విశేషమేమిటంటే, శూద్రులలోనే ఉత్తములు, ఉత్తములు కానివారన్న తేడా కూడా తీసుకొచ్చి, ఉత్తములకు మిగతా సంస్కారాలు అన్నీ చేయవచ్చు కానీ, ఉత్తములు కానివారికి ఒక్క వివాహం మాత్రమే చేయాలని చెబుతోంది. ఉత్తమత్వాన్ని ఎవరు, ఎప్పుడు, ఎలా నిర్ణయిస్తారన్న ప్రశ్నకు ఇక్కడ అవకాశముంది. అదలా ఉంచితే, ద్విజులైన పై మూడువర్ణాలవారినీ సేవించుకుంటూనే శూద్రులు జీవించాలని కూడా ‘ధర్మసింధు’ నిర్దేశిస్తోంది.

యుద్ధాలతో మొదలైన దాసదాసీవ్యవస్థనే మన ధర్మశాస్త్రాలు కూడా అందిపుచ్చుకుని ప్రామాణికత కల్పించిన సంగతిని ఆయా సంస్కారాల గురించి మనుధర్మశాస్త్రమూ, ధర్మసింధూ కూడా చేసిన ఇలాంటి అనేక నిర్దేశాలు స్పష్టంగా వెల్లడిస్తాయి. ఉదాహరణకు, నామకరణాన్నే తీసుకుంటే, బ్రాహ్మణుని పేరు చివర ‘శర్మ’ అనీ, క్షత్రియుని పేరు చివర ‘వర్మ’ అనీ, వైశ్యుని పేరు చివర ‘గుప్త’ అనీ ఉండాలని, శూద్రుని పేరు చివర మాత్రం ‘దాస’ శబ్దం ఉండాలని మనుధర్మశాస్త్రం, ద్వితీయాధ్యాయంలోని 31, 32 శ్లోకాలు చెబుతున్నాయి.

చివరికి పూజాదికాలు జరపడంలోనూ వివిధ వర్ణాల పురుషుల మధ్య వివక్ష కనిపిస్తుంది. ఎలాగంటే, ‘ధర్మసింధు’లోని ద్వితీయ పరిచ్ఛేదంలో చెప్పిన ప్రకారం, బ్రాహ్మణులు సాత్వికపూజకు; క్షత్రియులు సాత్వికపూజకు, మాంసంతో కూడిన రాజసపూజకు; శూద్రాదులు మంత్రయుక్తం కాని, మాంససహితమైన తామసికపూజకు అర్హులు. శూద్రాదులు సాత్వికపూజను బ్రాహ్మణులతో చేయించుకోవాలి తప్ప స్వయంగా చేయకూడదు. అలాగే, పురాణమంత్రాలను కూడా స్వయంగా పఠించే అధికారం స్త్రీలకు, శూద్రులకు లేదని; వాటిని వింటేనే చాలు వారికి ఫలం లభిస్తుందనీ; భగవద్గీతను, విష్ణుసహస్రనామాలనూ కూడా వారు స్వయంగా పఠించకూడదనీ ఇదే పరిచ్ఛేదం చెబుతోంది. కాకపోతే, పురాణమంత్రాలతో స్వయంగా పూజించే అధికారం స్త్రీలకు, శూద్రులకూ కూడా ఉన్నట్టు కొన్ని చెబుతున్న సంగతినీ అది ప్రస్తావించింది.

స్త్రీని కట్టడి చేయడంలో పురుషుడు ఎక్కడా రాజీపడలేదనీ; స్త్రీ స్వతంత్రంగా ఏ కొంచెమైనా కాళ్ళూ, చేతులూ ఆడించడానికి చిన్నపాటి సందును కూడా విడిచిపెట్టలేదనీ, ఎక్కడికక్కడ బిగింపులు చేస్తూ పోయాయనీ – ధర్మశాస్త్రాలను పైపైన పరిశీలించినా అర్థమవుతుంది. పైన చెప్పిన థామ్సన్ వ్యాఖ్యలను కూడా కలుపుకుంటూ చారిత్రకనేపథ్యంనుంచి చూసినప్పుడు, పురుషునిలో స్త్రీపట్ల గూడుకట్టుకుని ఉన్నపాత పగా, ప్రతీకారం, భయభ్రాంతులే ఆ కట్టడి వెనుక కనిపిస్తూ ఉండవచ్చు. ధర్మశాస్త్రాలు స్త్రీకి గృహనిర్బంధం మాత్రమే కాదు; బతుకులోనూ, చావులోనూ కూడా భర్తనే అనుసరించాలని చెబుతున్నాయి; బతుక్కీ, చావుకీ ఉన్న తేడాను చెరిపేస్తూ స్త్రీని జీవచ్ఛవంగా మార్చడంతో కసి తీరని పురుషుడు ఆమెను శవంగానూ మార్చి తన వెంట తీసుకువెళ్లడానికి పూనుకున్నాడు. అలా వచ్చినదే సహగమనం. ‘ధర్మసింధు’ సహగమనవిధి’ శీర్షికతో ఆ తంతును కూడా విపులంగా నిర్దేశించింది.

నిజానికి స్త్రీని శూద్రులతో సమానంగా చూశారన్నది కూడా సత్యదూరమనిపిస్తుంది; ఆమెది అంతకన్నా హీనమైన, దుర్భరమైన పరిస్థితి. అదలా ఉంచితే, ధర్మశాస్త్ర నిర్దేశాలు ఎప్పుడైనా పూర్తిగా అమలు జరిగాయా, సహగమనాన్ని సార్వత్రికంగా విధించడం ఎప్పుడైనా జరిగిందా అన్న ప్రశ్నలను ఎవరైనా ముందుకు తేవచ్చు; కాలం చెల్లిన శాస్త్రాలను, పాతరోత దురాచారాలను, వివక్షలను ఇప్పుడు కొత్తగా కెలకడమెందుకన్న ప్రశ్ననూ ఎవరైనా సంధించవచ్చు, నిజమే. కానీ మరోకోణంలోంచి చూడండి; వాటిలో పరంపరగా కొనసాగుతున్న పురుషుని మనస్తత్వం కనిపిస్తుంది; ఒకానొక చారిత్రకానుభవం హెచ్చుతగ్గుల తేడాలతో ఇప్పటికీ సజీవంగా ఉన్న సంగతి స్ఫురిస్తుంది. మరొకటేమిటంటే, ధర్మశాస్త్రాలు ఇప్పటికీ అచ్చులో వెలుగు చూస్తూనే ఉన్నాయి. అంతేకాదు, సహగమనం వంటి దారుణాలపట్ల ముద్రాపకులు విచారాన్ని, వ్యతిరేకతను ప్రకటించకపోవడమలా ఉంచి, ధర్మశాస్త్రాలను ప్రశంసించడమూ చూస్తున్నాం.

చివరిగా, పద్మపురాణం, ఉత్తరఖండంలోని భారద్వాజరామాయణంనుంచి ఒక ముచ్చట చెప్పుకుని తిరిగి పూర్తిస్థాయిలో వాల్మీకి రామాయణంలోకి వెడదాం:

దశరథుని అశ్వమేధయాగం ముగిసింది. దేవతలు తమ తమ భాగాలను తీసుకుని స్వస్థానాలకు వెళ్ళిపోయారు. యాగాన్ని చూడడానికి వచ్చిన రాజులు కూడా తమతమ రాజ్యాలకు పయనమయ్యారు. దశరథుడు బ్రాహ్మణులతో కలసి తన నగరానికి చేరుకున్నాడు. తనకు పుత్రులు ఎప్పుడు పుడతారా అని ఉవ్విళ్లూరుతూ సుఖంగా గడుపుతున్నాడు.

అతని భార్యలు ముగ్గురూ పూర్ణగర్భవతులయ్యారు. ఆ ముగ్గురి గర్భంలో ఉన్న శ్రీహరి పీతాంబరం ధరించి, శంఖచక్రగదాహస్తుడై ఆ ముగ్గురికీ కలలో కనిపించాడు. కౌసల్య అయితే, తను గరుత్మంతుని అధిరోహించినట్లు, బ్రహ్మాదిదేవతలు తనను కొనియాడుతున్నట్లు, దుష్టరాక్షసులతో తను యుద్ధం చేసినట్లు కలగంది.

పొద్దుటే ముగ్గురూ వశిష్టమహర్షిని రప్పించి తమ కల గురించి చెప్పారు. వసిష్ఠుడు నవ్వి, కొంచెం విబూదిని మంత్రించి, “ఓ రామచంద్రప్రభూ! అనధికారుల విషయంలో ఆత్మస్వరూపాన్ని చూపించకు” అని ప్రార్థించి, ఇకమీదట ఇలాంటి దుస్వప్నాలు మీకు కలగవని వారికి చెప్పి విబూది ఇచ్చి వెళ్లిపోయాడు! స్త్రీకి దేవుణ్ణి కలగనే అధికారం కూడా లేదు!!!

Read More
Next Story