మానవ తప్పిదమే తిరుపతి తొక్కిసలాట విషాదానికి కారణం
x

'మానవ తప్పిదమే తిరుపతి తొక్కిసలాట విషాదానికి కారణం'

తిరుపతిలో తొక్కిసలాట ఎందుకు తలెత్తింది? ఇప్పుడు పీడిస్తున్న పెద్ద ప్రశ్న


-కందారపు మురళి

మానవ తప్పిదం కారణంగానే తిరుపతి నగరంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయారని స్పష్టమవుతున్నది.

వెంకటేశ్వర స్వామి వారిని ఏకాదశి నాడు దర్శించుకుంటే మంచి జరుగుతుందని భావించి తిరుమలకు వైకుంఠ ఏకాదశి నాడు భక్తులు పోటెత్తడం ఆనవాయితీగా వస్తున్నది.

క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో టిటిడి ఉద్యోగులకు ఉన్న అనుభవం, దేశంలో మరే ఆధ్యాత్మిక సంస్థలకు లేదనేది కూడా సుస్పష్టం.

అయితే ఈ పరిస్థితి ఎందుకు తలెత్తింది? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా చర్చ జరుగుతున్నది.

జరిగిన ఘటనలో వ్యక్తులకు, సంస్థలకు దురుద్దేశాలు ఆపాదించలేము. ఏ ఒక్కరూ ఇలాంటి ఘటనలు జరగాలని భావించరు. కాకపోతే ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవటం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం తదితర కారణాలతో తిరుపతిలో ఆరుగురు భక్తులు చనిపోయారు. 40 మంది క్షతగాత్రులు అయ్యారనే వాస్తవాన్ని సాధారణ జనం, భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు.

వైకుంఠ ఏకాదశి నాడు లక్షల సంఖ్యలో జనం తిరుమలకు వస్తారన్న అంచనాలు ఉన్నప్పటికీ దానికై చేపట్టాల్సిన ఏర్పాట్లపై స్పష్టత లోపించడం వైఫల్యం గా కనిపిస్తున్నది.

తిరుపతిలో ఏర్పాటు చేసే టికెట్ కేంద్రాలు స్థానికులకు మాత్రమేనని గతంలో ప్రకటించేవారు.

ఎవరైనా ఇతర ప్రాంతాల భక్తులు కౌంటర్ల వద్దకు వచ్చినా టికెట్లు ఇచ్చేవారు.

ఈ దఫా లోపమేమంటే... టికెట్ లేని వారిని తిరుమల కొండకు అనుమతించబోము అని యాజమాన్యం చేసిన ప్రకటన వల్ల ముఖ్యంగా తమిళనాడు ప్రాంతం నుంచి చాలా పెద్ద సంఖ్యలో ఎలాగైనా వైకుంఠ ఏకాదశి నాడు దేవున్ని దర్శించుకోవాలి, వైకుంఠ ద్వారాలలో ప్రవేశం పొందాలి. అనే ఆతృత నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుపతి చేరుకున్నారు.

బుధవారం నాటి ఉదయానికి దూర ప్రాంతాల నుంచి రాత్రంతా ప్రయాణం చేసి అలసిపోయిన భక్తులు టికెట్ కౌంటర్ల వద్దకు చేరుకున్నారు.

గురువారం ఉదయం ఐదు గంటల నుంచి టికెట్లు ఇస్తారని ముందస్తుగా అధికారులు ప్రకటన చేసినా బుధవారంనాటి ఉదయం 10 గంటలకే కౌంటర్ల దగ్గరకు భక్తులు చేరుకోవడం ప్రారంభమైంది.

ప్రతిగంటకు భక్తుల సంఖ్య పెరగడం ఉదయం నుంచి కనబడుతూనే ఉంది.

పెరుగుతున్న సంఖ్యను దృష్టిలో పెట్టుకొని పోలీసు యంత్రాంగం తగిన జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈ ఘటన జరిగేది కాదు.

టీటీడీ ఉన్నతాధికారులు, బోర్డు చైర్మన్ లు పలుమార్లు ప్రకటనలు చేశారు. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్ని ఏర్పాట్లు చేపట్టామని 3,000 మంది పోలీసులు, 1500 మంది విజిలెన్స్ సిబ్బందితో ప్రశాంతమైన వాతావరణంలో దర్శన ఏర్పాట్లు చేశామని ప్రకటించారు.

ఇన్ని వేలమంది పోలీసులను కేటాయించామని చెబుతున్నా కౌంటర్లు దగ్గర భక్తులను నియంత్రించడానికి, క్రమబద్ధీకరించడానికి పోలీసులు పరిమిత సంఖ్యలో ఉండటం ఈ దుస్థితికి కారణంగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

టికెట్ కౌంటర్లను టీటీడీ తిరుపతిలోని మూడు కేంద్రాల్లో నిర్వహిస్తున్ళది. వేల సంఖ్యలో జనం రావడం టికెట్లు పొందడం అనేది ప్రతిరోజు నిత్యం జరిగేది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మూడు కౌంటర్లకు అదనంగా మరో ఐదు కౌంటర్లని టిటిడి ఏర్పాటు చేసింది. తిరుమల కొండపై స్థానికులకు కౌంటర్ బాలాజీ నగర్ లో ఏర్పాటు చేశారు.

మొత్తం తొమ్మిది కేంద్రాల్లో 90 కౌంటర్లని టిటిడి ఏర్పాటు చేసింది.

వాస్తవంగా ఒక్కో కౌంటర్ వద్ద పదివేల మంది జనం వచ్చినా లైన్ కదులుతూ ఉంటే మేనేజ్ చేయడం పెద్ద సమస్య ఏమి కాదు ఇది టిటిడి ఉద్యోగులకు తెలిసిన విద్యే.

వచ్చిన జనాన్ని నియంత్రించకపోగా కౌంటర్లకు తాళాలు వేసి లైన్లోకి జనాన్ని పంపకపోవడం దారుణం.

ఏర్పాటు చేసిన కేంద్రాలు కూడా జన సమ్మర్థంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం, నివాస ప్రాంతాల్లో సన్నని ఇరుకు దారులలో వీటిని ఏర్పాటు చేయడం, మలమూత్రాల విసర్జనకు కూడా అవకాశం లేకుండా ఉండటం ఆఖరుకు ఆహారము, నీరు వంటి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం ఎక్కడి నుంచో దూరప్రాంతాల నుంచి వచ్చి గంటలు తరబడి వేచి ఉండటం అడుగడుగునా కనిపించింది.

బైరాగి పట్టెడ లోనైతే గడ్డి తొక్కేస్తారన్న కారణంతో పార్కులో నీళ్లు పట్టేయడంతో ఎక్కడ కూర్చోవాలో తెలియక బురద నీళ్లలోనే వేలమంది నిలబడుకొని ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది.

గంట గంటకు జనం విపరీతంగా పెరుగుతున్నా పోలీసుల సంఖ్యను పెంచాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నా ఆలోచన టీటీడీకి, ప్రభుత్వ యంత్రాంగానికి, పోలీసులకు రాకపోవడం అన్యాయం.

తిరుపతిలో ఏర్పాటుచేసిన దాదాపు అన్ని కేంద్రాల్లో ఈ తొక్కిసలాటలు, ఘర్షణలు జరిగాయి.

రెండు కేంద్రాల్లో భక్తులు మరణించడం కూడా జరిగింది. బైరాగి పట్టెడ కేంద్రంలో తొక్కిసలాట తర్వాత అంబులెన్స్ కోసం అరగంటకు పైగా నిరీక్షించాల్సి వచ్చిందంటే నిర్లక్ష్యం స్థాయి ఎలా ఉందో అర్థమవుతుంది. దాదాపు అన్ని కేంద్రాల్లో గాయాలకి గురైన వాళ్ళు, ఊపిరాడకుండా ఇబ్బందులు పడిన వాళ్ళు, టికెట్లు వద్దని వెనక్కు వెళ్లిపోయిన వారు వందల సంఖ్యలో కనిపించారు.

క్యూలైన్ల నిర్వహణలో అడుగడుగునా ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది.

గతంలో క్యూలైన్ల ఏర్పాటును తిరుమల జెఇఓ ఆధ్వర్యంలో కలెక్టర్, ఎస్పీ ఇతర ఉన్నతాధికారులు, టీటీడీ ఉద్యోగులు సమన్వయంతో నిర్వహించేవారు.

ఈ దఫా ప్రతిరోజు సమీక్షలు చేయడం గొప్పగా నిర్వహిస్తున్నామని ప్రకటనలు చేయడం వల్ల విపరీతమైన ప్రచారం లభించింది. ప్రచారానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది.

గతంలో వైకుంఠ ఏకాదశికి వచ్చేవాళ్ళకి టిక్కెట్ లేకపోయినా సర్వదర్శనానికి అనుమతించేవారు. ఈ దఫా టిక్కెట్ లేకపోతే తిరుమల కి రావడానికి వీల్లేదని ప్రకటన చేయడంతో ప్రతి వాళ్ళు ఏదో రకంగా టిక్కెట్టు సంపాదించాలి... వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలన్న ఆత్రుత వల్ల ఈ తొక్కిసలాటకి కారణమైనట్టుగా కనిపిస్తున్నది.

టీటీడీ యాజమాన్యం అనాలోచితంగా వ్యవహరించ బట్టే ఈ పరిస్థితి నెలకొందన్న విమర్శలు వచ్చాయి.

దర్శనం జరిగే పది రోజులు కంటిన్యూగా టికెట్లు ఇచ్చే పద్ధతి గతంలో ఉండేది. ఇప్పుడు మూడు రోజులకు కుదించడం కూడా ఒత్తిడి పెరగడానికి కారణంగా కనిపిస్తున్నది.

దర్శనాల విషయంలో టీటీడీకి నిర్దిష్టమైన విధానాలు ఉన్నాయి. ఆ విధానం ఆధారంగానే ప్రతిరోజు జరుగుతుంటుంది.

టీటీడీ ఉద్యోగులను భాగస్వామ్యం చేయడం కంటే శ్రీవారి సేవకులను, పోలీసుల్ని నమ్ముకోవటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని కొందరు ఉద్యోగులు వ్యాఖ్యానించారు.

బుధవారం నాటి ఉదయం ప్రతి కేంద్రం వద్ద కిలోమీటర్ల కొద్దీ లైన్లో నిలబడిపోయి ఉండటం వల్ల ట్రాఫిక్ కు విపరీతమైన అంతరాయం ఏర్పడింది.

స్థానికేతరులు తిరుపతి నగరంలో ఎక్కడ చూసినా కనబడ్డారు. ఆఖరుకు జనం పెరిగిపోవడంతో స్కూలు నుంచి ఇళ్లకు వచ్చే పిల్లల బస్సులు ఆలస్యంగా నడిచాయి. ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు.

తిరుపతి నగర ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇలాంటి కేంద్రాలు నివాస ప్రాంతాల్లోనూ జనసమ్మర్దం ఉండే ప్రాంతాల్లోనూ ఇరుకు వీధుల్లోనూ కాకుండా తారకరామా స్టేడియంలోనూ, నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్స్ లోనూ ఏర్పాటు చేసి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు.

ముందస్తు జాగ్రత్తలు తీసుకోక పోవడం, ప్రత్యామ్నాయాలను ఆలోచించక పోవడం వంటి విషయంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది.

అంతా జరిగిపోయాక ఇప్పుడు లబోదిబోమంటూ నేతలు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. తిరుపతి నగరానికి 'క్యూ' కడుతున్నారు.

తిరుపతి ఘటన ఎవరికి ఎంత నష్టం? ఎంత లాభం? అనే లెక్కలు వేసుకుంటూ అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు పరస్పర విమర్శలు చేసుకోవడం దురదృష్టకరం. జరిగిన ఘటనలో బాధితులను ఆదుకోవడం, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన విధంగా వ్యవహరించాలన్న ఆతృత కంటే ఈ ఘటన నుంచి లాభం ఎంత పొందాలి? ఎదుటి వాళ్లకు నష్టం ఎంత చేయాలి? అన్న దానిమీద ఆత్రుత కనిపిస్తున్నది.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మరో ఆరుగురు మంత్రులు దాదాపు అన్నిపక్షాల నాయకులు బాధితుల పరామర్శకు బుధవారం నాడు పెద్ద సంఖ్యలో వచ్చారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి అధికారుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జరిగిన తప్పులకు కారణాలేమిటో పరిశీలించకుండా... ప్రజల్లో సానుభూతి కోసం బహిరంగంగా ఐఏఎస్ అధికారులను తూలనాడటం సమస్యకు కారణమైన ఎస్ పి ని పల్లెత్తు మాట అనకపోవటం చర్చనీయాంశంగా మారింది.

రానున్న పది రోజులలోను ఇదే రకంగా జనం వచ్చే పరిస్థితులు ఉన్నందున, మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

వీఐపీ దర్శనాలు రద్దు చేశామని ప్రకటనలు చేస్తున్నా ఆచరణలో తిరుమల కొండ మొత్తం వీఐపీలతోనే నిండిపోయింది. వీఐపీల సంస్కృతి విపరీతంగా పెరిగిపోవడం ప్రతిదానికి లెక్కలు కట్టి డబ్బులు వసూలు చేయడం దేవుడి దగ్గర సిఫార్సుల లేఖలు పెరిగిపోవడం పట్ల సామాన్య భక్తుల్లో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. దేవుడి దగ్గర సామాన్యుడికి సమానత్వం లేకపోతే ఎలా అనే ప్రశ్న అడుగడుగున సంధిస్తున్నారు. ఏ పాపం తెలియని అమాయకులైన భక్తులు వందల, వేల మైళ్ళ దూరం నుంచి స్వామివారిని దర్శించుకోవాలన్న కాంక్షతో తమ జీవితాలకు మంచి జరుగుతుందన్న ఆశతో వచ్చి ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం విషయంలో ప్రభుత్వ ప్రకటన సమంజసం గా లేదు. ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ పాతిక లక్షలు మృతులకి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రతిపక్షాలు, సిపిఎం మృతులకు కోటి రూపాయలు, క్షతగాత్రులకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని మృతుల కుటుంబాలకు శాశ్వత ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశాయి. చనిపోయిన వారిని కనీసం వారిని నమ్ముకుని ఉన్న కుటుంబాల కైనా భరోసా కల్పించాల్సిన బాధ్యత ఆధ్యాత్మిక సంస్థ టిటిడి పై, రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జరిగిన ఘటనలో బాధ్యుల పట్ల కఠినంగా వ్యవహరించి భవిష్యత్తులో ఇట్లాంటి ఘటనలకు ఆస్కారం లేకుండా వ్యవహరించాలని కోరుకుందాం.

- టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షులు, తిరుపతి.

Read More
Next Story