
యువ రచయితల సమ్మేళనానికి జేజేలు
యువ రచయితలు ప్రజల జీవితాలకు, పోరాటాలకు మరింత దగ్గరగా ఉండాలి
నవంబర్ 22 న మన విశ్వనగరం హైదరాబాద్ యువ రచయితల, కవుల, కళాకారుల సమ్మేళనానికి వేదిక కానుంది. సమూహ రైటర్స్ ఫోరం ఆధ్వర్యంలో “ words against walls” నినాదంతో జరగనున్న ఈ సమ్మేళనానికి తెలంగాణ నలుమూలల నుండీ తరలి వచ్చే యువ రచయితలను , వారి మనోభావాలను విని అర్థం చేసుకోవడానికి, వారి నుండీ ఉత్సాహం పొందడానికి ఉత్సాహంగా వస్తున్న అనేక మంది సీనియర్ రచయితలను కలుసు కోవాలని, నాలాంటి సామాజిక కార్యకర్తల మనసు ఉవ్విళ్లూరుతోంది.
50 ఏళ్ల క్రితం 1970 దశకంలో “రచయితలారా .. మీరెటువైపు ?” అని విశాఖ విద్యార్ధులు నిగ్గదీస్తే , అనేకమంది రచయితలు,కవులు, కళాకారులు తమ కలాలను, లక్ష్యాలను సవరించుకున్నకాలాన్ని చూశాం.
ఆ రోజుల్లోనే “యువతరమా, నవతరమా , ఇదే అదను కదలిరమ్ము, మీ మీదే మా ఆశలు, మీ మీదే మా కన్నులు” అంటూ ప్రజా కవి చెరబండరాజు పిలుపు ఇస్తే యువతరం రాడికల్, ప్రగతిశీల శక్తులు గా మారి, సమాజాన్ని ముందుకు నడిపించే బాధ్యత తీసుకున్న కాలాన్ని చూశాం.
మరో 20 ఏళ్ళకు, 1990 దశకంలో “మాకు గోడలు లేవు, గోడలను పగల గొట్టడమే మా పని” అని తొలి రోజుల ఫెమినిస్టు ఉద్యమం ప్రకటిస్తే, పురుషాధిపత్య సమాజం పై వెల్లువలా దండెత్తిన సాహిత్యాన్ని ఆవాహన చేసుకున్నాం. వ్యక్తిత్వాలను సవరించుకున్నాం. ప్రపంచంలో సగ భాగంగా ఉన్న మహిళలతో కలసి పని చేయాల్సిన అవసరాన్ని కూడా గుర్తించాం.
మరో 20 ఏళ్ళకు 2000 దశకంలో “శ్రామిక సమూహం సరే, సమాజంలో ఉనికిలో ఉన్న ఆస్తిత్వాల మాటేమిటి? ఆ ఆస్తిత్వాల ప్రత్యేక సమస్యల మాటేమిటి?” అని ఆయా ప్రత్యేక సమూహాల నుండీ ఎదిగి వచ్చిన అనేక మంది సృజన కారులు బలంగా , లోతుగా ప్రశ్నల బాణాల్ని వదిలితే గాయపడిన వాళ్ళున్నారు. భుజాలు తడుముకున్న వాళ్ళున్నారు.
కానీ, ఆ ప్రశ్నలలో నిజాయితీని, నిర్భీతిని, నిజాలను గుర్తించి అక్కున చేర్చుకున్న వాళ్ళనూ , తమ సామాజిక దృక్పధం అవగాహనలో మార్పులు చేసుకున్న వాళ్లనూ చూశాం.
ఈ కాలమంతా దళిత, బహుజన, మైనారిటీ సమూహాల నుండీ విస్తృత సాహిత్యం వచ్చింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలతో వచ్చిన సాహిత్యం, కళా రూపాలు కూడా సమాజం పై బలమైన ప్రభావాన్ని వేశాయి. దశాబ్ధాలుగా నిరంతర ప్రవాహంగా విప్లవ సాహిత్యం తన గొంతు వినిపిస్తూనే ఉంది. తనదైన ముద్ర వేస్తూనే ఉంది.
ప్రేమ కవిత్వం, ప్రకృతి ఆరాధనా సాహిత్యం, జీవితాలలోని వాస్తవికతను యధాతధంగా చిత్రీకరించే సాహిత్యం తమ ఒరవడిలో తాము ప్రవహిస్తూనే ఉన్నాయి. వర్తమాన రాజకీయాలకు దూరంగా, ప్రజలకు, వివిధ సైద్ధాంతిక దృక్పథాలకు అతీతంగా కేవలం ఏదో ఒక సాహిత్యాన్ని సృజించే వాళ్ళ సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నది. కాకపోతే వీరి రచనలలో అయోమయం, గందరగోళం కూడా అదే మోతాదులో ఉంటున్నది.
సృజన కారులకు ఉండే శక్తి సామర్ధ్యాలను, వారి రచనలకు, గొంతులకు ఉండే బలాలను గుర్తించవలసిందే కానీ, సాధారణ ప్రజలు ఎదుర్కుంటున్న నిజమైన సమస్యలపై వారికి స్పష్టమైన అవగాహన, వాటిని పరిష్కరించే క్రమంలో ఎదురయ్యే రాజకీయ, పాలనా సమస్యలు, సమస్యలకు వ్యతిరేకంగా పోరాడే ప్రజల పోరాట రూపాలు, ప్రభుత్వాల దమన రీతులు, ప్రజా వ్యతిరేక విధానాలపై విధాన స్పష్టత, దోపిదే, పీడన, వివక్షలను, అన్యాయాలను వ్యతిరేకించే ధోరణి ఇప్పటి యువ రచయితలు, కవులు జీవితంలో భాగం చేసుకోవడం ఒక అవసరంగా గుర్తించాలని మాలాంటి వాళ్ళ కోరిక.
ముఖ్యంగా మొదటి నుండీ ప్రతిఘటన స్వభావాన్ని కలిగిన తెలంగాణ సమాజం గత మూడు దశాబ్ధాలుగా ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక సంక్షోభానికి గురై , ఆత్మహత్యల కేంద్రంగా మారుతున్నది. ముఖ్యంగా గ్రామీణ వ్యవసాయ కుటుంబాలలో 93 శాతం కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నాయి. ఐదు ఎకరాలలోపు రైతు కుటుంబాల ఆదాయం నెలకు 9300 రూపాయలు మాత్రమే. రాష్ట్రంలో స్వంత భూమి లేని, అతి తక్కువ స్వంత భూమి ఉన్న కౌలు రైతుల సంఖ్య భారీగా పెరుగుతున్నది.
వ్యవసాయంలో ప్రధాన శ్రమ చేసే మహిళలకు రైతులుగా గుర్తింపు లేదు. గ్రామీణ ప్రాంతం లో ఉన్న వ్యవసాయ కూలీలకు పని దినాలు తగ్గిపోతున్నాయి. వాళ్ళకు రైతు బీమా లాంటి సామాజిక బధ్రత కూడా లేదు. రసాయన ఎరువులు, పురుగు విషాల వినియోగం భారీగా పెరిగిపోయి, రాష్ట్రమంతా గాలి,నీరు, ఆహారం విష కాలుష్యంతో నిండిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో మద్యం ఏరులై ప్రవహిస్తూ, మగవాళ్ళ మరణాలకు కారణమవుతూ, ఒంటరి, వితంతు మహిళల సంఖ్య లక్షలలోకకి చేరుతున్నది. పౌష్టికాహార లోపం గ్రామీణ ప్రజల అనారోగ్యాలకు కారణమవుతున్నది.
ఈ పరిస్థితులను తెలంగాణ యువ రచయితలు, కవులు, కళాకారులు ఎంతగా అర్థం చేసుకుంటున్నారు ? ఈ సమస్యలకు కారణాలను ఎంతగా తమ రచనలలో విశ్లేషిస్తున్నారు. సంక్షోభంలో ఉన్న గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల కుటుంబాల బాధలను ఎంతగా తమ రచనలలో ప్రతిబింబిస్తున్నారు ?
పట్టణాల, నగరాల జనాభా క్రమంగా పెరుగుతున్నది. నగరాలలో ఎలాంటి స్వంత నివాస వసతి, సుస్థిర ఉపాధి, తగినంత ఆదాయాలు లేని అసంఘటిత కార్మికుల, గిగ్ కార్మికుల , కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. నిరుద్యోగం భారీగా పెరిగింది. పెరుగుతున్న నగరాలలో గాలి, నీరు, కలుషితమై ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. నగరాల చుట్టూ వస్తున్న పరిశ్రమలు, సంస్థలలో స్థానిక యువతకు ఉపాధి దొరకడం లేదు. రాష్ట్రంలోకి వలస కార్మికులు లక్షల సంఖ్యలో తరలి వస్తున్నారు. వాళ్ళను మిగిలిన సమాజం మనుషులుగా కూడా చూడడం లేదు.
విద్యా ప్రమాణాలలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే చివరి స్థానంలో ఉంది. ప్రభుత్వ రంగ స్కూల్స్ లో 25 శాతం కూడా విద్యార్ధులు మిగలలేదు. స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీ లలో మౌలిక వసతులు లేక, బోధనా సిబ్బంది లేక ,ఎలాగైనా కష్టపడి చదువు చెప్పించాలనే ఆలోచనతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్రమైన ఆర్ధిక భారాన్ని భరిస్తూ, తమ పిల్లలను ప్రైవేట్ విద్యా సంస్థలకు పంపుతున్న దుస్థితి ఉంది.
సమాజంలో వస్తున్న ఈ మార్పులన్నిటినీ, యువ రచయితలు గమనిస్తున్నారనే అనుకుంటాను. స్వయంగా తమ కుటుంబాలలో కూడా ఈ సమస్యలను భరిస్తున్న తమ కుటుంబాల పెద్దలను అర్థం చేసుకుంటూనే ఉన్నారని కూడా ఆశిస్తాను. ఒక వేళ నగరాలలోనే పుట్టి పెరిగి , ఆర్ధికంగా ఇబ్బందులు లేని, వివక్షకు గురి కాని జీవితాలనే గడిపిన యువ రచయితలు, కవులు కూడా సృజన రంగంలో ఉన్నప్పుడు, తమ నిత్య జీవితంలో, తమ స్నేహితులను, తమ చుట్టు పక్కల ప్రజల జీవితాలను, తమదైన శైలిలో పరిశీలిస్తున్నారనే అనుకుంటాను.
ఇప్పటి వరకూ అలాంటి ప్రయత్నం చేయకపోతే, అలాంటి ఒక కృషిని ప్రారంభించాల్సిన అవసరముందని నా అభిప్రాయం. వాటిని యువ రచయితలు, కవులు తమ రచనలలో ప్రతిబింబించాలని నా కోరిక. తమ మనసులోని భావాలను వ్యక్తం చేయడానికి యువ రచయితలు, కవులు ఎన్ని పురిటి నొప్పులు పడతారో, చుట్టూ ఉన్న అంశాల నుండీ, ప్రజల నుండీ నేర్చుకోవడానికి అంతగానూ కష్టపడాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.
కుల వివక్ష, కుల ఉన్మాద దాడులు, మత మైనారిటీలపై పెరుగుతున్న వివక్ష, జండర్ స్పృహ లేకపోవడం, పర్యావరణ విధ్వంసం – ఇవన్నీ మన చుట్టూ ఎదురవుతున్న సమస్యలే. కానీ వీటిపై రచనలను, ఇప్పటికీ, అస్తిత్వ స్పృహతో, ఆయా సమూహాల నుండీ వచ్చిన వారే చేస్తున్నారా ? అస్థిత్వ ఉద్యమాలు ఇచ్చిన అవగాహనతో, స్పృహతో మిగిలిన రచయితలు కూడా, వాటిని అర్థం చేసుకోవడానికి, రచనలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా ? భావ ప్రకటన అంటేనే, పరస్పరం వినడం, నేర్చుకోవడం కదా..
ఒక సృజన శీలికి తనది కాని ప్రపంచమంటూ ఏమీ ఉండదు . కాదేదీ కవిత కనర్హం అని మహా కవి ఎప్పుడో చెప్పాడు కదా ? మరీ ముఖ్యంగా కష్ట జీవి కి ఇరువైపులా ఉండే వాడే కవి అని ఒక కవి అంటారు.
ఎంత మంది యువ రచయితలు ఎలాంటి ఊగిసలాటలు లేకుండా అన్ని అంశాలనూ తమవిగా మార్చుకోవడానికి, ప్రజల పక్షాన నిలబడడానికి ప్రయత్నిస్తున్నారో తెలియదు. అలా ఉండలేక పోవడానికి యువ రచయితలకు ఎదురవుతున్న ఆటంకాలేమిటో, వాటిని అధిగమించడానికి చేయాల్సిందేమిటో కూడా యువ రచయితల సమావేశాలలో చర్చలు లోతుగా జరగాల్సి ఉంటుంది. మార్పులను సాధించాల్సి ఉంటుంది.
సమాజం అభివృద్ధి గురించి, ప్రజల సంక్షేమం గురించి, నడిచే దారుల గురించి కూడా సమాజంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఆ భిన్నాభిప్రాయాలు యువ రచయితలపై కూడా ప్రభావం చూపిస్తాయి. ప్రజలలో మూడత్వాన్ని పెంచే భావవాద దృక్పథాన్ని పూర్తిగా వదిలిపెట్టినా, ప్రగతి శీల ఆలోచనలు కలిగిన భౌతిక వాద స్రవంతిలో బుద్దుడు, కారల్ మార్క్స్, జ్యోతిబా ఫూలే , డాక్టర్ అంబేద్కర్ ఆలోచనా స్రవంతులు,సైద్ధాంతిక దృక్పధాలు మన తెలంగాణ సమాజంలో వేళ్లూనుకుని ఉన్నాయి. వాటిపై సంఘర్షణలు, సానుకూలతలు చాలా సహజం.
ఈ దృక్పథాలను లోతుగా అర్థం చేసుకోవడానికి నిరంతర అధ్యయనం యువ రచయితల జీవితంలో భాగమయితే, వారి ఆలోచన, అవగాహన మరింత మెరుగవుతాయి. రచనలు మరింత పదునవుతాయి. “మన ఆలోచించే ధోరణి మాత్రమే సరైంది, మిగిలినవన్నీ పనికి మాలినవి” అనే అహంభావాన్ని వదులుకుంటే ఆలోచనలో విశాలత్వం పెరుగుతుంది.
మనుస్మృతిని ప్రచారం చేసి, సమాజాన్ని వెనక్కు నడిపించాలని చూసే సంఘ్ మూకలను ఎదిరించాలంటే, సమాజాన్ని ముందుకు నడిపించే లక్ష్యంతో సంఘర్షించే వివిధ సైద్ధాంతిక ఆలోచనా ధోరణులను కలిగిన వారిని మిత్రులుగా చూసే మనస్తత్వం మన స్వంతమయితే, మనం బలం రెట్టింపు అవుతుంది. శత్రు వైరుధ్యాన్ని పోరాటం ద్వారా మాత్రమే పరిష్కరిస్తాం. మిత్ర వైరుధ్యాన్ని స్నేహంతో చేసే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. అదొక్కటే మార్గం. యువ రచయితలు ఈ విషయంలో మెచ్యూరిటీ తో వ్యవహరిస్తే, సీనియర్ రచయితలు కొందరిలో వ్యక్తమయ్యే ఇలాంటి అపసవ్య ధోరణులను సరి చేయవచ్చు. తద్వారా మొత్తంగా సమాజానికి, ప్రజలకు మేలు చేసిన వాళ్ళవుతారు.
ఒక్కోసారి రచయితలకు , మిగిలిన సమాజానికి ఏదో కానరాని దూరం పెరిగిపోయినట్లు అనిపిస్తున్నాయి. సమాజంలో తమను తాము భాగంగా పునర్నిర్వచించుకునే ధోరణి రచయితలు, కవులలో తగ్గిపోతున్నట్లే, రచయితలతో, కవులతో సుహృద్భావ సంబంధాలు, కలయికలు సామాజిక కార్యకర్తలకు, చివరికి ప్రజా సంఘాల, ప్రజాపక్ష రాజకీయ పార్టీలకు లేకుండా పోతున్నది. ఎవరి ప్రపంచంలో వాళ్ళు బతుకుతున్న పరిస్థితి పెరిగింది.
రచయితల సమావేశాలకు , సామాజిక కార్యకర్తలు హాజరు కావడం, సామాజిక కార్యకర్తలు ప్రజా సమస్యలపై నిర్వహించే సమావేశాలకు రచయితలు, కవులు హాజరు కావడం అనే ప్రక్రియ లేకుండా పోయింది. ఫలితంగా పరస్పరం నేర్చుకునే అవకాశాలు కూడా తగ్గి పోతున్నాయి. దీనిని మళ్ళీ ఎలా పునరుద్ధరించుకోవడం ఎలా అనే చర్చలు ఇప్పటి యువ రచయితల సమావేశాలలో జరగాలని మా కోరిక .
యువ రచయితలు అర్థం చేసుకుంటారనే ఆశతో ,చివరిగా ఒక మాట. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన రచయితలు, కవులు , కొన్ని సార్లు చెడు అలవాట్లకు బానిసలై చాలా చిన్నవయస్సులోనే మృత్యు శయ్యపైకి చేరుతున్నారు. ముఖ్యంగా మద్యం వ్యసనానికి గురయిన, అనేక మంది రచయితలు, కవులు అనారోగ్యాలకు బలైపోయారు. సమాజం అద్భుతమైన సృజన కారులను కోల్పోయింది. యువ రచయితలు ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి. మీ అకాల మరణాల ద్వారా, స్వంత కుటుంబాలకు,సమాజానికి నష్టం చేసే హక్కు మీకు లేదని గుర్తించుకోవాలి.

