ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే షోకాజ్ నోటీసులు ఇస్తారా ?
x

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే షోకాజ్ నోటీసులు ఇస్తారా ?

ప్రభుత్వ పాలన రాష్ట్రమంతా ఇంత ప్రజాస్వామికంగా ఉంటుందని భ్రమిస్తే కష్టమే. ప్రజల ఆందోళనలు, ఆలోచనలు, డిమాండ్ల పట్ల అంతులేని అసహనం కనపడుతున్నది.

తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుండీ ప్రజాస్వామ్య భావనకు ప్రభుత్వాల వైఖరి తో సవాల్ ఎదురవుతూనే ఉంది. ప్రజలు పౌరులుగా తమ ప్రాధమిక హక్కులను ఉపయోగించుకోవడానికి ప్రభుత్వంతో నిత్యం సంఘర్షణ పడవలసే వస్తున్నది. పాలనలో ప్రజాసామ్య స్పూర్తి ఒక విధానంగా కాక, ప్రభుత్వాల అవసరార్ధం మారిపోతూ ఉంటుంది.

గత పదేళ్ళ KCR పాలనలో అప్పటి ప్రభుత్వం ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి తగిన వేదికలను , అవకాశాలను కల్పించకుండా నిరంకుశ వైఖరితో వ్యవహరించింది. పోలీస్ నిఘా, నిర్బంధంతో ప్రజా సంఘాల కదలికలను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసింది. రాజకీయ,సామాజిక కార్యకర్తల ముందస్తు అరెస్టులు సాధారణ వ్యవహారంగా ఉండేవి. అనేకమంది రాజకీయ, ప్రజా సంఘాల కార్యకర్తలపై UAPA కేసులు కూడా విచ్చలవిడిగా బనాయించారు. ఆనాడు రాష్ట్రంలో ప్రశ్న, ప్రజాస్వామ్య హక్కులు, పౌరుల ప్రాధమిక హక్కులు అంటరానివిగా మారిపోయాయి.

రైతులు,కార్మికులు, విద్యార్ధులు, మహిళలు,ఆదివాసీలు,మత మైనారిటీలు –ఒకరేమిటి, అందరికందరూ అప్పటి ప్రభుత్వ నిర్బంధ విధానాలతో విసుగు చెందారు. ఆ ప్రభుత్వాన్ని వదిలించుకుంటే తప్ప, ప్రజల హక్కులకు గ్యారంటీ ఉండదని బలంగా నమ్మారు. 10 నెలల క్రితం గత నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో BRS పార్టీని చిత్తుగా ఓడించడానికి ఇదొక బలమైన కారణంగా పని చేసింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ , ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలతో పాటు, ఏడవ గ్యారంటీగా ఇచ్చిన ప్రజాస్వామిక ప్రజా పాలన అనే వాగ్ధానం కూడా కాంగ్రెస్ వైపు మొగ్గడానికి ప్రజల పై బలమైన ప్రభావాన్ని పడేసింది.

అందుకే భారత రాష్ట్ర సమితి ఓడిపోయి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం లోకి రాగానే, ప్రజలు దశాబ్ధ కాల మౌనం వీడి సంబరాలు చేసుకున్నారు. అదే సమయంలో KCR నివాసంగా ఉంటూ వచ్చిన ప్రగతి భవన్ గేట్లు బద్ధలై , ప్రగతి భవన్ కాస్తా, ప్రజా భవన్ గా మారిపోయింది. వారానికి రెండు సార్లు ప్రజల సమస్యలు వినే ప్రజావాణిగా మారిపోయింది. ప్రజల పట్ల ప్రేమ, బాధ్యత కలిగిన ఇద్దరు వ్యక్తులు (రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్ జి. చిన్నారెడ్డి గారు, ప్రజా భవన్ నోడల్ ఆఫీసర్ దివ్య దేవరాజన్ గారు) అక్కడ నిత్యం ప్రజల సమస్యలను వింటున్నారు. వాటి పరిష్కారానికి తమదైన పద్ధతిలో కృషి చేస్తున్నారు.

కానీ, ప్రభుత్వ పాలన రాష్ట్రమంతా ఇంత ప్రజాస్వామికంగా ఉంటుందని భ్రమిస్తే కష్టమే. జిల్లా స్థాయి అధికారులకు , ఇంకా ప్రజా పాలన స్పూర్తి హృదయానికి ఎక్కలేదు. ప్రజలకు ఉండే రాజ్యాంగ బద్ధ హక్కుల పట్ల కనీస స్పృహ లేకుండా వ్యవహరించడం కనపడుతున్నది. ప్రజల ఆందోళనలు, ఆలోచనలు, డిమాండ్ల పట్ల అంతులేని అసహనం కనపడుతున్నది. ముఖ్యంగా సామాజిక కార్యకర్తలు ఎవరైనా, ప్రజల పక్షాన నిలబడి గొంతు వినిపిస్తే, వారి పట్ల మరింత అసహనంగా వ్యవహరించడం చూస్తున్నాం. ఈ క్రింది ఉదాహరణే అందుకు పెద్ద నిదర్శనం.

నిర్మల్ జిల్లా కేంద్రం బాగులవాడ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడుగా పని చేస్తున్న ఆరేపల్లి విజయ్ కుమార్ గారిపై కొన్నిఆరోపణలు చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి (DEO) గారు సెప్టెంబర్ 2 తేదీతో ఉన్న ఒక షోకాజ్ నోటీస్ ను సెప్టెంబర్ 26 న విజయ్ కుమార్ గారికి అంద చేశారు. దీనికి రిఫరెన్స్ గా ఆగస్ట్ 28 న దిలావర్ పూర్ SI గారు జిలా పోలీస్ సూపరెంటెండెంట్ గారికి పంపిన రిపోర్ట్ ను, జిల్లా పోలీస్ సూపరెంటెండెంట్ గారు 30-08-2024 న జిల్లా కలెక్టర్ గారికి రాసిన లేఖను ఉంచారు. అక్టోబర్ 2 నాటికి తమ షోకాజ్ నోటీస్ కు జవాబు ఇవ్వాలని ఆదేశించారు.

జిల్లా పోలీస్ సూపరెంటెండెంట్, జిల్లా కలెక్టర్ గారి ఒత్తిడితో, జిల్లా విద్యాశాఖాధికారి గారు ఇచ్చిన ఈ షోకాజ్ నోటీస్ లో విజయ్ కుమార్ గారిపై కొన్ని అవాస్తవాలతో కూడిన ఆరోపణలు చేశారు. వాటిలో ప్రధానోపాధ్యాయుడిగా ఆయన విధి నిర్వహణ గురించి కానీ, టీచర్ గా విద్యా బోధనలో ఆయన పిల్లలతో వ్యవహరిస్తున్న తీరు గురించి కానీ ఒక్క ఆరోపణ కూడా చేయలేదు.

విజయ్ కుమార్ గారు కేంద్ర ప్రభుత్వ ఇథనాల్ పాలసీని వ్యతిరేకిస్తున్నారని, జిల్లాలో ఏర్పడుతున్న ఇథనాల్ పరిశ్రమను అడ్డుకుంటున్నారని, శాంతి బద్రతల సమస్యలు సృష్టిస్తున్నారని, దిలావర్ పూర్ లో ఇథనాల్ కంపనీకి వ్యతిరేకంగా అమాయకులైన రైతులను రెచ్చగొడుతున్నారని షోకాజ్ నోటీస్ లో ఆరోపణలు చేశారు. ఇందుకు గాను, ఆగస్ట్ 14 న దిలావర్ పూర్ లో గ్రామస్తులు నిబంధనలను ఉల్లంఘించి ర్యాలీ తీశారని, అందుకు విజయ్ కుమార్ ప్రోత్సహించాడని తప్పుడు ఆరోపణలతో అక్కడి SI ఇచ్చిన రిపోర్ట్ ను ప్రాతిపదికగా పెట్టుకున్నారు. నిజానికి ఆ రోజు విజయ్ కుమార్ గారు స్కూల్ విధుల్లో ఉన్నారు. ఆ రోజు ఆయన దిలావర్ పూర్ గ్రామానికి కూడా వెళ్లలేదు..

విజయ కుమార్ గారు గత 37 సంవత్సరాలుగా ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. విద్యార్ధులతో, తోటి టీచర్ల తో అత్యంత మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. టీచర్ గా తన వృత్తికి న్యాయం చేస్తూనే, ఉపాధ్యాయ సంఘంలో నాయకుడుగా కూడా ఉన్నారు. ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి అగ్రశ్రేణి తెలంగాణ నాయకులు నిర్మించిన తెలంగాణ విద్యావంతుల వేదిక సంస్థకు జిల్లా బాధ్యులుగా కూడా పని చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో వివిధ ప్రజా సంఘాల ఐక్య వేదిక, గా 15 ఏళ్ల క్రితం ఏర్పడిన తెలంగాణ జేఏసీ ( ప్రస్తుతం తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ) ఛైర్మన్ గా ఉండి , ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా చురుకుగా పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక కూడా గత పదేళ్లుగా గత ప్రభుత్వ నిరంకుశ పోకడలను వ్యతిరేకిస్తూ, జిల్లా ప్రజల హక్కుల కోసం నిలబడి మాట్లాడిన వ్యక్తి. జిల్లాలో బీజేపీ ఫాసిస్టు పోకడలకు వ్యతిరేకంగా ఆదివాసీలకు, మత మైనారిటీలకు ఎప్పుడూ అండగా ఉండే వ్యక్తి. రైతుల సాగు నీటి సమస్యలపై నిత్యం ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రజల తలలో నాలుక లా వ్యవహరించిన వ్యక్తి. ఇలాంటి అన్ని సందర్భాలలో కూడా టీచర్ గా ఆయన తన విధులను సక్రమంగా నిర్వహించారు. అదే సమయంలో ఒక వ్యక్తిగా, పౌరుడిగా ప్రజల పక్షాన ఉండి న్యాయం కోసం మాట్లాడడం ఆయనకున్న ప్రజాస్వామిక బాధ్యతగా గుర్తించి ఆ బాధ్యతలను నిర్వహించారు. నిజానికి అది ఆయన కున్న సహజమైన, రాజ్యాంగపరమైన ప్రాధమిక హక్కు కూడా.

గత సంవత్సర కాలంగా దిలావర్ పూర్ –గుండంపల్లి గ్రామాల మధ్య నిర్మాణమవుతున్న ఇథనాల్ కంపనీ విషయంలో ప్రజలు ఆయనను సంప్రదించినపుడు ఆయన ప్రజలకు ఇథనాల్ గురించి, దాని తయారీ నుండీ వెలువడే వాయు, జల కాలుష్యం గురించీ అధ్యయనం చేసిన విషయాలను వివరించారు. తెలంగాణ పీపుల్స్ జేఏసీ రాష్ట్ర కమిటీ సభ్యులు, పర్యావరణ వేత్త డాక్టర్ కె. బాబూరావు గారు, TPJAC కో కన్వీనర్ కన్నెగంటి రవి గారు రాసిన వ్యాసాలను వారికి అంద చేశారు. ప్రజలు కూడా అప్పటికే, నారాయణ పేట జిల్లా మరకల్ మండలం చిత్తనూర్ లో నడుస్తున్న ఇథనాల్ కంపనీని చూసి వచ్చారు. అక్కడి ప్రజలతో వివరంగా చర్చించి వచ్చారు. తమ అనుభవాల నుండీ ప్రజలు తమ ప్రాంతంలలో ఈ కంపెనీ అవసరం లేదని తీర్మానించుకున్నారు. తమ వ్యవసాయ భూములను, సాగునీటి వనరులను ,గ్రామాలను కాలుశతం నుండీ కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో మాకొద్ధీ ఇథనాల్ ఫ్యాక్టరీ నినాదంతో ఒక ఐక్య కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయం పై లోక్ సభ ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా తాము గెలిస్తే, ఇక్కడ ఇథనాల్ కంపెనీ రాకుండా అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. కానీ మాట తప్పారు.

రాష్ట్ర ప్రభుత్వానికి కూడా స్థానిక ప్రజలు అనేక మెమోరాండం లు ఇచ్చారు. గత 70 రోజులుగా స్థానికంగా దీక్షలు చేస్తున్నారు. ప్రజలు శాంతియుతంగా చేస్తున్న ఈ ఆందోళనల పట్ల విజయ్ కుమార్ గారు జేఏసీ ఛైర్మన్ గా తన సానుభూతిని వ్యక్తం చేశారు. రెండు సార్లు జిల్లా కలెక్టర్ గారితో జరిగిన చర్చలలో కూడా గ్రామాల ప్రజలతో కలసి పాల్గొని తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆగస్ట్ 17న రాష్ట్ర ప్రజా భవన్ లో స్థానిక ప్రజలతో కలసి వచ్చి అధికారులకు మెమోరాండం ఇచ్చారు. ఇలాంటి చట్టబద్ధ కార్యక్రమాలు తప్ప, తన జీవితంలో ఆయనెప్పుడూ ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడలేదు.

రాష్ట్రంలో ప్రజా పాలన ఏర్పడి 10 నెలలు గడవక ముందే దానికి భిన్నమైన పోకడలతో, నిర్మల్ జిల్లా అధికారులు, విజయ్ కుమార్ లాంటి సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తుల ప్రజాస్వామిక హక్కుపై దాడి చేస్తున్నారు. ఆయనపై తప్పుడు ఆరోపణలు చేసి షో కాజ్ నోటీస్ ఇచ్చి, ఎలాగైనా, ఆయనను విధుల నుండీ సస్పెండ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే, స్థానిక ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా, ఇథనాల్ కంపనీ యాజమాన్య ఒత్తిడి మేరకు స్థానిక, జిల్లా అధికారులు పని చేస్తున్నట్లు కనిపిస్తున్నది. విజయ కుమార్ లాంటి వారిని స్థానికంగా అడ్డు తొలగించుకుంటే, ప్రజలను అణచి వేయడం సాధ్యమవుతుందనే దురుద్దేశ్యం కూడా వారికి ఉంది.

BRS ప్రభుత్వ పాలనా కాలంలో నారాయణ పేట జిల్లా చిత్తనూరు ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా స్థానిక ప్రజలు పోరాడినప్పుడు, అక్కడి ప్రజలకు సంఘీభావంగా పని చేస్తున్నాడనే ఆరోపణలతో అక్కడి జిల్లా అధికార గణం కూడా బండారు లక్ష్మయ్య అనే జూనియర్ కాలేజీ లెక్చరర్ పట్ల ఇదే విధంగా వ్యహరించింది. ఆయనపై కేసులు పెట్టింది. జైలుకు పంపింది. విధుల నుండీ సస్పెండ్ చేసింది. ఐదు నెలల తరువాత సస్పెండ్ ఎత్తేసినా, శిక్షగా ఆయనను హైదరాబాద్ నుండీ దూర ప్రాంతానికి బదిలీ చేసి కక్ష తీర్చుకుంది. ఇప్పుడు విజయ్ కుమ్మార్ సార్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో కూడా స్థానిక నిర్మల్ జిల్లా అధికార గణం అదే విధంగా వ్యవహరించడం శోచనీయం. ప్రజల పట్ల, ప్రజాస్వామిక వాదుల పట్ల అధికార గణం ఇలాగే వ్యవహరిస్తే, అది రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకునే ప్రజా పాలనకు మాయని మచ్చే.

Read More
Next Story