ఇంటిని మానవీకరించే ‘ఇల్లొక రాజకీయం’
x
సభలో ప్రసంగిస్తున్న గీతాంజలి

ఇంటిని మానవీకరించే ‘ఇల్లొక రాజకీయం’

గీతాంజలి ‘ఇల్లొక రాజకీయం’ ‘అత్తరు మునక’ ఆవిష్కరణ


‘‘గీతాంజలి ‘ఇల్లొక రాజకీయం’ కవితా సంకలనంలో ఇంట్లో ప్రతి ఒక్క దాన్ని మానవీకరించే ప్రయత్నం చేశారు. మనుషులను ఆలోచించే విధంగా రాశారు.’’ అని ఎస్వీయూనివర్సిటీ ఓరియంటల్ రిసెర్చి ఇన్ స్టిట్యూట్ విభాగాధిపతి ప్రొఫెసర్ పి.సి. వెంకటేశ్వర్లు అన్నారు. పౌరచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో గీతాంజలి రచించిన ‘ఇల్లొక రాజకీయం’ కవితా సంకలనాన్ని పి.సి. వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. పౌరచైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు వాకా ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ పుస్తకావిష్కరణ సభలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ‘‘ఈ కవితా సంకలనంలో గీతాంజలి ఇంటికి సంబంధించిన తలుపులు, కిటికీలు, గోడలు, పెరడు వంటి వాటన్నిటి గురించి రాస్తూ, ఇంటికి కొన్ని కొత్త నిర్వచనాలిచ్చారు. ఆనిర్వచనాలు సహజంగా మనం చూసే నిర్వచనాలు కావు. మానవీయ స్పర్శతో కూడిన నిర్వచనాలు. ఇంటిని వర్ణించి, ఇంటి గురించి రుచి చూపించారు. ‘చేలలో ఇంకిపోయిన నీళ్ళు అమ్మ కళ్ళలోంచి కారుతోంది’ ఇది ఇల్లంటే. చాలా గొప్పది, ఆర్ద్రమైనది.

గీతాంజలి మొదటి కవితా సంకలనమే ఇంత గొప్పగా ఉందంటే ఆశ్చర్యం వేస్తుంది. తరువాత వచ్చే కవితా సంకలనాలు ఇంకెంత గొప్పగా ఉంటాయో ఊహించుకోవచ్చు! ఈ కవితల్లో లోతైన సామాజిక విషయాలు ఉన్నాయి. ‘కిటికీ తానంతట తాను మూసుకోదు, మనం మూస్తే తప్ప’ అనడంలో ఎంత లోతైన తాత్వికత ! ‘యుగయుగాలుగా విన్న మాటలకు గోడలు పగుళ్ళిచ్చాయి’ అంటారు. మనకు తెలియకుండానే ఇంట్లో రాజకీయం నడుస్తుండడాన్ని చెపుతారు. సమాజానికి గీతంజలి చెప్పే భాష్యమే ఈ కవితా సంకలనం’’ అని విశ్లేషించారు.

తన కవితా సంకలనంపై పి.సి. వెంకటేశ్వర్లు చేసిన విశ్లేషణకు స్పందనగా, గీతాంజలి మాట్లాడుతూ, ‘‘ఇల్లు పురుష రాజకీయాలను, వారి అధికారాలను కాపాడేదే. మహిళలపైన చేసే మారిటైల్ రేప్ లను సహజమైన దాంపత్యంగా చూపిస్తున్న స్థితిలో ఇల్లు ప్రశ్నిస్తుంది. ఇంటికి రహస్య ఎజెండా ఉంటుంది. కొందరి ఇళ్ళు అందంగా కనిపిస్తూ, హింస లేకపోయినప్పటికీ, అందులో రాజకీయాలు మాత్రం ఉంటాయి. ప్రశ్నిస్తే మాత్రం ఇది అత్తిల్లు, నీది కాదు, జాగ్రత్త అని హెచ్చరిస్తుంది ఇల్లు. అందుకే ఇంటిని రొమాంటిసైజ్ చేయడం తప్పు. ఇంటికి స్త్రీ ఎప్పుడూ పరాయిదే.’’ అని తెలిపారు.

సూర్యకిరణాలు సైతం చొచ్చుకుపోని చోటికి కూడా చొచ్చుకుపోయినట్టు, తాను ముస్లిం కాకపోయినా, ముస్లింల ఇళ్ళలోకి, వారి జీవితాల్లోకి చొచ్చుకు పోయి పహెచాన్-2 కథల సంపుటిగా గీతాంజలి ‘అత్తరుమునక’ రాశారని ఆకాశవాణి విశ్రాంత డైరెక్టర్ ఆకుల మల్లేశ్వరరావు అన్నారు. ‘అత్తరుమునక’ కథాసంకలనాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడుతూ, ‘‘అత్తరు మునక చదువుతుంటే ముస్లిం సమాజానికి బైట వ్యక్తి రాసిన కథలనుకోరు. లోపలి వ్యక్తి అయినా ఇంత లోతుగా వారి జీవితాలను గీతంజలి అర్థం చేసుకుని రాయడం ఆశ్చర్యం వేస్తుంది. కళ్ళ ముందు జరుగుతున్న ఘటనలనే గీతాంజలి కథలుగా రాశారు. వీటిపైన కథలు అని నెపం మాత్రమే కానీ, వీటిలో తన దైన రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తాయి. ముస్లింలలోని బోహ్రా కమ్యూనిటీలో చాలా దారుణమైన ఖత్నా దురాచారం గురించిన కథ రాయడం మామూలు విషయం కాదు. ముస్లిం స్త్రీలతో సహజీవనం సాగించి రాసినంత సహజంగా ఈ కథలు ఉన్నాయి.’’ అంటూ వివరించారు.

స్వాతంత్ర్యానికి పూర్వం, స్వాతంత్ర్యానంతరం అనేక మతకలహాలు జరిగాయిని, గోద్రా రైలు దహనం తరువాత జరిగిన మతకలహాల వెనుక రాజకీయ అజెండా ఉందని ‘అత్తరు మునక’ సమీక్షకు స్పందనగా గీతాంజలి మాట్లాడుతూ అన్నారు. గుజరాత్ అల్లర్ల వెనుక బీజేపి, ఆర్ ఎస్ ఎస్ వారి రాజకీయ ఎజెండా ఉందని, ముస్లింల వ్యాపారాలు, వారి ఆర్థిక వ్యవస్థపైన దాడి చేసి నాశనం చేయడమే వారి ఎజెండానని వివరించారు. ఇదంతా చేసింది ఎవరు? నాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ నోరెత్తలేదెందుకు? అని ప్రశ్నించారు. గుజరాత్ అల్లర్ల సంఘటనల్లో కొన్ని వేల మంది నిందితులు ఉంటే, కేవలం 150 మందికి మాత్రమే శిక్షపడడం ఏమిటని ప్రశ్నించారు. ముస్లింలంతా అణిగిమణిగి ఉండకపోతే, గుజరాత్ - 2 తయారవుతుందని వారు హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. హిట్లర్, ముస్సోలినీ అనుసరించిన ఫాసిజాన్ని నరేంద్ర మోడీ గుజరాత్ లో అమలు చేశారని వ్యాఖ్యానించారు. అమెరికాలో ట్రంప్ జాత్య హం కారాన్ని పెంచి పోషించినట్టు గానే, భారత్ లో మోడీ ముస్లిం వ్యతిరేకజాత్యహంకారాన్ని పెంచి పోషిస్తున్నారని వ్యాఖ్యానించారు. ముస్లిం స్త్రీలలలాగా హిందూ స్త్రీలు అయిదుగురిని కనాలని ఆర్ ఎస్ ఎస్ అధినేత మోహన్ భగవత్ పిలుపునిచ్చారంటే, స్త్రీని పునరుత్పత్తి కేంద్రంగా మార్చడమే కదా అని ప్రశ్నించారు. పాఠ్య పుస్తకాలను హైందవీకరణ చేయడం మొదలైందని ఆవేదన వ్యక్తం చేశారు.

సభకు అధ్యక్షత వహించిన పౌరచైతన్య వేదిక తిరుపతి జిల్లా అధ్యక్షులు వాకా ప్రసాద్ సభ ప్రారంభానికి ముందు గీతాంజలిని సభకు పరిచయం చేస్తూ, వారు చిత్తూరు జిల్లా ఆడపడుచని, హైదరాబాద్ లో పుట్టి పెరిగారని గుర్తు చేశారు. తన మూలాలున్న తిరుపతి ప్రాంతానికి ఊహ తెలియని చిన్నతనంలో వచ్చినా, ఇప్పడు రావడం సంతోషకరమన్నారు. గీతాంజలి ఇంగ్లీషు తెలుగు, ఊర్దూ, హిందీ భాషలపైన మంచి పట్టున్న సీనియర్ రచయత్రి మాత్రమే కాదని, సీరియస్ రచయిత్రి అని అన్నారు. గుల్జార్ గజల్స్ ను చాలా చక్కగా అనువాదం చేశారని, గతంలో ముస్లింల అస్తిత్వ పోరాట కథలు పహెచాన్ రాగా, పహెచాన్-’2గా ఈ ‘అత్తరు మునక’ వచ్చిందని గుర్తుచేశారు. హైదరాబాదు ముస్లింలు ఉపయోగించే దక్కని ఉర్దూను ఈ కథల్లో చాలా బాగా పట్టుకోగలిగారని అన్నారు. పాలమూరు వలస కథలు రెండు సంకలనాలుగా తెచ్చారని, స్త్రీల లైగింక హింస వేధింపుల గురించి హస్బెండ్ స్టిచ్ మూడు భాగాలుగా వచ్చాయని, వారి ‘ఆమె అడవిని జయించింది’ నవలను ఉస్మానియా ఎం.ఏ. తెలుగు వారికి పాఠ్యాంశంగా పెట్టారని గుర్తు చేశారు. బెంగుళూరు హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ నాగరత్నం ఇచ్చిన ఒక తీర్పు ఆధారంగా ‘విత్ యువర్ పర్మీషన్ ’ అన్న నవలను రాశారని, మేరిటల్ రేప్ పై భారతీయ భాషల్లో వచ్చిన తొలి నవల ఇదే నని చెప్పారు. వీరి రచనలు తమిళం, కన్నడం, ఇంగ్లీషు భాషల్లోకి అనువాదమైనాయని గుర్తుచేశారు. సభలో వేమన విజ్ఞాన కేంద్రం ప్రధాన కార్యదర్శి నాగార్జునతోపాటు, సభికుల నుంచి పలువురు ప్రసంగించారు.


భారత దేశానికి ఆక్యుపంక్చర్ వైద్యాన్ని పరిచయం చేసిన డాక్టర్ డి.కె.బసు జయంతి సందర్భంగా ఈ సభలో తిరుపతిలో ఆక్యుపంక్చర్ వైద్యులు డాక్టర్ బాలాజి ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి, ఆయన గురించి ప్రసంగించారు. చైనాపై జపాన్ దాడి సందర్భంగా చైనా సైనికులకు వైద్య సహాయం అందివ్వడానికి చైనా వెళ్ళిన అయిదుగురు భారత డాక్టర్ల బృందంలో డాక్టర్ కోట్నీస్ తో పాటు డాక్టర్ డి.కె. బసు కూడా ఉన్నారని, 1938నుంచి 45 వరకు అక్కడి సైనికులకు సేవలందించారని గుర్తుచేశారు. అలా చైనా సైనికులకు సేవలందించిన వారిలో కెనడా నుంచి డాక్టర్ నార్మన్ బెతూన్ కూడా ఉన్నారని అన్నారు. ఈ సభకు పౌరచైతన్య వేదిక తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.ఎన్ పరమేశ్వరారావు ఆహ్వానం పలకగా, వేదిక గౌరవాధ్యక్షులు రాఘవ వందన సమర్పణ చేశారు.

Read More
Next Story