తెలంగాణలో సాగుభూములు కాపాడే ‘భూవినియోగ విధానం’ తేవాలి
x

తెలంగాణలో సాగుభూములు కాపాడే ‘భూవినియోగ విధానం’ తేవాలి

కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మానిఫెస్టో లో 2013 భూ సేకరణ చట్టాన్ని పునరుద్దరిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని కూడా ప్రజలు డిమాండ్ చేయాలి.


ప్రకృతి ఇచ్చిన ఒక సహజ వనరు భూమి. ఒక భౌగోళిక రాష్ట్రం పరిధిలో కాలం గడిచిన కొద్దీ జనాభా పెరుగుతుంది కానీ, భూమి విస్తీర్ణం పెరగదు. అందువల్ల భూమి వినియోగం పట్ల ప్రజలకు శాస్త్రీయ దృక్పథం, ప్రభుత్వాలకు ఒక భూమి వినియోగ విధానం ఉండాలి.

తెలంగాణ ప్రభుత్వ గణాంక నివేదికలు (Socio-Economic Outlook 2024-25), వ్యవసాయ గణాంకాల ఆధారంగా తెలంగాణ రాష్ట్ర మొత్తం భౌగోళిక విస్తీర్ణం సుమారు 2,76,95,000 ఎకరాలు (112.08 లక్షల హెక్టార్లు). ఇందులో నికర సాగు భూమి, 1,40,70,500 ఎకరాలు , అటవీ భూములు 72,02,100 ఎకరాలు, బీడు భూములు 24,62,600 ఎకరాలు, బంజారు, సాగుకు పనికి రాని భూములు 16,55,400 ఎకరాలు,మేత భూములు ,తోటలు 15,19,900 ఎకరాలు ఉన్నాయి. వ్యవసాయేతర వినియోగం 27,84,500 ఏకరాలని ప్రభుత్వం అంటోంది.

ప్రభుత్వ నివేదికల గణాంకాలు చాలా సార్లు నమ్మ శక్యంగా ఉండడం లేదు. రాష్ట్ర భూ వినియోగంలో భారీగా మార్పులు వస్తున్నా, ప్రభుత్వ రికార్డులలో మాత్రం, ఆయా భూముల విస్తీర్ణం, స్వభావం వేరుగా ఉంటున్నది. అన్ని జిల్లాలలో అడవుల విస్తీర్ణం, సాగు భూముల విస్తీర్ణం తగ్గిపోతున్నా, రియల్ ఎస్టేట్ భారీగా విస్తరిస్తున్నా, ఆ భూములు మాత్రం ఇప్పటికీ సాగు భూములుగానే రికార్డులలో ఉన్నాయి. అలాగే చెరువులు, ప్రాజెక్టులు ,బోర్లా క్రింద సాగు నీటి సౌకర్యాలు విస్తరిస్తున్నా, రాష్ట్రంలో ఇప్పటికీ ఆయా భూముల స్వభావం రీత్యా మాగాణి గా కాకుండా, మెట్ట భూములుగానే రికార్డులలో నమోదవుతున్నాయి.

రైతు భరోసా పథకం క్రింద ప్రభుత్వ సహాయం పొందాలనే దురాశ, భూ గరిష్ట పరిమితి చట్టం పరిధిలోకి రాకుండా చూసుకోవాలనే పన్నాగం భూ యాజమానులలో ఉండడం వల్ల, అవినీతికర అధికార యంత్రాంగం అందుకు సహకరించడం వల్ల, ప్రభుత్వ శాఖలు వెల్లడించే ఈ తప్పుడు గణాంకాలు ప్రజల ముందుకు వస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా అన్నీ తెలిసీ వాటిని ప్రోత్సహిస్తున్నాయి.

రాష్ట్రమంతా ఈ పరిణామాలు జరుగుతున్నా , గత 25 ఏళ్లలో హైదరాబాద్, దాని చుట్టు పక్కల ఉన్న రంగారెడ్డి, మేడ్చల్, భువనగిరి (యాదాద్రి), సంగారెడ్డి జిల్లాల్లో భూ వినియోగం లో విపరీతమైన మార్పులు వచ్చాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగర విస్తరణ ప్రభావంతో ఈ జిల్లాల సాగు భూములు నివాస, పారిశ్రామిక ప్రాంతాలుగా మారిపోతున్నాయి. హైదరాబాద్ జిల్లాలో ఇప్పుడు వ్యవసాయ సాగు భూమి సున్నా. 25 ఏళ్ల క్రితం జిల్లా శివారు ప్రాంతాలలో అక్కడక్కడ ఉన్న కొద్దిపాటి సాగు భూమి కూడా ఇప్పుడు పూర్తిగా భవనాలు, రోడ్లుగా మారిపోయింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో నివాస ప్రాంతాల విస్తీర్ణం గత 25 ఏళ్లలో దాదాపు 400 శాతం పెరిగింది. నివాస, పారిశ్రామిక అవసరాల కోసం సేకరించిన భూమి ఈ జిల్లాల్లో కలిపి సుమారు 5 నుండి 7 లక్షల ఎకరాల వరకు ఉంటుంది.

రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో కొన్ని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలు ఇప్పటికీ ఉన్నప్పటికీ, నగరీకరణ ఒత్తిడి వల్ల అటవీ సరిహద్దుల్లో భూ వినియోగం పూర్తిగా మారి పోయింది.

ఈ జిల్లాల్లో "బీడు భూములు" ఎక్కువగా ఉన్నాయి. అంటే భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నప్పటికీ, రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయడం వల్ల లేదా భవిష్యత్తులో అమ్ముకోవాలనే ఉద్దేశంతో ఆయా భూముల యజమానులు ఉండడం వల్ల ఆయా భూములలో పంటలు సాగు చేయడం లేదు.

ప్రత్యేక ఆర్ధిక మండళ్లు, పారిశ్రామిక వాడలు, ఐటి కారిడార్ లు, భారీ నివాస ప్రాంగణాల పేరుతో గత 20 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల భూమి వినియోగం పై ఎవరికీ బాధ్యత లేకుండా పోయింది. రైతుల చేతుల్లో ఉన్న కొద్దిపాటి భూములను, ముఖ్యంగా ఈ జిల్లాలలో దళితుల చేతుల్లో ఉన్న కొద్దిపాటి అసైన్డ్ భూములను కూడా లాక్కునే ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా తెలంగాణ ప్రాంతంలో భూ సేకరణ జరిగేది. రైతుల, గ్రామీణ ప్రజల ఇష్టా ఇష్టాలతో నిమిత్తం లేకుండా 1894 బ్రిటిష్ కాలపు చట్టం ప్రకారం ఆయా కాలపు ప్రభుత్వాలు అడ్డగోలుగా భూములు లాక్కునేవి. ఇలా భూములు కోల్పోయిన రైతులు ఆ భూముల్లోనే కూలీలుగా మారిపోయారు, లేదా భూమి రూపంలో ఉన్నకొద్దిపాటి ఆస్తిని కూడా పోగొట్టుకుని రోడ్డున పడ్డారు. ఈ ధోరణి అనేక ఇతర రాష్ట్రాలలో కూడా సాగింది.

ఈ నేపధ్యంలో దేశ వ్యాపితంగా అనేక రైతు ఉద్యమాల,ఆదివాసీ ఉద్యమాల ఫలితంగా 2013 లో అప్పటి UPA ప్రభుత్వం కొత్త భూసేకరణ చట్టం తీసుకు వచ్చింది. ఈ చట్టం ప్రజలకు కొన్ని హక్కులను ఇచ్చింది. ప్రజా ప్రయోజనం అంటే ఏమిటో కూడా నిర్వచించింది. ప్రభుత్వాల భూ సేకరణకు కొన్ని పరిమితులు విధించింది. భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన పరిహారం, పునరావాసం దక్కాలని,అసైన్డ్ రైతులకు కూడా పట్టా రైతులతో సమానంగా పరిహారం దక్కాలని, భూ సేకరణ వల్ల ప్రభావితులయ్యే వ్యవసాయ కూలీలు , చేతి వృత్తుల వారికి కూడా పరిహారం అందించాలని సూచిస్తూ, వాటిని ఆ చట్టంలో హక్కుగా నిర్వచించింది.

ఈ చట్టం అమలు పూర్తి స్థాయిలో ప్రారంభం కాకుండానే, 2014 లో అధికారంలోకి వచ్చిన మొదటి విడత మోడీ ప్రభుత్వం, ఆర్డినెన్స్ రూపంలో అనేక మార్పులు చేస్తూ, ఈ భూసేకరణ చట్టాన్ని పాతర వేయాలని చూసింది. కానీ దేశ వ్యాపితంగా రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, రైతులు, ఆదివాసీల ప్రతిఘటనతో వెనక్కు తగ్గింది.

2014 లో తెలంగాణ ఏర్పడి, KCR నేతృత్వంలో తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, జీవో 123 పేరుతో, ఈ చట్టానికి తూట్లు పొడవాలని చూసింది. కానీ ప్రజల పోరాటాలు, రాష్ట్ర హైకోర్టు తీర్పుతో ఈ జీవో రద్ధు అయింది. కానీ KCR ప్రభుత్వం , వివిధ ప్రాజెక్టుల పేరుతో, విచ్చలవిడి భూసేకరణకు సిద్దమై, 2013 భూ సేకరణ చట్టంలో గుండె కాయగా ఉన్న కొన్ని అంశాలను తొలగించి, 2016 లో తెలంగాణ అసెంబ్లీ లో కొత్త భూసేకరణ చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం కూడా దొరికి, 2017 నుండీ అమలులోకి వచ్చింది.

ఈ కొత్త చట్టం ప్రకారం సుమారు రెండున్నర లక్షల ఎకరాలకు పైగా రైతుల నుండీ అడ్డగోలుగా భూములను KCR ప్రభుత్వం గుంజుకున్నది. NIMZ, ఫార్మా సిటీ లాంటి పేర్లతో కూడా వేలాది ఎకరాలను రైతుల నుండీ గుంజుకున్నది. ఈ అక్రమ భూసేకరణకు వ్యతిరేకంగా అనేక చోట్ల ప్రజలు పోరాడారు. రాష్ట్ర హైకోర్టులో కూడా ఈ అక్రమ భూ సేకరణకు వ్యతిరేకంగా అనేక కేసులు దాఖలయ్యాయి.

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ , తన అభయ హస్తం మానిఫెస్టో లో , తాము అధికారంలోకి వస్తే , 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తామని, గత ప్రభుత్వం అన్యాయంగా గుంజుకున్న భూములకు కూడా తిరిగి తగిన నష్ట పరిహారం చెల్లిస్తామని, ఫార్మా సిటీ రద్ధు చేస్తామని, అసైన్డ్ భూములకు శాశ్వత పట్టా హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చింది. కానీ గత రెండేళ్లలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదు.

పైగా మానిఫెస్టో లో హామీ ఇచ్చిన విధంగా 2013 భూసేకరణ చట్టాన్ని పునరుద్ధరించకుండా, KCR తెచ్చిన 2016 కొత్త భూ సేకరణ చట్టం ప్రకారమే నోటిఫికేషన్ లు విడుదల చేస్తూ, జాతీయ రహదారులు, పారిశ్రామిక కారిడార్ లు, రీజనల్ రింగు రోడ్డు, ఫ్యూచర్ సిటీ పేరుతో వేలాది ఎకరాల భూ సేకరణ కోసం దూకుడుగా ముందుకు వెళుతున్నది.

గత అయిదేళ్లలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన వివిధ తీర్పులను, స్టే ఆర్డర్స్ ను కూడా పట్టించు కోకుండా రైతుల భూములలోకి అన్యాయంగా జొరబడుతున్నది. గ్రామీణ రైతులపైకి రెవెన్యూ అధికారులను పంపి బెదిరిస్తున్నది. ఇప్పటికీ రైతుల చేతుల్లో ఉండి సాగవుతున్న పొలాలకు కంచెలు వేస్తున్నది. తాము అనుకున్న అభివృద్ధి పనులకు టెండర్ లు పిలిచి, ఎంపికైన కాంట్రాక్టు సంస్థలకు పనులు అప్పగిస్తున్నది. ఇవన్నీ నిజానికి చట్ట వ్యతిరేకం. కోర్టు తీర్పులకు వ్యతిరేకం.

ఈ నేపధ్యంలో రాష్ట్ర వ్యాపితంగా అడ్డగోలు భూసేకరణ వల్ల అన్యాయంగా భూములు కోల్పోతున్న, అసైన్డ్ భూముల యజమానులు, పట్టా భూముల యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భూసేకరణ ప్రభావిత ప్రజలకు కూడా అన్యాయమే జరుగుతున్నది. పైగా రైతుల నుండీ ఈ భూములు లాక్కుని, పరిశ్రమల యజమానులకు ప్రభుత్వం అప్పగిస్తున్నా, ఆ భూములలో వస్తున్న కొద్ది పాటి పరిశ్రమలలో, సంస్థలలో స్థానికులకు , ముఖ్యంగా భూములు కోల్పోయిన కుటుంబాల సభ్యులకు , ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించడం లేదు. ఇది పూర్తి అన్యాయం.

ఈ ప్రత్యేక సందర్భంలో 2013 భూసేకరణ చట్టంలో ప్రజలకు దక్కిన హక్కుల గురించి, 2016 తెలంగాణ భూసేకరణ చట్టం కారణంగా కోల్పోయిన హక్కుల గురించి తెలంగాణ గ్రామీణ ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉండాల్సిన అవసరముంది. భూసేకరణ నోటిఫికేషన్ లు ఇప్పటికే వెలువడిన ప్రాంతాలలో , ప్రజలకు 2013 భూసేకరణ చట్టం ఇచ్చిన హక్కులను పొందడానికి స్థానిక ప్రజలు ఐక్యంగా పోరాడాలి.

కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మానిఫెస్టో లో 2013 భూ సేకరణ చట్టాన్ని పునరుద్దరిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని కూడా ప్రజలు డిమాండ్ చేయాలి. రాష్ట్ర భూమి వినియోగ విధానం రూపొందించాలి. దళితుల చేతుల్లో ఉన్న అసైన్డ్ భూములను భూసేకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం గుంజుకోవడం ఆపాలి. 1991 నుండీ ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వాలు సేకరించిన భూమి వివరాలు, పంపిణీ, వినియోగంపై శ్వేత పత్రం ప్రకటించాలి. రాష్ట్ర వ్యవసాయ భూములను ఇతర అవసరాలకు మళ్లించడం ఆపాలి. రాష్ట్ర సహజ వనరుల దోపిడీకి, పర్యావరణ విధ్వంసానికి కారణమయ్యే ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు, పారిశ్రామిక కారిడార్లు, గ్రీన్ ఎక్స్ ప్రెస్ వే లు, భారీ జాతీయ రహదారులు లాంటి ప్రాజెక్టులను ఆపి, రాష్ట్ర అభివృద్ధి నమూనా పై రాష్ట్ర ప్రజలతో మరింత లోతుగా చర్చించాలి.

Read More
Next Story