
బీసీ ఉద్యమ పునర్నిర్మాణం ఏ వైపు చేయాలి?
తమకు న్యాయం జరగాలంటే బీసీలు ఏం చేయాలి? ఎలా చేయాలి? ఎవరి చేత చేయించాలి?
-పాపని నాగరాజు
తెలంగాణలో ‘‘బీసీలకు న్యాయం’’ అనే నినాదం ఎన్నో దశాబ్దాలుగా వినిపిస్తోంది. కానీ న్యాయం మాత్రం ఇంకా చేతికి అందలేదు. ఇది కేవలం రాజకీయ పార్టీలు ఇచ్చే హామీల వైఫల్యం కాదు, బీసీలు స్వయంగా తమ రాజకీయ, సామాజిక శక్తిని ఒకే దిశగా నడపలేకపోవడమే అసలు సమస్య. ఇప్పటి ప్రశ్న బీసీలు ఏం చేయాలి? ఎలా చేయాలి? ఎవరి చేత చేయించాలి? 1. జేఏసీలు నిస్వార్థ త్యాగపరుల చేత లేదా ఉద్యమశక్తుల నాయకత్వంలో ఉండాలి, 2. ఉద్యమం గ్రామస్థాయి పునాదులతో పీడితుల శక్తి, సాంస్కృతిక బలంతో బలపడుతూ రావాలి 3. గులాంగిరి చెయాలేని స్వతంత్ర ప్రత్యామ్నాయ ఉద్యమ పునర్నిర్మాణం, 4.తెలంగాణ ఉద్యమం నుంచి నేర్చుకోవలసిన పాఠం.
1. జేఏసీలు పీడితుల సమన్వయ వేదికలుగా ఉండాలి : బీసీల ఉద్యమం ఒకే జాతిగా కాకుండా, అనేక కులాల కలయికగా ఉంది. ఈ విభిన్నతే శక్తిగా మారాలి. అందుకోసం ఏర్పడే జేఏసీలు (Joint Action Committees) కుల ఆధారంగా లేదా పార్టీ ఆధారంగా కాకుండా, పీడితుల పక్షంగా అనగా పీడిత కులాలను ఐక్యపరిచే, సమగ్ర సమన్యాయ సూత్రం పట్ల గౌరవం, నిబద్దత, దాని అమలు కోసం పోరాడేందుకు సిద్దపడే త్యాగనిరతి ప్రాతిపదిక మీద ఉండాలి. జేఏసీ నిర్మాణం అంటే ... కులాల మధ్య సారుప్యత, సామాన్య ప్రయోజనాల రక్షణ, రాజకీయ పార్టీ ప్రభావం రానీవ్వకపోవడం వంటి వీటిని ప్రధాన సూత్రాలుగా పెట్టుకోవాలి. అలాగే, బీసీ ఉద్యమానికి నాయకత్వం ఎవరిదన్న ప్రశ్న చాలా ముఖ్యమైనది. పార్టీ టికెట్లు ఆశించే నేతలు, లేదా కాంట్రాక్టు రాజకీయం చేసే నేతలు నాయకత్వం వహిస్తే ఉద్యమం చచ్చిపోతుంది. నాయకత్వం అంటే పదవి కాదు, బాధ్యత. తెలంగాణ ఉద్యమంలో పలు శక్తులు రాజకీయంగా చట్టం పరిధిలో ఆమోదం తీసుకొచ్చినా, చివరికి పాలకులతో కలిసి ‘‘సామాన్య ప్రజల ఆశలైన సామాజిక తెలంగాణను’’ మర్చిపోయాయి. అదే తప్పును బీసీ ఉద్యమం చేయరాదు. నిస్వార్థపరులు, మేధావులు, సాహితీవేత్తలు, కళాకారులు, ప్రజాశక్తులతో పెరిగిన నాయకత్వమే నిజమైన ఉద్యమ శక్తి. బీసీ ఉద్యమానికి నాయకత్వం వహించే వారు దళారీగిరి, గులాంగిరి చేయలేని, కాంట్రాక్టు చేయలేని, రాజకీయాల్లో పాల్గొనని, సామాజిక సమన్యాయ దృష్టిగల వ్యక్తులు కావాలి. నాయకత్వం అంటే పదవి కాదు, అది బాధ్యత. నిస్వార్థపరులు ఉద్యమకారులు మాత్రమే నిజమైన ప్రజా నాయకత్వం.
2. రాజకీయ చట్టసభ ఆమోదం కూడా పీడిత శక్తి ఆధారమే : కొంతమంది ‘‘చట్టసభ ఆమోదం లేకుండా రిజర్వేషన్లు రావు’’ అంటారు. ఇది నిజమే. కానీ చట్టసభలో చట్టాలు ఎవరిని అడిగేతే ఆమోదిస్తారు? ఎలా అడిగితే ఆమోదిస్తారు? సారంశంలో పాలకులపై ఒత్తిడి చేసే ప్రజా ఉద్యమమే చట్టాన్ని చేయడానికి సాధ్యం చేస్తుంది. అందుకే ‘‘పాలకులను నిందించరాదు’’ అనే మాటలో కొంత నిజం ఉన్నా, పాలకులను కదిలించే శక్తి మాత్రం బీసీ ప్రజా ఉద్యమాలే అవ్వాలి. చట్టం పాస్ కావాలంటే, ముందు చరిత్రలో బలమైన సామాజిక ఒత్తిడి ఉండాలి. అందుకే ర్యాలీ, ధర్న, రాస్తారోకొ, రాజకీయ నేతల ముట్టడి, అనేక వ్యవస్థల సంస్థల స్తంభన. ఉద్యమం అంటే రోడ్ల మీద ర్యాలే కాదు, అది ఒక సామాజిక విప్లవ చైతన్యం. ఆ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేది సాహిత్యం, పాట, నాటకం, కళ, మీడియా, ఇత్యాదివి. బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం జరిగితే, అది కేవలం న్యాయపరమైన డిమాండే కాదు, అదొక సామాజిక చైతన్య యుద్ధం. దానికి భాష్యం ఇవ్వడం కవులు, మేధావులు రాయాలి, కళాకారులు పాడాలి, గ్రామస్థాయి వేదికలు నిర్మించాలి. సంస్కృతి ద్వారా సమాజాన్ని కదిలించడమే ఉద్యమం యొక్క మొదటి దశ. ఉద్యమాలు మహానగరాల్లో మాత్రమే జరగడం వలన అవి ‘‘వ్యక్తిగతరూపం’’ పొందుతాయి కానీ ‘‘ఉద్యమ హోదా’’ మాత్రం రావు. ఉద్యమం అంటే గ్రామస్థాయిలో మనుషుల మనస్సులో మంట రేపడం. బీసీ జేఏసీ, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, రైతు బీసీ సంఘాలు, బీసీ కార్మీక సంఘాలు, బీసీ ఉద్యోగ సంఘాలు, ఇవన్నీ ఒకే దిశలో కదిలితేనే ఉద్యమానికి ‘‘సామాజిక బలం’’ వస్తుంది. ఇది లేకపోతే, ఉద్యమం పేరు మాత్రమే ఉంటుంది, శక్తి ఉండదు.
3. తెలంగాణ ఉద్యమం నుంచి నేర్చుకోవలసిన పాఠం ` భవిష్యత్ ఉద్యమ పునర్నిర్మాణం : తెలంగాణ ఉద్యమం చట్టపరంగా విజయవంతమైనా, సామాజిక న్యాయం పట్ల విఫలమైంది. ‘‘తెలంగాణ కోసం పోరాడినవారు’’ తర్వాత అధికారంలోకి వచ్చి, పీడిత వర్గాలను మర్చిపోయారు. అదే విధంగా, బీసీ ఉద్యమం కూడా ఒకసారి రాజకీయ హోదా పొందాక పీడిత ప్రజల సమస్యలు మరిచిపోతారనే ప్రమాదం ఉంది. అందుకే ఉద్యమానికి నాయకత్వం వహించే వారు దళారి గిరి చేయకూడదు, గులాంగిరి చేయకుడదు. స్వతంత్ర ఉద్యమంపట్ల చిత్త శుద్ది ఉండాలి, అధికారాల(ఫవర్) కోసం ప్రజలను మోసగించకూడదు. తెలంగాణ ఉద్యమం - రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికారంలోకి వచ్చిన వారు చేసిన తప్పులను గుర్తించి వాటిని పునరావృతం చేయకూడదు. బీసీ ఉద్యమం ఇప్పుడు ఒక కొత్త దశలోకి రావాలి. ‘‘రాజకీయ నాయకుల ఆధారమై ఉండే ఉద్యమం’’ నుంచి ‘‘ప్రజల చేతుల్లో ఉద్యమం’’ వైపు మారాలి. దానికి మూడు మార్గదర్శకాలు అవసరం. అవేమంటె ఉద్యమం ఎందుకు చేస్తున్నాం అన్న సమాధానం ప్రతి కార్యకర్తకి స్పష్టంగా ఉండాలి. కుల విభేదాలను పక్కనబెట్టాలి. ప్రతి కులానితొ సోదరభావం గల ఆలోచన - ఆచరణలుండాలి. ఒక్కడైనా పీడిత కులాలపై కులం పేరుతో వివక్షత, దాడులు, బహిష్కరణలు, అత్యాచారాలు జరిగితే వెంటనే ఆ సమస్యకు కారకులకు శిక్షపడేట్టు చూడాలి. ఆసలు ఈ దురదృష్టకర వాతవరణం రాకుండా జనాలను జాగృతం చేయాలి. ‘‘ బీసీల సమన్యాయ ప్రయోజనం’’ దిశగా కదలాలి.

