
రవీంద్ర భారతిలో ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అవసరమా?
ముఖ్యమంత్రి రేవంత్ కు ప్రముఖ రచయిత జూకంటి బహిరంగ లేఖ
గౌరవనీయులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారూ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం.
అయ్యా! శతకోటి నమస్కారాలు. మీ పాలనలో రెండు సంవత్సరాలుగా సంస్కృతి సాహిత్యాల పట్ల మీ వైఖరిని విధివిధానాలను పరిగణలోకి తీసుకొని తెలంగాణ ఆత్మగౌరవం తో నేరుగా మీకు రాస్తున్న ఈ బహిరంగ రేఖ ఏమనగా! గత ప్రభుత్వం చేసిన అప్పులు తప్పులు మీ తిప్పలు మీ హామీల అమలుపై చేస్తున్న తాత్చారాలు వాయిదాలు మీ పాలసీలు అన్నిటినీ తెలంగాణ మేధావులు కవులు రచయితలు ప్రజలు అర్థం చేసుకొని సంయమనంతో సహనంతో మీకు సహకరిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల తెలంగాణ సాంస్కృతిక సాహిత్య రంగాలపై మీ వైఖరి ధోరణి మీరు తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణవాదులకు కవులకు రచయితలకు మేధావులకు ఎంత మాత్రం సమ్మతము హర్షనీయం కాదు కానేరదు . సాహిత్య సంస్కృతిలో పట్ల తెలంగాణ ఆత్మగౌరవం పట్ల ఒక స్పష్టత ఉండాలి మీ నుంచి ఒక స్పష్టతను ఆశించాము కానీ మీరు కూడా గత ప్రభుత్వం లాగే ప్రతి సంఘటన నుంచి సమావేశం నుంచి రాజకీయ ఫాయిదా ఎలా ఉటాయించాలని చూస్తున్నారు తప్ప మరో మరో ప్రత్యామ్నాయంగా కనబడడం లేదు.
రాజకీయ చతురతతో వాగాడంబరంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్ప తెలంగాణ అస్తిత్వం సాహిత్య సంగీతాల వారసత్వ కొనసాగింపు పైన ఒక స్పష్టత లేకపోవడం లేకపోవడం బాధాకరం. ఇది మీకు తెలిసి జరిగినా జరగకున్నా పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సాహిత్య సంస్కృతి సంస్కృతులతో చెలగాటమాడుకుంటే సూదిని ముల్లెకట్టీ నట్టే గ్రహించవలసిన అవసరం ఏర్పడినది.
ప్రస్తుతం ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే తెలంగాణ హైదరాబాద్ నడిబొడ్డు మీద ఉన్న రవీంద్ర భారతిలో ప్రాంగణంలో సినీ గాయకుడు బాలసుబ్రమణ్యం విగ్రహం వేసిన ముసుగును అనతి కాలంలో తొలగించబోతున్నారని తెలిసి ఆవేదనతో మీ దృష్టికి ఈ క్రింది విషయాలను తీసుకొస్తున్నాను.
తెలంగాణ సాహిత్య సాంస్కృతిక సంగీత వారసత్వం భద్రాచలం రామదాసు నుంచి గద్దర్ మీదుగా అందెశ్రీ వరకు దాశరధి కాళోజి నుంచి సి.నా.రె. వరకు ఒక జానపద సాహిత్య సంగీత ఎరుక తెలంగాణకు తనదైన అత్యున్నతమైన ప్రజల వారసత్వ సంపద కలిగి ఉన్నది. సరిగమలు మనవి కావు.మనదంతా మౌఖిక సాహిత్యం కాళ్లకు గజ్జె కట్టడం, డప్పు కొట్టడం, దరువు వేయడం తుడుము ఊదడం బాగోతం చిరుతల రామాయణం పటం కథలు జంబిడిక వాయించడం తాంబూర మీటడం లాటీ తదితర అమూల్య ప్రజల శ్రమ నుంచి పాట పుట్టి తద నుకూలంగా సంగీతం తోడైనది.
ఈ విషయం పల్లెటూరు నుంచి వచ్చిన మీకు కూడా తెలుసినదే. ఇతరేతరులకు మృగ్యమైన తెలంగాణ గర్వించే ఆత్మగౌరవం జానపద సంగీత సాహిత్య అమూల్య విద్వత్తు సంపద మనకు మాత్రమే స్వంతం . అందుకని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అసలు రవీంద్రభారతిలో బాలసుబ్రమణ్యం విగ్రహం ఆవిష్కరణ మీరు గానీ ప్రభుత్వం గానీ చేయడం ఒక చారిత్రిక తప్పిదంగా మిగిలిపోనుంది. ఈ విషయం తెలిసినప్పటినుండి అనేకమంది తెలంగాణవాదులు కవులు రచయితలు మేధావులు తీవ్ర మనస్తాపానికి లోనవుతున్నారు ఈ విషయమై పునరాలోచన చేయవలసిన తక్షణ ఆవశ్యకత ఉన్నది. మీరు, మీ సహచర నాయకులు సంగీతానికి ఎల్లలు లేవు ప్రాంతాలు లేవు అని సన్నాయి నొక్కులు నొక్కుతుంటే అవన్నీ సమర్ధింపులుగానే ఉంటాయి తప్ప తెలంగాణ సమాజానికి ఏమాత్రం శోభితం శ్రేయస్కరం కాదని మీకు మనవి చేస్తున్నాను.
ఈ సందర్భంగా అసలు తెలంగాణ ఉద్యమం మూలమే నీళ్లు నిధులు నియామకాలు కాదు సంస్కృతి వివక్షల కాంక్ష నుండి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ఉద్యమంగా కొనసాగింది. అనే సత్యాన్ని పాలకులు, పాలితులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సినీగాయకులుగా ఘంటసాల బాలసుబ్రమణ్యం పైన మాకు గౌరవం ఉంది కానీ రెండు తెలుగు రాష్ట్రాల ఏర్పడ్డ తర్వాత కూడా సమాదరణ లేకపోవడం బాధాకరం. ఒక బూర్గుల రామకృష్ణారావును చెన్నారెడ్డిని పివి నరసింహారావును గద్దర్, అందశ్రీని రామదాసుల విగ్రహాలను అమరావతిలో ఊహించడానికి అవకాశాలు ఉన్నాయా అసలు ఊహించగలమా చెప్పండి అసలు ఎందుకు ఇంత రెండు రాష్ట్రాలు ఏర్పడే తర్వాత కూడా తెలంగాణలో విగ్రహాల ప్రతిష్టాపన చేయాలని పట్టుదల ఎందుకు? ఒకవేళ కావాలనుకుంటే ముందుగా వీళ్లకు ఆ చెయ్యి ఆడితేనే ఈ చెయ్యి ఆడుతుంది అనే గ్రహింపు ఉండాలి.
దానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతు తెలుపడం దేనికి మంచిది?దేనికి సంకేతం? ఉంటే గింటే వింటే ఓ మహాత్మా ఓ మహర్షీ మా పాలకులకు నువ్వైనా చెప్పవయ్యా ! తండ్రీ!! అయ్యా! తమరికి పై విషయాలన్నీ తెలియవు అని కాదు. మీ దృష్టికి ప్రత్యేకంగా తీసుకు వస్తున్నాను. ప్రతిసారి ప్రతి దాన్ని రాజకీయ భూతద్దంలో పెట్టి చూడవద్దని సవినయ మనవి. గతంలో అపూర్వంగా జరిగిన మిలియన్ మార్చ్ లో తెలంగాణ ట్యాంక్ బండ్ మీది విగ్రహాలు, ప్రజల ఆగ్రహానికి లోనై హుస్సేన్ సాగర్ లో మునిగి పుణ్యస్నానం చేసిన విషయం మీకు తెలిసినదే.
ఇక ఈ వాదాలు వివాదాలకు ఒక ముగింపు పలకాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం మేమో ద్వారా జారీచేసిన నిర్దేశాలను ఉపసంహరించుకొని తెలంగాణ ఆత్మగౌరవానికి ఆత్మాభిమానానికి అస్తిత్వానికి పట్టం కట్టేలా సరైన నిర్ణయం తీసుకోవాలని,తీసుకుంటారని ఆకాంక్షిస్తున్నాను.

