ఇంతకీ బీసీలకు ఏమి కావాలి?
x
Image source: Velivada

ఇంతకీ బీసీలకు ఏమి కావాలి?

హిందుత్వం లో బీసీలు ఎలా నష్ట పోతున్నారు ? అవకాశాలకు, అభివృద్ధికి దూరంగా ఎలా ఎందుకు నెట్ట బడుతున్నారు? : ప్రముఖ బిసి తాత్వికుడు కొండల రావు ఏమంటున్నారంటే...


-కె. కొండలరావు*


ఆధ్యాత్మిక కోణానికి సంబంధించి, ఎవరి అవగాహన, ఆలోచన మేరకు, వారు, వారి మతాన్ని నిర్ణయిం చేసుకొనే "మత స్వేచ్ఛ" అందరికీ ఉంటుంది. అంతవరకు హిందుత్వం తో ఎవరికీ సమస్య లేదు. ఉండ కూడదు కూడా.

"హిందుత్వం" తో ప్రత్యేక సమస్య, దాన్నుంచి పుట్టిన అసమాన అవకాశాలకు నిలయమైన, "వర్ణ, కుల" వ్యవస్థ లే. అనేక శతాబ్దాల ఈ రెండు వ్యవస్థల ప్రభావమే, హిందూ సమాజం "అసమాన సమాజంగా" ఘనీభవించి పోవడానికి కారణాలు, అయ్యాయి.
శూద్రులు, అతి శూద్రులు, విద్య ఉద్యోగ ఆర్ధిక రంగాలు లాంటి అనేక కీలక రంగాల్లో వివక్షకు, దోపిడీకి, దౌర్జన్యాలకు గురి చేయ బడ్డారు. అమానవీయంగా అణగ తొక్క బడ్డారు. మానసికంగా కూడా, "అది మా కర్మ" అనే న్యూనతా భావంతో, బాధిత వర్గాలు కూడా, హిందుత్వాన్ని సమర్ధిస్తూ మోసే స్థాయికి, వారి ఆలోచనలు శాశ్వతంగా మలచ బడ్డాయి. అదంతా "దైవ నిర్ణయం" అని, తమ బానిసత్వ పరిస్థితిని కూడా ప్రశ్నించ కుండా, అంగీకరించి, మోసే పరిస్థితికి అనేక మంది బీసీలు మలచ బడ్డారు. ఆధిపత్య శక్తుల దోపిడీకి, దౌర్జన్యాలకు, అణిచి వేత ధోరణులకు, ఈ పరిస్థితి ఊతం ఇస్తోంది.
నేటికీ కూడా బీసీలు సమాన అవకాశాలకు, సమాన విలువలకు, దూరం చేయ బడు తున్నారు. అందుబాటు లో ఉన్న గణాంకాలు, ఈ వాస్తవాన్ని రుజువు చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో చిక్కు కున్న, బాధితులైన బీసీ సమాజం సమాన అవకాశాల కోసం బలంగా నిలదీయ లేక పోతున్నారు. ఉద్యమాలు చేయలేక పోతున్నారు. ఫలితాలు సాధించ లేక పోతున్నారు.
ఆధిపత్య కులాల పార్టీలు ముఖ్యంగా నేడు కేంద్రంలో అధికారం లో కూర్చున్న బీజేపీ, వారి పరివార సంస్థలు కూడా, మనమంతా హిందువులం, అని బీసీల్ని మత్తులో ముంచు తున్న ఈ శక్తులు, బీసీల దామాషా అవకాశాలకు ఎందుకు అడ్డు పడుతున్నా యో, బీసీలు ఆలోచించు కోవాలి. అర్ధం చేసుకోవాలి. ప్రశ్నించడం నేర్చుకోవాలి.
అవకాశాలు తక్కించు కొంటున్న కొన్ని బీసీ కులాల వారికి మాత్రమే కాకుండా, బీసీల్లో అన్ని కులాల వారికి దామాషా అవకాశాలు తక్కే విధంగా, బీసీలకు:
*చట్ట సభల్లో అవసరమైన స్థాయిలో రిజర్వేషన్ కావాలి.
*విద్య ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ పెంచాలి.
*రిజర్వేషన్ సీలింగ్, 50% ఎత్తివేయాలి.
* బీసీ లకు కూడా ప్రమోషన్లలో రిజర్వేషన్ కావాలి.
*బీసీ మహిళలకు కూడా, మహిళా రిజర్వేషన్ చట్టం లో ప్రత్యేక కోటా కావాలి.
* కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో, బీసీల ఆర్ధిక అభివృద్ధి కోసం, "బీసీ స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ " ఉండాలి. వారి అవసరాలను మదింపు చేసి, తగినంత స్థాయిలో నిధుల కేటాయింపు జరగాలి.
*బీసీ వర్గానికి కూడా, అట్రాసిటీ చట్టం తేవాలి. బీసీల విషయంలో దుర్వినియోగం అవుతున్న అట్రాసిటీ చట్టాల సందర్భాల నుంచి, బీసీలకు రక్షణ కల్పించాలి.
* విదేశీ విద్య, పీహెచ్డీ స్థాయి విద్యకు సంబంధించి, బీసీలకు ఆర్ధిక సహాయం అందుబాటు లోకి రావాలి.
*సమసమాజ నిర్మాణం లక్ష్యంగా, ఆయా వర్గాలకు అవకాశాలు, నిధులు అందు బాటు లోకి తేవడానికి, వారి స్థితి గతులను, కనీసం పది సంవత్సరాలకు ఒకసారి మదింపు చేసి అవసరం అయిన సవరణలు జరపడానికి, అవసరం అయిన ఫార్మాట్ రూపొందించి, చట్ట పరమైన, దశాబ్ది "సమగ్ర కుల గణన" ఎటువంటి మినహాయింపులు లేకుండా సమాజం మొత్తానికి జరపాలి.
* ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు జరుపుతున్న "సర్వే గణాంకాలు" మోత్తాన్ని సమాజానికి అందుబాటులో ఉండే విధంగా చట్టాలు చేయాలి.
*మంజునాథ్ కమిషన్ నివేదికను, సేకరించిన సమాచారాన్ని, బీసీలు కోరినప్పటికీ, హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా, టీడీపీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదు ? బీసీల ప్రయోజనాలకు గండి కొట్టే, "ఈ పారదర్శకత లేని" టీడీపీ విధానం ఎవరిని ఉద్ధరించడానికి ? టీడీపీ లోని, బీసీ ప్రముఖులు కూడా ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయ లేక పోతున్నారు ? ఇటువంటి సందర్భాల్లో, బీసీలు తమ ఓటు తమ వారికే వేయడం, "ఎవరిని ఉద్ధరించడానికి ? అనే ఇబ్బంది కరమైన ప్రశ్న వస్తుంది. అందుచేతనే బీసీలకు స్వంత రాజకీయ వేదిక నిర్మాణం అవసరం అవుతుంది.
(*కె. కొండలరావు. న్యాయవాది, తెలంగాణ హైకోర్టు, హైదరాబాద్)
(The Federal-Telangana seeks to present views and opinions from all sides of the spectrum. The information,ideas, or opinions in the articles are of the author and do not necessarily reflect the views of The Federal.)


Read More
Next Story