రాజ్యాంగ పీఠికలోని ‘సోషలిజం’ ఉంటుందా, ఊడుతుందా?
x

రాజ్యాంగ పీఠికలోని ‘సోషలిజం’ ఉంటుందా, ఊడుతుందా?

ప్రైవేటు ఆస్తులను ‘జాతికోసం’ అని ప్రభుత్వం సేకరించడానికి వీల్లేదని నవంబర్ 5న, సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చాక వస్తున్న అనుమానం అంటున్నారు ప్రొ. మాడభూషి శ్రీధర్



(మాడభూషి శ్రీధర్)

సామాన్య ప్రజల సొంత ఆస్తి అయిన పొలాలు, స్థలాలు, ఇళ్లను ‘ప్రజా శ్రేయస్సు’ పేరుతో తీసుకోవడానికి వీల్లేదని నిన్న మొన్నటి వరకు చీఫ్ జస్టిస్ గా ఉన్న చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నవంబర్ 5న కీలక తీర్పు ఇచ్చింది.

ఇక కవులు ప్రజా శ్రేయస్సు, సామాజిక లక్ష్యం గురించి కవిత లు రాసుకోవచ్చు.

ఆర్టికల్ 39(బి) కింద ‘పంపిణీ’ పేరుతో కీలకమైన ప్రజల సంపదలను ప్రభుత్వం తీసుకోవడం చాలా హాని చేస్తుందని పేర్కొంది. మంచి కోసమైనా సరే, అన్ని ప్రయివేటు ఆస్తులను ఒకటిగా భావించిన అర్టికల్ 39 (బి) కిందికి తీసుకురాకూడదు అని, ఇదివరకు ఉన్న పబ్లిక్ ట్రస్ట్ డాక్ట్రిన్ (Doctrine of Public Trust) అనవసరం అని తేల్చింది.

గతంలో అర్టికల్ 39(బి) కింద ప్రభుత్వ ఆస్తి లేదా ప్రైవేట్ ఆస్తి ‘‘రీ డిస్ట్రిబ్యూషన్’’ మంచిదే అని సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్ కృష్ణ అయ్యర్ (State of Karnataka v. Shri Ranganatha Reddy (1977) కూడా అదే అన్నారు. అయితే, ఇపుడు ప్రజల ఆస్తిని ఆర్టికల్ 39 బి కింద తీసేసుకోవడానికి వీల్లేదు అని చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది.

ఇందిర దయ: ఆస్తి హక్కు హుళక్కి

1971లో 25వ రాజ్యాంగ సవరణలో 31 సి ని సృష్టించారు. ఇందిరాగాంధీ జట్టు చేసిన సృష్టి అది. 31 సి హక్కు. కొన్ని సామాజిక ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి (అని అంటారు) అందుకు కొన్ని చట్టాలు తెస్తారు. అందుకు ఆ చట్టాలు ప్రాథమిక హక్కులను తగ్గించైనా ఆ లక్ష్యాలను సాధించాలంటాయి. ఈ మేరకు 1971లో రాజ్యాంగాన్ని సవరించారు. ఇలా మంచి కోసం తెచ్చిన చట్టాల ప్రకారం ప్రయివేటు ఆస్తులను స్వాధీనం చేసుకున్నపుడు కోర్టుల్లో ఛాలెంజ్ చేయడానికి వీల్లేదు. కానీ ఆ సూత్రాలను అమలు చేసే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ ఆ పేరున ప్రాథమిక హక్కులు తగ్గించకూడదనే హెచ్చరికలు ఉన్నాయి. అయితే ఈ కొత్త చట్టాలు ఆ హక్కులను క్షీణింపజేస్తున్నాయి.

ఏదో పేరుతో హక్కులు తగ్గించకూడదు

1973లొ కేశవానంద భారతి కేసులో అత్యున్నత కోర్టు న్యాయమూర్తులు గొప్ప తీర్పు ఇచ్చారు. ప్రజాశ్రేయస్సు కోసం పేరుతో ఆదేశిక సూత్రాలు అమలు చేస్తామంటూ ప్రాథమిక హక్కులు తగ్గించే అధికారం ఉంటుందని, కానీ ఆ ప్రాథమిక హక్కు తగ్గింపు ఏమిటని ఎందుకనీ ప్రశ్నించి సమీక్షించే అధికారం న్యాయవ్యవస్థకు ఉండి తీరుతుందన్నది ఆ తీర్పు.

ఆ చట్టాలను సమీక్షించే కోర్టు అధికారాన్ని తీసేయడానికి వీల్లేదు. అది రాజ్యాంగం మౌలిక లేదా మూలస్తంభమవుతుందనీ, ఈ బేసిక్ స్ట్రక్చర్ (Basic Structure) అంటే ఆ స్తంభాన్ని కూల్చకూడదని దానర్థం.

ఆ లెక్కన న్యాయసమీక్ష అనేది మౌలిక సూత్రం. అంటే పార్లమెంటు (లేదా ప్రభుత్వం) ఒక చట్టం ద్వారా ఏదైనా హక్కు హరించినపుడు ఎంత హాని కలిగింది, ఎంత లాభం జరిగింది అని పరిశీలించే అధికారమే మౌలిక సూత్రం (Basic Structure). కావాలంటే హక్కులు తగ్గించండి, కానీ న్యాయసమీక్ష అనేది ఒకటొచ్చి ముందు నిలబడుతుంది. ఈ మూలస్థంభాన్ని ముట్టుకోరాదని తొలగించరాదని చెప్పిందే కేశవానంద భారతి కేసు. ఇప్పటికి ఈ సూత్రమే ఉంది. ఆ బేసిక్ స్ట్రక్చర్ కూల్చ కూడదనే పరిమితి రాజ్యాంగంలో భాగమైపోయింది. దీన్ని కూల్చడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు.

‘‘ఎందుకు?’’ అని సుప్రీంకోర్టు అడగవలెను!

కనుక చట్టాలు చేసినపుడు హక్కులు తగ్గించినా, ఆ తగ్గింపు ఎంత, ఎందుకు అనే ప్రశ్నించే హక్కును ఈ సూత్రం 1973లో నిర్ణయించింది. కానీ ప్రభుత్వ మేధావులు రాజ్యాంగానికి కష్టాలు తెచ్చి పెడుతూ ఉంటారు. 1976లో 31సి కింది హక్కులు ఉన్నప్పటికీ 39 బి 39 సి లో ద్వారా ఆదేశిక సూత్రాలను రక్షించుకునే వాళ్లం.

ఆర్టికల్ 31సి "సామాజిక కీలకమైన సంపద వనరులను" ప్రజల మేలు కోసం (ఆర్టికల్ 39(బి)) పంపిణీ చేయాలని, సంపద, ఉత్పత్తి సాధనాలు కొందరు వ్యక్తుల లేదా కంపెనీ చేతుల్లో "కేంద్రీకరించకుండా" ప్రజలకు దెబ్బకుండా ఉండేలా రూపొందించిన చట్టాలను రక్షిస్తుందని (ఆర్టికల్ 39(సి) అంటున్నారు.

కీలకమైన సంపద

ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తులను సంపద, పంపిణీ చేయవచ్చా లేదా అని నిర్ణయించడానికి ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం సిద్ధమయింది. వారిలో న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, బివి నాగరత్న, సుధాన్షు ధులియా, జె బి పార్దివాలా, మనోజ్ మిశ్రా, రాజేష్ బిందాల్, ఎస్‌సి శర్మ, ఎజి మసీహ్ ఉన్నారు. ఆర్టికల్ 39(బి)లోని “కమ్యూనిటీకి సంబంధించిన మెటీరియల్ రిసోర్సెస్” అనే పదంలో ప్రైవేట్ యాజమాన్యంలోని ఆస్తులు ఉన్నాయా లేదా అని ధర్మాసనం వివరించింది. ప్రైవేట్ యాజమాన్యంలోని అన్నిరకాల ఆస్తులను రాష్ట్రం స్వాధీనం చేసుకునేందుకు వీలులేదని అన్ని ఆస్తులు కమ్యూనిటీ రిసోర్సెస్ (Community Resources) గా భావించడానికి వీల్లేదని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. కేసును కేసును బట్టి విధానాలుండాలని కూడా తీర్పులో పేర్కొన్నారు. ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ & అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర & అదర్స్ విషయంలో ఈ చారిత్రక తీర్పు వచ్చింది. ఇది మంచిదనే వాదన వినబడుతూఉంది.

మొత్తానికి అన్నీ ‘‘మంచిమేలు’’ కోసమే

ఎందుకంటే ఇది ప్రజల "మంచి, మేలు" కోసం ప్రభుత్వం జోక్యం చేసుకోవడం అంటే ప్రజల హక్కులు తగ్గించేయడమే. ప్రభుత్వ చర్యలకు గురయ్యే సామాన్య పౌరుల ప్రైవేట్ ఆస్తి హక్కులు రాజ్యాంగబద్ధంగా రక్షించడానికి ఇపుడు సాధ్యమవుతుందని సుప్రీంకోర్టు అంటున్నది. ఇది నిజమా కాదా అని సుప్రీంకోర్టు ప్రతిసారీ సమీక్షించాలి. తప్పదు. అ మంచి అనే ముసుగులో ప్రైవేట్ యాజమాన్యంలోని ఆస్తులపై ప్రభుత్వం ఏ విధంగా అధికారాన్ని ఉపయోగించవచ్చనే దానిపై సరిహద్దులు ఎవరు గీచారు? వాటి ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో ఇప్పుడు చెప్పలేం. కానీ తీవ్రంగా మాత్రం ఉంటుంది.

కేసు ఇట్లా పుట్టింది

ఈ తీర్పులో 1976 నాటి మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్‌మెంట్ యాక్ట్ (MHADA) 1986 సవరణ చేసారు. ఈ నిబంధనలు ముంబయిలోని ప్రైవేట్ భవనాలను మరమ్మతులు, పునర్నిర్మాణం లేదా సహకార సంఘాలకు బదిలీ చేయడానికి, ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి అనుమతించింది. దానికి ప్రభుత్వానికి పూర్తి యజమాని సమ్మతి అవసరం లేదనీ, ఇది ఏదైనా ప్రైవేట్ ఆస్తిని "కమ్యూనిటీ రిసోర్స్"గా పరిగణించడం ద్వారా ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకోవచ్చని దీని అర్థం.దీని వల్ల వల్ల హక్కుల ఉల్లంఘన జరుగుతుందన్నది వాదన.

30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం సరిపోతుందా?

ఆలోచించవలసిందేమంటే మూడు దశాబ్దాల తరువాత సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగంలోని సోషలిస్టు అంశంపై ప్రాథమిక ప్రశ్నలను సంధించింది. ప్రజా ప్రయోజనాల కోసం ప్రైవేట్ ఆస్తిని సోషలిస్టు విధానం పరిధిలోకి తీసుకురావచ్చన్న రాజ్యాంగ భావనను సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. ఇలా చెప్పే గొప్ప అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. అందులో అనుమానమేదీ లేదు. కానీ అయిదేళ్ల కోసం పరిపాలించేందుకు ఏర్పాటుయ్యే పార్లమెంటు, ఆ ప్రభుత్వం చేసే చట్టాన్ని ఓ 20 ఏళ్ల తరువాత సుప్రీంకోర్టు న్యాయం చెబుతూ నాటి పరిస్థితులను ఈ నాటి పరిస్థితులనుంచి చూసి తీర్పు ఇస్తే ఎలా?

గుప్పెడు సంపన్నులే నాయకులవుతారు

ప్రయివేట్ ఆస్తులు పెంచుకోవడం తప్పు కాదు. కానీ సంపద మరీ పెరిగి, పెరిగి భారత దేశంలోనే సంపన్న సంస్థానాలు ఏర్పడతాయని మన రాజ్యాంగం ఊహించలేదు. ఈ మధ్య కాలంలో కొందరు గుప్పెడు మంది ప్రపంచ ప్రముఖ సంపన్నులై భారతదేశాన్ని పాలిస్తున్నారని అందరికి తెలుసు. మనకు ప్రాథమిక హక్కులు ఉన్నాయని అనుకుంటున్నాం. చాలా సంతోషించాం. మనం ఆ స్వాతంత్య్రాన్ని నమ్ముకున్నాం. రాజ్యంగం పౌరులకు హక్కులతో పాటు ప్రభుత్వానికి కొన్ని బాధ్యతలను నిర్దేశించింది. అవి ఆదేశిక రాష్ట్ర పరిపాలనా సూత్రాలని అంటారు. ఇంత మంచి రాజ్యాంగం ఉన్నపుడు, ఆదేశికా సూత్రాలు లక్ష్యమయినపుడు, ప్రభుత్వ పాలన మంచిదైపుడు, కేవలం గుప్పెడు మంది సంపదను పెంచుకోవడం ఎలా సాధ్యం? మనకు ఒక కాలంలో ఆస్తి హక్కులు ఉన్నాయని అనుకున్నాం, ప్రాథమిక హక్కుకాదని, రాజ్యాంగ హక్కుగానే ఉంటుందని తేలింది.

శోషనిజం

కొన్ని రాజ్యాంగ సవరణలు రావడం, సుప్రీంకోర్టు అది కాదు ఇది కాదు అంటూ మార్చడం వల్ల కనీసం మౌలిక రక్షణలు, లక్షణాలను ఉండనీయండి బాబూ అని న్యాయమూర్తులు కోరుకుంటున్నారు.

ఆస్తిని రాజ్యాంగపరమైన హక్కుగా గుర్తిస్తున్నప్పటికీ పరిమితులు ఉంటాయి. ఆ పరిమితుల్లో ప్రయివేటు పౌరుల ఆస్తిని అంటే ఇళ్లు, పొలాలు సేకరణ అంటే లాండ్ ఆక్విజనిషన్ అనే పేరుతో ప్రభుత్వం వారు తీసేసుకుంటారు. దానికి సేకరణ అనే అందమైన పేరు ఉంటుంది. అత్యంత సంపన్నులైన వారి ఆస్తిని ‘సేకరణ’ చేయరు, అంత గుండె ధైర్యం ఏ ప్రభుత్వానికి ఉంటుంది గనుక. ‘‘ప్రభుత్వం కోసం, సామాజిక సంక్షేమం కోసం, జన శ్రేయస్సు కోసం అనే అద్భుతమైన అందమైన పేర్ల మాటున సామాన్యుల భూమిని సేకరిస్తుంటుంటారు. కొన్నేళ్లుగా సోషలింజం శోషవచ్చి పడిపోతున్నదని అందరికీ తెలుసు.

భూమిని జాతీయం చేయడమా?

పాపం డాక్టర్ బాబా సాహేబ్ అంబేడ్కర్ భూమిని జాతీయం చేయాలని గొంతు చించుకుని.. మొత్తుకుంటూ చెప్పినా వినేవాడున్నాడా? ఆయన అనేక సందర్భాల్లో ఇది చెప్పారు. ఇప్పుడు జాతీయీకరణ పోయి విదేశీయికరణ, ప్రయివేయికరణ వంటివి పెరిగిపోతున్నాయి.

జస్టిస్ కృష్ణయ్యర్ తీర్పు పనికి రాకుండా అయిపోయింది!

అంతకుముందు భూసంస్కరణలు అని జస్టిస్ కృష్ణయ్యర్ వంటి పెద్దలు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పీవీ నరసింహారావు లాంటి వాళ్లు భూసంస్కరణల కోసం కష్టపడ్డారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ప్రపంచం మారింది. అదే పీవీ కూడా మారారు. ప్రధాన మంత్రిగా ఉండగా గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ వంటి అద్భుతమైన సంస్కరణలు వచ్చాయి. ఒక నాటి భూస్వాములు జమీందారులు పోయారు, కాని వేరే నేషన్ పోయి కార్పొరైజేషన్ వచ్చింది. ఓ దొరవారికి వందెకరాలో మూడొందలెకరాలో ఉండేది. వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చేవి. ఇప్పుడు చూడండి. వేల వేల ఎకరాల భూములు ప్రయివేటు సేకరణ చేస్తున్నారు. (అంటే స్వాధీనం, లేదా దోపిడీ) దిక్కూమొక్కూ లేని చిన్న రైతుల కడుపు కొడుతున్నారు. పొట్టకూటి కోసమైనా ఎంతో కొంత భూమి ఇవ్వండన్న చిన్న రైతుల మొర ఆలకించే వారే లేకుండా పోయారు. కారు చొకగా వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు బదలాయిస్తున్నారు. కాకుల్ని కొట్టి గద్దలకు వేస్తున్న చందంగా ప్రజావసరాల పేరిట పేదల భూములను ప్రైవేట్ వ్యక్తుల జీవనోపాదికీ కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు.

కీకారణ్యాల దోపిడీ

కొండలు, గుట్టలు, అడవులు ఆక్రమించి నయా భూస్వాములు వచ్చి కూచున్నారు. జాతీయ వనరులైన పొలాలు, అడవులు, గనుల మీద కన్ను పడింది. కీకారణ్యాలను దోచుకుంటున్నారు. మూలవాసులైన గిరిజనులు భూములు కోల్పోతున్నారు. సామాజానికి శ్రేయస్సు పేరిట దశాబ్దాలుగా చిన్న రైతుల పొలాలను యధేచ్చగా ‘సేకరిస్తున్నారు.’

ఆదేశిక సూత్రాలు అమలు చేస్తామంటూ ప్రాథమిక హక్కుల్ని పక్కకు నెట్టేలా రాజ్యాంగ సవరణలు వస్తున్నాయి. చివరికి కోర్టు పోరాటాలలో ఆస్తి హక్కు నీరుగారిపోయింది. మీకేమీ డబ్బు ఇవ్వకపోయినా భూమిని సేకరిస్తాం అనే దాకా పాలకులు వచ్చారు. ఎన్నో పోరాటాలు, మరెన్నో అంతులేని ఉద్యమాలతో ఆగిన ఈ సేకరణ (అక్విజేషన్) దుర్మార్గాలు 2023 నాటికి చట్టాలుగా మారాయి. కానీ సమస్య మళ్లీ మొదటికే వచ్చింది.

రాజ్యాంగ పీఠిక పునాది

రాజ్యాంగ పీఠికలో కనిపించే సోషలిజం ప్రస్తావన- ఆదేశిక సూత్రాలలో సజీవంగా ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించారు. ఆదేశం కాదు. ఆకాంక్ష. దాని మీద ఉన్న పరిమితి కీలకమైంది. దీని వెనుక కొన్ని దశాబ్దాల పోరాటం ఉంది. హక్కులను కాపాడడానికి సుప్రీంకోర్టు పోరాడుతూనే ఉన్నా, ఆదేశిక సూత్రాలను అమలు చేయడానికి హక్కులు తగ్గిద్దాం లేదా తీసేద్దాం అని ప్రభుత్వాలు నిరంతరం పట్టుబడుతూనే ఉన్నాయి. ఈ వాదోపవాదాల్లో హక్కులు చిక్కుల్లో పడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది.

నవంబర్ 5 న వెలువడిన తీర్పు ప్రభావం ప్రభుత్వాల పైన ఎంత ఉంటుందో రాజ్యాంగ పీఠిక లో చర్చించిన అంశంపైన ఎంత ఉంటుందో చూడాలి. ఇంతకు సోషలిజం అనే ఆలోచన ఉంటుందా, బలహీనపడుతుందా వేచిచూడాలి.


Read More
Next Story