‘ట్రంప్’ ను మిత్రదేశాలు పక్కన పెట్టడం ‘ఇరాన్’ ఘనతేనా?
x

‘ట్రంప్’ ను మిత్రదేశాలు పక్కన పెట్టడం ‘ఇరాన్’ ఘనతేనా?

హార్ముజ్ కోసం యుద్ధ నౌకలను పంపాలని కోరితే తిరస్కరించిన యూరప్


ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్నయుద్ధంలోకి యూరప్ సహ ఇతర నాటో మిత్రదేశాలను లాగాలని అనుకున్న ట్రంప్ ఆశలను ఆ దేశాలు వమ్ము చేశాయి. తమకు మిగిలిన ఉన్న కొద్దిపాటి గౌరవాన్ని అవి కాపాడుకున్నాయి. హర్ముజ్ జలసంధి గుండా ఇరాన్ అడ్డుకుంటున్న రవాణా నౌకలను రక్షించాలంటే తమ తమ దేశాలకు చెందిన యుద్ధ నౌకలను పంపాలని ట్రంప్ జారీ చేసిన ఆంజ్ఞలను ఆయా దేశాలు ధిక్కరించాయి.

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌తో కలిసి రెచ్చగొట్టి, చట్టవిరుద్ధమైన యుద్ధాన్ని ప్రారంభించిన ట్రంప్ చర్యపై అమెరికా నేతృత్వంలోని నాటో మిత్రదేశాలు అవిశ్వాసాన్ని ప్రకటించాయని చెప్పవచ్చు. అంటే ఇరాన్ ఈ యుద్ధంలో నైతికంగా విజయం సాధించినట్లే. ఈ చర్యలతో అమెరికా ఒక "దుష్ట" దేశంగా మిగిలిపోయింది.

కొరవడిన స్పష్టమైన ప్రణాళిక, వ్యూహం..

పశ్చిమాసియా దేశమైన ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న క్షిపణి దాడులు రెండు వారాలకు చేరాక ప్రపంచానికి ఒక విషయం అర్థమైంది. ఈ దాడుల్లో టెల్ అవీవ్, వాషింగ్టన్ కు ఎలాంటి స్పష్టమైన వ్యూహం లేదని తెలిసింది. ఇరాన్‌పై దాడి చేయాలన్న తమ చిరకాల కోరికను నెరవేర్చుకోవడం అనే కోరికను ఇజ్రాయెల్ నెరవేర్చుకుంది. ట్రంప్‌ కోరుకున్న "పాలన మార్పు" రాలేదు. టెహ్రాన్‌లో ఇస్లామిక్ పాలన స్థానంలో అమెరికా, ఇజ్రాయెల్‌కు అనుకూలమైన ప్రభుత్వం వస్తుందనే ఒక భ్రమ అలాగే ఉండిపోయింది.
అంతర్జాతీయ వాణిజ్యం కోసం హార్ముజ్ జలసంధిని తెరవడానికి తమ యుద్ధనౌకలను పంపాలన్న ట్రంప్ అభ్యర్థనను జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి పెద్ద యూరోపియన్ దేశాలు తిరస్కరించడం ఒక రకంగా మంచిదే. కానీ, ఇటీవలి సంవత్సరాలలో ట్రంప్‌కు తొత్తులుగా మారిన యూరప్‌లోని అమెరికా మిత్రదేశాలు ఇప్పుడు తమ వైఖరిని మార్చుకోవడం కొంత ఆశ్చర్యం కలిగిస్తోంది.
మరోవిధంగా చెప్పాలంటే, ఇరాన్‌ను యూరోపియన్ మిత్రదేశాలు చూసే విధానంలో ఎలాంటి మార్పు లేదు. ఇరాన్ "రహస్యంగా" అణ్వాయుధ శక్తిని సాధించడానికి ప్రయత్నిస్తున్న దేశంగానే వారు భావిస్తున్నారు. ఇరాన్‌పై దాడి చేయడంలో నాటో దేశాలు అమెరికా, ఇజ్రాయెల్‌లకు మద్దతు ఇస్తూనే ఉన్నాయి.
ఇరాన్ అణు కార్యక్రమాన్ని విమర్శించడమే కాకుండా, టెహ్రాన్‌లోని ప్రభుత్వాన్ని "అణచివేత పాలన"గా అభివర్ణిస్తున్నాయి. కానీ, ట్రంప్, బెంజమిన్ నెతన్యాహులు ఇరాన్‌పై బాంబులు వేస్తుంటే వారు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. కానీ హఠాత్తుగా ట్రంప్ వారిని కూడా యుద్ధరంగంలోకి దిగమని ఆదేశించడంతో వెనకాముందు ఆడుతున్నారు.
ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయం ఏమిటంటే, స్పెయిన్ ఒక ప్రత్యేకమైన దేశంగా నిలిచింది. సుంకాలు, గ్రీన్‌ల్యాండ్‌తో సహా ట్రంప్ తీసుకున్న అనేక చర్యలను అది గట్టిగా తిరస్కరించడమే కాకుండా, ఇరాన్‌పై దాడుల కోసం అమెరికా స్థావరాలైన రోటా, మోరాన్‌లను వాడుకోవడానికి అది నిరాకరించింది.

ట్రంప్ కు ‘నో’ అనే సమాధానమే వచ్చిందా?

నాటో మిత్రదేశాలు ట్రంప్ ను తిరస్కరించడం, ఆయన చేస్తున్న అనేక రకాల చేష్టల పట్ల ప్రపంచం స్పందనలో వచ్చిన తీవ్రమైన మార్పును ఇది ప్రతిబింబిస్తోంది. ఆయన డిమాండ్లు చాలావరకు అహేతుకంగా, అనూహ్యంగా, అన్యాయంగా ఉన్నాయి. తన మిత్రదేశాల సాయం కోసం ఆయన జారీ చేసిన తాజా ఆదేశం (ట్రంప్ ఎవరినీ దేనికోసమూ "అభ్యర్థించడం" అనేది అరుదుగా జరిగే విషయం) ఇరాన్‌పై క్షిపణి దాడులు అనుకున్న విధంగా జరగడం లేదనడానికి స్పష్టమైన సూచన. ఇది ట్రంప్ నిస్సహాయతకు సంకేతమా కాదా అనేది త్వరలోనే తెలుస్తుంది.
ఇరాన్ విషయంలో ట్రంప్ తీసుకున్న ఈ అనాలోచిత చర్య ప్రతికూల పరిణామాలను ప్రపంచం అనుభవిస్తున్నప్పటికీ, పశ్చిమ ఆసియా విషయంలో జరుగుతున్న ఈ పిచ్చిని అర్థం చేసుకోలేక చేష్టలుడిగి చూస్తూనే ఉంది. కానీ అందులో ఏదో విధంగా కలుగజేసుకునే ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు.
అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి, ముఖ్యంగా తన రెండవ పదవీకాలంలో, ఆయన తన పాశ్చాత్య మిత్రదేశాలను గౌరవంగా చూడలేదు కాబట్టి, ట్రంప్ తన అహంకారాన్ని దిగమింగి వారిని సంప్రదించడానికి చాలా ధైర్యం చేసి ఉండాలి. ఆయనకు ముందు జో బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు మొదలైన ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగించే ప్రయత్నం ప్రారంభించినప్పుడు, ఆయన తన యూరోపియన్ మిత్రులను చాలా చిన్నబుచ్చేలా, ఏకపక్షంగా వ్యవహరించారు.
క్రిమ్లిన్ తో యుద్ధ విరమణ ఒప్పందంపై సంతకం చేయడానికి అంగీకరించమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీపై ట్రంప్ బహిరంగంగా ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ పరిణామంతో యూరప్ మిత్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కానీ ట్రంప్ ఎప్పటి లాగే దానిని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పటి వరకు, రష్యా - ఉక్రెయిన్ మధ్య శాంతిని నెలకొల్పడానికి అతను చేస్తున్న ప్రయత్నాలలో తన యూరోపియన్ మిత్రదేశాల అభిప్రాయాలను దాదాపుగా పరిగణనలోకి తీసుకోవడం లేదు.
నాటో పట్ల ట్రంప్ వ్యతిరేకత తన మొదటి పదవీకాలంలోనే స్పష్టంగా వ్యక్తం చేశారు. ఆ సంస్థను రద్దు చేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. అప్పటి నుంచి, అమెరికా అధ్యక్షుడు నాటోపై ఒత్తిడిని కొనసాగిస్తూనే ఉన్నారు. అమెరికా ఖర్చుతో మిగిలిన దేశాలు లాభం పొందుతున్నాయని చెప్పారు.
ఈ ఖర్చు నుంచి తమకు ఉపశమనం కలగాలని లేదంటే నిబంధనల ప్రకారం నాటో దేశాలు 5 శాతం ఖర్చును భరించాల్సిందే అని డిమాండ్ చేశారు. నాటో దేశాలు ట్రంప్ చేస్తున్న అవమానాలను దాదాపు మౌనంగా భరించాయి.

విఫలమైన ఒప్పందాలు..

ఇరాన్ విషయంలో, అమెరికా నాటో మిత్రదేశాల పట్ల ట్రంప్‌కు ఉన్న అగౌరవం ఆయన మొదటి పదవీకాలంలోనే స్పష్టమైంది. 2018లో, బరాక్ ఒబామా ఐరోపా దేశాలతో కలిసి సంతకం చేసిన, పి5+1 ఒప్పందంగా (ఐదు ఐక్యరాజ్యసభ భద్రతా మండలి సభ్య దేశాలు, జర్మనీ) ప్రసిద్ధి చెందిన ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి ఆయన ఆకస్మికంగా వైదొలిగారు. వాస్తవానికి, ఇరాన్‌పై ప్రస్తుతం జరుగుతున్న దాడులు ఆ విఫలమైన ఒప్పందం పర్యవసానమే.
ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి పెద్ద యూరోపియన్ శక్తులు 2015 ఒప్పందానికి కట్టుబడి ఉంటాయని ఇరాన్ ఆశించింది. కానీ, మొదట్లో కొంత వ్యతిరేకత చూపినప్పటికీ, వారందరూ ట్రంప్‌తో ఏకీభవించి, చివరికి ఆయన వివాదాస్పద చర్యకు మద్దతు ఇచ్చారు. అంతేకాదు, వారు పరోక్షంగా ఇజ్రాయెల్, అమెరికాకు మద్దతు ఇచ్చి, ఇరాన్‌ను దాని అణు ఆశయాల కార్యక్రమాల నుంచి వెనక్కి నెట్టే ప్రయత్నంలో భాగస్వాములయ్యారు.
2020-2024 వరకు ట్రంప్ తర్వాత అధికారంలోకి వచ్చిన జో బైడెన్, తాను ఆ ఒప్పందాన్ని తిరిగి గాడిలో పెడతానని వాగ్దానం చేసినప్పటికీ, ఇరాన్ ఒప్పందాన్ని పునరుద్ధరించలేకపోయారు. 2025లో ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు ఇది ఆయనకు అనుకూలంగా మారింది.

హద్దులు దాటిన ట్రంప్

ఇజ్రాయెల్‌తో కలిసి, గత జూన్‌లో ఇరాన్ అణు కర్మాగారాలపై దాడి చేస్తూ 12 రోజుల యుద్ధానికి దిగి, టెహ్రాన్ సామర్థ్యాలను నాశనం చేశానని ఇక ముందు దానికి కోలువడానికి చాలా సంవత్సరాలు పడుతుందని ట్రంప్ ప్రకటించారు. కానీ అవి ఎప్పటిలాగే అసత్యాలుగా తేలాయి. ఎందుకంటే, ప్రస్తుత ఘర్షణలో ఇరాన్, ప్రపంచంలోని అగ్రశక్తి అయిన అమెరికాకు, అలాగే మరో సైనిక శక్తివంతమైన దేశమైన ఇజ్రాయెల్‌కు దీటుగా నిలిచింది.
తనదైన శైలిలో దుందుడుకు ధోరణిలో మాట్లాడే అమెరికా అధ్యక్షుడు, తన డిమాండ్‌ను తిరస్కరిస్తే ఐరోపాకు "చాలా చెడు" జరగబోతోందని హెచ్చరించారు. కానీ ఆయన హెచ్చరికను పట్టించుకోకపోవడం, ఇప్పటివరకు పిరికిపందలుగా ఉన్న తన నాటో మిత్రదేశాల విషయంలో ట్రంప్ హద్దులు దాటారని చూపిస్తుంది.
గ్రీన్‌లాండ్‌ను "స్వాధీనం చేసుకుంటానన్న" ట్రంప్ బెదిరింపుపై గతంలోనూ విభేదాలు తలెత్తాయి. అది ఐరోపా దేశాలను వారి సౌకర్యవంతమైన వాతావరణం నుంచి బయటకు లాగింది. గ్రీన్‌లాండ్‌ను పరిపాలిస్తున్న మిత్రదేశమైన డెన్మార్క్‌పై ట్రంప్ చేసిన సాహసోపేతమైన డిమాండ్‌ను వారు తప్పనిసరిగా వ్యతిరేకించాల్సి వచ్చింది. ఆ సందర్భంలో, అవసరమైతే సైనిక చర్యకు కూడా బెదిరించిన ట్రంప్, వెనక్కి తగ్గి, చర్చల ద్వారా మాత్రమే ముందుకు వెళ్తానని చెప్పారు.

ట్రంప్ ఏకాకి అవుతున్నారా?

ఈసారి, ఇరాన్‌పై దాడి చేయడంలో తనతో చేరడానికి అంగీకరించనందుకు, ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికన్ యుద్ధ విమానాలకు వైమానిక స్థావరాలు కల్పించేందుకు నిరాకరించినందుకు, ఇప్పుడు హార్ముజ్ జలసంధిని రక్షించాలన్న తన పిలుపును పాటించనందుకు, అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశమైన బ్రిటన్‌ను, దాని ప్రధానమంత్రి కీర్ స్టార్మర్‌ను ట్రంప్ విమర్శించారు.
స్పానిష్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్‌పై ట్రంప్ తీవ్ర వాగ్దాడికి దిగినప్పుడు వైట్ హౌస్‌లో మౌనంగా ఉన్న జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్, చివరకు ఇరాన్‌తో సంఘర్షణలో తమ దేశం ఆయనతో చేరదని అమెరికా అధ్యక్షుడికి చెప్పే ధైర్యం చేశారు.
ట్రంప్‌కు యూరప్ నుంచి ఎదురవుతున్న ప్రతిఘటన, కొంచెం ఆలస్యమైనప్పటికీ, బహుశా ఆయనకు చివరి దెబ్బ కావచ్చు. ఆస్ట్రేలియా, జపాన్ వంటి తన మిత్రదేశాలలో కూడా ఆయన క్రమంగా ఒంటరి అవుతున్నారు. ఇరాన్‌పై ఆయన చేస్తున్న యుద్ధానికి ఎవరూ మద్దతు ఇవ్వడం లేదు. ఈ పరిణామమే సంఘర్షణకు ముగింపు పలికేందుకు ఉత్తమ అవకాశాన్ని కల్పిస్తోంది.


Read More
Next Story