మల్లా జనంలో కనవడ్డాడట కెసిఆర్
శనివారం నాడు సోషల్ మీడియాలో అంతా ఇదే న్యూస్. ఏమయిందసలు. జనంలో ఉండాల్సిన నాయకుడు జనంలో లేకపోవడమేంది?: బహుజన తత్వవేత్త బిఎస్ రాములు కామెంట్...
జనంలో ఉండాల్సిన ఒక నాయకుడు జనంలోకి రావడమే ఒక వార్త కావడం ఎంత దురదృష్టం? ఎంత ఘోరం? జనంతో పార్టీ, ఉద్యమం నడిపిన అధికారంలోకి వస్తూనే జనం నుంచి దూరం కావడం మొదలయింది. సెక్రటేరియేటకే రాని ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసిఆర్) భారత దేశంలోనే గొప్ప చెడ్డ పేరు తెచ్చుకున్నారు. ఆయన అధికారంలో ఉన్న పదేళ్లు ఒక చీకటి అధ్యాయంలాగా మారిపోయింది. చెప్పడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా మనం ఎన్నుకున్నముఖ్యమంత్రి మనకు అందుబాటులో లేకపోతే ఎలా? అలాంటివారిని ఎన్నుకోవడం దేనికి ? ఇదే ప్రజల అసంతృప్తికి ప్రధాన కారణం. ప్రభుత్వంలో ఉన్నపుడు అపుడపుడూ కనిపించిన కేసిఆర్, 2023 అసెంబ్లీ, 2024 పార్లమెంటు ఎన్నికల పరాజయం తర్వాత అసలు జనం నుంచి పూర్తిగా దూరమయ్యారు. ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. నిన్న అక్కడే ఒక సమావేశంలో మాట్లాడటంతో అదిగో మల్లా జనంలోకి అంటూ సోషల్ మీడియాలో ఒకటే సందడి.
కెసిఆర్ ఎందుకు జనం నుంచి దూరమయ్యారు.
కెసిఆర్ ప్రభుత్యం చాలా మంచి పనులు చేసింది.అయితే, వఅవినీతి , కుల ప్రీతి , బీసీ వ్యతిరేకత , అహంకారం, ఎవరిని కలువని విధానం అందరిని బాధ పెట్టింది దూరం చేసింది. డబుల్ బెడ్రూం లు వెంటది వెంట పంటకు పోవడం, రెండేళ్లకొక విడతగా 1800 డబుల్ బెడ్రూం లు ప్రతినియోజక వర్గానికి కట్టక పోవడం,ఓటమి కారణాలు. దళిత బంధు పది లక్షలిచ్చి బీసీలకు లక్ష ఇస్తే అంటాడా? ఇది ఎంత ఇన్సల్టు? అది కూడా ఇయ్యలే! ఓటమికి ది అతి పెద్ద కారణం. అయినోళ్లకు రైతుబంధుతో లక్షలకు లక్షలు దోసి పెట్టిండు. మాకు ఏది ఇవ్వడా? ధరణి పేరు మీద 40 శాతం భూములు కిరి కిరి భూములని ఎక్కియ్యరా? దానికి లోన్లు రావు పట్టా కాదు, అమ్మా రాదు. నీయవ్వ ఇదేం కిరికిరి ? ఎలక్షన్ లకు నువ్వైతే రా నీ సంగతి చెప్తే అనుకున్నారు. ఓటమికివి కారణాలు.
బిఆర్ ఎస్ కు పడిన ఓట్లకు కారణాలు
1. గురుకుల పాఠశాలలు.
2.చేపల పెంపకం దారులు
3. రైతుబంధు మధ్యతరగతి
4. బీడీ కార్మికులు.
5. 33 జిల్లాల ఏర్పాటు.
ఇవి విజయాలు ఓట్లు తెచ్చాయి. ఇలాగే డబుల్ బెడ్రూం లు పొందిన వారి ఓట్ల వల్ల చాలా బి ఆర్ ఎస్ గెలిచింది.
నడ్డివిరిచిన ఈటెలతో పేచీ
బిఆర్ ఎస్ ప్రభుత్వంలో ఆరోగ్యంగా మంత్రిగా ఉండిన ఈటల రాజేందర్ మీద వేసిన దెబ్బ కెసిఆర్ నడ్డి విరిచింది. ఇది చంద్ర బాబు వెన్ను పోటు కన్నా ఎన్నో రెట్లు కెసీఆర్ పై బీసీలలో వ్యతిరేకత పెంచింది. దీనితో కెసిఆర్ కాళ్లను తానే నరుక్కున్నట్లయింది.ఈ విషయం నేను ఆరోజే చెప్పాను. ఆలె నరేంద్ర పట్ల ఈటల రాజేందర్ పట్ల ఒకే తీరు ప్రవర్తన! బీసీలంటే ఇంత చులకనా?అని జనం అనుకున్నారు. అవకాశం కోసం ఎదురు చూసారు. వేటు వేసారు. ఇలా కెసిఆర్ ప్రజల్లో ఒక్కొక్క వర్గాన్ని ఒక్కొక్క తీరుగా కోల్పోతూ వచ్చారు విద్యావంతులకు డెమాక్రటిక్ స్పేస్ లేకుండా పోవడం, పత్రికలకు అడ్వర్టైజ్ మెంట్ల విడుదల చేయడంలో పట్ల పక్ష పాతం, ఓటమి కారణాలయ్యాయి.
ఇతర కారణాలను పరిశీలిస్తే...
ఉద్యోగుల వయో పరిమితి 58 నుండి 61 కి పెంచడం చారిత్రక పొరపాటు. చారిత్రక నేరం. తద్వారా ఉద్యమాల్లో పాల్గొన్న యువకులకు ఏటా రావలసిన 50 వేల ఉద్యోగాలు రాకుండా పోయాయి. లక్ష యాభయి వేల మంది నిరుద్యోగులుగా ఉండి పోయారు. నూతన ఉద్యోగ కల్పనను కూడా కలుపుకుంటే ఉద్యమాలు చేసినందుకు మూడు లక్షల యువకులకు నిరుద్యోగాన్ని కెసిఆర్ శిక్షగా ఇచ్చాడు.
మరొక వైపు ఉన్నత విద్యా సంస్థ లన్నింటినీ నియామకాలు లేక కెసిఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. 2023నవంబర్ ఎన్నికలో భారత రాష్ట్ర సమతి (బిఆర్ ఎస్ ) ఓటమి పాలయ్యేందుకు ఇవి కూడ ప్రధాన కారణాలు.
కెసిఆర్ లో ఉన్న మరొక గుణం, సహచరులు అనుచరులు షైన్ అవుతుంటే ఓర్వ లేకపోవడం. జ్ఞానానికి , ప్రాధాన్యత ఇవ్వకుండా సౌండ్ పార్టీకి ప్రాధాన్యత నీయడం, ఉద్యమాల తెలంగాణ సమాజంలో డెమాక్రటిక్ స్పేస్ లేకుండా చేయడం అనేవి కెసిఆర్ టీం బలహీన పడడానికి బాగా కారణమయ్యాయి.
నిజానికి, 33 జిల్లాల ఏర్పాటు తో 50 ఏళ్ల కలలు సాకారమయ్యాయి. జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పడి సీట్లు పెరగడం ఒక మైలు రాయి. నియోజక వర్గానికి ఒక బాలికల బాలల గురుకులం అనే ఆలోచన గతంలో ఎన్నడూ లేని ఆలోచన. గతంలో జిల్లాకు లేదా తాలుకాకు ఒకటి అనే విధానం ఉండేది.
మండలాల పెంపు, జిల్లాల పెంపు వల్ల ప్రజల వద్దకు పరిపాలన మునుపెన్నడూ లేనంతగా చేరువైంది. నగర అభివృద్దికి వికేంద్రీకరణ అభివృద్దికి తోడ్పడింది. ఐటి రంగం కూడా వికేంద్రీకరణతో రెండో శ్రేణి నగరాలు ప్రయోజనం పొందాయి. ఎమ్మెల్సీలకు నియోజక వర్గంలో ఒక కార్యాలయం కట్టడం అనే ఆలోచన వల్ల శాసన సభ్యులను కలవడం స్టాఫ్ జవాబుదారీ తేలికైంది. ఇలా పదేళ్ల పాలనలో చేసిన మంచి పనుల వల్లే ఇపుడు వచ్చిన ఓట్లకు కారణం అని బిఆర్ ఎస్ మరిచి పోకూడదు. 7 లక్షల కోట్ల అప్పు చేసిన విషయం గురించి నాటి ప్రతిపక్ష పార్టీలు ఎంత గోల చేసినా దాని ప్రభావం ప్రజలకు తెలియదు. తెలిస్తే కనీసం మరో పది శాతం ఓట్లు తగ్గి వుండేవి.
మొత్తానికి జనానికి దూరం కావడం పదేళ్ల కిందట మెల్లిమెల్లిగా మొదలయింది. పదవి పోయాక పూర్తయింది. శనివారం నాడు ఎర్రవల్లి ని ఫామ్ హౌస్ చిన్న మీటింగ్ జరిగింది. పాలకుర్తి నియోజక వర్గంలో కొంతమంది బిఆర్ ఎస్ లో చేరారు. ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అంతే, అదిగో కెసిఆర్ మల్లొచ్చె అని వార్తలొచ్చాయి. అయితే ఇక్కడొకటి గమినంచాలె. ఆయన ఇంకా ఫామ్ గేటు దాటి రాలేదు. అందుకే మళ్లీ అంటున్నా
జనంలో ఉండాల్సిన ఒక నాయకుడు జనంలోకి రావడమే ఒక వార్త కావడం ఎంత దురదృష్టం? ఎంత ఘోరం?