శ్రీలంకలో ఆన్‌లైన్ సేఫ్టీ బిల్లుతో అంత ప్రమాదముందా?
శ్రీలంక కొత్త చట్టం తీసుకురానుంది. ఈ చట్టం ద్వారా ప్రభుత్వం ఏం సాధించబోతుంది.. ఎందుకు ప్రతిపక్షాలు ప్రతిపాదిత బిల్లును అడ్డుకుంటున్నాయి.
శ్రీలంక ప్రభుత్వం తీసుకురానున్న ‘ఆన్‌లైన్ సేఫ్టీ బిల్లు’ ఆ దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా ఉందని కొందరు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఆన్‌లైన్ కార్యకలాపాల్లో ప్రజలు మోసపోకుండా ఉండేందుకు దీన్ని తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
‘ఆన్‌లైన్ ఖాతాలు, బాట్‌ల’ దుర్వినియోగాన్ని గుర్తించి నిరోధించడం, రక్షించడం వంటి చర్యలు బిల్లులో పొందుపర్చారు.
ఐదుగురు సభ్యుల కమిటీ
బిల్లులోని ప్రతిపాదిత లక్ష్యాల సాధనకు ఐదుగురు సభ్యుల ఆన్‌లైన్ సేఫ్టీ కమిషన్ (ఓఎస్‌సీ) నియమిస్తారు. ఇందులో చైర్మన్‌తో సహా సభ్యులను నియమించే లేదా తొలగించే అధికారం అధ్యక్షునికి ఉంటుంది.
ఓఎస్‌సీకి ఉన్న అధికారాలివే..
‘నిషేధిత స్టేట్‌మెంట్‌లకు సంబంధించిన ఫిర్యాదులను పరిశోధించే అధికారం, తప్పుడు ప్రకటనలిచ్చే వ్యక్తులకు నోటీసులు జారీ చేయడం, అలాంటి ప్రకటనలను తీసివేయడానికి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, మధ్యవర్తులను సూచించడం లాంటి అధికారాలు ఓఎస్‌సీకి ఉంటాయి.
సుప్రీంలో పిటిషన్లు..
ముసాయిదా బిల్లు రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 45 పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్లలో ప్రతిపక్ష ఎంపీలు, కార్యకర్తలు, పౌర సమాజ కార్యకర్తలు, ట్రేడ్ యూనియన్ వాదులు, పాత్రికేయులు, శ్రీలంక క్యాథలిక్ చర్చి అధిపతి ఉన్నారు. ప్రభుత్వ, పిటిషనర్ల వాదానలు విన్న సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని నవంబర్ 7న పార్లమెంటుకు పంపింది. బిల్లులో 31 క్లాజులు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని, వాటి ఆమోదానికి మూడిరట రెండు వంతుల పార్లమెంటరీ ‘ప్రత్యేక మెజారిటీ’ అవసరమని తేల్చింది. అంటే 225 మంది ఎంపీలలో 150 మంది మద్దతు అవసరం. అయితే ఈ నిబంధనలను కోర్టు నిర్ణయానికి లోబడి సవరించినట్లయితే..వారికి సాధారణ మెజారిటీ (113 ఎంపీలు) మాత్రమే అవసరం.
సుప్రీం సూచించిన అంశాలేంటి?
ప్రభుత్వం సమర్పించిన సవరణలను పక్కన పెడితే, సుప్రీంకోర్టు అనేక సవరణలను సిఫారసు చేసింది. ఓఎస్‌సీ సభ్యుల నియామకాలు రాజ్యాంగ మండలి ఆమోదానికి లోబడి జరగాలి. పార్లమెంటు స్పీకర్ అధ్యక్షతన 10 మంది సభ్యుల కమిటీలో ప్రభుత్వ, ప్రతిపక్ష ఎంపీలు, పౌర సమాజ ప్రతినిధులు ఉండాలి. దేశం స్వతంత్ర కమిషన్లను నిర్వహించడానికి, పర్యవేక్షించడానికి కౌన్సిల్ బాధ్యత వహించాలి. దీని ప్రకారం.. అధ్యక్షుడు మాత్రమే ఒఎస్‌సీకి నామినీలను సిఫార్సు చేయగలరు. నామినేషన్లను ఆమోదించే లేదా తిరస్కరించే అధికారం కౌన్సిల్‌కు ఉంటుంది. ఒఎస్‌సీ సభ్యుల తొలగింపు కౌన్సిల్ ఆమోదంతో జరగాలి.
తొలుత క్యాబినెట్‌కు.. ఆ తర్వాత పార్లమెంట్‌లో..
సవరణల ద్వారా ఒఎస్‌సీ కొన్ని అధికారాలు న్యాయపరమైన పర్యవేక్షణకు లోబడి ఉన్నాయి. కొన్ని క్లాజులలో అస్పష్టమైన పదాలను కోర్టు గుర్తించింది. ఇవి అధికార దుర్వినియోగానికి దారితీసేవిధంగా ఉన్నాయని కోర్టు పేర్కొంది. సూచించిన అన్ని సవరణల ఆమోదం కోసం బిల్లును తొలుత క్యాబినెట్‌కు పంపుతారని ప్రజా భద్రతా మంత్రిత్వ శాఖలోని ఒక సీనియర్ అధికారి ఫెడరల్‌తో చెప్పారు. ఆ తర్వాత అదే బిల్లును మళ్లీ గెజిట్ చేసి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. అయితే, న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వారు సవరించిన బిల్లును కూడా వ్యతిరేకిస్తూ మొత్తం చట్టాన్ని రద్దు చేయాలని పట్టుబట్టారు.
పెరుగుతోన్న విమర్శలు..
పదుల సంఖ్యలో సవరణలను ప్రతిపాదించిన ప్రభుత్వం సాంకేతిక అంశాలను సాకుగా చూపుతో ఏదో దాస్తోందని మార్క్సిస్ట్ జేవీపీ రాజకీయ పార్టీ యువజన విభాగం సోషలిస్ట్ యూత్ యూనియన్ (ఎస్‌వైయు) ఎరంగ గుణశేఖర పేర్కొన్నారు. ‘‘సోషల్ మీడియాలో ప్రభుత్వం గురించి ఎవరూ మంచిగా చెప్పడం లేదు. పైగా విమర్శలు అధికారంలో ఉన్నవారిని బాగా ఇబ్బందిపెడుతున్నట్టున్నాయి’’ అని ప్రధాన ప్రతిపక్షం సమాగి జన బలవేగయ (ఎస్‌జేబీ) మాజీ ఎంపీ ముజిబుర్ రహుమాన్ అభిప్రాయపడ్డారు. బిల్లును మీడియా మంత్రిత్వ శాఖ ఎందుకు పంపలేదని ఆయన ప్రశ్నించారు.