'సనాతన హిందూవాది' పవన్ కళ్యాణ్ ఆక్రోశంలో అర్థం ఉందా?
కల్తీ లడ్డూ ఆరోపణల నేపథ్యంలో చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష లో భాగంగా అలసిసొలిసి కాలినడకన తిరుమల చేరుకొని దర్శనానంతరం 'వారాహి డిక్లరేషన్' సభ లో ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చ
అ) బుర్ర పెట్టాల్సిన మాటలు.
ఆ) బుర్ర లేని మాటలు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ హోదాలో కాకుండా 'సిసలైన సనాతన ధర్మ పరిరక్షకుడి'గా దసరా నవరాత్రుల మొదటి రోజు తిరుపతిలో నాలుగు భాషల్లో (తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్) చేసిన ప్రసంగం విన్నవారికి 'అ' గానీ, 'ఆ' గానీ అనిపిస్తుంది. తిరుమల కల్తీ లడ్డూ ఆరోపణల నేపథ్యంలో చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష లో భాగంగా అలసిసొలిసి కాలినడకన తిరుమల చేరుకొని దర్శనానంతరం 'వారాహి డిక్లరేషన్' సభ లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికలిగించాయి.
మొన్నటి సభలో 'పవర్ స్టార్' వస్త్రధారణ, చూపులు, మాటలు, వ్యవహార శైలి చూస్తే 'విశ్వ విఖ్యాత నట సార్వభౌమ' గుర్తుకు వచ్చారు. 1982లో తెలుగు దేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లో అధికారం చేజిక్కించుకుని రికార్డు సృష్టించిన నందమూరి తారక రామారావు క్రమేణా కాషాయం కట్టి జనాలను ఊపేస్తే, 2024 లో పోటీ చేసిన అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించి సంచలనం రేపిన పవన్ కళ్యాణ్ ఎర్రటి దీక్షా వస్త్రాల్లో అభిమానులలో ఉత్సాహం ఉరకలెత్తించారు. అధికారం రాకముందు--నక్సలెట్లు నిజమైన దేశభక్తులన్న ఎన్టీఆర్ లాగానే, పవర్ పరమపద సోపాన పయనం మొదలు పెట్టే ముందు--లాటిన్ అమెరికా విప్లవ యోధుడు ఎర్నెస్టో 'చే'గువేరా ను ఆరాధ్య దైవంగా చెప్పుకున్న పీకే సనాతన ధర్మం మీద మొట్ట మొదటిసారి గట్టి ఉపన్యాసం ఇచ్చారు. తనకు మతం లేదు, కులం లేదు... మానవత్వం మాత్రమే తన మతమని ఆవేశంగా గతంలో చెప్పిన పీకే దానికి పూర్తి వ్యతిరేకంగా ఏదో శక్తి ఆవహించిన మనిషిలాగా అణువణువునా మతం కిక్కు ఎక్కిన నాయకుడిలాగా చెలరేగి మాట్లాడారు. ఈ సూపర్ డైనమిక్ కాలంలో మతం, కులం మీద నిన్నటి అభిప్రాయం ఇప్పుడు కూడా ఉండాలనుకోవడం సరైనది కాదేమో. అంత వేడెక్కించిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో ఒక్కటంటే ఒక్కసారైనా మాట్లాడని అనేక మతపరమైన, ఆధ్యాత్మికమైన మాటలు పీకే నిన్న మాట్లాడి సంచలనం సృష్టించారనడంలో అతిశయోక్తి లేదు.
'ఎస్... నేను తిరుగులేని సనాతన హిందూ వాదిని,' అన్న చాలా బలమైన ప్రకటనతో పాటు... 'నేను హిందూ ధర్మాన్ని ఆచరిస్తాను, పరిరక్షిస్తాను.... ఇతర ధర్మాలను గౌరవిస్తాను,' అని బల్లగుద్ది చెప్పిన వర్తమాన రాజకీయ నాయకుడిగా, సో కాల్డ్ కుహనా లౌకిక వాదులను ఎడాపెడా బహిరంగంగా ఏకిపారేసిన నేతగా పీకే నిలిచిపోతారనడంలో సందేహం లేదు. మళ్ళీ స్టాండ్ మార్చకుండా ఇదే వాదన మీద పీకే నిలకడగా ఉండి జన సైనికులను ఆ దిశగా కార్యోన్ముఖులను చేస్తే, తామే హిందూ ధర్మ పరిరక్షణను గుండుగుత్తగా పాడుకున్నట్లు చెప్పుకుంటున్న భారతీయ జనతా పార్టీ ని తోసిరాజని ఒక రెండడుగులు ముందుకు వెళ్లినట్లే. ముసుగులో గుద్దులాట లేకుండా తన అభిప్రాయం ఏమిటో స్పష్టం చేసి పవనిజం నిరూపించుకున్న పీకే జనం బుర్ర పెట్టాల్సిన మాటలే మాట్లాడారా? లేక, బుర్ర లేని వాదన చేశారా? చూద్దాం.
వివిధ గ్లోబల్ అంచనాల ప్రకారం- ప్రపంచ వ్యాప్తంగా 32 శాతం క్రైస్తవులు, 25 శాతం ముస్లింలు, 15 శాతం హిందువులు ఉన్నారు. ఒక్క భారత్, నేపాల్ లలో మాత్రమే దేశ జనాభాలో 75 శాతానికి పైబడి హిందువులు ఉన్నారు. ఈ మూడు మతాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మన దేశంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా ఉంది. ఢిల్లీ నుంచి గల్లీ స్థాయి వరకూ, కాలనీల్లో, ఆఫీసుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియా వేదికల్లో... అన్ని స్థాయుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ మూడు మతాల వారి మధ్య టెన్షన్ ఉంది--పైకి పెద్దగా కనిపించినప్పటికీ. ఒక మతం వారి మీద మరొకరికి అపనమ్మకం, మానసిక దూరం నానాటికీ పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. మతాంతర్గత సంకుచిత సిద్ధాంతాల వల్ల, ఆధిపత్య ధోరణి వల్ల, ఆధునికత కు అనుగుణంగా మతాలను సంస్కరించుకోవాలన్న స్పృహ గానీ, ఆలోచనగానీ మత పెద్దలకు లేకపోవడం వల్ల ఈ విబేధాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఏ మూలనో జరిగిన చిన్న మత ఘర్షణ సమాచారాన్ని అయినా క్షణాల్లో వైరల్ చేసి ఆ మతస్థులకు క్షణాల్లో చేరవేసి స్పందన రాబట్టే సాంకేతికత అగ్నికి ఆజ్యం పోస్తోంది.
తమ దేవుడు మాత్రమే దేవుడని నమ్ముతూ ఇస్లామిక్ ప్రపంచ స్థాపన దిశగా జరుగుతున్న వ్యూహాత్మక ప్రయత్నాలు, తమ మత వ్యాప్తికి విశ్వ వ్యాప్తంగా ఒక పద్ధతి ప్రకారం క్రైస్తవ మతం అందజేస్తున్న ఆర్థిక అండదండల నడుమ నికార్సైన హిందూ ధర్మ అవలంబకులు తమ మత భవిష్యత్తు గురించి కలవర పడుతున్నారన్న వాదనలో నిజం లేకపోలేదు. మెజారిటీ హిందువుల పక్షాన గట్టిగా నిలబడి మాట్లాడడం, ఆవేదనను చెప్పుకోవడం పీకే అన్నట్లు ఈ దేశంలో కష్టంగా మారింది. సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని వల్లెవేస్తూ... ప్రతి మనిషిలో, చెట్టులో, పుట్టలో దేవుడ్ని మాత్రమే చూడాలని ప్రబోధిస్తూ, పరమత సహనాన్ని నిత్యం ప్రవచించే హిందూ మతం అద్భుతత్వాన్ని, విశిష్టతను స్వార్ధ శక్తులు, పొలిటికల్ హైజాకర్స్ దెబ్బతీసి, మత సామరస్యాన్ని కలుషితం చేశారు.
నిజమైన హిందువులు భిన్నత్వంలో ఏకత్వాన్ని, సర్వే జనా సుఖినో భవంతు అన్న మాటను త్రికరణ శుద్ధిగా నమ్ముతారు. ఇలాంటి వారికి భిన్నమైన కరుడు గట్టిన ముస్లిం-క్రైస్తవ వ్యతిరేక హిందువుల మద్దతు కూడగట్టి బీజేపీ హిందూ వాదానికి ఏకైక ప్రతినిధిగా తనకు తాను బ్రాండింగ్ చేసుకోవడంతో సమస్య వచ్చిపడింది. సంఘ్ పరివార్ చర్యలు, నిర్ణయాలు యావత్ హిందువుల చర్యలు, నిర్ణయాలుగా చెలామణీ కావడం విషాదం. ఇప్పుడు క్షేత్ర స్థాయి వాస్తవ స్థితిగతులు ఎట్లా ఉన్నాయంటే, పరమత సహనం కలిగి ఉండీ, ఏదైనా విషయంలో హిందువుల పక్షాన నిష్పాక్షికంగా ఎవ్వరు మాట్లాడినా వారిపై 'అంధ్ భక్త్' అనో, 'మోదీ భక్త్' అనో ముద్ర పడుతోంది. అందుకే విద్యావంతులు, మేధావులు, జర్నలిస్టులు, విశ్లేషకులు ఈ విభజన రేఖ దగ్గర డీల్ చేయడం చేతగాక ఎందుకొచ్చిన లాయిలాస అని కిమ్మనకుండా ఉండడమో, తమకు తాము లౌకిక వాదులుగా పోజు కొట్టడమో చేస్తున్నారు. ఈ క్రమంలో-ఎంతో సున్నితమైన మతాల విషయంలో తప్పును తప్పు, ఒప్పును ఒప్పు అనే వర్గమే కరువయ్యింది. ఇంతలో, కాషాయ సేనకు వ్యతిరేకంగా కత్తి కట్టిన ఒక లౌకిక మేధో (సెక్యులర్ ఇంటలెక్చువల్) వర్గం జనాభా పరంగా అల్పసంఖ్యాక వర్గాల పక్షాన గళం వినిపించడం మాత్రమే అజెండాగా పెట్టుకుంది. హిందువులపై, హిందూ వ్యవస్థలపై జరిగే దాడిని ఈ వర్గం పరిగణనలోకి తీసుకోకుండా ముస్లిం, క్రిస్టియన్ మతాలపై దాడి సందర్భంగా మాత్రమే షెల్ నుంచి బైటికి వచ్చి నానా హడావుడి చేస్తూ మీడియాలో యాగీ చేస్తుందన్న విమర్శ మూటగట్టుకుంది. ఎంతో పేరు పొందిన కవులు, కళాకారులు, విద్యావంతులు, జర్నలిస్టులు ఈ కోవకు చెందినవారై ఉండడం గమనార్హం. ఈ వర్గంలో కొందరికి బైటి నుంచి మతపరమైన ఫండింగ్ అందుతుందన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయనేది వేరే విషయం. ఎవరి మీద ఎవరు దాడి చేసినా తప్పే, అది ఖండనార్హమే అన్న ప్రాథమిక సూత్రం విస్మరించి 'సెలెక్టెడ్ రియాక్షన్' ఇవ్వడం రివాజుగా మారి పరిస్థితిని సంక్లిష్టం చేస్తోంది.
ఈ క్రమంలో- మితవాద హిందువులు ఎందుకొచ్చిన గొడవని.... కక్కలేక మింగలేక కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుని బతుకుతున్నారు. ఇతర మతాల వారి భారతీయత నిరూపించుకోవాలన్న వాదన కూడా తప్పని వీరు నమ్ముతారు. ఎవరి మతాన్ని వారు సామరస్యపూర్వకంగా ఆవలంభించుకోవాలని వీరు గట్టిగా అభిలషిస్తారు. ఇలాంటి నికార్సయిన హిందూ ధర్మ అవలంబకుల మనోభావాల నిజమైన ప్రతినిధి నిజంగానే కరువయ్యారు. హిందువులకు, హిందూ ధార్మిక సంస్థలకు, హిందూ సంస్కృతీ సంప్రదాయాలకు దెబ్బ తగులుతున్నా ఈ వర్గం హిందువులు లోలోన కుమిలిపోతున్నారు తప్ప మతాన్ని అత్యంత సున్నిత అంశగా మార్చిన కాషాయ సేనతో అంటకాగడం లేదు. ఇది అర్థం చేసుకునే తీరిక, ఓపిక లేని సో కాల్డ్ లౌకిక వాదులు ఇస్లాం, క్రైస్తవ ప్రయోజనాల పరిరక్షకులుగా మిగిలిపోయారన్నది సమాజంలో ఒక వర్గంలో ఉన్న నిశ్చితాభిప్రాయం. సహజ సిద్ధమైన సినిమాటిక్ ఆవేశంతో పీకే చెప్పదలిచింది సూక్ష్మంలో మోక్షంగా ఇదే నని అయన ప్రసంగాన్ని విశ్లేషిస్తే అర్థమవుతుంది.
హిందూ సమాజం 'డొసైల్' గా మారిందని, తిడితే బాధపడే హక్కు, బాధను వ్యక్తపరిచే హక్కు లేకపోవడం ఏమిటి అన్నది అయన బాధగా వెల్లడయ్యింది. చట్టాలు కూడా సనాతన ధర్మం పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తూ అన్య ధర్మాలపై ఎక్కువ మానవత్వం, దయ కనబరుస్తున్నాయని ఆయన చేసిన ప్రస్తావన మితవాద హిందువుల్లో ఎప్పటి నుంచో ఉన్న బాధే. మెకాలే చదువుల వల్ల వచ్చిన సాంస్కృతిక సామ్రాజ్యవాదమంటూ, పశ్చాత్య దేశాల్లో మతం-అధికారం కలగాపులగమైనా, మధ్య ప్రాశ్చ్య మ్ లో ఇస్లామిక్ రాజ్యాలు ఏర్పడినా మాట్లాడని సూడో సెక్యులరిస్టులు భారత్ లో మాత్రం హడావుడి చేస్తున్నారని చేసిన విమర్శ పసలేనిది కాదు. చైనా తప్ప మిగిలిన అన్ని అగ్ర రాజ్యాల అధినేతలు మతం ఆశ్రయం పొందినా లేని సమస్య భారత్ లో మోదీ విషయంలో ఎందుకన్నది పీకే ఆవేదన. రాజ్యాంగంలో 'సెక్యులర్' అన్న మాట రాసుకున్నాక మరి దానికి కట్టుబడి ఉండాలి కదా! ఈ అడ్డంకి గురించి కూడా పీకే తన ప్రసంగంలో మాట మాత్రంగా ప్రస్తావించారు.
నిజానికి, 'సనాతన ధర్మం' అన్న దానికి విస్తృతమైన అర్థం ఉంది. ఈ పద బంధానికి పీకే నిర్వచనం, మోదీ -అమిత్ షా నిర్వచనం, ఆర్ ఎస్ ఎస్ నిర్వచనం, లౌకిక వాదుల నిర్వచనం ఒక్కటిగా లేదు. బీజేపీ మూడో సారి బంపర్ మెజారిటీ (చార్ సౌ పార్....) వస్తుందన్న అత్యాశతో మోదీ - అమిత్ షా బృందం రెచ్చిపోయి సనాతన ధర్మ స్థాపన ప్రస్థావన చేసి ఆ పదం నిర్వచనాన్ని గందరగోళపరిచింది. దాంతో ఇప్పుడు మితవాద హిందువు అయినా ఆ మాట వాడితే హిందూ మతోన్మాది అనే ముద్ర పొందేట్లు ప్రమాదం పొంచి ఉంది. అందుకే... పీకే "స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం.. లోకాస్సమస్తా స్సుఖినోభవంతు" ప్రస్తావన చేసి అందరూ సుఖంగా ఉండాలనుకునేది మాత్రమే సనాతన ధర్మం అంటూ... హిందూ రాజులు కట్టించిన మసీదులు, డచ్ వారి కోసం కట్టించిన చర్చిల మాట తెచ్చారు. హిందువుగా సనాతన ధర్మాన్ని తాను ఆరాధిస్తానని, మిగతా మతాలను గౌరవిస్తానని అయన పదే పదే చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం చూపేది, ఇతర మతాలను గౌరవించేది సనాతన ధర్మమని వివరణ ఇచ్చారు. సనాతన ధర్మం మనుషులు ఒక్కరే సుఖంగా ఉండాలని మాత్రమే కోరుకోలేదని, ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి సుఖంగా ఉండాలని కోరుకుంటుందని వెల్లడించారు. నమాజ్ సమయంలో తన ప్రసంగాలు ఆపిన విషయాన్ని, రష్యన్ ఆర్థడాక్స్ కు చెందిన తన కూతురు తిరుమల దర్శనం కోసం డిక్లరేషన్ ఇచ్చిన సంగతిని కూడా ప్రస్తావిస్తూ తన విశాల దృక్పథాన్ని వెల్లడించే ప్రయత్నం చేశారు. పనిలో పనిగా జగన్ ను, కల్తీ లడ్డూను ప్రస్తావించారు.
ఇంతకూ పీకే సొంత బుర్రతోనే ఈ మాటలు మాట్లాడారా? వేరే అజెండా ఏమైనా ఉందా? అన్న అనుమానం కలగడం సహజం. కొన్ని రాష్ట్రాలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అయన ఎన్ డీ ఏ కు అనుకూలమైన నెరేటివ్ బిల్డప్ చేయడం కోసం మూడు ఇతర భాషల్లో మాట్లాడారా? అన్న అనుమానం చాలా మందికి కలిగింది. పీకే ప్రసంగం మోదీ చెవులకు ఇంపుగా ఉంటుందనడంలో సందేహం లేదు. ప్రసంగం మధ్యలో సనాతన ధర్మం పరిరక్షకుడిగా 'గౌరవనీయులైన మోదీ గారి' పేరు అయన తెచ్చారు కూడా. మోదీ వ్యతిరేకులపై కూడా విమర్శలు సంధించారు. తమిళనాడు యువనేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని వైరస్ తో పోల్చడాన్ని, బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ 'నాచ్-గాన్' తంతుగా అభివర్ణించడాన్ని కూడా పీకే ప్రస్తావించి విమర్శలు చేసారు. "మోదీని, మమ్మల్ని తిట్టండి గానీ మా రాముడ్ని అంటే సహించేది లేదు. సనాతన ధర్మంపై దాడి చేస్తే చేతులు కట్టుకుని కూర్చుని లేము," అని కూడా చెప్పడం విశేషం. సనాతన ధర్మం కోసం తన రాజకీయ పదవులు, జీవితం పోయినా పర్వాలేదని ఒక దశలో ఆవేశంగా చెప్పారు.
సనాతన ధర్మ పరిరక్షణకు ఒక బలమైన చట్టం అవసరమనీ, చట్టం అమలుకు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని వారాహి డిక్లరేషన్ డిమాండ్ చేసినా, దానికన్నా ముందు-"ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం కలిగినా ఒకేలా స్పందించేలా లౌకికవాదాన్ని పాటించాలి," అన్న దాన్ని పాయింట్ నెంబర్-1 గా ఉంచారు. వారాహి డిక్లరేషన్ కు ముందుగానీ, తర్వాత గానీ పీకే కేంద్ర పెద్దలతో మాట్లాడి ఉంటారు. అందులో అంశాలు అమలు చేసి ఆయన్ను వారు సంతృప్తి పరుస్తారన్న దాంట్లో సందేహపడాల్సింది లేదు.
మొత్తం మీద చూస్తే...."పెద్ద నైతిక సంక్షోభం తలెత్తిన సమయంలో నిష్పాక్షికత పాటించే వారికి నరకంలో ఘోరమైన చిత్రహింసలు తప్పవు," అని తన ప్రసంగంలో ఉటంకించిన డాంటే అలిఘేరి అనే ఇటాలియన్ రచయిత చెప్పిన మాటలు పీకే ను ప్రేరేపించినట్లు కనిపించింది. "secularisim is not one way it is a two-way. Respecting each other is esential," అన్న పీకే మాటతో విభిదించేవారు ఉండరేమో. ఆవేశంలో ఏదేదో మాట్లాడతారన్న, మాట మార్చడానికి మొహమాటపడరన్న అపప్రద ఉన్న పీకే వారాహి డిక్లరేషన్ కు కొనసాగింపుగా, 'నిజమైన హిందూ సనాతన వాది'గా మున్ముందు చేపట్టే చర్యలను బట్టి హిందూ సమాజం పట్ల అయన చిత్తశుద్ధిని అంచనా వేయవచ్చు.
(ఇందులో వ్యక్తీకరించినవన్నీ రచయిత సొంత అభిప్రాయాలు. వాటితో 'తెలంగాణ -ఫెడరల్' ఏకీభవించనవసరం లేదు.)