ఎటూ చూసినా శ్రీరామ్ జండాలే, వాటిని మోస్తున్నదెవరు?
x
Image source: Chennai Photo Biennale

ఎటూ చూసినా శ్రీరామ్ జండాలే, వాటిని మోస్తున్నదెవరు?

ఒకటైతే నిజం. 2024 జనవరి 22 కి ముందు భారత్, ఆ తర్వాత భారత్ కి మధ్య మాత్రం తేడా ఉంది. అయినాసరే అది ప్రతీఘాతుక పరిణామానికి దారితీస్తుందని భీతిల్లాల్సిన పని లేదు.


ఇఫ్టూ ప్రసాద్ (పిపి)


నేను విజయవాడ వీధులన్నీ తిరగలేదు. తిరిగిన మేరకు పసిగట్టిన విషయం గూర్చి!

నెల్లిమర్ల అమరత్వపు 30వ వర్ధంతి సందర్భంగా ఇఫ్టూ అనుబంధ యార్డు హమాలీ యూనియన్ నిర్వహించిన సభలో వక్తగా నిన్న ఏలూరు వెళ్ళా. అక్కడా వీధులన్నీ తిరగలేదు. తిరిగిన మేరకు గమనించిన విషయం గూర్చి!

వీధులూ, ఊళ్ళూ తిరగాలా? మెతుకు పట్టుకుంటే రుచి తెలుస్తుంది కదా! ఇంతకూ ఆ కొత్త దృశ్యాలు ఏమిటి?
ఎక్కడ చూసినా కొత్త జండాలే! ఇళ్ళు, దుకాణాలు, బైక్స్, కార్లు, లారీల మీద!
ఇది ఎన్నికల సంవత్సరం ఐనందున కొత్త పార్టీ పుట్టి కొత్త జండాలు ఎగిరాయని అనుకుంటున్నారా? కాదు.
కాంగ్రెస్, టీడీపీ, వైకాపా, జనసేన, లెఫ్టు, బీజేపీ, బిఎస్ పి, ఎఎపి ఎ వంటి పాత రాజకీయ పార్టీల జండాలా? అవీ కాదు.
జాతీయ జండా అనే భావం కలిగిందా? అది కూడా కాదు.
ఇవేవీ కాకుండా ఇంకేమిటి? ఔను, ఉన్నాయి. నేడు కొత్తగా వెలిసిన శ్రీరామ్ జండాలవి.

విజయవాడ, ఏలూరులలో నా పరిమిత చూపుకు చిక్కిన దృశ్యాలు బహుశా దేశవ్యాప్త ధోరణికి ప్రతీక కావచ్చేమో! దక్షిణాది పరిస్థితి ఇలా ఉంటే, ఉత్తరాదిస్థితి ఏమిటో మరి!

జనవరి 22 అయోధ్య ప్రక్రియ దేశంలో మెజార్టీ మత ప్రజల్లో అత్యధిక శాతం మనసుల్ని ఆవహించిందని అనిపిస్తుంది. ఎంత శాతమని లెక్కింపుకి వెళ్లడం లేదు. ఒకటైతే నిజం. 2024 జనవరి 22 కి ముందు భారత్, ఆ తర్వాత భారత్ కి మధ్య మాత్రం తేడా ఉంది.

వర్తమాన భారత రాజకీయ గమనంలో 2024 జనవరి 22 నాటి పరిణామం సాంస్కృతిక తిరోగమన దారిలో మలుపు. అంతమాత్రాన అనివార్యంగా అది రాజకీయ ప్రతీఘాతుక పరిణామానికి దారితీస్తుందని భీతిల్లాల్సిన అవసరం లేదు.

రాజకీయ శాస్త్రం ఒక కళ! ఫాసిజం అంతకంటే గొప్ప కళ! ఫాసిజాన్ని ఓడించే రాజకీయ విధానం శక్తివంతమైన కౌంటర్ కళ! అది ఫాసిస్టు వ్యతిరేక శక్తుల తక్షణ కర్తవ్యం.

దేవుణ్ణి అడ్డం పెట్టుకొని సజీవ బాధితప్రజల్ని తెలివిగా తనవైపు త్రిప్పుకునే కార్పోరేట్ రాజకీయకళని వాళ్లు ప్రదర్శిస్తున్నారు. దేవుడి ఉనికిని బహిర్గతం చేసే పేరిట సజీవ స్వపక్ష ప్రజల్ని దూరం చేసుకోకుండా జాగ్రత్త పడడం కౌంటర్ రాజకీయ కళలో ఒక భాగం!

తమ రక్షణగీత దాటి లేదా లక్ష్మణ రేఖ దాటి దోపిడీవర్గ శత్రుకంచుకోటలో మన జనం అడుగు పెట్టిన నిర్దిష్ట కాలాల్లో కళకు అత్యంత ప్రాధాన్యత ఉండడం సహజమే!

మన ప్రజలు భ్రమలతో దారి తప్పి శత్రుకోటలోకి అడుగు పెట్టిన సమయంలో వారిని బయటకు తెప్పించే పేరిట బయటి నుండి కోట గోడలపై దాడికి దిగడం సరైన మార్గం కాదు. కోటలోపలకి చేరిన మన ప్రజల దృష్టిలో మనం వారికి శత్రువులమౌతాం. బయటి నుండి మనం చేసే దాడిని తమ మీద దాడిగా అపోహ పడే ప్రమాదం ఉంది. మనం కోట బయటి నుండి దాడికి దిగితే, మన ప్రజలు లోపల నుండి కోట గోడల పరిరక్షణ కోసం కత్తులు నూరతారు. కోట లోపల 'పెట్టుబడి', దాని సేవక ముఠా సురక్షితంగా బ్రతికిపోతాయి.

ఇప్పుడు చేయాల్సింది కోటకు అగ్గిపెట్టడం కాదు. కోటలోపల అగ్గి పుట్టించడం.

ఈ సున్నిత సమయంలో పీడిత ప్రజలు చేబూనిన జండాల రంగుల్ని దృష్టిలోకి తీసుకోకూడదేమో! మన ప్రజల్ని మనం మానసికంగా గాయపరిస్తే, వారు మనల్ని రాజకీయంగా శిక్షిస్తారు. శత్రు జండా ధరించిన మన ప్రజల్ని ప్రేమతో హక్కున చేర్చుకొని మనసుల్ని గెలుచుకుంటే, రాజకీయ శిక్షార్హులైన ప్రజా శత్రువుల్ని అంతిమంగా శిక్షిస్తారు.

జండాలపై రాజకీయ కోపంతో అవి ధరించిన ప్రజలపై కోపం పెంచుకుంటే అతిపెద్ద చారిత్రక అపరాధం చేసిన నేరస్తులం అవుతాం. ప్రజల చేతుల్లోని జండాల్ని, వాళ్ళ సైకిళ్లు, బైక్స్ పై ఎగిరే జండాల్ని, వాళ్ళ ఇళ్లపై ఎగిరే జండాల్ని చూసి చులకన చేయొద్దు. పీడిత ప్రజల పట్ల అత్యంత గౌరవం వినయశీలత, విధేయతలతో మనసుల్ని జయించే పనిని చేపడితే, మనం కొత్త చరిత్ర నిర్మాణానికి ఉత్ప్రేరకంగా సహకరించి, రాజకీయంగా చరితార్థులమౌతాం.

చరిత్రలో మక్కీకి మక్కీగా ఏదీ పునరావృతం కాదన్న మార్క్స్ భాష్యాన్ని దృష్టిలో ఉంచుకుంటూనే, 119 ఏళ్ల క్రితం ఇదే రోజున జరిగిన ఓ ఘటన ఉదహరించుకుందాం.

కాకతాళీయంగా జరిగినా రెండూ జనవరి 22 వ తేదీనే జరిగాయి.
అది 22-1-1905వ తేదీ.
ఇది 22-1-2024వ తేదీ.
అది రష్యా. ఇది భారతదేశం.
వాటి మధ్య వ్యవధి 119 ఏళ్లు!

రష్యా రాజధాని సెంట్ పీటర్స్ బర్గ్, వింటర్ ప్యాలెస్ లోని జారు చక్రవర్తికి వినతిపత్రం ఇచ్చే పేరిట ఓ మతాధికారి పట్ల భ్రమలతో లక్షా నలభైవేల మంది కార్మికులతో ప్రదర్శన జరిగింది. వింటర్ ప్యాలెస్ కి ర్యాలీగా వెళ్తే రొట్టె ఇవ్వరు, తూటాల్ని బహుకరిస్తారని కార్మికవర్గాన్ని బోల్షివిక్కులు హెచ్చరించి ఆపించే ప్రయత్నం చేశారు. వారు వినలేదు. దేవుడి పట్ల, ముఖ్యంగా మతాధికారి పట్ల ఆరోజు వారికి భ్రమలు బలంగా ఉన్నాయి. ఐనా బోల్షివిక్కులు శ్రామికజనం పాల్గొన్న నాటి ప్రాణాంతక ప్రదర్శనకి దూరంగా లేరు. సెంటిమెంట్ల జోలికి వెళ్లకుండా మతాధికారి నిలువెత్తు ఫోటోలు ధరించి శ్రామికవర్గం పాల్గొన్న ర్యాలీలో పాల్గొన్నారు. ప్రదర్శనపై ఘోర మారణకాండ చరిత్రలో రక్తసిక్త ఆదివారం (BLOODY SUNDAY) గా పేరొందింది. అదే ప్రధమ రష్యన్ విప్లవంగా మారింది. అందులో వారు పాల్గొనడం ద్వారా శ్రామికవర్గ విశ్వసాన్ని పొంది అజేయులై విప్లవ సారధ్యం వహించారు.

రష్యన్ క్యాలెండర్ ప్రకారం 1905 జనవరి 9న జరిగినా, ప్రపంచ క్యాలెండర్ ప్రకారం జనవరి 22నే జరిగింది.

సామాజిక భౌతికపరిస్థితుల రీత్యా గానీ, స్వీయాత్మక పరిస్థితుల రీత్యా గానీ నాటి రష్యాకూ, నేటి భారత్ కూ పోలికలు లేకపోవచ్చు. కానీ ప్రజలు మానసికంగా భ్రమలకి గురైన సందర్భాల్లో రాజకీయ వైఖరి ఎలా ఉండాలో ఆదర్శంగా తీసుకునే అంశం అందులో దాగి ఉండడం విశేషం!





Read More
Next Story