అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విస్తరిస్తున్న ‘యూదు ప్రాబల్యం’
x

బాబు జగజ్జీవన్ రామ్, డగ్లాస్ ఎమ్ హఫ్ (కమలాహారిస్ భర్త)

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విస్తరిస్తున్న ‘యూదు ప్రాబల్యం’

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మూడు నెలలకు ముందు యూదు నేతలకు అత్యున్నత పదవులకు పోటీచేసే అవకాశం, యూదు ఓటర్ల మద్దతు ఎవరికి? అనే అంశాలపై విశేష చర్చ జరుగుతోంది.



–నాంచారయ్య మెరుగుమాల, సీనియర్ జర్నలిస్టు


ఇండియాలో అనుసూచిత కూలాలకు (ఎస్సీ) చెందిన ఒక నాయకుడికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం 45 సంవత్సరాల క్రితం చేజారిపోయింది. కేంద్రంలో 23 రోజులు అధికారంలో ఉన్న నాటి మైనారిటీ ప్రభుత్వ ప్రధాని చరణ్‌ సింగ్‌ 1979 ఆగస్ట్‌ 20న రాజీనామా చేస్తూ లోక్‌సభ రద్దుకు సిఫార్సు చేశారు. పార్లమెంటు దిగువసభలో తన మెజారిటీ నిరూపించుకొని ఈ ప్రధాని మాట జవదాటకుండా రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి వెంటనే సభను రద్దు చేశారేగాని తనకు అవకాశమిస్తే మెజారిటీ నిరూపించుకుంటానని ముందుకొచ్చిన జనతా పార్లమెంటరీ పార్టీ నేత బాబూ జగ్జీవన్‌రామ్‌కు చాన్స్‌ ఇవ్వలేదు. రెండు పక్షాల్లో ఏదీ చట్టసభలో అవసరమైన సంఖ్యాబలం చూపించుకోలేనప్పుడు సభను సమావేశపరిచి నాయకుడిని (ప్రధాని) ఎన్నుకోమని కోరే అధికారం లేదా వెసులుబాటు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉంది.

లోక్‌సభ స్పీకర్‌గా రెండుసార్లు పనిచేసిన సంజీవరెడ్డికి ఇలాంటి పార్లమెంటరీ సాంప్రదాయలు తెలిసి కూడా నాలుగున్నర దశాబ్దాల క్రితం జగ్జీవన్‌రామ్‌కు ఆ అవకాశం ఇవ్వలేదు. కరుడుగట్టిన తన పాత రాజకీయ ప్రతీకారాన్ని, కుల విద్వేషాన్ని నీలం ఇలా ఆచరణలో చూపించారనే అపప్రధను తర్వాత మూటగట్టుకోవాల్సివచ్చింది. ఓటర్ల సంఖ్యరీత్యా అతిపెద్ద ప్రజాస్వామ్యదేశంగా వర్ణించే భారత్‌లో దళిత నాయకుడు ఎవరైనా సమీప భవిష్యత్తులో ప్రధాని అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇక్కడ ఈ ప్రస్తావన ఎందుకంటే– ప్రపంచంలో అత్యుత్తమ ప్రజాతంత్ర దేశంగా పరిగణించే అమెరికా 245 ఏళ్ల ప్రజాస్వామ్య చరిత్రలో యూదు జాతికి చెందిన నాయకుడు ఎవరూ దేశాధ్యక్షుడు కాలేదు.

ఇక ముందు ఈ ఏకైక అగ్రరాజ్యంలోని అధికార కేంద్రమైన కాపిటల్‌ హిల్‌లో అధ్యక్ష పీఠం అధిష్ఠించే అవకాశం యూదు నేతకు ఎన్నేళ్లకు వస్తుందో చెప్పడం కష్టం. దైవసుతుడిగా కోట్లాది మంది ప్రజలు ఆరాధించే యేసు క్రీస్తు జీవితంలోని విషాద ఘట్టాలకు కారకులు యూదులు అనే భావన, ఐరోపా, ఆసియా దేశాల్లో వ్యాపారంతోపాటు అనేక రంగాల్లో పైపైకి దూసుకెళ్లిన యూదులతో క్రైస్తవులు సహా ఇతర మతస్తులకు ఉన్న పేచీలు, ఘర్షణల వల్ల అమెరికాలో సైతం మెజారిటీ వర్గమైన క్రైస్తవుల్లో యూదు వ్యతిరేకత ఇప్పటికీ చెప్పుకోదగిన స్థాయిలోనే ఉంది. అనేక ఐరోపా దేశాల్లో మాదిరిగానే అమెరికాలో కూడా మీడియా, స్టాక్‌మార్కెట్‌ సహా చాలా ప్రధాన వ్యాపారాలు, ఉన్నత విద్యారంగాల్లో మైనారిటీవర్గమైన యూదుల ప్రాబల్యం, ఆధిపత్యం కొనసాగుతోంది. యూదుల భిన్న జీవనశైలి కూడా వారిపై మిగిలిన మతాల ప్రజల్లో అనుమానాలను, హేతుబద్ధంకాని విద్వేషాలను పురికొల్పుతోంది.

అమెరికాలో యూదులు 2.4 శాతమేగాని కాంగ్రెస్‌లో ఎక్కువ సంఖ్యలో పదవులు!

దాదాపు 34 కోట్ల అమెరికా జనాభాలో యూదుల వాటా 2.4 శాతం మాత్రమే. అంటే దేశ జనాభాలో యూదులు 75 లక్షల మంది ఉన్నారు. శతాబ్దాల యూదు వ్యతిరేక కాస్త తగ్గుముఖం పట్టడం ఆరంభమవ్వడంతో అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ, సెనేట్‌కు యూదులు మొదటిసారి 1845లో ఒక్కొక్కరి చొప్పున ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1887లో తొలిసారి ఒక రాష్ట్రానికి (కాలిఫోర్నియా) గవర్నర్‌గా యూదు నేత ఎన్నికయ్యారు. ఆ తర్వాత 20వ శతాబ్దంలో ఫెడరల్‌ (కేంద్ర) ప్రభుత్వంలో మంత్రి పదవుల వరకూ యూదులు సాధించి మెరుగైన ప్రాతినిధ్యం దక్కించుకున్నారు.

1964లో జరిగిన 45వ అధ్యక్ష ఎన్నికల్లో అప్పటి డెమోక్రాటిక్‌ పార్టీ అధ్యక్షుడు లిండన్‌ బీ జాన్సన్‌పై రిపబ్లికన్‌ పార్టీ తరపున బరిలోకి దిగిన బారీ గోల్డ్‌వాటర్‌ అధ్యక్ష పదవికి ప్రధాన పార్టీ అభ్యర్ధిగా అవకాశం పొందిన తొలి యూదు నేతగా చరిత్రకెక్కారు. అయితే, ఈ ఎన్నికల్లో డెమొక్రాట్‌ జాన్సన్‌కు 54 రాష్ట్రాల్లో మెజారిటీతోపాటు పోలైన ఓట్లలో 68% వచ్చాయి. డెమొక్రాటిక్‌ విజేతలకు వచ్చిన అత్యధిక మెజారిటీగా ఇదే నమోదై ఉంది. ఆ తర్వాత తనకు సభ్యత్వం ఉన్న డెమొక్రాటిక్‌ పార్టీ తరఫున కాకుండా 2016 అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన నేత బెర్నీ శాండర్స్‌ కూడా యూదు కుటుంబంలో పుట్టారు.

అంతకు ముందు 2000 సంవత్సరం అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్దులు జార్జి డబ్ల్యూ బుష్‌–డిక్‌ షెనీపై నాటి వైస్‌ప్రెసిడెంట్‌ అల్‌ గోర్‌తో కలిసి పోటీచేసిన డెమొక్రాటిక్‌ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్ధి జోసెఫ్‌ లీబర్‌మన్‌ కూడా యూదు జాతీయుడే. అయితే, ఎనలేని ఆర్థిక, మేధో సంపత్తి ఉన్న ఆధునిక, లిబరల్‌ వర్గమైన యూదులు అమెరికా అత్యున్నత అధికార పీఠం (ప్రెసిడెంట్‌) దక్కించుకోకపోవడం కొన్ని విషయాల్లో ఇంకా మారని అమెరికా సమాజ ంలోని ప్రత్యేక లక్షణాలకు అద్దంపడుతోంది. అమెరికాలో గత కొన్నేళ్ల వరకూ డెమొక్రాటిక్‌ పార్టీ వైపు మొగ్గుచూపిన యూదులు ఈమధ్య రిపబ్లికన్లుగా, స్వతంత్ర ఓటర్లుగా నమోదు చేయించుకుంటున్నారు.

తొలి జెంటిల్మన్‌గా యూదు!

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మూడు నెలలకు ముందు యూదు నేతలకు అత్యున్నత పదవులకు పోటీచేసే అవకాశం, యూదు ఓటర్ల మద్దతు ఎవరికి? అనే అంశాలపై విశేష చర్చ జరుగుతోంది. అధ్యక్ష పదవికి డెమొక్రాటిక్‌ టికెట్‌ ఖాయంగా సంపాదిస్తారని భావిస్తున్న ప్రస్తుత వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హారిస్‌ భర్త, అమెరికా ‘సెకండ్‌ జెంటిల్మన్‌’ డగ్లస్‌ ఎమ్హాఫ్‌ యూదు లాయర్‌. నవంబర్‌ 5న జరిగే అమెరికా 60వ అధ్యక్ష ఎన్నికల్లో ఒకవేళ డెమొక్రాటిక్‌ టికెట్‌ సంపాదించి కమలా హారిస్‌ రిపబ్లికన్‌ అభ్యర్ధి డొనాల్డ్‌ ట్రంప్‌ను ఓడిస్తే కమల భర్త ‘అమెరికా తొలి యూదు ఫస్ట్‌ జెంటిల్మన్‌’గా చరిత్రకెక్కుతారు.

తాజా సమాచారం ప్రకారం కమలా హారిస్‌ డెమొక్రాటిక్‌ పార్టీ అధికార అభ్యర్ధిగా నామినేట్‌ అయ్యాక తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా (రనింగ్‌మేట్‌) ఎంపిక చేస్తారని వెలుగులోకి వచ్చిన ముగ్గురిలో ఒకరు యూదు కాగా, ఇంకొకరు యూదు భార్య ఉన్న నాయకుడు. వారిలో ముందు వరుసలో ఉన్న పెన్సిల్వేనియా గవర్నర్‌ జాష్‌ షాపీరో ఇజ్రాయెల్‌ అనుకూల వైఖరి ప్రదర్శించే యూదు నేత. యూనివర్సిటీల్లో ఇటీవలి ఇజ్రాయెల్‌ వ్యతిరేక ప్రదర్శనలను యూదు వ్యతిరేకత పెంచేవిగా ఈ 51 ఏళ్ల షపీరో వర్ణించారు. రెండో నేత అరిజోనా సెనెటర్‌ మార్క్‌ కెలీ. ఆయన భార్య యూదు. దీంతో దేశంలో యూదు ఓటర్ల సంఖ్య నిండా మూడు శాతం లేకున్నా ఈ ఆధిపత్య వర్గం అర్ధబలం, రాజకీయ, సామాజిక పలుకుబడి అధ్యక్ష ఎన్నికల్లో అవసరమనే స్పృహ రెండు ప్రధాన రాజకీయపక్షాల అభ్యర్ధులకూ ఉందని అర్ధమౌతోంది. అమెరికాలో స్థిరపడిన యూదుల్లో కొత్త తరానికి, పిల్లలకు తమ ‘మాతృదేశం’గా భావించే ఇజ్రాయెల్‌ చరిత్ర గురించి అవగాహన క్రమక్రమంగా తగ్గిపోతోంది.

ఇది వరకు అమెరికా సాధారణ ఎన్నికల్లో యూదులు మిగిలిన వర్గాల ప్రజల మాదిరిగానే ధరలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, శాంతిభద్రతలు వంటి అంశాల ఆధారంగా రెండు పార్టీల్లో ఒక దానికి ఓటేసేవారు. అయితే ఈసారి కిందటి అక్టోబర్‌ 7 హమస్‌ దాడి ఫలితంగా ఇజ్రాయెల్‌ ప్రయోజనాలు, ఉనికి కాపాడే అభ్యర్ధికి ఓటేయాలనే ‘చైతన్యం’ యూదుల్లో వెల్లివిరుస్తోందని అమెరికా మీడియా చెబుతోంది. అదీగాక, హమస్‌ దాడిని సాకుగా చూపించి, గాజా పట్టీ, వెస్ట్‌ బ్యాంక్‌ తదితర పాలస్తీనా అరబ్బులు నివసించే ప్రాంతాలపై ఇజ్రాయెల్‌ రక్షణ దళాలు పైశాచిక దాడులు జరుపుతూ దాదాపు 40 వేలమందిని పొట్టనపెట్టుకున్నాయి. ఫలితంగా, అమెరికాలో ముఖ్యంగా యూనివర్సిటీలు, కాలేజీలు, హైస్కూళ్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో ఇజ్రాయెల్‌పైన, యూదు జాత్యహంకార శక్తులపైనా, ఇజ్రాయెల్‌ సర్కారుకు అనుకూల విధానాలపైనా విద్యార్ధులు, యువకుల నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి.

గాజా ప్రాంత ప్రజలకు కనీసం నీరు కూడా సరఫరా కాకుండా అడ్డుకుంటున్న ఇజ్రాయెలీ సర్కారు పోకడలతో అమెరికా యువతలో ఆగ్రహావేశాలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే, ఇజ్రాయెలీ ప్రభుత్వం గత 9 నెలలుగా అనుసరిస్తున్న అమానుష పోకడలను అమెరికా ప్రజల్లో ఉదారవాదులు తప్పుపడుతుంటే దాన్ని ఒక వర్గం మీడియా, యూదు జాత్యహంకార శక్తులు ‘యూదు వ్యతిరేకత లేదా విద్వేషం’గా ముద్ర వేయడంతో అమెరికా ఎన్నికల్లో యూదుల ఓట్లకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇండియాలో జనసంఖ్య రీత్యా చూస్తే అతి తక్కువ జనాభా ఉన్న జైనులు, జొరాష్ట్రియన్ల మాదిరిగానే అమెరికాలో స్వల్ప మైనారిటీవర్గంగా పరిగణించే యూదులకు వారి జనాభా శాతానికి మించి ఎన్నో రెట్లు ఆర్థిక, రాజకీయ ఆధిపత్యం ఉండడంతో ఇజ్రాయెల్‌–పాలస్తీనా వివాదం ఎప్పుడూ అగ్రరాజ్యంలో చర్చనీయాంశమే.

ఇజ్రాయెల్‌కు యూదులకన్నా అమెరికా ఇవాంజలికల్‌ క్రైస్తవుల మద్దతే ఎక్కువ

ఏడున్నర దశాబ్దాలకు పైగా మండుతున్న ఇజ్రాయెల్‌–పాలస్తీనా సంక్షోభం విషయంలో జాత్యహంకార యూదు ప్రభుత్వాలకు అమెరికాలో నేడు డెబ్బయి ఐదు లక్షల యూదుల కన్నా స్థానిక ఇవాంజలికల్‌ క్రైస్తవుల మద్దతే ఎక్కువ అని అనేక సర్వేలు చెబుతున్నాయి. అమెరికా యూదుల్లో హెన్రీ కిసింజర్‌ వంటి కొందరు ‘అభివృద్ధి నిరోధకశక్తులు’గా ముద్రపడిన మితవాదులు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నాగాని ప్రపంచ ప్రసిద్ధ భాషాశాస్త్రవేత్త, మేధావి నోమ్‌ చోమ్‌స్కీ వంటి లిబరల్‌ మానవతావాదులూ ఉన్నారు. హమస్‌ దాడి తర్వాత అమెరికాలో యూదులపై విద్వేషం పెరిగిపోయిందని ఇటీవలి ‘ప్యూ’ రీసెర్చ్‌ సంస్థ సర్వేలో పాల్గొన్న యూదుల్లో 87% మంది చెప్పగా, విపరీతంగా పెరిగిందని 55% అభిప్రాయపడ్డారు.

‘అవకాశాల స్వర్గం’గా ఎప్పటి నుంచో పేరుగాంచిన అమెరికాకు ఐరోపా యూదుల వలసలు జోరందుకున్న నూరేళ్ల క్రితం అంటే 1920–25 ప్రాంతంలో ఈ ఏకైక అగ్రరాజ్యాన్ని యూదుల వ్యవహారిక భాష యిద్దిష్‌లో ‘గోల్డెన మెదీనా’ (స్వర్ణభూమి) అని యూదులు అభివర్ణించేవారు. కాని, అక్టోబర్‌ 7 హమస్‌ దాడి, తదనంతర పరిణామాలతో దేశంలో పెరుగుతున్న యూదు వ్యతిరేకత (యాంటీ సెమిటిసిజం) దృష్ట్యా ఇతర దేశాలకు వలసపోతే మంచిదేమోనని అమెరికాలోని యూదులు దాదాపు 7 శాతానికి పైగా ఆలోచించారని ఒక సర్వేలో తేలింది. ‘మాతృభూమి’ ఇజ్రాయెల్‌లో కన్నా ఎక్కువ మంది యూదులకు (75 లక్షలు) ఇంకా వివరంగా చెప్పాలంటే– యూదు అపర కుబేరులు, మేధావులు, గొప్ప శాస్త్రవేత్తలు సహా లక్షలాది మంది మధ్యతరగతి యూదులకు ఆశ్రయం కల్పించిన అమెరికాలో రోజురోజుకు పెరిగే యూదుల ప్రాబల్యానికి అధ్యక్ష ఎన్నికలు అద్దంపడుతున్నాయి.


Read More
Next Story