కాళేశ్వరం ఎత్తి పోతల పథకంలో భాగంగా చేపట్టిన మూడు బ్యారేజుల రూపకల్పన, నిర్మాణం, నిర్వహణలో జరిగిన లోపాలను అధ్యయనం చేసి, అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే అన్ని తప్పులకు బాధ్యుడని, అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ర్ రావు, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తమ వంతు తోడ్పాటు అందించారని, జస్టిస్ పి.సి.ఘోష్ కమీషన్ తన నివేదికలో నిర్దారించిందని ప్రాధమిక సమాచారం.
సదరు మూడు బ్యారేజీల నిర్మాణంలో లోపాలున్నాయని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ కూడా నిర్ధారించింది. ఈ మొత్తం ప్రక్రియలో వివిధ స్థాయుల్లో ఉన్న అధికారులను, ఇంజినీర్లను, నిర్మాణ సంస్థలను కూడా తప్పుపట్టినట్లు ప్రచారం అయ్యింది.
అయితే జరిగిన తప్పులను, అక్రమాలను ఆయా సమయాల్లో అధికారంలో ఉన్న కొంత మంది వ్యక్త్తులకు మాత్రమే ఆపాదించి, మొత్తం వ్యవస్థల పాత్రను, వైఫల్యాలని మరుగున పరిచే ప్రయత్నంగా కనిపిస్తుంది. వ్యవస్థలను బాధ్యులను చేస్తే ప్రస్తుతం అధికారంలో ఉన్న వారితో సహా అందరూ జవాబుదారీ అవుతారు. అప్పుడు పాత తప్పులనే చేస్తున్న, ఆ క్రమంలో అవే వ్యవస్థల సహకారం తీసుకుంటున్న ప్రస్తుత అధికారంలోని వ్యక్తుల బండారం బయటపడుతుంది.
పి.సి.ఘోష్ కమీషన్ పరిశీలించిన అంశం కేవలం మూడు బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి మాత్రమే. అది మొత్తం కాళేశ్వరం ప్రాజక్టుకు జరిగిన ఖర్చులో 10 శాతం కూడా లేదు. సదరు ప్రాజక్టులో బాగమైన 15 రిజర్వాయర్లు, 21 పంపు హౌసులు, బాహు బలి మోటర్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1500 కిలోమీటర్లకి పైగా కాలువలు, అదనపు టి.ఎం.సి కోసం అదనంగా చేపట్టిన పనులు, వీటన్నింటి కోసం జరిగిన వేల ఎకరాల భూ సేకరణ, పునరాసం కోసం నిర్మించిన కాలనీలు అన్నీ కలిసి లక్ష కోట్లకు పైగా ఖర్చు అయ్యింది. వాటన్నింటి పై విచారణ జరపాలంటే ఎన్ని ప్రత్యేక కమీషన్లు వేయాలో, ఎన్ని వేల పేజీల నివేదికలు తయారవుతాయో, ఎంత మంది బాధ్యులు తేలతారో లెక్కలేదు.
కాళేశ్వరం ప్రాజక్టులో జరిగిన తప్పులకు బాధ్యత అప్పటి అధికారంలో ఉన్న ప్రభుత్వాధినేతలదే కాదు, ఆ ప్రభుత్వానికి అప్పుడు వంత పాడిన ఇతర వ్యవస్థలది కూడా. అంటే మీడియా, కేంద్ర ప్రభుత్వం, దాని అనుబంధ సంస్థలు, గవర్నర్ వంటి వ్యవస్థలు, సంబంధిత ప్రాంతాల్లోని తహశీల్దార్ స్థాయి నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దాకా అందరూ తమ విధి తప్పిన వారే.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన కొంత మంది మేధావులు, పౌర సమాజం, చివరకు న్యాయ వ్యవస్ధ కూడా. ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న కాళేశ్వరం తరహా అక్రమాలలోనూ ఈ వ్యవస్థల పాత్ర, బాధ్యత ఉంటుంది. సదరు వ్యవస్థల ద్వారా నిరంతరాయంగా, సార్వజనీనంగా, వివిధ రూపాలలో జరిగే దోపిడీని కేవలం కొంత మంది వ్యక్తులు మాత్రమే, కొన్ని సంధర్భాలలో మాత్రమే జరిపే దోపిడీగా చిత్రించటం, ప్రజలు తమ కళ్ల ముందు ప్రస్తుతం జరుగుతున్న దోపిడిని గుర్తించకుండా ఏమార్చే ప్రయత్నమే.
ఇప్పడు కె.సి.ఆర్ ను తప్పు పడుతున్న వ్యవస్థలు, అనగా మీడియా, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మేధావులు, ఇదే కాళేశ్వరం ప్రాజక్టు నిర్మాణాన్ని ఆహా, ఓహో అని, అద్భుతమని కీర్తించిన వారే. కాళేశ్వరం ప్రాజక్టు పై కేసులు వేసిన వారిని అభివృద్ధిని అద్భుత ప్రాజక్టును అడ్డుకుంటారా అని మందలించిన, సమాజం కోసం త్యాగం చేయాలని సూచించిన గౌరవ న్యాయమూర్తులు కూడా ఉన్నారు.
ఇప్పడు నీతి వాక్యాలు వల్లిస్తున్న గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి వారైతే తమ రాఘవ కన్ స్ట్రక్షన్స్ ద్వారా ఆ ప్రాజెక్టులో భాగంగా వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు పొందిన వారే. అందుకో ఏమో కాని కోటి రూపాయల చిరు మొత్తం అధికారికంగా అప్పటి పేద అధినేతకు అప్పుగా కూడా ఇచ్చారు.
ప్రస్తుత ప్రభుత్వం కూడా అక్కున చేర్చుకున్న మేఘా కంపెనీ గురించి అయితే చెప్పనే అవసరం లేదు. కాళేశ్వరం ప్రాజక్టు పనుల్లో సింహ భాగం వారిదే. ఇప్పుడు కూడా రాబోయే ప్రాజక్టులలో వేల కోట్ల కాంట్రాక్టులు కూడా ఆ కంపెనీకే. నిజంగా చిత్త శుద్ది, నిజాయితీ ఉంటే, కాళేశ్వరంలో భాగంగా అప్పటి కె.సి.ఆర్ ప్రభుత్వం అక్రమంగా 40 వేల కోట్ల అంచనాతో చేపట్టిన అదనపు టి.ఎం.సి పనులను ఇప్పటికీ ఎందుకు కొనసాగిస్తున్నారు, గత సంవత్సరం కాలంలో రెండు వేల కోట్ల రూపాయలకు పైగా ఎందుకు విడుదల చేశారు. సదరు ప్రాజక్టు అక్రమమని హై కోర్టు, సుప్రీం కోర్టులలో కేసులు వేసిన తమ సొంత పార్టీ నేతతో ఆ కేసును ఎందుకు ఉపసంహరించారో, అందుకోసం సీనియర్ న్యాయవాదులకు ఎన్ని లక్షల ఫీజు చెల్లించారో, ప్రస్తుత గౌరవ నీటి పారుదల శాఖ మంత్రి ప్రజలకు జవాబు చెప్పగలరా ?
గత ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు చెల్లించగలిగిన ప్రభుత్వం, మల్లన్నసాగర్లో నిర్వాసితులైన వ్రుద్ద వితంతువులకు గత ప్రభుత్వం ఎగ్గొట్టిన 18 కోట్ల రూపాయల పునరావాసం డబ్బులను, కోర్టు ఆదేశాలు ఉన్నా ఎందుకు చెల్లించలేకపోతున్నారో, ప్రజా ప్రభుత్వ ఆర్ధిక మంత్రిగారు సెలవివ్వాలి.
కే.సి.ఆర్ గారెకి కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో, రేవంత్ రెడ్డి గారికి ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ ఫ్రంట్, లగచర్ల అంతే. అది ఎంత ఏక పక్ష నిర్ణయమో, ఇదీ అంతే. ముందస్తు పాలనా అనుమతి, కేబినెట్ తీర్మానం లేకుండానే ఫ్యూచర్ సిటీ ప్రక్రియలు ప్రారంభించారు. భూ సేకరణ ప్రక్రియ పూర్తి కాకుండానే టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టిందీ ప్రభుత్వం. కోర్టులో ఫార్మా సిటీ అంటారు, బయట ఫ్యూచర్ సిటీ అంటారు. నిజాన్ని నిర్బయంగా చెప్పలేని దౌర్భాగ్యం. కాళేశ్వరం, ఇతర ప్రాజక్టుల భూ సేకరణకు గత ప్రభుత్వం ఎటువంటి అరాచక, బలవంతపు ప్రక్రియలు పాటించిందో, ఇప్పటి ప్రభుత్వం కూడా లగచర్ల, ఫ్యూచర్ సిటీ, గ్రీన ఫీల్డు రేడియల్ రోడ్డు తదితర ప్రాజక్టులకు అదే పంథా అనుసరిస్తుంది. అప్పుడు వ్యతిరేకించిన టి.ఆర్.ఎస్ ప్రభుత్వ భూ సేకరణ చట్ట సవరణను ఇప్పుడు యధాతధంగా ఉపయోగించి వేల ఎకరాల భూ సేకరణ చేపట్టింది. అప్పుడు భూములు కోల్పోయిన ప్రతి కుటుంబానికి పునరావాసం కల్పించాలని పోరాటం చేసి, ఇప్పుడు మాత్రం ఇళ్లు కోల్పోతేనే పునరావాసం అంటూ పాత ప్రభుత్వ పాటనే పాడుతుంది. ఇంకా ముందుకు వెళ్లి గత ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం చేపట్టిన భూ సేకరణ ప్రక్రియ అంతా సక్రమమే అని, గౌరవ ఉన్నత న్యాయస్థానంలో ఏక సభ్య ధర్మాసనం తీర్పు పై అప్పీలు కూడా దాఖలు చేసి, గత ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది.
కెసిఆర్ గారు తనకు సాగునీటి పైన అపార పరిజ్ఞానం ఉందని నమ్మి ఏ విధంగా అయితే కాళేశ్వరం కట్టారో, రేవంత్ రెడ్డి గారు కూడా రియల్ ఎస్టేట్ రంగంలో తనకు ఉన్న అపార అనుభవంతో కొత్త నగరాలు, ప్రాజక్టులు, మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో, మొత్తం పాలనను స్థిరాస్థి వ్యాపారంగా మార్చేశారు. దీనికి మళ్లీ ప్రజా పాలననే ముసుగులు తగిలించడు. అధికారం సాధించడం ద్వారా రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రాజక్టు చేపట్టాలో నిర్ణయించే అధికారం, వాటి పేరు మీద పెద్ద ఎత్తున ప్రభుత్వ నిధులను ఖర్చు చేసే వెసులుబాటు, తద్వారా వందల ఎకరాలు భూమి సంపాదించే అవకాశం, వాటి విలువలను పెంచుకుని వేల కోట్ల ఆస్తులను సమకూర్చుకోవడం కోసమే ప్రస్తుత పాలక పార్టీల పోరాటం, ముఖ్యమంత్రి పదవి కోసం నాయకుల ఆరాటం. రాష్ట్రంలోని యువతకు విద్య, నైపుణ్యం కల్పించడమే తన ప్రాధాన్యమని చెబుతున్న ముఖ్యమంత్రిగారు బతుకుతెరువును, భరోసాను ఇచ్చే భూమిని కూడా ప్రతి కుటుంబానికి ఉండే విధంగా చర్యలు తీసుకుంటానని మాత్రం చెప్పరు. పోనీ ఇప్పటికే విద్య, నైపుణ్యం, ఉద్యోగం కలిగి తద్వారా లక్షల, కోట్ల రూపాయల ఆదాయం ఉన్న వారికి, ఎకరాల కొద్దీ వ్యవసాయ భూములు ఎందుకుండాలని ప్రశ్నించరు. ఎందుకంటే ఆ ప్రశ్న వస్తే ముందుగా భూములు వదులుకోవాల్సింది వారే.
అప్పుడు కాళేశ్వరం ప్రాజక్టు, దాని కోసం భూసేకరణను వ్యతిరేకించినవారిని, కోర్టుల్లో కేసులు వేసిన వారిని కె.సి.ఆర్ గారు రాక్షసులుగా పేర్కొని, వారికి బుద్ది చెప్పటానికే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నానని చెప్పారు. ఇప్పడు రేవంత్ రెడ్డి గారు కూడా అవే మాటలు మాట్లాడుతున్నారు. ఫ్యూచర్ సిటీని అడ్డుకునేవారికి ప్రజలే బుద్ది చెప్పాలని పిలుపునుస్తున్నారు. మళ్లీ ప్రభుత్వం మారితే, ఈ ప్రాజక్టుల పై కూడా విచారణలు, కమీషన్లు, కేసులు మొదలవుతాయి. అయితే వాటి ద్వారా ఎవ్వరికీ శిక్షలూ పడవు, ప్రజలు కోల్పోయిన భూములు, బతుకులు తిరిగీ రావు. తద్వారా ఆయా కాలాల్లో అధికారంలో ఉండే నాయకులు, ఎప్పటికీ ఉండే అదే అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల ముసుగులో ఉండే బడా వ్యాపార, రియల్ ఎస్టేట్ సంస్థల అధిపతులు అంతులేని సంపదను, వనరులను పోగేసుకోవటమే జరుగుతుంది. ప్రజలు ఈ నాయకులనే మార్చి మార్చి ఎన్నుకున్నంత కాలం ఇదే నాటకం మళ్లీ మళ్లీ పునరావ్రుతమవుతుంది.
(*రవి కుమార్, న్యాయవాది, హైదరాబాద్)