రామాయణంలో కనిపించని కథ
x

రామాయణంలో కనిపించని కథ

రామాయణ కథానిర్మాణం సాగిన తీరు మీద ప్రముఖ సాహిత్య విమర్శకుడు కల్లూరి భాస్కరం అందిస్తున్న పరిశోధనాత్మక వ్యాస పరంపర వచ్చే వారం నుంచి ప్రారంభం. ఈ రోజు ఈ ప్రయత్నానికి ఉపోద్ఘాతం.



ఈ వ్యాసపరంపర ఎందుకు?

వాల్మీకి రామాయణం ఏడు కాండలుగా, మళ్ళీ ఒక్కొక్క కాండ అనేక సర్గలుగా 24వేల శ్లోకాలతో ఉంటుంది. ఆ కాండలు ఇవీ: బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. ఉత్తరకాండ వాల్మీకి చెప్పినదని కాదన్న వివాదమూ ఉంది. దానిని అలా ఉంచుదాం. ఇలాంటి రామాయణం వేల సంవత్సరాలుగా కాకపోయినా, వందల సంవత్సరాలుగా పఠన, పాఠనాలలో ఉంది. పండితుల వ్యాఖ్యానాలు, భాష్యాలు, ప్రవచనాల ద్వారానే కాక; వివిధకళారూపాలలో కూడా వ్యాప్తిలో ఉంది.

వాల్మీకి రామాయణమే కాక ఇంకా మరెన్నో రామాయణాలు భిన్నకథనాలతో ప్రచారంలో ఉన్నాయి. ఎ. కె. రామానుజన్ అనే ఆయన 300 రామాయణాలను గుర్తించి వాటిపై ఒక సుదీర్ఘ వ్యాసం రాశారు. ములుకుట్ల నరసింహావధాని అనే ఆయన తన ‘శ్రీ రామాయణ సారోద్ధారము’ అనే 9 సంపుటాల గ్రంథంలో 200 ఆర్షరామాయణాలు ఉన్నట్టు చెప్పి వాటిలో 24 రామాయణాలను ఉదహరిస్తున్నానన్నారు. రామాయణం గురించిన ఈ భిన్నపాఠాల చర్చలోకి ఇప్పుడు వెళ్లద్దు.

ఇంతటి రామాయణాన్ని మూడు మాటల్లో చెప్పడం గురించిన ఒక నానుడి ప్రచారంలో ఉంది. అది, ‘కట్టె-కొట్టె-తెచ్చే’ అనేది. ‘రాముడు వారధి కట్టాడు, రావణుని కొట్టాడు, సీతను తెచ్చుకున్నాడు’ అని చెప్పి ఈ మాటలను ఒకింత విస్తరించుకోవచ్చు. లేదా ‘రాముడు సీతకు తాళి కట్టాడు; ఆమెను అపహరించుకుని వెళ్ళిన రావణుని కొట్టి సీతను తెచ్చుకున్నాడు’ అని కూడా చెప్పుకోవచ్చు.

రామాయణకథ నిజంగా జరిగిందా, లేక కల్పనా అన్న సందేహాన్ని వ్యక్తం చేసేవారు కూడా ఉన్నారు. ‘కట్టె-కొట్టె-తెచ్చే’ అనేది ఒకవిధంగా వారికి సమాధానం. ఎలాగంటే, రాముడనే వ్యక్తి భార్య సీతను రావణుడనేవాడు ఎత్తుకుపోవడం, రాముడు అతన్ని చంపి భార్యను తిరిగి తెచ్చుకోవడంలో జరగలేనిదీ, జరగకూడనిదీ ఏమీలేదు. అది మనం మామూలుగా అర్థం చేసుకోగలిగిన విషయమే తప్ప ఏవో అతీంద్రియశక్తులకు, మంత్రాలకు, మాయలకు సంబంధించినది కాదు. రేఖామాత్రంగా అలాంటి ఘటన ఒకటి జరిగే ఉండచ్చు. ఆ ఘటన ఆధారంగా వేల శ్లోకాల రామాయణం నిర్మాణం అయిందనుకోవడమే- జరిగిందా, జరగలేదా అన్న చర్చకు అర్థవంతమైన ఒక సమాధానం.

రాముడు-సీత-రావణుడు అనే పేర్లను పక్కన ఉంచి, ఒక వ్యక్తి భార్యను ఇంకొకడు ఎత్తుకుపోవడం, ఆ వ్యక్తి అతణ్ణి చంపి భార్యను తిరిగి తెచ్చుకోవడం ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగిందనేవి కూడా అంతే అర్థవంతమైన ప్రశ్నలు. ఒక ‘సాధారణఘటన’గా అది మనదేశంలోనే కాక, ఎక్కడైనా జరగడానికి అవకాశముంది. దీనిపై రాంభట్ల కృష్ణమూర్తి గారి ‘జనకథ’ అనే రచనలో ఒక సమాధానం దొరుకుతుంది. అది ఎంతవరకు విశ్వసనీయమన్నది అలా ఉంచి, దాని గురించి చెప్పుకుందాం:

క్రీస్తుపూర్వం మూడవ సహస్రాబ్ది చివరిలో ఉత్తరసిరియాలో ‘ఉగారిత్’ అనే రేవుపట్టణం ఉండేది. అది తూర్పు, పశ్చిమదేశాల వర్తకులకు కూడలి. ఈజిప్టు, మైసీనియా గ్రీసు, సైప్రస్, క్రీట్, భారతదేశాలకు; మరికొన్ని ఆసియాదేశాలకు చెందిన వర్తకులు అక్కడ కలసుకుంటూ ఉండేవారు. సరకు తీసుకుని దూరప్రాంతాలనుంచి వచ్చేవారు కనుక క్రయవిక్రయాలు పూర్తయ్యేవరకు నెలల తరబడి వారు అక్కడే ఉండిపోయేవారు. అప్పుడు వారు తాము తెచ్చిన సరకుని ఇతర ప్రాంతాలవారికి అమ్మి వారి సరకును కొనుక్కోవడం వంటి అసలు పనితోపాటు మరికొన్ని కూడా జరగడం సహజమే... ఒకరి భాషను ఒకరు అర్థం చేసుకోవడం, తద్వారా మాటల్లో ముచ్చట్లలో పడడం, ఒకరి సంస్కృతి, సాహిత్యం, ఆచారవ్యవహారాలు, ఖగోళశాస్త్రం వంటి శాస్త్రసంబంధమైన విషయాలు ఇంకొకరితో పంచుకోవడం లాంటివన్నమాట.

అలా పరస్పరం తెలుసుకున్నవాటిలో ‘కృత’ అనే కావ్యంలోని కథ ఒకటి. రాంభట్ల రాసిన ప్రకారం, ఆ కావ్యం పూర్తిగా దొరకలేదు, దొరికిన మేరకు పూర్తిగా అర్థం కాలేదు. అర్థమైన మేరకు ఆ కథ ఇదీ: ఒకరాజు భార్యను మరో రాజు ఎత్తుకుపోయాడు. బాధితుడైన రాజు మిత్రబలగాలను కూడగట్టుకుని తన భార్యను అపహరించిన రాజు నగరాన్ని ముట్టడించాడు! పరిశోధకులు ఈ కావ్యానికి పెట్టిన పేరును బట్టి (కృత)చూస్తే, అది క్రీటుదీవినుంచి వచ్చి ఉండవచ్చునని రాంభట్ల గారి ఊహ. క్రీటు గ్రీస్ లో ఉన్న అతి పెద్ద దీవుల్లో ఒకటి. అప్పట్లో క్రీటుదీవుల్లో వ్యవహారంలో ఉన్నది ఒక ఆర్యభాషే కనుక ‘కృత’ సంస్కృతంలోని కృత శబ్దాన్ని ధ్వనిస్తూ ఉండవచ్చు.

పై కథే ఉగారిత్ మీదుగా గ్రీసు దేశానికి, మన దేశానికీ కూడా చేరింది. దీని ఆధారంగా గ్రీకుల మహాకావ్యమూ, హోమర్ కృతమూ అయిన ‘ఇలియడ్’ వచ్చింది. మన దగ్గర వాల్మీకి కృతమైన రామాయణం వచ్చింది. రెండింటిలోనూ మూలకథ దాదాపు ఒక్కలానే ఉంటుంది. రామాయణంలో రాముడి భార్య సీతను రావణుడు అపహరించినట్టే; ఇలియడ్ లో మైసీనియా గ్రీకుల రాజైన అగమెమ్నన్ తమ్ముడు మెనలాస్ భార్య హెలెన్ ను ట్రాయ్ రాకుమారుడు పారిస్ అపహరిస్తాడు. అప్పుడు అగమెమ్నన్ సైన్యంతో వెళ్ళి ట్రాయ్ ని ముట్టడిస్తాడు. అదే ట్రోజన్ యుద్ధంగా ప్రసిద్ధి చెందింది. హెలెన్ తిరిగి భర్తను చేరుకుందా లేదా అన్న విషయంలో రెండు రకాల కథనాలు ఉన్నాయి. హోమర్ కథనం ప్రకారం భర్తను చేరుకోగా, ఇంకొక కథనం ప్రకారం దేవతల నివాసమైన ఒలింపస్ పర్వతానికి చేరుకుంది. సీత విషయంలో కూడా ఇలాంటి రెండు కథనాలు ఉండడం ఆసక్తికరం. ఉత్తరకాండ ప్రకారం గర్భవతి అయిన రాముడు తనను అడవుల్లో విడిచిపెట్టాక, లవకుశుల్ని కన్న తర్వాత సీత కొంతకాలానికి తల్లి అయిన భూదేవిని చేరుకుంటుంది.

సరే, ఈ రెండు కథల మధ్య ఉన్న పోలికల చర్చలోకి తగిన సందర్భం వచ్చినప్పుడు మరింత లోతుగా వెళ్లవచ్చు కనుక ప్రస్తుతానికి ఇక్కడితో ఆపుదాం.

రామాయణానికి మరో రెండు పేర్లు కూడా ఉన్న సంగతి మనలో చాలామందికి తెలియకపోవచ్చు. అవి, ‘సీతాచరితం’, ‘పౌలస్త్యవధ’ అనేవి. పౌలస్త్యుడంటే పులస్త్యబ్రహ్మ కుమారుడైన రావణుడు. అతని వధ గురించి చెప్పే కావ్యం కనుక ఆ పేరు. వాల్మీకి చెప్పిన ఈ శ్లోకమే చూడండి, అందులో రామాయణానికి గల మూడు పేర్లే కాక, దానికీ, ఇలియడ్ కీ కూడా మూలకథను అందించిన ‘కృత’ పేరు కూడా సూచనప్రాయంగా కనిపిస్తుంది:

కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్

పౌలస్త్యవధ మిత్యేతి చకార చరిత్రవ్రతః

‘కృత్స్నం’ అంటే ‘మొత్తమంతా’ అని అర్థం. ఈ మాట ‘కృత’ అనే కావ్యాన్ని స్ఫురింపజేస్తుందన్న రాంభట్ల, వాల్మీకి ఈ కృతిని చెప్పిన కాలానికి రామకథ, సీతాచరితం, పౌలస్త్యవధ అన్న మూడు కావ్యాలూ ఉండి ఉండాలన్న ఊహ చేస్తారు. లేదా రామాయణానికి గల మిగతా రెండుపేర్లూ కూడా ప్రచారంలో ఉండి ఉండాలని కూడా ఊహించవచ్చు.

ఇప్పుడిదంతా ఎందుకు తడమాల్సివచ్చిదంటే; దేవతలు, అవతారాలు, దైవాంశసంభూతులు, అయోనిజులు, నరులు, వానరులు, రాక్షసులు, మంత్రాలు, మహిమలు, మునులు, తపస్సులు, సముద్రాన్ని లంఘించడం, దివ్యాస్త్రాలు వగైరా అనేక ఇంద్రియ, అతీంద్రియ అంశాలతో పెనవేసుకుని ఒక బృహద్రచనగా అభివృద్ధి చెందిన రామాయణంలో, మనందరికీ మామూలుగా అర్థమయ్యే బీజప్రాయమైన మూలకథను గుర్తించడం కోసం. మొదటే చెప్పినట్టు, మూలకథకు వెడితే అది జరిగిందా, లేదా అన్న చర్చకు ప్రాధాన్యం లేదు. అది జరగడానికి అసంభవమైనదీ కాదు.

ఏతావతా అసలు సంగతేమిటంటే, సాధారణలోక జ్ఞానంతో అర్థం చేసుకోగల మేరకు రామాయణకథానిర్మాణం ఎలా జరిగిందో పరిశీలించడం; వ్యాఖ్యాతలూ, ప్రవచనాకారులూ గుర్తించని, గుర్తించినా చర్చలోకి తీసుకురాని కొన్నితప్పిపోయిన అంశాలను పైకి తేవడం; అవి రామాయణానికి సామాజికవ్యవస్థాపరంగా ఎలాంటి భిన్నప్రాతిపదికను కల్పించగలవో సూచించడం; రామాయణ పాత్రల స్వభావాలతో సహా ప్రచారంలో ఉన్నవాటికీ, వాస్తవంగా రామాయణంలో ఉన్నవాటికీ అంతరాన్ని ఎత్తిచూపడం స్థూలంగా ఈ వ్యాసపరంపర ఉద్దేశం.

మరింత స్పష్టంగా చెబుతున్నదీ, పాఠకులు గుర్తించవలసిందీ ఇదీ! రామాయణంతో అల్లుకున్న భక్తివిశ్వాసాలతో కానీ, వాటితో ముడిపడిన మనోభావాలతో కానీ ఈ పరిశీలనకు ఎలాంటి సంబంధమూ లేదు. ఇది కేవలం ఒక కథగా మాత్రమే రామాయణం గురించి చర్చించేదీ, రామాయణకథానిర్మాణాన్ని విశ్లేషించేది మాత్రమే.


Read More
Next Story