పారిశ్రామిక ప్రమాదాలు, కాలుష్యం మధ్య  ప్రజలు ఉక్కిరి బిక్కిరి
x

పారిశ్రామిక ప్రమాదాలు, కాలుష్యం మధ్య ప్రజలు ఉక్కిరి బిక్కిరి

ప్రజల జీవితాలను దుర్భరం చేస్తున్న ఫార్మా,రసాయన కంపెనీలు..

ప్రజలకు మందులు చవక ధరలకు అందించడానికి IDPL లాంటి ప్రభుత్వ రంగ ఫార్మా కంపనీలు ఒకప్పుడు ఉండేవి. అవి ప్రజల ఆరోగ్యానికి బాధ్యత పడేవి. నూతన ఆర్ధిక, పారిశ్రామిక విధానాల పేరుతో 1991 నుండీ ప్రభుత్వాలు అనుసరించిన సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాల ఫలితంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలను మూత వేయించి, బడా ప్రైవేట్ పారిశ్రామిక వేత్తల ఆధ్వర్యంలో వేల కోట్ల లాభాలు గడించే పరిశ్రమలు వందల సంఖ్యలో ఏర్పడ్డాయి.

ఈ యజమానులకు లాభాల మీద యావ తప్ప, ప్రజల పట్ల ఏ బాధ్యతా లేదు. ఆయా పరిశ్రమలలో భారీ ప్రమాదాలు,పేలుళ్లు జరుగుతున్నాయి. వీటిలో అనేక మంది మరణిస్తున్నారు. తీవ్రంగా గాయపడుతున్నారు.

ఈ పరిశ్రమల చుట్టూ ఉన్న ప్రాంతాలు పరిశ్రమలు వదులుతున్న వ్యర్ధాల కాలుష్యంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఈ కాలుష్యం కారణంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ప్రజలలో క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, గుండె జబ్బులు, ఊపిరి తిత్తుల సమస్యలు, జుట్టు రాలి పోవడం, ఇతర అనేక రకాల అనారోగ్యాలు పెరుగుతున్నాయి. చర్మ వ్యాధులు పెరుగుతున్నాయి. పరిశ్రమల చుట్టూ ఉన్న నీటి వనరులు దెబ్బ తింటున్నాయి.

కాలుష్యంతో దుర్భరంగా మారుతున్న ప్రజల జీవితాలు :

ఆయా పారిశ్రామిక ప్రాంతాల గాలి నాణ్యత బాగా దెబ్బ తింటున్నది. ఆయా కంపనీల నుండీ వెలువడే చెడు వాసన భరించలేక ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. మధ్యతరగతి, ధనిక కుటుంబాలు ఆ ప్రాంతాలను వదిలి వెళ్లిపోతున్న పరిస్థితి పెరుగుతున్నది. ఆయా కుటుంబాలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాంతాలలో కొనుగోలు చేసిన ప్లాట్ లు, , బ్యాంకుల నుండీ రుణాలు తీసుకుని స్వయంగా కట్టుకున్న ఇళ్ల ధరలు కూడా పడి పోతున్నాయి. రైతులు, వ్యవసాయ కూలీలు, ఇతర పేద కుటుంబాలు ఎటూ పోలేక అక్కడే ఉండి అనారోగ్యాలకు గురవుతున్నారు. ఆయా కంపనీలలో పని చేసే కార్మికులు, ఉద్యోగులు కూడా ఆ ప్రాంతంలో ఉండలేక, దూర ప్రాంతాల నుండీ బస్సులలో వచ్చి, తిరిగి వెళ్లి పోతున్నారు.

కాలుష్యం నిండిన వ్యర్ధాలతో వ్యవసాయ భూములు దెబ్బ తింటున్నాయి. వాటి సారం పడి పోతూ సాగు యోగ్యం కాకుండా పోతున్నాయి. ఆయా సాగు భూముల విలువలు కూడా పడి పోతున్నాయి. ఆయా భూములలో పండుతున్న పంటలు, పాలు, మాంసం లాంటి పశువుల ఉత్పత్తులు విషపూరితంగా తయారవుతున్నాయి. వాటిని కొని వినియోగిస్తున్న వినియోగదారుల ఆరోగ్యాలపై ఇప్పటి వరకూ ఎలాంటి అధ్యయనం లేదు.

ప్రజల ఆందోళనలు, వార్తా పత్రికల కథనాల కారణంగా , ఇటీవల దోమడుగు గ్రామంలో చెరువు నీటిని తీసుకు వెళ్ళి పరీక్షించిన కాలుష్య నియంత్రణ మండలి, గ్రామ ప్రజలకు వెంటనే నివేదిక ఇవ్వలేదు. నెల రోజులు గడిచాక, ప్రజల ఒత్తిడితో నివేదిక ఇచ్చింది. గత అనేక సంవత్సరాలుగా ఆ ప్రాంత నీళ్ళు పరిశ్రమల కాలుష్యంతో నిండి ఉన్నాయని, వాటిని పశువుల పోషణకు, వ్యవసాయానికి ఉపయోగించ కూడదని, ఇప్పుడు తీరికగా నివేదిక ఇచ్చింది. కానీ, ఆ నివేదిక ఆధారంగా పరిశ్రమ యాజమానిపై, హెటిరో పరిశ్రమపై ఎలాంటి చర్యా ఇప్పటి వరకూ తీసుకోలేదు.

విచిత్రం ఏమంటే, ఆయా ప్రాంతాలలో వస్తున్న ఈ ఫార్మా, రసాయన పరిశ్రమలలో యాజమాన్యాలు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. దూర రాష్ట్రాల నుండీ వలస వచ్చిన కార్మికులతో రోజూ 12 గంటలు పని చేయించుకుంటూ వాళ్ళను దోచు కుంటున్నాయి. బాగా చదువుకున్న స్థానిక యువతీ, యువకులు, మహిళలు కూడా తగిన ఉద్యోగాలు దొరకక ఖాళీగా ఉంటున్న పరిస్థితి కనపడుతున్నది.

నెల రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం లో దోమడుగు గ్రామ చెరువును కాలుష్య మయం చేసిన హెటిరో పరిశ్రమ దుర్మార్గంపై, అక్టోబర్ 19 న సైంటిస్ట్స్,ఫర్ పీపుల్, TPJAC, NAPM,HRF, మహిళా, ట్రాన్స్ జండర్ సంఘాల JAC ఆధ్వర్యంలో దోమడుగు గ్రామ ప్రజలతో జరిగిన సమావేశంలో పై విషయాలన్నీ బయటకు వచ్చాయి. వాళ్ళ దుఖం వర్ణనాతీతం. ఆ పరిశ్రమను, ఆ ప్రాంతంలో ఉన్న, ఇతర కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను శాశ్వతంగా మూసి వేయాలనే వారి డిమాండ్ న్యాయమైనది.

పరిశ్రమలలో పెరుగుతున్న ప్రమాదాలు :

గత 30 ఏళ్లలో తెలంగాణలో ఎవరైనా ఒక పారిశ్రామికవేత్త ఫార్మా , రసాయన కంపనీ పెడితే అది రాష్ట్ర అభివృద్ధి కోసమో, ప్రజలకు సేవ చేయడం కోసమో , ప్రజలకు అవసరమైన ఫార్మా ఉత్పత్తులు, వైద్య సేవలు,ఇతర ఉత్పత్తులు తక్కువ ధరలకు అందించడానికో పెట్టారని మాత్రం భ్రమలో ఉండకండి.

వివిధ వార్తా పత్రికల కథనాలు, నివేదికల ప్రకారం, తెలంగాణలో పారిశ్రామిక ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నది. ఈ ప్రమాదాలు ప్రధానంగా ఫార్మాస్యూటికల్ , రసాయన పరిశ్రమల రంగాలలో అత్యధికంగా ఉంది. గత పదేళ్లలో (2015-2025) రాష్ట్రంలో జరిగిన వివిధ పారిశ్రామిక ప్రమాదాల్లో కనీసం 300 మందికి పైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు అంచనాలున్నాయి. ఈ మృతుల్లో ఎక్కువ మంది భారత దేశ ఉత్తర, తూర్పు రాష్ట్రాల నుండి వలస వచ్చిన కూలీలే ఉన్నారు.

ఒక నివేదిక ప్రకారం, గత రెండు సంవత్సరాలలో ( 2023-2025) హైదరాబాద్ శివార్లలోని ఆరు ప్రధాన పారిశ్రామిక ప్రాంతాల్లో జరిగిన 125 ప్రమాదాల్లో 133 మంది మరణించగా, 350 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవల కాలంలో, అనేక భారీ ప్రమాదాలు జరిగాయి, ఇవి పారిశ్రామిక భద్రత లోపాలను ఎత్తి చూపాయి.

సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో ఉన్న సిగాచి ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌లో జూన్ 30 న రియాక్టర్ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 54 కి చేరుకుంది. 30 మందికి పైగా ఈ ఘటనలో గాయపడ్డారు. ఈ ఘటన దేశ చరిత్రలోనే అత్యంత విషాద కరమైన పారిశ్రామిక ప్రమాదాలలో ఒకటి.

ఈ పారిశ్రామిక ప్రమాదాలు, మరణాలపై రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ, ఫ్యాక్టరీల డైరెక్టరేట్ నుండి సంవత్సరాలవారీగా పూర్తి అధికారిక గణాంకాలు సాధారణంగా ప్రభుత్వ వెబ్‌సైట్‌ లలో అందుబాటులో ఉండవు. అయితే, కార్మిక బ్యూరో (భారత ప్రభుత్వం) వంటి జాతీయ స్థాయి సంస్థలు ఫ్యాక్టరీలలో జరిగిన ప్రమాదాలపై నివేదికలను ప్రచురిస్తాయి. కానీ వాటిలో తెలంగాణ కు చెందిన పూర్తి వివరాలు ఉండడం లేదు.

కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రజల ఆందోళనలు:

తెలంగాణ రాష్ట్రంలో గత నలభై ఏళ్లుగా, ముఖ్యంగా గత పదేళ్ల లో కూడా పరిశ్రమల కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతం పటాన్‌చెరు (సంగారెడ్డి జిల్లా) పారిశ్రామిక కాలుష్యానికి (ముఖ్యంగా ఫార్మా, కెమికల్ పరిశ్రమలు) వ్యతిరేకంగా సాగిన ఆందోళనల గురించి మనం వింటూనే ఉన్నాం. చాలా సంవత్సరాలుగా ఇక్కడ గాలి, నీరు, నేల కాలుష్యంపై స్థానిక ప్రజలు, పర్యావరణ సంస్థలు నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. కాలుష్యం వల్ల ఆరోగ్య సమస్యలు, భూగర్భ జలాలు కలుషితం కావడం ఈ ఆందోళనలకు ప్రధాన కారణం. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కొత్త పరిశ్రమల ఏర్పాటు, ఉన్నవాటి విస్తరణపై నిషేధం విధించడం వల్ల, ఈ పరిశ్రమలు కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి.

బాచుపల్లి, నిజాంపేట్, ప్రగతి నగర్ ప్రాంతాల నివాసితులు పారిశ్రామిక కాలుష్యం (ముఖ్యంగా రసాయన వాసన, విష వాయువుల విడుదల)పై తీవ్రంగా ఆందోళనలు నిర్వహించారు. 2025 మార్చిలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. ఐ.డి.ఎ. బొల్లారం, కాజీపల్లి, బొంతపల్లి, జిన్నారం వంటి సమీప పారిశ్రామిక ప్రాంతాల నుండి వచ్చే విష వాయువుల వల్ల కళ్ళు మండడం, శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయని వారు విమర్శిస్తున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ప్రాంతం కొత్త పటాన్‌చెరులా మారుతోందని, ఇక్కడ ఫార్మా, బల్క్ డ్రగ్ పరిశ్రమల వ్యర్థాల వల్ల భూగర్భ జలాలు విషతుల్యమవుతున్నాయని, ఘాటైన వాసన వస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చౌటుప్పల్‌తో పాటు దండు మల్కాపురం, కొయ్యల గూడెం, ధర్మాజీ గూడెం వంటి పరిసర గ్రామాల్లో పరిశ్రమల వ్యర్థాల పారబోతపై నిరసనలు జరిగాయి. కాలుష్య నియంత్రణ మండలికి అక్కడి ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు.

నల్గొండ జిల్లా దొండపాడు/వజినేపల్లి, మేళ్లచెరువు ప్రాంత గ్రామాల్లో ప్రతిపాదిత బల్క్ డ్రగ్ యూనిట్లు/ కెమికల్ పరిశ్రమల ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజలు బహిరంగ విచారణల్లో (పబ్లిక్ హియరింగ్స్), ఇతర రూపాల్లో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ పరిశ్రమల వల్ల తాగునీరు కలుషితమై ప్రజల ఆరోగ్యం (క్యాన్సర్, టీబీ వంటివి), వ్యవసాయ భూములకు ముప్పు ఏర్పడుతుందని ప్రజలు ఆందోళన చేస్తున్నారు.

సంగారెడ్డి జిల్లా దోమడుగు హెటిరో పరిశ్రమ కాలుష్యానికి వ్యతిరేకంగా దోమడుగు గ్రామ ప్రజలు పోరాటం చేస్తున్నారు. తమ గ్రామ నల్లకుంట చెరువు కాలుష్య జలాలతో కలుషితం కావడంపై రైతులు, గ్రామస్థులు ఇటీవల నిరసనలు, అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా లో పారిశ్రామిక కాలుష్యం ఎక్కువగా ఉన్న హాట్‌ స్పాట్‌లలో రామగుండం ఒకటి. ఇక్కడ పరిశ్రమలు, థర్మల్ ప్లాంట్లు, ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల వల్ల కాలుష్యం పెరుగుతోంది. దీనిపై కూడా స్థానిక ఆందోళనలు ఉన్నాయి.

రంగారెడ్డి జిల్లాలో యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాల పరిధిలో ఫార్మా సిటీ పేరుతో గత BRS ప్రభుత్వం సుమారు 15,000 ఎకరాల వరకూ వ్యవసాయ భూమిని సేకరించింది. ఈ ఫార్మా సిటీ ఏర్పాటు వల్ల భూమి, నీరు, గాలి కలుషితమవుతాయని, ఇది ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని స్థానిక ప్రజలు, పర్యావరణ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. హైదరాబాద్‌ చుట్టూ పటాన్‌చెరు, జీడిమెట్ల వంటి ప్రాంతాలలో ఇప్పటికే ఫార్మా కంపెనీల వల్ల జరిగిన కాలుష్య అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ జిల్లా ప్రజలు ఫార్మా సిటీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. స్థానిక ప్రజలు, 'ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ నాయకత్వంలో ఆందోళన చేస్తున్న రైతులు హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఫార్మా సిటీ కోసం ఇప్పటికే సేకరించిన భూములను తిరిగి రైతులకు అప్పగించాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టును రద్దు చేసి, రైతులకు న్యాయం చేయాలని కూడా కోరుతున్నారు.

రాష్ట్ర వ్యాపితంగా ఈ పరిశ్రమలకు వ్యతిరేకంగా ప్రధానంగా స్థానిక ప్రజల ఆందోళనలు, శాంతియుత నిరసన ర్యాలీలు, పబ్లిక్ హియరింగ్‌లలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి (PCB) అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అనేకమంది పర్యావరణవేత్తలు, సైంటిస్ట్స్ ఫర్ పీపుల్ , NAPM, TPJAC, మానవ హక్కుల వేదిక వంటి సంస్థలు కూడా ప్రజల పోరాటాలలో భాగస్వామ్యం అవుతున్నాయి.

ప్రజలు ఆందోళనలు చేస్తున్నా, ఈ పరిశ్రమలు ఎందుకు రాష్ట్రంలోకి వస్తున్నాయి ?

ఆయా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్న పారిశ్రామిక వేత్తలు ప్రభుత్వాల మద్ధతుతో ముందుకు వెళుతున్నారు. రాష్ట్రంలో, దేశంలో ఇప్పటికే ఉన్న అన్ని పర్యావరణ, భూసేకరణ చట్టాలను తుంగలో తొక్కుతున్నారు. రాష్ట్ర స్థాయిలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలకు విరాళాలు వెద జల్లుతున్నారు. మంత్రుల నుండీ శాసన సభ్యుల వరకూ తగిన మొత్తంలో కమిషన్ లు ఇస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులకు, అధికారులకు లంచాలు ఇస్తున్నారు. రాష్ట్రంలో పెరిగిన నీటి పారుదల సౌకర్యాలను ఉపయోగించుకోవడానికి, అత్యంత కాలుష్య కారక పరిశ్రమలను జనావాసాలు, వ్యవసాయ భూములు, నదులు, చెరువులు, కుంటలు లాంటి నీటి వనరులకు అత్యంత సమీపంలో ఏర్పాటు చేస్తున్నారు.

పైగా ఇటీవలి కాలంలో ఈ పారిశ్రామిక సంస్థల యాజమనులే వివిధ రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్లు, ఇతర రూపాలలో విరాళాలు ఇచ్చి, టికెట్లు కొనుక్కుని, ప్రజా ప్రతినిధులుగా ఎన్నికలలో పోటీ చేస్తూ, వందల కోట్లు వెదజల్లి, ఓట్లు కొనుక్కుని చట్ట సభల లోకి ప్రవేశిస్తున్నారు. రాష్ట్రంలో అనేక ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటుకు సిద్దం అవుతున్నది యజమానులు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులే.

ఒక్క ఉదాహరణ చూడండి. తెలంగాణ కేంద్రంగా అనేక సంస్థలను స్థాపిస్తున్న హెటిరో గ్రూప్ యజమాని డా. బండి పార్థసారథి రెడ్డి ఈ కోవలోకే వస్తారు. ప్రస్తుతం ఆయన భారత్ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధిగా ఉన్నారు. 2022 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. డా. బండి పార్థసారథి రెడ్డి ఫార్మా , ఇథనాల్ రంగాలతో పాటుగారియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలలో కూడాపెట్టుబడులు పెట్టారు.

Hetsym Estates and Realtors Pvt. Ltd., Dyumat Hotels LLP ఆయనవే. Hetero Wind Power Limited వంటి సంస్థల ద్వారా పవన విద్యుత్ (Wind Power) రంగంలో కూడా పెట్టుబడులు పెట్టారు. సింధు హాస్పిటల్స్ (Sindhu Hospitals) పేరుతో ఆయన హాస్పిటల్స్ కూడా నిర్వహిస్తున్నారు.

నారాయణపేట జిల్లా, మరికల్ మండలం, చిత్తనూరు గ్రామం సమీపంలో ఉన్న ఇథనాల్ ప్లాంట్‌ “జూరాల ఆర్గానిక్ ఫార్మ్స్ అండ్ ఆగ్రో ఇండస్ట్రీస్” యాజమాన్యంలో డా. బండి పార్థసారథి రెడ్డి గారు కూడా ఒకరు. ఈ ఇథనాల్ కంపెనీ వ్యవసాయ ఉత్పత్తులను (బియ్యం, మొక్కజొన్న వంటి) ముడి సరుకుగా ఉపయోగించి ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తున్నది, ఈ గ్రూప్ సుమారు 300 మెగావాట్ల (MW) పవన విద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి గతంలో ఆంధ్రప్రదేశ్‌లో భూములను సేకరించింది.

దేశ వ్యాపితంగా మోడీ జమానాలో ఒక పద్ధతిగా ఎంచుకున్న రాజకీయం ఒకటి ఉంది. ఈ రాజకీయం మేరకు 2021 అక్టోబర్ నెలలో ఆదాయపు పన్ను శాఖ హెటిరో గ్రూప్‌కు సంబంధించిన కార్యాలయాలు, నివాసాలు, ఇతర ప్రాంగణాలపై దేశవ్యాప్తంగా దాడులు (సోదాలు) నిర్వహించింది. పన్ను ఎగవేత (Tax Evasion), లెక్కల్లో చూపని ఆదాయం (Undisclosed Income), అక్రమ లావాదేవీలకు సంబంధించిన ఆరోపణల కారణంగా ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల సందర్భంగా పెద్ద మొత్తంలో నగదు, బంగారం, విలువైన వస్తువులు పట్టుబడినట్లు మరియు కంప్యూటర్ డేటా, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారికంగా ప్రకటించింది. పట్టుబడిన లెక్కల్లో చూపని ఆదాయం రూ. 550 కోట్ల వరకు ఉంటుందని ఐటీ శాఖ అంచనా వేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ కేసు తరువాత ఏమైందో బహిరంగంగా ఇప్పటికీ స్పష్టమైన సమాచారం లేదు.

ఈ క్రమంలో పరిణామాలను అర్థం చేసుకోవడానికి దేశ వ్యాపితంగా చర్చనీయాంశం అయిన ఎలాక్టోరల్ బాండ్లు కొన్ని ప్రశనలకు జవాబు ఇస్తాయి. ఎలక్టోరల్ బాండ్‌ లకు సంబంధించిన బహిరంగ డేటా ప్రకారం హెటిరో గ్రూప్‌కు చెందిన కంపెనీలు భారతీయ జనతా పార్టీ (BJP) తో సహా వివిధ రాజకీయ పార్టీలకు విరాళాలు అందించాయి. BRS పార్టీకి (అప్పటి TRS) అత్యధిక మొత్తంలో ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చింది. ఈ విరాళాలు ఆయన రాజ్యసభ నామినేషన్ ముందు మరియు తరువాత కూడా జరిగాయి.హెటిరో గ్రూప్ కంపెనీలు భారతీయ జనతా పార్టీ (BJP) కి కూడా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో గణనీయమైన మొత్తంలో విరాళాలు అందించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ (INC) పార్టీకి కూడా ఈ కంపనీ విరాళాలు ఇచ్చింది.

ఈ కారణం చేతనే, నారాయణ పేట జిల్లా చిత్తనూరులో ఇథనాల్ కంపనీ ద్వారా కాలుష్యం వెదజల్లుతున్నా , సంగారెడ్డి జిల్లా దోమడుగులో ఫార్మా కంపనీ ద్వారా కాలుష్యం పారించినా ఈ యాజమాన్యంపై ప్రభుత్వాలకు చర్య తీసుకోవడానికి చేతులు రావడం లేదు. బాధ్యత ఉన్న అధికారులకు పట్టడం లేదు. .

యూరప్, ఆమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలలో మందుల ఉత్పత్తి ఖర్చులు, ముఖ్యంగా కార్మికుల, ఉద్యోగుల వేతనాలు, కంపనీ నిర్వహణ వ్యయాలు చాలా ఎక్కువ. పైగా పర్యావరణ పరంగా కాలుష్యం కలిగించే భారీ తయారీ యూనిట్ల స్థాపనపై ఈ దేశాలలో కఠినమైన పర్యావరణ నిబంధనలు (Environmental Regulations) ఉంటాయి. అందుకే జెనరిక్ ఉత్పత్తులకు అమెరికా, యూరప్ అతిపెద్ద వినియోగదారు మార్కెట్లు అయినప్పటికీ, అక్కడ ఈ ఉత్పత్తులను స్థానికంగా తయారు చేయడం కంటే, భారత్ వంటి దేశాల నుండి తక్కువ ధరకు దిగుమతి చేసుకుంటున్నాయి.

ఈ అంతర్జాతీయ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని, ఇక్కడ కంపనీలు ప్రజలపై, గ్రామాలపై కాలుష్యం వెదజల్లుతూ, కార్మికులను దోచుకుంటూ లాభాలు గడిస్తున్నాయి. నిపుణులు పని చేయాల్సిన పని స్థలాలలో కూడా సాధారణ నిరక్షరాస్య వలస కార్మికులను పనిలో పెడుతూ, వారి ప్రాణాలకు కూడా ముప్పు తెస్తున్నాయి.

వలస కార్మికులపై పెరుగుతున్న దోపిడీ:

తెలంగాణలోని ఫార్మా, ఇతర పారిశ్రామిక ప్రాంతాలలో పని చేయడానికి కార్మికులు ఎక్కువగా ఉత్తర భారత రాష్ట్రాల నుండి వలస వస్తున్నారు. ప్రధానంగా బీహార్ , పశ్చిమ బెంగాల్ (కలకత్తా), ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండీ వస్తున్నప్పటికీ, కొన్ని ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కూడా వలస కార్మికులు వస్తున్నారు. చాలా మంది వలస కార్మికులకు ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికులకు ఇప్పటికీ నెలకు 15,000 రూపాయల వేతనం కూడా దాటని పరిస్థితులు ఉన్నాయి . ప్రమాదకర పరిశ్రమలలో రోజుకు 12 గంటలు పని చేసినా సరైన వేతనం లభించడం లేదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే 12 గంటల షిఫ్టుకు రోజుకు సుమారు 750 రూపాయలు చెల్లిస్తున్నారు. కార్మికులకు పని స్థలాలలో అసలు భద్రత లేదు. ఫలితంగా ప్రమాదాలు పెరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం 8 గంటల పని విధానం ఉన్నప్పటికీ, చాలా చోట్ల 12 గంటల వరకు పని చేయిస్తున్నారు.

తక్కువ వేతనాలు చెల్లిస్తూనే, కార్మికులు ఒక రోజు విధులకు హాజరుకాక పోయినా ఆ రోజు వేతనం నుండి కోత విధిస్తున్నారు. కనీస వేతన చట్టం అమలు కావడం లేదు. వలస కార్మికులు నివసించే ప్రాంతాలలో సరైన పారిశుద్ధ్యం, పరిశుభ్రమైన తాగునీరు, తగినంత వెంటిలేషన్ ఉన్న ఇళ్ళు లాంటి కనీస సదుపాయాలు కూడా ఉండడం లేదు. ఒకే గదిలో 5 నుండి 10 మంది కార్మికులు నివసించాల్సిన దయనీయ పరిస్థితులు ఉన్నాయి.

రాష్ట్రంలో వలస కార్మికుల చట్టం (Inter-State Migrant Workmen Act, 1979) సరిగా అమలు కావడం లేదు. కార్మికుల వివరాలను సేకరించడం, వారికి చట్టం ప్రకారం అందాల్సిన సౌకర్యాలు కల్పించడం వంటి విషయాలలో కార్మిక శాఖ అసలు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఈ కార్మికులు కాంట్రాక్టర్ లు, యాజమాన్యాల చేతుల్లో శ్రమ దోపిడీకి గురవుతున్నారు. ఈ కార్మికులకు సమయానికి వేతనాలు అందడం లేదు. వీరికి వైద్య సదుపాయాలు ఉచితంగా అందుబాటులో లేవు. సామాజిక భద్రతా పథకాలకు (ESIC వంటివి) కూడా లేవు.

ఒక వైపు పారిశ్రామీకరణ , భూ సేకరణ పేరుతో, రైతుల చేతుల్లోని సాగు భూములను లాక్కుంటూ రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం, మరో వైపు కాలుష్య కారక పరిశ్రమలకు ద్వారాలు తెరుస్తున్నది. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నది.

కార్మిక శాఖ , కాలుష్య నియంత్రణ మండలి పని తీరను పూర్తిగా యాజమాన్యాల అవసరాలకు అనుగుణంగా మార్చేసింది.

ఈ స్థితిలో రాష్ట్ర ప్రజలకు తమ జీవితాల , ప్రాణాల రక్షణ కోసం పోరాడక తప్పని స్థితి ఏర్పడింది. తమ సాగు భూములను, పశువులను , నీటి వనరులను కాలుష్యం నుండీ కాపాడుకోవడానికి ప్రజలు కులమతాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఐక్యంగా పోరాడితేనే ఈ సమస్యల నుండీ బయట పడతారు. సుస్థిరమైన జీవితాలు, హక్కులతో కూడిన జీవనోపాధి, పర్యావరణ హితమైన రాష్ట్ర అభివృద్ధి ప్రజల హక్కు.

Read More
Next Story