ఈ ఏడాది కాలంలో సిఎం రేవంత్ బాస్ అయ్యాడా, మాస్ అయ్యాడా?
x
Chief Minister A Revanth Reddy

ఈ ఏడాది కాలంలో సిఎం రేవంత్ బాస్ అయ్యాడా, మాస్ అయ్యాడా?

కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై కన్నెగంటి రవి విశ్లేషణ-1

ప్రజల దృష్టి కోణం నుండీ రేవంత్ ప్రభుత్వ పాలనా తీరు ఎలా ఉంది ?


భారత ఎన్నికల వ్యవస్థలో ప్రజా ప్రాతినిధ్య చట్టం క్రింద ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయని ఎన్నికల కమిషన్ ప్రకటిస్తున్నప్పటికీ, గత మూడు దశాబ్ధాలుగా ఎన్నికల వ్యవస్థ ప్రజాస్వామ్య విలువల రీత్యా పూర్తిగా పతనావస్థలో ఉందనేది అందరూ అంగీకరించే అంశమే. చట్ట సభల గడువు ముగిసిన వెంటనే ఎన్నికలు సకాలంలో నిర్వహించడమనేది మాత్రమే క్రమ పద్ధతిలో జరుగుతున్నది తప్ప, మిగిలినవన్నీ - ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధుల ఎంపిక నుండీ, ప్రచారం, ప్రలోభాలు, అలవి కాని ఎన్నికల హామీలు, ఇతరులను కొంచపరిచే అనైతిక భాష, కొన్ని ప్రాంతాలలో దళితులు, మత మైనారిటీలు లాంటి బలహీన వర్గాలపై దౌర్జన్యాలు, డబ్బులు, మద్యం పంపిణీ, మీడియా మేనేజ్మెంట్ వరకూ అన్ని అంశాలూ దేశ ఎన్నికలలో ప్రజాస్వామ్య స్పూర్తిని పూర్తిగా దెబ్బ తీస్తున్నాయి.

ఎన్నికలలో పోటీ చేయడానికి ముందుకు వస్తున్న అభ్యర్ధులు, సాధారణ జన జీవితం కలిగిన వాళ్ళు కారు. దశాబ్ధాలుగా రాజకీయాలలో, ప్రజా సేవలో ఉన్న వాళ్ళు అసలు కాదు. వివిధ వ్యాపారాలలో డబ్బులు సంపాదించి, ఆ డబ్బులను ఎన్నికల్లో పెట్టుబడిగా పెట్టడానికి సిద్దమై గెలుపు గుర్రాలుగా చలామణీలోకి వస్తున్న వాళ్ళు. సాధారణంగా వీళ్లందరూ శత కోటీశ్వరులై ఉంటున్నారు. గెలుపు సాధించడం తప్ప, ఇతర ఏ నైతిక ప్రమాణానికీ కట్టుబడని వాళ్ళనే ఆయా పార్టీలు అభ్యర్ధులుగా ఎంపిక చేయడం ఆనవాయితీగా వస్తున్నది. వీళ్ళకు ఒక రాజకీయపార్టీ లాయల్టీ కూడా పెద్దగా ఉండడం లేదు. ఏ పార్టీ తన అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేస్తే, ఆ పార్టీ అభ్యర్ధిగా రంగంలోకి దిగడానికి సిద్దంగా ఉండేవాళ్లే ఎక్కువ. అందుకే ప్రజల తీర్పు చాలా సార్లు అపహాస్యానికి గురవుతున్నది. సమాజంలో 50 శాతంగా ఉన్న మహిళలకు, 50 శాతానికి పైగా ఉన్న సామాజికంగా వెనుకబడిన వర్గాలకు, తమ జనాభా సంఖ్యకు అనుగుణంగా ముస్లిం ప్రజలకు ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే రావడం లేదు.

1990 దశకంలోనే ఈ ధోరణులు ప్రారంభమైనప్పటికీ,తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో 2014, 2018 లలో జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికలలో KCR నాయకత్వంలోని భారాస పార్టీ, ప్రభుత్వం ఈ అనైతిక, అప్రజాస్వామిక, ఫక్తు రాజకీయ ధోరణులను మరింత పై స్థాయికి తీసుకుపోయింది. ప్రతిపక్ష రాజకీయ పార్టీలను బలహీన పరచడం, ఆయా పార్టీల నాయకత్వాలను కొనుగోలు చేసి తన పార్టీలో కలుపు కోవడం, గ్రామ స్థాయి నుండీ, రాష్ట్ర స్థాయి వరకూ, ఎదుటి పార్టీలకు కార్యకర్తలు లేకుండా నయానో భయానో లోబరుచుకోవడం – పదేళ్లుగా అన్ని స్థాయిల ఎన్నికలలో ఈ ధోరణులను బలంగా పెంచి పోషించింది కూడా KCR కుటుంబమే.

నిజానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీతో అంటకాగుతూ, రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ, ఇతర RSS అనుబంధ సంస్థల కార్యక్రమాలకు ప్రోత్సాహమిస్తూ, ప్రజాస్వామిక వాదుల, ప్రజా సంఘాల నాయకుల గొంతు నొక్కేస్తూ, ముందస్తు అరెస్టులతో వారి కదలికలపై ఆంక్షలు విధిస్తూ, UAPA సహా అక్రమ కేసులు బనాయిస్తూ, పదేళ్ళ పాటు KCR సాగించిన నియంతృత్వ పాలనతో, కాంగ్రెస్ పార్టీ కూడా సంస్థాగతంగా తీవ్రంగా బలహీన పడింది.

ఆనాటి కాంగ్రెస్ పార్టీ లో ఉన్న కొద్ది మంది నాయకులు కూడా KCR పాలనలో లోపాలపై ప్రజలను సమీకరించడానికి ఏ మాత్రం పూనుకోకుండా, పార్టీ ఉన్నత స్థానాలలో ఉంటూ, KCR కు లోపాయికారీగా సహకరిస్తూ ఉండేవాళ్లు. ఈ పదేళ్ళలో నిజంగా ప్రతిపక్ష పాత్ర పాత్ర పోషించింది ప్రొఫెసర్ కోదండరామ్ నాయకత్వంలో 2015 నుండీ TJAC లాంటి సంస్థలు ( 2018 లో ఆయన తెలంగాణ జన సమితి పార్టీని ఏర్పాటు చేశారు ) వివిధ ప్రజా సంఘాలు, పౌర సమాజ బృందాలు, ఆర్టీసీ కార్మికులు, ఆదివాసీలు, భూ సేకరణ బాధితులు, నిరుద్యోగ యువత మాత్రమే. ఈ శక్తులు చేసిన పోరాటాలే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అధికార మార్పుకు ప్రధాన కారణ మయ్యాయి.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టాక, ఆ పార్టీ కొంత జవసత్వాలు కూడగట్టుకున్నప్పటికీ, స్వయంగా KCR ను ఓడించే సామర్ధ్యాన్ని మాత్రం పెంచుకోలేకపోయింది. క్రమంగా రేవంత్ నాయకత్వం పార్టీలో స్థిర పడడం, KCR భాషతో పోటీ పడే భాషను ఉపయోగించడానికి రేవంత్ కూడా సిద్ద పడడం, ప్రజల ఆకాంక్షలపై ప్రత్యేక కార్యక్రమాలతో దూకుడు కాంగ్రెస్ పార్టీ వైపు, స్థానిక BRS నాయకులు, తాజా, మాజీ శాసన సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు చూసి, ఆ పార్టీలో చేరడం ప్రారంభమైంది. అంటే, ఒక రకంగా మళ్ళీ ఉద్యమాల నుండీ ఎదిగి వచ్చిన కొత్త తరం నాయకత్వం కాకుండా, BRS పాలనలో అవినీతిలో, అరాచకత్వంలో రాటుతేలిన వారే, కాంగ్రెస్ లో కీలక స్థానాలను ఆక్రమించడం, వాళ్ళే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులుగా ఎంపిక కావడం జరుగుతూ వచ్చింది. ప్రజలకు మరో దిక్కు లేక వీరినే ఎన్నుకోవాల్సిన పరిస్థితి.

ప్రస్తుత రేవంత్ పాలనలో రాష్ట్ర ప్రజలు రోజు వారీ సమస్యలు ఎదుర్కుంటున్నా, ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా స్థానికంగా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలలో గెలిచిన శాసనసభ్యులు వేగంగా కదిలి ప్రజల సమస్యల పరిష్కారానికి పూనుకోకపోవడం, అసంతృప్తిలో ఉన్న ప్రజలకు భరోసా కల్పించక పోవడం, ప్రతిపక్ష రాజకీయ పార్టీలుగా బీజేపీ, BRS పార్టీలు చేస్తున్న రాజకీయ విమర్శలను తిప్పికొట్టడానికి పూనుకోకపోవడం – వీటన్నిటికీ కారణం ఒక్కటే. స్వార్ధం నిండిన, అవినీతిలో కూరుకుపోయిన, కనీస పార్టీ లాయల్టీ లేని అవకాశవాద వర్గాలు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పదవులు, ఫలితాలు పొందడం.

ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలకు నిధులు లేకపోయినా, BRS ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్ లకు మాత్రం బిల్లులు శాంక్షన్ చేయించడం, గెలిచిన, ఓడిన MLA లు కలసి వాటిలో కమిషన్లు పంచుకోవడం నిత్యకృత్యంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

వాస్తవ సాగుదారులను గుర్తించకుండా, రైతు బంధు పేరుతో పెద్ద ఎత్తున నిధులను వ్యవసాయం చేయని బడాబాబులకు దోచి పెట్టడం, ధరణి పేరుతో సాగించిన అన్యాయాలు, అడ్డగోలు భూసేకరణతో రైతుల నుండీ భూములు గుంజు కోవడం, ఆవినీతితో నిండిన కుటుంబ పాలన లాంటి పరిణామాల వల్ల తెలంగాణ గ్రామీణ ప్రజలు మాత్రం KCR పార్టీని ఓడించాలనే నిర్ణయానికి వచ్చారు. దొర బంగ్లాలో కొలువు తీరిన ఆనాటి రాష్ట్ర పాలకుల అప్రజాస్వామిక వ్యవహార శైలి నుండీ మార్పు కావాలనే బలమైన కోరిక ప్రజలలో ఏర్పడింది.

తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, జాగో తెలంగాణ, TSDF, మేలుకో తెలంగాణ, ముస్లిం సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ లాంటి వేదికలు సాగించిన విస్తృత ప్రచారం KCR నిరంకుశ పాలనను బలంగా ప్రజలలో ఎండగట్టింది. ఇదే సమయంలో కేంద్రంలో పదేళ్ళ మోడీ ఫాసిస్టు పాలనపై ఈ సంస్థలు సాగించిన ప్రచారం కూడా రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు ఆలోచించకుండా ఆపింది. తెలంగాణ జన సమితి, CPI పార్టీలు నేరుగా కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల ఒప్పందం చేసుకున్నాయి. ఈ పరిణామాలతో, ప్రజలు అనివార్యంగా KCR కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు, మరీ ముఖ్యంగా ప్రజాస్వామిక పాలన గురించి ఇచ్చిన 7 వ గ్యారంటీ కూడా ఎన్నికలలో ప్రజలను ప్రభావితం చేశాయి.

ఈ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2023 నవంబర్ లో జరిగాయి. డిసెంబర్ 7 న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ బాధ్యతలు స్వీకరించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ మంత్రులుగా కొలువు తీరారు. ఈ ప్రభుత్వానికి 2024 డిసెంబర్ 7 నాటికి సంవత్సర కాలం నిండుతోంది. డిసెంబర్ 1 నుండీ డిసెంబర్ 9 వరకూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా పాలన సంబరాలు నిర్వహించుకుంటోంది.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ సంవత్సర పాలనపై సమీక్ష అవసరం. ఆ సమీక్ష ప్రజల కోణం నుండీ సాగాలి. గత పదేళ్ళ KCR పాలనతో పోల్చి సాగాలి. అలాగే, రాజకీయంగా తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో బీజేపీ లాంటి ఫాసిస్టు శక్తుల చేతుల్లోకి పోకుండా రాజకీయ విచక్షణతో, రాష్ట్ర ప్రజలను ప్రజాస్వామిక తెలంగాణ వైపు సమాయత్తం చేసే లక్ష్యంతో సాగాలి. BRS పదేళ్ళ పాలన లో అమలు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు మళ్ళీ గుర్తు చేస్తూనే, కొత్త ప్రభుత్వం కూడా ఆ పాత విధానాలనే కొనసాగిస్తుంటే, అందువల్ల రాష్ట్ర ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను గుర్తు చేస్తూ సమీక్ష సాగాలి. రాష్ట్ర అభివృద్ధి నమూనా సవ్యమైన దిశలో పోతుందో లేదో పరిశీలిస్తూ ఈ సమీక్షలు సాగాలి. పాలనలో ప్రజా వ్యతిరేక విధానాలు, అప్రజాస్వామిక పాలనా తీరు వ్యక్తమవుతుంటే, దానిని ప్రశ్నిస్తూ సమీక్ష సాగాలి.

ఈ సమీక్ష సందర్భంగా, 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు అంశాలను కూడా ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే – నడిచి వచ్చిన దారిని ఈ ప్రభుత్వం మర్చిపోయిందా అనే అనుమానం కలుగుతున్నది. అలాగే, ప్రజలు KCR పాలనను ఎందుకు తిరస్కరించారో, సరిగ్గా అవే పాలనా ధోరణులు ఇప్పుడు కూడా బయటకు కనపడుతున్నాయి. రోజు వారీ పాలనలో నిరంతరంగా కాకపోయినా, కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఆయా సంఘటనలు అందుకు సూచికగా ఉన్నాయి. అవి విడి విడి ఘటనలుగా చూస్తే పెద్ద ప్రమాదంగా కనపడకపోవచ్చు. కానీ వాటిని ప్రత్యేకంగా ప్రస్తావించక పోతే, అవి సాధారణ పాలనా వ్యవహారంగా మారిపోవచ్చు.

2

ముఖ్యమంత్రి గా రేవంత్ బాధ్యతలు చేపట్టాక, పౌర సమాజం పక్షాన తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (TPJAC), భారత్ జోడో అభియాన్ (BJA) సంస్థల ప్రతినిధులు రెండుసార్లు ఆయనను కలసి కొత్త ప్రభుత్వం నుండీ ఆశిస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రస్తావించారు. ముఖ్యంగా గత పదేళ్లుగా KCR ప్రభుత్వ నిర్బంధ విధానాలతో విసిగిపోయిన ప్రజలు ఊపిరి పీల్చుకునేలా ప్రభుత్వం వ్యవహరించాలని, ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఒక పర్మినెంట్ వేదికను కల్పించాలని, పోలీసులపై ప్రభుత్వం ఎక్కువగా ఆధారపడకుండా ఉండాలని, గత ప్రభుత్వం ప్రజలపై, ప్రజా సంఘాల కార్యకర్తలపై, మేధావులపై పెట్టిన అన్ని అక్రమ కేసులను సమీక్షించాలని, వాటిని ఎత్తేయాలని, పౌర సమాజంతో, ప్రజా సంఘాలతో, రాజకీయ పార్టీలతో చర్చల ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి పూనుకోవాలని, అందుకు నిరంతరంగా పని చేసే ఒక శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఆయన వాటిని ఓపికగా విన్నారు. పౌర సమాజ ప్రతినిధులు ప్రస్తావించిన వాటిని నోట్ చేసుకోవాలని, తగిన చర్యలు తీసుకుకోవాలని , అందరి ముందూ తన సిబ్బందికి ఆదేశించారు.

ఏడాది కాలం గడిచాక , పరిస్థితిని సమీక్షిస్తే వీటిలో ఒక్కటి మాత్రమే నిజంగా ఉనికిలోకి వచ్చి, ఒక మేరకు ప్రజలకు ఊరట లభించేలా చేసింది. దొర గడీగా విలసిల్లిన ప్రగతి భవన్, మహాత్మా జ్యోతీబా ఫూలే ప్రజాభవన్ గా మారడం, అక్కడ వారానికి రెండు సార్లు, ప్రజావాణి నిర్వహించడం, పేద ప్రజల పట్ల , వారి సమస్యల పట్ల సానుభూతితో వ్యవహరించే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి వర్యులు జి. చిన్నారెడ్డి గారిని ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్ గా, ప్రజా భవన్ బాధ్యులుగా, సీనియర్ ఐఏఎస్ అధికారి దివ్య దేవరాజన్ గారిని ప్రజావాణి నోడల్ ఆఫీసర్ గా నియమించడం – సానుకూల పరిణామాలు. ప్రజల సమస్యలను నమోదు చేయడానికి, వాటి పరిష్కారానికి , వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. వేల సంఖ్యలో వస్తున్న ప్రజా సమస్యల పరిష్కారానికి , ఇంకా సరైన ప్రణాళిక రూపొందలేదు కానీ, కనీసం అటువైపు అడుగులు పడుతున్నాయి.

ఇక పౌర సమాజం ప్రస్తావించిన మిగిలిన అంశాలలో పెద్దగా పురోగతి లేదు. ఇప్పటికీ పాలనా తీరు కుదుట పడలేదు. ముఖ్యమంత్రి గారు, మంత్రులు స్వయంగా ఇచ్చిన ఆదేశాలు కూడా సకాలంలో అమలు కావడం లేదు. ముఖ్యమంత్రి గారి అపాయింట్ మెంట్ రాను రానూ కష్టమైపోతున్నది. మంత్రులు ప్రజలను కలుస్తున్నారు కానీ, సమస్యల పరిష్కారం అనుకున్న స్థాయిలో ఉండడం లేదు.

విద్య, కార్మిక లాంటి కొన్ని ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు కూడా ఇంకా ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉండడంతో, ఆయా రంగాలపై చర్చకు ఆయనకు సరైన సమయం దొరకక రెగ్యులర్ గా సమీక్షలు జరగడం లేదు. ఆయా రంగాలలో పనులు వేగంగా, స్వతంత్రంగా ముందుకు వెళ్ళడం లేదు.

ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉన్న బ్యూరోక్రసీ , గత పదేళ్లుగా KCR పాలనలో వ్యవహరించిన తీరుతోనే వ్యవహరిస్తున్నది. ఏదో ఒక కొర్రీ పెట్టి పనులు ముందుకు పోకుండా ఆపడం ఆనవాయితీగా మారిపోయింది. ఇప్పటికే ఉన్న జీవో లను వ్యాఖ్యానించడంలో, ఏదైనా అడ్డంకులు ఉంటే, అవసరమైన మార్పులను చేసి, ప్రజానుకూలంగా వాటిని అమలులోకి తీసుకురావడంలో అధికార గణం వైపు నుండీ కాలయాపన తీవ్రంగా ఉంది. అందుకే , అసలు ప్రభుత్వ పాలన సాగుతున్నదా అనే అనుమానం ప్రజలకు కలుగుతున్నది. విద్యా రంగ జీవో ల విషయంలో అయినా, ధరణి సమస్యల పరిష్కారం విషయంలో అయినా, నియామక పరీక్షలు నిర్వహించి, అర్హులతో పోస్టులను భర్తీ చేసే విషయంలో అయినా ఈ ధోరణులు బలంగా వ్యక్తమవుతున్నాయి.

ఇక పోలీసుల తీరులో పెద్దగా మార్పు లేదు., గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను సమీక్షించాలని పౌర సమాజ సభ్యుల సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రి గారే ఆదేశించినా, ఇప్పటి వరకూ ఆ సమీక్ష పూర్తి కాలేదు. ప్రొఫెసర్ హరగోపాల్, పద్మజా షా , ఖాసిం, వి. సంధ్య లాంటి వారిపై పెట్టిన UAPA కేసును కూడా సమీక్షించలేదు. ఇప్పటి వరకూ ఒక్క అక్రమ కేసును కూడా ఎత్తి వేస్తూ, పోలీసుల వైపు నుండీ కోర్టులో పిటిషన్ వేయలేదు. కనీసం నారాయణ పేట జిల్లా వాసి, జూనియర్ కాలేజీ లెక్చరర్ బండారి లక్ష్మయ్య సహా, ఎనిమిది మందిపై ఓపెన్ చేసిన రౌడీ షీట్ ను కూడా తొలగించలేదు. ఆయా అక్రమ కేసుల్లో ప్రజా సంఘాల కార్య కర్తలు , నాయకులు కేసుల కోసం కోర్టుల చుట్టూ ఇప్పటికీ తిరగ వలసి వస్తున్నది.

గత పదేళ్ళ KCR పాలనలో ప్రజల సమావేశాలపై తీవ్రమైన ఆంక్షలు ఉండేవి. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ను రద్ధు చేయడం కూడా చూశాం. కోర్టు తీర్పు ద్వారా ధర్నా చౌక్ పునరుద్ధరణ జరిగినా, ధర్నా చౌక్ ప్రజల గొంతు వినిపించ డానికి కేటాయించే విషయంలో పోలీసులు ఇప్పటికీ, ప్రజాస్వామిక పాలన ప్రభుత్వ గ్యారంటీ అనే పూర్తి స్పృహతో ఉండడం లేదు. ఇందిరా పార్క్ ధర్నాలకు హాజరయ్యే ప్రజల సంఖ్యపై ఆంక్షలు, సమయంపై ఆంక్షలు అప్పుడప్పుడూ ప్రజలను సతాయిస్తున్నాయి.

అలాగే రాష్ట్రంలో ఎక్కడైనా సభలు, సమావేశాలకు అనుమతులు తప్పకుండా ఇవ్వాలనే స్పృహతో పోలీసులు వ్యవహరించడం లేదు. ప్రభుత్వం అందుకు అనుగుణంగా పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం లేదు.

కొన్ని సార్లు, ముఖ్యమంత్రి రేవంత్ జిల్లాల పర్యటన సందర్భంలో ఆయా జిల్లాలలో ప్రజా సంఘాల కార్యకర్తల ముందస్తు అరెస్టులు కూడా చోటు చేసుకున్నాయి.

ప్రజల కదలికలపై ఆంక్షలు కూడా అప్పుడప్పుడూ వ్యక్తమయ్యాయి. ఉదాహరణకు నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండల ప్రజలు రెండు బస్సులు వేసుకుని, నారాయణ పేట జిల్లా మరికల్ మండల గ్రామాలలో చిత్తనూరు ఇథనాల్ పరిశ్రమ వెదజల్లుతున్న కాలుష్యంపై తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు, ప్రజల బస్సులను ఆయా గ్రామాలలోకి వెళ్ళకుండా ఆపి, వెనక్కు పంపించారు. అలాగే లగచర్ల ఘటన తరువాత ఆయా గ్రామాలకు వెళ్ళి నిజ నిర్ధారణ చేయాలని ప్రయత్నం చేసిన పౌర హక్కుల సంఘం, PDSU, మహిళా, ట్రాన్స్ జండర్ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ లాంటి సంఘాల ప్రతినిధులను మధ్యలోనే అడ్డుకుని అరెస్టు చేసి వెనక్కు పంపారు.

ఉదాహరణకు నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ లో ప్రజలు అక్టోబర్16 న నిర్వహించు కోవాలనుకున్న సభకు పోలీసులు అనుమతి నిరాకరించడం, గద్వాల జిల్లా అయిజ మండలం పెద్ద ధన్వాడ లో నవంబర్ 30 న బహిరంగ సభ నిర్వహణకు అనుమతించకపోవడం, ఈ రెండు సందర్భాలలో రాష్ట్ర హై కోర్టు నుండీ అనుమతి తెచ్చుకోవాల్సి రావడం, ప్రొఫెసర్ జి. ఎన్. సాయిబాబా వరంగల్ సంస్మరణ సభకు అనుమతి నిరాకరించడం లాంటి ఘటనలు పోలీసుల పాత ధోరణికే అద్దం పట్టాయి. ,

నిర్మల్ జిల్లాలో ఇథనాల్ కంపనీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకు సంఘీభావం తెలియ చేశాడనే కారణంగా, ఆరేపల్లి విజయ్ కుమార్ అనే ప్రధానోపాధ్యాయుడిని విధుల నుండీ సస్పెండ్ చేయడం కూడా ఈ ప్రభుత్వ పాలనలో వ్యక్తమైన ఒక అప్రజాస్వామిక ఘటన. రాష్ట్రంలో పోలీసు లాకప్ మరణాలు కూడా కొన్ని జరిగాయి. అలాగే విద్యార్ధుల సమస్యలపై ఆందోళన చేస్తున్న ABVP మహిళా విద్యార్ధినిని మగ పోలీసులు జుట్టు పట్టి ఈడ్చి వేసిన సంఘటన, గ్రూప్స్ పరీక్షల వాయిదా కోరుతూ, ఉస్మానియాలో ఆందోళన చేస్తున్న విద్యార్ధులు, నిరుద్యోగుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు కూడా ప్రభుత్వ పాలనపై తగ్గని పోలీసుల పట్టునే బయట పెట్టింది.

బీజేపీ తన ఫాసిస్టు ఎజెండా ను తెలంగాణ లో కూడా అమలు చేయాలనే ప్రయత్నంలో ఉంది. గత పదేళ్ళ KCR పాలనా కాలంలో ఆ ప్రయత్నం ముమ్మరంగా చేసింది. కానీ KCR ప్రభుత్వం, RSS కార్యకలాపాల విస్తరణను అడ్డుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు కానీ, సంఘ్ మూకల దాడి నుండీ ముస్లిం ప్రజలకు రక్షణ కల్పించడంలో, ముస్లిం, క్రిస్టియన్ ప్రజలకు భరోసా ఇవ్వడంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించింది. ఆ మేరకు ముస్లిం ప్రజల మద్ధతును BRS పార్టీ పొందింది.

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో అత్యంత బలహీనంగా వ్యవహరిస్తున్నది. ఈ ఏడాది కాలంలో మెదక్ లో ముస్లిం దుకాణాలపై జరిగిన దాడులు, ఆసిఫాబాద్ జిల్లాలో సంఘ్ మూకల ప్రోత్సాహంతో జైనూర్ లో ముస్లిం ప్రజల దుకాణాలపై జరిగిన దాడులు, ఆదిలాబాద్ ట్రాన్స్ పోర్ట్ రంగంలో ముస్లిం లారీ యాజమానుల పట్ల వ్యక్తమవుతున్న వివక్ష – ఈ ధోరణికి కొన్ని మచ్చు తునకలు. వరంగల్ లో సెక్యులర్ రచయితల వేదిక సమూహ సమావేశాలపై, సంఘ్ మూకలు చేసిన దాడి, ఆ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు కూడా ఈ ప్రభుత్వం RSS సంస్థల పట్ల ఉండాల్సినంత మెలకువగా లేదని అర్థం చేయించాయి.

దేశంలో బీజేపీ ఫాసిస్టు కూటమికి వ్యతిరేకంగా, ఇండియా కూటమి నిలబడుతుందని ముస్లిం ప్రజలు విశ్వాసించి, అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణలో కూడా ఇండియా కూటమి అభ్యర్ధులకు పూర్తి అండదండలు అందించారు. కాంగ్రెస్ ఎన్నికల విజయాలకు మైనారిటీ ప్రజల మద్ధతు తప్పకుండా ఉపయోగ పడింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో మైనారిటీలకు రక్షణ కల్పించడంలో, మైనారిటీలకు ఎన్నికల లోనూ, ప్రభుత్వ పాలనలోనూ తగిన ప్రాతినిధ్యం ఇవ్వడంలో తగిన పరిణతి చూపించలేదని బాహాటంగా కనపడుతున్నది.

3

నీ స్నేహితులెవరో చెప్పు , నువ్వేమిటో నేను చెబుతాను అనేది సామెత.

కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో అలుము కుంటున్న స్నేహాలు, చేసుకుంటున్న ఒప్పందాలు కూడా ఆ పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల గౌరవాన్ని , నమ్మకాలను పెంచడం లేదు. మూడు విషయాలలో ఈ వైఖరి బయట పడింది.

మేఘా ఇంజినీరింగ్ కంపనీ యజమాని కృష్ణారెడ్డి తో రేవంత్ ప్రభుత్వానికి సంబంధాల పునరుద్ధరణ ఇందులో ఒకటి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఇంకా విచారణ ముగియ లేదు. తప్పొప్పులు తేలలేదు. నివేదిక బయటకు రాలేదు. దోషులు నిర్ధారణ కాలేదు. కానీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో BRS, బీజేపీ పార్టీలతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన మెగా కృష్ణారెడ్డి , కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తో మాత్రం వాణిజ్య ఒప్పందానికి వచ్చేశాడు. తెలంగాణ ఆర్టీసీ కి ఎలక్ట్రిక్ బస్సుల సరఫరా ఒప్పందం మెగా కంపనీ చేసుకుంది. దీనికి కృతజ్ఞతగా కావచ్చు, ఆయన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి క్రింద, స్కిల్ యూనివర్సిటీ లో ఒక భవనాన్ని నిర్మించి ఇస్తాడు. దేశమంతా ఈ ధోరణి నడుస్తూనే ఉంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనికి భిన్నంగా లేదు.

మోదానీ గా పేరు తెచ్చుకున్న ఆదానీ అవినీతి దేశమంతా తెలుసు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గత ఐదారేళ్లుగా ఆదానీ అవినీతి గురించి మాట్లాడకుండా ఒక్క రోజు కూడా నిద్ర పోలేదు. కానీ, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదానీ అవినీతి పట్ల, మోడీ ఆదానీ సంబంధం పట్ల పెద్ద అభ్యంతరం ఉన్నట్లు లేదు. అందుకే ఆదానీ కంపనీలతో వేల కోట్ల వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం, పాత హైదరాబాద్ విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఆదానీ కంపనీకీ ఇస్తామని ప్రకటించడం , స్కిల్ యూనివర్సిటీ కి ఆదానీ కంపనీల నుండీ 100 కోట్ల విరాళం స్వీకరించడం - ఈ ఘటనలన్నీ, రాహుల్ మాటల లోని నిజాయితీనీ, కొన్ని విలువలకు కట్టుబడి ఉండలేని రేవంత్ ప్రభుత్వ పని తీరునూ అనుమానించేలా చేస్తున్నాయి.

తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇజ్రాయిల్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలు కూడా ఈ కోవలోకే వస్తాయి. ఇజ్రాయిల్ ఇవాళ ప్రపంచమంతా చీదరించుకుంటున్న యుద్ధోన్మాద శక్తి. వేల సంఖ్యలో పాలస్తీనా పసిపిల్లలను చంపేస్తున్న తీరు చూసి, ప్రపంచమంతా ఇజ్రాయిల్ దుర్మార్గాలను ఎలుగెత్తి ప్రశ్నిస్తున్నది. ఫాసిస్టు బీజేపీ కి ఇజ్రాయిల్ దేశంతో సంబంధాలు నెరపడం పెద్దగా అభ్యంతరం ఉండక పోవచ్చు.

కానీ నెహ్రూ అలీన విధానానికి కట్టుబడి ఉంటామనీ, పాలస్తీనాకు అండగా ఉంటామనీ ప్రకటిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం , విచక్షణా రహితంగా ఇజ్రాయిల్ తో ఎలా ఒప్పందాలు చేసుకుంటుంది ? పైగా ఇజ్రాయిల్ అభివృద్ధి చేసిన పెగాసిస్ టెక్నలజీని మోడీ ప్రభుత్వం వాడుకుని రాహుల్ గాంధీ సహా ఎందరిని వేధించిందో చూసిన వాళ్ళం, ఇప్పుడు అటువంటి సర్వైవలెన్స్ టెక్నాలజీ కోసం ఇజ్రాయిల్ మీద రేవంత్ ఆధార పడాలని చూడడం అత్యంత అభ్యంతరకరం. మొదటి సంవత్సర కాలంలోనే మోడీ ప్రభుత్వ బాటలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం కూడా నడవాలని చూడడం, ప్రజలకు నమ్మకాన్ని పోగొడుతుంది.

ఈ స్నేహాలు ఒక నాన్ సీరియస్ ధోరణితో తెలియక చేస్తున్నారా ? ప్రజల దేముందిలే, వాణిజ్య ప్రయోజనాల కోసం ఎవరితోనైనా కలుస్తాం అనే బే ఫర్వా ధోరణితో ఆలోచిస్తున్నారా? అన్నది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది, కానీ ఈ స్నేహాలు రాష్ట్రానికి మంచివి కావు, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచివి కావు.

Read More
Next Story