గత కొన్నిరోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో లడ్డూ వివాదం రాజకీయంగా తీవ్రంగా సంచలనం రేపుతుంది. ఏ మీడియా చూసిన రాజకీయ నాయకులు దేవుడి ప్రసాదంగా ఇచ్చే లడ్డూలో జంతువు కొవ్వు కలిసిందని, టాయిలెట్ క్లీనర్ వాడారు అని రక రకాలుగా వాదన చేసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో కల్తి జరిగిందా లేదా అనే అంశాన్ని పక్కన పెడితే లడ్డూ వివాదం చుట్టూ ఏర్పడిన రాజకీయ చర్చను కేవలం ఆరోపణలు–ప్రత్యారోపణల స్థాయిలో మాత్రమే చూడటం సరిపోదు. ఈ అంశం రాజకీయంగా, సామాజికంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో అనేది సామాజిక శాస్త్ర దృష్టితో పరిశీలించడం అవసరం. ఈ లడ్డూ వ్యవహారం సమాజంలోని ప్రజల విశ్వాసం, మత పరమైన అంశాల ప్రాముఖ్యత, మీడియా నిర్మాణం , ప్రజాస్వామ్య ప్రభుత్వాల బాధ్యతల మధ్య ఉన్న సంక్లిష్ట సంబంధాన్ని తెలియజేసే ఒక ముఖ్య సంఘటన. వాస్తవానికి ఇలాంటి వివాదాలు సాధారణ పరిపాలనా లోపాలుగా మొదలై, తరువాత సంకేతాత్మక (సింబాలిక్) రాజకీయాలకు వేదికగా మారుతాయి. .
మనం గమనిస్తే మత సంబంధిత అంశాలు అనేవి సమాజంలో కేవలం ఆచారాలుగా మాత్రమే ఉండవు; అవి సామూహిక భావోద్వేగాలకు కేంద్రాలుగా ఉంటాయి. అంటే వివిధ కులాల, వర్గాల, మతాల అంశాలకు సంబధించిన భావోద్వేగాలకు కేంద్రాలు. శ్రమ విభజన, ఆత్మహత్య సిద్ధాంతం, మతం, సమాజంలో పవిత్ర-అపవిత్రమైన అంశాలు లాంటి వాటిపై విస్తృత పరిశోధనలు చేసిన ఫ్రెంచ్ సామాజిక శాస్త్రవేత్త ఎమిల్ డర్కెయిమ్ చెప్పినట్టు, మతం అనేది సమాజపు “సామూహిక చైతన్యం (కలెక్టివ్ కాన్సిసినెస్)” ను నిర్మించే ఒక వ్యవస్థ. దైవం, దైవ ప్రసాదాలు వంటి అంశాలు, ప్రజలకు, భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి మాత్రమే కాదు అవి ఒక సామాజిక అనుబంధాన్ని కూడా కలిగి ఉంటాయి. అందువల్ల లడ్డూ ప్రసాదం లేదా దేవుడికి సంబంధించిన అంశాల చుట్టూ వచ్చిన వివాదాలు సహజంగానే ప్రజలలో అనుమానం, ఆవేదన, ఆగ్రహం లాంటివి కలిగిస్తాయి. ఇది ప్రజలలో పరిపాలనా లోపాన్ని మించి, సమాజపు విలువల సంక్షోభంగా కనపడుతుంది.
ఇలాంటి సందర్భం లో ఇక్కడ ప్రభుత్వ ప్రతిస్పందన సామాజికంగా చాలా ముఖ్యం. సమాజంలో ఆలోచనలు, వాల్యూస్, సంస్థలు ఎలా పని చేస్తాయో వివరించిన జర్మన్ సామాజిక వేత్త మాక్స్ వెబర్ చెప్పిన “లెజిటిమసీ” భావన ప్రకారం, ఏదైనా ప్రభుత్వం అధికారాన్ని కేవలం ఎన్నికల ద్వారా మాత్రమే కాకుండా ప్రజల విశ్వాసం ద్వారా కూడా నిలబెట్టుకోవాలి. ఎప్పుడైనా, ఏదైనా వివాదం వచ్చినప్పుడు ప్రభుత్వం చూపే పారదర్శకత, సమగ్ర విచారణ, బాధ్యత లాంటి అంశాలు ప్రభుత్వం పై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని బలపరుస్తాయి. కానీ సమస్యపై లేదా వివాదం పై ప్రభుత్వాలు గాని, రాజ్యాంగ వ్యస్థలు గాని స్పష్టత ఇవ్వకుండా/ఇవ్వకముందే (ఇక్కడ లడ్డూ వ్యవహారంలో ఏ రకమైన జంతు కొవ్వులు గుర్తించ లేదు అని నివేదికలు చెపుతున్నా... అలాగే లడ్డూ వ్యవహారంపై ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నప్పటికి) రాజకీయ నాయకులు ప్రతిపక్షాన్ని నిందించడం ప్రారంభిస్తే, అది ప్రజల్లో నమ్మకాన్ని పెంచదు , పెంచకపొగ దానికి బదులు ప్రభుత్వం ఎదో దాచిపెడుతుందనే భావన ప్రజల్లో బలపడుతుంది.
అలాగే ఈ వివాదాలు వాస్తవమైన/అవాస్తవమైన రాజకీయంగా “బ్లేమ్ షిఫ్టింగ్” అనే వ్యుహాల్లాగా కనిపిస్తాయి. సాధారణంగా పరిపాలనా వ్యవస్థల్లో ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు తమ బాధ్యతను ప్రత్యర్థులపై మళ్లించడంలో భాగంగా జరిగే రాజకీయ రక్షణ చర్య. అయితే ప్రజలకు సమాచారం విస్తృతంగా అందుబాటులో ఉన్న ఈ ఆధునిక కాలంలో ఇలాంటి వ్యూహాలు ప్రతిసారి పనిచేయవు. ఈ లడ్డూ వివాదంలో మనం సింబాలిక్ వాల్యూ అనే సామాజిక శాస్త్ర పరమైన భావనను విశ్లేషించవచ్చు. సమాజంలో కొన్ని వస్తువులు లేదా అంశాలు భౌతిక విలువను దాటి సింబాలిక్ విలువను కలిగి ఉంటాయి; దేవాలయాల్లో ఇచ్చే లడ్డూ, భక్తి, కట్టుబాట్లు, ఆచారాలు సింబాలిక్ విలువ కలిగి ఉన్న అంశాలుగా చూడవచ్చు. ప్రజలు ఈ సింబాలిక్ వాల్యూ కలిగి ఉన్న వాటిని (ఉదాహరణకు జాతీయత సింబల్స్, మతపరమైన సింబల్స్, కల్చరల్ సింబల్స్ మొ,, వీటిలో లడ్డూ ను మతపరమైన సింబల్స్ లో భాగంగా చూడవచ్చు) తమ గుర్తింపుతో అనుబంధాన్ని కలిగి ఉంటారు. అందువల్ల వాటిపై వచ్చే విమర్శ లేదా మార్పు వ్యక్తిగత/సామూహిక అవమానంగా భావించబడుతుంది. ఈ భావోద్వేగ అనుబంధాన్ని ఉపయోగించి రాజకీయ నాయకులు లడ్డూ వంటి సింబాలిక్ అంశాల పై చర్చను పెంచి, భావోద్వేగ సమీకరణ, నైతిక విభజన, , ఓట్లు సాధించే రాజకీయ వ్యూహంగా మార్చుకుంటారు. కాని ఇలాంటి అంశాల పై వాదన అతిగా కనిపించినప్పుడు ప్రజల్లో ప్రతికూల ప్రతిస్పందనకు దారితీస్తుంది. ప్రజలు దీన్ని నిజమైన భక్తిగా కాకుండా, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు తమ స్వలాభం వాడుకుంటున్నాయి అని గుర్తించే అవకాశం ఉంది. అప్పుడు ఈ సింబాలిక్ వాల్యూ కలిగిన అంశాల పై చర్చ పార్టీలకు, నాయకులకు నష్టం కలగజేస్తుంది.
అలాగే ఇలాంటి వివాదాలు మరో ముఖ్య అంశాన్ని కూడా మనకు తెలియజేస్తాయి. అదే రాష్ట్రం , మత సంస్థల మధ్య ఉన్న సంక్లిష్ట సంబంధం. సెక్యులర్ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం మతపరంగా తటస్థంగా ఉండాలి. కానీ అనేక సందర్భాల్లో ధార్మిక సంస్థలు, దేవాలయాల నిర్వహణలో ప్రభుత్వ పాత్ర ఉంటుంది. సమస్యలు వచ్చినప్పుడు బాధ్యత ఎవరిది? పరిపాలనదా? ట్రస్ట్‌దా? కాంట్రాక్టరుదా? అనే ప్రశ్న స్పష్టంగా లేకపోతే కల్తి లడ్డూ లాంటి వివాదాలపై ప్రజా చర్చ గందరగోళంగా ఉంటుంది.
మీడియా పాత్ర కూడా ఇక్కడ విమర్శానాత్మకంగా చూడాలి. ప్రస్తుత మీడియా వాతావరణంలో ఒక సంఘటన ఏదైనా త్వరగా మీడియా ప్రేరేపిత సంక్షోభంగా మారుతుంది. సమాజంలోని ఒక వర్గం లేదా జాతి పై వ్యతిరేఖ భావన కలిగిస్తుంది. మీడియా ప్రదర్శించే దృశ్యం సమకాలీన సంస్కృతి, సాంకేతిక కమ్యూనికేషన్స్ పై విశ్లేషనలకు ప్రసిద్ధి చెందినా ఫ్రెంచ్ సామాజిక శాస్త్ర వేత్త జీన్ బార్దిలార్డ్ చెప్పిన “హైపర్ రియాలిటీ” భావన లాంటిది, అంటే మీడియా చూపిస్తున్న సంఘటనలు అసలు వాస్తవాన్ని మించి సమాజం పై ప్రభావం చూపుతాయి. ఒకవేళ సమస్య పరిపాలనా లోపం వల్ల ఉత్పన్నమైన, అది ప్రజలకు పెద్ద సాంస్కృతిక,రాజకీయ సంక్షోభంగా ప్రదర్శించబడుతుంది. దీంతో ప్రజా అభిప్రాయం వాస్తవ వివరాల కంటే మీడియా కథనాల ద్వారా రూపుదిద్దుకుంటుంది.
ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు కూడా వారి పాత్రను సమీక్షుంచుకోవాలి. ప్రతిపక్షం కేవలం ఆరోపణలకే పరిమితం కాకుండా, స్వతంత్ర విచారణ, నివేదికలు కోరడం లాంటి వాటిని డిమాండ్ చేయాలి, పరిపాలనా లోపాలపై నిర్మాణాత్మక విమర్శ చేయాలి. పార్టీల అతిశయోక్తి కూడా సమస్య విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బాధ్యతాయుత ప్రత్యామ్నాయం చూపగలిగితేనే ప్రజాస్వామ్యంలో ప్రజా అవసరాలకు సంబంధించిన చర్చ ఆరోగ్యకరంగా ఉంటుంది.
మొత్తానికి, రాష్ట్రంలో లడ్డూ వివాదం ‘రాష్ట్రం–సమాజం–మతం–రాజకీయాల’ మధ్య ఉన్న సున్నితమైన సంబంధాన్ని బయటపెట్టింది. ఇటువంటి సందర్భాల్లో అధికార పక్షం గానీ, ప్రతిపక్షం గానీ భావోద్వేగ రాజకీయాల కంటే పారదర్శకత, బాధ్యత, ఆధారపూర్వక చర్చకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వాల పై ప్రజా విశ్వాసం ఒకసారి దెబ్బతింటే తిరిగి నిర్మించడం కష్టం. అందుకే ప్రజాస్వామ్యంలో ప్రతిసారి గెలవాల్సింది వాదన కాదు — విశ్వసనీయత.