లడాఖ్ సమస్యకు పరిష్కారం చూపలేరా
x

లడాఖ్ సమస్యకు పరిష్కారం చూపలేరా

కేంద్ర ప్రభుత్వం నిర్లిప్త  ధోరణితో అట్టుడుకుతున్న  లడాఖ్ 

ఆరు సంవత్సరాలుగా లడాఖ్ ప్రజలు ఎదురుచూశారు, శాంతియుతంగా ప్రదర్శనలు చేశారు, దీక్షలు చేశారు, వేడుకున్నారు. వారి డిమాండ్ ఒక్కటే లడాఖ్‌ను లడాఖ్ వాళ్లే పాలించాలి. కానీ కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. బుధవారం ఆ సహనం చెల్లాచెదురైంది. లేహ్ వీధులు అగ్నికి ఆహుతయ్యాయి, నలుగురు నిరసనకారులు మృతి చెందారు, డజన్ల కొద్దీ గాయపడ్డారు. 2019లో జమ్మూ కశ్మీర్ రాష్ట్ర హోదా రద్దు చేసి లడాఖ్‌ను శాసనసభ లేకుండా యూనియన్ టెరిటరీగా మార్చినప్పటి నుండి, స్థానికులు పాలనలో పూర్తిగా పక్కకు నెట్టబడ్డారు. ఉద్యోగాలు లేవు, హక్కులు లేవు, హామీలు నిలబడలేదు. ఉపాధి లేదు ఈ ఆగ్రహమే ఇప్పుడు “జెన్-జెడ్ తిరుగుబాటు”గా మారింది.

ఉపవాసం నుంచి అగ్నికీలలు వరకు

స్పార్క్ మరణం నుంచి వచ్చింది. రాజ్య హోదా, ఆరో షెడ్యూల్ రక్షణ కోసం దీక్ష చేస్తున్న ఇద్దరు వృద్ధులు ఈ వారం కన్నుమూశారు. దీంతో ఆగ్రహం ఆవేశాలు పెల్లుబికి యువత వీధుల్లోకి దూసుకెళ్లింది. మధ్యాహ్నం బీజేపీ కార్యాలయానికి తగులబెట్టారు, వాహనాలు తగులబెట్టారు, పోలీసుల లాఠీఛార్జ్ ఎదుర్కొన్నారు. పరిస్థితి అదుపు తప్పిందని గ్రహించిన పోలీసులు కాల్పులు జరిపారు. సాయంత్రానికి నలుగురు మరణించారు. “మా యువతను తుపాకీ బుల్లెట్లతో . వారు తమ హక్కుల కోసం మాత్రమే రోడ్లపైకి వచ్చారు,” అని లడాఖ్ ఏపెక్స్ బాడీకి చెందిన జిగ్మత్ పల్‌జోర్ అన్నారు.

వాంగ్‌చుక్‌పై నిందలు, ఎఫ్‌సీఆర్‌ఏ రద్దు

ప్రజల డిమాండ్లపై చర్చించడానికి బదులుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అస్త్రాలను ప్రముఖ పర్యావరణవేత్త హక్కుల ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ వైపు మళ్లించింది. ఆయన ప్రసంగాలు “అరబ్ స్ప్రింగ్ శైలిలో నిరసనలు” ప్రేరేపించాయని ఆరోపించింది. ఇదే సమయంలో, వాంగ్‌చుక్ స్థాపించిన *ఎస్ఈసిఎంఓఎల్ * సంస్థకు చెందిన విదేశీ నిధుల లైసెన్స్ ను రద్దు చేసింది. కారణం: “ఆర్థిక లోపాలు”, అవకతవకలు “జాతీయ ప్రయోజనాలకు విరుద్ధమైన నిధుల బదిలీ జరిగిందని ప్రకటించారు. నిన్న బుల్లెట్లు వాడారు. ఈ రోజు పేపర్‌వర్క్ వాడుతున్నారు. లక్ష్యం ఒక్కటే సోనమ్ వాంగ్‌చుక్‌ను గొంతు కట్టేయడం అని కర్గిల్ డెమొక్రటిక్ అలయన్స్ నాయకుడు అస్గర్ అలీ కార్బలాయి తీవ్రంగా స్పందించారు.

2019 నుంచి నిరంతరంగా లడాఖ్ ప్రజలు కోరుతున్న ప్రధాన డిమాండ్లు, లడాఖ్ పూర్తి రాష్ట్ర హోదా, ఆరో షెడ్యూల్ రక్షణలు (భూమి, ఉద్యోగాలు, సంస్కృతి కాపాడేందుకు). లేహ్, కర్గిల్‌కు వేరువేరు లోక్‌సభ స్థానాలు, ఒక రాజ్యసభ స్థానం. ఉద్యోగ ఉపాధి కల్పనకు స్థానిక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు. లడాఖ్ జనాభాలో 90% కంటే ఎక్కువ మంది షెడ్యూల్డ్ ట్రైబ్స్‌లోకి వస్తారు. అయినా రక్షణ లేవు. 97% అక్షరాస్యత ఉన్న, స్థానిక పట్టభద్రులలో నిరుద్యోగం జాతీయ సగటుతో పోలిస్తే రెండింతలు ఉంది. యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా, ప్రజాస్వామ్య హక్కులు లాక్కుంటే, సమాజంలో ఆగ్రహం తప్ప మరేమీ మిగలదు,” అని వాంగ్‌చుక్ హెచ్చరించారు.

లడాఖ్ రాజకీయ చరిత్రలో రక్తపాత దినం

1981, 1989లో జరిగిన పోరాటాల్లో లడాఖ్ ఇప్పటికే రక్తం చిందించింది. ఇప్పుడు 2025లో నలుగురు నిరసనకారుల మృతి ఆ జాబితాలో చేరింది. “ఇది ఒక నాయకుడి లేదా ఒక గ్రూప్ విషయం కాదు. ఇది మా భవిష్యత్తు దొంగిలించబడుతున్నదన్న కోపం,” అని ఒక యువ నిరసనకారి తెలిపారు. మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ “కేంద్రం తప్పు విధానాలే లడాఖ్‌ను మంటల్లోకి నెట్టాయి” అని మండిపడ్డారు.

కాంగ్రెస్ సీనియర్ నేత కరణ్ సింగ్ “ఆరో షెడ్యూల్‌లో చేర్చడం సమంజసం. ఇది భద్రతా పరంగా కూడా కీలకం” అని వ్యాఖ్యానించారు. కానీ ఢిల్లీ మాత్రం “మాబ్ హింస” అని వర్ణిస్తూ, పోలీసుల చర్యలను సమర్థించడమే చేస్తోంది. లడాఖ్ కేవలం రాష్ట్రహోదా డిమాండ్ మాత్రమే కాదు. ఇది చైనాతో భారత్ సరిహద్దు. 2020లో గల్వాన్ ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఇక్కడ భారీ సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఆ భయంకర భూభాగం మరో అగ్నిని ఎదుర్కొంటోంది , స్థానిక యువత తిరుగుబాటు. “ముందు కశ్మీర్ నమ్మకాన్ని కోల్పోయారు. ఇప్పుడు లడాఖ్ కోల్పోతున్నారు,” అని రాజకీయ విశ్లేషకుడు సిద్ధిక్ వాహిద్ హెచ్చరించారు. నలుగురు మరణించిన వారి మృతదేహాలను కుటుంబాలకు అప్పగించగా, లేహ్ నగరం కర్ఫ్యూలో ఉంది. దీక్షలు విరమించబడ్డాయి కానీ కోపం మాత్రం మిగిలే ఉంది. లడాఖ్‌కు రాష్ట్రహోదా ఇవ్వండి. ఆరో షెడ్యూల్ ఇప్పుడే అమలు చేయండి అన్న నినాదాలు లేహ్ వీధుల్లో కొనసాగుతున్నాయి.

ప్రశ్న ఇప్పుడు ఒకటే ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇంత తాత్సారం చేస్తున్నది, లడాఖ్ నిరసనలు ఢిల్లీకి వినిపిస్తుందా? లేక మరింత రక్తం చిందితేనే చర్యలు తీసుకుంటుందా?

Read More
Next Story