భూములను లాక్కోవడమే కానీ, ప్రభుత్వాలకు భూసంస్కరణల అమలు ఊసే లేదు
x

భూములను లాక్కోవడమే కానీ, ప్రభుత్వాలకు భూసంస్కరణల అమలు ఊసే లేదు

తెలంగాణలో భూమి చర్చ భూ సంస్కరణల కోణంలో సాగాలి. కానీ అది అందరూ వదిలేసిన ఎజెండా అయిపోయింది.


హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల సమస్య పూర్తిగా ఇంకా కొలిక్కి రాలేదు కానీ, నిర్బంధం ప్రయోగించయినా భూములు తీసుకోవాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు సుప్రీం కోర్టు తీర్పుతో, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జోక్యంతో తాత్కాలికంగా ఆగాయి. కానీ అప్పటికే కొంత అడవి నాశనం అయింది. యూనివర్సిటీ లో పోలీసు పహారా, విద్యార్ధులపై కేసులు ఎత్తేశారు కానీ, యూనివర్సిటీ భూములను తీసుకోవాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలలో మార్పు ఉందా లేదా అనేది స్పష్టంగా తేలలేదు. కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, రాజ్య సభ సభ్యుడు మల్లు రవి విడుదల చేసిన వీడియో ఈ అనుమానాలకు తావు ఇస్తున్నది.

రాష్ట్రంలో యూనివర్సిటీ లకు కేటాయించిన భూమి అంతా ప్రభుత్వ భూమేనని రేవంత్ ప్రభుత్వం అంటోంది. విస్తృతార్ధంలో అది నిజమే కావచ్చు. కానీ సహజ వనరుగా ఉన్న భూమి పై ప్రభుత్వానికి కూడా పూర్తి యాజమాన్య హక్కులంటూ ఏమీ ఉండవు కస్టోడియన్ హక్కులు తప్ప. ప్రభుత్వం భూమికి సంబంధించిన చట్టాలను అమలు చేస్తూ, భూమికి కాపలాదారుగా ఉండాలి. నిజానికి తెలంగాణలో భూమి చర్చ వేరే కోణంలో సాగాలి. అది భూ సంస్కరణల కోణంలో. కానీ అది అందరూ వదిలేసిన ఎజెండా అయిపోయింది. ఆ ఎజెండాను గుర్తు చేయడమే లక్ష్యంగా కొన్ని పాత అంశాలను మళ్ళీ నేను ఈ వ్యాసం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను.

భూసంస్కరణలను అంతా విస్మరించారు

సాగు భూములు నిజమైన సాగుదారుల చేతుల్లో ఉండాలని మనం భావిస్తాం. సాగు భూములను విచ్చలవిడిగా, విచక్షణ లేకుండా ఇతర అవసరాలకు మళ్లించ కూడదని కూడా మనం డిమాండ్ చేస్తాం. కానీ ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో సాగు భూములను ఇతర అవసరాలకు మళ్లించడం, రైతుల చేతుల్లోంచి అతి తక్కువ పరిహారం చెల్లించి భూములు తీసుకుని పరిశ్రమల యజమానులకు ఎక్కువ ధరలకు అమ్ము కోవడం, 1990 నుండీ ప్రారంభించి గత మూడు దశాబ్ధాలుగా గమనిస్తున్నాం.

ఈ పరిణామాలు అర్థం కావాలంటే, దీనికి ముందు నాలుగు దశాబ్దాల కాలంలో సాగిన భూ పోరాటాల చరిత్రను, ఆ క్రమంలో వచ్చిన చట్టాలను కొంత అర్థం చేసుకుంటే గ్రామీణ ప్రజలలో భూమి కోసం తపన, భూమి లాక్కుంటే వచ్చే ఆగ్రహాన్ని అర్థం చేసుకోవచ్చు.

1947 లో భారత దేశంనుండీ బ్రిటీష్ వాళ్ళు వెళ్లిపోయాక, 1948 నాటికి స్వతంత్ర్య సంస్థా నాలన్నీ భారత దేశంలో విలీనమయ్యాయి. అప్పటికే వివిధ సంస్థానాలలో భూస్వాములకు, జమీందారులకు వ్యతిరేకంగా రైతుల, కూలీల, ఆదివాసీల పోరాటాలు విస్తృతంగా సాగు తున్నాయి. జమీందారీ, భూస్వామ్య వ్యవస్థలు రద్దవుతున్న కాలంలో రైతుల,భూమిలేని పేదల చేతుల్లోకి సాగు భూములు రావాలనే డిమాండ్ మరింత ఊపందుకుంది. ఇందుకు అనుగుణంగా దేశ వ్యాపితంగా వివిధ రాష్ట్రాలలో భూమి చట్టాలు రూపొందాయి.

తెలంగాణలో భూపంపిణీ

హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ , ప్రత్యేక తెలంగాణ లో కూడా భూమి పంపిణీ ఒక సమస్య గా, ఒక డిమాండ్ గా ఎప్పుడూ ఉంటూ వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం (1946-1951) ఫలితంగా నిజాం పాలనలో దొరలు బలవంతంగా స్వాధీనం చేసుకున్న భూములను తిరిగి రైతులకు పంపిణీ చేశారు.

1948 నాటికి సుమారు 10 లక్షల ఎకరాల భూమిని గ్రామీణ ప్రజల మధ్య పంపిణీ చేసినట్లు చారిత్రక రికార్డులు సూచిస్తున్నాయి. ఈ పంపిణీ ప్రధానంగా గ్రామ కమ్యూన్ల ద్వారా జరిగింది.

భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1949లో కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీని నియమించింది. దీనికి జె.సి. కుమారప్ప (J.C. Kumarappa) అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ కమిటీ దేశ వ్యాప్తంగా భూమి సమస్యలను అధ్యయనం చేసి, సిఫార్సులు చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా సమస్యలను అధ్యయనం చేసి ఈ కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది.

మధ్యవర్తుల (ఇంటర్మీడియరీస్) రద్దు : రాష్ట్రం - రైతుల మధ్య ఉన్న జాగీర్దార్లు, జమీందార్లు వంటి మధ్యవర్తులను తొలగించాలని కమిటీ సిఫార్సు చేసింది. తెలంగాణలో ఇది చాలా కీలకమైనది, ఎందుకంటే నిజాం పాలనలో జాగీర్దార్లు, దొరలు పెద్ద ఎత్తున భూములను నియంత్రించారు. "దున్నే వారిదే భూమి " (Land to the Tiller) అని ఆనాటి ఉద్యమం లేవనెత్తిన నినాదం ఈ సిఫార్సు ద్వారా బలపడింది. ఈ సిఫార్సు హైదరాబాద్ రాష్ట్రంలో జాగీర్దారీ రద్దు నిబంధనలు (Hyderabad Jagirdari Abolition Regulation, 1949) రూపొందడానికి దారితీసింది.

రైతుల స్వయం ప్రతిపత్తి : రైతుల్లో ఆత్మ గౌరవాన్నిపెంపొందించడం, భూస్వాముల దోపిడీని నిరోధించడం లక్ష్యంగా చేయబడిన ఈ సిఫార్సు, , తెలంగాణ సాయుధ పోరాట (1946-1951) కాలంలో రైతులకు భూమి హక్కులను కల్పించడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది.

భూమి బదిలీ మరియు సబ్‌ లెట్టింగ్‌పై నిషేధం : వ్యవసాయ భూమిని వ్యవసాయేతరులకు బదిలీ చేయడంపై నిషేధం విధించాలని, భూమిని సబ్‌లెట్ చేయడాన్ని నిషేధించాలని కూడా కమిటీ సిఫార్సు చేసింది. ఇది భూమిని నేరుగా సాగు చేసే వారి వద్దే ఉంచడానికి ఉద్దేశించబడింది.

సహకార వ్యవసాయం: సహకార ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కమిటీ సూచించింది, దీని ద్వారా చిన్న రైతులు సామూహికంగా భూమిని సాగు చేసి లాభాలను పంచుకోవచ్చు. అయితే, తెలంగాణలో ఈ సిఫార్సు పెద్దగా అమలు కాలేదు.

పరిపాలనా వ్యవస్థ ఏర్పాటు : భూసంస్కరణలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఒక ప్రత్యేక పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. ఇది అధికారుల ద్వారా భూమి పంపిణీ, రక్షణను నిర్ధారించడానికి ఉద్దేశించబడింది.

తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా కమ్యూనిస్టులు భూమిని రైతులకు పంచడం ప్రారంభించిన నేపథ్యంలో కుమారప్ప కమిటీ సిఫార్సులు ఈ ప్రక్రియను చట్టబద్ధం చేయడానికి కొంత దోహద పడ్డాయి. 1949 లో హైదరాబాద్ జాగీర్దారీ రద్దు నిబంధనలు అమలులోకి వచ్చాయి కానీ, తెలంగాణలో కుమారప్ప కమిటీ సిఫార్సులు పూర్తిగా అమలు కాలేదు.

మరో రెండు దశాబ్ధాలకు 1973 భూసంస్కరణ చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో (తెలంగాణతో సహా) భూమిలేని పేదలకు ప్రభుత్వ భూములు, సీలింగ్ ద్వారా సేకరించిన అదనపు భూములను ఒక మేరకు పంపిణీ చేశారు. 1970 నుండీ ప్రారంభించి రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ దశలలో దళితులు, ఆదివాసీలు, ఇతర వెనుకబడిన వర్గాలకు ఈ భూములను అసైన్డ్ చేశారు. ప్రభుత్వ అంచనా ప్రకారం, తెలంగాణలో మొత్తం 1.5 కోట్ల ఎకరాల సాగు భూమిలో సుమారు 30 లక్షల ఎకరాలు భూమిలేని పేదలకు అసైన్ చేయబడ్డాయి.మి

ఎస్ సి మహిళలకు భూమి ఎక్కడ?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత BRS ప్రభుత్వం భూమిలేని షెడ్యూల్డ్ కుల (SC) మహిళలకు 3 ఎకరాల సాగు భూమిని అందించే పథకాన్ని ప్రారంభించింది. కానీ సుమారు 6000 కుటుంబాలకు 16,000 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇచ్చి, ఈ పథకాన్నికూడా పూర్తిగా నిలిపేసింది.

విషాదం ఏమిటంటే, 1948 నుండి తెలంగాణ లో చేసిన భూ పంపిణీ కి సంబంధించిన పూర్తి గణాంకాలు ఒకే చోట అందు బాటులో లేవు . వివిధ ప్రభుత్వ నివేదికలు బహిరంగంగా ప్రజలకు అందుబాటులో ఉండవు. ఇదే సమయంలో 2014 తెలంగాణ ఆవిర్భావం తరువాత అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో అసైన్డ్ భూములను ప్రభుత్వాలు తిరిగి స్వాధీనం చేసుకుంటున్నాయి. ఇది భూమి పంపిణీ లక్ష్యాలను పూర్తిగా దెబ్బ తీస్తోంది.

1973 భూ గరిష్ట పరిమితి చట్టం ఏమంటోంది?

ఈ చట్టం ప్రకారం తెలంగాణలో సాగు భూములను మాగాణి (Wet Lands) , మెట్ట (Dry Lands) భూములుగా వర్గీకరించారు. 1973 చట్టం ప్రకారం, భూములను మాగాణి మరియు మెట్ట భూములుగా వర్గీకరించడానికి సాగు నీటి లభ్యతను ప్రధాన ప్రాతిపదికగా తీసుకున్నారు.

మాగాణి భూమి (Wet Land): ఇది సాగు నీటి సౌకర్యం ఉన్న భూమి, అంటే కాలువలు, చెరువులు, బావులు లేదా ఇతర నీటి పారుదల వనరుల ద్వారా నీరు అందే భూమి. ఈ భూములు సాధారణంగా ఎక్కువ దిగుబడినిచ్చే సామర్థ్యం కలిగి ఉంటాయి.

మెట్ట భూమి (Dry Land): ఇది నీటి పారుదల సౌకర్యం లేని లేదా పరిమిత నీటి వనరులపై ఆధారపడే భూమి. ఇవి వర్షాధారం పై ప్రధానంగా ఆధారపడతాయి.

ఈ వర్గీకరణ భూమి ఉత్పాదకత , నీటి లభ్యత ఆధారంగా జరిగింది. చట్టంలో ఈ భూములను గుర్తించడానికి రెవెన్యూ రికార్డులు, స్థానిక సర్వేలు, భూ శిస్తు వివరాలు పరిశీలించారు.

తెలంగాణలో మాగాణి, మెట్ట భూముల వర్గీకరణ చివరిగా 1973 చట్టం అమలులోకి వచ్చిన సమయం లోనే (అంటే 1973-1975 మధ్య కాలంలో) ప్రధానంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ చట్టం అమలు చేయ బడినప్పుడు తెలంగాణ ప్రాంతం కూడా దీని పరిధిలోకి వచ్చింది. అప్పటి నుండి ఈ వర్గీకరణలో సమగ్రమైన మార్పులు లేదా పునర్విభజనలు అధికారికంగా జరగలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత (2014 ) కూడా ఈ పాత వర్గీకరణనే అనుసరిస్తున్నారు.

అనేక నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా, ఇతర నీటి పారుదల పథకాల ద్వారా తెలంగాణలోని అనేక ప్రాంతాలకు కొత్తగా సాగు నీరు అందుతున్నప్పటికీ, ఈ భూములను మాగాణిగా పునర్వర్గీకరణ చేయడం లేదు. రెవెన్యూ శాఖ కూడా కొత్త నీటి సౌకర్యాలను పరిగణనలోకి తీసుకోకుండా. ఇప్పటికీ 1970 ల లోని రికార్డులను ఆధారంగా తీసుకుంటుంది, భూ వర్గీకరణను నవీకరించడానికి ఇన్ని దశాబ్ధాలలో సమగ్ర సర్వే కూడా చేయలేదు.

1973 చట్టం ప్రకారం, తెలంగాణలో భూములను వివిధ జోన్‌లుగా విభజించారు. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ పరిధిలోకి వచ్చిన జిల్లాలను కవర్ చేస్తాయి. నీటి లభ్యత, భూ సారం ఆధారంగా తెలంగాణలోని జోన్‌లు ఏర్పాటయ్యాయి.

జోన్ I లో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలు, జోన్ II లో వరంగల్, ఖమ్మం జిల్లాలు, జోన్ III లో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జిల్లాల సంఖ్య 10 నుండి 33కి పెరిగినప్పటికీ, 1973 చట్టం జోన్‌ లు పాత జిల్లాల ఆధారంగానే ఉన్నాయి. కొత్త జిల్లాలు ఈ పాత జోన్‌ల లోనే భాగంగా పరిగణించ బడతాయి.

1973 చట్టం ప్రకారం, ఒక కుటుంబం గరిష్టంగా ఉంచుకోగల భూమి పరిమితి "స్టాండర్డ్ హోల్డింగ్" ఆధారంగా నిర్ణయించారు. ఇది మాగాణి మరియు మెట్ట భూములకు భిన్నంగా ఉంటుంది:

మాగాణి భూమి (Wet Land) జోన్ I & II లో 10 ఎకరాలు, జోన్ III లో 12 ఎకరాలు ఉంచుకోవచ్చు. మెట్ట భూమి (Dry Land) జోన్ I & II లో 35 ఎకరాలు ఉంచుకోవచ్చు. జోన్ III లో 54 ఎకరాల వరకూ ఉంచుకోవచ్చు. ఒక కుటుంబం అంటే (భర్త, భార్య, మైనర్ పిల్లలు కలిపి) ఈ పరిమితుల్లో భూమిని కలిగి ఉంచుకోవచ్చు. ఇంతకు మించి అదనపు భూమి ఉంటే ప్రభుత్వం దానిని స్వాధీనం చేసుకుని భూమిలేని రైతులకు పంపిణీ చేయాల్సి ఉంటుంది.

1973 భూ గరిష్ట పరిమితి చట్టం ప్రకారం, కొన్ని భూములు మరియు పంటల భూములకు నిర్దిష్ట సందర్భాలలో భూ గరిష్ట పరిమితి నుండీ మినహాయింపు ఇచ్చారు. ఇవి ప్రభుత్వ భూములు, మత/ చారిటబుల్ సంస్థల భూములు, టీ, కాఫీ, కోకో, కార్డమమ్, రబ్బరు లాంటి ప్లాంటేషన్ భూములు. అయితే వందలాది ఎకరాలు కలిగిన వ్యక్తులు, వేలాది ఎకరాలు కలిగిన సంస్థలు , ఎలా ఈ చట్టం ఇచ్చిన మినహాయింపులను పొందాయో లోతుగా పరిశీలించాలి. ఈ సమాచారం ప్రస్తుతం బయట ప్రజలకు అందుబాటులో లేదు. చట్టం అమలుకు ప్రభుత్వానికి, లేదా రెవెన్యూ యంత్రాంగానికి ఆసక్తి లేదు కనుక, ఆయా సంస్థల బాధ్యులు, లేదా నయా భూస్వాములు ఈ మినహాయింపులను చాలా ఈజీగా పొందుతున్నారు.

1973 చట్టం అమలు లోకి వచ్చినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఈ చట్టంలో కొన్ని సవరణలు చేశాయి.

1974 సవరణ (Act No. 9 of 1974): ఈ సవరణ ద్వారా సెక్షన్ 5 లో మార్పులు చేశారు, దీనిలో డబుల్ క్రాప్ వెట్ ల్యాండ్ (ప్రైవేట్ ట్యూబ్‌వెల్ ద్వారా నీటిపారుదల జరిగే భూమి) స్టాండర్డ్ హోల్డింగ్‌ను 25 శాతం పెంచారు కానీ పెంచిన భూమితో కలిపి, గరిష్టంగా 18 ఎకరాలు (7.28 హెక్టార్లు) మించకూడదని నిర్ణయించారు.

1977 సవరణ (Act No. 8 of 1977): చట్టంలో సెక్షన్ 4 A అదనంగా చేర్చారు. ఇది హిందూ సంయుక్త కుటుంబ వ్యవస్థలో లేని ముస్లిం, క్రైస్తవ కుటుంబాలను కూడా చట్టం పరిధిలోకి తీసుకు రావడానికి ఈ చర్య తీసుకున్నారు. ఈ సవరణ ద్వారా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సీలింగ్ విస్తీర్ణాన్ని పెంచే అవకాశం కల్పించారు.

2009 సవరణ : ఈ సవరణ ద్వారా పరిశ్రమలు, వాణిజ్య ప్రయోజనాల కోసం సీలింగ్ మిగులు భూములను విక్రయించడానికి అనుమతి ఇచ్చారు. ఈ చట్ట సవరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగినప్పటికీ, 2014 లో తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఈ నిబంధనలు వర్తిస్తున్నాయి. .

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత (2014 ) ఈ చట్టంలో ప్రత్యేకంగా కొత్త సవరణలు చేసినట్లు బహిరంగ సమాచారంలో స్పష్టమైన ఆధారాలు లేవు. గత ప్రభుత్వం బయటకు విడుదల చేయని ఆర్డినెన్సు లు , సవరణ జీవో లు ఏమైనా చేసిందేమో తెలియదు.

పెద్ద భూ యజమానులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తూ 1973 భూ గరిష్ట పరిమితి చట్టం అమలు కాకుండా చేస్తున్నారు. ఈ చట్టం పరిధిలోకి రాకుండా చాలా మంది నాయకులు తమ భూములను ట్రస్టులు, బినామీల పేరిట బదిలీ చేశారు.

రైతులకు, రైతు సంఘాలకు ఈ చట్టం గురించి తగిన అవగాహన కూడా లేకుండా పోయింది. ఈ చట్టం ఇంకా అమలులో ఉందనీ , కానీ అమలు మాత్రం కావడం లేదనే స్పృహ చాలా మంది సామాజిక కార్యకర్తలకు కూడా లేదు. అందుకే ఈ చట్టం అమలు చేయాల్సిన అవసరాన్ని గురించి మాట్లాడడమే మానేశారు.

మరో వైపు 2009 సవరణలో చూపినట్లు , ప్రభుత్వాలు భూ సంస్కరణలు అమలు చేసి, మిగులు భూములను తేల్చి, పేదలకు భూమి పంపిణీ చేయాలనే లక్ష్యాన్ని వదిలేసి, సీలింగ్ మిగులు భూములను పరిశ్రమలకు బదిలీ చేస్తున్నాయి.

పేదల పోరాటాల ఫలితంగా పేదలకు అసైన్డ్ చేసిన భూములు పేదల చేతుల్లోంచి జారి పోకుండా మరో చట్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ ల్యాండ్స్ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్స్) యాక్ట్, 1977 (9/77 చట్టం) పేరుతో చేసిన ఈ చట్టం భూమిలేని పేదలకు ప్రభుత్వం కేటాయించిన భూములను బదిలీ చేయకుండా నిషేధించడానికి రూపొందించబడింది. ఈ చట్టం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1977లో అమలులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా దీని అమలు కొనసాగింది. ఈ చట్టానికి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో వివిధ దశలలో కొన్ని సవరణలు చేశాయి

1989 సవరణ (Act 32 of 1989): ఈ సవరణ ద్వారా సెక్షన్ 4(1)(b) మరియు (c)లను సవరించారు, మరియు సెక్షన్ 5ని పూర్తిగా మార్చారు. ఈ సవరణలు భూమి తిరిగి స్వాధీనం మరియు పునరుద్ధరణ ప్రక్రియలను స్పష్టం చేశాయి.ఈ చట్టం ద్వారా అసైన్డ్ భూములను బదిలీ చేసిన వారిని శిక్షించే నిబంధనలను బలోపేతం చేశారు. అయితే, ఈ సవరణలు పూర్తిగా అమలు కాకపోవడం వల్ల భూమి బదిలీలు కొనసాగాయి.

2007 సవరణ (Act 8 of 2007) : సెక్షన్ 4(1)(b)లో మార్పులు చేసి, అసైన్డ్ భూమిని ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం నోటిఫై చేసిన ప్రాంతాలు మినహా, మిగిలిన భూమిని మొదటి అసైనీకి పునరుద్ధరించే నిబంధన జోడించారు (ఒకసారి మాత్రమే).సెక్షన్ 7(1)లో కొత్త షరతు చేర్చారు. 2006 సవరణ చట్టం అమలులోకి వచ్చిన 90 రోజుల్లో స్వచ్ఛందంగా భూమిని అప్పగించిన వారిని ప్రాసిక్యూషన్ నుండి మినహాయించారు.

సెక్షన్ 5(1)లో, జిల్లా కలెక్టర్ లేదా అధికారి 45 రోజుల్లో అసైన్డ్ భూముల జాబితాను రిజిస్ట్రేషన్ అధికారికి అందించాలని నిబంధన చేర్చారు. ఈ సవరణలు జనవరి 29, 2007 నుండి అమలులోకి వచ్చాయి. కానీ పెద్దగా అమలు కాలేదు.

2008 సవరణ (Act 21 of 2008) : సెక్షన్ 4(1)(b)లో మరోసారి సవరణ చేసి, జనవరి 29, 2007కు ముందు "మంచి నమ్మకంతో" భూమిని కొనుగోలు చేసిన భూమిలేని పేదలకు తిరిగి కేటాయించే అవకాశం కల్పించారు, కానీ గరిష్టంగా 5 ఎకరాల మెట్ట భూమి లేదా 2.5 ఎకరాల మాగాణి భూమి మాత్రమే అనే షరతు విధించారు.

ఈ తిరిగి కేటాయించిన భూమిని మళ్లీ బదిలీ చేస్తే, ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఇతర అర్హులైన భూమిలేని పేదలకు కేటాయిస్తుందని నిర్ణయించారు. ఈ సవరణ మే 6, 2008 నుండి అమలులోకి వచ్చింది. ఇది గతంలో జరిగిన బదిలీలను క్రమబద్ధీకరించడానికి, నిజమైన లబ్ధిదారులకు రక్షణ కల్పించడానికి ఉద్దేశించబడింది. అయితే, ఈ పథకం అమలులో ఆలస్యం, అర్హత నిర్ధారణలో సమస్యలు తలెత్తాయి.

ఆంధ్రప్రదేశ్‌లో 2019 లో మరో సవరణ చేశారు. 20 సంవత్సరాలకు పైగా అసైన్డ్ భూమిని స్వాధీనంలో ఉంచుకున్న వారికి పూర్తి హక్కులు (విక్రయం, తాకట్టు, బదిలీ) కల్పించేందుకు చట్టంలో సవరణ చేశారు. ఈ సవరణ జులై 12, 2019న ఆమోదించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత (2014), ఈ చట్టం "తెలంగాణ అసైన్డ్ ల్యాండ్స్ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్స్) యాక్ట్, 1977"గా అడాప్ట్ చేయబడింది (G.O.Ms.No.45, Law (F) Department, జూన్ 1, 2016). ఈ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రానికి అనుగుణంగా మార్చారు, "ఆంధ్రప్రదేశ్" అనే పదాన్ని "తెలంగాణ" గా భర్తీ చేశారు. 2007, 2008 సవరణలు తెలంగాణ లో కూడా వర్తించాయి,

తెలంగాణలో "ధరణి" పోర్టల్ (2020) ద్వారా భూమి రికార్డులను డిజిటలైజ్ చేసినప్పటికీ, అసైన్డ్ భూముల రక్షణలో మాత్రం సమస్యలు కొనసాగుతున్నాయి. ఈ చట్టం కింద భూములను స్వాధీనం చేసుకోవడం లేదా పునరుద్ధరణ లో ఆలస్యం జరిగింది. 2014 తర్వాత, అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో, అసైన్డ్ భూములను అసైన్డ్ రైతుల నుండీ ప్రభుత్వాలు తిరిగి స్వాధీనం చేసుకుంటున్నాయి.

2007 మరియు 2008 సవరణలు భూమి బదిలీలను కొంతవరకు నియంత్రించాయి, కానీ అమలులో అవగాహన లోపం, అధికారుల నిర్లక్ష్యం వల్ల పూర్తి విజయం సాధించలేదు. 2019 సవరణ ఆంధ్రప్రదేశ్‌లో లబ్ధిదారులకు స్వేచ్ఛ ఇచ్చింది. అయితే ఈ సవరణ చట్టం ఉద్దేశానికి విరుద్ధమైనది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అసైన్డ్ భూములకు శాశ్వత పట్టా హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చింది కానీ, దానిపై ఇంకా చర్చ ప్రారంభించకుండానే, అసైన్డ్ భూములను మాత్రం అభివృద్ధి పేరుతో లాక్కుంటోంది.

ఎందుకు ఇప్పుడు ఈ చట్టాలను జ్ఞాపకం చేయాల్సి వస్తుందంటే, ప్రభుత్వం రైతుల నుండీ అడ్డగోలుగా భూములు గుంజుకోవడానికి లేదని చెప్పడానికి. భూమి ప్రభుత్వానిది అనే పేరున, రైతుల నుండీ, ప్రభుత్వ సంస్థల నుండీ భూములు లాక్కుని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికి వీలు లేదు అని గుర్తు చేయడానికి.

Read More
Next Story