జాషువా మానవతావాదం ఇపుడు చాలా అవసరం...
నేడు జాషువా జయంతి
నేడు గుర్రం జాషువా జయంతి
---వడ్డేపల్లి మల్లేశము
రచయితలు, కవులు ,కళాకారులకు ఒక దృక్పథం, అంతకుమించిన ఆశయం, సామాజిక చింతన, లక్ష్య సాధనలో సామాజిక బాధ్యతగా కర్తవ్య నిర్వహణ కొనసాగితే చరిత్రలో వారికంటూ ఓ స్థానం పదిలం గా ఉండడమే కాకుండా ఆ వ్యవస్థకు ప్రజానీకానికి ఎంతో మేలు జరుగుతుంది.
అందుకే పాఠకులు మహా పాఠకులై ఆతర్వాత రచయితలుగా తీర్చిదిద్ద పడాలని తద్వారా మంచి మనసు ఉన్న మనుషుల మధ్య సమాజం నిత్య చైతన్యం గా ఉంటుందని ఆశిస్తూ కవి లోకం పాఠకులను నిత్యం కోరుకుంటుంది. సాహిత్య ప్రయోజనం కూడా అదే.
విలక్షణమైన కవితా శక్తి
కులమతాల గీతలతో తలరాతలను శాశించే కుళ్ళిన సమాజాన్ని దాటి విశాల కవితా సామాజిక జగత్తుకు ఎదిగిన తిరుగు లేని మేటి కవితా వీరుడు , విశ్వనరుడు గుర్రం జాషువా .ఆధునికాంధ్ర కవులలో విలక్షణమైన కవితా శక్తిని సొంతం చేసుకొని సమాజ అభ్యుదయo కోసం అసమాన
తలపై సమరభేరి మ్రోగించిన కవిగా
చిరపరిచితులు.. ఒక కవి గురించి చర్చించుకునే టప్పుడు సమాజానికి అందించిన సందేశం , సామాజిక దృక్పథం ,వ్యక్తిత్వం ఇవన్నీ ఆదర్శం అవుతాయి. ఏ కవి అయినా తన కవితా శిల్పాన్నీ తానే ఎంచుకుంటారు. ఆ శిల్పం స్థాయి, ప్రయోజనాన్ని సమాజం నిర్ణయిస్తుంది. వేమన తీయని తెలుగు పదాలలో జీవిత విలువలను పద్య గుళికలుగా అందిస్తే అదే తోవలో సామాజిక సొంత వేదనల నుంచి, జీవిత సంఘర్షణ నుంచి ఆవిర్భవించిన కవిత్వం అందించిన జాషువాను నిజమైన ప్రజాకవిగా చెప్పుకోవచ్చు. సమాజంలో అంతరాలు ,అసమానతలు ,సంఘర్షణలు, అణచివేత ఉన్నంతకాలం దళితులకే కాదు జనులందరికీ జాషువా పద్యాలు నిరంతరం చైతన్యాన్ని నింపుతూనేవుంటాయి.
జాషువా కవితా ధోరణి
జాషువా కవితాశైలి ఒక సమ్మోహన మైనది. పండిత పామరులను సమానంగా ఆకట్టుకుంటూ పరవశింప చేయగలదు. కళ్ళముందు కదలాడినట్లు పద్యాలు చదువుతుంటే మనోఫలకంపై దర్శనమిస్తాయి. ఆయన కవిత్వంలో సానుభూతి ,కరుణ తో పాటు మానవతా విలువల పరిరక్షణ, మానవ సంబంధాల పునరుద్ధరణ నిండి ఉంటాయి.
ఆనందం, హితోపదేశం ,ప్రతిభ ఆత్మ స్థైర్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఆయన కవిత్వం కొనసాగుతోంది. నిజాయితీ, ఆర్తి, ఆవేశం-ఆవేదన ,ఆలోచన ,ప్రతిఘటన, పరిష్కారం, సామాజిక పరివర్తన జాషువా కవిత్వానికి జీవ లక్షణాలు .అయితే వేదనా భరిత జీవిత అనుభవంతో మానవ జీవితాన్ని వ్యాఖ్యానించి జీవిత విలువలు నొక్కి చెప్పిన కవి గాగుర్రం జాషువాచిరపరిచితులు., ప్రవక్తలు ,దేశభక్తులు, స్వాతంత్ర సమరయోధుల జీవితాలను కావ్యాలుగ మలచి కర్తవ్య బోధ చేసినాడు.
పండిత పామరులను రంజింప చేయడం తో పాటు గబ్బిలం , గిజిగాడు వంటి పక్షుల నోటిద్వారా, వాటి చేష్టల ద్వారా ఎంతో సందేశాన్ని జనానికి అందించారు.
" తేలిక గడ్డిపోచ లనుదెచ్చి రచించెదవీవు
తూగు టు
య్యేల గృహంబు, మానవుల కేరికి సాధ్యముగాదు దానిలో
జాలరు,లందులో జిలుగు శయ్యలు నంతి
పురంబు లొప్పగా మేలుభలే
పులుంగు టెకీ మీడవురా గిజగా డనీడజా!
కుల నిర్మూలనకై తపన పడిన జాషువా:-
కుల వ్యవస్థ ద్వారా అవమానించబడిన గుండె గాయాలే వీరి కవిత్వానికి అండగా రచనల అన్నింటా నిండి ఉన్నాయి. కుల అణచివేత వర్ణవ్యవస్థ కొనసాగుతున్నoతకాలం, అస్పృశ్యత పురివిప్పినoతకాలం ఆ కవి మన గుండె తలుపులు తడుతూనే ఉంటాడు. ఆయన కవిత్వం మానవతా కోణం. కవిత్వం చదివినప్పుడు ఆనాటి సామాజిక స్థితిగతులు మనకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంటాయి .ఇది మహాకవి కుండవలసిన కవితా లక్షణం. వీరి ఆవేదనలు ,ఆందోళనలు జాలు వారగా కురిసిన కవితా ప్రవాహం వలన కరుణ
రసార్ధ్ర కవి కాగలిగాడు. జాషువా కుల నిర్మూలనకై తపన చెందాడు .అందుకే అస్పృశ్యులుగా అవమానాలకు గురైనా
" కులమతాలు గీచుకొన్న గీత ల జొచ్చి
పంజరాన గట్టు పడను నేను
నిఖిల లోక మెట్లు నిర్ణయించిన నాకు
తిరుగులేదు విశ్వనరుడ నేను"
కుల వాదిగా ముద్ర పడకుండా కుల నిర్మూలన లక్ష్యంగా అన్నింటికీ అతీతంగా విశ్వనరుని గా తనకు తాను చాటుకున్న తీరు మహోన్నతమైనది. అస్పృశ్యులుగా అవమానాలకు గురవుతున్న హరిజనులను "గబ్బిలం లో "హృదయవిదారకంగా చిత్రీకరించారు. అరుంధతి సుతుడు తన దీన గాథను గబ్బిలము ద్వారా శివునికి తెలియజేసే ప్రయత్నమే గబ్బిలం కావ్య ఇతివృత్తం. జాషువా లోతైన అవగాహన ఉన్న కవి. సాంస్కృతిక ,సామాజిక జీవనాన్ని ప్రకృతి తో పోల్చి చెప్పిన కవి. కులాలకు అతీతంగా వినగలిగిన శ్రావ్యత గల ఆయన కవిత్వానికి పునాది ఆత్మ గౌరవం. వేద వ్యాసుడు నాలుగు వర్ణాలను సూచిస్తే మాదిగలు అస్పృశ్యులు పంచములు ఎలా అవుతారని తన పద్యాల ద్వారా కుల వ్యవస్థలోని అసంబద్ధత ను నిలదీసి నాడు జాషువా.
జాషువా జీవితం
1895 సెప్టెంబరు 28 వ తేదీన గుంటూరు జిల్లా వినుకొండ లో ఒక పేద అంటరాని కులంలో జన్మించినాడు. అందుకే చిన్ననాడు చాలా అవమానాల పాలు అయినాడు .కుల వ్యవస్థ బలంగా ఉన్న కారణంగా ఉపాధ్యాయులుగా జీవితం ప్రారంభించి తెలుగు పండితుడిగా పనిచేసి ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో ప్రొడ్యూసర్గా ఉద్యోగం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులుగా కూడా పనిచేసిన వీరు
అనేక పదవులు నిర్వహించి ఉన్నత స్థాయిలో జీవించినట్లే కవితా రంగంలోనూ సాహిత్యము ను సొంతం చేసుకొని ఆధునిక వర్తమాన కవులు అందరికీ స్ఫూర్తిగా నిలిచారు.
జాషువా గారిని భారత ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో సత్కరించగా
ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో సన్మానించిన ది. తన ప్రతిభ ద్వారా రచనా రంగంలో వినూత్న మార్పులు తీసుకురావడం ద్వారా కవికోకిల, నవయుగ కవితా చక్రవర్తి, కవితా విశారద, మధుర శ్రీనాథ వంటి బిరుదులు పొందాడు. కనకాభిషేకం ,గండపెండేరము వంటి సత్కారములతో తన ప్రతిభను జగతికి చాటినాడు.
( ఈ వ్యాసకర్త సా.రా.విశ్లేషకులు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు హుస్నాబాద్ జి.సిద్దిపేట)
Next Story