
తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి
ఎన్నికల హామీలకు చట్టబద్ధత లేకపోవడమే అసలు సమస్య
ఎన్ని చేస్తున్నా రాజకీయ తప్పిదాల వల్ల సాధారణ ప్రజలలో రేవంత్ ప్రభుత్వం పట్ల ఒక నెగెటివ్ అభిప్రాయం ఏర్పడిందంటున్నారు ‘రైతు స్వరాజ్య వేదిక’ కన్నెగంటి రవి
“నన్ను కోసినా ఒక్క రూపాయి కూడా మీకు వేతనాలు పెంచలేను. మీ డిమాండ్లు తీర్చలేను”
ఇదీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి అన్న మాట. ఎందుకీ పరిస్థితి వచ్చింది ? ఇది బేల తనమా ? నిస్సహాయతా ? ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో చేతులెత్తేసిన రాజకీయ వైఫల్యమా ?
పైగా ఇదే సమావేశంలో “ మీరూ, నేనూ కూడా ప్రజలు ఇచ్చిన జీతాలతో పని చేస్తున్నాం. మనం కేవలం 2 శాతం. మనం అందరం కలసి సంక్షోభాన్ని పరిష్కరించి, 98 శాతం ప్రజలకు సేవ చేయాలి. మీకు మరింత మేలు చేయడానికి , ప్రజలకు అమలు చేస్తున్న ఏ పథకాన్ని ఎత్తేయమంటారు ? మీరే చెప్పండి ? అని కూడా దబాయించారు.
ముఖ్యమంత్రి ఆవేశంగా , ఆక్రోశంగా మాట్లాడినా, ఆయన మాటలు పూర్తిగా తప్పు. ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఎన్నికల సమయంలో ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.
చివరికి ఉద్యోగులకు , ఉపాధ్యాయులకు కూడా హామీలు ఇచ్చారు. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఆయన మీదే ఉంటుంది. నెపాన్ని ఇతరుల మీదికి నెట్టడానికి వీలు లేదు.
మహా అంటే, గత ప్రభుత్వ పాలనా నిర్వాకాలపై, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని పాడు చేసిన వైనంపై ఒక ముఖ్యమంత్రిగా, ఎంతయినా రాజకీయ విమర్శలు ఆయన చేయవచ్చు.
కానీ, సమాజంలో ఒక శ్రేణిగా ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులపై - వాళ్లెంత ప్రజలకు సేవ చేయాల్సిన అధికార చట్రంలో భాగంగా ఉన్నా, మిగిలిన సమాజ సాధారణ ప్రజలతో పోల్చినప్పుడు వారెంత ఆర్ధికంగా మెరుగుగా ఉన్నా, వారిలో కొందరు రోజు వారీ సేవలు అందించడంలో ప్రజలను వేధించుకు తిన్నా, వారిలో కొందరు ప్రజల పట్ల, తమ వృత్తి పట్ల ఎంత బాధ్యతా రహితంగా వ్యవహరించినా, వారు ఎప్పటికీ, రాష్ట్ర ముఖ్య మంత్రితో, రాష్ట్ర క్యాబినెట్ తో సమానం కాలేరు.
సమస్యల పరిష్కారానికి సమాన బాధ్యత తీసుకోలేరు. కాబట్టి, ముఖ్యమంత్రి గారే కొంత ఓపికగా ఆలోచించి, తప్పు ఎక్కడ జరిగిందో గుర్తించాల్సి ఉంది. ఇందులో తాను స్వయంగా చేసిన తప్పులేమిటో కూడా గుర్తించాలి.
ప్రజలను మభ్య పెట్టడానికి , ఎన్నికల సమయంలో ప్రజలకు అట్టహాసంగా, అలవికాని హామీలు ఇవ్వడం అన్ని రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న తప్పుడు పద్ధతే. ఇందులో బీఆర్ఎస్,బిజేపి, కాంగ్రెస్ పార్టీల మధ్య తేడా ఏమీ లేదు .
సాధారణంగా ఎన్నికల నియమావళిలో , రాజకీయ పార్టీలు ఇస్తున్న హామీల అమలుకు, ఆర్ధిక వనరులను ఎలా సమీకరించుకుంటారో ముందుగానే చెప్పాలని నిబంధనలు ఉంటాయి. కానీ, ఈ నిబంధనను ఏ రాజకీయ పార్టీ అసలు పట్టించుకోవడం. ఎలక్షన్ కమిషన్ కూడా దీనిపై రాజకీయ పార్టీలను ఒత్తిడి చేయదు.
2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే రైతు స్వరాజ్య వేదిక గా మేము, ఆనాడు రాజకీయ పార్టీలు వ్యవసాయ రంగానికి సంబంధించి ఇచ్చిన హామీలపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి, ఆ హామీల అమలుకు ఆర్ధిక వనరులు ఎలా సమకూర్చుకుంటారో ముందుగానే చెప్పాలని కోరాము.
ఎలక్షన్ కమిషన్ అన్ని రాజకీయ పార్టీలకు నోటీసులు పంపింది. ఆయా రాజకీయ పార్టీలు ఇచ్చిన జవాబులు చూస్తే మాకు ఆశ్చర్యం వేసింది. “ మాకు హామీల అమలుకు తగిన ప్రణాళికలు ఉన్నాయని” ఒక పార్టీ జవాబు చెపితే, “ఆర్ధిక వనరులు సమకూర్చుకోగలమన్న నమ్మకం మాకుంది “ అని మరో పార్టీ జవాబు ఇచ్చింది.
చివరికి అధికారం లోకి వచ్చిన BRS పార్టీ , మేము ఊహించినట్లుగానే, ఎన్నికలలో తాను ఇచ్చిన అనేక ప్రధాన హామీలను అమలు చేయలేక పోయింది. ముఖ్యంగా రైతులకు లక్ష రూపాయల ఋణమాఫీ విషయంలో తన హామీని నిలబెట్టుకోలేకపోయింది.
2018 లో కూడా BRS పార్టీ ఇచ్చిన రైతులకు ఋణమాఫీ హామీని అమలు చేయలేకపోయింది. దళిత బంధు హామీని కూడా పూర్తి స్థాయిలో కాదు కదా, కనీసం గా కూడా అమలు చేయలేకపోయింది.
బీజేపీ పార్టీ కూడా కేంద్రంలో ఇచ్చిన అనేక హామీలను, తాను అధికారంలోకి వచ్చిన రాష్ట్రాలలో అనేక హామీలను అమలు చేయకపోవడం మనం గమనిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగు దేశం పార్టీ ఇచ్చిన అనేక హామీలే అమలు ఇంకా ప్రారంభమే కాకపోవడం మనం చూస్తున్నాం.
అంటే, రాజకీయ పార్టీలు ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా హామీల వర్షాన్ని కరిపించినప్పటికీ, బడ్జెట్ లో నిధుల వరద ఎక్కడి నుండీ వస్తుంది? ఏ రాష్ట్రానికయినా, నిధుల కొరత ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది.
అవి సహజ వనరులైనా, ఆర్ధిక వనరులైనా, వాటికి ఎప్పుడూ కొన్ని పరిమితులు ఉంటాయి. దానిని రాజకీయ పార్టీలు గుర్తించవు అని మనకు అనిపిస్తుంది. ఆయా పార్టీల మొత్తం సభ్యులకు, కార్యకర్తలకు వనరుల అందుబాటుపై అటువంటి అంచనా ఉంటుందని మనం చెప్పలేం కానీ, ఆయా రాజకీయ పార్టీలలో ఎన్నికల మానిఫెస్టో కమిటీలలో ఉండే సభ్యులకు, ముఖ్యంగా ఆయా కమిటీల బాధ్యులకు, పార్టీ అగ్ర నేతలకు తప్పకుండా ఆర్ధిక వనరుల అందుబాటుపై ఒక అంచనా ఉంటుంది.
అయినా సరే, అలవి కాని, హామీల వర్షం కురిపించడం వెనక ఉన్న లక్ష్యం , ప్రజలను మభ్య పెట్టి, ఓట్లు దండుకోవడమే. ఈ మోసం అన్ని పార్టీలకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేసింది.
విచిత్రం ఏమంటే, అప్పటివరకూ, అధికారంలో ఉండి అనేక హామీలను అమలు చేయకుండా, ప్రజలను మోసం చేసిన రాజకీయ పార్టీ కూడా , తాను ప్రతిపక్షం లోకి రాగానే, అధికార పార్టీ హామీలు అమలు చేయడం లేదని గగ్గోలు పెట్టడం.
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో భారాస పార్టీ ఇప్పుడు పెడుతున్న గగ్గోలు ఈ కోవలోకే వస్తుంది. ఇది పచ్చి హిపోక్రసీ తప్ప మరేమీ కాదు. వీరి గోడవలో నిజాయితీ ఉండదు. నీతి ఉండదు. కేవలం అధికార పార్టీని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా ఈ లొల్లి సాగుతుంది.
నిజానికి, 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్టో కమిటీ ముందు, మా రైతు స్వరాజ్య వేదిక టీం, వ్యవసాయ రంగానికి ఇచ్చిన హామీల అమలు విషయంలో తన వాదన వినిపించింది. ఇప్పుడున్న పరిస్థితులలో, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఉన్న స్థితిలో , రైతులకు 2 లక్షల ఋణ మాఫీ హామీ అమలు చేయడం అసాధ్యమనీ, ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం ఆ హామీ అమలుపై దృష్టి పెట్టి, నిధులన్నీ అందుకే ఖర్చుపెడితే, వ్యవసాయరంగానికి ఇచ్చిన ఇతర హామీల అమలుకు నిధుల కొరత ఏర్పడుతుందనీ చెప్పాం.
పైగా వ్యవసాయం చేసినా, చేయకపోయినా, వ్యవసాయ భూమి ఉన్న రైతులందరికీ పంట రుణాల మాఫీ చేయడం కంటే, వాస్తవ సాగుదారులకు, ముఖ్యంగా అప్పుల సంక్షోభంలో ఉన్న రైతులకు రుణాలు మాఫీ చేస్తే బాగుంటుందని కూడా సూచించాం. కేంద్ర సహకారం లేకుండా, ఒక రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్ నుండీ మొత్తం రైతుల రుణాలను మాఫీ చేయడం అసాధ్యమని కూడా చెప్పాం.
కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా, రాష్ట్రంలో పండే అన్ని పంటలను కనీస మద్ధతు ధరలకు కొనడం కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యం కాదనీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆ హామీ కూడా భవిష్యత్తులో ఇబ్బందులను తెస్తుందనీ తేల్చి చెప్పాం.
ఉన్న నిధులను జాగ్రత్తగా ఎలా ఖర్చు పెడితే బాగుంటుందో మా వైఖరి కూడా స్పష్టంగా చెప్పాం. మీరు రైతులకు వరంగల్ డిక్లరేషన్లో రైతులకు ఇచ్చిన హామీలను పునరాలోచించుకోవాలని కూడా సూచించాం.
కానీ ఆ రోజు ఆ కమిటీ సభ్యులు, బాధ్యులు పార్టీ ఇచ్చిన హామీల నుండీ తాము వెనక్కు వెళ్లలేమని చెప్పి, ముందుకే వెళ్లారు. ఇప్పుడు పరిస్థితిని గమనిస్తే , మేము ఆ రోజు చెప్పిన విషయాలు ఎంత వాస్తవమో స్పష్టంగా అర్థమవుతుంది. ఒక రాజకీయ పార్టీ, కనీస ప్రణాళిక, చర్చ, లేకుండా వ్యవహరిస్తే, ప్రజలకు నష్టమే జరుగుతుందనడానికి ఇదొక ఉదాహరణ.
వివిధ రంగాల సమస్యలపై పదేళ్ళ పాటుఇతరులతో అసలు చర్చించే పనే చేయని, BRS పార్టీ, ఇప్పుడు నీతులు వల్లించడం కూడా దారుణం. కేంద్రంలో ప్రజలకు అనేక హామీలను ఇచ్చి అమలు చేయని బీజేపీ పార్టీ, రాష్ట్రాల నుండీ పన్నుల ఆదాయాలను దండుకుంటూనే, అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కోరిన నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు , హామీల అమలులో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై విమర్శలు చేయడం, కేవలం రాజకీయ క్రీడగానే అర్థం చేసుకోవాలి.
ఎన్నికలలో పాల్గొనే రాజకీయ పార్టీలు, హామీల విషయంలో ఈ రాజకీయ క్రీడను ఆడడానికి ప్రధాన కారణం, ఆ హామీలకు చట్టబద్ధత లేకపోవడమే. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే, ఆ హామీల అమలు కోసం కోర్టును ఆశ్రయించే అధికారం పౌరులకు ఉంటే, రాజకీయ పార్టీలు, హామీలు ఇచ్చే సమయంలోనే ఒళ్లు దగ్గర పెట్టుకుంటాయి.
అమలు సాధ్యమైన హామీలను మాత్రమే ఇస్తాయి. కానీ, మన రాజకీయ వ్యవస్థలో ఉన్న అనేక లోపాల లాగే, మన ఎన్నికల వ్యవస్థలో కూడా ఈ బలహీనతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ పరిస్తితి మారాలంటే, రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలకు చట్టబద్ధత కల్పించడమే మార్గం.
ఇకపోతే, ఇచ్చిన హామీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాధాన్యతలు కూడా చాలా అవసరం. రాష్ట్రానికి ఉన్న నికర పన్నుల ఆదాయం, రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగిన అప్పులకు ఉండే పరిమితులు, కేంద్ర ప్రభుత్వం నుండీ అందే సహాయం, కేంద్ర పన్నులలో వాటా ఆధారంగా వాస్తవ ఆదాయాన్ని లెక్క వేసుకోవాలి.
వీటి నుండీ గ్యారంటీగా ఉండే ఖర్చులు( ఉద్యోగుల జీతాలు, ఉద్యోగుల పెన్షన్ లు, అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులపై అసలు, వడ్డీల చెల్లింపు లు ) తీసేస్తే మిగిలిన ఆదాయం ఎంతో తెలుస్తుంది. మన రాష్ట్రానికి కొత్తగా అప్పులు చేయడానికి ( ఆ అప్పులు ఎందుకు చేస్తున్నామో కూడా స్పష్టత ఉండాలి) ఉన్న అవకాశాలను బేరీజు వేసుకోవాలి. అప్పుడు సంక్షేమ పథకాల అమలు ఖర్చులకు నిధుల కేటాయింపు మొదలవుతుంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ ఇటీవల తన ఉపన్యాసంలో చెప్పిన ప్రకారం, తెలంగాణ రాష్ట్రానికి నెలకు 18,500 కోట్ల ఆదాయం ఉంది. అంటే సంవత్సరానికి 2,22,000 కోట్లు ఆదాయమన్నమాట.
పైగా ఇప్పటికే లక్షన్నర కోట్లకు పైగా కొత్తగా అప్పు చేసింది. ఇందులో సంవత్సరానికి గత బడ్జెట్ పత్రాల ఆధారంగా తప్పని ఖర్చుల అంచనా( ఉద్యోగుల జీతాలు , ఉద్యోగుల పెన్షన్ లు, అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులపై అసలు, వడ్డీల చెల్లింపులు ) 60,000 కోట్ల పైనే ఉంది. ఏ రాష్ట్ర ప్రభుత్వమయినా వీటిని చెల్లించడానికి ముందుగా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. మనం కాదనలేం.
కానీ గత BRS ప్రభుత్వం ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించకుండా కాలయాపన చేసేది. వారు రిటైర్ అయ్యాక చెల్లించాల్సిన పెన్షన్ లను సంవత్సరాల కొద్దీ పెండింగ్ లో పెట్టేది.
రిటైర్ మెంట్ బెనిఫిట్స్ చెల్లించడానికి డబ్బులు లేకనే, ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58 సంవత్సరాల నుండీ 61 సంవత్సరాలకు పెంచిందనేది కూడా ఆ ప్రభుత్వం పై ఉన్న ఒక విమర్శ.
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను పూర్తి స్థాయిలో చెల్లించడానికి ఇబ్బంది పడుతున్నది.
2023 చివరిలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టే నాటికి గత ప్రభుత్వం చేసిన అప్పులు కూడా 6 లక్షలు దాటి పోయాయి. ఇవి కాక రాష్ట్ర ప్రభుత్వం హామీ పడిన వివిధ కార్పొరేషన్ ల ఋణ బకాయిలు కూడా మరో లక్షన్నర కోట్ల వరకూ ఉన్నాయి.
ఆసుపత్రులకు చెల్లించాల్సిన ఆరోగ్యశ్రీ బకాయిలు, విద్యార్ధుల ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు, నిర్మాణ పనులు చేసిన కాంట్రాక్టర్స్ కు బకాయిలు, అనేక రకాల ఇతర చెల్లింపులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చాయి. వీటన్నిటినీ సరిదిద్దాల్సిన బాధ్యత కూడా ఇప్పటి ప్రభుత్వం పై పడిన మాట నిజం.
గత ప్రభుత్వం అప్పులు చేసి, కొన్ని పథకాలను సకాలంలో అమలు చేసి ఉండవచ్చు కానీ, ఆ ప్రభుత్వ పరిపాలనా తీరు ఇప్పటి ప్రభుత్వం ఎదుర్కుంటున్న ఆర్ధిక సంక్షోభానికి ప్రధాన కారణంగా ఉంది. దాన్ని కాదనలేం. కానీ BRS పార్టీ, ఈ సంక్షోభానికి తన బాధ్యత ఏమీ లేదన్నట్లుగా , ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేయడం మాత్రం హాస్యాస్పదం. అన్యాయం.
BRS పార్టీ చేసింది ఏమంటే, అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయడం, కమిషన్ ల కోసం ప్రాజెక్టులు చేపట్టడం, నిరంకుశంగా ప్రజలను పాలించడం. అందుకే కేవలం రైతు బంధు, ఆసరా పెన్షన్ లు లాంటి సంక్షేమ పథకాల అమలు కోణంలో చూసినప్పుడు, ప్రజలలో రేవంత్ కంటే KCR కు ముఖ్యమంత్రిగా ఎక్కువ మార్కులు పడతాయి .
ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయాల్సి ఉంటుంది ? ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కుని తన ప్రభుత్వ పరిపాలనను సుస్థిరం చేసుకోవడం ఎలా ? ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రాధాన్యతలు నిర్ణయించుకోవడం ఎలా ?
ఇక్కడే అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఉండే రాజకీయ చిత్తశుద్ది, ప్రజల పట్ల బాధ్యత, సుస్థిర అభివృద్ధి పట్ల అవగాహన ఎంత ఉంది అన్నది తేలిపోతుంది. ఏ ప్రజల కోసం ఈ ప్రభుత్వం ప్రధానంగా పని చేస్తుందో అర్థం చేసుకోవడానికి బడ్జెట్ కేటాయింపులలో ఈ ప్రాధాన్యతలు పనికి వస్తాయి.
ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు సరిగా ఉన్నాయా లేవా అన్నది గత 16 నెలల అనుభవం ఇప్పటికే తేల్చిచెప్పింది. ఈ ప్రభుత్వ ప్రాధాన్యతలు సరిగా లేవని మనం స్పష్టంగా చెప్పవచ్చు.
తప్పని సరి ఖర్చులు చేశాక , మొదట చేయాల్సిన పని సమాజంలో ప్రభుత్వ ఆసరా పై జీవించే వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చడం. అంటే ఆసరా పెన్షన్ లను పెంచి చెల్లించడం , కొత్తగా అర్హులైన వారికి ఆసరా పెన్షన్ లు మంజూరు చేయడం. దానిని రెగ్యులగా అమలయ్యేలా విధి విధానాలు రూపొందించడం మొదట చేయాల్సిన పని.
స్కూల్ నుండీ యూనివర్సిటీ వరకూ అన్ని చోట్లా బోధన, బోధనేతర ఖాళీలను నింపడం, ఆయా స్కూల్స్ లో, యూనివర్సిటీలలో మౌలిక వసతులను ప్రాధాన్యతగా చేపట్టి పూర్తి చేయడం, రాష్ట్రంలో 60 లక్షల మంది విద్యార్ధులను తల్లిదండ్రులు ప్రభుత్వ స్కూల్స్ కు పంపేందుకు అవసరమైన విశ్వాసాన్ని పెంచడం రెండవ పని.
రాష్ట్ర వైద్య రంగం లో ప్రజలకు హామీ ఇచ్చినట్లుగా , క్షేత్ర స్థాయిలో, మండల స్థాయిలో ప్రభుత్వ రంగంలో వైద్య సౌకర్యాలను మెరుగు పరచడం, కోట్లాది మంది పేద , మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్యం అందేలా చర్యలు చేపట్టడం మూడవ పని.
మానిఫెస్టో లో హామీ ఇచ్చినట్లుగా, హమాలీలు సహా లక్షల సంఖ్యలో ఉన్న అసంఘటిత రంగ కార్మికుల కోసం సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేయడం, వారికి విశ్వాసాన్ని కల్పించడం నాలగవ పని.
రాష్ట్రంలో అన్ని పేద కుటుంబాలకు రేషన్ కార్డులు ఉండేలా చూడడం. అనర్హుల రేషన్ కార్డులను తొలగించి, రాష్ట్ర బడ్జెట్ పై భారాన్ని తగ్గించడం ఐదవ ప్రాధాన్యతగా, రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వినియోగ దారులకు జీరో బిల్లు ఇవ్వడం మరో ప్రాధాన్యతగా తీసుకోవలసి ఉండింది.
వ్యవసాయ రంగంలో కౌలు, పోడు రైతులు సహా వాస్తవ సాగుదారులను గుర్తించి, ఏడున్నర ఎకరాలకు పరిమితమై రైతు భరోసా అందించడం , వ్యవసాయ కూలీలను, భూమి లేని కౌలు రైతులను కూడా రైతు భీమా పరిధిలోకి తీసుకు వచ్చి, ఆయా కుటుంబాలకు భరోసా ఇవ్వడం తరువాత ప్రాధాన్యతగా తీసుకోవాల్సి ఉండింది.
దళితుల, ఆదివాసీల, మైనారిటీల, బీసీ ఉపకులాల సబ్ ప్లాన్ లలో పై అంశాలు కవర్ కాని కొన్ని ముఖ్యమైన అంశాలపై దృష్టి సారిస్తే ఎక్కువ మంది అట్టడుగు వర్గాల ప్రజలకు ఉపయోగం జరిగి ఉండేది.
ఇవన్నీ నిజంగా మొదటి సంవత్సరం నుండీ అమలు చేయడానికి బడ్జెట్ లో నిధులు సరిపోయేవి. ఇవన్నీ, సమాజంలో అత్యధిక ప్రజలలో ప్రభుత్వం పట్ల ఒక సానుకూల దృష్టికి కారణమయ్యేవి. ఈ అంశాలను ఎప్పటి కప్పుడు, పౌర సమాజంతో, ప్రజా సంఘాలతో చర్చించడం ద్వారా, అమలుకు మార్గం సులువు అయ్యేది.
కానీ రేవంత్ ఏం చేశాడు?
BRS పార్టీ విసిరిన ట్రాప్ లో పడి, రైతులకు ఋణమాఫీని ముందస్తుగా నెత్తికి ఎత్తుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి పేరు వచ్చేలా, అది కూడా సరిగా చేయగలిగారా ? లేదు. చివరికి ఒక్క సంవత్సరంలోనే 20,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి, 25 లక్షల మంది రైతులకు ఋణమాఫీ చేసినా కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రాలేదు.
రైతులలో అసంతృప్తే మిగిలింది ? పైగా రెండు లక్షల పైగా ఉన్న పంట రుణాలను కూడా రెండు లక్షల వరకూ ఋణ మాఫీ చేస్తామని చెబుతూ వచ్చి, చివరికి, వారికి ఋణ మాఫీ చేయలేమని అసెంబ్లీ సాక్షిగా చేతులు ఎత్తేయడంతో, అ క్యాటగిరీ రైతులలో కూడా అసంతృప్తే మిగిలింది.
ఈ ఋణమాఫీ కోసం HCU భూములను బ్యాంకుల ధగ్గరా తాకట్టు పెట్టి, 10,000 కోట్లు రుణం తెచ్చారు. TGIIC ద్వారా భూములు అమ్మి, ఆ రుణం తీర్చాలని అనుకున్నారు. కానీ విద్యార్ధుల, పౌర సమాజ ఆందోళనతో ఆ భూముల అమ్మకం ప్రణాళికా బెడిసి కొట్టింది .
2024 ఖరీఫ్ లో రైతు భరోసా అసలు చెల్లించలేక పోయారు. చివరికి 2024-2025 రబీ లో రైతు భరోసా పథకం అమలు చేసినా, హామీ ఇచ్చినట్లుగా సీజన్ కు 7,500 కాకుండా కేవలం 6,000 రూపాయలు మాత్రమే సహాయంగా అందిస్తున్నారు.
అది కూడా జిల్లాలలో సాగిన ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చినట్లుగా రైతు భరోసా సహాయాన్ని, పది ఎకరాలకు పరిమితం చేయకుండా, మొత్తం సాగు యోగ్యమైన భూములకు రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ, నిధుల కొరత వల్ల, ఇప్పటి వరకూ , కేవలం 4 ఎకరాల వరకూ కూడా రైతు భరోసా సహాయం అందించలేక పోతున్నారు.
వీటన్నిటికీ కారణం ఏమిటి? రాష్ట్ర ప్రజల ప్రాధాన్యతలు నిర్ణయించుకోకుండా , ముందుగా రైతులలో ఒక భాగానికి మాత్రమే ఊరట నిచ్చే ఋణ మాఫీ హామీ అమలుకు పూనుకోవడం. ఈ ప్రక్రియ మిగిలిన హామీల అమలుకు పెద్ద ఆటంకంగా మారింది.
పాత ప్రభుత్వం చేసిన రుణాలపై వడ్డీ చెల్లింపు కూడా ఈ ప్రభుత్వానికి భారంగానే మారినా, ఈ విషయాలపై ప్రజలకు విషయాలు వివరించి చెప్పడానికి పూనుకోకుండా, వారిని విశ్వాసం లోకి తీసుకుని ముందుకు వెళ్ళకుండా తన దారిలో తాను అభివృద్ధి నమూనాను డిజైన్ చేసుకుని ముందుకు వెళ్లారు. తాను ఇప్పటి వరకూ నడిచిన దారి, ప్రజలకు, రాష్ట్రానికి, స్వయంగా కాంగ్రెస్ పార్టీకి ఆత్మహత్యా సదృశ్యమైనది.
హామీ ఇచ్చిన విధంగా, రేషన్ కార్డులు సకాలంలో ఇవ్వక పోవడం, ఆసరా పెన్షన్ లు పెంచి ఇవ్వక పోవడం , కొత్తవి ఇవ్వక పోవడం, రైతులకు రైతు భరోసా సహాయం వేగంగా అందించ లేక పోవడం, కౌలు రైతులను గుర్తించక పోవడం, వ్యవసాయ కూలీలకు రైతు బీమా విస్తరించక పోవడం లాంటి ఆర్ధిక విషయల హామీల అమలులో వైఫల్యంతో పాటు, మూసీ ప్రక్షాళన పేరుతో, మూసీ పునరుజ్జీవనం పేరుతో, సరైన ప్రణాళిక లేకుండా, పేదల ఇళ్ల మీదికి బుల్డోజర్లు పంపి కూలగొట్టడం, పర్యావరణ వేత్తలు మొత్తుకుంటున్నా, వికారాబాద్ జిల్లాలో దామగుండం అడవిని నావీ రాడార్ స్టేషన్ కోసం కేంద్ర ప్రభుత్వానికి రాసి ఇవ్వడం, ఫార్మా విలేజ్ పేరుతో లగచర్ల లో అడ్డ గోలుగా భూసేకరణకు పూనుకోవడం, రద్ధు చేస్తానన్న ఫార్మా సిటీ ప్రాంతంలో రైతుల అభీష్టానికి భిన్నంగా , రైతుల పొలాల చుట్టూ కంచెలు వేయడం, రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, స్కై రోడ్లు, లాంటి వాటికి విపరీత ప్రాధాన్యం ఇవ్వడం, HCU విషయంలో పూర్తి స్థాయిలో పరిణామాలు ఊహించకుండా, భూముల అమ్మకాలకు పూనుకోవడం, ఇచ్చిన హామీ మేరకు, RTC లో యూనియన్లను పునరుద్ధరించకుండా కాలయాపన చేయడం, పాతబస్తీ విద్యుత్ బిల్లుల వసూలును ఆదానీ కంపనీకి ఇవ్వాలన్న ఒప్పందం చేసుకోవడం, కాళేశ్వరం లో జరిగిన తప్పులపై నివేదిక రాకుండానే, ఆ ప్రాజెక్టు కాంట్రాక్టర్ తో సఖ్యత పెంచుకుని, తిరిగి వాళ్ళ సంస్థ తోనే, RTC లో విద్యుత్ బస్సుల కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం, ఉద్యోగులతో, ఉపాధ్యాయులతో చర్చించడానికి తగిన సమయం ఇవ్వకపోవడం, ఫ్యూచర్ సిటీ పేరుతో వేలాది ఎకరాల రైతుల భూములను లాక్కోవడానికి పూనుకోవడం , రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగా లేకున్నా , రాష్ట్రంలో ప్రపంచ స్థాయి అందాల పోటీలు నిర్వహించడానికి పూనుకోవడం, రాష్ట్ర మహిళల స్థితిగతులపై ఒక్కసారి కూడా రాష్ట్రంలో మహిళా సంఘాలతో చర్చించడానికి సమయం ఇవ్వక పోవడం, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడిన ముస్లిం ప్రజల గొంతు వినడానికి తగిన సమయం ఇవ్వకపోవడం,గత ప్రభుత్వం ప్రజా సంఘాల నాయకులపై, మేధావులపై పెట్టిన అక్రమ కేసులను సమీక్షిస్తామని చెప్పినా, అందుకు పూనుకోకపోవడం, రాష్ట్రంలో మద్యం బెల్టు షాపులను రద్ధు చేస్తానన్న హామీ మర్చిపోయి, రాష్ట్ర మంతా మద్య ప్రవాహాన్ని మరింత పెంచడం, ఎక్సైజ్ ఆదాయం కోసం మరింతగా అర్రులు చాచడం, ఇవన్నీ రేవంత్ ప్రభుత్వం చేసిన రాజకీయ తప్పిదాలు.
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినా, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నా, 200 యూనిట్ల వరకూ ఉచిత గృహ విద్యుత్ సరఫరా చేస్తున్నా, రైతులకు సన్న ధాన్యం పై క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లించినా, రాష్ట్రంలో కుల గణన చేసినా, బీసీలకు రిజర్వేషన్ లు పెంచుతూ అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపినా, ఎస్సీ రిజర్వేషన్ ల వర్గీకరణ కోసం చట్టం చేసినా, పైన చెప్పిన రాజకీయ తప్పిదాల వల్ల, సాధారణ ప్రజలలో రేవంత్ ప్రభుత్వం పట్ల ఒక నెగెటివ్ అభిప్రాయం ఏర్పడింది. ఈ వ్యతిరేకతకు భౌతిక రూపం ఇవ్వడానికి BRS, బిజేపి పార్టీలు ఎలాగూ ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడదే జరుగుతుంది.
ఇప్పటికైనా రేవంత్ , హామీల ఆమలు లో ప్రాధాన్యతలు నిర్ణయించుకోకుండా, ప్రజా సంఘాలతో, పౌర సమాజంతో చర్చించి, సమస్యల పరిష్కారానికి సరైన దారులు వెతకకుండా, ఇలాగే రాజకీయ తప్పిదాలు చేసుకుంటూ పోతే భవిష్యత్తులో మరింత నష్టమే తప్ప రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రానికి, కాంగ్రెస్ పార్టీకి లాభం ఉండదు.
Next Story