
నేడే మే డే: ఎనిమిది గంటల పనిదినం ఎందుకో తెలుసా?
మేడే లో శ్రామికుల మానసిక, శారీరక ఆరోగ్యం రహస్యం దాక్కుని ఉంది. దానిని కొల్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
-పి.ప్రసాద్
నేడు 139వ మేడే! ఈ సందర్బంగా కార్మిక సంఘాల, శ్రామికవర్గ సంస్థల ఆర్గనైజర్లకు, కార్యకర్తలకు ఓ విజ్ఞప్తి చేయాలని అనిపించింది.
పెట్టుబడిదారీ వర్గ ప్రయోజనాల కోసం, ముఖ్యంగా భారతదేశ ఆర్ధిక, రాజకీయ, సాంఘిక వ్యవస్థల్ని శాసించే స్థాయికి చేరిన కార్పొరేట్ వ్యవస్థ కోసం కార్మికవర్గం పై నాలుగు లేబర్ కోడ్లతో తీవ్ర దాడికి దిగబోతున్న కాలమిది. ఆఖరికి ఎనిమిది గంటల పని దినం మీద కూడా ఓ క్రూరదాడికి దిగనున్న కాలమిది. మన బలగం పెంచుకునే వ్యూహాలు రూపొందించుకునే కాలమిది. మున్ముందు మన భుజస్కాందాలపై బరువు బాధ్యతలు చాలా వున్నాయి.
యాంత్రిక పని పద్ధతుల వల్ల, మన సాంప్రదాయ రాజకీయ భాష వల్ల, మేడే అమర సందేశాన్ని శ్రామిక జనం వద్దకు ఒకవేళ శక్తివంతంగా మనం తీసుకెళ్లలేక పోయిఉంటే ఆ నష్టం తిరిగి రాదు. గతించిన కాలం తిరిగి రాదు. అలా కోల్పోయిన నష్టాలను గూర్చి ఆలోచించడం వల్ల ఫలితం లేదు. రానున్న కాలాన్ని సద్వినియోగం చేసుకుందాం.
ప్రధానంగా ఎనిమిది గంటల పని దినం కోసం సాగిన పోరాట ఫలితమే మేడేగా చెప్పడంలో నిజం వుంది. కానీ అది కేవలం పని గంటల కోసం సాగిన పోరాట ఫలితమని చెబితే న్యాయం కాదు. ఒకవేళ అలా చెబితే, ఆ పోరాటానికి నాయకత్వం వహించి ఉరికంభం ఎక్కిన మేడే యోధులకు న్యాయం చేయలేము.
రోజులో ఉండేది ఇరవై నాలుగు గంటలు కదా! ఎనిమిది గంటల వరకు పరిమితమై నాటి మేడే యోధ కార్మికవర్గం మాట్లాడలేదు. మిగిలిన 16 గంటల గూర్చి కూడా ఆ త్యాగధనులు గొంతెత్తి మాట్లాడారు. వాళ్ళు బూర్జువా కోర్టుల్లో సాగే బూటకపు విచారణలో కూడా మరో 16 గంటల గూర్చి కూడా గళం విప్పి గర్జించారు. ఉరితీయబడ్డ నాటి మేడే అమర వీరుల శిరస్సులు ఉరికంభం పై వినిపించిన ఆఖరి మాటల్ని మరువవద్దు. 24 గంటల సమయాన్ని మూడు సమ భాగాలుగా పంపిణీ చేసే ప్రాతిపదికన మాత్రమే వారు ఎనిమిది గంటల పని దినం గూర్చి మాట్లాడారని మనం మరిచిపోరాదు. వాళ్ళ అమరవాణిని విస్మరించే హక్కు మనకు లేదు.
విశ్రాంతి కోసం ఎనిమిది గంటలు, వినోదం కోసం ఎనిమిది గంటలు, పని కోసం ఎనిమిది గంటలు విభజన జరగాలని వాళ్ళు నినదించారు. వాళ్ళు దినవిభజన చేశారు. విశ్రాంతిదినం, వినోదదినం, పనిదినంగా విభజించారు. నాడు చికాగో, డెట్రాయిట్, ఫిలడెలిఫీయా వీధుల్లో లక్షల కార్మికుల గొంతులు ఈ నినాదాల్ని ఇచ్చారు. మిగిలిన రెండు దినాలు లేకుండా ఒక్క పనిదినం ఉండడానికి అవకాశం లేదు.
ప్రకృతి పరంగా మనిషి నిద్రకు ఎనిమిది గంటలు విధిగా అవసరం.
నాగరిక సమాజంలో మనిషికి కుటుంబాలతో వినోదంగా గడపడానికి మరో ఎనిమిది గంటలు కూడా అవసరమే
పెట్టుబడిదారీ వర్గం కోసం పని చేయడానికి ఎనిమిది గంటలు అవసరం.
మొదటిది, శారీరకంగా ఆరోగ్యాంగా జీవించడం కోసం.
రెండవది, మానసికంగా, వైజ్ఞానికంగా, ఆనందంగా, ఆహ్లాదంగా జీవించడం కోసం.
మూడవది పొట్ట పోషణ కోసం.
మనిషి, పశువు ఒకటి కాదు. అడవి జంతువు పుష్కళంగా నిద్రిస్తాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ శ్రామికుల్ని ఎనిమిది గంటలు కాదు కదా, ఐదారు గంటలు కూడా నిద్రపోనివ్వలేదు. నాడు మొదటి ఎనిమిది గంటల నిద్రే పోనివ్వని వ్యవస్థ, రెండవ రకం ఎనిమిది గంటలకు అనుమతి ఎందుకు ఇస్తుంది? ఆ దుర్భర పరిస్థితులలో మేడే పోరాటం తలెత్తి ఎనిమిది గంటల పని దినాన్ని సాధించింది.
ఎనిమిది గంటల పని దినం అమలు జరిగితే, అది దానికే పరిమితం కాదు. ఎనిమిది గంటల నిద్రాదినం, ఎనిమిది గంటల వినోదదినం కూడా ఆటోమేటిక్ గా అమలు జరగడానికి ప్రాతిపదిక వున్నట్లే!
రోజుకు ఎనిమిది గంటల పనిదినం హక్కుతో పాటు వారానికో రోజు శేలవు దినం హక్కు కూడా మేడే పోరాట ఫలితమే. వాటికి నేడు ప్రమాదం ఏర్పడింది.
వారానికి 72 గంటల పని చేయాలని ఒక కార్పొరేట్ ప్రతినిధి వాగుతాడు. మరో కార్పొరేట్ కంపెనీ ప్రతినిధి 90 గంటల పని చేయాలని కూస్తాడు.
నిజానికి గత తరాల శ్రామికవర్గ శ్రమశక్తి ఫలితం నుండి కనుగొన్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన ఫలితాలు నేటి తరం శ్రామికవర్గానికి దక్కాల్సి వుంది. కానీ గతంలో శారీరక శ్రమ భారాన్ని తగ్గించిన యాంత్రీకరణ, ఆధునికీకరణల ఫలితం శారీరక శ్రామికవర్గానికి దక్కనివ్వలేదు. నేడు కృత్రిమ మేధ (AI) తో తగ్గించనున్న మేధోశ్రమ ఫలితం మేధో ఉద్యోగ వర్గాలకు దక్కనివ్వడం లేదు. వాటి వెలుగులో నిజానికి జీతాభత్యాల పై ప్రభావం పడకుండా, పని గంటలు తగ్గించాల్సిన ఆవశ్యకత వుంది. ఐనా పని గంటల్ని పెంచడానికి పెట్టుబడిదారీ వర్గం కొత్త దాడికి దిగబోతోంది.
పనిగంటలు పెరిగితే, మిగిలిన రెండు దినాల వ్యవధి తగ్గుతుంది. నిద్ర తగ్గితే ఆరోగ్యం దెబ్బ తింటుంది. వినోదదినం తగ్గితే కుటుంబంతో గడిపే సావకాశాన్ని కార్మికవర్గం కోల్పోతుంది. అంటే పిల్లలతో గడిపే కాలాన్ని కోత పెట్టాలి. ఇరుగు పొరుగుతో గడిపే కాలంలో కోత పెట్టాలి. ఇంట్లో గడిపే కాలంలో కోత పెట్టాలి. ఇంటి పనుల్లో సహకరించే కాలంలో కోత పెట్టాలి. దిన పత్రికల చదువు కోసం, టీవీల వీక్షణ కోసం వినియోగించే కాలంలో కోత పెట్టాలి. ఆచరణలో అదో మానసిక ఆస్థిరతకు దారితీస్తుంది. శ్రామికవర్గ కుటుంబాలు మానసిక సంక్షోభంలో చిక్కుతాయి. వారిని శారీరక, మానసిక వ్యాధులు చుట్టుముట్టి తీవ్ర సాంఘిక కల్లోలాన్ని సృష్టిస్తాయి.
ఈ వాస్తవ పరిస్థితుల్ని మన కార్మిక సంస్థల కార్యకర్తలు, ఆర్గనైజర్లు కార్మికవర్గానికి సరళంగా అర్ధమయ్యే భాషలో మేడే సందర్బంగా వివరిద్దాం. కార్మికుల భార్యాబిడ్డల్ని కూడా ఆలోచింపజేసే భాషలో మాట్లాడదాం. వారినే కాకుండా మనం పౌర సమాజాన్ని కూడా ఆలోచింపజేసే విధంగా మాట్లాడదాం.
ఈ మేడే సందర్బంగా వివిధ కార్మిక సంఘాలు వివిధ పిలుపుల్ని ఇచ్చి ఉండొచ్చు. దాదాపు అన్ని కార్మిక సంస్థలు లేబర్ కోడ్ల వ్యతిరేక పిలుపు ఇచ్చాయి. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, స్కీం తదితర వర్గాల సర్వీసుల క్రమబద్దీకరణ, ఇంకా ప్రైవేటీకరణ వ్యతిరేక పిలుపులు ఏవైనా ఇచ్చి ఉండొచ్చు. ఈ అన్నింటా పూసల్లో దారంలా బడా కార్పొరేట్ వ్యవస్థ శ్రమశక్తిని మరింత కొల్లగొట్టే లక్ష్యంతో పని గంటల్ని కోత పెట్టనుంది. ఈ ప్రమాదం తీవ్రంగా ముంచుకోచ్చే కాలంలో మేడే పోరాట లక్ష్యాలను మనం సరిగ్గా అర్ధం చేసుకుందాం. మనం అర్ధం చేసుకున్న భావాన్ని శ్రామిక వర్గానికి తేలిగ్గా అర్ధమయ్యేలా భాషలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తద్వారానే భావాల్ని భౌతిక శక్తిగా మార్చగలం. ఈ మేడే నుండే ప్రారంభిద్దాం.
(పి. ప్రసాద్, ఐఎఫ్ టి యు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు)