
బెట్టింగ్ యాప్ ... డబ్బు ఆశ చూపి విసిరిన ‘ట్రాప్’....
ఆన్ లైన్ గాంబ్లింగ్, బెట్టింగ్ యాప్స్ మీద స్పెషల్ స్టోరీ
-వెలది కృష్ణ కుమార్
"డబ్బులు ఎవరికి ఊరికే రావు" తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడంలో భాగంగా నైనా ఆ ప్రకటన కర్త చెప్పేది మాత్రం నిజం. దానికి పూర్తి విరుద్ధంగా బెట్టింగ్ చేయండి కోట్లు కొలగొట్టండనే ప్రకటనలు కోకొల్లలుగా దర్శనమిస్తున్నాయి. సినిమా నటులు, సోషల్ మీడియా ఇన్ఫులెల్సర్లు ప్రమోట్ చేస్తున్న ఈ బెట్టింగ్, గేమ్ యాప్స్ యమపాశాలుగా మారి సామాన్యుల జీవితాలను పిండిపిప్పిచేసి పైలోకానికి తీసుకెళుతున్నాయి.పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత జోడించి డబ్బుల కోసం ఆశగా ఎదురు చూసేవారే లక్ష్యంగా వలవేసి మరీ పట్టుకుంటున్నాయి ఈ బెట్టింగ్ యాప్ లు. ఈజీగా డబ్బు సంపాదించాలని ఒకరు, ఆర్థిక సమస్యలతో మరొకరు, బెట్టింగ్ మత్తులో చిక్కుకొని సమిధలవుతున్నారు.అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అప్పుల ఊబి నుంచి బైటపడలేక తనకుతాను ఉరితాడు బిగించుకునేవారు కొందరైతే , అభశుభం తెలియని భార్యా బిడ్డల జీవితాలను కూడా తనతో పాటు చిదిమేసే వారు మరికొందరు. ఏదైనా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో బెట్టింగ్ యాప్స్ పై విపరీతమైన చర్చ నడుస్తోంది.
హైదరాబాద్ కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి తరుణ్ రెడ్డి, ఉరవకొండకు చెందిన ప్రైవేటు ఉద్యోగి కిషోర్ కుమార్... పేర్లు ఏమైనా ఇలా పదులు కాదు వందల సంఖ్యలో మధ్యతరగతి యువత ఆత్మహత్యలు చేసుకుంటుండటం వెనుక బెట్టింగ్ మాఫియా కారణమన్నది విస్తుగొలుపుతున్న వాస్తవం.డబ్బు ఆశ చూపించి బెట్టంగ్ ఊబిలోకి దించి బయటకు రాలేని పరిస్థితులు కల్పిస్తుండటంతో ముఖ్యంగా యువత తమ ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు.తమ కుటుంబాలను నడిబజారు పాలు చేస్తున్నారు.బెట్టింగ్ యాప్స్ కు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలే టార్గెట్ అవుతున్నారు.గడచిన సంవత్సరంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలో వెయ్యిమంది వరకూ ఆత్మహత్యలు చేసుకున్నారని పోలీసులు ప్రకటించడం చూస్తుంటే పరిస్థితి ఎంత తీవ్రంగా వుందో అర్థమవుతుంది.ఒకవైపు పోలీసులు బెట్టింగ్ మాఫియా లక్ష్యంగా కేసులతో చర్యలకు ఉపక్రమిస్తున్నా, లెక్కచేయకుండా ఐపీఎల్ సీజన్ కూడా ప్రారంభమవడంతో కొత్త బెట్టింగ్ యాప్ లు తీసుకొస్తున్నారు. ప్రమోటర్లపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నా, అసలు నిర్వాహకులు మాత్రం అంతుచిక్కడం లేదు.
అసలు ఏంటీ బెట్టింగ్ యాప్ లు..వాటి జోలికి వెళితే ఏమవుతుంది?
క్రికెట్ , మరేదైనా గేమ్ ప్రత్యక్షంగా మన ముందు జరిగే పోరులో ఏ జట్టు గెలుస్తుందో, ఏ జట్టు ఓడుతుందో, జట్టు సామర్థ్యం పై ఆధార పడుతుంది. వీటిపై బెట్టింగ్ కూడా సాగినా, బెట్టింగ్ యాప్స్ విషయానికి వస్తే ఒరిజినల్ గేమ్స్ కంటే వర్చువల్ గేమ్స్ దందా ఎక్కువుగా నడుస్తుంది.వర్చువల్ గేమ్స్‌లో మాత్రం గెలుపోటములను కొందరు వ్యక్తులు ప్రపంచంలో ఏమూలో కూచుని ప్రభావితం చేస్తారు. రమ్మీ, 7అప్ 7 డౌన్, తీన్‌పతి, అందర్ బహార్, పూల్ రమ్మీ, ఏకే 47, డ్రాగన్ అండ టైగర్, పప్పు, విన్ డ్రాప్ ఇలా మన మొబైల్ ఆన్ చేస్తే సరి సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ల ద్వారా మనకు దర్శనమిచ్చేవే. ఆటోమేటిక్ గా మన వేలు దానిపైకి వెళ్లిపోతుంది.ఇవే ఆశలు రేకెత్తించి ప్రాణాలను హరించే ప్రమాదకరమైన యాప్ లు. ఈ వర్చువల్ గేమ్స్ , బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులకు ఎక్కువ లాభాలు తెచ్చిపెడతాయి.మొత్తం గ్యాంబ్లింగ్ వేలు పెట్టామో అంతే కూరుకు పోవడమే. ఈ యాప్స్ ఎవరు ఆపరేట్ చేస్తున్నారో, ఎక్కడి నుంచి చేస్తున్నారో కూడా తెలవదు. ముందు ఫ్రీగా ఆడండంటూ, యాప్ డౌన్లోడ్ చేస్తే ముందు బోనస్ పాయింట్లు వస్తాయంటూ ముగ్గలోకి దింపుతారు. ముందుగా ఫ్రీట్రైల్ కు అవకాశం ఇస్తూ, వ్యసనంగా మార్చి డబ్బులు బెట్టింగ్ పెట్టేలా చేస్తాయి. మొదట్లో కొద్ది మొత్తంలో పెట్టిన బెట్టింగ్ లను గెలిచేలా, చేతికి డబ్బులు వచ్చేలా చేసి, మత్తులో అధిక మొత్తం బెట్టింగ్ చేసే స్థితి కి ఈ యాప్ లు తీసుకు వెళతాయి. అక్కడి నుంచే అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. పోయిన డబ్బుల కోసం మరింత సొమ్ము బెట్టింగ్ చేయడం, ఇలా ఉన్నది పోయి, అప్పులు తెచ్చి ఊబిలో దిగుతారు. అందుకే ఇలాంటి వర్చువల్ గేమ్స్ ఆడితే సొమ్ము పోగొట్టుకోవడమే తప్ప ప్రయోజనం ఉండదు. క్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్, రమ్మీ, క్యాసినో, పోకర్ వంటి గేమ్స్‌లో డబ్బులు పెట్టి ఆడేందుకు వీలుగా బెట్టింగ్ యాప్స్‌ను తయారు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
బెట్టింగ్ యాప్స్ కు చట్టబద్దత వుందా?
బెట్టింగ్ కు సంబంధించి పలు దేశాలు రకరకాల చట్టాలను అమలు చేస్తున్నాయి.20 దేశాల వరకూ క్రికెట్ తో సహా బెట్టింగ్ లపై నిషేధం విధించాయి.అయితే, ఈ నిషేధాలు డిజిటల్ యుగంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లు జూదగాళ్లకు కొత్త మార్గాలను అందిస్తున్నాయి.ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ ,నేపాల్, అరబ్ ఎమిరేట్స్,సౌదీ అరేబియా,ఇరాక్, కువైట్, ఒమన్ ఇలా మెజార్టీ ఇస్లామిక్ దేశాలలో జూదం
ఇస్లామిక్ చట్టం ప్రకారం నిషేధం.
షరియా చట్టం ఆధారంగా ఉన్న దేశ న్యాయ వ్యవస్థ, జూదాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తుంది. దీనికి తీవ్రమైన శిక్షలు విధిస్తారు.
శ్రీలంకలో 1988 నాటి గుర్రపు పందెం, గేమింగ్ , లాటరీలపై బెట్టింగ్ చట్టం దేశంలో జూదం కార్యకలాపాలను నియంత్రిస్తుంది,
నేపాల్‌లో జూదం ఎక్కువగా చట్టవిరుద్ధం, కొన్ని క్యాసినో కార్యకలాపాలకు పరిమిత మినహాయింపులు ఉన్నాయి. ఇక 1946 నుండి, బ్రెజిల్ అన్ని రకాల జూదాలపై నిషేధాన్ని కొనసాగిస్తోంది, వాటిలో స్పోర్ట్స్ బెట్టింగ్ కూడా ఉంది.అర్జెంటీనాలో గుర్రపు పందెం బెట్టింగ్ చట్టబద్ధమైనప్పటికీ, క్రికెట్‌తో సహా ఇతర రకాల క్రీడా బెట్టింగ్‌లు సాధారణంగా పరిమితం చేయబడ్డాయి.ఇక అమెరికా లో స్పోర్ట్స్ బెట్టింగ్ యొక్క చట్టబద్ధత రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటుంది. 2018 సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత కొన్ని రాష్ట్రాలు స్పోర్ట్స్ బెట్టింగ్‌ను చట్టబద్ధం చేసినప్పటికీ, చాలా రాష్ట్రాలు ఇప్పటికీ పరిమితులను కొనసాగిస్తున్నాయి. USలో క్రికెట్ బెట్టింగ్ ఒక ప్రత్యేక మార్కెట్‌గా వుంది .
భారత్ లో పరిస్థితి ఏంటి?
మన దేశంలో బెట్టింగ్ సంబంధిత చట్టాలు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకంగా ఉన్నాయి. పలు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ నేరంగా పరిగణిస్తారు. మరికొన్ని రాష్ట్రాల్లో నియంత్రిత బెట్టింగ్ అమల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన కొన్ని చట్టాలు చేసింది. ఇక ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో పూర్తిగా నిషేధం అమలులో ఉంది. అయితే సిక్కిం గోవా నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లో మాత్రం నియంత్రిత బెట్టింగ్ సేవలు అమలులో ఉన్నాయి.అందుకే అక్రమమార్గంలో డబ్బులు సంపాదించాలనే బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు అవకాశం గా మారుతున్నాయి. అనుమతి వున్న రాష్ట్రాల ఐపీ అడ్రస్ లతో దేశ వ్యాప్తంగా బెట్టింగ్ యాప్ లతో విజృంభిస్తున్నారు. మధ్యతరగతి జీవితాలను కాటేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఆన్లైన్ అక్రమ బెట్టింగ్లను అడ్డుకునేందుకు ఐటీ చట్టం 2000, ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పిఎంఎల్ఏ) నిబంధనల ద్వారా కేసులు నమోదు చేస్తోంది.
ఈ చట్టాల కింద ఆన్లైన్ బెట్టింగ్ అక్రమ జూదం నిర్వహించే వెబ్సైట్లు నడిపే వారికి మూడు సంవత్సరాల జైలు శిక్ష 1,00,000 జరిమానా ఉంటుంది. ఇక ఆన్లైన్లో పాల్గొంటే ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు 50 వేల రూపాయల జరిమానా ఉంటుంది.పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్, 1867 ప్రకారం అక్రమ బెట్టింగ్ నిర్వహణ చేస్తే ఒక నెల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే జరిమానా కూడా ఉంటుంది.
సినీ నటులు ,సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు లపై కేసులు
బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారనే ఆరోపణలతో పలువురు సినీ ప్రముఖులపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. రానా , ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ పై కేసు పెట్టారు పోలీసులు.వీరితోపాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లుగా పేరున్న అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి, వాసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పాండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణు ప్రియ, హర్షసాయి, బయ్యా సన్నీ యాదవ్, శ్యామల, టెస్టీ తేజ, రితూచౌదరి, బండారు శేషయాని సుప్రీతపైనా పోలీసులు కేసులు పెట్టారు.కొందరిని ఇప్పటికే విచారించారు.బెట్టింగ్ యాప్ లను ప్రోత్సహించి అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమవుతున్న వీరిపై చట్టప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చని న్యాయ నిపుణుల తో చర్చిస్తున్నారు.అయితే తెలియక చేశామని కొందరు, డబ్బుకోసం ప్రచారం చేశామని మరికొందరూ తప్పులు ఒప్పుకొని, యాప్ ల బారిన పడవద్దంటూ మళ్లీ ప్రచారం చేస్తున్నారు.
హ్యాష్ టాగ్ ట్రెండ్
అమాయకుల ఆర్థిక ఇబ్బందులకు, ఆత్మహత్యలకు కారణమవుతున్న బెట్టింగ్ యాప్ లకు వ్యతిరేకంగా పెద్ద పోరాటం సాగుతోంది.సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ పిలుపు మేరకు సోషల్ మీడియాలో SayNoToBettingApps #హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతోంది.ఫలానా యాప్‌లో గేమ్ ఆడి డబ్బులు గెలుచుకున్నానంటూ నమ్మించే సోషల్ మీడియా ప్రమోషన్ లపై జాగ్రత్తగా వుండాలని సజ్జనార్ పిలుపునిచ్చారు.ఇలా ప్రమోషన్స్ చేసే యూట్యూబర్ల మాయలో ఫాలోయర్లు పడకూడదంటున్నారు
బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న ఇన్‌ఫ్లూయెన్సర్లను అన్ ఫాలో చేయండి, వారి అకౌంట్లకు రిపోర్టు కొట్టండని సూచించారు.
యాప్స్ పై అవగాహన పెంచాలి. ఏదిమంచో ఏది చెడో అమాయక ప్రజలకు తెలియపరిచి చైతన్యవంతులను చేయాలి. టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో బెట్టింగ్, ఇతర హానికర యాప్ లను పూర్తిగా నిషేధించడం సాధ్యమయ్యే పనికాదు. కొన్ని యాప్ లను గుర్తించి ప్రభుత్వం బ్యాన్ చేసినా , మరోరూపంలో ప్రత్యక్ష మవుతునే వుంటాయి. మధ్యతరగతి ప్రజల అవసరాలను క్యాష్ చేసుకుంటూ, నిలువు దోపిడీ చేసి జీవితాలను చిద్రం చేస్తూనే వుంటాయి. సైబర్ నేరాలను అరికట్టడానికి పోలీసులు ఎన్నిమార్గాలను వెదుకుతున్నారో, అంతకంటే వేగంగా నేరగాళ్లు తమ మెదళ్లకు పదునుపెడుతున్నారు.ఎక్కడో విదేశాలలో కూర్చొని తప్పులు వ్యాపారాన్ని వర్చువల్ గా నిర్వహించే కేటుగాళ్లను కటకటాల వెనక్క పంపడం కూడా అంత సులభ కాదు. ఏదైనా తస్మాత్ జాగ్రత్త .. డబ్బులు ఊరికే రావన్నది మాత్రం నిజం.