
‘ఆధార్’ కు ఎక్కని అనామకులు, ప్రభుత్వానికి పట్టని భారతీయులు
ప్రభుత్వ నిర్లక్ష్యం నీడలో మానసిక వైద్యము – కనిపించని క్లినికల్ సైకాలజీ సేవలు
ఈ రోజు (సెప్టెంబర్ 10) ఆత్మహత్యల నివారణ దినం
ఒకరు చింపిరి జుట్టుతో , పెరిగిన గడ్డముతో, మట్టి , దుమ్ము , చెత్త చెదారంతో చెమట కలిసి, ముక్కు పుటాలు పగిలిపోయే దుర్గంధం...
ఇంకొకరు ఒంటిపై నూలు పోగు లేకుండా, నగ్నంగా ఉంటూ...
కొందరు అర్థ నగ్నంగా ఉంటూ, ఎక్కడో దిక్కులు చూస్తూ , మౌనంగా బిత్తరీ చూపులతో , తమలో తాము మాట్లాడు కుంటూ, తమలో తాము నవ్వు కొంటూ..
వీళ్లు మనకు నిత్యం రోడ్ల మీద ఎక్కడో ఒక దగ్గర తారస పడతారు. కొన్ని సార్లు అకారణంగా కోపముతో అరుస్తూ , బూతులు తిడుతూ, రోడ్డు మీద అడ్డం వచ్చిన వారినందరిని అదిలిస్తూ, కొన్ని సార్లు దాడి చేస్తూ కనిపిస్తారు.
వారి అసాధరణ ప్రవర్తన , రూపం, గమనించి కొందరు వాహన దారులు చాక చక్యంగా వారిని తప్పుకుని పోయేందుకు ప్రయత్నిస్తారు. ఇంకా కొందరు వారిని చూస్తూనే భయంతో బెంబేలెత్తి దూరంగా జరుగుతూ ఉంటారు.
ఇంకా కొందరు, వారిని చూసి , భయంతో , వారి నుండి వచ్చే దుర్గంద వాసన భరించలేక వాంతులు కూడా చేసుకుంటారు.
వీళ్లని మానసిక రోగులని, పిచ్చి వారు అని ఎగతాళిగా చికాకు పడుతు అప్పుడప్పుడు నవ్వుకుంటూ ఉంటాం మనం.
కాని, వీరికి తాము ఎవరో ? తాము ఎక్కడ ఉన్నామో ? తాము ఏమి చేస్తున్నామో ? తన చుట్టు ఏమి జరుగుతూ ఉందో తెలియని స్థితి. ఆధార్ కు ఎక్కని అనామకులు వీళ్లు. ఓటులేదు కాబట్టి పార్టీలు, ప్రభుత్వాలు వీళ్లని పట్టించుకోరు.
ఒక కుక్క ఒకరిని కరిచి చంపి వేసిందని దేశ అత్యున్నత న్యాయస్థానం స్వయంగా( Sumoto) కేసు స్వీకరించి కుక్కలను మొత్తం తొలిగించండి అని ప్రభుత్వాలను ఆదేశించింది. కాని ఇలాంటి వారిని సమాజంగాని,కోర్టు గాని ఎందుకు పట్టిచ్చుకోవడం లేదు. ఎందుకు, అనే సందేహం ఎవరికైనా కలుగుతుంది.
ఒక అగ్ని ప్రమాదం జరిగినప్పుడు గాని, ఒక ఆక్సిడెంట్ జరిగినప్పుడు గాని ఆగమేఘాల మీద స్పందించే పోలీసులు, ఇరుగు పొరుగు, మునిసిపాలిటీ వారు వీరిని ఎందుకు అలా పట్టించ్చుకోక పోవడానికి కారణం ఏమిటి?
ఇది ఇలా ఉండగా, ఇంకొక చోట “ అయ్యా మాది పల్లెటూరు . కులీ నాలి చేసుకునే బతికే బడుగు జీవులం. బడుగు బతుకులు మావి. మాకు ఒక అబ్బాయి ఉన్నాడు. అతను తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. తనలో తాను నవ్వుకుంటున్నాడు. ఎటో చూస్తుంటాడు. అతను అందరినీ అనుమానంగాను, భయంగాను చూస్తుంటాడు. ఎవరో వచ్చి తనను చంపాలని చూస్తున్నారు, అక్కడే ఎవరో ఉన్నారు , ఇక్కడే వీరు ఉన్నారంటూ వింతగా ప్రవర్తిస్తున్నాడు. వీడిని ప్రయివేట్ వైద్య శాలకు తీసుకుని వెళ్ళినాను. ఇతన్ని నెల రోజులు ఆసుపత్రిలో ఉంచాలని అన్నారు. వైద్యానికి రోజుకు రు 5000-6000 ల వరకు ఆసుపత్రి చార్జి అవుతుందని అంటున్నారు. దానితో పాటు ఇతర పరీక్షలకు , వేరే ఆయా ప్రత్యేక వైద్య నిపుణుల ఛార్జీలు కలిపి ఒక లక్ష నుండి రెండు లక్షల ఖర్చు అవుతుందిని చెప్పారు . డబ్బును సమకూర్చుకుని రండీ” అని దీనస్థితిగా దిక్కు తోచక అన్నాడు.
ఇంకొకరు కొంచె మధ్య ఎగువ తరగతి కంటే పై స్తాయిలో గల వ్యక్తి “అయ్యా , ఎంత డబ్బు అయిననూ సరే , మీ ఆసుపత్రిలో చేర్చుకుని వైద్యం చేయండి. మేము వాడిని భరించలేక పోతున్నాము. మేము వృద్దులం అతని వద్ద ఉండే స్థితిలో లేము. ఆసుపత్రి వాళ్ళేమో రోగి వద్ద ఒకరు కచ్చితంగా ఉండాలని అంటున్నారు. ఏమి చేయాలో దోయటం లేదు.” చేతులుడిగి ఏమి చేయలేని నిస్సాహాయస్థితి.
అంతే కాకుండా చాలా మంది చూడటానికి చాలా బాగానే ఉంటారు. చదువు, వృత్తి నైపుణ్యం లాంటివి కూడా మంచిగానే ఉంటారు. కాని ఏదో కారణం చేత కావచ్చు, ఏ కారణం లేకుండా కావచ్చు. ఏదైనా అనుకోని సంఘటనలు అంతే పరీక్ష లో ఫెయిల్ కావచ్చు, తమ దగ్గరి తల్లి, తండ్రి, కొడుకు, భార్య, ప్రేమికులు కావచ్చు, వ్యాపార ములో నష్టం లాంటివి కావచ్చు, అలాంటి వారు కూడా మానసిక వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. ఏ ఆసుపత్రి వద్ద చూసిన ఇలాంటివి కోకొల్లలు. ఒక వరంగల్ పట్టణములోనే సుమారు 20 వరకు ప్రయివేట్ , ఒక ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. ప్రతి ప్రయివేట్ ఆసుపత్రిలో రోజుకు 60 నుండి 70 మంది రోగులు వస్తారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రికి సుమారు 100 నుండి రెండు వందల మంది రోగులు వస్తారు. మొత్తం మీద 1000 నుండి 1500 దాకా రోగులు వస్తారు. ఇందులో 10 నుండి 15 శాతం మందికి తీవ్రమైన మానసిక సమస్యలు ఉన్నాయి. మన దేశంలో గల అన్ని పట్టణాల్లో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది.
ఇలా వివిధ రకాల మానసిక వ్యాధులతో బాద పడేవారు ప్రపంచ వ్యాప్తముగా 109 కోట్ల , 50 లక్షలకు పైగా ఉన్నారు.
భారత దేశామో పరిస్థితి: ఇక మన దేశములో ప్రతి ఐదుగురిలో ఒకరు ఉన్నారు. సుమారు 150 కోట్ల జనాభా గల మన దేశంలో సుమారు 30-40 కోట్ల మంది ఏదో ఒక చిన్న చితక మానసిక సమస్యతో ఉంటారు. ఇందులో డెబ్బది శాతం మందికి కచ్చితంగా వైద్య అవసరం పడుతుంది. పెద్దవారిలో 10.6 శాతం వివిధ రకాల మానసిక వ్యాధులతో బాధ పడుతున్నారు(NMHS 2015-16), గ్రామీణ ప్రాంతములో 6.9 శాతం ఉండగా పట్టణ ప్రాంతములో 13.5 శాతం వరకు ఉంది.
ఇక యుక్త వయస్సు పిల్లలో 11 శాతం మంది ఆందోళన (anxiety) తోను, 14 శాతం మంది ఉద్వేగ సమస్యలు (depression) తోను, 43 శాతం మంది చంచల స్వభావం(mood swings) తోను బాధ పడుతున్నారు, ఈ పరి స్థితి కోవిడ-19 తరువాత ఇంకా ఎక్కువగా అయ్యాయి. మొత్తం మీద మానసిక సమస్యలతో బడా పడే వారిలో 70-90 శాతం వరకు వైద్యం అవసరం.మరియు వారు వైద్య సహాయం పొందలేక పోతున్నారు. వీరిలో ఈ మధ్య క ఆత్మ హత్యలు కూడా పేరుగుతున్నవి.
ఇంతకు మానసిక ఆరోగ్యం అంటే ఏమిటో కొంచెం తెలుకుందాము.
మానసిక ఆరోగ్యం : ఒక వ్యక్తి మానసికంగా(psychological) , సామాజికంగా(sociological), తనలో కలిగే భావోద్వేగాల(emotional) పరంగా సాధారణ స్థితిలో ఉండుటను “మానసిక ఆరోగ్యం” అంటారు. ఇది ఆలోచనలను, ప్రవర్తనలను, అనుభూతులను ప్రభావితం చేస్తుంది.
నిత్య జీవితములో సహజంగా వచ్చే ఇబ్బందులు , ఛాలెంజుల వల్ల వచ్చే ఒత్తిడిని తట్టుకుని వాటిని అదిగమించుటకు తగు నేర్పరి తనంతో, యుక్తిగా ఎత్తుగడలను, వ్యూహాలను పన్నుకుని సక్రమంగా వినియోగించుకునుటకు మానసిక ఆరోగ్యం ఉపకరిస్తుంది.
ఒక వ్యక్తి తాను ఎవరు? ఏమిటి తాను ఏమి చేస్తున్నాడు? తాను ఎవరితో ఉన్నాడు? ఏమి మాట్లాడుతున్నాడో,తాను చేసే పని వల్ల , తన ప్రవర్తన వల్ల కలిగే మంచి, చెడు లాంటి పరిణామాల పట్ల స్పృహ ఉండే మానసిక సమత స్థితి కలిగి ఉండడం.సమాజములోని అందరితో అనగా భార్య పిల్లలతోనూ, తన కుటుంభ సభ్యులతోనూ, బంధు మిత్రులతోను, పని చేసే చోట తన యాజమనితోనూ,తన కింది వారితోనూ, తన సహచరులతోనూ సానుకూల లేదా ఆరోగ్య కరమైన సంబంధాలు కలిగి ఉండడం.
వీటితో పాటు శారీరకంగాను, భౌతికంగాను ఆరోగ్యముగా ఉండడం.
మనం చేసే వృత్తిలోనూ పనిలో నాణ్యత(quality) ,పరిమాణాలు(quantity) స్థాయిలు తగ్గకుండ ఉండడం.
మంచి మానసిక ఆరోగ్యం కలిగిన వ్యక్తి తన గురించి తాను పట్టించ్చుకుని శుచి శుభ్రంగా ఉండడం. తన రోజు వారి విధులు సక్రమంగా నిర్వర్తిస్తాడు . అంతేగాక పని చేసే చోట మరియు ఇతర సామాజిక కార్యక్రమాలలో ప్రతి చోట ఒత్తిడి తట్టుకుని, దానిని సానుకూల భావంతో స్వీకరించి, పనివల్ల ఆనందం, తృప్తి పొంది ఉపశమనం పొందగలడు. సాదారణంగా అన్ని చోట్ల అన్ని వేళల్లో, ఎల్లప్పుడూ అందరి చేత సామాజిక మద్దతు పొందగలదు.
వీటితో పాటు ఆరోగ్య కరమైన అలవాట్లు ఉంటాయి. క్రమం తప్పక నిర్దిష్ట సమయంలో శారీరక వ్యాయామం. తగు పాళ్లలో పోషక విలువలు గల ఆహారం తీ తీసుకుంటాడు. ఇంకా కావాలిసినంత కలతలు, ఇబ్బందులు
లేని ప్రశాంతమైన గాఢ నిద్ర కలిగి సంతృప్తిగా ఉండగలడు.
మానసిక ఆరోగ్యానికి అవరోధాలు :
- మానసిక సమస్యలు ఆందోళన,భయాలు , కుంగుబాటు, మద్యపానం, ధూమపానం, పొగాకు, తంబాకు, గుట్కా ,జర్దా ,కిల్లి నమలడం , సిగరెట్టు చుట్టలు ,బీడీ లాంటి పొగతాగడం. మాదక ద్రవ్యాలు గంజాయి లాంటి వాటికి బానిస అవడం.
- మానసిక రోగం పట్ల. మానశిక వైద్య నిపుణులను కలువడానికి అపోహ (stigma) అడ్డు రావడం. మానసిక వైద్యం పట్ల సదాభిప్రాయం లేక పోవడం.
- మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులోకి లేక పోవడం , వాటిని వినియోగించుకునుటకు ముందుకు రాక పోవడం లాంటి తదితర ఎన్నో కారణాలు ఉన్నాయి.
మానసిక సమస్య గుర్తించడం ఎలా : ఒక వ్యక్తికి ఎప్పుడైనా కనీసం రెండు వారాలుగా తనకు నిద్ర రాక పోవడం , ఆకలి లేక పోవడం, నిరుత్సాహంగా ఉండడం , ఏదో కోల్పోయినట్టు, అన్నింటి పైన కోరిక తగ్గడం, కుంగి పోవడం నిరాశగా , జీవిత మీద విరక్తి గా ఉండడం, తక్కువగా మాట్లాడటం, చనిపోతే బాగుండును అని పదే పదే అనడం, స్నానం చేయక పోవడం, మాసిన గుడ్డతోనే ఉండడం లాంటి లక్షణాలు గత రెండు వారాలుగా కనిపిస్తే అతనికి ఏదో మానశిక సమస్య ఉనట్టు గుర్తించి వైద్య సహాయం తీసుకోవాలి. ఇలాంటి వారు వైద్య నిపుణుని దగ్గరకు రావడానికి ఇష్ట పడరు. ఏలోగో ఒక లాగా ఒప్పించి, అతనికి భరోసా ఇచ్చి తీసుకుని రావాలి. తప్పని సరైన పరిస్థితిలో అతని కుటుంబ సభ్యులు కూడా వెళ్ళి వైద్యుని కలిసి రోగి పరిస్థితి గురించి కులంకషంగా చెప్పి తగిన వైద్య సహాయం పొందవచ్చును.
రోగిని ఎవరి వద్దకు తీసుకు వెళ్ళాలి: రోగి పరిస్థితిని బట్టి అతడు రావడానికి సహకరిస్తే మొదట క్లినికల్ సైకాలజిస్ట్ వద్దకు తీసుకుని వెళ్ళాలి. ఒక వేళ పరిస్థితి తీవ్రంగాను, ఆత్మ హత్య ప్రయత్నాలు, తనకు తాను హాని చేసుకోడం, ఇతరులను హాని చేయడం, ఎవరో ఏమో నన్ను చేస్తున్నారని తీవ్రంగా బయపడటం లాంటి విపరీత లక్షణాలు ఉంటే మాత్రం తప్పనిసరిగా బలవంతంగానైనా మానసిక వైద్యుని వద్దకు తీసుకుని వెళ్ళాలి. అతనితో పాటు ఆ రోగితో కనీసం 15 రోజులు కలిసి ఒక చోటగాని , ఒకే ఇంటిలో గాని, ఒకే గదీలో గాని నిద్రించి , తినిన వారు అయ్యి ఉండాలి. వారితో తల్లి గాని, తండ్రి గాని, పెళ్లి అయితే జీవిత బాగస్వామి గాని ఉంటే చాలా మంచిది. లేదా ఏదైనా వసతి గృహములో ఉండినట్లైతే అతని సహగది మిత్రుడు గాని వెళ్ళాలి. నిపుణుని వద్దకు వెళ్ళే ముందు రోగి ఇంతకు ముందు వాడిన మందుల చిట్టీలు, ఇతర జబ్బుల వివరాలు, సర్జరీ వివరాల, వివిధ డయాగ్నోస్టిక్ రిపోర్టులు కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళాలి.
మానసిక వ్యాదులను సకాలములో గుర్తించక, వివిధ రకాల మూడ నమ్మకాలతో దయ్యం పట్టిందని , ఏదో గాలి, దూళి , ప్రేతాత్మలు లాంటివి పట్టినవి అని భావించి గుళ్ళు, గోపురాలు , చర్చిలు , దర్గాలు , మంత్రాలు తంత్రాలు లాంటి విపరీత నమ్మకాలతో ఎన్నో ప్రయత్నాలు చేసి, ఎన్నో లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి చివరకు ఏమి చేయలేక నిస్సాయంగా వదిలి వేయ బడ్డ వాళ్ళు కొందరైతే , ఇంటిలో నుండి ఎక్కడో వెళ్ళిన వాళ్ళు ఇంకొందరు. ఇలా రోడ్ల మీద చెత్త కుప్పల వద్ద పైన చెప్పిన చెప్పిన విదంగా దయనీయంగా రారసపడుతారు.
మానసిక వైద్య నిపుణులు ఎవరు: ప్రపంచ ఆరోగ్య సంస్థ విధి విధానాల ప్రకారం మానసిక వైద్య నిపుణులు(Psychiatrist ), వైద్య మనో విజ్ఞాన నిపుణులు(clinical psychologist), మరియు మానసిక – సామాజిక కార్య కర్త (psychiatric social worker) లాంటి తదితరుల టీం వర్క్ తో రోగికి చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇందులో మానసిక వైద్య నిపుణులు UGC, ICMR, MCI లాంటివి నిర్దేశించిన విధి విధానాల లోబడి పోస్ట్ గ్రాడ్యూయేట్ డిప్లొమా లేదా పోస్ట్ గ్రాడ్యూయేట్ డిగ్రీని వైద్య కళాశాలలో చదివిన వాురు.ఇక మిగిలిన వైద్య మనో విజ్ఞాన నిపుణులు, మానసిక -సామాజిక నిపుణులు UGC RCI నిర్దేశించిన విధి విధానాలకు లోబడి , RCI చేత గుర్తించ బడిన ప్రత్యేక విద్య సంస్థ,లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా , పోస్ట్ గ్రాడ్యుయేషన్ , ఆపైన MPhil , PhD, Psy. D లాంటి కోర్సులు చదివిన వారు. వీరు చదివిన కళాశాలకు అనుసంధానంగా పలు విభాగాలు (psychiatric hospital, neurology department, pediatric, child development center, de -addiction center , psychiatric Rehab center, geriatric Rehab center, neuro rehab center, family counselling ) లాంటి సెంటర్లు తదితరాలు కలిగి ఉండాలి. వీరు అంత పూర్తి కాలం చదివే కోర్సులు. దూర విద్య విధానంలో అసలు ఉండవు. వీరి చదువు UGC, ICMR, RCI లాంటి నియమ నిబంధనలకు లోబడిన అర్హతలు, అనుభవం కలిగిన సీనియర్ కన్సల్టెంట్ హోదా కలిగిన వారి ప్రత్యక్ష పర్యవేక్షణ(supervising)లో శిక్షణ ఉంటుంది. దానితో పాటు స్వల్ప పరిశోధన (dissertation), డియాగ్నోస్టిక్ కేసు సమర్పణ , therapy కేసు సమర్పణ లాంటితో నిరంతర నాణ్యమైన, పరిమాణమైన శిక్షణ పూర్తి చేసిన వారు.
వైద్య మనో విజ్ఞాన నిపుణుల(clinical psychologists) పాత్ర : వీరు మానసిక వ్యాదుల నిర్దారణ పరీక్షలు చేయడం, సైకో తెరపీ,కౌన్సెలింగ్ లాంటివి చేయుటలో అతి ముక్య పాత్ర పోషిస్తారు. ప్రజ్ఞ లబ్ది (IQ), అందలి వివిధ స్థాయిలు( mild, moderate, severe, profound) వివిధ మానసిక పరీక్షల చేసి నిర్దారణ చేస్తారు. మానసిక జబ్బుల తీవ్రత(intensity) ,ఒక నిర్ధిష్ట సమయ కాల వ్యవధిలో ఎన్ని సార్లు (frequency) , వచ్చి ఎంత కాలం(duration) వరకు ఉంటుంది లాంటివి నిర్ధారణ చేస్తారు. పలు ప్రశ్నల పట్టిక (questionaires /inventories)ల తోను, రోషాక్ ఇంక్ బ్లాక్ ,టాట్, , హ్యూమన్ ఫిగర్ డ్రాయింగ్ టెస్ట్ లాంటి పలు రకాల ప్రక్షేపన(projective) పరీక్షలు ఎన్నో ప్రత్యేక్ష, పరోక్ష పరీక్షలు మరియు శుక్ష్మ పరిశీలనల ద్వారా మూర్తి మత్వ(personality), భయాలు(pbhobias) , ఆందోళన (anxiety ),కుంగుబాటు(depression) , స్కిజోఫ్రెనియా వాటిని నిర్దారణ చేస్తారు వీటితో పాటు చికిత్సకు అవసరమైన తెరపీలను చేస్తారు. శిశువు నుండి వృద్దుల వరకు వచ్చే మానసిక, నరముల జబ్బుల, మాదక ద్రవ్యాలకు బానిసలు అవడం, కుటుంబ సమస్యలు, దంపతుల సమస్యలు లాంటి ఎన్నో మానసిక వ్యాదులను వివిధ పరీక్షల ద్వారా నిర్దారణ చేయడం, కౌన్సెలింగ్ ఇవ్వడం, సైకో తెరపిలు ఇవ్వడం లాంటి కీలక పాత్ర పోషిస్తారు.
కాని క్లినికల్ సైకాలజిస్టుల సంఖ్య అతి తక్కువ ఉన్నందున చాలా చోట్ల క్లినికల్ సైకాలజిస్టులు లేకుండానే డయాగ్నోసిస్ చేసి సదరం సర్టిఫికెట్లు ప్రోఫౌండ్ వాళ్ళకూ మాత్రమే ఇస్తున్నారు. దేని వల్ల మైల్డ్ , మోడరేట్ సివియర్ వాళ్ళు సదరం సర్టిఫికెట్ పొంద లేక పోతున్నారు. తద్వారా ప్రభుత్వం నుండి వచ్చే పెన్షన్ లాంటి సహాయ సదుపాయాలకు దూరం అవుతున్నారు. ఇలా డయాగ్నోసిస్RCI గుర్తింపు లేని వారు ఇవ్వడం మెంటల్ హెల్త్ చట్టము ప్రకారం చట్ట విరుద్దము మరియు శిక్షించదగిన నేరం. కాని ప్రభుత్వమే తమ నియామక ప్రకటనలలో అర్హతలను గణనీయంగా సడలించి , అర్హతలు లేని వారిని , RCI లీసెన్స్ లేని వారిని ప్రోత్సహిస్తుంది.
అంతేగాక సైకో థెరపీ , కౌన్సెలింగ్ లాంటివి RCI గుర్తింపు పొంది లైసెన్స్ నెంబర్ కల వారే చేయాలని చట్టాలు చెప్పుతున్నా, CP లు లేని కారణంగా 5 రోజుల CBT , 10 రోజుల కౌన్సెలింగ్ లాంటి చట్ట విరుద్దమైన, అనైతికమైన స్వల్ప కాలిక శిక్షణ పొంది వాళ్ళు కూడా పెద్ద బోర్డు మీద ఆకర్షణీయంగా పేర్లు రాసి పెట్టి కౌన్సెలింగ్ సెంటర్లు నడుపుతున్నారు. వీటిపై RCI , ICMR, MCIలాంటి వారి పర్య వేక్షణ, నియంత్రణ తనిఖీలు లాంటివి లేవు , చట్ట బద్ద చర్యలు తీసుకున్న చర్యలు ఏమి లేవు. తీసుకోవాలి అనే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదేమో మరీ.అందువల్ల సామాన్య జనం ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇలాంటి సెంటర్ల బారిన పడి డబ్బు సమయం, ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు.వీటి పైన కూడా ఒక సరియైన అద్యయనం కూడా లేదు.
క్లినికల్ సైకాలజిస్టులు ఎక్కడెక్కడ అవసరం : ఇక్కడ అక్కడ అని కాదు ప్రతి చోట ఎక్కడ తీవ్ర పని ఒత్తిడి , మానసిక ఒత్తిడి గల ప్రతి రంగములోని వీరి పాత్ర అవసరం. ఎందుకంటే మానశిక సమస్యలను తొలి దశలోనే గుర్తించి, ఒత్తిడికి కారణమును గుర్తించి కౌన్సెలింగ్ , సైకో తెరపీల ద్వారా, కౌన్సెలింగ్ వల్ల తగ్గించ వచ్చును, లేదా ఇతర వైద్య సహాయమునకు సిఫారసు కూడా చేయ వచ్చు. అందు ముఖ్యమైన రంగాలు ;అంగన్ వాడి కేంద్రాలు, స్వధార్ హోములు, అనాధ శరణాలయాలు, డి -అడిక్షన్ సెంటర్లు, భరోస హోములు, బాల సంక్షేమ సంఘాల(cwc)లోను, జువెనైల్ జస్టిస్ బోర్డు , చైల్డ్ లైన్, ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు, సఖి హోములు,క్రైస్తవ మిసినరీలు, ముస్లిం మదరసాలు, హిందూ గురుకులాలు, పలు ఎన్జిఓ నడిపే షెల్టర్ హోములు, కళాశాలలు వసతి గృహాలు, వృద్దాశ్రమాలు, అన్నీ మెడికల్ కాలేజీలు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఇలా ప్రతి చోట క్లినికల్ సైకాలజిస్ట్ ఉండాల్సిన అవసరం చాల వుంది. కాని వీరిని తయారు చేసే యంత్రాంగం , వ్యవస్థ లేదు. ఉన్నను అది సముద్రంలో కాకి రెట్టంత. ప్రతి మెడికల్ కాలేజీలో ఈ కోర్సు పెట్టవలసిన అవసరం ఉంది.దాంతో పాటు ఒక ప్రత్యేక స్వతంత్ర విభాగము(special independent department)ను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరంచాలా ఉంది.
మాననసిక వైద్యశాల పరిస్థితి : ప్రభుత్వ మానసిక వైద్యశాలలు అన్ని కూడా జిల్లా కేంద్రములోనే ఉన్నాయి. ఈ మద్య ఒక ప్రత్యేక డిపార్ట్మెంట్ ఉంది ఇక్కడ పని చేయాలంటే నర్సులు గాని , వార్డు బాయిలు కాని చేయాలంటే సుముఖంగా ఉండరు. ఒక్కొక్క హాస్పిటల్ వద్ద సుమారు 100 కు పైన బయటి రోగులు ఉంటారు. అనాధ రోగుల గురించి సీనియర్ వైద్యుడు మాట్లాడుతూ “అనాధ రోగులను గుర్తించడం, తీసుకు రావడం , ట్రీట్మెంట్ ఇవ్వడం , ట్రీట్మెంట్ తరువాత వారి వారి ఇంటికి పంపడం అనే మూడు దశలో ఉంటుంది. మొదటి దశ చాలా కీలకం. రోగి చాలా బయంకరంగాను బయానకంగాను ఉంటాడు, మురికి గబ్బు వాసన, ఇతరులను హాని చేయడం లాంటి విపరీత ప్రవర్తన వల్ల ఎవరు ముందుకు రారు. ఒకవేళ ఎవరైనా పట్టించు కుంటే ముందు పోలీసులకు కంప్లయింట్ ఇవ్వాలి, పోలీసులకు సహకిరించి తీసుకుని కోర్టులో ప్రవేశ పెట్టి, జడ్జి అనుమతితో సైకియాట్రిస్ట్ వద్ద నుండి సిఫారస్ లెటర్ తీసుకుని రాష్టా రాజదాని లో పెద్ద హాస్పిటల్ కు తీసుకుని పోయి చేర్పించాలి. ఇదంతా పెద్ద తతంగం అందుకని పోలీసులు గాని, మున్సిపల్ సిబ్బంది కాని ఎవరు పట్టించుకోరు. ఈ గుర్తించడం , రిస్క్ తీసుకోవడం, ట్రీట్మెంట్ అనంతరం ఎవరైనా వారిని వారి వారి బంధువులను కనుక్కుని వారికి అప్పగించే బాధ్యత ఎవరైనా స్వచ్చంద సంస్థలు తీసుకుంటే బాగుటుంది” ఒక వైద్యుడు అన్నాడు. ఈ పని చేయుటకు ఒక సామాజిక కార్యకర్త(social worker) ఉంటారు. కాని అది ఆ ఒక్కనికి శక్తి మించిన పని. ట్రాన్స్పోర్ట్ అవకాశం ఉండదు. ఇలాంటి వాళ్ళను చేర్చుకునుటకు రాష్టము మొత్తం మీద ఒక్క హైదరాబాద్ లోనే ఉంది.ప్రతి జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రుల్లో గాని , మెడికల్ కాలేజీల్లో గాని క్లినికల్ సైకాలజిస్ట్ లేదు. కాని చట్ట ప్రకారం ప్రతి జిల్లా ఆసుపత్రుల్లోనూ, మెడికల్ కాలేజీలలోనే తప్పని సరిగా ప్రత్యేకంగా స్వతంత్రంగా ఒక ప్రత్యేక డిపార్ట్మెంట్ కచ్చితంగా ఉండాలి ఉండాల్సిందేనని, లేకుంటే మెంటల్ హెల్త్ ఆక్ట్ ను, RCI ఆక్ట్ ను , IMC, లేదా NMC, ICMR లాంటి చట్టాలను, వాటి నియమ నిబంధనలను, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలను పక్కకు పెట్టి నట్లే నని” తెలుగు రాష్టా ల క్లినికల్ సైకాలజిస్టుల సంఘం అద్యక్షులు డా కె శ్రీనివాస్ నాయుడు అన్నారు.
ఇక మిగతా అంతా ప్రయివేట్ ఆసుపత్రులే. ఇక్కడ కూడా ఎవరు క్లినికల్ సైకాలిస్ట్ లేరు. ఉన్న ఎక్కడో ఒక చోట ఉంటారు. వీరు మామూలు సైకాలజిస్టులను పెట్టుకుని నెట్టుకొస్తున్నారు. ఎక్కడ , సైకియాట్రిక్ సోషల్ వర్కర్ లేరు. ఒక వేళ చెప్పాలంటే వీరి ఇచ్చే ట్రీట్మెంట్ అంతా కూడా చట్టాలకు వ్యతిరేకమే. కారణం వీరి సంఖ్య అతి తక్కువ. ఈ విషయము అందరికీ తెలిసిన బహిరంగ రహస్య మే.
ఇంకొక చోట ప్రయివేట్ ఆసుపత్రుల్లో అంత ఎక్కువ ఖర్చు ఎందుకు అంటే “ ఒక ప్రయివేట్ ఆసుపత్రి పెట్టాలంటే సామాన్య విషయం కాదు.ముఖ్యంగా ఆ చుట్టూ పక్కల వారితో అనుమతి తీసుకోవాలి, ఆ నియమ నిబంధనల ప్రకారం సదుపాయాలు సమకూర్చడం ఒక ఎత్తు అయితే, ఇంటి అద్దెలు, కరంటూ బిల్లు, నీళ్ళ బిల్లు, బైలాజికల వేసస్టేగి బిల్లు, ఇలా లెక్కకు లేని ఖర్చులు ఉంటాయి. అందరి చూపులు వైద్యుని మీదనే ఉంటాయి. పార్టీలకు చందాలు, పార్టీల బ్యానర్లు, వివిధ పండుగలకు, పబ్బాలకు చందాలు అన్నీ ఇన్ని కావు.ఇలాంటి పరిస్తితుల్లో డయాగ్నోస్టిక్ సెంటర్లతో , ఫార్మసీ , మెడికల్, మందుల కంపనిలతో తప్పనిసరి పరిస్థితిలో లాలూచి పడి కొద్ది గొప్ప కమీన్లు తీసుకోవడం మామూలే.” అని
అని చెప్పుతూ వాటితో పాటు మళ్ళీ “ఒకరికి ECT ఇవ్వాలంటే సాధారణ వైద్యుడు(general physician), కంటి వైద్యుడు , క్లినికల్ సైకాలజిస్ట్, ENT , మత్తు డాక్టరు(anesthesia) లాంటి పలువురు కలిసి ఇవ్వాల్సి ఉంటుంది. దానికి తోడు సర్జికల్ ప్రొఫైల్ (ct ,bt , ecg CT-scan, mri scan, cbp, cue, lft, kft) లాంటివి అవసరం బట్టి ఇంకా ఎన్నో పరీక్షలు చేయాల్సి ఉంటుంది.” ఒకరు చెప్పారు. ఇంకొకరు కల్పించుకుని “విద్యుత్ ఛార్జీలు, నీళ్ళ బిల్లు, మున్సిపల్ బిల్లు , బైలాజికల వేస్టేజీ చార్జి లాంటి వాటిలో రాయితులు ఇస్తే రోగుల పై భారం తగ్గించ వచ్చును “ అని సూచించారు. ఇంకొకరు మాట్లాడుతూ “ ఏదో దేశ వ్యాప్తంగా పలు శాఖల లతో నడిచే భారీ కార్పొరేట్ ఆసుపత్రులు అయితే ఎంత ఖర్చు అయిననూ భరించగలరు. కాని మొదటి తరం చదువుకుని వచ్చిన డాక్టర్లు ప్రయివేట్ ఆసుపత్రులు పెట్టడం అంత తేలిక కాదు. అందుకే ఆయా కార్పొరేట్ ఆసుపత్రుల్లో కన్సల్టెంట్ పని చేస్తూ బతుకు వెళ్ళ దీస్తున్నారు.” అని చెప్పాడు.
ఇంకొకరు కల్పించుకుని “ ఆధ్యాత్మిక , సోషలిస్ట్, కమ్యూనిస్ట్ సేవా భావముతో చదువుకున్న వాళ్ళు అత్యుత్సాహముతో బ్యాంకులలో భారీ మొత్తంలో రుణాలు తీసుకుని ఆసుపత్రి నిర్మించి , వాటి నెల నెలవారి వాయిదాలు(EMI) కట్టలేక , నైతిక సామాజిక , మంచి చెడ్డలు అనే విలువలకు తిలోదకాలు ఇచ్చి, పెట్టుబడి దారులుగా తయారై రోగులను పీక్కు తింటున్నారని “ విశ్లేషించారు. ఒకరు విచారంగా . అంతేకాదు “ పైన పటారం లోన లొ టారం, ఉప్పర్ షేర్వాణి అందర్ పరేశాని అన్నట్టు పైకి పోలేక , కిందికి రాలేక త్రిశంకు స్వర్గంలో చావలేక బతుకలేక అట్టడుగు వర్గాల నుండి వచ్చిన కొత్త తరం వైద్యుల పరిస్థితి మరి దీయనీయంగా ఉందని “ సానుభూతి చెప్పేవారు లేక పోలేదు.
ఇదిలా ఉండగా భారత పునరావాస మండలి(Rehabilitation Council of India) కార్యాలయం దేశ రాజధాని దిల్లీలో ఉంది. ఇది నిర్దేశించిన కోర్సుల సిలబస్,పని గంటలు, ఆసుపత్రులు, విద్యా సంస్థల పరి తీరు లాంటివి పరిశీలించి , అనుమతులు ఇవ్వడం , కోర్సుల పూర్తి చేసిన వారికి లైసెన్స్ నెంబర్లు ఇవ్వడం లాంటివి చేస్తుంది. ఇది సుమారు చిన్న పెద్ద కలిపి వంద కోర్సుల వరకు పర్యవేక్షణ చేయాల్సిన ఇంత పెద్ద దేశానికి , ఇన్ని రాష్ట్రాలు గల దేశానికి కావలిసిన మానవ వనరులు లేనందున దాని పై పని భారం కూడా ఎక్కువగా ఉంది. చాల మంది ఒప్పంద , ఔట్ సోర్సింగ్ సిబ్బంది తో నెట్టుకుని వస్తున్నారు. ఈ సిబ్బంది చాలా కాలంగా సుమారు 10- 15 ఏండ్లు గా చాలీ చాలని జీతములో ఎప్పటికైనా క్రమ బద్దీకరణ కాక పోతుందా అని పడిగాపులు కాస్తున్నారు. ఈ సరళీకరణ , ప్రయివేటికరణ, ప్రపంచీకరణ వల్ల వచ్చిన మార్పు ఈ ఔట్ సోర్సింగ్ , ఒప్పంద విధానాల బడుగులను పీల్చి పిప్పి చేసున్నాయి. ఎక్కడైనా ఒప్పంద , ఔట్ సోర్సింగ్ లాంటివి తాత్కాలికంగా , ఒకటి , రెండు నెలలకు ఒక ప్రాజెక్టు పూర్తి చేసే వరకు తీసుకుంటారు. కాని ఇలా ఏండ్లకు ఏండ్లు తీసుకుని కార్మిక చట్టాలను , న్యాయ సూత్రాలను, మానవ హక్కులను ప్రభుత్వాలే తుంగలో తొక్కుతున్నాయి.
ఇందులో క్లినికల్ సైకాలజీ నిపుణుల భాగ్య స్వామ్యం తగినంతగా లేక పోవడం కావచ్చు, వారిని వారి రంగమును గుర్తించ లేక కావచ్చు. అసలు విషయం సైకాలజీనే రెండవ ప్రపంచ యుద్దము తరువాత ప్రభుత్వాలు గుర్తిచడం, గత 75 ఏళ్ల క్రితం క్లినికల్ సైకాలజీ ఒక స్వతంత్ర మానసిక వైద్యా విభాగంగా ఏర్పడి మానసిక వైద్య విద్యా రంగం లో పని చేస్తుంది.
ఇది ఇలాగ ఉండగా మనే దేశంలో ప్రభుత్వం ఆధ్వర్యం లో మానసిక వైద్య కార్య క్రమాలు నిర్వహించ బడుతున్నవి. అవి :1. జాతీయ మానసిక ఆరోగ్య కార్య క్రమం(NMHP), 2. జిల్లా మానసిక ఆరోగ్య కార్య క్రమం(DMHP), MANAS, app , జాతీయ టెలీ మానసిక ఆరోగ్య కార్య క్రమం(NTMHP), Kiran helpline, center for excellent , ఆయుష్మాన్ భారత్ , జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం(NTCP) లాంటివి కలవు. ఈ కార్యక్రమాలు దేశములో కొన్ని రాష్టాలలోనే జరుగుతున్నవి. కొన్నింటిలో పాక్షికంగా జరుగుతున్నవి. మన తెలుగు రాష్టాలలో కూడా చోట్ల ఉన్నాయి. కాని క్లినికల్ సైకాలజిస్ట్ గాని , psychiatric social worker గాని లేరు. ఎవరినో ఒక సాదారణ సైకాలజిస్ట్ , ఒక సాధారణ నర్సులతో చట్ట విరుద్దంగా , నియమ నిబంధనలకు విరుద్దముగా పోస్టులను నింపుతున్నారు.
అంతేగాక మన దేశంలో గల మానసిక వైద్య సిబ్బంది వివరాలు ఇలాగ ఉన్నవి. అందులో ముక్యమైనవి:
- మానసిక వైద్యులు( psychiatrists): మన వద్ద వీరు 9000 ల మాది ఉన్నారు. ఒక జనాభా కు కేవలం 0.73 మాత్రమే ఉన్నారు. కాని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం ఒక జనాభాకు ముగ్గురు ఉండాలి. అంటే మనకు 30000 మంది ఉండాలి. అంటే ఇంకా 27000 మంది లోటు ఉంది.
- వైద్య మనో విజ్ఞాన నిపుణులు(clinical psychologists):సుమారు 3372 మంది ఉన్నారు. అవసరం ఉన్న వాళ్ల 20000ల మంది. ఉన్న లోటు 16628 మంది.
- మానసిక -సామాజిక కార్యకర్త(psychiatric social worker ): వీరి సంఖ్య 1500 మంది. కావాల్సిన వాళ్ళు 35000 మంది. లోటు 33500 మంది.
ఇది ఇలా ఉండగా జాతీయ మానసిక వైద్య చట్టం( National Mental health act 2017) చాప్టర్ -6, సెక్షన్ 29, 30, 31 ప్రకారం మానసిక ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమాల పథకాలకు కావాల్సిన ప్రణాళికలు సిద్దం చేసి, అమలు చేయాలి. ఆత్మహత్య లాంటివి నివారణకు కృషి చేయాలి. మానసిక వైద్యం పట్ల పలు శాఖల వారికి కూడా అవగాహన కల్పించి , వివిధ వార్తా మాధ్యమాల ద్వారా అనగా టెలీ విజన్లు, సినిమా హాళ్లు, వార్తా పత్రికలు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసి మానసిక వైద్యం పట్ల , మానసిక ఆసుపత్రి పట్ల చెడు భావన(Stigma)ను తొలిగించాలి.
ఈ చట్టం అమలులోకి వచ్చిన పది సంవత్సరాలలో మానసిక వైద్య నిపుణులను(Human resources) వివిధ ఉన్నత విద్యా మండలులతో కలిసి జనాభాకు అనుగుణంగా పెంచుకోవాలి . వీటితో పాటు అదనంగా వివిధ శాఖలకు ఆరోగ్యం, చట్టం , గృహం, మానవ వనరులు, సామాజిక న్యాయం, ఉపాది, విద్య, మహిళా శిశు సంక్షేమం, వైద్య విద్య లాంటి తదితరులతో సమన్వయం చేసుకుని మానసిక వైద్యం మీద పని చేయాలి.
అంతేకాకుండా భారత పునరావాస మండలి (RCI) చట్టం -1992, సెక్షన్ 13(3) ప్రకారం పునరావాస సర్టిఫికేట్ (RCI- certificate) లేకుండా ఎవరైనా విభిన్న ప్రతిభ గల వారి (Persons with disability)తో పని చేసినచో చట్ట బద్దముగా చర్య తీసుకోబడును. వీరు ప్రభుత్వలో పని చేసే వారు కావచ్చు, ఎన్జీఓ లలో పని చేసే వాళ్ళు కావచ్చు , ప్రైవేట్, శిక్షణ పొందిన నిపుణులైన వాళ్ళు కావచ్చు, అర్హతలు ఉన్న వాళ్ళు కావచ్చు, అందరికి RCI రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
కాని ఇప్పటి వరకు అమలు విషయానికి వస్తే ప్రభుత్వమే చట్టము ఉల్లంఘిస్తూ క్లినికల్ సైకాలజిస్ట్ లేకుండా సర్టికెట్లు ఇస్తున్నారు. చట్టం వచ్చి 8 సంవత్సరాలు గడిచి పోయినను మానవ వనరులైన క్లినికల్ సైకాలజీ కోర్సును ఇప్పటి వరకు కూడా చాలా రాష్టాలలో ప్రభుత్వం చె నడిపే విద్యా సంస్ధ లేదు. ఇపుడు బెంగళూరు (Nimhans) లోను, రాంచీ (CIP) లోను లాంటివి ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి. కాని అవసరం చాలా ఉంది. ప్రతి కాలేజీలో ఒక స్వతంత్ర ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి మానవ వనరులను ఉ పెంచాలి. అవగాహన, వివిధ శాఖలను కలిపి చేయాల్సిన అవసరం ఇంకా చాల ఉంది.
విద్య , వైద్య రంగాన్ని మన ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ రంగాలకు వినియోగించే వాటా మన జాతీయ ఉత్పత్తిలో చాలా 3 నుండి 4 శాతమే. అభివృద్ది చెందిన దేశాలలో 12 నుండి 13 శాతం వాటా వారి జాతీయ ఉత్పత్తిలో ఉంది. అంతే కాక విద్య , వైద్యం ప్రభుత్వ రంగలోనే 80 నుండి 85 శాతం వరకు ఉంటే, మనదేశములో 20 శాతం మాత్రమే ప్రభుత్వ రంగం అధీనములో ఉంది. మిగతా 80 శాతం ప్రయివేట్ రంగం లో ఉంది. ఇలాంటి పరి స్థితిలో ఉంటే మానసిక వైద్యం ఎంత దయనీయంగా ఉంటుందో చెప్పవాలిసిన అవసరం లేదు. అందుకే రోడ్డు పక్కన , చెత్త కుప్ప వద్ద రోగులు కనిపిస్తారు. ప్రయివేట్ వైద్యుల వద్ద ఎక్కువ జనం కొట్టు మిట్టాడుతున్నారు.
అందుకే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విద్య , వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, మన GDP లో తగిన వాటా ఇచ్చి, మౌలిక సదుపాయాలు, ప్రతి మెడికల్ కాలేజీలో ఒక కోర్సు గల శాఖ , ప్రతి సివిల్ ఆసుపత్రిలో మానసిక వైద్య నిపుణుల బృందం ఉండేటట్లు మానవ వనరుల అభివృద్దికి తగిన ప్రణాళికలు వేసి అమలుకు కృషి చేస్తారని , పలువులు మానసిక వైద్యం గురించి పట్టించు కోవాలని ఆశిస్తున్నాను